“శుభ ముహూర్తం”- 6వ భాగం

ధారావాహిక నవల

జరిగిన కథ:

పాణిగ్రహణం చేసుకున్న విదర్భ రాకుమారి, ప్రమీలాదేవి మనసును వేరే వారికి అర్పించానని తెలిపినా, ఆమె కోరిక మేరకు యుద్ధవిద్యలను అనంతుడితో పాటుగా, నేర్పిస్తూ, ఆమె అంటే తనకిష్టమెలా ఏర్పడిందోనని జ్ఞాపకాలలోకి జారుకున్నాడు విక్రమసింహ. తనకు కన్యను వెతికే పనిలో అప్పలాచార్యుల వారు దేశదేశాలు తిరిగివచ్చి, విదర్భ రాకుమారి తనకు సరైన కన్య, గాని వారిది చిన్నదేశం, పైగా ఆమె యవ్వన తొలిదశలో పురుషునిగా యుద్ధ విద్యలు నేర్చుకుందని చెప్పినప్పుడు, ఐదేళ్ల క్రిందట తాము బాలకునిగా అనుకున్న వ్యక్తి ప్రమీలాదేవి అయి ఉండవచ్చని, వివాహానికి ముందు ఆమెనొకసారి చూద్దామని విదర్భదేశానికి పయనమయ్యాడు విక్రమసింహ. ఆపైన ఏమి జరిగిందో మనం కూడా చూద్దాం రండి.

తరువాయి భాగం

విక్రమసింహ స్వప్నంలో కూడా ఊహించనిది… నిజమై ఎదుట నిలిచింది. తనువు చేష్టలుడిగి పోయింది. హృదయ స్పందన స్తంభించింది… విదర్భ రాకుమారిని ఇంత తొందరగా, ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో కలుస్తానని అనుకోనేలేదు.

అసలేమి జరిగిందంటే…
రాకుమారిని కలవడానికి మార్గాల కోసం అన్వేషిస్తూ అనంతుడు ఒకరోజు బయటకు వెళ్ళినప్పుడు, పూటకూళ్లమ్మ ఇంట్లో తాను ఒక్కడూ ఉన్న సమయంలో బాటసారుల మాటలు వినవచ్చాయి. వాటి సారాంశం ఏమిటంటే, రాజధాని వెలుపల ఉన్న అటవీ ప్రాంతంలో ఎలుగుల బెడద ఎక్కువగా ఉందని, రాత్రిపూట ప్రయాణం చెయ్యాలంటే భయంగా ఉందని, అందుమూలంగా వ్యాపారం తగ్గిపోయిందని…

విదర్భదేశానికి అటవీ సంపద ఎక్కువే. అనంతుడెలాగూ ప్రక్కన లేడు. అందుకని సమయంలో ఆ ఎలుగుల బెడద నుంచి ఆ దేశ ప్రజలను రక్షించాలని, పల్లెవానిగా వేషం వేసుకొని అరణ్యం వైపు వెళ్లాడు తాను. అక్కడే తొలిసారి ప్రమీలాదేవిని చూశాడు. అప్పుడే తన మనసులో వేయి వేణువులు మోగినట్లు అనిపించింది. తన కోసమే వారు పుట్టినట్లు అనిపించింది. ఆరోజే నిర్ణయించుకున్నాడు ఆమెతోనే తన జీవితమని.
అంతఃపురాన్ని పరిశీలించటానికి వెళ్ళిన అనంతుడు తిరిగివచ్చాడు.

“మిత్రమా! రాచనగరులో ప్రతివారి కదలికలు సునిశితంగా గమనించబడుతున్నాయి. చిన్న రాజ్యమైనా రక్షణ వ్యవస్థ పకడ్బందీగా ఉంది. అంతఃపురము శత్రుదుర్భేద్యంగా ఉంది. వేరే మార్గం ఆలోచించాలి, యువరాణిని కలవాలంటే” అన్నాడు.

