పరివర్తన

కథ

హైదరాబాద్ మహా నగరంలో, ఊరంతా ఇంకా నిద్ర మత్తులో ఉండగా, ఉదయం ఐదు గంటలకే నిద్ర లేచిన నీలిమ ఆ రోజు కూడా తన పనుల్లో తలమునకలై ఉంది. గిన్నెలు శుభ్రం చేయడం, వంట మొదలుపెట్టడం, ఇల్లు తుడుచుకోవడం..ఇవన్నీ చేస్తూనే పక్క గదిలో నిద్రలో ఉన్న తన కొడుకు భరత్ కోసం బీరువాలోంచి ఉతికిన చొక్కా తీసి, ఇస్త్రీ చేసి రెడీగా పెట్టింది.

గదిలో నుండి ఆమె కొడుకు భరత్ పిలిచాడు. “అమ్మా… ఇంకా అయిదే ఔతోంది. అప్పుడే ఎందుకు లేచావు ?”

నీలిమ  నవ్వుతూ, “నీ బోజనం, నీ టీ, నీ షర్ట్… ఇవన్నీ నేను సిద్ధం చేయాలి కదా? నువ్వు టైం కి ఆఫీస్‌కు వెళ్లాలి, ఆలస్యం అయితే నన్నే అంటావు!”

భరత్ చిరునవ్వు నవ్వాడు. “సర్లే, నేనూ లేచి వస్తున్నాను ఉండు, ఇద్దరం కలిసి చేసుకుందాం,” అంటూనే లేచి కాలకృత్యాలు తీర్చుకుని, తల్లి అందించిన కాఫీ తాగుతూ, కబుర్లు చెప్పుకుంటూ, ఇంటి పని ఇద్దరూ కలిసి పూర్తి చేసారు. ‘వరాల మూట’ అన్నట్టు ఆమె తన కొడుకును చూసింది.

నీలిమ భర్త శ్యామల రావు బ్యాంకు ఉద్యోగి. పెళ్ళైన కొన్నాళ్ళకే దూరపు ఊరికి బదిలీ కావడంతో, ఆమెను,తన తల్లిదండ్రులకు సాయంగా పట్నం లో ఉంచి, తాను మాత్రమే ఆ ఊరికి వెళ్ళాడు. అప్పుడప్పుడూ వచ్చి భార్యను, తల్లిదండ్రులను చూసి వెళ్తుండేవాడు. భర్త ఓదార్పు మాటలతో నిండిన చిన్న లేఖలు, అప్పుడప్పుడూ వచ్చి వెళ్లే అతని సందర్శనలు… అటు బాధ, ఇటు బాధ్యతల మధ్య నీలిమ జీవితం సాగింది. అత్తామామల కఠినత్వానికి, భర్త చెప్పిన ‘వాళ్ల మాటే శిరోధార్యం’ అన్న ధోరణికి అనుగుణంగా నడవడం తప్ప మరొక మార్గం లేకపోయింది ఆమెకు.

పెద్ద వారు, పైగా ఎంతో కాలంగా ఉన్న నిర్దిష్టమైన అలవాట్లతో పండిపోయిన అత్తమామలకు సేవ చేస్తూ, భర్త వద్దకు తాను వెళ్ళగలిగిన రోజు కోసం ఎదురు చూస్తూ ఆమె యవ్వనం గడిచిపోయింది. అడపాదడపా వచ్చి వెళ్లే భర్త పుణ్యమా అంటూ ఒక సుపుత్రుడు జన్మించాడు. భరత్ అని పేరు పెట్టుకున్నారు. ఆమె పంచప్రాణాలు అతని చుట్టూ కవచంగా మారిపోయాయి. అతని చుట్టూ ఆమె లోకం అల్లుకుంది. సంవత్సరాల తరబడి ఆమె ఒంటరితనంతో పోరాడినప్పుడు, ఈ కొడుకే ఆమెకు వెలుగుకిరణం అయ్యాడు. తల్లే ప్రపంచంగా పెరిగాడు భరత్. పసికూనగా తన చేతుల్లో పెట్టుకుని నడిపించిన కాళ్లు, ముద్దు ముద్దు మాటలు పలికే పెదాలు, మొదటి స్కూల్ బాగ్… ప్రతీ దానిపైనా ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకునేది. అతనికి ఎన్నో మార్లు బదిలీలు జరిగినా, కొంత కాలం తల్లిదండ్రుల కారణంగా ఆ తర్వాత కొడుకు చదువు కారణంగా నీలిమ పట్నం లోనే ఉండిపోయింది.

