దివ్య సోపానం కాత్యాయనీ వ్రతం

సమాజానికి ఏది హితవో దాన్ని మన పెద్దలు చెప్పి ఆచరించారు. ఆ సంప్రదాయ ఆచరణలను మనం కాపాడి, వ్యాప్తి చేస్తే అది మనను రక్షిస్తుందనేది చద్ది అన్నపు మూట! అలాంటి సంప్రదాయాచరణే కాత్యాయనీ వ్రతం. ఇటువంటివి సక్రమంగా సాగాలంటే మంచివాళ్ళ శాతం ఎక్కువ ఉండాలి.
మరి ఏది సమాజానికి ఆనందం కలిగిస్తుంది? అది శాంతిగా సుస్థిరంగా ఉన్నప్పుడే! అది ఎలా ఉంటుంది? పాపభీతి లేదా వసుదైక కుటుంబమనే భావన.. ఉండాలి. అది ఏ ఒక్కరితోనో జరగదు…
సమిష్టి కృషితోనే సాధ్యమని జట్టు ఏర్పడం నేర్పించింది అమ్మ ఆండాళ్ తల్లి!
అన్నం దొరకని మనిషి ఆ ఆకలితో దొంగలౌతారు.. దోపిడీ దారులౌతారు, చేయకూడని పనులు చేసి దుర్మార్గుడైనట్టే… కడుపుకు ఆకలి వలెనే – నడవడికకు మనసుకు మంచితనం అనేది అవసరం! సమాజం సన్మార్గంలో నడవాలంటే బాధ్యత కలవారు ఎప్పుడూ మంచి చెబుతూనే ఉండాలి! ఏ ఒక్క సారో చెబితే మన మనసు పట్టుకోదు, పదేపదే చెప్పాలి! అది మనసు లక్షణం అంత త్వరగా మంచిని పట్టుకోకపోవడం…
బ్రాహ్మీ ముహూర్తంలో ఏ పని తలపెట్టినా… ఆ పని తప్పక నెరవేరుతుంది. అలా అనుకుని మార్గళి స్నానం చేయాలన్నారు. దీనిలోని శాస్త్రీయత మనం గుర్తించాలి.
నీటిలో విద్యుత్తు ఉంటుంది. తెల్లవారు ఝామున స్నానంవల్ల ఆ శక్తి శరీరంలో కలసి బలోపేతం చేస్తుంది.
ఇక ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే జీవకోటి పుట్టడానికి పంచభూతాలు ఆధారం. అందులో జలం ఒకటి. ముఖ్యంగా మానవ సంస్కృతి, నాగరికత నదులను ఆధారంచేసుకునే పరిణమించింది. నదీజలాలు పవిత్రంగా భావించి, ఎన్నో ఉత్సవాలు, పూజలు, మత కార్యక్రమాలు చేస్తారు కదా! అలా కూడా స్నానానికి ప్రాముఖ్యత ఉంది.
బాహ్య శుభ్రత స్నానంతోనూ- అంతర్ శుభ్రత దైవసాధన-నిత్యస్మరణ, పూజలు, నోములు, వ్రతాలతో భక్తి-జ్ఞాన వైరాగ్యాలు అలవరచుకుంటే అంతరంగం శుభ్రమౌతుంది. ఇలా బాహ్య శుద్ధికి స్నానం- అంతఃశుద్ధికి ధ్యానం చేసి, ఇక జట్టు కార్యాచరణ ప్రారంభించాలని చెప్పింది గోదమ్మ.
