“ఆశగా,ఆకాశం లో తారల
నా ఆశ మినుకు మినుకు మంటున్నది మత్తుగా,
వెంటనంటే నీ తలపులా, వలపు వెన్నెలలో వాలుగా,
నీ తలపులలో వేగి వేగి వేసారి, మెనూ వాల్చి విడిచిన భారమైన
నిట్టూర్పుకి బదులు పలికాయి కొండా కోనలు,
లేదు నీ నుంచి బదులు, కొండకన్నా కసాయి గుండెగల నిన్ను
తలచి వేచి చూస్తున్నాను, నీ రసోన్మాదిలా , నీ అభిసారికనై !”
‘రామ! నీ దర్శనమెప్పుడు’ మా కులగురువు చెప్పారు, ‘నీవు తప్పక వస్తావని.’ నీవు గురు విశ్వామిత్రుని తో యాగ రక్షణ కోసం వచ్చినప్పుడు నీ రూపురేఖలు వర్ణించిన మారీచుని మాటలను చాటుగా విన్న నేను ముగ్డురాలనై, ‘పొందితే నిన్నే భర్తగ పొందాలని’ తపస్సు చేస్తున్నాను. ‘నీతో నా సంగమము ఎప్పుడు స్వామి! ఎన్ని ఏళ్ళు గడిచిన, ఎన్ని జన్మలు ఎత్తయిన నీ కోసమే ఎదురు చూస్తుంటాను , నీకై అభిసారికనై!’ అంటూ ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు అయినా ఆ శ్రీరామచంద్ర మూర్తి కోసం ఎదురు చూస్తూనే ఉన్నది శుర్పణఖ.
శ్రీ రామునికి మైధిలి రాజపుత్రి సీతా దేవి తోటి వివాహమైంది, ఆ స్వయంవర తంతుకు తన సోదరుడు రావణుడు కూడా వెళ్లాడని,”ఆ రాముని దివ్య మంగళ రూపానికి ముగ్దుడై ఒక్క క్షణం కనులుమూసుకొని ఆ దివ్య సౌందర్య అనుభూతిని పొందాడని,” దూతలు చెప్పగా విన్నది. అలాటి దివ్యస్వరూపు డిని ఏ స్త్రీ కోరుకోదు. తానేమి సీత కంటే తక్కువ సౌందర్యవతి కాదు. పైగా ఇచ్ఛారూపధారిణి. కోరుకుంటే తాను ఆ సీతా దేవి కన్నా అత్యంత సౌందర్య రాశిగా మారిపోగలదు. ఆ రాముని కనులముందు నడయాడే సమయం కోసం ఎదురుచూసింది. రామునికి వనవాస దీక్ష ఇవ్వబడింది, ఆయన పత్ని, సోదర సమేతంగా దండకారణ్యమునకు వస్తున్నాడన్న వార్త ఆమెకు చెవుల్లో అమృతం పోసినట్లయింది.
ఆ దండకారణ్యం ఖర దూషణులనే రాక్షసుల పాలనలో ఉన్నది. శుర్పణఖ భర్త దానవ కాలకేయ వంశానికి చెందినవాడు. తన అంగీకారం లేకుండా శుర్పణఖ అతన్ని వరించి గాంధర్వ విధిన వివాహం చేసుకున్నదన్న కోపంతో, ఆమె అన్న రావణుడు అతన్ని యుద్ధం లో వధించి, శుర్పణఖ ని కూడా చంపబోయాడు. వదిన మండోదరి, అన్న కుంభకర్ణుడు వారించి, ఆమె కు దండకారణ్యం లో ఉండే ఏర్పాటు చేశారు. అప్పటినుండి ఆమె దండకారణ్యం లో సంచరిస్తూ ఆ శ్రీరాముని గుణ గణాలు, సౌందర్య ప్రశంసలు ఋషి పుంగవుల మాటల ద్వారా తెలుసుకొని ఆ రామచంద్రుడి మీద మనసు పెంచుకొని ఎదురుచూపులు చూసింది. గోదావరి తటమున పంచవటి ప్రాంతంలో అరణ్యవాసానికి వచ్చిన శ్రీరాముడు తన నివాసం అక్కడ ఏర్పాటు చేసుకున్నాడని తెలిసిన శుర్పణఖ మనస్సు రాగ రంజితమే అయింది. ఆ దండకారణ్యంలో నా రాముడిని కనిపెట్టుకొని ఉండమని కొందరు రాక్షస ముఖ్యులు అయినా ఖర, దూషణ, త్రిశరుడు లాటి వారికి పని అప్పగించింది. ఆ రాక్షసులు తమ భార్యలతో ఆ దండకారణ్యం లో సంచరిస్తూ, రాముని పైన నిఘా వేసి ఉంచారు.
