మానసిక వికాస మార్గం …కైలాస మానససరోవర సందర్శనం …

ప్రముఖ దేవాలయాలు ఉన్న ప్రదేశాలను మనం సందర్శిస్తున్నప్పుడు అది ఒక ఇష్టం లాగా మారి, ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఒక్కసారైనా చూడాలనిపిస్తుంది కానీ కైలాస మానస సరోవరం ఒక్కసారి చూసి వస్తే మర్చిపోలేని జ్ఞాపకాలతో మళ్ళీ ఒకసారి చూసి వస్తే బాగుండు అనడంలో అతిశయోక్తి లేదు.  కారణం ఆ ప్రాంతం వర్ణింప వీలులేని ఆకర్షణీయమైన ఆధ్యాత్మిక ప్రకృతి దృశ్యం [spiritual Land scape],

శివపార్వతుల నివాస స్థలమనే బలమైన నమ్మకం కానీ అక్కడ ఉండేది ఒక శివ రూపం (లింగం) కాదు ఒక శక్తి స్థాయి (Energy level) అక్కడి నుండి వెలువడే ప్రతిష్టాత్మక మై ప్రకంపనలు …. మానసిక, ఆధ్యాత్మిక శక్తులను సుసంపన్నం చేసి, వెళ్లిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందేశాన్ని ఇస్తుంది.  నిజానికి అది కాగితం మీద పెట్టేది కాదు. కేవలం అనుభూతి పరిణామ స్థితి ( Great transformation )

నేను దర్శించినప్పుడు నాకు అనిపించింది నేను నేర్చుకున్నది మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను.  కానీ దానికంటే ముందుగా కైలాస మానస సరోవర ప్రాంతాల గురించి క్లుప్తంగా…. …..

సముద్ర మట్టానికి సుమారు 22 వేల అడుగుల ఎత్తులో ఉండే కైలాస పర్వతాన్ని హిందువులు, బౌద్ధులు, జైనులు, బాన్ మతస్తులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. విశాలమైన మైదానంలో 32 మైళ్ళ చుట్టూ కొలతతో,  ప్రకాశంవంత మైన వెండి అంచులతో, ఆధ్యాత్మిక ధార్మిక పరిమళంతో గుభాలిస్తూ నలువైపులా నాలుగు రూపాలతో, నాలుగు వర్ణాలతో కనిపిస్తుంది. జైనుల సాహిత్యంలో ఈ పర్వతాన్ని అష్టపది గా పిలుస్తారు. దక్షిణంలో ఉన్న ధ్వజస్తంభం (తర్బోచి) దగ్గర మే నెలలో చతుర్థి, పౌర్ణమి రోజుల్లో బుద్ధుని పుట్టిన రోజుగా భావించి వేల మంది టిబెట్ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక పెద్ద పండగ లాగా జరుపుకుంటారు.  తూర్పున ఉన్న గౌరికుండ్ అనే కొలను ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది.  పురాణాలలో అత్యంత పవిత్రమైనదిగా వర్ణిస్తారు. దానికి దగ్గరగా వెళ్లడానికి ఎవరికి అనుమతి ఉండదు.  టిబెటన్ పురాణాల ప్రకారం గంగానది మొదట కైలాసం నుండి అవతరించి మానస సరోవరం ద్వారా నాలుగు నదులుగా (బ్రహ్మపుత్ర, సింధు, సటలెజ్, కర్నాలి/సరయు) అవతరిస్తాయని  చెపుతారు.