ఈ గోదమ్మ ఎవరంటే?పెరియాళ్వారు వారు అనే విష్ణుచిత్తులకు తులసీ వనంలో లభించిన బిడ్డ. చిన్నప్పటినుండే శ్రీ రంగనాథుడే తనభర్త అని భావించి, సేవించి పుష్పమాలలు ధరించి బావిలో తను అందంగా ఉన్నానా? స్వామికి తగినట్టు ఉన్నానా? అని తనను తాను పరీక్షించుకున్న భక్తురాలు. ఆ భక్తితోనే తిరుప్పావై రచించి పాడింది. మధుర భక్తికి పరాకాష్టలో తన శరీరం పరమాత్మకే భోగ్య వస్తువు అనే భావించిన భావకురాలు ఆండాళ్ తల్లి. ఆ భక్తి యోగ దశలో రచించిన ఈ తిరుప్పావును రోజు మనం పారాయణం చేయడంలో మనసు పరిపక్వత చెందుతుంది. భక్తి ఇనుమడుస్తుంది. వ్రత నియమాలు తెలుస్తాయి. దానితో మానసిక ప్రశాంతతనిస్తుంది.
మానవ జీవితం ప్రకృతి ధర్మాలతో నిండి ఉంది. ప్రకృతి ధర్మం గల గోదాదేవి స్త్రీ ఆమె రంగనాథుడిని వరించింది. భక్తి భావాలతో తిరుప్పావైని రచించి పాడుతూ రంగనాథునికి తన మనసును, తనువును అర్పించింది. ఇది కూడా ప్రకృతి ధర్మమే!
సాంప్రదాయాన్ని ఎందరో మహానుభావులు రక్షించీ- వ్యాప్తి చేసారు. ఇలాంటి వైష్ణవాచార్య పరంపరకి శ్రీమన్నాధముని మొదటి వారు.
వారి కన్నా ముందు ఆళ్వారులు 12 మంది. వారిలో మధ్య నాయిక మణిగా ఆండాళ్ళు తల్లి ఓక్కతే మహిళ.
విశిష్ట వైభవంతో మహిళలకే మణిగా ఆదర్శంగా చెప్పుకుంటున్నాం. ఈమెను తమిళంలో చూడకూడిత్త నాచ్ఛియార్ అనీ, నాచ్ఛియార్ అని, సంస్కృతంలో గోదా అని ఆముక్తమాల్యదా అని పిలుస్తున్నాము.
పరాశర భట్టర్ వారు గోదాదేవికి నమస్కార రూపంగా ఈ తొలి శ్లోకం నీలా తుంగస్థనగిరి తటీం విన్నవించారు.
శ్రీకృష్ణ పరమాత్మ నీలాదేవి యొక్క ఉన్నత స్థనగిరి తటములలో నిద్రించినాడు, ఆ నిద్రించిన కృష్ణ సింహాన్ని మేల్కొల్పింది గోదాదేవి.
ఆ గోదాదేవికి నమస్కారము అన్నారు.
ఈ నీలాదేవి ఎవరంటే యశోదా దేవి తమ్ముడైన కుంభుని కుమార్తె! ద్రావిడ ప్రబంధాలలో ఈమెను నప్పిన్నపిరాట్టి అని అంటారు. కుంభుని భార్య ధర్మద. ఆమెకు శ్రీదాముడు, నీలా అనే ఇద్దరు సంతానం. ఈ ధాముడు-కృష్ణునికి అంతరంగ మిత్రుడు. ఈయన తన చెల్లె అయిన నీలాదేవిని కృష్ణునికిచ్చి వివాహం జరిపించాలని అనుకున్నాడు. అందుకోసం ఒక పరీక్ష కూడా పెట్టాడు. అంటే ఏడు ఎద్దులు కలిగిన బండిని అవలీలగా నడిపించడం.. కృష్ణుడు ఆ పరీక్షలో నెగ్గి నీలను పెళ్లాడాడు. నిత్యజాగరూకుడైన పరమాత్మ నిద్రించాడని, మేల్కొల్పగలిగింది ఈ గోదాదేవి. అంటే
అన్య పరత లేక నిద్రిస్తున్న కృష్ణుని మేల్కొలిపిందని అర్థం. కృష్ణ అంటే శబ్ద వాచ్యంగా ఆనందమని అర్థం కదా? ఆ ఆనందాన్ని తెలియచెప్పింది ఆండాళ్ తల్లి.
