గాడాంధకారం… హోరున వీస్తున్న చలిగాలి. అప్పుడే సన్నగా ప్రారంభమైన వర్షం.
గాలి వేగానికి కొట్టుకుంటూన్న కిటికీ రెక్కల్ని మూసివేసింది రేవతి. అరగంటపైనే అయింది కరెంటుపోయి. వేసి ఉన్న లైట్ల స్విచ్ లన్నీ తీసి వేస్తూ బెడ్ రూమ్ లోకి దారి తీసిందామె.
ఊయలలోని బాబు పక్క సరిచేసి మంచంపై వాలిపోయి వెచ్చని రగ్గులో దూరిపోయి ఆనాటి దినచర్యకి…. ఆ పూట చలి బాధకీ గుడ్ బై చెప్పింది.
టక్… టక్…
తలుపు కట్టిన శబ్దం…..
నిద్రమత్తులో పట్టించుకోలేదు రేవతి. ఇంతలో వుయ్యాల్లో బాబు లేచి యేడ్పు ప్రారంభించాడు.
కళ్లు నులుముకుంటూ వెళ్లి దీపం వత్తి పెద్దది చేస్తూ వేసి వున్న బెడ్ లైట్ వేపు చూసింది. ఊహూ! కరెంటు రానేలేదింకా.
బాబుని తన పక్కమీదికి చేర్చుకుని జోకొట్టసాగింది. మళ్లీ తలుపు చప్పుడు.
సందేహం లేదు! ఎవరో ముందు గది తలుపు తడ్తున్నారు. ఈ అర్ధరాత్రి పూట ఎవరై యుంటారు?
“ఏమండీ!” పిలుస్తూ మరీ తలుపు తడుతున్నారు.
“తీయటమా? మానటమా?”
ఏదో సందేహం….
“దయచేసి తలుపు తీస్తారా? మళ్లీ వర్షం తగ్గగానే వెళ్తాను. ఈ చీకట్లో వర్షంలో వెళ్లటం చాలా కష్టంగా ఉంది. తడిసిపోయాను. తట్టుకోలేక పోతున్నాను!”
అభ్యర్థన ఆ కంఠంలో స్పష్టమౌతోంది. సందిగ్ధంలో పడిపోయింది రేవతి.
భర్త కూడా లేడు సమయానికి. వొంటరిగా చీకట్లో ఇలా అర్ధరాత్రి తలుపు తీసి అపరిచితుల్ని ఆహ్వానించటం క్షేమమేనా? ఆడమనిషిలాగే ఉంది. అయితే మాత్రం నమ్మేదెలా? దొంగలూ, నేరస్థులూ ఆడవాళ్లలో మాత్రం లేరూ? ఏమో! యే పుట్టలో ఏ పాముందో, కీడెంచి మేలెంచమన్నారు. అయినా తనకెందుకీ తనకు మాలిన ధర్మం? ఎవరెలా పోతే తనకేం?
నంగనాచిలా వచ్చి మెల్లగా యే కత్తో చూసి బెదిరించి అన్నీ లాక్కుపోతే దిక్కెవరు? పిలిచేది ఆడమనిషే అయినా వెనక యింకెవరైనా వున్నారేమో? ఇలాంటి సంఘటన గురించి ఈ మధ్యే వింది తను! ఊహూ! తలుపు తీయకూడదు, మెళ్లోని గొలుసోమారు సర్దుకుని కళ్లు మూసుకుని పడుకుంది రేవతి.
వర్షం హోరుతోపాటు కల్సిపోయి విన్పిస్తూన్న ఆ గొంతుక విన్పించనంతవరకూ గమనించిన రేవతి తేలిగ్గా నిట్టూరుస్తూ నిశ్చయంగా నిద్రాదేవి నాహ్వానించింది.
* * *
“ఏమ్మా రేవతీ! కులాసా?”
