పుస్తక దినోత్సవ సందర్భంగా….

పుస్తకాల పురుగు అని పేరు తెచ్చుకున మా దయక్క ఒకసారి పుస్తకానితో తనకున్న అనుబంధాన్నిలా చెప్పింది.
పాపం తనకు 7 రోజూల వయసున్నప్పుడే తల్లి స్వర్గస్తురాలవడమేమో ? నాయనమ్మే అక్కయ్య కు సర్వస్వం….మరీ చిన్నగా ఉన్నప్పుడేమో ఏడిస్తే ఏదో మాటో- పాటో చెప్తే ఊరుకునేదట!
క్రమంగా 5 సంవత్సరాలు రాగానే అక్షర శ్రీకారం చేయించి,తానే విద్యాబుద్దులు నేర్పించిన నాయనమ్మ ఏంచేసేదట అంటే….ఆ కాలంలో ఆడుకునేందుకు బొమ్మలూ..గట్రా అందుబాటులో లేక ఎఱ్ఱటి బైండింగ్ ఉన్న పుస్తకమో? లేదా బాలలబొమ్మల రామాయణమో? అక్కయ్య ముందు పెట్టి, ఆమె వంట పనిలోనో- ఇంటి పనిలోనో పడేదట.
అలా అప్పటి నుండి పుస్తకాల స్పర్శ తో మొదలైన ఆమె పఠన ప్రయాణం కంటిచూపు సహకరించినంత వరకూ సాగింది. ఈ దీర్ఘమైన ప్రయాణంలో ఆమె పుట్టింట్లో తండ్రి-పెద్ద తండ్రి రచనలతో పాటు, ఆ ఇంటి గ్రంథాలయం అక్కడినుండి అత్తారింటికి అరణంగా పుస్తకాలనే కోరిన విదుషీమణి మా అక్కయ్య అత్తగారిల్లైన రాయపర్తి గ్రంథాలయం లో ఒక్క పుస్తకమూ వదలకుండా…కొండొకచో ఆ గ్రంథాలయ అధికారి “అమ్మా! ఏంచేయనూ? కొత్త పుస్తకాలు రాలేదు.మరి ఇదివరకు చదివినవే ఇవ్వనా?” అని మర్యాదగా కొన్ని పుస్తకాలను ఇస్తే తిన్న అన్నమే రోజూ రెండు పూటలా తినడం లేదా? సరే! చదివినవే చదువుతానని తీసుకునేదా పుస్తక ప్రియురాలు.
ఇంకొక విషయం చెప్పక పోతే నా ముచ్చట అరాకొరాగానే అనిపిస్తుంది మా అక్కయ్య తెలిసిన వారికి…అక్కయ్య అభిరుచులనర్ధంచేసుకునే మా బావగారు ..మహారాజశ్రీ కీ.శీ.మల్యాల వేంకటేశ్వర రావుగారు…వారి దినచర్యలో ఒక భాగం గ్రంథాలయ దర్శనం( కోవెలకు పోకున్నా ) తప్పక గ్రంథాలయం వెళ్ళి, అక్కయ్య ఇచ్చిన జాబితా లోని పుస్తకాలను తీసుకుని రావడం…ఏ భార్య కైనా కావాల్సిందేముంది? మనసెరిగి నడుచుకున్న మా బావగారిని కూడా పుస్తక దినోత్సవం రోజు తప్పక స్మరించుకోవాల్సిందే!
అలా మూడు గ్రంథాలయాల పుస్తకాలను ఆపోసన పట్టిన మా అక్కయ్య తన90 వ యేట దిగులుతో ఓమాట చెప్పింది.
అక్కయ్యా ! చక్కని సంసారం; సంస్కారవంతులైన ప్రేమ కల పిల్లలుండగా ఇంకా దిగులేమిటే? ఎంతో వేదాంతం బోధించే నీవు దిగులు పడడం బాగాలేదు అన్నాను.
ఐతే నా దిగులు నువ్వు తీరుస్తావా? అన్నది.ప్రయత్నిస్తాను.నా వల్ల ఐతే తీరుస్తానన్నాను…
అప్పటికి అక్కయ్య దిగులు తీర్చడానికి మాటైతే ఇచ్చాను కానీ ….అమ్మో ! అంత కఠినమని ఆ సమయంలో నాకూ తెలియదు!
కలం-కాగితం ఉందా? అన్నది. ఉన్నదని చెప్పాను. తను చదవాలనుకుని- చదవలేకపోయిన పుస్తకాల పేర్లు- వాటిని రచించిన రచయితల, కవుల పేర్లు చెబుతూ పోయింది.
కాస్త ఆపవే 65 దాటిన నేను ఏనాటికి చదువగలను? అన్నాను.
అహ! అలా అనకు కనీసం నువ్వు చదివితే నైనా…నాకు తృప్తి అన్నది…ఇక ఏంచేస్తాను.మాట ఇచ్చాక మడమ తిప్పితే కుదురుతుందా? అదీ నన్నెంతో ప్రేమించి- మనస్పూర్తిగా దీవించే అక్కయ్య కిచ్చిన మాట!
ఇక బాణుని , దండి, ఆకవులకు ముందో పదితరాలు అటూ ఇటూ పది తరాల కవుల రచనల జాబితా…ఎరక్కపోయి మాట ఇచ్చి, మా అక్కయ్య ఇంటినుండి అటే వెళ్ళి ముందూగా ఓ నిఘంటువు కొనుక్కొని ఒకటొకటీ సాధన చేస్తున్నాను.
కాదంబరి ఆమె చదవమన్న పుస్తకం…ఆ భాష చక్కగా చూసే చదవలేను.ఇక బోధ పడడం మరుజన్మలోనే అనుకుని, ఇన్ స్టంట్ యుగంలో కాఫీతో పాటు అనేక అలవాట్లకు బానిసైన నేను ఆ గ్రంథాలు చదవాలంటే వాటి వ్యాఖ్యానాలు చదివితే తప్ప బోధపడవని..ఆ దిశ గా ప్రయాణించాను.
ఆమెను చూడాలని వెళ్ళితే బాగున్నవా అనే పలకరింపుకాకుండా…నేను చదవమన్న పుస్తకం చదివినవా? అని అడిగేది. అదీ మా అక్కయ్య పుస్తక ప్రేమ.
ఈ విషయం చెప్పక పోతే ఈ ప్రత్యేక పుస్తక దినోత్సవమని చెప్పితే బాగుంటుందా? పుస్తక ప్రేమికుల్లారా? మీరే చెప్పండి!
అంకిత భావంతో ఆమెలా చదవాలనీ, చదివిన వన్నీ , మస్తిష్కంలో భద్రపరుచుకోవాలని…
విన్నవిస్తూ…
రాష్ట్రంలోని గ్రంథాలయాల నిర్వాహకులకూ…గ్రంథాలయోద్యం తమ పత్రిక ద్వారా నడిపిన ఒద్దిరాజు సోదరుల సేవాభావానికీ
అభినందన వందనములతో…

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అలసిపోతున్న ఆనందం

విధివంచిత