జరిగిన కథ
ఎన్నో ఆశలతో మగధదేశపు మహారాజు విక్రమసింహ, తాను వలచి పాణిగ్రహణం చేసుకున్న విదర్భదేశపు రాకుమారితో, ప్రథమ సమాగమమునకు ఉవ్విళ్లూరుతున్న సమయంలో, మా మనసు అన్యాక్రాంతమన్న సమాధానం ఇవ్వడమే కాకుండా, “ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలంటే అంతఃపురం మా స్వాధీనంలో ఉండాలని, మాకు యుద్ధ విద్యలు నేర్పించే బాధ్యతను కూడా మీరే తీసుకోవాలని” అర్ధించిన రాకుమారి కోరిక మేరకు, ఆమెకు యుద్ధ విద్యలు నేర్పేందుకు, సర్వ సైన్యాధిపతి అనంతుడిని నియమిస్తాడు. మొదటిరోజే రాకుమారి ఇచ్చిన బహుమతిని చూసి, ఆందోళనకు లోనవుతాడు అనంతుడు. తర్వాత జరగబోయేది వీక్షిద్దాం రండి.
“మా ఈ చిన్న బహుమానాన్ని గురువర్యులు స్వీకరించాలని వినమ్రంగా ప్రార్థిస్తున్నాను” అంటూ ఆమె చేతికందించిన ఆ బహుమానాన్ని చూసి అత్యంత ఆశ్చర్యానికి లోనయ్యాడు అనంతుడు. ఎంతో సన్నిహితులకు ఇవ్వాల్సిన ఈ బహుమానాన్ని, ఇప్పుడే మొదటిసారిగా కలిసిన తనకు ఇవ్వడంలో ఆమె ఆంతర్యమేమిటి? ఇటువంటివి ఆమె దగ్గర ఎన్ని ఉండి ఉంటాయి? ఇది ఆమె తనకు విసిరిన సవాలా? ఇస్తున్న తాయిలమా? విద్య నేర్చుకున్నాక మహారాజును కూడా ఇలాగే సవాలు చేస్తుందా? ఒకప్పుడైతే అటువంటి బహుమానం అందుకునేందుకు గర్వించేవాడే. కాని, ఇప్పటి పరిస్థితి వేరుగా ఉంది. అందుకే అంత ఆలోచించవలసి వస్తుంది.
ఆ బహుమానం… శత్రువుల తలలను మొండెము నుండి వేరు చేసే కరవాలం. దానికి పొదగబడే జాతి రత్నాలను చూస్తే, అది అత్యంత విలువైనదని అర్థమవుతూనే వుంది. ధనుర్విద్యలో ఆమెకున్నంత చురుకుదనం, ఖడ్గవిద్యలో లేదు కాబట్టి సరిపోయింది గాని, అదెంత పదునుగా ఉందంటే, యే భాగానికి తగిలితే ఆ భాగం ఊడి రావాల్సిందే. అంతటి పదును ఆ కరవాలానిది. దానితోనే ఈరోజు ఖడ్గవిద్యా శిక్షణలో పాల్గొంది రాకుమారి. దానిని తనకివ్వడంలో ఆమె ఆంతర్యం? ఇదేమైనా ఎత్తుగడా?
సంశయిస్తున్న అనంతుని చూసి, “గురువర్యా! ఇది మా పితామహులు మా కోసం ప్రత్యేకంగా చేయించిన కరవాలం. వారు బ్రతికి ఉన్నప్పుడు, వారే మాకు ఖడ్గవిద్యను నేర్పించారు. వారు స్వర్గతుల్యులయ్యాక, వేరెవరి దగ్గరా ఖడ్గవిద్య నేర్చుకోవాలనిపించలేదు. మీరు నేర్పిస్తుంటే, మా పితామహులు గుర్తుకొచ్చారు. ఇది మీ వంటి వీరుల దగ్గర ఉండడమే శోభస్కరం. దయచేసి కాదనకండి” వేడుకోలు స్వరంతో పలికింది రాకుమారి.