అప్పుడే గుమ్మంలో అడుగుపెట్టిన భారతమ్మను చూస్తూ ఆశ్చర్యానందాల్తో అడుగు ముందుకేసింది రేవతి.
“అమ్మా! వస్తున్నట్టు ఉత్తరమైనా రాయలేదేం? స్టేషన్ కొచ్చేదాన్నిగా! ఒక్కర్తెవీ వచ్చావా? ఏ ఇబ్బందీ పడలేదుగా!” అంటూ ఆప్యాయంగా చేతిలోని బాబుని తల్లి చేతి కందించింది.
‘బాబుకి అమ్మ వెండిగిన్నెచేయించిందట. నాన్న వచ్చినప్పుడు చెప్పారు. తానొచ్చినప్పుడు తెచ్చి బాబుకి అన్న ప్రాసన వేడుక జరిపిస్తోందిట అమ్మ. చక్కని డిజైన్ తో అందంగా వుందిట ఆ గిన్నె. చూడాలని కుతూహలంగా ఉంది. కానీ తీసి చూపించదేం. యెలా అడగడం? అయినా భోజనాలూ అవీ అయ్యాక తీరిగ్గా చూపొచ్చని వుండొచ్చు’ అనుకుని పంట ప్రయత్నంలో పడిపోయిందామె.
“అమ్మా!”
తలెత్తి చూసిన భారతమ్మ యేదో అడగబోయి కూతురు సందేహించటం గమనించింది.
“ఏమ్మా ఆగిపోయావ్?”
చిర్నవ్వుతో అభిమానంగా చూస్తున్న తల్లిని చూస్తుంటే రేవతిలో సంకోచం తొలగిపోయింది.
“బాబుకి వెండిగిన్నె చేయించావటగా అమ్మా! తెచ్చావేమో చూద్దామని!”
“వెండిగిన్నె! తెచ్చానమ్మా.”
“చాలా అందంగా చక్కని లతలూ, పూలూ అవీ చెక్కించి సరికొత్త డిజైన్ లో చేయించావటగా చూడాలని ఉంది.”
ఆనందంగా అడిగేసింది ఆత్రత నణచుకోలేని రేవతి.
“అవునమ్మా! బాబు పేరిట చేయించాను. వాడికి అన్న ప్రాసన చేయించాలనుకున్నాను కానీ,”
ఆగిపోయింది భారతమ్మ.
అర్థం కాలేదు రేవతికి.
“అంటే? వెండిగిన్నెతేలేదా? మర్చిపోయావా? మరిందాక తెచ్చానన్నావుగా అమ్మా?”
కొంచం నిరాశగా ప్రశ్నించింది.
“మర్చిపోలేదు…. తెచ్చాను కానీ! రేవతీ అదిప్పుడు నా దగ్గర లేదమ్మా:”
“పోయిందా? ఎవరైనా కొట్టేశారా? అసలే రోజులు బాగాలేవు!”
రేవతి కంగారుకు సన్నగా మందహాసంచేసింది తల్లి. “వెండిగిన్నె పోగొట్టలేదు. మరెవరూ కొట్టేయలేదు. వివరంగా చెప్పాలంటే… దానికో కథలాంటి సంఘటన వుంది.”
“కధేమిటమ్మా!”
“చెబుతాను వినమ్మా।”
“నిన్న ఊర్నుండి బయల్దేరానా మీ నాన్నకేదో పనుండి రాలేకపోయారు నా వెంట. రైలు మాత్రం యెక్కించి వెళ్ళారు. మీరు ఇల్లు మారారు. కొత్త ఇల్లు నేను చూడలేదు. అడ్రస్ మాత్రం వుంది. మీ నాన్నగారన్ని గుర్తులూ చెప్పారు. ఓ వారం ఆగితే ఇద్దరం వెళ్ళొచ్చన్నారు మీ నాన్న. కానీ రేపు మంచి రోజని ఆచార్యులవారు చెప్పినందున బయల్దేరాను. అన్న ప్రాసన జరిపించొచ్చని: కానీ…. రైలు అనుకున్న టైముకన్నా మూడు గంటలు లేటయ్యింది. మార్గమధ్యంలోని మరో రైలు ప్రమాదంవల్ల దీనిక్కూడా అవరోధం కల్గింది. చీకటి పడింది. ఇక్కడి కొచ్చేసరికి వర్షం: కరెంటులేదు. ఇల్లు కనుక్కోలేక పోయాను. అదీకాక మీ కాలనీలో ఇళ్ళన్నీ ఒకేలా వున్నాయి. పొరపాటున యే సందులో కెళ్ళినా కష్టమే. ఇల్లు తెలీలేదు.
