పాకాల యశోదారెడ్డి కథలలో (మా ఊరి ముచ్చట్లు) నాగి

యశోదా రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి గ్రామానికి చెందిన రచయిత్రి. ఈమె వందకు పైగా కథలు రాసినప్పటికి కేవలం 63 కథలు  మా ఊరి ముచ్చట్లు  (1973)  ఎచ్చమ్మ కథలు (1999)ధర్మశాల (2000)  మూడు కథాసంపుటాలుగా వెలువడ్డాయి. మా ఊరి కథలు 1920 నుండి 1940 నాటి తెలంగాణ గ్రామీణ జీవన విధానాన్ని చిత్రీకరిస్తే  ఎచ్చమ్మ కథలు 1950 నుండి 1970 ల కాలంలోని తెలంగాణా సంస్కృతికి ప్రతీకలుగా నిలిచినై. ఇక ధర్మశాల కథలు 1980 నుండి 1990 లలో సమాజంలో వచ్చిన మార్పులను ముందుకు తెచ్చినవి. మొత్తంగా సాహిత్యం సమాజ దర్పణం అన్న విషయాన్ని  యశోదా రెడ్డి కథలు నూటికి నూరు పాళ్ళుగా ఋజువు చేస్తాయి. ఊరికి ఉయ్యాలో ,భావిక అనే కవితా సంపుటాలు కూడా ఈమె కలం నుండి వెలువడినవి. ద్విపద వాజ్ఞ్మయము, ప్రబంధ వాజ్ఞ్మయము ,భారతీయ చిత్రకళ, భాగవత సుధలు వీరి పరిశోధనాత్మక గ్రంథాలు.అంతే కాకుండా కులశేఖర్ రావు  గారితో కలిసి కావ్యానుశీలనం వట్టికోట ఆళ్వారుస్వామి స్వామి , సి నారాయణ రెడ్డి గార్లతో కలిసి చిరు గజ్జెలు రచనలను పాఠకులముందుకు తీసుకొచ్చారు. అంతేకాకుండా పారిజాతాపహరణం ,ఉత్తర హరివంశం,తెలుగు సామెతలు, ఆంధ్ర క్రియాద్వీపమణి దీపిక మొదలగు పుస్తకాలకు సంపాద కత్వం వహిస్తూ వాటికి విలువైన పీఠికలు రాసారు. తెలంగాణా గ్రామీణ  నుడికారాన్ని మాండలికాన్ని ఒడిసిపట్టి భాషామాధుర్యాన్ని పాఠకులకు రుచి చూపించారు. అదే క్రమంలో ఆకాశవాణిలో తెలంగాణా మాండలికంలో ప్రసంగం చేసిన తొలిరచయిత కూడా ఈమెనే. కథల్లో మండలికం కొట్ట వచ్చినట్లు కనపడుతున్నప్పటికీ వాటిలో వైవిధ్యం ఉంది
నాగి కథా పస్తువు::  హైదరాబాద్ లో రామిరెడ్డికి చదువు ముగిసింది. చదువుతోపాటు కిక్కిరిసి పోయిన పట్నం  యాంత్రిక జీవితంతో విసిగిపోయి గ్రామానికి చేరుకున్నడు.  గ్రామంలో పచ్చదనపు పర్యావరణం ఆ పల్లె జీవితం ఆయనకు ఎంతో తృప్తినిచ్చింది. ఒకరోజు ఊరబాయికి పోయి ఈతకొట్టి
వంక దరిపట్టుకొని చూస్తే ఆయన పొడి దోతి కనబడలేదు. చుట్టూత కలియచూస్తె ఒక ఆడపిల్ల దాన్ని
