ఒడిపిళ్ళు- 26 వ భాగం

ధారావాహిక నవల

ఆ రాత్రి గ్రామం మధ్య కూడలిలో డాన్స్  మొదలు కాబోతుంది. దేవుని మంట వెలిగించారు. వారి పూర్వీకుల కోసం ఏర్పాటు చేసిన రాళ్ళ చుట్టూ చేరి, దీపాలు వెలిగించారు. మరణించిన మగవారి కోసం రాళ్ళను నిలువుగా , ఆడవారి కోసం చదునుగా ఏర్పరచి, వాటి చుట్టూ చేరారు. ఆ విధంగా వారి పూర్వీకుల సాక్షిగా డాన్స్ మొదలయింది. వారి సంప్రదాయం ప్రకారం ఒక గొలుసు లాగా ఏర్పడి కొనసాగుతోంది. చాలా వసంతాలు వస్తుంటాయి పోతుంటాయి. నృత్యం చేసేవాళ్ళు పాతవారి స్థానంలో కొత్తవారు వేరొకరు వచ్చి చేరుతూ ఉంటారు. కానీ పూర్వీకుల గుర్తుగా ఉంచిన రాళ్ళు స్థిరంగా ఉండి నృత్యాన్ని చూస్తూ ఉంటాయి. జీవించి ఉన్నవారు మరణించిన వారు కలిసి వసంతాన్ని పూజిస్తారు .

కానీ , సోమ్లా ఇల్లు మాత్రం అసంతృప్తితో ఉంది. సాలీ పెద్దగా నిష్టూరంగా తన తండ్రి, అన్నలతో మాట్లాడుతున్నది.

“నేను డాన్స్ కి వెళ్ళను. చూడండి నా బట్టలు ఎలా ఉన్నాయో, ఈ చింపిరి బట్టలతో డాన్స్ కు ఎట్లా వెళ్ళేది . నా గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? మేము ఆకలితో ఎండి పోతున్నాము. మీకేమైనా తేడా తెలుస్తుందా ? మీకు వీటితో సంబంధమే లేదు” అంటూ గట్టిగా అరిచింది.

మాలీ కూడా డాన్స్ కు వెళ్లనని తిరస్కరించింది. అయినా అక్క చెల్లెళ్ళు ఇద్దరూ తమ పాత చీరలు శుభ్రం చేసుకుని కట్టుకున్నారు. పూలమాలలను అల్లుకొని తమ కొప్పులలో పెట్టుకున్నారు.

” తొందరపడకు సాలీ , హేమ్లా నీకు కావలసినన్ని బట్టలూ, తినుబండారాలు అతి త్వరలో అందిస్తాడు. ఇంకెన్నో రోజులు ఆలస్యం చేయడు” అంటూ ఆమెను ఆటపట్టించాడు.

చేయెత్తి అతని పై దూకినంత పనిచేసింది. సాలీ గట్టిగా కేకలు వేస్తూ “నన్ను వేధిస్తూనే ఉండు. అది మాత్రమే నీకు ఆనందం. నాకు కావలసినదేది ఇవ్వలేవు. కానీ ఎప్పుడూ నన్ను పీడించడానికి సిద్ధంగా ఉంటావు. నాన్నా నువ్వే సాక్షం. చూడు ఇవన్నీ భరిస్తూనే వున్నాను” అన్నది.

సోమ్లా రాబోయే ప్రమాదం గ్రహించాడు. దాడి భూక్యా మీది నుండి తన మీదకు తిరగబోతున్నదని తెలుసుకొని, వారిద్దరి మధ్య తీర్పు చెప్తూ “భూక్యా..! మీ చెల్లిని ఒంటరిగా వదిలెయ్. ఆమెను ఏమి అనబోకు. సాలీ! ఏమనుకోకమ్మా! డాన్స్ చేయడానికి వెళ్ళు ” అన్నాడు.

ఆ తర్వాత పిల్లలను ఉద్దేశించి గంభీరంగా “వసంతోత్సవ సమయంలో ఇట్లా పోట్లాడుకోవడం మంచిది కాదు. వెళ్ళండి అందరూ వెళ్లి వేడుకలో పాల్గొనండి” అన్నాడు.