తరువాత అతిముఖ్యమైన మానస సరోవరం…..కైలాస పర్వతం పాదపీఠంలో ఉండి అపురూపంగా,  ముగ్ధ మనోహరమై ప్రపంచ ప్రసిద్ధి గాంచడంతో పాటు అత్యంత పురాతనమైంది గా గుర్తింపు పొందినది.  బ్రహ్మ మనసు నుండి ఈ సరస్సు సృష్టించ బడినదని, దీనిని దేవతల విహార స్థలమని అనేక పురాణాలు చెబుతున్నాయి.  సముద్ర మట్టానికి సుమారు 15 వేల అడుగుల ఎత్తులో 200 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో 300 అడుగుల లోతులో ఉంటుంది. స్వచ్ఛతకు ఈ సరస్సు నిలువుటద్దం.  చుట్టూ కొండలు, బండరాళ్లు,  చిన్న చిన్న గడ్డి జాతి మొక్కలు కనిపిస్తాయి.  అనేక ఔషధ మొక్కలకు నిలయమని స్థానికులు చెపుతారు. హంసలు విహరించేవి అని కూడా అంటారు. చుట్టూ ఎనిమిది బౌద్ధారామలు ఉంటాయంటారు కానీ వాటి వివరణ ఎవరు మనకు ఇవ్వరు. ఆసియా ఖండంలో నాలుగు పొడవైన గొప్ప నదులకు ( బ్రహ్మపుత్ర, సింధు, సట్లెజ్, కర్నాలీ) ఆధారం ఈ మానస సరోవరం అని చెపుతారు. దీనికి పశ్చిమాన రాక్షస్ తాల్  అనే ఉప్పునీటి సరస్సు ఉంటుంది.  రావణుడు శివుని అనుగ్రహం కోసం తపమాచరించిన ప్రాంతంగా ప్రసిద్ధి. దీని చుట్టుకొలత 77 మైళ్ళు.  మానస సరోవరం ఉత్తరం వైపు నుండి చూస్తే కైలాస పర్వతం కనబడుతుంది. మానస సరోవర సరస్సు పవిత్రతను కాపాడడానికి,దాని పరిసరాలు కలుషితమైపోకుండా ఉండడానికి చైనా ప్రభుత్వం కొన్ని కఠినమైన నిర్ణయాలను తీసుకోవడం నిజంగా అభినందనీయం.

ఇక మా ప్రయాణం విషయానికి వస్తే 24 మంది సభ్యులతో ఒక గ్రూపు లాగా లక్నో నుండి బయలుదేరి నేపాల్ గంజ్ చేరుకొని అక్కడి నుండి 9540 అడుగుల ఎత్తులో ఉన్న సిమీకోట్ ప్రాంతానికి వెళ్లి, అక్కడి నుండి 11970 అడుగుల ఎత్తులో ఉన్న హిల్సా (Nepal border Tibet) అనే ప్రదేశానికి వాయుమార్గంలో వెళ్లి దానికి దగ్గరలో ఉన్న కర్నాలీ అనే నదిని దాటి చైనా ఎంబసీ లో  ఇమ్మిగ్రేషన్ పనులు పూర్తి చేసుకుని 12,795 అడుగుల ఎత్తులో ఉన్న పూరంగ్ ( Tar, China) అనే ప్రాంతానికి బస్సులో చేరుకున్నాము.  అసలైన ప్రయాణం అక్కడి నుండే మొదలవుతుంది.

బస్సులో ప్రారంభమైన మా ప్రయాణంలో మొదట రాక్షసతాల్  సరస్సు చూశాక మానస సరోవర పరిక్రమ మొదలవుతుంది. 15 వేల అడుగుల ఎత్తులో మూడు వందల అడుగుల లోతులో ఉండి,  అంతుచిక్కని రహస్యాలతో చెక్కుచెదరకుండా ప్రకృతి ఏర్పరచిన ఆ మంచినీటి సరస్సు చూస్తే అస్సలు ఇంత ఎత్తులో ఎలా ఏర్పడిందని  ఆలోచించటానికి  మనకు ఉన్న శక్తి సరిపోదు.  ప్రశాంతంగా హుందాగా నీలీ ఆకుపచ్చ వర్ణాలతో అత్యద్భుతంగా మెరుస్తూ ఉండి మరపురాని దివ్యానుభూతిని కలగజేస్తుంది.  ఆ నీటిని స్పృశించి కదిలించినప్పుడు వచ్చే గలగల శబ్దం ఒక ప్రత్యేకమైన ఆహ్లాదాన్ని ఇస్తుంది. మనం ఈ సౌందర్యానికి మంత్ర ముగ్ధులమై ఉన్నప్పుడు ఉత్తరాన ఉన్న కైలాస పర్వతం పాపం తనను పట్టించుకోవడం లేదు అనుకుంటుందో ఏమో…. మనం ప్రయాణం చేస్తున్నంతసేపు మనతో పాటు ప్రయాణం చేస్తున్నట్టుగా కనిపిస్తూనే ఉంటుంది.  ఆ అద్భుతాన్ని కెమెరాలో బంధించని వ్యక్తులు ఎవరు ఉండరు.