కట్టుకొని కిలకిలా నవ్వుతూ కనపడుతుంది. రామిరెడ్డి కోపంతో ఆ పిల్లను చెంపపెట్టు పెట్టడంతో ఆమె ఆ దోతిని విప్పి  పాత పేలికను కట్టుకొని వెళ్ళిపోతుంది. అట్లా వెళ్ళిపోయిన అమ్మాయి పేరు నాగి. ఆమె ఆ ఊరి గొల్ల సాయి మల్లిల బిడ్డ. ఏదో విషపురుగు కాటుతో సాయి చనిపోతాడు. గంపెడు పిల్లల సంసారాన్ని ఈదడం మల్లికి పెద్ద పరీక్షే ఐంది. జెట్టమీద రోకటి పోటులా కులకట్టుబాటుల కారణంగా పదేండ్ల బిడ్డకు పెళ్ళి చేయాల్సిన పరిస్తితిలో ఉన్న నాలుగు గొర్రెలను అమ్మి పెళ్ళి చేసింది. దాంతో ఆమెకు బతుకుదెరువు కష్టమైంది. కూలికి ధాన్యం దంచపోతే చుట్టూత చేరిన ఆమె పిల్లలు చాలా ధాన్యాన్ని ఎవరి కంటబడకుండా బుక్కేవాళ్ళు. దాంతో ఆసాములెవ్వరూ ఆమెను కూలికి పిలువడం మానుకున్నారు. దాంతో పిల్లలకు అన్నమో రామచంద్రా అనే పరిస్తితి వచ్చింది. ఆ పిల్లలలో ఒకతైన నాగమ్మ అలియాస్ నాగి రకరకాల దొంగతనాలతో పాటు దౌర్జన్యంగాను కడుపు నింపుకోవడం మొదలు పెట్టింది. అందువల్ల నాగిని  గత్తరను  మర్నాగిని చూసినట్లు భయపడేవారు. పైగా ఆమెకు మర్నాగి అనే నామకరణం చేసిన్రు. దోతి సంఘటన జరిగిన మరునాడే నాగి రామిరెడ్డి ఇంటి మొక్కజొన్న పెరట్ల పడి కంకులు ఇర్సుకొని తినుకుంట వాళ్ళ గుమస్తా చేతకి దొరికింది. ఆగుమస్తా నడీపుల గుద్దుకుంట రాంరెడ్డి దగ్గరికి ఈడ్చుకురావడంతో తనకు కడుపునిండా తిండి దొరకనందువల్లే దొంగతనం చేయవలసి వస్తుందన్న విషయాన్ని విడమరిచి చెప్తుంది నాగి.
రాంరెడ్డి “కూలిజేస్క బతుకరాదె” అన్న సలహా ఇవ్వగానే ” దొరో. పొట్టల ఎలుకలు పొర్లుతుంటె  కూలి ఎట్ల చేస్త. ….” అంటూ తన పరిస్థితిని పూర్తిగ విప్పి చెప్తది .ఆమె పరిస్థితిని మొత్తం అర్థం చేసుకున్న రాంరెడ్డి ఎందరు వద్దని సలహా ఇచ్చినా  నాగి అడిగినట్లు  మొదలు కట్టుకోను బట్ట ఇచ్చి, కడుపు నిండ తిండి పెట్టి తన దగ్గర పనికి కుదుర్చు కుంటడు. నాగికి ఇక దొంగతనంతో పని లేకుండ పోయింది. మనిషి ఆరోగ్యవంతంగా తయారైంది. పనిలో నాగికి పోటీకి ఎవరూ రానంతగా చేసుకుంటూ పోయింది. ఒకప్పుడు నాగిని అసహ్యించుకున్న జనం ఆమెను లోబరచుకోవడంలో విఫలురయ్యారు. మేతకు తగ్గట్టే కాదు అంచనాకు మించి చేతికొచ్చింది. ధాన్యం బండ్లు ఇంటికి వస్తున్న రోజు జోడెద్దులకు గానుగ పిండి పెడ్తున్న నాగికి కరణం పంతులు నడుచుకునే తీరు మీద అనుమానమొచ్చింది. ఏవో గుసగుసలు వినబడటంతో పరిశీలనగా చూసి కలం దగ్గరి నుండి వస్తున్న బండిని మూలమలుపున తప్పియ్య చూస్తున్న రంగయ్యను ….ఒకప్పుడు ” కడ్పుకు లేక రెండు కంకులు తిన్నందుకు నాగి రెండు కంకులేంది?