అక్కాచెల్లెళ్ళం ఇద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఎగురుతూ డాన్స్ చేయడానికి వెళ్ళిపోయారు.

భూక్యా నవ్వుతూ “చెల్లి ఏ మాత్రం మారలేదు నాన్నా. ఆమెకు కొత్త బట్టలూ , నగలు లేవని ఎంత కోపంగా ఉందో చూడు. చెల్లి ఎప్పుడూ తన గురించే ఆలోచిస్తుంది. మనం ఉన్న పరిస్థితి అర్థం చేసుకోవడం లేదు” అన్నాడు.

సోమ్లా కొడుకు మాటలు విని “మీ చెల్లి ఒక్కతేనా? ఏది ఒక అమ్మాయి పేరు చెప్పు. కొత్త బట్టలు అంటే ఇష్టం లేని అమ్మాయి పేరు చెప్పు. ఆమెకు మన నుండి కొత్త బట్టలను ఆశించే హక్కు ఉన్నది. మనము తనకు ఇవ్వలేకపోవడం ఆమె తప్పు కాదు కదా! నీకెంత ధైర్యం? మీ అమ్మ ఉంటే నువ్వు ఈ విధంగా మాట్లాడేవాడివా” అన్నాడు.

భూక్యాకు ఆ మాటలు కోపాన్ని తెప్పించాయి, ఒక్కసారిగా ఇంటి పరిస్థితి భయపెట్టింది . తన చేతులను విసురుగా గాలిలో ఊపాడు దానితో చేతికున్న గొలుసులు శబ్దం చేశాయి.

“ఆ రోజు డోంబ్ జాతి వెధవలు ఫిర్యాదు చెయ్యకుండా ఉంటే , నేను కాస్తున్న సారాయి గురించి ఎవరికీ తెలిసేది కాదు. ఇప్పుడు నా చెల్లెళ్ళకు కొత్త బట్టలు తెచ్చి ఇవ్వగలిగి ఉండేవాణ్ణి” అన్నాడు విసురుగా.

తండ్రి కొడుకులు ముగ్గురూ కలిసి ఇంటి ముందు వరండాలో కూర్చుని చుట్ట తాగుతున్నారు. డాన్స్ చేస్తున్నట్టు వాయిద్యాల శబ్దం మోగుతూ ఉన్నది. కానీ ఎవ్వరికీ దానిపై ఆసక్తి లేదు.

టీక్యా ఆవలించి, ఒళ్ళు విరుచుకొని ” అందరూ సాలీ, మాలీల గురించి బాధ పడుతున్నారు. గానీ నా గురించి ఎవరూ ఆలోచించడం లేదు. నాకు కొత్త బట్టలు ఏవి నాన్నా ” అన్నాడు .

సోమ్లా అతని వీపు నిమురుతూ “సరే కొడకా, నేను గుర్తుంచుకుంటాను. వచ్చే సంవత్సరం తప్పకుండా నీకు కొత్తబట్టలు వస్తాయి” అన్నాడు.

భూక్యా నవ్వుతూ ” నీ పాత బట్టలు వేసుకో టీక్యా! ఎవరైనా అడిగితే అవి కొత్తవే, అని చెప్పు. నిజంగానే అవి కొత్తవి అయిపోతాయి” అన్నాడు.

తండ్రి టీక్యా వీపుమీద చేతితో నెమ్మదిగా ప్రేమగా తడుతున్నాడు. అది ఒక శక్తివంతమైన స్పర్శ. అటువంటి స్పర్శ తండ్రి చేతినుండి, తల్లి ఒడి నుండి మాత్రమే లభిస్తుంది. ఎంత ఎండిపోయి ఎముకల గూడులా ఉన్నవారికైనా, తమ కష్టాలను మరిపించి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ స్పర్శా సుఖం భౌతికంగా ఎలా ఉంటుందంటే? ఒక విత్తనం మొలకెత్తి చిగిరించి పుష్పించి పండులా మారాలనే కోరికను కలిగిస్తుంది. ఎండిపోయిన సెలయేళ్ళను సైతం ఒక్కసారిగా ఉప్పొంగేలా చేసే స్పర్శ అది. అమర గాయకుని స్వర సమ్మేళనం వంటిది ఆ స్పర్శ.