భరత్ చిన్నతనం నుంచే తల్లి పడే కష్టాన్ని గమనిస్తూ పెరిగాడు. ఇంట్లో ఎప్పుడూ అందరికన్నా చివరగా తినే తల్లి, పగలంతా పని చేసి రాత్రిళ్ళు మోకాళ్ళు పట్టుకుని విశ్రమించే తల్లి…అందరికన్నా ముందు లేచి, ఆఖరున పడుకునే అమ్మ, ఇవన్నీ గమనించిన అతని మనసులో ఒక తీర్మానం బలంగా నాటుకుపోయింది, “తల్లిని సంతోషంగా ఉంచడమే నా జీవిత లక్ష్యం,”

అలా వారిద్దరి సంబంధం బలమైన బంధంగా మారింది — తల్లీకొడుకుల మైత్రిగా.  కాలక్రమంలో అత్తామామలు కన్నుమూశారు. భరత్ చదువు కోసం నగరానికి చేరుకున్నారు తల్లీ కొడుకులు. ఎంబీఏ చదివిన తరువాత అతనికి మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇంక కొడుకు వివాహం జరిపించి, తాను భర్త ఉద్యోగం చేస్తున్న ఊరికి వెళ్ళచ్చు అనుకుంటూ సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. కానీ కాలం తన పరీక్షలు పెట్టక మానదు. శ్యామల రావుకు తీవ్ర అనారోగ్యం కలిగింది. అతడిని ప్రతిరోజూ హాస్పిటల్ కు తీసుకు వెళ్ళి వైద్యం చేయించాలి. అది తన తల్లి వయసుకు మించిన భారంగా భావించిన భరత్ తల్లి వారిస్తున్నా వినకుండా ఉద్యోగం మానేసాడు. కానీ వారి కష్టం ఫలించలేదు. అనారోగ్యంతో పదవీ విరమణకు ముందే కన్నుమూశాడు శ్యామల రావు. భర్తతో కలిసి జీవించాలన్న కలలు ఒక్కసారిగా నీలిమ కళ్లముందే తారుమారు అయ్యాయి. గుండె లోతుల్లోని బాధను దిగమింగి, భరత్ కోసం బలంగా నిలబడింది. కొన్నాళ్ళు కొడుకు తన పెళ్లి సంగతి కూడా మర్చిపోయాడు. తల్లిని కంటికి రెప్పలా చూసుకున్నాడు.

బంధువుల ద్వారా తన కొడుకు కోసం ఆమె మంచి సంబంధాన్ని చూసింది. ఆ అమ్మాయి — ప్రణవి. తండ్రిలేని అమ్మాయి. తల్లి మాత్రం ఎంతో వినయంగా, గౌరవంగా ప్రవర్తించిన మహిళ.

ప్రణవిని చూసిన మొదట్లోనే నీలిమకు ఆమె మీద ఇష్టం కలిగింది. “ఈ అమ్మాయి మన ఇంట్లో ఉంటే మన భరత్‌కు బాగుంటుంది” అనిపించింది. ఎలాంటి ఆడంబరాలు లేని పెళ్లి జరిపించి, ఇంటికి నూతన వధువును తీసుకొచ్చారు.

కానీ పెళ్లైన తరువాత మారాల్సింది నీలిమ. ఆమె మారలేదు.

ప్రణవికి భర్త మీద, దాంపత్య జీవితంపై కలలుంటాయి. భర్త ప్రేమలో తడిసి ముద్దవ్వాలనే ఆశలు ఉంటాయి. కానీ నీలిమ మాత్రం అన్నీ తన చేతుల్లో ఉంచుకుంది — కొడుకు భోజనం, ఇదివరకు లాగానే తామిద్దరూ బయటికి వెళ్లడమూ, బంధువుల ఇళ్లలో పనులకైనా తన కొడుకును వెంటే తిరగమంటూ, కోడలికి తమ జీవితంలో ఎలాంటి ప్రమేయం లేకుండా చేసింది.  ప్రణవికి ఆ ఇంట్లో తన స్థానం ఏమిటో తెలియకుండా పోయింది.

