జరిగిన కథ
పాణిగ్రహణం చేసుకున్న విదర్భ రాకుమారి, ప్రమీలాదేవి మనసులో తాము లేమని తెలిశాక, ఆమె కోరిక మేరకు యుద్ధ విద్యలు నేర్పించడానికి సర్వ సైన్యాధిపతి అనంతుడిని నియమించాడు మగధ దేశపు మహారాజు విక్రమసింహ. అనంతుని కోరిక మేరకు మారువేషంలో వచ్చి, ప్రమీలాదేవికి శిక్షణ గరుపుతూ, రాకుమారి మనసులో ఉన్నది అనంతుడా అన్న అనుమానం పొడ సూపుతుంది విక్రమసింహకు. ముందు కోపమొచ్చినా, ఆమె మనసులో ఉన్నది అనంతుడు కాదని సందేహ నివృత్తి చేసుకొని, ప్రమీలాదేవి అంటే తనకిష్టమెలా ఏర్పడిందోనని జ్ఞాపకాలలోకి జారుకున్నాడు విక్రమసింహ. ఆ జ్ఞాపకాలేమిటో వీక్షిద్దాం రండి …
ఇక చదవండి….
అసలు ప్రమీలాదేవి అంటే తనకు ఇష్టమెలా ఏర్పడింది? గతంలోకి జారుకుంది మనసు…
చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన తనకు అన్నీ తానై, అల్లారు ముద్దుగా తండ్రి లేని లోటు కనిపించకుండా పెంచింది తల్లి, రాజమాత భ్రమరాంబ. మహామంత్రి, సర్వ సేనాధిపతుల సంరక్షణలో, అడుగడుగునా వారు తనకు కోటలా నిలబడి తండ్రి లేని లోటుని భర్తీ చేస్తూ, సర్వోన్నతంగా తీర్చిదిద్దారు తనను.
బ్రాహ్మణత్వానికి లోటు రాకుండా, యుద్ధ విద్యలలో ఆరితేరిన నారాయణాచార్యుల వారి శిక్షణలో సకల విద్యలను అలవోకగా నేర్చుకున్నాడు. యుక్తవయసు వచ్చేసరికి తన శౌర్య పరాక్రమాలు, మేధోసంపత్తి, వినయ విధేయతలు, అందచందాలు చూసి పలువురు రాజులు తమ కన్యలను వివాహం చేస్తామని రాయబారాలు నడిపేవారు. కాని, తన మనసు రాకుమారి ప్రమీలాదేవి మీదే లగ్నమై పోయింది.
దానికి తగిన కారణం లేకపోలేదు. తల్లి భ్రమరాంబ తనకు తగిన సంబంధం కోసం వేగుల నుండి సమాచారం తెప్పించుకునే వారు. నారాయణాచార్యులు, ప్రధానమంత్రి, సర్వ సేనాధిపతుల సమక్షంలో వివాహానికి సంబంధించిన విషయాలను చర్చించేవారు. నారాయణాచార్యుల వారి శిష్యుడు, అప్పలాచార్యులకు, తగిన కన్యను వెతికే పనిని అప్పచెప్పారు. అన్ని దేశాలూ తిరిగి అప్పలాచార్యుల వారు వచ్చిన సందర్భంలో…
వారికి తెలియకుండా వారి సంభాషణలను తాను వినడం జరిగింది. అదెలాగంటే…
అప్పుడు తన వివాహం గురించి జరిగిన సంభాషణలు ఇప్పటికీ తన మనోఫలకం మీద నిలిచిపోయాయి. ఆ రోజు గురించి చెప్పాల్సి వస్తే…
దేశ దేశాలు తిరిగి వచ్చిన అప్పలాచార్యులను పిలిపించి తగు రీతిన సత్కరించి “మహానుభావా! మన యువరాజులకు తగిన వధువును వెతికే ప్రయత్నంలో మీ అనుభవాలను చెప్పండి” సవినయంగా అడిగారు రాజమాత భ్రమరాంబ.
తాము తెచ్చిన రాకుమార్తెల చిత్రపటాలను చూపిస్తూ…
“మహారాణీ! వీరు కుంతలదేశపు రాకుమారి. మన ప్రభువు విషయంలో వారు ఎంతో ఆసక్తితో ఉన్నారు. మన రాజ్యానికి సరితూగే ఆయుధ సంపత్తి వారికి ఉంది. కాని అందచందాలలో ఆమె ఒక్క అడుగు మన ప్రభువులకు తగ్గి ఉంటారు.”
“ఈమె శంతన దేశపు యువరాణి. అందచందాలలో సరితూగినా, ప్రధమ కోపమని ప్రతీతి. యువరాజు అటువంటి వారిని సహించరు.”
“వీరు చోళదేశపు రాకుమారి. అన్ని విషయాలలో బాగున్నా, మేని వర్ణం మన ప్రభువులకు ఒక ఛాయ తక్కువ.”