ఆ ముగ్గురు కొంత సమయం వరకు నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర్చున్నారు. భూక్యా తన చుట్టను గట్టిగా పీలుస్తున్నాడు.

ఉన్నట్టుండి టీక్యా నిద్రలో మాట్లాడుతున్నట్టు “నాన్నా ! నేను డాన్స్ చేయడానికి వెళ్తున్నాను” అన్నాడు.

“వెళ్ళు బిడ్డా. కానీ మరీ ఆలస్యం అయ్యే వరకు ఉండకు” అన్నాడు తండ్రి .

టీక్యా వెళ్ళిపోయాడు.

కొద్ది సమయం తరువాత భూక్య తన తండ్రిని పిలిచాడు. కానీ సోమ్లా అన్యమనస్కంగా ఉన్నాడు.

భూక్యా మళ్ళీ “ఏమి చేయబోతున్నావు నాన్నా. ఏమి నిర్ణయించావు నాన్నా ” అన్నాడు.

“దేని గురించి” అన్నాడు తండ్రి.

” నేను నా పెళ్లి గురించి అడుగుతున్నాను” అన్నాడు భూక్యా.

అప్పుడు తండ్రి స్పృహలోకి వచ్చాడు. కాలుతున్న తన చుట్టను ఆరికాలికి రుద్ది ఆర్పేసి.

“నేనేం చేయగలను చెప్పు. నువ్వెందుకు మరో ఆలోచన చేయవు” అని అడిగాడు.

తండ్రి చెప్పిన ఆలోచన మాండ్యాకు అర్థమైంది. సమస్యంతా డబ్బుకు సంబంధించి ఉంది. ఇప్పుడు తన తండ్రి ఏమి చేయలేడు.

ఏ తండ్రి కన్యాశుల్కం లేకుండా తన బిడ్డను కన్యాదానం చెయ్యడు. పెళ్లి కూతురు కోసం డబ్బులు తేవడం ఎలా? రెండవసారి షాహుకార్ వద్ద తన శరీరాన్ని తనకా పెట్టడం కుదరదు. ఆలోచిస్తూన్నాడు కొడుకు.

“వాల్యా తన బిడ్డకోసం ఎంత డిమాండ్ చేస్తాడో తెలీదు. మొత్తం మనకు ఉన్నదంతా రెండు ప్లాట్ల నేల మాత్రమే. ఒకవేళ దానిని అమ్మినా లేదా కుదువ పెట్టినా, ఇంక మిగిలేది ఏమీ ఉండదు. ఇంటికి వచ్చే కొత్త పెళ్ళికూతురు ఏమి తింటుంది? ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడపిల్లల సంగతేమిటి?” అన్నాడు తండ్రి.

సోమ్లాకూ విసుగ్గా చిరాకుగా వున్నది. భూక్యా తన మొదటి గారాల సంతానం. పాపం ఇంటి బాధ్యతలను అతనే మోయవలసి ఉంది. కానీ ఇంకా చిన్న పిల్లవాడి మనస్తత్వమే. మరీ ముసలి వాని వలె నెమ్మదిగా ఉంటాడు. అది యువకుడికి ఉండవలసిన లక్షణం కాదు. యువకులు ఉప్పెనలా ఆవేశంగా ఉండాలి. తల ఎగరేస్తూ దట్టమైన అడవిలో దారులు వేయగలగాలి. తమంతట తామే ఆలోచనలను అద్భుతంగా చేయాలి. తను ఆ వయసులో ఉండగా ఎంత ధైర్యంగా ఉండేవాడు. ఇప్పుడు భూక్యా ఆ విధంగా లేడు. తన కొడుకు బయటకు వెళ్లి తనంతట తాను ఒక అమ్మాయిని బలవంతంగా ఇంటికి లాక్కొని రావచ్చు. తర్వాత నియమాలను అనుసరించి పెళ్లిగా అదే గుర్తిస్తారు గుంపంతా. వధువు బంధువులు అందరూ వచ్చి భూక్యా మీద దాడి చేస్తారు. కొన్ని దెబ్బలు కూడా కొడతారు. కానీ సంప్రదాయం ప్రకారం డబ్బులు చెల్లించిన తర్వాత అంతా సద్దుమణిగి పోతుంది. అటువంటి వివాహాలు గిరిజన సంప్రదాయంలో అతి సాధారణం.