ఒక రాత్రి భరత్, తిన్నాక ఫోన్ చూస్తూ కుర్చీలో కూర్చున్నాడు. ప్రణవి పక్కన కూర్చొని మాట్లాడడానికి ప్రయత్నించింది.

“భరత్… ఈ వారం ఎక్కడికైనా బయటకు వెళదామా? ఒక రోజు ఆఫీసుకు లీవ్ తీసుకో.”

“బయటకు వెళ్లాలంటే అమ్మ కూడా వస్తుందిగా. ఆమె కూడా ఎప్పట్నుంచో చెబుతోంది, తిరుపతిలో ఏదో మొక్కు ఉందని,” ఫోన్ లోంచి తల పైకెత్తకుండానే సమాధానం ఇచ్చాడు.

“ఒక్కసారి నన్ను ఒక్కదాన్నే తీసుకెళ్లడం నీకు తప్పుగా అనిపిస్తుందా? నేను నీ భార్యను కదా, నా కోసంగా ఏదైనా ప్లాన్ చేస్తే… నీ తల్లికి తప్పని అనిపిస్తుందా?”

“ప్రణవీ! మా అమ్మ మీద అసూయపడుతున్నావా? నువ్వు తల్లి ప్రేమను అర్ధం చేసుకోవాలి.” బాధపడుతున్నట్టు అన్నాడు భరత్.

“ప్రేమంటే కేవలం తల్లి మీద మాత్రమేనా భరత్? తల్లికి నువ్వు కొడుకువు, నాకు నువ్వు జీవిత భాగస్వామివి. నాలో భార్యగా ఉన్న ఊహలు, ఆశలు, నీతో ఏకాంతంగా ఉండాలన్న కోరికలు… ఇవన్నీ నా ప్రేమలో నీకు కనిపించవా?” తన మనసులోని మాటను అతనికి తెలియజెప్పే ప్రయత్నం చేసింది.

“నాకు అవన్నీ తెలియదు. పెళ్లికి ముందే నీకు చెప్పాను కదా మా అమ్మంటే నాకు ప్రాణం అని. నువ్వు ఇలా మాట్లాడతావనుకోలేదు…”

అంతే. ప్రణవి గొంతు మూగబోయింది.. లోలోపలే మరిగిపోతున్న బాధ  దావానలంలా ప్రణవి కళ్ళల్లోంచి ఉబికింది. మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించింది.

తలుపు వెనుక నిల్చున్న నీలిమ ఈ సంభాషణ అంతా విని, “నా కొడుకు బంగారం, కోడలు తమను విడదీసేందుకు వచ్చిన కొరివి దెయ్యం,” అనుకుంది స్వగతంలో. కానీ ఇది రాబోయే ప్రమాదానికి సంకేతం అని, తాను కాస్త పట్టు విడవకుంటే కొడుకు జీవితం పాడౌతుందని ఆమె గుడ్డి ప్రేమ గుర్తించలేదు.

******************

ఒకరోజు నీలిమ స్నేహితురాలు శైలజ రాగా, ఇద్దరూ కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు.

“శైలూ, నా కోడలు నన్నూ, నా కొడుకుని విడదీసేందుకు ప్రయత్నిస్తోంది. నేను తనని బాగానే చూసుకుంటున్నా కదా, ఐనా ఇలా……., అంటూ కొడుకు కోడలు మధ్య జరిగిన సంభాషణ అంతా స్నేహితురాలికి చెప్పింది.

“నీలూ, ఓసారి నీ కోడలి స్థానంలో నిన్ను ఊహించుకోగలవా?” అడిగింది శైలూ.

“ఏం శైలూ, నేను ఆమెకు ఏమన్నా బాధ కలిగించానా? నా కొడుకుతో ఆమెకు ఉన్న బంధాన్ని నేనేం తప్పుపట్టాను?” అమాయకంగా అడిగింది నీలిమ.