రెండు ఊళ్ళు మింగుతదని తప్పెట గొడ్తివి…..ఇప్పుడేమొ ఉప్పుదిన్న గురుత్వంగూడ లేక దొరకండ్లు గప్పి  దొరసొమ్మును ఆ పాపిష్టి కరణపోడి ఇంటికి చేరుస్తవా?  ఈణ్ణుంచి ఎట్లగదుల్తవో చూస్త ” అని సెర్లకోన పట్టి నిలదీసింది. గింజల విషయం ఏమైనా నాగిలో తను  మార్పును తీసుక రాగలిగినందుకు చాలా తృప్తి పడ్డడు. ఇది కథ.
విమర్శ: నాగి తండ్రి సాయికి గొర్లు మేపుకోవడం మినహా వేరే పనులు తెలియదు. సాయి చనిపోవడంతో
నాగి తల్లి మల్లి ఒక బిడ్డ పెండ్లికి ఉన్న గొర్రెలను అమ్మింది. తినే  పిల్లలు  చాలామంది. కూలీ చేయగలి గింది ఒక్కతే. అందువల్ల పిల్లలకు ఆకలి తీరేది కాదు. పిల్లలంతా తల్లి పటేలు పట్వారీ ఇండ్లల్లకు కూలీ కి  పోతున్నపుడు ఆమె వెంటపోయేవాళ్ళు. వాళ్ళు అంతటితో ఆగకుండా ఆమె దంచుతున్న ” అవి వడ్లైనా సరె. అర్కెలైనా సరే.అద్దశేరు గింజలు నోట్లె గుమ్మరిచ్చుకోని పరపర బర్పటిచ్చి మింగెటోళ్ళు. ఇంగ న్యాల శనక్కాయ (వేరు శనగ/ బుడ్డలు/ పల్లీలు) ఏరవోయిందంటే నాగమ్మ ఆరగింపు చేస్తదని…
కండ్లుండగనే కంట్లె పాపను తీసెటంతటి  బంటు దొంగ నాగి ” అని నాగికి పేరు పడ్డది.దాంతో మల్లిని ఎవరూ కూలికి పిలువడం మానుకున్నరు.
రచయిత్రి మల్లి పిల్లలు ధాన్యం దంచే దగ్గర అద్దశేరు గింజలు బర్పటిచ్చేటోళ్ళని చెప్పడంలో వాస్తవముండొచ్చు. కాని అద్దశేరు ఆమె పిల్లలంతా కలిసి తిన్నరు. పిల్లలు వడ్లను అరికెలను కూడా నమిలే వాళ్ళని చెప్పడంలో పొట్టుతో ధాన్యాన్ని ఎట్లా తినగలిగారని పాఠకులకు ఆశ్చర్యం కలుగక పోదు. కడుపు నిండిన వాళ్ళకు ఆకలిగొన్నవాళ్ళ పరిస్థితి  ఎప్పటికీ   అర్థం కాదనేది వాస్తవం.  పిల్లల సంఖ్యే కాదు ఆకలిగొన్న రోజులూ ఎక్కువే వాళ్ళకు. అద్దశేరు ధాన్యాన్ని తినడం  యజమాని పెద్దమొత్తంగా చూస్తాడు. వాస్తవంగా వాళ్ళకు ఆ ధాన్యం ఆకలి తీర్చి ఉండక పోవచ్చు.