అవును భూక్యా అలా చేయవలసి ఉంది. అందరి యువకుల లాగా భూక్యా తనంతట తాను ఒక పాక వేసుకోవాలి. ఆ కొడుకు ఇదంతా తండ్రి వివరించాలని ఆశిస్తున్నాడా? అనిపించినప్పుడు అతని గందరగోళానికి విచారమనిపించినా , కొడుకు మంచి స్వభావానికి తండ్రి ఆనందించాడు.

అందుకని కొడుకుని ప్రోత్సహిస్తూ “చూడు బిడ్డా ! ఇది చైత్ర మాసం .ఈ ఋతువులో యువకులంతా తమ ప్రియురాళ్లను ఆశిస్తారు. ఏమి చేయాలని అని నన్ను అడగకు. కానీ, ఏదో ఒకటి చెయ్యి. ఒక వధువును తీసుకొని ఇంటికి వస్తే, ఆనందించడం తప్ప ఏమీ చేయలేను. నాకు తెలుసు నువ్వు అట్లా చేస్తే మీ అమ్మ ఆత్మ కూడా సంతోషిస్తుంది. కనుక తప్పకుండా నువ్వు చేసే దానిని మేము అంగీకరిస్తాం” అన్నాడు.

ఆ విధంగా తండ్రి ఇచ్చిన సూచన హృదయపూర్వకంగా స్వీకరించాడు భూక్యా. “నాన్న నేను డాన్స్ చేయడానికి వెళుతున్నాను. నా దగ్గరున్న మంచి పొగాకు ఆ తుండు గుడ్డలో కట్టాను. నువ్వు తీసుకో ” అంటూ విసురుగా వెళ్ళి పోయాడు.

కొడుకు చెప్పినట్టు పొగాకు తీసుకోడానికి చెయ్యి చాపాడు సోమ్లా.

ఆ నిస్సహాయ వృద్ధుడొక్కడే ఇంటి వద్ద మిగిలాడు. ఒక్కసారిగా గాలి తరంగం అతని ముఖాన్ని తాకి ఊరట నిచ్చింది. డాన్సులకు సంబంధించిన శబ్దాలు అతని మనసును ఆలోచనలను బయటికి లాగినట్టు అనిపించింది. అతడు కష్టాలకు సంబంధించిన ఆలోచనల నుండి బయటకు వస్తూ ఇంటి ముందున్న చెట్ల గుంపును చూశాడు. ఆ చెట్ల మీద నిండిపోయిన మిణుగురు పురుగులు మెరుస్తూ ఉన్నాయి. అవి వెలుగుతూ ఆరిపోతూ ఉంటే.. ఆ వేలకొద్ది పురుగుల వెలుగునీడల ఆటలు, అతని మనసును దిగులును నింపాయి.

వసంతానికి సంబంధించిన నృత్యాల శబ్దాల మత్తు అతని రక్తంలో ఒక్కసారిగా ఉప్పొంగినట్టు అనిపించింది. కానీ వెంటనే తిమ్మిరెక్కి, భారంగా మారిన అతని శరీరాన్ని, అవయవాలను సర్దుకుని నెమ్మదిగా లేచి, చేతి కర్రను పట్టుకొని డాన్సులు జరుగుతున్న చోటుకి బయలుదేరాడు.