కానీ ఆ రాక్షస స్త్రీ లు మాత్రం ఆ రామ లక్ష్మణుల సుందర రూపానికి ముగ్దులై ,”ఆహా !శుర్పణఖ! ఎంత సుందర సుగుణాభిరాముడికి మనసిచ్చింది. రాక్షస స్త్రీ అయితే మాత్రమేమి అలాటి పురుషోత్తముడి చెంత ఒక్క ఘడియ గడిపిన చాలు ఈ జన్మ తరించిపోతుంది,” అనుకొంటూ చిత్ర విచిత్రముగా మనసు చలించిపోయే విధముగా ఆ శ్రీరామాచంద్రుని వర్ణన చేసేవారు శుర్పణఖ ముందు. అలా ఆ స్వామి మీద ప్రేమ పొంగి పొరలి ఒక శుభ సమయం లో ఆమే పంచవటిని చేరుకొన్నది. అసలే సౌందర్యవతి అయిన శుర్పణఖ అతి సుందర రూపం ధరించి రాముని ఆశ్రమం దగ్గరికి చేరుకుంది.
ఆశ్రమానికి కొద్దీ దూరం లో శ్రీరాముడు ధ్యానముద్రలో ఒక తటవృక్షం క్రింద కూర్చొని కనిపించాడు. నలువైపులా పరికించి చూసింది. ఎవ్వరు లేరు. ఇదే సరైన సమయం రామునికి తన మనసులోని మాట చెప్పుకోవటానికి అనుకోని ఆ వృక్ష సమీపానికెళ్ళింది. ఆ స్వామి పాదాల దగ్గర అలవోకగా కూర్చొని ఆ స్వామి దివ్యమంగళ తేజస్సుకు మాటలు రాని దానివల్లే కొద్దీ సేపలా ఉండి పోయింది నిశబ్దంగా. రాముడు తన ధ్యానం లోనే ఉన్నాడు.
తనని తాను సంభాళించుకుంటూ, ”రఘుకులోత్తమ రామ నేను, విశ్వబ్రహ్మ కైకసిల పుత్రికను, రావణ బ్రహ్మ సోదరిని, మహా బలిష్టుడయినా కుంభకర్ణుడు, జ్ఞానిశీలి అయిన విభీషణుడు నా తోబుట్టువులు. మాయా యుద్ధంలో ప్రవీణుడు నా ముద్దుల మేనల్లుడు మేఘనాధుడు. అలాటి గొప్ప వంశజనయినా నన్ను నీ పత్నిగా స్వీకరించు. నాకు ప్రేమ భిక్ష పెట్టమని నిన్ను వేడుకొంటున్నాను స్వామి! మీ ధ్యానం వీడి నన్ను అనుగ్రహించమని ప్రార్ధన,” అంటూ ఏంతో వినమ్రంగ చేతులు జోడించి ఆ విశ్వమోహనకారుని అర్ధించింది.
ఆమె పలుకులకు ధ్యానం వీడిన రామచంద్రుడు ,”దేవి! నేను వనవాసిని. నిన్ను చూడ అతి సౌందర్య రాశివి. నీకు నాపైన ఈ మక్కువేల. నేను ఏక పత్నీవ్రతుడను. నా భార్య సీత నా చెంతనే ఉన్నది. నీ అబ్యర్ధనను తోసిపుచ్చినందుకు నన్ను మన్నించి, నీవిక వెళ్ళ వచ్చును,” అంటూ సౌమ్యముగ పలికాడు.
”రామా! నీవు క్షత్రియుడవు. నేను రాక్షస కాంతను. నాకు గాని, నీకు గాని ఈ సామాజిక కట్టుబాట్లు వర్తించవు స్వామి. నన్ను వివాహం చేసుకో, నిన్నీ దండకారణ్యానికి చక్రవర్తిని చేస్తాను, నా అన్న రావణుడే నీకు పట్టాభిషేకం చేస్తాడు. నీ సోదరుడు లక్ష్మణుడు మన సేనానాయకుడవుతాడు. సీతా దేవి రాచ కన్య కాబట్టి ,ఆమెకు కూడా ఒక సుందర భవనం నిర్మించి ఇద్దాము ఇక్కడే ,” అంటూ ప్రలోభ పెట్టబోయింది.
“దేవి! ఆపు నీ వ్యర్ధ ప్రసంగం. నువ్విక వెళ్లొచ్చు.” అంటూ శ్రీ రాముడు కొంచం కఠినముగా పలికాడు. శూర్పణఖ ఏంతో ప్రాధేయ పడింది. రాముడు తిరిగి తన ధ్యానం లోకి వెళ్ళిపోయాడు. ఉన్నట్టుండి ఒక వైపునుండి శూర్పణఖ వైపుగా ఒక అస్త్రము దూసుకు వచ్చింది. ఆ అస్త్రము ఆమెకు తగలకుండా ఉండడం కోసం ఆ రాముడు కదిలాడు. అది చూసిన శూర్పణఖ కొంచెం వెన్నక్కి వంగింది, లిప్త పాటులో ఆ శరము శూర్పణఖ చెవిని కోస్తూ, కొనదేరినట్టున్న ఆమె అందమైన నాసికను తాకుతూ గాయం చేసి ముందుకు పోయింది.