రాంరెడ్డి దొడ్లెకు గోడదుంకి రెండు కంకులు  తిన్నందుకు గుమస్తా రంగయ్య అణుగవట్టి తిట్టుకుంట గుద్దుకుంట గొరగొర గుంజుకొచ్చినపుడు రాంరెడ్డికి దొంగతనం చేసిందనే ఉద్దేశంతో ఆ నాగి మీద కోపం వచ్చింది. అసహ్యం కలిగింది. దొంగతనం చేసి బతుకెటోల్లకు  బూమ్మీద బతికే హక్కు లేదని  అనుకొని గుమస్తా రంగయ్యతో గొంతు కలిపి ” ఏం రోగం నీకు. నిండ తిని కోడి కుయ్యక ముందే దొంగ తనానికి మొదలైనావ్? ఆడిపోరివి గదా మొగోణివన్నకాదు. సిగ్గులేదె” అని చెడామడా  తిట్టడంలో క్రితంరోజు   తన దోతి కట్టుకున్నదన్న కోపం కూడా ఉన్నది. రాంరెడ్డి నోటివెంట ఆడిపోరివి అనే మాట వచ్చేంత వరకు నాగికి తను ఆడిదో  మొగోడో  అనే విషయం  తెల్వలేదని రచయిత్రి మాట.అంటే ఆకలి తీర్చుకోవడంలో భాగంగా మొగ పిల్లల జత కట్టింది . ఆమెకు సమస్యల్లా ఆకలి. అదే తీవ్రమైన సమస్య. ఆ సమస్య తీర్చుకోవడంలో భాగంగా గుళ్ళె జొరబడి అయ్యగారు ఆరగింపు చేసి అక్కడిక్కడ పడేసిన బలిముద్దలు తెచ్చుకొని తినడం..రాగిచెట్టకింద భక్తులు కొబ్బరికాయ కొట్టి దక్షిణకని ఏసిన పైసలు ఎత్తుక పోయి బెల్లం కొనుక్కొని తినడం…తాటి చెట్టుకు ఎగబాకి ఈడ్గి ఎల్లప్ప కట్టిన కల్లు
లొట్టిని కతం పట్టిచ్చుడు..సీతవల్క పండ్ల కాలంల గుడ్ల గుడ్ల పండ్లను సాఫ్ పట్టించుట…ఒకటా రెండా  చింత చిగురు..ఓనగాయలు..చింతకాయలు ..సమస్తంతో   తన ఆకలి తీర్చుకునే ప్రయత్నంలో భాగంగా చేసినవే. అంతే కాదు. ఆకలి మంటకు పెరుగు ముంతలు నెత్తిన పెట్టుకొని అమ్ముకుంటూ పొయ్యేవాళ్ళ కండ్లల్ల మట్టికొట్టి ఆ పెరుగు ఎత్తుక పొయి తాగటం కూడా అందులో భాగమే.
నాగి కత దొంగతనాలు వింటుంటే ఆమె చెయ్యి తిరిగిన దొంగ అని ఊళ్ళో జనానికి చాలా నష్టం చేసిందనే అభిప్రాయం కలుగక మానదు. కాని అట్లాంటి పనులు ప్రతి రోజు చేసేది అంటే లేదనే చెప్పాలె. ఏది దొరుకన్నాడే పెరుగుదుత్తలమీద పడేదని రచయిత్రే చెప్తున్నది. ఈ ఆకలి తీర్చుకోవడమే పెద్ద సమస్య ఐన నాగికి రాంరెడ్డి ” ఆడిపోరివి సిగ్గులేదే” అనేంత వరకు నాగికి ఆ విషయం మీద సోయే లేదు.  అంటే ఆమె ఆకలి స్థితి చెప్పకనే తెలుస్తున్నది.
“నిండదిని కోడి కుయ్యకముందే దొంగతనానికి మొదలైనావ్ ”  అన్న  రాంరెడ్డి మాటకు
” అవద్దం. నేను కడ్పునిండ తిన్ననంట.యాడదిన్న? ఎప్పుడుదిన్న? నాకు బువ్వ యాడుండది? ” అని తనమనసులోనే గుణించుకొని  ” దొర నాకు నిన్న గూడంగ ముంజకాయలు దొర్కలేదు. ఉపాసం పండుకుంటె కడుపుల ఒకటే గోకుడు మంట. అందుకే ఇంటెన్క గోడ దుంకి మక్కజొన్న సేన్లవడి రెండు కంకులు నవిల్న .” అన్న ది నాగి . నిజమే రామిరెడ్డి బావిలో ఈత కొడ్తున్నపుడు అక్కడికి తాటి ముంజలు తెంపుకోవడానికి వచ్చిన నాగి తన ఒంటిమీదున్న పాతపేలికను ఇడిసి ఆయన దోతి చుట్టుకున్నది కాని అక్కడే ఉన్న ఖరీదైన చేతిగడియారం ముట్టలేదు. కారణం అవసరానికి మించి నాగి ఏమి ఆశించలేదు. ఐనా రాంరెడ్డి  చెంపదెబ్బ ఆ దోతి లేకుండా చేయడమే కాదు. ముంజకాయలు కాయల ప్రయత్నాన్ని కూడా  ఆపింది. అంటే ఆమె ఆకలికి  పరోక్షంగా రాంరెడ్డి కారణం అనే విషయం నాగి చెప్పకనే చెప్పింది.
