రమక్కతో ముచ్చట్లు-26

పోతురాజువు నువ్వు బొనమెత్తింది నీ తల్లి

అందరికీ శనార్థులు.

ఆషాడ మాసంల ఏం పండుగలు ఉండయి అంటరు. కానీ తెలంగాణ బోనాల పండుగ జోర్దార్ ఉంటది.

తెలంగాణ భూమి అంటెనే ముందుగాల యాదికొచ్చేది మట్టివాసన.ఈ మట్టి పరిమళంల మెరిసిన సంస్కృతుల జాడనే బోనాల పండుగ. ఇది ఆషాఢ మాసంల హుషారుగ జరుపుకునే సామూహిక జాతర. ఆడబిడ్డలు బతుకు కోరి అన్నదమ్ములు, కుటుంబం సల్లగుండాలని జరుపుకునే బోనం పండుగ ఇది.

ఆషాఢ మాసం అంటే మబ్బుల మాసం. భూమి తడిసే కాలం. రైతు నాగేటి సాలు తీసి దుక్కి దున్నే కాలం. మొదటి వానల జల్లు, పచ్చదనంగ మారే చెట్లు, పూల పరిమళం, ప్రకృతి రాగం… ఇదీ ఈ మాసం.
ఆషాడ మాసం వచ్చిందంటే సాలు తెలంగాణలోని ప్రతి గడప పూదిచ్చుకోని అమ్మోరై కూసుంటది. గ్రామ దేవతకు బోనం తీసుడు అంటే… ఇంట్ల ఒక ఆడబిడ్డకు లగ్గం చేసినంత సంతోషం ఉంటది.
బోనం అంటే బిందెల బెల్లపన్నం, పెరుగు పెట్టి, బోనంను సుత అందంగ పూదిచ్చి అమ్మవారికి సమర్పించడం. ఇది ఒట్టి గుప్పెడు అన్నం కాదు, మట్టిల నుంచి పుట్టిన జీవితానికి కృతజ్ఞత. అమ్మవారు ఈ బోనాన్ని ఆశీర్వదించి, ప్రజలకు ఆరోగ్యాన్ని, వర్షాన్ని, శాంతిని ప్రసాదిస్తారని నమ్మకం.
మహా శక్తి మూర్తులు అయిన మహంకాళమ్మ, యెల్లమ్మ, మల్లమ్మ, పోచమ్మ, ఉప్పలమ్మ ఇట్ల గ్రామదేవతలను పూజించుడే ఈ బోనాల పండుగ ఆచారం!
తమ ఊరును, దేశాన్ని, సల్లగ సూడుమని అమ్మకు పెట్టుకునే సమర్పణమే ఈ బోనం. పంటలు పండాలే, పొలాలు పచ్చగ మెరువాలే, గాదెలు నిండాలే, బతుకు పండాలి సల్లగ చూడమ్మా… మా ఆడబిడ్డల మీద యే సెడుకన్న పడకుండా కాపాడమ్మా అని అమ్మకు మొక్కుకొని తీసేదే బోనం.

అమ్మోరు తల్లి రూపాలైన ఈ గ్రామదేవతలంతా పెద్దపెద్ద గుడిలల్ల కాదు ప్రతి మనిషి గుండెల కొలువుదీరి ఉంటరు. ప్రజల గుండెల్ల, వీధుల్లో, చెట్లకింద స్థానం పొందిన శక్తి రూపాలు వీరు. గ్రామీణ ప్రాంతాలల్ల ఈ అమ్మవారే ఆరోగ్య రక్షకులు, అనర్థాల నివారకులు.
అమ్మకు సంతోషంగా బెల్లపన్నం పెడతరు. సల్లగా చూడు మని సల్వ చేయనీకి పెరుగన్నం, అట్లనే “ఉష్ణం ఉష్ణేన శీతలం” అన్నట్టు అమ్మ ఉగ్రం నుంచి ప్రశాంతంకు రావాలని పచ్చన్నం అంటే పులిహోర అన్నం సుత పెడతరు. దీంతో పాటు కల్లు- సారా కూడా పోస్తరు. సాక బోసుడు అని జెప్పి యాపాకులు నీళ్లు పసుపు కలిపి బోనంల ఎత్తుకొని తీసుకపోయి అమ్మ దగ్గర పోస్తరు. ‘ ఏ రోగాలు యే పీడలు,ఏ మహమ్మారిలు రాకుండా కాపాడమ్మా ‘ అని రక్షణ కోరుడన్నమాట. యాపాకు, పసుపు antibiotics అని మనకు విజ్ఞానం చెబుతుంది కదా!
వర్షాలు పడుడు షురువ్ అయితది క్రిములు,కీటకాలు మురికి నీళ్ల నిల్వలల్ల ఉండే పురుగు పుట్రా కుట్టినా ఏమీ గాకుండ కాపాడే antibiotics ఇవి మల్ల!
వాతావరణ మార్పుల వల్ల వచ్చే రోగాలు, విషపూరితమైన పురుగుల నుంచి కాపాడేదే ఈ యాపాకు, పసుపు. బలం ఇచ్చేది బెల్లం. ఐరన్ అంటరు కదా సైన్స్ల. ఇదే మన పండుగల ఎనుక ఉన్న సైన్సు. మన పండుగలు మనకు ఇచ్చే రోగ నిరోధక శక్తి. ఇదే మన భారతీయ సంస్కృతి యొక్క పండుగల పరమార్థం.

