నిర్జీవ కళారాశి

అరుణ ధూళిపాళ

ఉదయం తన ఉనికిని
చాటుకునే ప్రయత్నం లోపు
సడి లేకుండా
ఆమె నెమ్మదిగా తెచ్చిన
చక్కెర లేని చాయ్
అతని నాలుకపై చల్లారుతుంది
రసాస్వాదన లేకుండానే

రాత్రి కలలు ఆమెను
ఏ ఆశలతో మురిపిస్తాయో
తెల్లవారుతూనే
మొదలవుతుంది యుద్ధం
ఆమె మౌనమంటే
ఎంతో భయం అతనికి
ఆమె చూపుల ప్రశ్నలకు
అతని కళ్ళు నేలకు వాలుతాయి
పొదుపు మాటలు
నిశ్శబ్దానికి హారతి పడతాయి

రెక్కలు మొలిచిన
రెండు పక్షుల బాటలో
ఎగిరి దూరంగా వెళ్ళడానికి
ఒప్పుకున్న పర్యవసానం
గుండెను లోతుగా తవ్వి
ఎప్పటికీ దూరం కాని
ఒంటరితనాన్ని మిగిల్చింది

ఇద్దరు ఉన్న ఇంట్లో
ఎవరికి వారు ఏకాంత తీరాలు
జ్ఞాపకాల ఎండమావులతో
ఎడారై కాలుతున్న హృదయాలు
రాతిరి చీకటి గదిలో ఆమె
అతని కౌగిలి సేదలో
పువ్వులా ముడుచుకొని
రోజంతా నింపుకున్న ఆవేదనను
కరుణ రసంగా స్రవిస్తుంది
నిర్జీవ కళారాశి అయిన
ఆమెను పొదువుకొని
కన్నీటిని రెప్పలలో దాస్తూ
మాటలు రాని శిల్పంగా అతను…!!

Written by Aruna Dhulipala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

లాయర్ సలహాలు(కాలమ్)

దివ్య సోపానం కాత్యాయనీ వ్రతం