“బంధం అనేది పైపైన ఉంటే చాలదు. నువ్వు నీ భర్తతో సరియైన బంధం ఏర్పడకపోవడంతో ఎంతో బాధపడ్డావు గుర్తుందా? భార్యాభర్తల అనుబంధం ప్రేమతో ముడిపడాలి. కానీ నువ్వు వారికా అవకాశం ఇస్తున్నావా? మూసిన వారి గది తలుపు తెరిచి అడుగుపెడుతున్నావు. తమ  దాంపత్య జీవితంలోని శూన్యత ఆమె మాటల్లో తేటతెల్లమవుతోంది.  నీ ప్రేమ – కొడుకు మీద ఉన్న ప్రేమ – అది ఓ గరిష్ఠ రేఖ దాటి పోతోంది. ఇది ముందు ముందు అతడి జీవితంలో తుఫాను సృష్టించిగలదు, ఆలోచించుకో. అర్థం చేసుకునే ప్రయత్నం చేయి,” నిజమైన స్నేహితురాలిగా ఆమె మంచి కోరి చెప్పింది శైలజ.

నీలిమ మాత్రం “నా కొడుకు నన్ను మర్చిపోతాడనిపిస్తుంది. నాకు భయమేస్తుంది శైలూ,” తన ధోరణిలో తానే మాట్లాడుతోంది.

“ఆ భయం వదిలేయ్ నీలూ. అసలైన ప్రేమ మనసులో ఉంటుంది. కానీ ఆ ప్రేమ కోసం ఇంకొకరి జీవితం పాడుచేయాలని లేదు,” ఇలా ఎన్నోసార్లు ఆమె స్నేహితురాలు శైలజ, నీలిమను హెచ్చరించింది.

“నీలిమా, మీ తల్లీబిడ్డల ప్రేమ ఆమె మనసును నెమ్మదిగా గాయపరుస్తోంది. కొడుకు ఎప్పుడూ నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు, కానీ జీవితాంతం అలాగే ఉండాలని కోరుకోవడం తగదు” అని పలుమార్లు చెప్పింది.

“నా బిడ్డను నా నుంచి దూరం చేసేందుకు వీళ్ళంతా కుట్ర పన్నుతున్నారు. ఇక ఈ శైలూ నుంచి కూడా దూరం పెట్టాలి,” అని నిర్ణయించుకుంది నీలిమ.

కాలం మరింత ముందుకు సాగింది. ప్రణవి తన భర్తను తనవాడిగా మార్చుకోవడానికి ప్రేమగా, సహనంగా, నిశ్శబ్దంగా ఎంతో ప్రయత్నించింది. కానీ ప్రతి అడుగులోనూ ఆమెకు అడ్డుగా నిలిచింది నీలిమ ప్రేమ.

భరత్ తన భార్యతో  పంచుకోవల్సిన వ్యక్తిగత విషయాలు, బాధలు, ఆలోచనలు అన్నీ తల్లితోనే పంచుకుంటూ ఉంటాడు. దాంతో ప్రణవికి తాను ఆ ఇంట్లో కేవలం పని చేసేందుకు మాత్రమే ఉన్నానని అనిపించడం మొదలయ్యింది.

ఒక రోజు భరత్ ఆఫీస్ నుండి వస్తూనే సంతోషంగా, “అమ్మా ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. నా శ్రమకు తగిన ఫలితంగా కంపెనీ నాకు ప్రమోషన్ ఇవ్వబోతోంది. మా బాస్ ఈరోజే నాకీ విషయం చెప్పాడు. వెంటనే ఈ సంతోషాన్ని నీతో పంచుకోవాలని అనిపించింది,”  చెప్పాడు.

“ఔనా! చాలా సంతోషం భరత్. నీకు ముందు ముందు మరింత విజయం కలగాలని ఆ భగవంతున్ని మనసారా ప్రార్థిస్తాను. రేపు కోడలితో చెప్పి నీకు ఇష్టమైన పులావ్, గులాబ్ జామూన్ చేయిస్తాను. మీ ఫ్రెండ్స్ కి కూడా పట్టుకెళ్దువు గానీ,,” కొడుకు సంతోషంలో పాలు పంచుకుంది నీలిమ.