కొన్ని తావులల్ల జంతు బలులు కూడా ఇస్తరు. ఈ ఆచారం ఎట్లచ్చిందో ఏమోగానీ నాకెరికైన కాడికి అమ్మ అంటే కన్నతల్లి, జగన్మాత.. ఈ లోకానికే తల్లి. తల్లి బిడ్డలను ఎప్పుడు బలిగోరదు. పశువులు పక్షులు మేకలు కోళ్లు కూడా ఆమె బిడ్డలే. కనుక బలి గోరదు. గిదో ఆచారం పడిపోయింది. దాని గురించి ఇక్కడ కామెంట్ లేదు!
గ్రామంల ఉన్న ఆడబిడ్డలు అందరూ పట్టు చీరలు కట్టుకొని పసుపు రాసుకొని మైదాకు చేతులకి నిండుగ గాజులు వేసుకొని గలగలమని గజ్జలతో నెత్తి మీద బోనం ఎత్తుకొని నడుస్తుంటే.. సాక్షాత్ ఆ లలితా త్రిపుర సుందరి దేవి సహస్ర రూపాలల్ల మన ఆడిబిడ్డలై ఆ గ్రామంల తిరుగుతున్నట్టు ఉంటది. యే చెడ్డ బుద్ధి ఉన్నోళ్ళైనా వాళ్ళను సూస్తే ఒణికి పోవాలె. అట్లుంటరు అమ్మోరుల లెక్క మన అమ్మలందరు, ఆడి బిడ్డెలందరు.
తెలంగాణ సంస్కృతిల అన్ని ప్రాంతాలను,అన్ని వర్గాలను ఒక్కటి చేస్తూ 400 ఏండ్ల ఘన చరిత్ర కలిగిన ఒక మహోన్నతమైన పండుగ ఏందంటే అదే బోనాల పండుగ. బోనాల పండుగకు పుట్టినిల్లు మన భాగ్యనగరం అదే హైదరాబాదు. పల్లవ రాజుల కాలం నుంచి ఈ బోనాలు ప్రారంభమైనయి అని అంటరు. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ బోనాల పండుగను చేసిండ్రంట ఆయన రాజ్యంల. ఇక మన వరంగల్ కాకతీయ సామ్రాజ్యం, కాకతీయ రాజులు ఈ పండుగను గొప్పగ చేసిండ్రు. గోల్కొండ కాడికెల్లి మొదలుపెట్టి చేసిండ్రంట.
ఆ తర్వాత కులీకుతుబ్ షా లు సుత ఆదరించిన్రట. రజాకర్లు మాత్రం బతుకమ్మ బోనాలు ఆడుతుంటే హింస పెట్టిన్రని సుత ఇన్నం!
1869 ల హైదరాబాదుల ప్లేగు వ్యాధి బాగ ముదిరి జనాలు పిట్టలోలె రాలిపోడు మొదలుపెట్టిండ్రు, ఆ సావులు ఎంత ప్రయత్నం చేసిన, ఎవరికీ ఆపుడు తరం కాలేదు. అప్పుడు సైన్యంల ఉన్న మన తెలంగాణ జవాన్లు ఉజ్జయిని మహంకాళి అమ్మ కాడికి పోయి అక్కడ అమ్మకు మన తెలంగాణకు వచ్చిన కష్టం గట్టెక్కించుమని, గీ సావులను ఆపుమని మొక్కిన్రంట. హైదరాబాద్ ల గుడి కడ్తమని మొక్కిన్రు. ప్లేగు వ్యాధి తగ్గినంక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మ గుడి కట్టిండ్రు, రెండోది 1908 ల మూసీ నది పొంగి ఆ నీరు చార్మినార్ దాంక వచ్చినయ్, హైదరాబాద్ అంతా మునిగిపోయే పరిస్థితి వస్తే అప్పటి రాజు కిషన్ ప్రసాద్ అనేటైన సూచన ప్రకారం మీర్ అలీ ఖాన్ ప్రభువు అక్కడున్న లాల్ దర్వాజా సింహావాహిని అమ్మకు మొక్కి మూసీ నది నీళ్లల్ల పసుపు కుంకుమ గాజులు వేసి, అమ్మకు బోనం తీస్తే మూసి ప్రవాహము ఆగింది అన్నది చరిత్ర చెబుతుంది.
అందుకే తెలంగాణ బోనం ఘన చరిత్ర కలిగిన బోనం. సామూహికంగా అందర్నీ కలిపే ఒక గొప్ప మహోత్సవం ఇది. తల్లులంతా బోనమెత్తితే పోతురాజు తల్లిని కాపాడుతూ ముందు నడుస్తడు. పోతురాజు సంస్కృతి కూడా చాలా గొప్పది. దీని వెనక ఉన్న అర్థము రక్షణ. మగ పిల్లగాడు ఎట్లుండాలి ఆడబిడ్డకు తోడుగా అన్నది అమ్మవారి సోదరుడైన పోతురాజు మనకు తెలియజేస్తడు.
పోతురాజు అలంకరణ జెర భయం పుట్టిచ్చేటట్లే ఉంటది. పోతురాజు కొరడా పట్టుకుని ఝళిపిస్తూ సమూహం ముందు ఉండి నడిపిస్తుంటడు. దీని అర్థం ఏందంటే ఏ చెడు కన్ను ఆడబిడ్డల మీద పడకుండ సోదరుడు, కొడుకు ముందుండి కాపాడుకుంటడు అని అర్థం.
ఇదే కదా భారతీయ సంస్కృతి అంటే! ఇదే కదా మనము భారతదేశమును “అమ్మ” అని కొలిచి ఆడబిడ్డలకు ఇస్తున్న ఇజ్జత్ అంటే! ఇదే కదా మరి తెలంగాణ ఘన సంస్కృతి అంటే!
ఘటంతోనే అమ్మకు స్వాగతం పలుకుతరు. బోనాలు తీసుడైపోయినంక ‘రంగం ఎక్కుడు’ ఒక గొప్ప కార్యము ఉంటది. రంగం ఎక్కిన ఆ మహిళ మీద అమ్మవారు పూని జాతకం చెప్పుతది. ఇదీ సుత శాన బాగుంటది.
మొత్తం మీద తెలంగాణ సంస్కృతికి జీవనాడి బోనం. బోనం అంటేనే భోజనం. అన్నమే బతుకుకు ఆధారం. అమ్మా..సల్లగ చూడమని ఆమె ఇచ్చిన అన్నమును ఆమెకే సమర్పించుకుంటున్నము.
మొత్తం మీద బోనాల పండుగ అంటే
జాతర, జనం, సామూహికంగా ఒకరితో ఒకరు కలిసి స్నేహ సౌబ్రాతృత్వ సంబంధాలు మెరుగుపరుచుకొనుడు. కులమతాలకు అతీతంగా గ్రామము, నగరము, ఊరు, దేశమంత బాగుండాలనే వసుదైక కుటుంబం యొక్క ప్రార్థన ఇది. ఇది కేవలం మతపరమైన పండుగ మాత్రమే కాదు. ఇది సామాజికమైన ఉత్సవం. అందరూ కలిసి తినడం, పాడడం, నాట్యం చేయడం, సామూహిక జీవితం ఎలా ఉండాల్నో చెబుతది.
బోనం తెలంగాణ నారి ఆత్మ విశ్వాసం