“ఈమె వంగదేశపు రాకుమారి. అన్ని విధాలా సరితూగుతారు. గాని ఆమెకు అతిశయమెక్కువని, ఎవరినీ లెక్కచెయ్యరని ప్రతీతి. అది మన యువరాజులకస్సలు నచ్చదు” అని చెప్పసాగారు అప్పలాచార్యుల వారు.
“ఆచార్యులవారూ! మీరు తెచ్చిన వారిలో ఏ ఒక్కరు కూడా మనకు సరితూగేవారు లేరా?”
“లేకేం రాజమాతా! విదర్భ రాజ్యపు యువరాణి ప్రమీలాదేవి అందచందాలలో, వినయ సంపత్తిలో మన ప్రభువులకు సరిపోతారు. కానీ…”మాట నాన్చాడు.
“కానీ…”
“వారిది చాలా చిన్నదేశం. వారిని మన దేశపు మహారాణిగా తెచ్చుకుంటే, ఇతర దేశాలవారికి కోపం రావచ్చని సంశయిస్తున్నాను మహారాణీ!”
“అంతేకాదు. ఇంకొక విషయం…” అంటూ చెప్పడానికి కొద్దిగా సంశయించారు అప్పలాచార్యులవారు.
“సందేహమెందులకు? చెప్పవలసినదంతా సూటిగా చెప్పవలెనని రాజమాతగారి ఆజ్ఞ” నారాయణాచార్యుల వారు.
“రాకుమారి చిన్ననాటి నుండీ, శౌర్య పరాక్రమాలలో పురుషులకు సరితూగేవారట. యుక్త వయసు వచ్చేసరికి, ఆమెను అంతఃపురానికే పరిమితం చేసారట ఆమె తండ్రిగారు. ఆ విషయంలో మీ అభిప్రాయం తెలుసుకోకుండా ముందుకు వెళ్లకూడదని… ” వినమ్రంగా చెప్పారు అప్పలాచార్యులవారు.
విదర్భదేశపు రాకుమారి అనగానే, వీరి సంభాషణను చాటుగా వింటున్న నాకు, అంతకుముందు ఐదేళ్ల క్రిందట జరిగిన సంగతి మదిలో మెదిలింది.
విశాలదేశపు రాజు, వారి రాజ్యంలో వీరులకు ప్రతి సంవత్సరం పోటీలు పెడుతుంటారు. ఆ పోటీలకు అన్ని రాజ్యాలకూ ఆహ్వానాలు వెళుతుంటాయి.
ఉత్సాహవంతులు ఆ పోటీలలో పాల్గొంటారు. వచ్చిన వారందరికీ శిబిరాలలో తగిన ఏర్పాట్లు చేస్తుంటారు. గెలిచిన వారిని సత్కరించి, ఇష్టమైనవారికి వారి రాజ్యంలో తగిన ఉద్యోగాలిచ్చి సత్కరిస్తుంటారు.
ఆ పోటీలకు సాధారణ వ్యక్తిలా, అనంతుడు లేకుండా వెళ్ళిన తనకు, ఆ పోటీలలో ఒక యువకుని ప్రతిభాపాటవాలు విపరీతంగా ఆకర్షించాయి. వయసులో చిన్నవాడైనా, ఇంకా నూనూగు మీసాలు రానివాడైనా, కంఠస్వరం ఆడపిల్లల స్వరాన్ని పోలినా, పోటీకి నిలబడ్డ వారందరి మీద, నల్లేరు మీద నడకలా గెలుపును సాధిస్తున్నాడు. అప్పటికి మూడు రోజులు గడువగా, వరుస విజయాలతో అందరికన్నా ముందున్నాడు.
ఇంకొక ప్రక్క, తనతో పోటీకి వచ్చిన వారిలో తాను ముందున్నాడు. నాల్గవ రోజు ఆ యువకుడితో తాను పోటీ పడాలి. ఆ యువకుడితో పోటీ పడే క్షణం కోసం తాను ఎదురు చూస్తున్నాడు. అనూహ్యంగా నాల్గవ రోజు ఆ యువకుడు రాలేదు. తనను గెలవలేనని తెలిసి, ఓటమికి భయపడి వెన్నుచూపి వెనుతిరిగాడన్నారు కొందరు. ఆ మాటలు నమ్మలేదు తాను వీరుని చేతిలో ఓటమి కూడా గెలుపే అని పరాక్రమవంతులందరికీ తెలుసు. ఆ యువకుడు అసమాన పరాక్రమవంతుడని తెలుసు. మరి ఎందుకు ఈ రోజు పోటీలకు రాలేదు? కారణమేమై ఉంటుంది? ఎంత ఆలోచించినా సమాధానం దొరకలేదు.