“లక్ష్మణ! ఏంటి అఘాయిత్యం. ఒక స్త్రీ పైన నీ బలప్రయోగమా ?”అంటూ గర్జించాడు.
“క్షమించండి అన్న! ఈ రాక్షసి తమరి ధ్యానానికి ఆటకం కలిగిస్తున్నదని తలచాను. రాక్షసి రాక్షసే కదా!”అంటూ తన కత్తి తీసాడు.
శ్రీ రాముడు తన తీవ్రమయిన చూపులతోనే లక్ష్మణుడిని ఆపి, “దేవి మీరు వెంటనే వెళ్లిపోండి,”అంటూ ఆజ్ఞాపించాడు. శూర్పణఖ బాధతో అక్కడినుంచి వెళ్ళిపోయింది.
ఆదిశేషు అంశం తో ఉన్న లక్ష్మణ స్వామి అస్త్రఘాతానికి సౌందర్యవతి అయిన శూర్పణఖ నల్లగా మారిపోయి నిజమయిన రాక్షస రూపం పొందింది. ఇంత జరిగినా, ఆమెకు ఆ రామచంద్రుడి మీద మక్కువ మాత్రం పోలేదు. తపిస్తూనే ఉన్నది ఆయన సన్నిధి కోసం.
రావణాసురుడు సీతాదేవిని చెర బట్టి అశోక వనం లో ఉంచినప్పుడు, ”నేను అంతటి సౌందర్యవతినే కదా! మరి ఆ రాముడు ఈమెనూ ఏమి చూసి మోహించాడు? ఈమె కోసం వెతుకుతూ సముద్రం కూడా దాటి వచ్చేసాడు. మా అన్న రావణుడితో పోరు కూడా తలపెట్టాడు!” అనుకుంటూ అశోక వనం లో ముఖ్య సేవికగా ఉన్న త్రిజటరాక్షసి ని పిలిచి అదే విషయం అడిగింది.
త్రిజట బ్రహ్మజ్ఞాని. రావణ సంహారం ఈ రామచంద్రుని చేతిలోనే అని గ్రహించగలిగిన త్రికాలజ్ఞాని. ఆమెకు తెలుసు ఆ రామచంద్రుడిని ఏ జన్మలోనయినా కూడా శూర్పణఖ పొందలేదని.
అందుకే ఇలా చెప్పింది, “తల్లి శూర్పణఖ! నీవు శ్రీరాముడు, సీతాదేవి సామాన్య మానవమాత్రులనుకుంటున్నావా? కానే కాదు. మీ అన్న తపస్సు ఫలితంగా, ఆయనను సంహరించటం కోసమే ఈ మానవ రూపంలో అవతరించిన వైకుంఠ ధాముడు ఆ రాముడు, ఆ సముద్ర రాజతనయే ఈ సీతా దేవి. ఇది త్రేతాయుగం. ఇక్కడ ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది. ఎవరయినా అధర్మం గ ప్రవర్తిస్తే వారికీ ఈ భూమిమీద నూకలుండవు. ఆ రామచంద్రుడే ప్రతీక ,”రామో విగ్రహవాన్ ధర్మః. ” అంటూ త్రిజట చేతులు జోడించి ఆ రామచంద్రునికి మనసులోనే ప్రణామములు సమర్పించింది.
“మరయితే త్రిజట! ఆ లక్ష్మణుడు నన్ను చంపబోయాడు. మరి ఆయనకు శిక్ష పడలేదే?” అన్నది కాస్త ఉక్రోషంగా.
“పిచ్చితల్లి! ధర్మం మరిచి మాట్లాడుతున్నావు. ఆ రాముడు మర్యాద పురుషోత్తముడు. ఆయన నీకు అతి మర్యాదగ నచ్చచెప్పాడు. నీ మీద చేయి కూడా ఎత్తలేదు. నీ ప్రేలాపన అధర్మ పూరితం. ఆయనే కోపగించివుంటే నువ్వి రోజున నాతో ఇలా మాట్లాడగలిగే దానివే కాదు. అంతే కాదు, ఆ శరవేగం కనిపెట్టి నీకు జరగాల్సిన అతి పెద్ద ప్రమాదం, త్రుటి లో తప్పించేసాడు ఆ పురుషోత్తముడు తన కదలికతో. అందుకే నీకు రూపం మాత్రమే పోయింది. ప్రాణాలు కాదు. పైగా నువ్వు రాక్షస స్త్రీవి. నీవు మాయావివి. అందుకే నిన్ను చంపినా స్త్రీ హత్య పాతకం చుట్టుకోదు. కారణం నీ వలన ఈ ప్రపంచానికి ఆపద రావచ్చు. ఇదే యుగ ధర్మం,” అంటూ ధర్మోపదేశం చేసింది త్రిజట.