ఆ ఆనందం భార్యతో కూడా పంచుకోవాలనే కనీస బాధ్యత మర్చిపోయాడు భరత్. మరునాటి ఉదయం అత్తగారి నోటి ద్వారా ఆ విషయం విన్న ప్రణవికి కోపం నసాలానికి అంటింది. అత్తగారు కూడా కేవలం వంటేం చేయాలో చెప్పేందుకు, అతి మామూలుగా ఆ విషయం చెప్పడంతో ఆమెకు పుండు మీద కారం చల్లినట్లు అనిపించింది.

ఆరోజు ఆమె పెట్టె సర్దుకుని నిశ్శబ్దంగా తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది.

“నేను ఇక అత్తింటికి వెళ్ళను. అక్కడ నాకు ఒక భార్యగా గౌరవం లేదు. బలవంతంగా పంపిస్తే నేను ఎక్కడికైనా వెళ్లిపోతా. నువ్వు అరిచి గోల పెట్టినా కూడా మళ్ళీ ఆ గడప తొక్కేది లేదు,” అని తన తల్లికి గట్టిగా చెప్పేసింది.

అల్లుడికి ఫోన్ చేసి మాట్లాడడానికి రమ్మంది ప్రణవి తల్లి సుశీల.

“తను నా తల్లిని భరించలేకపోతే, నేను తనని భరించలేను,” నిష్కర్షగా చెప్పాడు భరత్.

ఆ మాటలు విన్న నీలిమ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయింది. చుట్టుపక్కల వారు వారిపై జాలి చూపించలేదు. “అంతలా అత్తగారు ఇంట్లో పెత్తనం చేస్తుంటే, కోడలు ఇంటిని వదిలేసి వెళ్లిపోయింది” అని ఎత్తి చూపారు.

ప్రణవి వెళ్లిపోయిన తరువాత, నీలిమ ధైర్యంగానే ఉంది. పోతే పోనీ,కోడలు లేకపోయినా, నా బిడ్డకు నేను ఉన్నాను కదా,” అని భావించింది. కానీ రోజులు గడిచేకొద్దీ, వాస్తవం అర్థమవడం మొదలైంది. ప్రతి ఉదయం ఒక భారం. ఇంతకాలం ప్రణవి చేసిన పనులు—ఆకలితో నిద్రలేచిన భరత్ కోసం వంట చేయడం, కాఫీ సిద్ధం చేయడం, ఇంటి చుట్టూ తుడువడం—ఇవన్నీ తనే చూసుకోవాల్సి వస్తోంది.

ఒక రోజు ఉదయం తలనొప్పితో నీలిమ కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుంది. అదే తలనొప్పి ప్రణవి ఉన్నపుడు వచ్చిందంటే, ఆమె తన వెనకే తిరుగుతూ కాఫీ ఇచ్చి, బామ్ రుద్దడమూ చేసేది. భరత్ కూడా, తనకు కాస్త బాగా లేదంటే తల్లడిల్లి పోయేవాడు. ఇప్పుడు మాత్రం భరత్ చూశాడు. “నిద్ర సరిగ్గా లేనట్లుంది, కాస్త రెస్ట్ తీసుకో అమ్మా” అని చెప్పి వెళ్ళిపోయాడు.

అప్పుడు మాత్రమే నీలిమ గుండె లోతుల్లో ఎక్కడో తడి.  “నాకు కాస్త నొప్పి వచ్చినా ప్రణవి నన్ను పిల్లలా చూసుకునేది. ఇప్పుడు నన్ను చూసేది ఎవరు? నా బిడ్డనేమో…”

భర్తతో  కలుగని తన అనుబంధాన్ని కొడుకుతో పూరించుకుంటూ జీవించిన నీలిమకు, ఇప్పుడు భరత్ కూడా పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల  ఒంటరితనపు చేదు రుచి తగలింది.

భార్య పక్కనే ఉన్నప్పుడు ఆమె విలువ తెలీలేదు కానీ, ఇప్పుడు మాత్రం ఆమె గుర్తొస్తోంది భరత్ కి. “మీ అమ్మను ప్రేమించొద్దని నేను చెప్పట్లేదు భరత్, కానీ భార్యకు ఇవ్వవలసిన స్థానం ఇమ్మని నిన్ను కోరుతున్నాను,” అని ప్రణవి అడిగినప్పుడు ఆమె హృదయంలోని బాధ తనకు అర్థం కాలేదు.