*
“ఎంతో అపురూపంగా దాచుకున్న ఆ కరవాలాన్ని అలా బహుమానంగా ఇచ్చేసారేమిటి రాకుమారీ!” కుతూహలం ఆపుకోలేక అడిగేసింది ప్రియంవద.
“నాకూ అదే ఆశ్చర్యంగా ఉంది. గాని, వారిని చూడగానే పితామహులే గుర్తుకొచ్చారు. పితామహులే దగ్గరుండి నేర్పించారన్న అనుభూతి కలిగింది” సాలోచనగా అంది రాకుమారి.
సర్వ సైన్యాధ్యక్షుల పాటవమే ఇంత గొప్పగా ఉంటే వారి మహారాజులు ఇంకెంతటి వీరులో? ఇలాంటి ఆలోచనలతో, తన మనసును దోచుకున్న వీరుడు గుర్తొచ్చాడు. ఎక్కడ ఉన్నాడో? తనకోసం ఎదురు చూస్తూ ఒక కన్య ఉందన్న విషయం తెలుసో! తెలియదో! ఆ మహాభాగుని కలవడానికి, ఎన్నిసార్లు ప్రయత్నం చేసిందో? అతని జాడే లేదు. మెరుపులా వచ్చి మాయమైపోయాడు. ఈ జన్మలో, వారిని కలిసే యోగముందా తనకు? తన నుదుట ఏమి రాసిపెట్టి ఉందో! దుఃఖం ముంచుకొచ్చింది.
*
శిక్షణ చురుకుగా సాగుతుంది. ఒక్కో రోజు అనంతుడు రావడం ఆలస్యమైన పక్షంలో, ఆమె గురువు అవతారమెత్తి తన చెలికత్తెలకు శిక్షణ నిస్తుంది. సాధన చేస్తున్నప్పుడు కాని, శిక్షణ ఇస్తున్నప్పుడు కాని, ఆమె ఎంత ఏకాగ్రతతో ఉంటుందంటే, చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఇటువంటి శిష్యులకు కదా మన విద్యను ధార పొయ్యాలని గురువులకు అనిపించేంతగా, ఆమె శిష్యరికం చేస్తుంది.
అప్పుడప్పుడూ, ఆమె నైపుణ్యాన్ని చూస్తూ మైమరిచిపోతుంటాడు అనంతుడు. శిష్యురాలిగా ఆమె అంటే అపారమైన ప్రేమాభిమానాలు కలుగుతున్నాయి. తనకు అత్యంత ప్రియమైన మహారాజు, సరసన ఈ కొత్త శిష్యురాలు చేరుతుంది. తనకు ప్రియమైన వీరిద్దరూ, ఒకరికొకరు ఎందుకు ప్రియం కాలేకపోతున్నారు? వారి మధ్య ఉన్న ఆ నిగూఢ రహస్యమేమిటి? అలాగని, వారిరువురిలో ఏ ఒక్కరినీ అడిగే సాహసం చెయ్యలేడు. ఒక్కోసారి ఆమెకు తెలియకుండా, దూరం నుండే గమనిస్తూ ఉంటాడు, ఆమె ప్రవర్తనలో ఏ మార్పైనా ఉంటుందేమోనని. అటువంటిదేమీ కనిపించదు. మహారాజును దూరంగా ఉంచడానికి, ఈ యుద్ధవిద్యలు నేర్చుకోవడానికి మధ్య ఉన్న రాకుమారి ఆలోచనను ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ఛేదించలేకపోతున్నాడు అనంతుడు.
*
గురువుగా ఆమె తనకిస్తున్న గౌరవ మర్యాదలు, తన పట్ల చూపిస్తున్న వినయవిధేయతలు ఆమె సౌశీల్యాన్ని తెలియబరుస్తున్నాయి. శిష్యురాలిగా ఆమె అంటే అభిమానం ఏర్పడుతుంది. కాని, మహారాజును దూరంగా ఉంచుతున్న ఆమె పద్ధతి, ఈ యుద్ధవిద్యలు నేర్చుకోవాలన్న ఆలోచన, అనంతుడు ప్రతి నిమిషం జాగరూకతతో, ఆమె పట్ల మరింత అప్రమత్తతతో ఉండేలా చేస్తున్నాయి. ఒక రకంగా ఆమె అంటే ద్వేషభావం కూడా ఏర్పడుతుంది. ఇటువంటి ద్వైదీభావంతోనే ఆమెకు ఖడ్గవిద్య, ధనుర్విద్య తదితర యుద్ధవిద్యలు నేర్పిస్తున్నాడు.