కలవడం అయిపోయింది. ఇంకా ఇక్కడ ఉండి సమయాన్ని వృధా చేయదలచుకోలేదు తాను. యువరాణిని కలిశానని అనంతునికి చెప్పకుండా, “చేయవలసిన అత్యవసర కార్యాలు ఉన్నాయి. మన రాజ్యానికి మరలిపోవాలి” అన్నాడు. ఆవశ్యంగా రాజ్యానికి చేరుకుని, తల్లిగారితో విదర్భ రాజ్యానికి రాయబారం పంపించమని చెప్పాలని, వీలైనంత తొందరగా ముహూర్తాన్ని నిర్ణయించమని చెప్పాలని కూడా మనసులో అనుకున్నాడు.
*

వివాహ విషయంలో విక్రమసింహ నిర్ణయం విని రాజమాత భ్రమరాంబ మిగుల సంతసించారు. వెంటనే అప్పలాచార్యుల వారిని, రాయబారం పంపించారు, ఆ దేశపు యువరాణిని మగధదేశపు పట్టమహిషిగా చేసుకోవాలని తమ కోరికని, అందుకు అంగీకరించ వలసినదిగా వారిని అభ్యర్థిస్తూ, వెలలేని ఆభరణాలను, చీనీ చీనాంబరాలను బహుమతులుగా వెంట పంపించారు.

మహారాజు చనిపోయాక ఇంట్లో జరగబోయే ప్రధమ శుభకార్యం ఇదే. ఇన్ని నాళ్లకు మరలా అంతఃపురం కళకళలాడబోతుంది. వివాహ వేడుకలను ఏ రకంగా ఏర్పాటు చేయాలో, కాబోయే కోడలికి ఏయే ఆభరణాలు సమకూర్చాలో, ఎవరెవరిని వివాహానికి ఆహ్వానించాలో, ఆహుతులకు ఏయే బహుమతులు ఇవ్వాలో… ఇలా ఆలోచిస్తూ రాజమాతకు కాళ్ళు నిలవడం లేదు.

           డా. మజ్జిభారతి

ఇక విక్రమసింహ సంగతి సరేసరి. మేఘాల మధ్యనే ఉన్నాడు. తన కాబోయే ప్రియసఖిని తలుచుకొని పొంగి పోతున్నాడు. విక్రమసింహుని ఆనందం చూసి, “మిత్రమా! మా మహారాజులకు లోకమంతా నందనవనంలా కనిపిస్తుందో! ఏమో! చిరునవ్వు వెన్నెలలు కురిసి, మోములో నిండుకున్న గాంభీర్యం కరిగిపోతుంది. కారణమేమిటంటారు? ప్రేమ సుధారసం గ్రోలడమేనంటారా?” అంటూ అనంతుడు ఆటపట్టించేవాడు.

“మీరు నా ప్రక్కనే ఉన్నా, మీ మనసంతా ఎక్కడో ఉన్నట్టనిపిస్తుంది. రాకుమారిని చూడకుండానే, ప్రేమనే వలలో చిక్కుకున్నారు. చూస్తే విడిచి ఉండగలరా మహారాజా?” అని ఆశ్చర్యపోయేవాడు.
అనంతుని ఆశ్చర్యాన్ని చూసి నవ్వుకునేవాడు విక్రమసింహ.

“జీవితంలో ఒక్కసారైనా, ఈ ప్రేమనే వలలో చిక్కుకోవాలి అనంతా! అప్పుడే జీవితం సంపూర్ణమవుతుంది” రాకుమారి గుర్తుకు రాగానే ఎదలో పొంగుతున్న ఆనందాన్ని, కళ్ళలోనే దాచుకుంటూ, గంభీరంగా అనేవాడు విక్రమసింహ.

అలా, స్నేహితులిద్దరూ, ఒకరు రాజని, ఇంకొకరు సేనాధిపతి అని మరిచిపోయి అప్పలాచార్యుల వారు తెచ్చే శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు.