నిద్రపోనివ్వడాన్ని ఎందుకు మేల్కొలిపింది? అంటే తన స్వరూపాన్ని ఆయనకు నివేదించేందుకు…
ఇదే ఉపనిషత్తు చెప్పిన రహస్యం..
__ జీవాత్మ పరమాత్మకు పరతంత్రము అని…
పర అంటే తన హృదయంలో ఉన్న పరమాత్మ తత్త్వాన్ని మేల్కొలిపి ఈ మొత్తం జగత్తు అతని సృష్టే అని అతడే యజమాని అని తెలుపడమే ఈ తిరుప్పావు ఉద్ద్యేశ్యము.
అంటే మనమంతా మాయలో పడి నిద్రిస్తున్నాము. కానీ పరమాత్మ ఎన్నడూ నిద్రించడు భగవంతున్ని వేదము శిరోభూషణంగా కీర్తించిన ఆయన ఆత్మ స్వరూపాన్ని ఆ పరమాత్మకే ఉపదేశించింది గోదాదేవి.
ఆ పరమాత్మ లోకాన్ని కర్మపాశంతో బంధించి, కర్మ ఫలాన్ని అనుభవించినట్లే చేయిస్తుంది. ఆ పరమాత్మను తాను అనుభవించి విడిచిన పుష్పమాల పాశంతో బంధించి, తాను చేసిన కర్మకు ఫలితంగా పరమాత్మను అనుభవించింది.
ఆ గోదాదేవి భగవంతుని విషయంలో ఎటువంటి దాస్యం కోరుకున్నదో? అలాంటి దాస్యం మాకు కూడా లభించాలని పరాశరభట్టరు కోరుకున్నట్టే మనమూ కోరుకుందాం…
మనం గోదాదేవి చెప్పిన బాటలోనే, భక్తులతో కలసి భగవంతుని గురించి మాట్లాడుకోవడం వల్ల భక్తి ఎక్కువ అవుతుంది. సహజంగా భక్తి ఉన్నవారికే అలా మాట్లాడుకోవాలనిపిస్తుంది.
అలానే మానవ విలువలు కాపాడుకోవాలంటే ఒక జట్టుగా కలిసి కట్టుగా మంచి విషయాలు చెప్పుకుని, ఇతరులకు వివరిస్తే ఒక న్యాయ వ్యవస్థ, ఒక చట్ట వ్యవస్థ, రక్షణ వ్యవస్థలు చేసే పనికి సమానంగా ఫలితాలనిస్తాయి.
అందుకే కాలాలు మారినా, జీవన విధానాలు మారినా మంచి మాటలు చెప్పే బోధకులుండాలి! పూర్వం భగవంతునితో జోడించి చెప్తే భక్తి-భయాలతో ఆచరిస్తారని చెప్పినా, ఈ కాలంలో పత్రికలు, మీడియా ఛానెళ్ళు చెప్పినా, సంఘటితంగా చేసే పనులు చక్కగా ఫలిస్తాయని, ఆచరించిన వారు చెబితే అందరూ ఆచరిస్తారని తెలియచెప్పేదే తిరుప్పావై ముప్పైరోజుల వ్రతం. ఇందులో సత్యాన్వేషణ ముఖ్యంగా ప్రతిధ్వనిస్తుంది. సత్యమంటే భగవంతుడు, సత్యమంటే అబద్ధమాడకపోవడం.. ఇలా రెండింటికి అధిక ప్రాధాన్యతనిచ్చిన కాత్యాయనీ వ్రతాన్ని అందరం ఆచరించి మంచి ఫలితాలను పొందుదాము!
రేపు పాశుర అనుసంధానం చేద్దాము!

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిర్జీవ కళారాశి

హేమంత ఋతువు