అప్పటికే డాన్స్ మొదలైంది పెళ్లయిన స్త్రీ పురుషులు, యువకులైనా, పెద్ద వారైనా ఆ డాన్స్ లో భాగస్వాములు కాలేరు. వాళ్ళు కేవలం ప్రేక్షకులుగా మాత్రమే కూర్చొని చూడాలి. పెళ్లి కాని అమ్మాయిలందరూ గుండ్రంగా ముడి వేయని పూలదండ లాగా సగం వికసించిన పూలమొగ్గల వలె ఒకరి చేతులు ఒకరు వీపుల వెనకనుండి పట్టుకొని, యువకులను కేంద్రంగా చేసుకొని గుండ్రంగా తిరుగుతూ డాన్స్ చేస్తున్నారు. దాదాపు డ్వాన్స్ అదుపు తప్పి, ఆవేశంగా మారింది. పండుగ సందర్భంగా వేసిన పెద్ద మంట కోసం ఏర్పాటుచేసిన ప్రదేశంలో విస్తారంగా మద్యాన్ని పాత్రల్లో నింపి వుంచారు. ఆడపిల్లలందరూ గుండ్రంగా తిరుగుతూ తళతళ మెరుస్తూ లయబద్ధంగా నాట్యం చేస్తూ ఉంటే, వారికి తెలియకుండానే వారి శరీరం నడుము భుజాలు వక్షస్థలం లయబద్ధంగా కదులుతున్నాయి.

ప్రేక్షకులలో తాగుతున్న వారు ఎక్కువమంది చేరారు. ముసలి వాళ్లు యువకులు నియంత్రణ కోల్పోయి నిబంధనలు మరిచిపోయి తాగిన మైకంలో డాన్స్ చేస్తున్నారు.

యువకుల్లో హేమ్లా కేంద్ర బిందువు అయ్యాడు. తన డుంగుడుంగా వాయిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నాడు. సాలీ గుండ్రంగా తిరుగుతున్న ప్రతిసారి అతని కళ్ళల్లోకి చూస్తున్నది. కొన్నిసార్లు వారి చూపులు కలిసి కళ్ళతో నవ్వుకున్నారు. కొన్నిసార్లు అతడు వేరే అమ్మాయిలను చూస్తూ నవ్వడం చూసిన ఆమె కళ్ళు ఎరుపెక్కాయి. ఆమె చెవుల్లో హోరు మొదలైంది. కళ్ళు మసకలు కమ్మాయి. డాన్స్ లో లయ మారింది ఆమె అది గమనించక తోటి బృందాన్ని అనుసరించ లేకపోయింది. అందరికంటే భిన్నంగా తనకు తాను ఏవో అడుగులు వేస్తున్నట్టు నాట్యం చేస్తున్నది. ఆమె నృత్యంలో ఆత్రుత కనపడింది. వెంటనే చుట్టూ చూసింది.

తాను లయ తప్పినట్టు గుర్తించిన ఆమె నెమ్మదిగా గుంపు నుండి వెనకకు జరిగింది. హేమ్లా నుండి ఒక మాట వినాలని ఆమె ఆశించింది. తమ జీవితాన్ని గురించి పెళ్లి గురించి అతడి నోట సమాధానం కోరుకున్నది. కానీ ఆ సంగీతం మోతలు, అరుపులు , చప్పట్లతో అది సాధ్యపడలేదు. పరిష్కరించ లేని ఆలోచనలతో ఘనీభవించిన మనసుతో గుండ్రంగా ఆ బృందంలో తలసాచి ఈదుతూ తిరుగుతూనే ఉంది.

భూక్యా అక్కడే ఉన్నాడు అతని డుంగుడుంగాతో… వేరే యువకుల సాంగత్యం అతనికి ధైర్యాన్నిచ్చింది. అతని ధ్యాసంతా ప్రత్యేకంగా కమ్లీ పైనే ఉంది. అతడు తన వాయిద్యాన్ని శృతి చేస్తూ, సాహసంగా ముందుకు సాగాడు. డుంగుడుంగా పెద్దగా మోగిస్తూ నవ్వుతున్నాడు. ఆమె కూడా అతని వైపు ఓర చూపులు చూస్తూ నవ్వుతూ, మిగిలిన అమ్మాయిలతో ముందుకు కదిలి గుంపులో కలిసి పోయింది. చాలాసార్లు యువకులు కొందరు ఆమె వైపుకు దూసుకు వచ్చారు. హేమ్లా పూలను ఆమెపై విసిరాడు. మిత్లా, రత్లాలు కూడా ఆమెపై పూలను విసిరారు. కానీ ఆమె ఎవ్వరినీ పట్టించుకోకుండా డాన్స్ చేయడంలో మునిగిపోయింది.