బోనం మోసే మహిళ ఒక్క అమ్మవారి మీద భక్తిని మాత్రమే కాక, తన కుటుంబం మీద ప్రేమను, తన సామాజిక బాధ్యతను కూడా ప్రతిబింబిస్తది. ఆమె ఒంటి మీద మంగళ స్నానం, నెత్తిమీద బోనం, దానిమీద వెలిగె దీపం, ఆమె అడుగుల చప్పుడు ఇవన్నీ భక్తిరసం నింపిన తెలంగాణ స్త్రీ శక్తిని ప్రతిబింబిస్తయి.
ఏదేమైనా పండుగంటే వండుకొని తినుడు కాదు, దాని వెనుకున్న పరమార్థం తెలుసుకునుడు. ఆడిబిడ్డకు ఎప్పుడూ.. తోడబుట్టినోడు రక్షగ ఉండాలి అన్నది బోనం పండుగ మనకు తెలియజేస్తది. పోతురాజు దీనికి నిదర్శనం. అందుకే “బోనమెత్తింది నీ తల్లి.. పోతురాజు కదులు ముందుకు ఏ కీడు ఆడబిడ్డెల నీడను సుత తాకకుండ!
బోనం పండుగ గొప్పతనం ను తెలుసుకొని ఆషాడ మాసం అంత.. ప్రతి వారం ఘనంగా జరుపుకుందాం!
ఉంట మరి.
ఎల్లమ్మ తల్లికి జై!
పోతురాజుకు జై!

మీ
రమక్క

Written by Ramadevi Kulkarni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ధీరలారా! ధీరులారా! శిరసాభివందనం

కొంచెం ఆసరాగా నాతో!