“మరి నేనా స్వామిని చేరుకోవడమెలా, నా కోరిక ఫలించే మార్గమే లేదా, త్రిజట? ఏదయినా మార్గం చెప్పు, నేనా స్వామి లేకున్నా నాకీ జీవితమే దుర్భరము,” అంటూ ప్రాధేయ పడింది.
“దేవి! నువ్వీ జన్మలో ఆయనను పొందలేవు. ఇంకా ఆశ ఉంటె తపస్సు చేయి. మరో జన్మలోనైనా ఆ స్వామి అనుగ్రహం పొందగలవేమో చూసుకో,” అంటూ పలికింది అనుభవజ్ఞురాలయిన త్రిజట.
“మరయితే నేను ఆ స్వామిని ఏ నామంతో జపించాలి?” అడిగింది శూర్పణఖ.
“మన రాక్షసుల ఆరాధ్య దైవం ఆ మహేశ్వరుడే స్వయంగ జపించే తారక మంత్రం జపించు.” అంటూ ఆమె చెవిలో త్రిజట, ”శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే,” అన్న రామనామ తారక మంత్రాన్ని ఉపదేశించింది ఆమెకి.
ఆ క్షణం నుండి శూర్పణఖ తన మందిరం లోనే ఉండి రామనామ జపం లో మునిగిపోయింది. ఆమెది తనతో తానే చేస్తున్న యుద్ధం. అందుకే ఆ రామరా వణ సంగ్రామం గురించిన చింత లేదు ఆమెకి. ఎన్ని జన్మలేతైన ఆ స్వామి సన్నిధిని పొందాలన్న ఆకాంక్షతో చేసే తపస్సు తప్ప.
యుద్ధం ముగిసింది విభీషణుడు లంక రాజ్యాభిషిక్తుడయ్యాడు. సోదరి శూర్పణఖ మందిరానికి వచ్చాడు ఆమె క్షేమ సమాచారములు తెలుసుకోవడం కోసం. అక్కడ మారిపోయినా వాతావరణం ఆయన్ని ఆశ్చర్యచకితుడిని చేసింది. అక్కడ తిరుగుతున్నా గాలిలో కూడా రామనామ స్మరణే వినిపించడం గుర్తించి, సోదరి తపస్సుని భంగం చేయరాదని అయన అక్కడి నుండి నిష్క్రమించాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అలా తపస్సులో లోనే సోదరి శూర్పణఖ దేహం త్యజించిందని తెలుసుకొన్నాడు.
************************
ద్వాపరయుగంలో చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ యుగంలో గోపాలకులే భూపాలకులుగా చలామణి అవుతున్నారు. మధుర ఒక మంచి రాజ్యంగా ప్రఖ్యాతి పొందింది. మధురకు చుట్టుపక్కల ఉన్న అనేక గోపాలుకుల గ్రామాలు పాడిపంటలతో విలసిల్లినాయి.
ప్రజలు సుఖసంతోషాలతో జీవనం సాగిస్తున్నారు. కంసుమహారాజు చాలా కోపిష్టి, బలవంతుడు, కానీ మంచి పాలకుడు అని ప్రజలు ఆనంద పడేవారు. ఒక అనుకోని సంఘటన వలన ఆ ప్రజల జీవనమే అస్తవ్యస్తమైంది. ఆ రాజు గారి పాలనలో తమ యొక్క, తమ పిల్లల ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు.
దేవకీదేవి కంసమహారాజు యొక్క సోదరి, వసుదేవుని భార్య. ఆమెకు కలగబోయే సంతానం వలన కంసమహారాజుకు మరణం సంభవించునని జ్యోతిష్య పండితులు ఆయనకు తెలియజేశారు. “దేవకి తన ఆడబిడ్డ. ఆమెకు పుట్టబోయే కొడుకు అంటే తనకు మేనల్లుడు. తన తల్లితో సమానుడైన మేనమామకు ప్రాణహాని తలపెడతాడా? అలాంటి పక్షంలో దేవకికి ఒక బిడ్డను కూడా కలగనీయకూడదు,” అన్న రాక్షసాహంకారంతో.’ దేవకి,వసుదేవులను కారాగారంలో ఉంచి వారికి కాపలాగా ద్వారపాలకుడు వికౄపుడుని ఉంచాడు.