కాక్లా కూడా పండుగను ఆనందిస్తూ నృత్యం చేయడం మొదలు పెట్టాడు. వికారంగా ఒక అరటి చెట్టు పెద్ద గాలికి అటు ఇటు ఊగినట్టు ఉన్నది అతని డాన్స్ . వదులు వదులుగా ఉన్న దుస్తులతో అలంకరించుకున్న అతని వస్త్రాలు శవంపై కప్పినట్లున్నాయి. అతని కళ్ళు కేవలం సాలీ కోసం వెతుకుతున్నాయి.

ప్రేక్షకులంతా ఒకరికొకరు సరదా ముచ్చట్లు చెప్పుకొని నవ్వుకుంటున్నారు. ఆ మైదానం అంతా అరుపులతో నవ్వులతో ప్రతిధ్వనిస్తోంది. చాలా అరుదుగా కొన్ని వివాహాలు ఈ సందర్భాల్లోనే నిర్ణయించబడతాయి. యువకులంతా గుంపులుగా విడిపోయి తమకు నచ్చిన అమ్మాయిల కోసం పాటలు పాడుతూ సంబోధిస్తుంటారు. అది సామూహికంగా పాట లాగా కనిపించినా వ్యక్తిగతంగా కొందరికి సమాచారంలా, సంకేతాలు చేరుతూ ఉంటాయి. ప్రత్యేకంగా కొందరిని ఉద్దేశించి కొన్ని వాక్యాలను నొక్కి నొక్కి పాడుతుంటారు. ఆ విధంగా తమ జంట అది అర్థం చేసుకోడానికి వీలవుతుంది. అది ఒక రకమైన సంకేతం ఆ సమాచారాన్ని గట్టి గట్టిగా పాడుతూ సంకేతాలను అందజేస్తారు.

అమ్మాయిలు కూడా దానికనుగుణంగా ప్రతిస్పందిస్తూ సమాధానం ఇస్తారు.

ఓ.. ఓహో.. అంటూ యువతీ యువకులు దగ్గరవుతారు.

నృత్యం కాస్త ఒక అల్లరి లాగా మారిపోతుంది ఆ రాత్రి సుదీర్ఘంగా మారిపోతుంది. అక్కడ అక్కడ కొందరు తాగి కుంటుతూ పడుతూ లేస్తూ నడుస్తూ ఉంటారు. భూక్యా తనను తాను మద్యంతో నింపు కుని, ఒక గుడిసె ముందు వసారాలో పడి గురక పెడుతున్నాడు. సోమ్లా తనలో తాను గొణుక్కుంటూ తాగిన మైకంలో అటు ఇటు సోలుక్కుంటూ మాలీ సాయంతో ఇల్లు చేరాడు.

టిక్యా కొంత మంది యువతులను అనుసరిస్తూ చీకట్లోకి సాగిపోయాడు.

డాన్స్ వల్ల మద్యం వల్ల దుస్తులన్నీ నలిగిపోయాయి అందరివీ. కానీ ఆ రాత్రి మిగిలిన రాత్రుల కంటే భిన్నంగా ఒకరినొకరు క్షమించుకుంటారు. యువతీ యువకులు జంటలుగా వారికి నచ్చిన చోటును వెతుక్కున్నారు. బృందంగా సాగుతున్న నాట్యం పలచబడింది. కానీ సంగీతం మాత్రం ఆగకుండా కొనసాగుతూనే ఉంది. కొందరు ఇంటికి వెళ్లడానికి ఇష్టం లేనివారు ప్రత్యేకంగా తోడు లేనివారు అక్కడే మిగిలిపోయారు.