“తడిసిపోయాను చలిగాలి: పెను చీకటి. ఆ రాత్రివేళ నా అవస్థ వర్ణనాతీతం,
“అక్కడికి యే ఇల్లయితేనేం అనుకొని ఆశ్రయంకోసం ఆర్ధించాను,
“ఊహూ: చూసీ చూడనట్లు మొహం మీదే తలుపులు వేసుకున్నారు కొందరు. కొందరేమో తలుపులే తీయలేదు. ఇక ఊహించుకో తల్లీ … ఆ పరిస్థితిలో నేనేం చేయాలో.”
వింటున్న రేవతి పులిక్కిపడింది.
మళ్ళీ ప్రారంభించింది భారతమ్మ.
“ఇంక యెవర్నీ అడగాలనిపించక అలాగే రోడ్డు మీదే నడుస్తూ తడుస్తూ వెళ్ళాను. కొండ దూరం నడిచాక యింక వోపిక నశించిపోయింది. అక్కడ వో సందులో వున్న చిన్న రేకుల యింటిముందు కొంచెం స్థలంలో వొదిగి కూర్చుండి పోయాను నా ప్రారబ్దానికి చింతిస్తూ చలికి వణుకుతూ.
“అంతలోనే ఆ యింటి తలుపు తెరిచి ఓ స్త్రీ బయటకు వచ్చి చూసి నా స్థితికి యెంతో చింతిస్తూ లోపలికి తీసుకు వెళ్ళింది. వొద్దన్నా వినక కుంపటి అంటించింది. వెచ్చగా చలి కాచుకున్నానమ్మా। ఆపైన ఆ రాత్రి వంట కూడా చేసి నా ఆకలి తీర్చి అమ్మలా అన్నపూర్ణలా అందుకుంది రేవతీ. ఆ యిల్లాలు ఆ మానవతామూర్తిలో మూర్తీభవించిన మానవత నా మనసు నిండిపోయింది.
నేనెవరో తానెవరో అన్న ఆలోచనే ఆమెకు రాలేదు. నాకు రానివ్వలేదు. చాలా పేదరాల్లాపుంది. భర్తకు చెప్పుకోదగ్గ ఉద్యోగమేదీ దొరక లేదుట. ఇంట్లో స్థితిగతులలా వున్నాయిగాని ఆమెను చూస్తుంటే పేదమనిషిలా కన్పించలేదు. పెద్ద ఇళ్ళలో అడిగినా దొరకని ఆశ్రయం పెద్దమనసున్న ఆమె చిన్న యింటిలో దొరికింది అడగకనే నారు. ఆమె వెచ్చని ఆశ్రయం ఒక్క రాత్రిదే కావచ్చు. రేవతీ! కానీ నాకు మాత్రం జీవితకాలమంతా జ్ఞాపకముంటుంది”
అలా అంటున్నప్పుడు తల్లి కళ్ళలో లీలగా తడి గమనించింది రేవతి.