“దేవకిదేవిని గర్భవతిగా చూసినప్పుడల్లా, మా రాజుగారి ముందు ఈ బిడ్డ బతికేనా?” అనుకుంటు దేవకీదేవికి ప్రసవం కాగానే ఆ వార్తను కంసమహారాజుకి అందించేవాడు. అలా అతి క్రూరంగా ఆమె ఏడుగురు బిడ్డలను ఆహుతి తీసుకున్నాడు కంస మహారాజు. 8వ సంతానం అయిన వాసుదేవుడిని వసుదేవుడు తప్పించి, ఆ బిడ్డ స్థానం లో నందుని ఇంట యశోద గర్భ సంభూతమయిన యోగ మాయను కంసుని కి సమర్పించాడు. తన అష్టమ సంతానాన్ని నందుని ఇంట వదిలి, ఆ బిడ్డను మాత్రమే రక్షించుకోగలిగాడు వసుదేవుడు. దేవకీ దేవి అష్టమ సంతానం బతికే ఉన్నదన్న శంక తో కంసుడు, ‘అప్పటినుండి ఏ నవజాతి శిశువు కనిపించిన చంపమని’ రాజాజ్ఞ జారీ చేశాడు
కానీ విక్రూపుడి భార్య రూపాంగి మాత్రం కంసమహారాజుకి చందన లేపనం చేసి ఇవ్వడానికి వెళ్ళినప్పుడల్లా, “ఇంత సౌందర్యో పాసకుడయిన కంసమహారాజు అలా పసిపిల్లల పట్ల క్రూరంగా ఎందుకు మారిపోయాడు? ఒక్క బిడ్డను కూడా బతకనీయకుండా తన సొంత సోదరికి ఎంత గర్భ శోకం మిగిల్చాడు, ” అనుకునేది. పైగా ఆమె ఆ సమయంలో గర్భం దాల్చి ఉన్నది. ఆ స్థితిలో మహారాజు గారి మందిరానికి వెళ్లిన ఆయన కంటపడకుండా సుగంధ లేపనం తయారు చేసి పెట్టి వెళ్లిపోయేది. అలా నవమాసాలు భయం భయంగా గడిపేసింది రూపాంగి. ఒక శుభ సమయంలో ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. పుట్టుకతోనే ఆ పసిబిడ్డ అంగవైకల్యం తో ఉంది. అందుకే ఆమెని ‘త్రివర్క’ అని పిలిచేవారు. ఎదిగే కొద్ది ఆమెకు గూని కూడా వచ్చింది. అందువలన ఆమె నిటారుగా నిలబడలేదు. ఎవరిని నేరుగా చూడలేదు. ఆగూని కారణంగా నడవడం కూడా కష్టమై ఒక కర్ర సాయంతో నడుస్తుంది ఆమె.
ఇది కేవలం ఆమె బాహ్య రూపమే. ఆమె అంతరంగం మాత్రం సౌందర్యపూరితం. ఏదో లీలగా చాలా సుందర స్వరూపం ఆమెకు కలలో కనిపిస్తూ ఉంటుంది. ఆ రూపం కనపడినప్పుడల్లా ఆమె మనసు మయూరమై నర్తిస్తుంది. మనసు కోయలై రాగాలు తీస్తుంది. ఏ కొండల్లో విరబూసిన మందారమో! ఓ నా స్వామి! ఆనాటి నా ప్రేమను నేను మరువలేకున్నాను,” అని అంటూ “నీ రాకకై యుగాలుగా ఎదురుచూస్తున్న నీ అభిసారికను!” అంటూ ఏదో స్పష్టంగా తెలియని ఒక సౌందర్యం మూర్తిని ఆరాధిస్తుంది ఆమె తన అంతరంగములో.
సరైన అంగసౌష్టవం లేకపోవడం వలన ఆమెను ‘కుబ్జా’ అని కూడా పిలుస్తారు. అలా కుబ్జా పెరిగి పెద్దదయింది. తల్లికి సాయం గా కంసమహారాజు అంతఃపురానికి వెళుతూ ఉండేది. ఆమె కూడా సుగంధ లేపనం చేయడంలో నిష్ణాతురాలైంది. ఆమె వెళుతున్న దారిలో చాలాసార్లు విన్నది, “చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ, బంగారు మొలతాడు పట్టుదట్టి, సందెట తాయెత్తులు, సరిమువ్వ గజ్జలతో గోకులంలో ఘల్లు ఘల్లుమని ఆటలాడుతూ, అందరినీ ఆడిస్తూ తిరుగుతున్న ఆ జగన్మోహనుని గురించి.
ఆ తర్వాత బాలకృష్ణుడు కాళిందీ బారి నుంచి గోపాలురను గోవులను కాపాడినాడని, కంసమహారాజు పంపిన రాక్షసులను కూడా బాల్యావస్థయందే అంతమొందించినాడని, గోవర్ధనగిరిని సునాయాసంగా ఎత్తినాడని తెలుసుకొని ఆ స్వామిని చూడాలని ఎంతో ఆశపడేది. మనసులోనే ఎన్నోసార్లు తలుచుకునేది, “అంత అద్భుతమయిన కార్యాలను చేయగలిగేది త్రేతాయుగమున శ్రీ రాముడే! మళ్ళి ఈ యుగమున ఆ బాల గోపాలుడే!” అని
“ఎంతగా తపించినా తనకి ఆ స్వామి దర్శన భాగ్యం కలగడం లేదే! అయినా తన పిచ్చి కానీ! తను త్రివక్ర! కుబ్జ సరిగా కూడా నడవలేదు. తనని చూసి తన సాటి పిల్లలు ఆడుకోవటానికి కూడా ఇష్టపడరు. చూసినప్పుడల్లా ‘వంకర టింకరు ఓ! నల్లగుడ్ల మే! నాలుగు కాళ్ల బే!’ అనే పాటల పాడి ఆమెను గేలిచేస్తారు. అలాంటి తనను చూస్తే ఆ నీల మేఘశ్యాముడు దగ్గరికి రానిస్తాడా? తనొక దాసి. తనకంత తాహతు ఉందా ఆ స్వామి ని కలవడానికి? తనలో ఉన్న ఈ తపన, తను చేస్తున్న తపస్సు ఫలితం ఇచ్చేనా? ఎప్పటికైనా ఫలించేనా?” అంటూ ఆ కుబ్జ రోజు తనలో తానే వాపోతుంటుంది.