రాంరెడ్డి ఆలోచనలు అందరికంటె భిన్నమైనవి.  కృత్రిమమైన పట్నవాసం గిట్టక  పల్లెలో ప్రశాంతంగా జీవించాలని వచ్చినవాడు. పల్లెజనం పట్ల ఆత్మీయత గలవాడు. ఆ జీవన విధానం వైపు  మొగ్గు చూపేవాడు.    హేతుబధ్ధత గలవాడు. అందుకే ఆయన నేరము మరియు శిక్ష (crime and punishment )పుస్తకాన్ని చదువుతున్నాడు. ఈ లక్షణాలు గల రాంరెడ్డికి నాగి ఆకలి మాటలు వినగానే తల తిరిగింది. ఆకలికి దొంగతనం చేయడమెందుకు? కూలీ పని చేస్తే చేతికి పైస పైసలతో ఆకలి తీరుతది కదా? అనే ఆలోచనతో
” నాగీ కూలీ జేస్క బతుకరాదే?” అనే సలహా ఇస్తడు. ఈ సలహా నాగికి చెట్టు ముందా? విత్తనం ముందా ? ” అన్నట్లైంది. ఊళ్ళో నాగి  చేసిన ఆకలి దొంగతనాల వల్ల మర్నాగి పేరు మోసింది.
దొంగకు కూలీ దొరుకదు. కూలీ లేక ఆకలి దొంగతనం దారి చూపుతది.ఆకలి తీరే మార్గముంటే దొంగతనం అవసరముండదు. అదే మాట రాంరడ్డితో
“దొరో పొట్టల ఎలకలు పొర్లుతుంటె కూలీ ఎట్ల జేస్త. మంట సల్లవడెనికె యాదన్న తింటె దొంగనాగినని నాకు పని ఎవ్వరు జూపరు. కూలి నూకలో కుచ్చపు దుడ్లో తేకపోతె మాయవ్వ గంజి పొయ్యదు. బువ్వ గంజి అని ఏడిస్తే  నీకు మారెమ్మవట్ట. నీ కుంపటి పాడుగాను. నీకు గత్తరగట్కపోను.
పో! బిచ్చం ఎత్కపో  అంటది. కూలి ఇయ్యనోళ్ళు బిచ్చెం ఎవ్వరిస్తరు?  ఐనా బిచ్చెం నాకు ఇకారం అనిపిచ్చింది. అందుకే బీరడు నేను కలిసి ఈ పని నేర్సుకున్నం.” అన్న నాగి అన్న మాటలలో ఆమె దొంగతనం చేయక తప్పని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది. బిచ్చానికి పోయి అందరి చీదరింపులు
తిట్లు  తినడంకన్నా దొరికింది తినడమే మేలనుకొంది. ఈ చర్యలో ఆత్మాభిమానం స్పష్టం .
నాగి మాటలతో పల్లెసీమలలో అట్టడుగు వర్గం  ఆర్థిక పరిస్థితిని ఆకలి బాధలను రాంరెడ్డి  అర్థం చేసుకోగలిగాడు. తనే పని ఇవ్వడం వల్ల నాగి ఆకలి తీరడమే కాదు దొంగతనం మార్గం నుండి తప్పించి మంచి దారిలో పెట్టవచ్చు అనే నిర్ణయానికి వచ్చి . ఆమెను తమఇంట్లోనే పనికి కుదుర్చుకుంటాడు.