“చూశావా రేవతీ! రాత్రి నాకు దొరికిన ఆదరణ డబ్బుతో కొన్నదిగాదు. బంధుత్వాన్ని పురస్క రించుకున్న దిగాను. మనిషికి సాటి మనిషి పట్ల వున్న సదవగాహనే అది।
“ఉన్నవాళ్ళంతా మనసున్నవాళ్ళేకారు. లేని వాళ్ళంతా లెక్కకు రానివాళ్ళుకారు।
“రాత్రి నాకు కల్గిన సంతృప్తికి భాషగాని, వివరణగానిలేవేమో అన్పిస్తుంది. అనుకోని వరి స్థితుల్లో కూతుర్ని కలుసుకోలేక పోయినా, మరో కూతురి అనుబంధాన్ని మనిషికి మనిషికి మధ్య నున్న బంధంలో తెల్సుకోగలాను.”
“ఈ రోజే వాళ్ళ బాబు పుట్టిన రోజని వాళ్ళు జ్ఞాపకం చేసుకోవటం వాడితో దేవుడికి దణ్ణం పెట్టించి అదే పది వేలనుకో బాబూ అంటూ ఆ తల్లి కొడుకుని ఆప్యాయతతో అంతులేని బాధతో గుండెకు హత్తుకొని కన్నీళ్ళు కార్చి దీవించటం లీలగా చూశాను.
మరింక చూడలేకపోయాను రేవతీః వాడిని చేరబిలిచి ఆ వెండిగిన్నె వాడి చేతిలో వుంచాను.
వాళ్ళు సనేమిరా వద్దన్నారు.
“చూడు రాధికాః సాటిమనిషిపట్ల నీకర్త వ్యాన్ని నెర వేర్చుకున్నావ్: ఓ అనుబంధం సృష్టింపబడిందక్కడ. ఆ బంధాన్ని పురస్కరించు కునే బాబుకోసం ఈ పని చేస్తున్నాను. తెలియని నన్నాదుకున్నావ్: కాని అన్నీ తెల్పి ఇప్పుడు నేను చేస్తున్న ఈ పని నీకన్నా గొప్పది కాదు. అయినా నా ఆత్మతృప్తికోసం నీ ఆతిధ్యానికి వెలకడూ నీ ఋణం తీర్చుకుంటున్నాననే తేలిక అభిప్రాయానికి నీవు లోనుకావని భావిస్తున్నాను. నీ తల్లే యిలా ఇస్తుంటే కాదనగలవా అమ్మా: నీకు తెలీదా? ఇది మానసిక స్పందన. దీనికి ఆద్యంతాలూ ఋణశేషాలూ వుండవు కదూ ?”
“బాబు పుట్టిన రోజున నా కానుక ఇది. ఇది వాడికోసం యెలా పుపయోగపడ్డా సరేనమ్మా: కాదని నా మనసు బాధ పెట్టవని తలుస్తాను!”
ఇలా ఎంతో నచ్చజెప్పి, నా మనోభావాలన్నీ ముందు పెట్టి, నొప్పించక వారి -నొప్పించి ఆ వెండిగిన్నె ఆనందంగా వాళ్ళబ్బాయి కిచ్చేశానమ్మా!”
ఒడిలోని బాబు తల నిమురుతూ అంది భారతమ్మ కూతురి మొహంలోకి చూస్తూ.
రేవతిలో అప్పటికే సంచలనం ప్రారంభమయింది. కన్నీళ్ళు చెంపల మీదుగా ధార కడ్తున్నాయి. రాత్రి .. రాత్రి సంఘటన కళ్ళముందు కదలాడింది.
ఆమె వచ్చి తనింటి తలుపు తట్టింది తెలీకయేః ఆ విషయం తెలిస్తే యెంత బాధపడ్తుంది తన తల్లి: ఆ చీకట్లో ఈ యిల్లే రాత్రి తను తలుపు తట్టినదని తెలిసి ఉండకపోవచ్చును.
