మరో వత్సరాన్ని గతంగా
కాలంలోకి పొదిగాక
అస్పష్టమైన ఆలోచనా రేఖ
అంతస్స్పర్శతో ఎదను తట్టిలేపింది
తిరోగమనంతో వెనుకకు పరుగెత్తి
నన్ను నేనుగా చూసుకున్నా
ధర్మానికి కట్టువడి
మానవతా క్షేత్రంలో
మనుషులుగా కాక
మనసులుగా మొలకెత్తి
నాలో పరిమళించిన పరిచయాలు
అల్లుకున్న అక్షర బంధంలో
విప్పారిన హృదయ వైశాల్యంతో
పలు మార్గాలుగా
నా లక్ష్య సాధనను నిర్దేశిస్తున్న
కృపాజ్ఞాన సింధువులు
మంచితనానికి ఛాయగా
నేనుంటూనే ఉంటానంటూ…
గుండెను ఛిద్రం చేస్తూ
అవగాహన లేమిని పులుముకొని
బాకులుగా విసిరిన పరుషవాక్కులు
ఒకవైపు కాగా
పంతాల వలయంలో ఖండితమై
ఒక్కో శకలంగా రాలిపోతున్న
స్నేహ వృక్షపు శాఖలు మరోవైపు
వేటికీ అతీతం కాని మనిషికి
కాలమే ఓ అనుభవపాఠమని
దేనినైనా మోయక తప్పదని
నన్ను నేను ఓదార్చుకుంటూ
పురోగమనంలోకి సాగాను
వర్తమానాన్ని ఆస్వాదించడానికి!!