నాగికి ఆ ఇంట్లో పని దొరికింది. తిండి దొరికింది. దాంతో దొంగతనం చేయాల్సిన అవసరం  ఏ మాత్రం రాలేదు. తిండి దొరకడం వల్ల పుష్టిగా బొద్దుగా తయారైంది. ఆ తిండే రెక్కలు దాచుకోకుండా  సవ్యంగా పని చేయించింది. పంట కూడా అంచనాకు మించి వచ్చింది.
ఈ కథ ద్వారా రచయిత్రి యశోదా రెడ్డి మంచి చెంప పెట్టు వంటి సందేశాలనిచ్చింది.
మనుషులను  మంచి చెడులుగ తీర్చి దిద్దేది  పరిస్థితుల ప్రభావమే కాదు. సమాజం కూడా.
నాగి దొంగగా మారడానికి 1. తండ్రి చనిపోవడం. 2. గంపెడు పిల్లలుండటం. 3. సమాజం దండుగ విధిస్తుందన్న భయంతో తల్లి అనివార్యంగా  ఉన్న గొర్రెలను అమ్మి  పదేండ్ల పిల్లకు పెళ్ళి చేయడం.4.ఈ పరిస్థితిలో  తల్లితో కూలీ దగ్గర పిల్లలు ఆకలి తీర్చుకునే ప్రయత్నం.4. ఆ ప్రయత్నం వాళ్ళపై దొంగ ముద్ర వేయడం.5. ఆ దొంగ ముద్ర కూలీ లేకుండ చేయడం.6. కూలీ దొరక్కపోవడం తప్పని సరిగా ఆకలి తీర్చుకోవడంలో భాగంగా దొంగగా మారడం.
ఇక నాగి దొంగతనం మానింది. ఒళ్ళొంచి పని చేసింది. పుష్టిగా తయారైంది.యజమాని మంచి పంట  తీయడానికి సహకరించింది.
ఈ కథలో సమాజాన్ని కూడా గమనించాలి. రాంరెడ్డి దొర పెరట్లో కంకులు తిన్న నాగిని గుమస్తా రంగయ్య దొరుకబట్టి ” అమ్మా ! నా కండ్లల్లనె కారం గొడ్తావు . ఇయ్యాళ్ళ నీ తోడ్కలు తీస్త. నీ బొక్కలు సున్నం జెయ్య కుంటె సూడు. బద్మాష్ ముండ. లంబడి దయ్యం” అని తిట్టిన రంగయ్య
రాంరెడ్డి ఇంట్ల నాగి పని కుదుర్చుకుంటుంన్న సందర్భంగ
” అమ్మో మొండి ఘటం.దొమ్మరి సాని కుదురుగ కూసోని పని చేస్తాది? ఇదెక్కడ ఇముడ్తది మనింట్ల? తోడ్కెలు తీసి ఎళ్ళ దన్నుండి.” అన్న రంగయ్యనే ధాన్యం
బర్తితో ఒచ్చే బండిని  కరణం ఇంటికి పంపించే ప్రయత్నం చేయడం దాన్నినాగి కనిపెట్టడం.