కాని, వారు అనుకున్నట్లు అప్పలాచార్యులు వారు తెచ్చింది శుభవార్త కాదు. “మన్నించాలి. మేము మా రాకుమార్తెను మీ రాజుకిచ్చి వివాహం జరిపించ లేము. అందుకు మమ్మల్ని మనస్ఫూర్తిగా మీరు మన్నించాలని, సవినయంగా వేడుకుంటున్నాం” ఇదీ అప్పలాచార్యుల వారు తెచ్చిన వార్త.

వివాహ సంబంధాలు ఎన్ని వచ్చినా, త్రోసిపుచ్చే యువరాజు, తనంతట తానుగా ఒక కన్యను వివాహమాడుతానని చెప్పడం, ఆ కన్య సుగుణాల రాశియని తమకు ముందే తెలియడంతో, వారిది చిన్న రాజ్యం, తమతో వియ్యమందే అర్హత లేదన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా, రాయబారం పంపితే వారు తృణీకరించారు. కోరుకున్న వనిత దక్కని, కుమారుని మనసు మళ్లించడానికి, విదర్భ రాకుమారి కన్నా, ఈ రాకుమారి మనకు తగిన సంబంధమని, ఎందరు రాకుమార్తెల చిత్రపటాలను చూపించినా కొమరుని మనసు మళ్లించలేకపోయారు. విదర్భ రాకుమారిని మర్చిపోలేక, పూర్తిగా రాజ్య వ్యవహారాల మీదే దృష్టి పెట్టిన కుమారుడు, ఎప్పటికైనా వివాహం చేసుకుంటాడా! లేదా! చేసుకోకపోతే ఈ దేశ భవిష్యత్తు ఏమవుతుందని దిగులు పడేవారు.

కుమారుని జాతకంలో, దుష్ట గ్రహాలేమన్నా ఉన్నాయేమోనని, శాంతి కోసం యజ్ఞాలు యాగాలు చేయించేవారు. ఎందరో రాకుమార్తెలను విక్రమసింహ యాదృచ్ఛికంగా కలుసుకునేటట్టు ఏర్పాట్లు చేసేవారు. అలా ఎన్నో రకాలుగా, విక్రమసింహ మనసు మార్చడానికి ఆమె చెయ్యని ప్రయత్నాలు లేవు. విక్రమసింహ జాతకంలో వివాహయోగం, పుత్రయోగం స్పష్టంగా ఉన్నా, తాను బ్రతికుండేలోగా కుమారుని వివాహం చూస్తానా లేదానన్న దిగులుతోనే రాజమాత, ఈ లోకాన్ని విడిచిపోయారు.

అంతవరకూ విదర్భ రాజ్యపు తిరస్కరణను మౌనంగా భరించిన విక్రమసింహ, క్షణికావేశంలో తన తల్లి మరణానికి వారే కారణమని, విదర్భరాజ్యంపై దండయాత్రకు వెళ్ళడం, వారిని ఓడించడం, క్షత్రియ ధర్మం ప్రకారం ఓడిపోయిన రాజ్యపు రాకుమారిని వివాహమాడటం అన్నీ, వెంటవెంటనే జరిగిపోయాయి. ఇప్పుడా విషయాలన్నీ గుర్తుకు వచ్చి నిట్టూర్చాడు విక్రమసింహ.
*