ఇలా చాలా సంవత్సరాలు తనకు ఊహ వచ్చినప్పటినుండి ఆ గోపాలుడి కోసం ఎదురు చూస్తూనే ఉన్నది ఆమె. పదమూడు సంవత్సరాల వయసుకు చేరుతున్న కుబ్జా లో ఆ గొపబాలుకుడి రూపం మనసంతా నిండిపోయింది.
“ నా ఈ జన్మలో నీవు నా మిత్రుడివే.
మిత్రమా! నీవు లేని రోజు యుగాలుగా మారుతున్నాయి!
నీవు రాని క్షణం అంతం లేని అశాంతి!
నీవు వస్తావని చూసే నా చూపులు రాత్రి పవళ్లు నిత్యం చూస్తాయి;
నీవు వస్తావని! రాని నీకోసం ఎదురు చూస్తాయి.
ఎందుకో తెలుసా స్వామి! ఎప్పటికైనా నీవు వస్తావని.
నా నిరీక్షణ ఫలిస్తుందన్న ఆశ,” అనుకుంటూ సుగంధ లేపనం రోజు ఆ యశోద తనయుడి కోసం కూడా తయారు చేస్తుంది కుబ్జ ప్రతినిత్యం .
ఆరోజు అంతఃపురంలో కాపలాదారులు మాట్లాడుకుంటున్నారు, “విను సోదర మన కంశమహారాజు గారు వసంతోత్సవాలను ప్రారంభించారు. నృత్యగానాలతో పాటు మల్ల యుద్ధాలు, కర్రసాములు , కత్తియుధ ప్రదర్శనలు కూడా ఉన్నాయి.”
“ఎన్ని సంబరాలు జరిగితే ఏముంది మన బతుకులు ఇలాగే కాపలా కాస్తూ గడిచిపోతాయి. ఏ కాస్త పొరపాటు జరిగిన మన తలలు తెగిపడతాయి.”
“అది నాకు తెలుసు సోదరా! నేను చెప్పేది మరొక విశేషం. కంసమహారాజు ఈసారి ప్రత్యేకంగా బృందావనంలోని గోపాలకుల పెద్ద నందగోపాలుని కుమారుల కోసమే ఈ మల్ల యుద్ధ ప్రదర్శన ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడని అందరూ చెప్పుకుంటున్నారు,” అని వివరించాడు.
“అంతే కాదు మన కంసులవారి మత్తగజం కువలయపీడ ను ఆ యువకులు మల్ల యుద్ధం చేసే బరిలోకి రాకముందే వారి మీదకు ఉసిగొలుపుతారు. దాంతో మన కంస మహారాజు గారి కోరిక తీరిపోతుంది, శత్రుశేషం తొలిగిపోతుంది.”
“పిచ్చోడా! మన మహారాజు గారు పంపిన మహామహా రాక్షస యోధులే ఆ బాలుడి ముందు ఎందుకు కొరగాకుండా పోయారు. ఈ మత్త గజమెంతా!” అంటూ నవ్వేసాడు.
వారి మధ్య జరుగుతున్న సంభాషణలను స్త్రీల మందిరాల వైపు వెళుతున్న కుబ్జ విన్నది. “ఆమె మనసు ఆనందతరంగితమే అయింది. పురివిప్పిన నెమలిలాగా నాట్యమాడ సాగింది. ఆ స్వామి తప్పక వస్తాడు. తనకు ఆయనను దర్శించే భాగ్యం తప్పక కలుగుతుంది. తన నిరీక్షణ ఫలిస్తుంది. మహాదేవ నీకు కోటి కోటి ధన్యవాదాలు!” అంటూ ఎన్నోసార్లు ఆ దేవదేవునికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇల్లు చేరింది. ప్రత్యేకంగా ఆ స్వామికోసం చందన లేపనం చేయడం మొదలుపెట్టింది. “ఎంతయినా ఆ స్వామి కి మల్ల యుద్ధం లో దెబ్బలు తగలవ ఏమిటి? అసలే ఆ చాణూర ముష్టికులు మొరటు రాక్షసులు. తనని ఎన్నో సార్లు గాల్లోకి విసిరేసి భయపెట్టేవారు. నా స్వామి, వారికీ తగిన శిక్ష వేయాలి. నేను రాసె ఈ చందన లేపనం తో మల్లయుద్ధం లో కలిగే ఆ నొప్పులన్ని ఉపశమించాలి,” అనుకుంటూ అనేక శ్రేష్ఠమయిన వనమూలికలు సేకరించి, స్వచ్చమయిన గంధం తో కుబ్జ లేపనం తయారు చేసి పెడుతున్నది రోజు.
