మహిళాలోకమా..

డా. నీలం స్వాతి

.సమాజ చిత్రపటంలో
ఎవరి వాటా ఎంత అని తెలుసుకోవడంలోనే ఉన్న సమయమంతా గడిచిపోతుంది. అయితే
వాదోపవాదాలలో
గతి తప్పుతున్న గమ్యాలను గమనించుకోవాల్సిన అవసరం లేదని అంటారా? ఎందుకు లేదు ఖచ్చితంగా ఉంది.
అధికారమా…. ఆధిపత్యమా….
సామరస్యమా…
సమానత్వమా…. ఎప్పటినుంచో సాగుతున్న నినాదాలు ఇవే.
స్త్రీ వాదాన్ని వినిపించడంలో తప్పేం లేదు. హక్కుల కోసం పోరాడడం తప్పు కానే కాదు.
వాదోపవాదాలతో, వివాదాలతో చర్చలతో, సమావేశాలతో సద్దుమణగని కార్చిచే ఈ ఆధిపత్య సమస్య. స్త్రీ స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం జరుగుతున్న ఈ పోరాటాన్ని నేను తప్పు పట్టను కానీ.
ఈ వివాదాలలో చిక్కుకొని
మహిళలుగా వారు నిర్వర్తించవలసిన బాధ్యతలను వారెందుకు విస్మరించారని నాకు అనిపిస్తుంది. అలా ఎందుకని మీరు అడగొచ్చు. పదండి నేటి వాస్తవాలను పరిశీలిద్దాం…
గతం మాదిరి కాదు, నవతరంలో ఆలోచనలు మెరుగుపడ్డాయనే చెప్పుకోవాలి. ఆడపిల్లలను చదివించడం, వారిని అన్ని విధాలుగా వారి వారి తల్లిదండ్రులు ప్రోత్సహించడం
వల్ల అడుగడుగునా ఆడపిల్లలు అవకాశాలను అందిపుచ్చుకుంటూ అన్ని రంగాలలో తమదైన గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఇది శుభ సూచకమే. ఎవరి మీదా ఆధారపడకుండా ఓ మహిళ తన జీవితాన్ని తీర్చిదిద్దుకునే ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందించి తీరాల్సిందే.
అయితే మునపటి రోజులలో
ఆడపిల్లలపై ఇన్ని అఘాయిత్యాలు, అరాచకాలు
ఎక్కడా మనకి వినిపించేవి కావు. కానీ ఇప్పుడు అలా కాదు పూటకో సంఘటన చొప్పున
జరుగుతూనే ఉన్నాయి. ఇలా సమాజ చిత్రణ ఎందుకు మారింది అంటే కారణాలు అనేకం చెప్పవచ్చు పరిసరాల ప్రభావాలు కానివ్వండి, విచ్చలవిడిగా విస్తరించిన టెక్నాలజీ మహత్యం అనుకోండి. అందరూ చెప్పే మాటలే నేను చెప్పాలనుకోవడం లేదు ఇది “మగ అహంకారమా”…? అని ప్రశ్నించే ముందు మహిళగా మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే “మమకారంలో లోపమా అని”…? పాత రోజులలో ఆడవారు ఇంటిపట్టున ఉండేవాళ్ళు అందువల్ల పిల్లలతో సహచర్యం బాగా ఉండేది. అందుకే వారు ఏ తప్పు చేసినా తల్లి వారిని సరిచేసేది. ఇది తప్పు, ఇది ఒప్పు అంటూ వారికి అర్థమయ్యేలా చెప్పడం వల్ల వారిలో మంచి ప్రవర్తన అలవడడానికి తల్లి సారధ్యం
ఎంతగానో ఉపకరించేది.
అందువల్ల మగ పిల్లలైనా, ఆడపిల్ల అయినా భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణలో పెరిగేవారు. కానీ ఇప్పటి రోజులు అలా ఉన్నాయో చెప్పండి ఇంటిపట్టున తల్లి ఉండే అవకాశం లేదు విద్యావంతులు కనుక ఆమె ఉద్యోగం చేసి తీరాల్సిందే ఉన్న కాస్తంత సమయం కూడా పిల్లలతో గడపడానికి వీలు లేకుండా పిల్లలను హాస్టళ్లకు పంపించడం. దానివల్ల పిల్లలకు మంచి, చెడు పట్ల అవగాహన ఎలా కలుగుతుంది? తల్లి ఆడపిల్లను ఇలా గౌరవించాలి అని తమ కొడుకులకు చిన్నతనం నుంచే చెప్పకపోతే ఆడపిల్లలను అమర్యాద పరచకూడదు, హింసించ కూడదు అన్న జ్ఞానం వాడికి కలుగే అవకాశం ఉందా ? ఒక్కసారి మీరూ ఆలోచించండి. మహిళా దినోత్సవాలను జరుపుకుంటూ
కొత్త కొత్త ఆశయాలను సృష్టించుకోవడం కాదు. వెనుతిరిగి నేటి భవితను
క్రమశిక్షణలో నడిపించే బాధ్యతను ఒక్క తల్లి మాత్రమే తీసుకోగలదు.
తల్లి సాంగత్యంలో, సారధ్యంలో పెరిగే ఏ ఒక్క మగ పిల్ల వాడు కూడా తన చెల్లి తో, తన అక్కతో ఎంత మర్యాదగా ప్రవర్తిస్తారో అదే
సత్ప్రవర్తనతో సమాజంలో మెలుగుతాడని
నా అభిప్రాయం. ఇది ఒక మేలుకొలుపుగా భావించుకోవాలి.

ఈ మహిళా దినోత్సవం సమాజ శ్రేయస్సుకు సహకరిస్తుందని…
సహకరించాలని… ఆశిస్తూ…
ఆకాంక్షిస్తూ…

Written by Dr.Neelam Swathi

చిన్న చెరుకూరు గ్రామం,
నెల్లూరు.
6302811961.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఓ అమ్మకథ

తరుణులందరికీ స్వాగతం-సుస్వాగతం!