ఒక్క రాత్రికి అసహాయ స్థితిలోని సాటి ఆడదాని అవస్థను గ్రహించలేని ఆశ్రయమిచ్చి ఆదుకోలేని సంకుచితురాలూ, పిరికిమనిషీ తన కూతురని తెలిస్తే తల్లి తన్నెలా చూస్తుంది? యెంత నిరసించుకుంటుంది? దేవతలా ఆ రాధిక ఆదుకుంది గనుక సరిపోయింది లేకుంటే ఆమె యేమయ్యేదో తర్వాత గ్రహించిన తన బాధకు ఈ జీవిత కాలం సరిపోయేది.
ఎంతసేపటికీ ఏ దొంగలో, దౌర్జన్యపరులోనన్న
తన వేపు ఆలోచనలే తప్ప ఒక్క క్షణం అవతలి వ్యక్తి గురించి ఎవరూ అని అడిగైనా కనుక్కోగల్గిందా!
ఏ బీభత్స వాతావరణానికైతే తాను భయపడి తలుపులు, కిటికీలు సైతం మూసుకుందో, ఆ భయంకర వాతావరణంలోనే తనలాంటి మనిషి వుందని గ్రహించి ఎవరో తెలుసుకుని, తలుపు తీసి తన కర్తవ్యాన్ని నెరవేర్చలేక పోయింది. పిరికి తనానికి చోటిచ్చి సాటిమనిషికి చోటివ్వలేక పోయింది. తన తల్లి అవస్థకు కారణమయింది.
ఇతరుల కష్టసుఖాల్లో మనకెందుకు అనుకోక ఒక క్షణం మనిషిగా, మానవత్వంతో ప్రవర్తించి వుంటే హాయిగా అమ్మనాదుకోగలిగేది. పరాయి వాళ్ళనుకొని నిర్లక్ష్యంచేసి ఆ నిర్లక్ష్యానికి పరోక్షంగా తన తల్లినే గురిచేసి శిక్షించింది తను.
రేవతి పొంగివస్తున్న దుఃఖాన్ని బలవంతాన ఆపుకుంటోంది.
ఆ రాధికకు తన తల్లి పరాయిదేగా! అయినా ఆదుకుంది. మానవతను నిలుపుకుంది. మరి తను? ఏమౌతుందోనని భయంతో కొండంత గుండెను, సాగరమంత మనో విశాలతను పిరికి గుప్పెట్లో బంధించి వుంచింది. మనిషి జీవితమే యెప్పుడే మవుతుందో యెవరికీ తెలీదు. అలాగని మనిషి బ్రకకటం మానేస్తున్నాడా? ఆ బ్రతకటం కోసం చేసే భయం గొల్పే పనులు మానుకుని కర్తవ్యాన్ని విస్మరించి నాలుగోడల మధ్య ఎప్పుడూ సురక్షితంగా బంధింపబడి వుంటున్నాడా తనకు తాను?
ఇది తెలీని తనెంత అవివేకురాలైంది? ఎంత కథనడిపింది తన పిరికి తనం? స్వార్ధపరత్వం?
బాధావరితప్తమై వర్షించే కళ్ళతో నిల్చున్న కూతురి భుజం పై అనునయంగా చేయి వేసింది తల్లి.
” బాధపడ్తున్నావా రేవతీ ?”
కూతురి కళ్ళు తుడుస్తూ ఆర్ద్రంగా అడిగిందామె.
” రాత్రి సువ్వు పడ్డ కష్టానికి వో పక్క బార ఆ రాధిక పరోపకార గుణంతో చేసిన సహాయానికి మరో పక్క సంతోషం, సంకోచించక వాళ్ళ బాబుకి వెండిగిన్నె నిచ్చి ఆశీర్వదించి వచ్చిన నా తల్లి నిండు మనసుకు గర్వపడూ…. ఆ రాధికని నాకాదర్శంగా భావిస్తూ…. ఇన్ని కారణాల్తో ఈ కళ్ళు నిండుకున్నాయమ్మా”
తల్లి తుడిచిన కళ్ళు తడిసిన మల్లెల్లా తళతళ లాడగా అంది రేవతి.