నిరీక్షణ ఫలించే రోజు వచ్చేసింది. కుబ్జకు ఆందోళనగ ఉన్నది. అపారమయిన నమ్మకమున్న కూడా, అంతకుమించిన ప్రేమ ఉండడం వలన ఆ నంద గోపాలునికి ఏ హాని జరగరాదని ఆ దేవదేవు ని వేడుకోంది. ఆ రాక్షస మల్లుల బారినుండి తమను ఎవరు కాపాడతారా! అని ఎదురుచూసే మధురవాసులు కూడా ఆ గోపాలకులనే విజయలక్ష్మి వరించాలని ముక్కోటిదేవతలకి మొక్కుకున్నారు. చాణూర ముష్టికులతో మల్ల యుద్ధ ప్రహశనం లో వారిని చిత్తుగా ఓడించి మధురవాసులను వారి అరాచకాల నుండి రక్షణ కల్పించి ఆ నగరవాసుల మన్ననలను దీవెనలను పొంది, ఆ మధురానగర వీధులలో తిరగాడటం మొదలుపెట్టారు బాలరామకృష్ణులు. రెండు మత్త గజాలు ఠీవిగా నడుస్తున్నట్లు, కొద్దిసేపు రెండు కొదమ సింహాలు వేటకు బయలుదేరినట్లుగా ఆ ఇరువురు కనిపించారు. ఆ వీధులలో నడుస్తున్న వారంతా కొందరు భక్తితో, కొందరు భయంతో పక్కకు తప్పుకుంటున్నారు. మరికొందరు ఆ దివ్యలోచనులను చూస్తూ చూపు మరల్చుకోలేక పక్కకు తప్పుకొని వెళుతూ వెనక్కి తిరిగి చూస్తూ చూస్తూ నడుస్తున్నారు. అదే సమయంలో స్త్రీల అంతఃపురం వీధులలోకి ప్రవేశించాడు శ్రీకృష్ణుడు తన సోదరుడు బలరామునితో. గూనితో వంగిపోయి క్రిందకి మాత్రమే చూస్తూ వంగిపోయిన నడుము తో వంకరకాళ్ళ తో కర్ర సాయంతో ఒక చేత్తో సుగంధ లేపనం ఉన్న పాత్ర మరో చేత చేతికర్రతో వస్తున్నది కుబ్జ.
“నా స్వామి ని ఎలాగయినా కలిసి , ఈ సుగంధ లేపనం సమర్పించుకోవాలి. మల్లయుద్ధం లో ఎన్ని దెబ్బలు తగిలాయో!” అనుకుంటూ వడివడి గ నడవాలనిఉన్న నడవలేక కర్రసాయంతో కాస్త వేగంగానే నడుస్తున్నది కుబ్జ.
ఆమెనుండి వస్తున్న సుమధుర సువాసనకు కృష్ణుడు బలరామునితో, “చూడు అన్న! మధురానగరం ఎంత సుందరంగా ఉన్నది. అలాగే ఇక్కడి స్త్రీలు ఇంకా ఎంత సౌందర్యవంతులు. ఆహా ఎంత మంచి సుగంధ పరిమళం వస్తున్నది ఆమె చేతిలో ఉన్న పాత్రనుంచి. మనం వెళ్లి అడుగుదామా,” అంటూ బలరాముని కోసం ఎదురు చూడకుండా అటువైపుగా పరిగెత్తాడు శ్రీ కృష్ణుడు. ఆ పాద తాడనలకు భూమి కంపించినట్లయింది.
కుబ్జ తేరు కొని చూసే లోపే ఆమె ఎదురుగా ఒక యువకుడు నిలుచున్నాడు. “ఏయ్ ఎవరు నువ్వు ఇది కంసమహారాజు గారి స్త్రీల అంతఃపుర వీధి. ఇక్కడ నీలాంటి యువకులు తిరగకూడదు. త్వరగా వెళ్ళిపో లేదంటే భటులు మీకు కొరడా దెబ్బలు తినిపిస్తారు,” అని కుబ్జ పలికింది. తలెత్తి ఆ యువకుడు రూప మొత్తం చూడలేకపోతున్నది. కానీ త్రిభంగా కృతి లో నడుమున చేయి, మరొక చేతిలో పిల్లనగ్రోవితో వయ్యారంగా నిలిచిన ఆ యువకుడి కలువ రేకులు వంటి సుందర పాదాల నుండి తన చూపు తిప్పుకోలేకపోయింది.