కోడలు ఇంట్లోంచి వెళ్లిన తర్వాత, కొడుకు ఏదో పోగొట్టుకున్న వాడిలా శూన్యం లోకి చూస్తూ కూర్చోవడం చూసి నీలిమ భయపడింది.  “నువ్వే వెళ్లి ఓసారి కోడలిని ఇంటికి తీసుకొని రారా. చిన్నపిల్ల ఏదో ఆవేశంలో వెళ్లిపోయిందని మనం వదిలేస్తామా,” అంటూ కొడుకును పురమాయించింది.

ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్టు ఉన్న భరత్ తన భార్యను కలవడానికి వెళ్లాడు. ప్రణవిని క్షమాపణలు కోరాడు. “నిన్ను బాధపెట్టానని ఇప్పుడు అర్థమైంది. నాన్న పోయాక అమ్మను కూడా కోల్పోతానేమోననే భయంతో, తల్లితో మరీ ఎక్కువగా అనుబంధం పెంచుకున్నాను. నీవు ఎప్పటికీ నా జీవిత భాగస్వామివి ప్రణవీ…”

ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ తలదించుకుంది.  “మన జీవితంలో మీ అమ్మకు, ఎప్పుడూ ముఖ్య స్థానం ఇవ్వాలి భరత్. కానీ నేనంటూ నీ జీవితంలో ఉన్నానని గుర్తించు. అదే నేను కోరుకునేది. ” సుతిమెత్తగా చెప్పింది.

కొన్ని రోజులపాటు ఇద్దరూ కలిసి పలు ప్రదేశాలు తిరిగి కొత్త ఉత్సాహంతో ఇంటికి వచ్చారు. కోడలిని చూశాక నీలిమ నవ్వింది.

“ప్రణవీ, నీకు చెడ్డ అనుభవం ఇచ్చాను. కొడుకు పై ఉన్న పిచ్చి ప్రేమ వల్ల అలా ప్రవర్తించాను. నన్ను క్షమించగలవా?”

ప్రణవి ముందుకెళ్లి ఆమె చేతిని పట్టుకుంది. “మీ పై నాకు కోపం లేదు అత్తయ్యా.  కానీ భార్యగా నాకూ సరైన స్థానం కావాలి. అది మీరు అర్థం చేసుకున్నారు. ఇక పై మనందరం సంతోషంగా ఉందాం,” స్వచ్చంగా నవ్వుతూ చెప్పింది.

ప్రణవి కాపురానికి వచ్చేసిన తరువాత, కొద్ది రోజులు ఇంట్లో గడిపి, “నేను తీర్థయాత్రలకు వెళ్లాలి” అంటూ బయలుదేరింది నీలిమ.

ఆమె వెళ్ళబోయే ముందు  తన కొడుకుతో ఇలా చెప్పింది. “పరిమితి లేని ప్రేమ కూడా ఒక అపరాధమే భరత్… ఇకపై నీ భార్యకు నీ హృదయాన్ని పూర్తిగా ఇవ్వు. నన్ను మర్చిపోకు, కానీ తన స్థానాన్ని తను భార్యగా పొందాలి.”

“అమ్మా నువ్వు ఇప్పుడు ఈ యాత్రలకు వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ నువ్వు మొక్కు అంటూ పట్టుపట్టావు కనుక ఒప్పుకుంటున్నాను. వీలైనంత త్వరగా వచ్చేయ్,” తల్లితో చెప్పాడు భరత్.

“వస్తాను, మీరు ఆ శుభవార్త ఎప్పుడు చెబితే అప్పుడు, అర్థమైందా?” కోడలికేసి చూస్తూ చెప్పింది నీలిమ.

“పొండత్తయ్యా,” అందంగా సిగ్గుపడింది ప్రణవి.

Written by Lata Murty

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రంగు రంగుల చిత్రాలు

మన మహిళామణులు – డా . కొఠారి వాణీ చలపతి రావు