 ఆలోచించాల్సిన విషయమేంటంటే  ఇక్కడ నాగి దొంగనా? కాదా? నాగి దొంగతనంగా కంకులు తిన్నది నిజమే. కాని ఆ దొంగ తనం ఆకలిని తట్టుకోలేక చేసింది. ఆకలిని తీర్చ గలిగిన పని రాంరెడ్డి ఇవ్వగానే ఆ దొంగతనం
జోలికి పోలేదు. పైగా ఆఇంటి సొత్తును కాపలా కాసింది. కాని తిండి పొట్టకు  లోటులేని కరణం ఇంటికి  తృణమో ఫణమో ఆశించి ధాన్యంతో బర్తీ ఐన బండిని పంపించే ప్రయత్నం చేసిన రంగయ్య…ఆ బండి ధాన్యాన్ని కాజేయాలని చూసిన కరణం అసలు దొంగలు . ఆ విషయాన్ని ఎత్తి చూపుతూ
“గుళ్ళెవుండి గుడారాలు మింగినట్లు  …దొర గుమస్తావు. ఉప్పుదిన్న గురుత్వం లేకుండా ఎంగిలి కూడుకాశపడి దొరసొమ్మును పాపిష్టి కరణపోడింటికి చేరుస్తావ్?” అని చెడామడాతిట్టి ఆ దొంగతనాన్ని ఆపిన నాగి వ్యక్తిత్వాన్ని రచయిత్రి గొప్పగా తీర్చిదిద్దింది.
నిజానికి అసలు దొంగలు కరణం, రంగయ్యలనే  విషయం పాఠకులకు తెలుస్తున్నదే. రచయిత్రి కూడా ఈ సమాజం ఆకలి మంటకు  తట్టుకోలేని చిన్న చిన్న దొంగతనాలను బూతద్దంలో చూపిస్తూ అసలు దొంగలను పట్టించుకోవడంలేదని చెప్పదలచుకొన్నది. యథార్థానికి సమాజంలో జరుగుతున్నది కూడా అదే. బహిరంగంగా కోట్లాది రూపాయిల దొంగలను గాలికి వదిలేస్తూ…చిన్నా చితుక దొంగలను కటకటాల పాలు చేస్తున్నారు. ఆ దొంగలను వదిలేయాలని కాదు.వాళ్ళు దొంగలుగా మారడానికి గల కారణాలను తెలిసికొని వాటిని రూపుమాపే ప్రయత్నం ఏమాత్రమూ చేయడం లేదని .పైగా కొన్ని సార్లు అసలు దొంగల పక్షం వహిస్తూ  ఒకటి రెండు సార్లు జైలుకు పోయిన వారిని ఇబ్బంది పెడుతున్న ఉదాహరణలు కూడా లేకపోలేదు.
ఆకలితీర్చుకోవడానికి దొంగతనం అనివార్యమైన నాగికి ముక్కుసూటితనం ,ఆత్మ గౌరవం  తెగింపులతో పాటు నిజాయితీ పాలు కూడా ఎక్కువే. రాంరెడ్డి పనిలో కుదుర్చుకోగానే
“పనిగిని అటెంక గని ముందు నాకు బువ్వ పెట్టు.  ఈ సింపులు ఇడిస్తే కట్టుకోనికె మారు బట్ట లేదు. నాకో బట్టయియ్యి.” అని అడగడంలో ముక్కుసూటితనం…
“ఇంగో మళ్ళ నన్ను దొంగనాగి గింగనాగి అంటే ఊకోను.ఎర్కేనా?” అనడంలో ఆత్మగౌరవభావం
పట్వారీ నాగి ఆరోగ్యంగా రంగుదేలి నిగనిగ కనపడేవరకు  ఆమెపై దుమ్మెత్తిపోసిన, జనంలో
ఒకడైన పట్వారీ ఆమెతో లైంగిక వాంఛను తీర్చుకోవాలనే ఎత్తుగడతో
” నాగమ్మా! ఓ పారి ఇంటి దిక్కు రారాదె. జర ఆసరైపోదువు. పూటకు రెండు రూపాయలు
రెండు సేర్ల పోటు పెట్టిన బియ్యం కొలుస్త.” అన్న మాటకు
” అయ్య పంతులూ. దొంగనాగి దోసిళ్ళకొద్ది బుక్కుతది గాని దంచుతాది. ఏం మొకం పెట్టుకొని పిలువొచ్చినవయ్యో? అన్న సమాధానంలో ఆ పంతులు వ్యవహారం అర్థం చేసుకున్న చురుకు దనము
” అంత కూడు లేక మాడి సచ్చేదినమే వస్తే మా సిన్నదొర పాదాలకాడ బడి పానాలైన ఇడుస్త గని ఈ జీవి ఉండంగ కడప దాటను. పో పో ఏంముద్దుగ అడ్గొచ్చినవు?  మర్శిగిట్ల మళ్ళ ఆ మాట నాల్కదాటనిచ్చెవ్? ” అన్న మాటలలో తెగింపు నిజాయితీ కొట్టవచ్చినట్లు కనబడుతున్నది.