జైత్రయాత్రకు వెళ్లే ముహూర్తం దగ్గర పడుతుంది. ఆ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నాడు విక్రమసింహ. రాజ్య వ్యవహారాలను ప్రధానమంత్రి సారంగులవారు నిర్వహించేటట్లు, రాజమాత కాలంలో సర్వ సైన్యాధ్యక్షులుగా ఉన్న అనంతుని తండ్రిగారైన, సోమదత్తుల వారు జైత్రయాత్ర ముగిసే వరకు కోటను, రాజ్యాన్ని సంరక్షించే బాధ్యతను స్వీకరించేటట్లు, కొంత సైన్యం కోటలోనే ఉండేటట్లు, అవసరమైన పక్షంలో నారాయణాచార్యుల వారు మధ్యమధ్యలో రాజ్యానికి వచ్చేటట్లు ఏర్పాట్లను చేసారు. ఇరువది నాలుగు గంటలూ కోటకూ యుద్ధభూమికి మధ్య సమాచారం ఉండేటట్లుగా వేగుల వారిని అప్రమత్తం చేశారు. యుద్ధం జరిగినన్నాళ్లూ రాజ్యంలో ఆహార కొరత లేకుండా ఏర్పాట్లు చేశారు. ఈ రకంగా యుద్ధానికి సర్వసన్నద్ధాలూ చేసుకుంటున్నారు.

ఇంతలో విదర్భ దేశపు కులదేవత నాగాంబిక అమ్మవారి ఉత్సవాలకు ప్రమీలాదేవిని పంపించమని వేడుకుంటూ ఆమె తండ్రిగారు వార్త పంపించారు. ప్రమీలాదేవి విదర్భదేశ ప్రయాణానికి ముహూర్తం సిద్ధమైంది. మరో వారం రోజులలోనే ముహూర్తం. ఈలోగా వీలున్నప్పుడంతా వచ్చి ప్రమీలాదేవికి యుద్ధ విద్యలలో శిక్షణ గరుపుతూనే వున్నాడు విక్రమసింహ.

అనంతుల వారి కన్నా వారి గురువర్యుల దగ్గర శిక్షణ తీసుకోవడం సులువుగా అనిపిస్తుంది రాకుమారికి. శిక్షణ విషయంలో అనంతుల వారు చాలా కఠినంగా ఉంటారు. మహారాణిగా మర్యాదిస్తూనే, విషయానికొస్తే నిర్మొహమాటంగా ఉంటారు. ఏ చిన్న పొరపాటు జరిగినా, దండన ఎక్కువగానే ఉంటుంది. అందుకే వారంటే అందరికీ ఒక రకమైన భయం.

అదే వినయవర్మ గురువర్యులైతే, తప్పు చేస్తే అతి సున్నితంగా మందలిస్తారు. వీరులకు క్షణం ఏమరపాటు కూడదు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలంటూ దిశా నిర్దేశం చేస్తారు. మనిషి ఎంత దృఢంగా ఉంటారో, మనసు అంత సున్నితమని అనిపిస్తుంది ఆయన చెప్పే తీరును బట్టి. వీరి దగ్గర శిక్షణ చాలా సులువు అనిపిస్తుంది.

అలా ఇరువురి దగ్గరా, రాకుమారి ఆమె చెలులు శిక్షణ తీసుకుంటున్నారు.
*

జైత్రయాత్రకి ఏర్పాట్లు జరుగుతున్నాయని రాకుమారికి చెలుల ద్వారా తెలుస్తూనే ఉంది. అదే కాకుండా, గురువర్యులు ఇద్దరు ఆ ఏర్పాట్లలో తల మునకలై ఉండి, శిక్షణనివ్వడం కూడా తగ్గించారు. ఆ ఏర్పాట్లవీ చూస్తుంటే, యుద్ధానికి వెళ్లాలన్న కుతూహలమైతే మెండుగా ఉంటుంది. అందుకు అనంతుల వారు అంగీకరించరని ముందే తెలుసు. నేర్చుకుంటున్న విద్యలో పూర్తిగా ప్రావీణ్యత సాధించక ముందే, బరిలోకి దిగరాదని ఆయన ఆదేశం. నెమ్మదిగా ఉండే వినయవర్మ గురువర్యులను అడిగితే, కాదనరేమోనన్న ఆశతో ఉంది రాకుమారి. వారు ప్రసన్నంగా ఉన్న సమయంలో అడుగుదామని నిర్ణయించుకుంది.