మొదట్లో ఆమె అంత ఖడ్గవిద్యా నిపుణురాలు కాదు. ఆమె అన్నట్టు వారి తాతగారి తదనంతరం, ఆమె కరవాలాన్ని పట్టనేలేదు. కానీ ఇప్పుడామెకు ఖడ్గవిద్య అంటే అత్యంత ప్రీతి. మీలాంటి గురువు ఉంటే నాకు ఆకాశమే హద్దని అంటుంది. ఆమె కరవాలం తిప్పుతుంటే చూసి తీరాల్సిన విషయమే. మెరుపుతీగలా కదులుతుంది. ప్రత్యర్థికి ఆమె చేతిలోని కరవాలం కనిపించటం లేదంటే, అది అతిశయోక్తి కాదు. అంత లాఘవంగా ఖడ్గ ప్రదర్శన చేస్తుందామె.
ఇక ధనుర్విద్య గురించి చెప్పనవసరమే లేదు. అలవోకగా లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఆ కళ్ళలో పట్టుదల, నేర్పు కోసం ఆమె చేస్తున్న సాధన, నిరంతర కృషి, విజయాన్ని సాధించినా దాన్ని వినమ్రంగా స్వీకరించే ఆమె పద్ధతి, ఎదుటివారికి ఆమె ఇచ్చే గౌరవ మర్యాదలు, ముఖ్యంగా ఆమె కళ్ళు… పసిపాపల కళ్ళలా నిర్మలంగా వుంటాయెప్పుడూ. ఆమెలో కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఉత్సాహం పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. విజయం దక్కితే పసిపాపలా పొంగిపోతుంది. వీటన్నిటితో, ఆమె నిర్మల మనస్తత్వానికి దాసోహం అయిపోయాడు అనంతుడు.
రాకుమారికి శిక్షణ మొదలుపెట్టి ఆరు నెలలు గడిచాయి. ఈ శిక్షణా కాలంలో ఒక్కరోజు కూడా మహారాజు ఈ దరిదాపులకు రాలేదు. రాకుమారి గురించి అనంతుని దగ్గర ప్రస్తావించనూ లేదు. ఆశ్చర్యమనిపించినా, ఆ విషయం ఎత్తే సాహసం అనంతుడూ చెయ్యలేదు. పాముకి పాలు పోసి పెంచుతున్నామా, అని అప్పుడప్పుడూ అనిపించినా, మహారాజ ఆజ్ఞను పాటించక తప్పదు. దానికి తోడు ఆమె ప్రవర్తనలో అడుగడుగునా వినయం తొణికిసలాడుతూనే ఉంటుంది. నేర్చుకోవాలనే కుతూహలం ఎక్కువ. విద్యల్లో ఆరితేరిన వాడు గురువు. ఆ రకంగా, అనంతుని శిక్షణలో ఆరితేరింది రాకుమారి.
ఎందులో పోటీ పెట్టినా, గురువుకు తగ్గ శిష్యురాలే అనిపించుకుంటుంది.
“రాకుమారీ! శిక్షణ అనంతరం ఖడ్గవిద్యలో మమ్ములను ఓడిస్తే మా గురువర్యులు, మీకు శిక్షణనిస్తారని” అనకుండా ఉండలేకపోయాడు అనంతుడు.
“మహాప్రసాదం గురువర్యా! మిమ్ములను ఓడించడం కాదు, మీ చేత అభినందనలు అందుకోవడం నా అభిమతం” సవినయంగా, అంజలి ఘటిస్తూ చెప్పింది ప్రమీలాదేవి. ఆమె మాటల్లో, ప్రవర్తనలో ఎక్కడ కూడా మహారాణినన్న భావం ఇంచుకైనా లేదు.