కమ్లీ, సాలీ, హేమ్లా ఇంకా కొందరు నాట్యం చేస్తూనే ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఇళ్లకు పోయారు. కమ్లీ కాళ్లు అవిశ్రాంతంగా, ముఖంపై నవ్వు తరగకుండా, ఉత్సాహంగా, స్థిరంగా డాన్స్ చేస్తూనే ఉంది. ఆమె మెడ చుట్టూ యువకులు విసిరిన పూలదండలు నిండిపోయాయి. కానీ ఆమె అవేవీ పట్టించుకోలేదు.

ఒక శోక గీతం మొదలై విచార కరంగా గాలిలో తేలి ఆడుతూ స్పష్టమైన అర్ధంతో మనసులను వెంటాడుతూ వినబడుతోంది. కమ్లీ, సాలీ కలల్లో తేలిపోతూ నాట్యం చేస్తున్నారు. ఒక రకమైన ఆవేశంతో ఉన్న ఆ పాటలు ఉద్రేకాన్ని కలిగిస్తున్నాయి. ప్రియురాళ్ళను వదలకుండా ప్రేమను రేకెత్తిస్తూ మత్తు గొలిపే ఆ వెన్నెలరాత్రి చెమేలిపూల పరిమళంలో తడిసి ముద్దయింది.

నాట్యం చేసే అమ్మాయిల పెదవులు అలకతో బిగించబడి రాతి పై చెక్కినట్టు కదలడంలేదం. అర్ధనిమీలిత నేత్రాలతో వారి చూపులు మొనదేరిన కత్తులయ్యాయి. శరీర అవయవాలు ప్రేమ తరంగంతో నిండిపోయాయి. పాముల వాడి నాదస్వరం తప్పించుకోలేక నాట్యం చేస్తున్నారా అన్నట్టున్నారు వారు. పాడుతున్న స్వరం దయతో మనసులను కదిలిస్తోంది. వేదనతో కూడిన అసంతృప్తి ఆ గానం లో ఉంది. ఇదంతా ఒక ముఖ్య సంఘటన జరిగే సమయం వచ్చింది. అంతా నిశ్శబ్దంగా జారిపోతుంది.

“చెప్పు ఓ ప్రియా ఈ రోజే చెప్పు

ఇప్పుడే చెప్పు చెలీ చెప్పు ఔనని చెప్పు

రా రా నన్ను అంగీకరించు

రా నాతో నాట్యం చెయ్ నాతో ఆడుకో ”

అంటూ యువకులు తమను తాము అందమైన తమ ప్రియురాళ్ల పాదాల వద్ద మనస్ఫూర్తిగా అర్పించు కుంటారు. అమ్మాయిలు అది తమ హక్కు అన్నట్టు వారిని అంగీకరిస్తారు. చివరకు ఎర్రబారిన పొగమంచు కరిగిపోతుంది. ఆ తర్వాత ఆకలిగొన్న శరీరాలు ఒకదానితో ఒకటి పెనవేసుకొని శాంతిని పొందుతాయి.

**** ****

వెన్నెల పలుచ పడింది, పండుగ మంట నెమ్మదిగా చల్లారిపోయింది. రాత్రంతా వింత గానం కొనసాగింది. డాన్స్ ఆపే సమయం దగ్గర పడింది. గుంపులన్నీ కదలి వెళ్ళిపోయాయి. సాలీ , కమ్లీ, హేమ్లా మాత్రమే మైదానంలో మిగిలారు. సాలీ చూస్తుండగానే కమ్లీని తన చేతుల లోకి ఎత్తుకొని పరిగెత్తాడు హేమ్లా. ఒక పులి తన వేటను నోటకరుచుకొని ఆత్రంగా పరిగెత్తినట్టుగా ఉన్నదది.