కాని, ఆ రాత్రి శిబిరానికి వెళ్ళిన తనకు, అక్కడి యువకుల గుసగుసలు విని మతిపోయింది. ఆ వీరుడు బాలుడు కాదని, బాలిక అని, విదర్భ దేశపు రాకుమారని ఆ గుసగుసల అంతరార్థం. అప్పుడే విదర్భదేశపు రాకుమారి అంటే ఒక రకమైన కుతూహలం ఏర్పడింది తనలో. ఇప్పుడు సమాలోచనా మందిరంలో ఆచార్యులవారి మాటలు విన్నాక ఆ కుతూహలం ద్విగుణీకృతమైంది. తానే స్వయంగా వెళ్లి ఆ మాటలు నిర్ధారించుకుందామని, దేశసంచారం పేరుతో తల్లిగారి దగ్గర సెలవు తీసుకుని, అనంతునితో కలిసి బయలుదేరాడు తాను.
*
విదర్భ రాజ్యం చేరుకొని సాధారణ బాటసారులలా తానూ, అనంతుడూ పూటకూళ్లమ్మ ఇంట బస చేశారు. నగర సంచారం చేస్తున్నప్పుడు, ఎక్కడ యువకులు గుమి గూడినా, అక్కడ ఆ రాజ్యపు యువరాణి అందచందాలు, సంగీత సాహిత్యాలలో ఆమెకున్న ప్రవేశం, ఆమెను వివాహం చేసుకునే అదృష్టం ఏ దేశ రాజకుమారుడికి ఉంటుందోనని, జరుగుతున్న చర్చలకు తానూ, అనంతుడూ ప్రత్యక్ష సాక్షులు.
“ఆమె చిత్రలేఖనాన్ని చూసి తీరాలట. ఎవరిని చిత్రీకరించినా, వారు ప్రాణాలతో సజీవంగా మన ఎదురుగా ఉన్నట్టే ఉంటుందట. ఒకసారి ఆమె వేసిన పులిబొమ్మను చూసి, పులి అంతఃపురానికి వచ్చిందని చెలికత్తెలు భయపడ్డారట. ఇప్పటికీ చెప్పుకుంటారు. ఈ విషయం నాకెలా తెలుసని అంటున్నావా? మా పిన్నిగారి అమ్మాయి, యువరాణి మందిరంలోనే పనిచేస్తుంది కదా!” అన్నాడు ఆ చెప్పిన వ్యక్తి.
“అవునవును, నేనూ విన్నాను. అసలామెను చూస్తే ఏ దేవకన్యో దిగి వచ్చిందని అనుకుంటారట, కొత్తగా పనిలో చేరిన చెలులు” ఇంకొకడు.
“యువరాణినన్న భేషజం కూడా చూపించరట”
ఇవన్నీ విన్న అనంతుడు “ప్రభూ! మీరామెను ఒకసారి చూడాలి. వీరి మాటలు వింటుంటే, వారు మీ మనసును దోచుకుంటారనిపిస్తుంది నాకు”, అని అనడమే కాదు, మామూలు వ్యక్తుల్లా ఆమెను కలుసుకునే మార్గాల కోసం అన్వేషించసాగాడు.
అనంతునికి చెప్పలేదు గాని, తాను వచ్చినది అందుకే. ఏమి చేసైనా ఒక్కసారి యువరాణిని ప్రత్యక్షంగా చూడాలన్న కోరికతోనే ఉన్నాడు తాను. ఐదేళ్ల క్రిందట బాలుని వేషంలో ఉన్న బాలిక. బాలుడు అనుకునే దూరం నుండి చూసాడు గాని, ఒక బాలికగా చూడలేదు. అప్పలాచార్యుల వారి మాటలు గుర్తుకొచ్చాయి. యుక్త వయసు వచ్చాక ఆమెను అంతఃపురానికి పరిమితం చేశారని.
బహుశా, ఆనాడు ఆమె హఠాత్తుగా అదృశ్యమవ్వడానికి కారణమదే అయుంటుంది. ఇప్పుడామె నవ యవ్వన శోభలతో వెలుగొందుతూ ఉంటుంది. బాణాలు పట్టిన ఆమె చేతులిప్పుడు, సుతారంగా వీణను మీటుతూ ఉండి ఉంటాయి కదా! యువకుల మాటలను బట్టి ఆమె అపురూప లావణ్యవతే కాదు సుగుణాల ప్రోవని తెలుస్తూనే ఉంది. సంస్కారవంతంగా, సంప్రదాయబద్దంగా పెరిగిందని అప్పలాచార్యులవారే చెప్పారు. అందుకే ఆమెను ప్రత్యక్షంగా, ఒక్కసారైనా, కనీసం దూరం నుండైనా చూడాలన్న కోరికను ఆపుకోలేకపోతున్నాడు తాను. ఆమెను కలుసుకునే సుముహూర్తం కోసం ఎదురు చూస్తున్నాడు తాను.
ఇంతలో తాను స్వప్నంలో కూడా ఊహించనిది… నిజమై ఎదుట నిలిచింది. తనువు చేష్టలుడిగి పోయింది. హృదయ స్పందన స్తంభించింది…
(సశేషం)