యశోదా రెడ్డి  ఈ కథలో నాగి కథ ఆధారంగా సమాజపోకడలను చాలా స్పష్టంగా వివరించింది.
తెలంగాణా నుడికారాలకు మాండలికానికి గత సంస్కృతికి సంప్రదాయాలకు చిరునామా యశోదా రెడ్డి రచనలు. కథంతా తెలంగాణా మాండలికంలో లోనే సాగింది. వెల్లొడీ పాలనలో ప్రారంభమైన వలస, భాషాపర రాష్ట్రాలు ఏర్పడడం వలస పాలన ఆధిపత్య ధోరణి వలన  తెలంగాణా ప్రాంతం తన భాషలో యాసలో సంస్కృతీ సంప్రదాయాలలో అస్తిత్వం కోల్పోయి పాలకుల భాషను అసలు సిసలైన భాషగా కొనసాగించక తప్పలేదు. ఈ డెబ్బై ఏండ్ల కాలంలో ఈగ ఇల్లల్లుక్కుంటూ  తన పేరు మరిచిపోయినట్టు తెలంగాణా ప్రజలు తమ భాషను తాము వెతుక్కోవలసిన పరిస్థితి వచ్చింది. అందుకు యశోదా రెడ్డి సాహితీ ప్రస్థానం మనకు చాలా ఉపయోగ పడింది .
తెలంగాణ మాండలికాలు
                వయ్యి.         పుస్తకం
బాగే ఆమ్.   పబ్లిక్ గార్డెన్స్ ( ఉర్దూ)
గుర్గి.            గురిగి /మట్టితో చేసిన కుండ ఆకారంలోని అతి చిన్న పాత్ర
ఇంగులం.    ఇంగులము/ నిప్పు
హవాకోరి.      వాహ్యాళి/ గాలికోసం పచ్చదనంలో కాలి నడక
నాదాని.       అవమానం
గుట్కుమన్నాడు.  ఊపిరి మింగడం/ చనిపోవడం
మిర్గం.          మృగశిర
వష్టిమి.         వష్టిమయ్య/ వైష్ణవ పూజారి
చింతపలపండ్లు.  సీతాఫలాలు
బర్పటము.     దొడ్డు రవ్వగా చేయుట
నేల శనక్కాయ /వేరు శనగ/ బుడ్డలు
దూప              దాహము
మిత్తి.              మృత్యువు/చావు
అలవాటుపొంటి.  అలవాటు ప్రకారము
తోడ్కెలు.         తోడ్కలు/ చర్మము
దుడ్లు.             పైసలు
కుచ్చపు దుడ్లు. నాలుగు పైసలు
మారెమ్మ.          ప్లేగు
మారెమ్మవుట్ట.   ప్లేగు రాను
తుప్పలు.          చింరవందరగా తెగినట్లు ఉండే వెంట్రుకలు
శావ  / చేవ / శక్తి    బలము
దాణబుట్ట.       పశువుల తిండి ఉంచే బుట్ట.
ఆయుదం        ఆముదం
లేకిడితనం.     తక్కువ మోతాదు  కూడా కావాలని  ఆశించడం
ఇటువంటి అనేక తెలంగాణా మాండలికాలను ఎన్నో వాడింది ఈమె. గంగాళంల చాప
చెర్లపడ్డట్టు …పంజరంలో ఇడిసిన చిల్కోలె వంటి ఉపమానాలను వాడింది.మొత్తంగా తెలంగాణా మాండలికం అంటే యశోదారెడ్డి అన్నంతగా ఈమె రచనలలో తెలంగాణా మాండలికం ఒదిగిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఈ తరానికో రోజు

ఇంద్రజీత్ కౌర్ సంధు