దాదాపు 60పైగా పురస్కారాలు పొందిన ఈమె భద్రాచలం లో వెలిసిన మొల్ల తెలుగు తల్లి మెడ లో మల్లెమాల! ఆధ్యాత్మిక భక్తి మార్గం లో పయనిస్తూ ద్విపదలో బాలకాండ రాస్తున్నారు.84ఏళ్ళవయసులో ఆధ్యాత్మిక తతో పాటు సమాజసేవలో కూడా తన పాత్ర పోషిస్తున్న విదుషీమణి.ఆమెవిద్యార్ధులంతా గొప్ప హోదాలో ఉన్నా భద్రాచలం వచ్చి ఈమెను పలకరించి ఆశీస్సులు అందుకుంటారు.ఆమెకి లభించిన అవార్డులలో కొన్ని మాత్రమే ప్రస్తావిస్తాను.అకాడమీ ఆఫ్ ఇంటర్నేషనల్ గ్లోబల్ పీస్ నుండి గౌరవ డాక్టరేట్ బెంగుళూరు సెంట్రల్ యూనివర్సిటీ నుంచి పొందారు.కె.వి.రమణాచారిగారి తండ్రి గ్నాపకార్ధం ఇచ్చే తిరుమల ట్రస్ట్ పురస్కారం భద్రాచలం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ బెస్ట్ ఉమెన్ అవార్డు ప్రపంచ తెలుగు మహాసభలలో సన్మానం తెలంగాణ అవతరణోత్సవం కిన్నెర ఆర్ట్ థియేటర్స్ కడప గడియారం వేంకట శేష శాస్త్రి పురస్కారం కవయిత్రి మొల్ల స్వర్ణ పతక ప్రదానం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తెలుగు యూనివర్సిటీది కవిసామ్రాట్ విశ్వనాథ ప్రతిభా పురస్కారం యునెస్కో మహిళా సాహిత్య రత్న యునెస్కో లిటరరీ ఉమెన్ ఆఫ్ ది ఇయర్…ఇలా ఎన్నో ఎన్నెన్నో!హరికథలు శతకం నాటకం భక్తి గీతాలు ద్విపదలో.. పుంఖానుపుంఖాలుగా ఆమె రచనలు వెలువడ్డాయి.ప్రస్తుతం బాలకాండ ద్విపదలో రాస్తున్నారు.ఇక ఆమె జీవితం ను గూర్చి ఇలా తన చేదు అనుభవాలు పంచుకున్నారు

మాతల్లి దండ్రులు శ్రీమతి నర్సమాంబ శ్రీ పొడిచేటి వీరరాఘవాచార్యులు గార్లు.మానాన్నగారు ఆగమశాస్త్ర పండితులు భద్రాచలం సీతారామ చంద్ర దేవస్థానం లో ప్రధానార్చకులు గా ఉండేవారు.ఆలయకైంకర్యార్చనకై ఏర్పాటు చేసిన ఐదు శ్రీ వైష్ణవ కుటుంబాల్లో మాది ఒకటి.నైజాంనవాబుల పాలననుంచే తరతరాలుగా మావంశం రాముని సేవలో తరిస్తోంది.మాతాతగారికి దత్తత కుమారుడు మానాన్న.మేము 11మంది సంతానం.7గురు ఆడ 4గురు మగపిల్లల్లో నేను రెండో దాన్ని.సనాతన కుటుంబం కావటంతో నా 8వ ఏట పెళ్లి చేశారు.అప్పుడు నేను 3వక్లాస్ లో ఉన్నాను.14ఏళ్లు రాకుండా పెళ్లి చేయడం నేరం.శారదాచట్టం అమల్లో ఉండటంవల్ల అడవిలో రహస్యంగా పెళ్లి చేశారు.4 ఏళ్ళు అత్తగారింట నరకం అనుభవించాను.నాకు పిల్లలు పుట్టలేదని బావిలో పారేశారు.ఆరోజుల్లో ఇంటిచుట్టూ మోటబావులుండేవి.పాలేర్లు బైటకితీశారు.1958_59లో జరిగిన సంఘటన ఇది.మాతాతగారు నన్ను భద్రాచలం తీసుకుని వెళ్ళారు.ఇంట్లోనే ఉండి హిందీ పరీక్షలు పాసైనాను.8వక్లాస్ తోHGBT ట్రైనింగ్ పొంది ఆంధ్రా మెట్రిక్ ఫస్ట్ క్లాసు లో పాసైనాను.అమ్మకు ఇంటిపనుల్లో సాయంచేస్తూ ఇల్లెందులో SGBT చేశాను.మాకు బేసిక్ ట్రైనింగ్ ఉండేది.రాట్నం వడకటం తోటపనితోసహా అన్నీ నేర్పారు.ఖద్దరు ధరించాలి.1962 చైనా యుద్ధం లోగాయపడిన సైనికుల కోసం కట్లు కట్టడం ఫస్ట్ ఎయిడ్ శిక్షణ ఇచ్చారు కానీ యుద్ధ భూమి కి వెళ్ళే అవసరం రాలేదు.
1964లోభద్రాచలం మల్టీపర్పస్ హైస్కూల్ లో టీచర్ గా పిల్లల అధికారుల మెప్పు పొందాను.మైసూర్ ఓరియంటల్ ప్రోగ్రాం కి ఖమ్మం నుండి నన్ను సెలెక్ట్ చేశారు.NCERTలో చేశాను.నా 7వ ఏటనేగాంధీతాతపై కవిత రాశాను.క్రమంగా నారచనలు అందరి మన్ననలు పొందాయి.1981లో రామదాసు పద్యకావ్యం రాయటానికి ప్రేరణ కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు.వారే నాకు అభినవ మొల్ల అనేబిరుదు ఇచ్చారు.పెళ్ళి జీవితంలో ఓ భాగం అని నాభావన.అందుకే పై చదువులు పిల్లల కి బోధనలో నాజీవితం ప్రశాంతంగా గడిచిపోయింది.ఆంధ్రయూనివర్శిటీ నుంచి ఎం.ఎ.ఫస్ట్ క్లాస్ లో పాసైనాను.ఆడపిల్ల అనే నా కవిత తెలంగాణ ప్రభుత్వం 3వతరగతి తెలుగు వాచకం లో ఉంది.