కాసేపు ఆలోచిస్తే సరస్సు హుందాతనం,  ప్రశాంతత చూస్తే మన నడవడి క ఎలా ఉండాలో సూచిస్తున్నట్టు ఉంటుంది.  ఉప్పునీరు,  మంచినీటి సరస్సులు పక్కపక్కనే ఉండటం చూస్తే మన జీవితంలో కూడా మంచి చెడులు కలిసి ప్రయాణిస్తాయని అనిపిస్తుంది. అక్కడ మన శ్వాసను శాసిస్తున్నా…. మైమరచిపోయి చూసే ప్రకృతి సౌందర్యం వెనక శ్వాస ఆగిపోయే ప్రమాదం ఉన్న పట్టించుకోకుండా మన కిచ్చిన జీవిత కాలానికి సరిపడే ఆనందాన్ని అనుభవిస్తూనే,  మానవ తప్పిదాల ఫలితంగా వచ్చే ప్రకృతి నుండి వచ్చే ప్రకోపాన్ని  చవి చూస్తే జరిగే దారుణాలు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకొని,  ప్రకృతి విలువలను ఎలా కాపాడాలో,  దాని పరిరక్షణకు ముందు తరాల వారికి  మనమేం చేస్తున్నాం,ఏంచేయాలో అన్న ఆలోచనను కలగజేస్తుంది.

అక్కడినుండి ధార్చన్ అనే బేస్ క్యాంప్ చేరుకొని అక్కడి నుండి ఆరు కిలోమీటర్లు ప్రయాణం చేసి యమద్వార్ అనే ప్రదేశానికి చేరుకుంటాము . అక్కడి నుండే కైలాస పర్వతం (దక్షిణాముఖం ) చాలా దగ్గరగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది.  ఎంతోకాలం ప్రతీక్ష తరువాత ఎన్నో అంచనాలతో మొదటిసారి ఆ పర్వతాన్ని కొన్ని నిర్ణీత సమయాల్లో (సంధ్యా సమయం) దగ్గరగా చూసినప్పుడు క్షణకాలం ఏం జరుగుతుందో తెలియదు. మాటల్లో వర్ణించలేని ఒక ఆధ్యాత్మిక విశ్వశక్తి (Cosmic Energy) మనపై ప్రభావం చూపినప్పుడు నిజానికి క్షణకాలం పాటు మనల్ని మనం మర్చిపోయి….మనం అక్కడ ఏ దేవుణ్ణి చూడలేం, ఏ మంత్రం చదవలేం, ఏ పూజ చేయలేము, ఏ కోరిక కోరలేము,  మనతో వచ్చిన వాళ్లు,  మన పక్కన ఉన్న వారి గురించి ఆలోచించలేము, ఏదో తెలియని శక్తి లభించనట్టూ,  క్షణకాలంలో అన్నింటిని పోగొట్టుకుంటున్నట్టు ఉంటుంది .ఏదో చేస్తున్నాను,  చూస్తున్నాను అన్నట్టు సహజంగా జరిగిపోతుంది. ఆ పాజిటివ్ ఎనర్జీని తట్టుకొని నిలబడడానికి నిస్వార్థ సాధన చాలా అవసరం అనిపించింది. ఈ ప్రపంచంలోకి ఒక్కరై వస్తాము ఒక్కరిగానే వెళ్తాము అన్న జీవితసత్యం సూచనలా కనపడుతుంది . అక్కడ నేను నేర్చుకున్నది ఒక్కటే “నేను”అన్న అహం వీడి మానసిక సంసిద్ధతో ధర్మ పరిరక్షణ నే మన కింకర్తవ్యం అనే భావన కలుగా చేసుకోవడమే.