ఒక ప్రక్క జాగ్రత్తగా ఉండాలని తన మనసును హెచ్చరించుకుంటూనే, ఆమె శిష్యరికానికి దాసోహం అయిపోతున్నాడు. తనకున్న విద్యలన్నిటినీ నేర్పిస్తున్నాడు. నేర్పిస్తున్నాడే కాని ఇంకొక ప్రక్క అనుమానం వీడడం లేదు. తన దగ్గర నేర్చుకుని రేపు తనకే పోటీగా వస్తుందా?
తనకు విద్య నేర్పిన గురువుగారు, మహారాజు తప్ప ఈ రాజ్యంలో తనను ఓడించే వారు ఎవరూ లేరు. అవసరమైతే రేపు తనని ఓడిస్తుందా! ఏమో! ఎవరు చూడగలరు భవిష్యత్తును?
ఏదేమైనా, ఆమె యుద్ధ విద్యా నైపుణ్యతను, సాధనలో ఆమె కౌశల్యాన్ని ప్రభువులవారికి తెలియజేయవలసిందే అనుకుంటూ, “ప్రభూ! మహారాణి వారు చాలా తొందరగా నేర్చుకుంటున్నారు. అటువంటి శిష్యులు ఉండడం, గురువుల అదృష్టం. మీరొక్కసారి ఆ శిక్షణా శిబిరానికి వేంచేస్తే బాగుంటుందని నా అభిప్రాయం” అన్నాడు.
అనంతుని మాటలు విని, “అనంతుని ఆదరణను చూరగొనడమంటే మాటలు కాదు. ఎవరిని అంత తొందరగా మెచ్చుకోడు. అటువంటి అనంతుడే ఆమెను మెచ్చుకుంటున్నాడంటే”, ఆశ్చర్యపోయాడు మహారాజు. ఆ వెంటనే ఆశ్చర్యపోవడానికి ఏముంది? ఆమె ప్రజ్ఞా పాటవాలు చూసే కదా ఆమెని ఇష్టపడ్డాడు. ఆమెకు రాలేదంటే ఆశ్చర్యపడాలి గాని, వచ్చంటే ఆశ్చర్యం దేనికి? ఏమి జ్ఞాపకమొచ్చిందో తనలో తానే నవ్వుకున్నాడు విక్రమసింహ.
విక్రమసింహ ముఖంలో నవ్వు చూసి ఆశ్చర్యపోయాడు అనంతుడు. వివాహమైన నుండి విక్రమసింహ ముఖంలో నవ్వే మాయమైపోయింది. అటువంటిది మరలా… ఇప్పుడు… నవ్వుతున్న విక్రమసింహుని చూసి అలా ఉండిపోయాడు అనంతుడు.
“అనంతా! ఏమిటా పరధ్యానం?” అన్న విక్రమసింహుని మాటలతో మరల ఈ లోకానికొచ్చాడు అనంతుడు.
“ప్రభూ! పొరపాటుకు మన్నించండి” చేతులు జోడించాడు.
“ఏమిటి అనంతా! ఏమైంది నీకు? మేము వచ్చి మహారాణిని పరీక్షిస్తాం. ఏర్పాట్లు చెయ్యి.” ఆజ్ఞాపించాడు.
*
సాధన చేస్తున్న ఆమెను దూరం నుండి చూసిన మహారాజు మనసు కరిగిపోయింది. అడుగు ముందుకు పడలేదు. స్త్రీగా ఎంత లావణ్యవతియో! పురుష వేషంలో కూడా అంతే మెప్పించి, తన మనసును చూరగొంటున్నది. అయినా ఇదే మొదటిసారి కాదు కదా, ఆమెను ఈ వేషంలో చూడడం! నిట్టూర్చాడు విక్రమసింహ.
“మా గురువర్యులు వినయవర్మగారు” దగ్గరకు వచ్చిన మహారాజును చూసి రాకుమారికి పరిచయం చేశాడు అనంతుడు.