ఎన్నో సాహిత్యోపన్యాసాలు ఇచ్చాను.ఇస్తున్నాను.అనవసరంగా చిన్న చిన్న కలతలకే ఆత్మహత్య కు పాల్పడేవారికి కౌన్సిలింగ్ ఇస్తాను.మాతమ్ముడి కుటుంబం తో ఉంటున్నాను.1997 లో రిటైరైనాను.నామేనకోడలు కొడుకు రఘుపుంగవను దత్తత తీసుకున్నాను.చినజియ్యర్ స్వామి వద్ద చదివించి కులవృత్తి వేదవిద్యతో పాటు డిగ్రీ పొందటం నాకు సంతోషం కలిగించే విషయం.నారచనలు రామదాసు గోదాకల్యాణంపై ఎం.ఫిల్.చేశారు కొందరు.డాక్టర్ సీతాకల్యాణి నాజీవితచరిత్ర సాహిత్యంపై పుస్తకం ప్రచురించారు.నాజీవితంలో మర్చిపోలేని అనుభవం ఒకటి ఉంది.జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు బతుకమ్మ శతకం వ్రాశారు.రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కలవటం ఆనందం.పైగా ఆయన “అమ్మా! మీరు పెద్దవారు” అని నాకు పాదాభివందనం చేశారు.అదింకా నాకు మనసు లో మెదులుతూనే ఉంటుంది.2010_2020 దాకా ప్రసిద్ధ ఆలయాల్లో తిరుప్పావై ప్రవచనాలు చేశాను.దైవసంకల్పం ఉన్నంతకాలం తెలుగు సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లో సమాజచైతన్యం కోసం నాకలం అలా సాగిపోతూనే ఉంటుంది.

నావిద్యార్ధులు పెద్ద పెద్ద హోదాలో ఉన్నారు.భద్రాచలం వస్తే తప్పక నన్ను కల్సి పోతారు.అధ్యాపకులజీవితంలో అంతకన్నా గొప్ప అదృష్టం ఇంకేం ఉండదు అని నాభావన.
ఇంకా ఒక విషయం మీతో పంచుకోవాలి.రేపల్లెలో యునెస్కో క్లబ్ ఆఫ్ రేపల్లెలోవారి ఆహ్వానం పై నేను వెళ్లి చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు పిల్లల కి సామాజిక అందరికీ ఉపయోగపడే అంశాలపై అవగాహన కల్గించాను.అంతేగాక 1998_99లో ASPగా ఉన్న భావనా సక్సేనా కి రోజూ ఓగంట తెలుగు నేర్పాను.ఆమె రిటైరైన వారి తో ఓకౌన్సిలింగ్ సెంటర్ పెట్టారు.నావంతుగా నిరాశతో కృంగినవారికి కుటుంబ సమస్యలతో బాధపడేవారికి ధైర్యం ఉత్సాహం ఉత్తేజం కల్గించడం నేను చేసిన ఉత్తమ కార్యం.నాకు చాలా సంతృప్తి కల్గించిన అనుభవంకూడా”.
ఈమె అనుభవాలు విన్నాక నర్సమ్మ మేడం ఓరచయిత్రి కవయిత్రి గానే కాక ఆదర్శ మహిళగా గుర్తింపు పొందారు.భగవంతుడు ఆమె కి నిండు నూరేళ్ళు జీవితం ప్రసాదించి మనలాంటి వారికి వెలుగు దివ్వె మార్గదర్శి గా ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని మనసారా ప్రార్ధిస్తున్నాను.