తరువాత చేసే పరిక్రమలో… ప్రయాణంలో ప్రయాస పడుతూనే అక్కడేదో అద్భుతం చూడాలన్న తాపత్రయంతో, పర్వత ఉత్తరం వైపు చూసినా దాని చుట్టూ ఉండే చిన్న చిన్న పర్వతాలు చూసినా ఏదో ఒక దేవుని ప్రతిరూపం కనిపిస్తున్నట్టు గానే ఉంటుంది. నిజంగా అది ఊహాజనితమే అయినా అద్భుతంగానే ఉంటుంది. అదే సమయంలో అక్కడి స్థానికులు ఎంతో క్లిష్ట పరిస్థితులలో వేరే విషయాలు ఏవీ పట్టనట్టు ఉండి, మనతో ప్రయాణిస్తూ,  మన అవసరాలు తీరుస్తూ మనకు మార్గదర్శనం చేస్తూ,  ప్రశాంతంగా,  చిరునవ్వుతో, విసుగు అనేది లేకుండా క్షణకాలం వృధా చేయకుండా,  నిస్వార్ధంగా, శక్తికి మించి సహాయపడి దానితో వచ్చిన సంపాదనతో జీవనోపాధి కొనసాగిస్తారు.  వారి జీవన విధానం చూసినప్పుడు ఆధ్యాత్మిక దృక్పథం, భగవతత్వం తెలిసినవారు  కూడా అక్కడి వారి జీవనశైలిని చూసి మెచ్చుకోవాల్సిందే తప్ప వారి జీవన మార్గంలో మనం ప్రయాణించలేము.  కానీ వారి ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకొని అలౌకిక మార్గాన్ని ఎంచుకొని ముందుకు వెళ్ల కలిగిన వారే అసలైన కైలాస యాత్ర, (పరిక్రమ)  చేసిన వారిగా భావించవచ్చు.

అదే సందర్భంలో  నాకోక  గమ్మత్తైన ఆలోచన వచ్చింది.  సాయం సంధ్య వేళలో శివుడే ఆ విశాలమైన పర్వత ప్రాంతంలో ఉన్న బండరాళ్లపై కూర్చొని సేద తీరుతూ అటువైపు నుండి ప్రయాణిస్తూ  పరిక్రమ చేస్తున్న స్థానికులను (Tàshi deleg అని) పలకరిస్తున్నట్టు…వారు కూడా ఒక సాధారణ వ్యక్తి లాగా చూసి సమాధానం ఇస్తున్నట్టు, వారు ఏం ఆశించకుండా ఒక నమ్మకంతో ముందుకు సాగిపోవాలని అమాయకత్వంతో కనబడు తున్నట్టుగా అనిపించింది. నిజంగా ఎలాంటి హద్దులు లేని అనుసంధానం మనకు భగవంతుడు కీ మధ్య ఉంటే ఎంత బాగుండనిపించింది.

కైలాస పర్వతం అధిరోహణ సాధ్యమా , ఎందుకు ఎవరు చేయలేకపోతున్నారు అని అనుకున్నప్పుడు నిజానికి అది ఒక సాధారణ వ్యక్తి పరిధిలో లేని విషయం.  రోజు రోజుకు ఊహకందని అద్భుతాలు మానవ మేధస్సు ఎన్ని సృష్టిస్తున్న…. ప్రకృతి రహస్యాలు తెలుసు కోవడంలో మాత్రం ప్రయాస పడుతూనే ఉన్నాడు. ఉదాహరణకు ఒక సాధారణ శివాలయంలో అపారమైన జ్ఞాన సంపద ఉంటుందని యజుర్వేదంలో సూచించబడిన రుద్రం మంత్రాల ద్వారా తెలియజేయబడింది.  ఆ  జ్ఞానాన్ని తెలుసు కోవడానికే చాలా సమయం పడుతుందంటారు.  మరి శివుని నివాస స్థలంగా ఏర్పరచ్చుకున్న ప్రపంచ కేంద్రంగా (Center of Universe) ఉన్న కైలాస పర్వతమనే అనంతమైన జ్ఞానాన్ని అధిరోహించడమా? కానే కాదు కళ్ళతో చూసి మనసుతో తెలుసుకోవాల్సిందే,  పకృతే  దైవం, గురువు.  ప్రకృతి చర్యలకు తలవంచిన వాడీకే సృష్టి రహస్యం అర్థమవుతుంది.  ప్రకృతి ధర్మాన్ని అనుసరించి మనుగడ సాగించిన వాడే భగవతత్వాన్ని తెలుసుకుంటాడు. అది తెలుసుకున్నవాడే ఈ కైలాస మానస సరోవ దర్శనం చేసుకొని ధన్యుడవుతాడు. చివరగా ఒక అధ్యాపకురాలిగా నాకు అనిపించింది ఏంటంటే కైలాస మానస సరోవర యాత్ర నేను చేశానని అటెండెన్స్ వేసి రావడం కాదు.  ఆ పరమేశ్వరుడే మనకు అటెండెన్స్ వేయాలేమో అనిపించింది.

Written by Dr. Chilpuri Vani

Dr. Chilpuri Vani
Retd.Botany Lecturer
పుస్తకాభిలాషి , పర్యాటక,ప్రకృతి ఆరాధకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

A walk & a realization

మృదుమధురమైన స్వరం