చీకట్లో కొన్ని వాయిద్యాలు ఇంకా మోగుతూనే ఉన్నాయి. ఆ మైదానంలో చివరకు మిగిలింది సాలీ ఒక్కతే ఒంటరిగా తడబడి పోయి, చావులేని ఒక జ్ఞాపకాన్ని మిగిలించుకొని రాతిపై కూలబడింది. వాయిద్యాల మోతలు నెమ్మదిగా తగ్గిపోయాయి. చివరికి మిణుగురుల కాంతి కూడా ఆగిపోయింది. దట్టమైన చీకటి ఆ చెట్ల కింద వ్యాపించింది. ఆకాశంలో ఒక మూలన ప్రకాశవంతమైన నక్షత్రం వెలిగింది అదే (వీనస్ )శుక్రగ్రహం. పెను చీకట్ల నుండి ఒక కాగడా పట్టుకొని ఆశ కోల్పోయిన ఆత్మకు చిరు దీపంతో దారి చూపించినట్లున్నది.

సాలీ ఒక రాతిపై తలవంచుకుని పడిపోయింది. దుఃఖంతో ఆమె కన్నీరు మున్నీరవుతున్నది. ఆమె కంటి నుండి కారుతూన్న కన్నీటి బొట్లు నేలను తడిపేస్తూ ఉన్నాయి.

గుంట నక్కలు గ్రామం వెనుక చెట్ల గుంపుల మధ్య నుండి ఊళలు మొదలుపెట్టాయి. అవి సద్దుమణిగినప్పుడు, మచ్చల పాము చెట్టు తొర్రలో నుండి బుసలు కొడుతూ ఉంది. సాలీ లేచి స్థిరంగా తన ఇంటి వైపు నడిచింది.

అర్ధరాత్రి గడిచిన తరువాత ఒక వింత శబ్దము తేలుతూ వస్తూన్నది. అడవి నుండి. దానిని గాలి మోసుకొస్తూన్నది. అందులో తబ్బిబ్బు అయ్యే ఆనందం కానీ, దుఃఖాన్ని కలిగించే విచారం కానీ లేవు. వింతగా అది కొంత సౌకర్యవంతంగా ఉన్నది.

*** *** *** **** *** ***

Written by Jwalitha

కవి, రచయిత, అనువాదకురాలు, ఫ్యామిలీ కౌన్సిలర్, సామాజిక కార్యకర్త, ప్రచురణకర్త, ప్రకృతి ప్రేమికురాలు, తెలంగాణ ఉద్యమ కారిణి అయిన జ్వలిత అసలు పేరు విజయకుమారి దెంచనాల.
‘బహళ’ అంతర్జాతీయ అంతర్జాల త్రైమాసిక మహిళా పత్రికను 2021నుండి నడుపుతున్నారు.
వీరి రచనలు-
కాలాన్ని జయిస్తూ నేను, సుదీర్ఘ హత్య, అగ్ని లిపి, సంగడి ముంత అనే నాలుగు కవితా సంపుటులు; ఆత్మాన్వేషణ, రూపాంతరం అనే రెండు కథల సంపుటులు; జ్వలితార్ణవాలు అనే సాహిత్య సామాజిక వ్యాసాల పుస్తకం; ఎర్రరంగు బురద, ఆత్మార్ణవం, జగన్నాటకం, ఒడిపిళ్ళు అనే నాలుగు నవలలు మొత్తం 11 పుస్తకాలు రచించారు. ముజహర్ నగర్ లో దీపావళి, ‘పరజ’ వంటి అనువాదాలతోపాటు, బహుజన కథయిత్రుల పరిచయం, మెరిసే అనువాదాలు, అనువాద నవలలు పేరుతో శీర్షికలను నిర్వహించారు.
స్వీయ సంపాదకత్వంలో ఖమ్మం కథలు, మల్లెసాల చేతివృత్తికథలు, కొత్తచూపు స్త్రీల కథలు, పరివ్యాప్త, సంఘటిత, రుంజ, కరోనా డైరీ, లేఖావలోకనం, గల్పికా తరువు, ఓరు వంటి పదో సంకలనాలను ప్రచురించారు. గాయాలే గేయాలై, పూలసింగిడి వంటి అనేక పుస్తకాలకు సహసంపాదకత్వం వహించారు.
మర్డర్ ప్రొలాంగేర్, వుండెడ్ లైవ్స్ పేరుతో వీరి కవిత్వం ఆంగ్లానువాద పుస్తకాలు వెలువడ్డాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

డిజిటల్ వేధింపులు

శుభ ముహూర్తం -8వ భాగం