“మా గురువర్యులకు గురువర్యులు మీరు. మీ దర్శనం మాకు మహా ప్రసాదం” అంటూ ప్రణామాలు చేసింది రాకుమారి.
ఆమె సౌశీల్యాన్ని దగ్గర నుండి చూసిన మహారాజు, తన ఎదలో మెదిలే భావాలను దాచుకొని ఆమెకు పరీక్ష పెట్టాడు.
ఖడ్గవిద్యలో, ధనుర్విద్యలో ఆమె లాఘవాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. నిజంగా ఆమె పురుషుడే అయి ఉంటే ఆమె రాజ్యాన్ని తాము గెలవడం అసంభవమేమో అనిపించింది. ఒక వీరునిగా ఆమె ప్రతిభకు దాసోహం అయ్యాడు. అనాలోచితంగా తన మెడలోని హారం తీసి ఆమె మెడలో వేశాడు అభినందిస్తూ.
ఆమె మహదానందంగా “నా, యీ ప్రతిభ అంతా మా గురువర్యులదే. ఇది వారికే చెందాలి.” అని వినమ్రంగా అంజలి ఘటిస్తూ, హారం అనంతునికి అందించింది.
ఆమె సమయస్ఫూర్తికి ఆశ్చర్యపోయారు మహారాజూ, అనంతుడూ. వీరునిగా అయినా, ఇంకొక పురుషుని మెడలోని హారం గ్రహించలేననుకునే ఆమె ధర్మనిరతికి ఇద్దరూ మనసులోనే పొంగిపోయారు.
శిరస్త్రాణం ధరించి, తన ముఖం కనపడనీయకుండా వచ్చిన విక్రమసింహ ముఖంలో ఆనందం తాండవించింది ఆమె నిబద్ధతకు, వినమ్రతకు. “రాకుమారి! మీకు విద్య నేర్పే బాధ్యతను మేము కూడా తీసుకుంటాం” అసంకల్పితంగా విక్రమసింహ నోటినుండి ఆ మాట వచ్చింది.
“మహానుభావా! మీ దర్శనమే మహా ప్రసాదమనుకుంటే, మాకు విద్యను నేర్పిస్తామన్న మీ ఔదార్యానికి, సర్వదా కృతజ్ఞురాలిని. ఇది మాకు లభించిన భాగ్యంగా నమ్ముతున్నాం గురుదేవా!” ఇలా అంటూ విక్రమసింహ పాదాలను కళ్ళకద్దుకుంది ప్రమీలాదేవి. ఆమె కరములు తన చరణాలను స్పృశించగానే అలౌకికానందంతో పులకించిపోయి, ఒక్కక్షణం సర్వం మైమరచిపోయాడు విక్రమసింహ. ఆరోజు కూడా ఇలాగే… తనువును మర్చిపోయి… ఆమే లోకంగా…
మహారాజు మనోస్థితిని గుర్తించి “గురువర్యా!” అంటూ కనులతోనే హెచ్చరించాడు అనంతుడు.
అంతకుముందే అనంతుడు “ఈ దినం మా గురువర్యులు వచ్చి మీ ప్రతిభాపాటవాలను పరీక్షిస్తారు” అని ఆమెకు చెప్పడం జరిగింది. ఆ గురువర్యులే మహారాజని, అక్కడున్న ఎవరికీ తెలియదు.
తమ గురువులకు గురువర్యులంటే, వయసులో ఎంత పెద్దవారో అనుకున్నారంతా! కాని, వారి దేహదారుఢ్యం చూసి ఆశ్చర్యపోయారంతా! యువకులు కూడా వారితో సరితూగరనిపించింది. దానికి తోడు వారు కూడా సంపూర్ణ కవచధారులై శిరస్త్రాణం ధరించి వచ్చారు. కాబట్టి వారి వయసును అంచనా వెయ్యలేకపోయారు రాకుమారి, ఆమె చెలులు. అయినా కొంతమంది గురువులు కఠోరశ్రమతో, వయసును వెనుకకు తిప్పగలరు. వీరు కూడా అంతేనేమో! అనుకుంటూ వారు నేర్పించబోయే, మెలకువల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంతా!
*