“సరే అయితే మేము త్వరగా వెళ్ళిపోతాము. నాకు ఆ సుగంధ లేపనం ఇవ్వు లేదా నీవే రాయి మేము వెళ్ళిపోతాము,” అంతే చిలిపిగా నవ్వాడు శ్రీ కృష్ణుడు.
“ఓయి యువకుడా! నాలాంటి కురూపి అంగవైకల్యం ఉన్న నేను మీలాటి వారికీ చందనం రాయగలనా, స్వామి? క్షమించి నన్ను వదిలేయ్. నాతో పరాచికాలాడకు,” అంటూ పక్కకు తప్పుకోబోయింది.
“ఓహో! అలాగా! నిన్ను వదిలేయటానికి కాదు కదా కుబ్జా నేనీ వీధిలోకి వచ్చింది. ఏది ఒకసారి నీ మొఖం చూపించు,” అని ప్రేమతో పలికాడు.
“ అయ్యో స్వామి నేను అంత ఎత్తుకి తలెత్తి చూడలేను,” అంటూ కళ్ళనీళ్ల పర్యంతం అయి, “ఈ దాసిని క్షమించు,” అంటూ ఆ స్వామి పాదాలకు లేపనం అద్దింది.
అంతకే కరిగిపోయిన స్వామి, “కుబ్జ,” అని ప్రేమగా పిలుస్తూ, నూతన వరుడు నూతన వధువికి సునిసితంగా పాదతాడన చేసిన తీరులో ఆమె బొటన వేలిని తన బొటన వేలుతో నొక్కిపట్టి, ఆమె చూబుకం మునివేళ్లతో పట్టుకొని మరొక చేతితో ఆమెను పాణిగ్రహణం చేసి పైకి లేపాడు. ఆ జగదేక మోహనుని కోసం ఎన్నో జన్మల నుండి చేసిన తపస్సు ఫలితం, ఎన్నో యుగాల నిరీక్షణ ఫలించిన ఆ క్షణం కుబ్జ నడుము పైకి సాగింది. గూని జారిపోయింది. ఆమె భుజాలు, ఆ తర్వాత శిరస్సు ఆ దివ్య తేజోమయరూపుని చాతి దగ్గరకు నిటారుగా వచ్చి నిలిచిపోయాయి. ఆ పురుషోత్తముని అలా చూస్తూ ఉండిపోయింది. ఆ వీధి లో తిరగాడుతున్న స్త్రీలకు ఆ వింత మహాద్భుతంగా తోచింది. త్రివక్ర అతి సౌందర్యరాశిగా మారిపోయింది. ఆమె తనను తాను చూసుకోలేదు. ఆమె త్రిభంగాకారంలో నిలిచిన ఆ గొపబాలుడినే చూస్తున్నది ఆర్తితో.
ఏదో లీలగా ఒక దివ్య పురుషుడు సాక్షాత్కరించినట్లయింది. “ఆజానుబాహుడు అరవింద దయా దళాయతాక్షుడు రఘువంశ సుధాముడు రామ చంద్రుడు” దర్శనమిస్తున్నాడు. ఆమె ఆ పురుషపుంగవుని చాతికి, భుజాలకు, తీర్చిదిద్దినట్లుగా ఉన్న సుందర వదనమునకు ఆమె సుగంధ లేపనం రాసింది. “స్వామి నా ఇంటికి రండి. వచ్చి నాకు మోక్షం ప్రసాదించు.” అని వేడుకుంది.
అప్పుడు ఆ దివ్య పురుషుడు, “ దేవి!గత జన్మలో నీవు సౌందర్య రాసివి. కానీ నా సోదరుని శరాఘాతం వలన నీవు కురూపిగా అయిపోయావు. నా సమక్ష్మలోనే ఒక స్త్రీవి, అందునా అతి రూపవతి అయినా నీకు అన్యాయమే జరిగిందని నా మనసుకు అనిపించింది. నేను ధర్మ బాధుడను. ఆ రోజు నేను అనుకున్నాను నీకు న్యాయం చేయాలి అని. ఆ న్యాయమే నేను ఈ నాడు నీకు చేయగలిగాను. ఈ యుగధర్మానుసారం నిన్ను కలిసి నీ సుందర రూపాన్ని నీకు తిరిగివ్వగలిగాను నాలో ఉన్న ఆ నేరభావనను నుండి విముక్తి పొందాను. నీవు ధన్యురాలివి!” అని సంబోధించాడు. “మన ఈ కలయిక ఇప్పటివరకే సెలవు నేస్తమా!” అని కృష్ణుడు బలరామునితో సహా అక్కడి నుంచి వేగముగా నిష్క్రమించాడు.
అలా సాగిపోతున్న ఆ దివ్య తేజోమయ రూపాన్ని కళ్ళల్లో నింపుకొని ఆ స్వామి సేవా భాగ్యం ఎప్పటికైనా దక్కకపోదా అన్న ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నది కుబ్జ, “ నీకై అభిసారికనై!” అనుకుంటూ.