అలా ఒక రోజు వినయవర్మ గురువర్యులు శిక్షణ ఇస్తున్న సమయంలో, “రాజ గురువులు నారాయణాచార్యుల వారు వేంచేస్తున్నారు ప్రభూ” అంటూ ఒక భటుడు అత్యవసర సమాచారం తీసుకువచ్చాడు. శిక్షణా సమయంలో భటులెవ్వరికీ అక్కడకు ప్రవేశం లేదు. అనంతుడికి తప్పించి, ఆఖరికి ఉన్నత ఉద్యోగులకు కూడా ప్రవేశం లేదు. ఎంతటి అత్యవసర కార్యమైనా మహారాజు వచ్చిన వరకు అంతఃపురం బయట వేచి ఉండాల్సిందే. ఆ ఆజ్ఞను ఉల్లంఘించిన వారెవరైనా శిక్షార్హులే. కాని, ఇప్పుడు సందర్భం వేరు. రాజగురువులు ఒక్క క్షణమైనా వేచి ఉన్నారనే విషయం విక్రమసింహకు తెలిస్తే, దానికి కారణమైన వారు ఉరికంబానికి బలి కావాల్సిందే. ఆ విషయం మొదటి నుండీ అందరికీ తెలుసు.

రాజగురువులు, నారాయణాచార్యుల వారంటే మహారాజుకు అంత భక్తి. వారి తర్వాతే, ఎవరైనా. ఒక విధంగా చెప్పాలంటే దైవ సమానులే వారు మహారాజుకు. ఎంతటి రాచకార్యాలైనా, ఎటువంటి సమాలోచనలలో ఉన్నా… చెప్పాల్సి వస్తే, విక్రమసింహ తల్లిదండ్రులైతే… ఏకాంతంలో ఉన్నా, నారాయణాచార్యుల వారు వచ్చారనగానే యెలా ఉన్నవాళ్లు అలాగే వచ్చేవారు, అంతటి భక్తి ప్రపత్తులు ఆయన మీద… విక్రమసింహకు కూడా అంతే. అందుకే గురువుగారి పేరు వినగానే ప్రమీలాదేవికి శిక్షణనిస్తున్న విక్రమసింహ, తన శిరస్త్రాణాన్ని తీసి, చేతితో పట్టుకుని గురువుగారికి ఎదురువెళ్ళాడు.
*

శిరస్త్రాణాన్ని తీసి వడివడిగా ముందుకు వెళ్తున్న, గురువుగా తనకు విద్యలు నేర్పుతున్న ఆ వ్యక్తిని శిరస్త్రాణం లేకుండా మొదటిసారిగా చూసిన ప్రమీలాదేవి సొమ్మసిల్లి పడిపోయింది. చెలికత్తెలందరూ పరిచర్యలు చెయ్యడం మొదలుపెట్టారు ఏమైందేమైందంటూ? ఆ విషయాన్ని కూడా గమనించకుండా, వడివడిగా నడుచుకుంటూ గురువుగారికి ఎదురు వెళ్ళాడు విక్రమసింహ. అటునుండి అటే, యిద్దరూ కలిసి సమాలోచనా మందిరానికి వెళ్లిపోయారు.
*

ఈ హఠాత్పరిమాణంతో మ్రాన్పపడి పోయారంతా. ఎప్పుడూ లేనిది మహారాణికి ఈరోజు ఎందుకిలా జరిగిందని ఆందోళన చెందారు. ప్రమీలాదేవికి విద్య నేర్పే గురువుగారు, వినయవర్మ కూడా వెళ్లిపోవడంతో, అంతఃపురానికి తోడ్కొని పోయి, సపర్యలు చెయ్యగా తేరుకుంది ప్రమీలాదేవి. తేరుకుందే గాని, ముఖంలో ఆందోళన, భయం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. శోకానికి మారుపేరులా కనిపిస్తుంది.

రాజగురువులు వచ్చాక జైత్రయాత్రకు ముహూర్తం నిర్ణయిస్తారని, అందరూ అనుకుంటున్న విషయమే. ఇప్పుడు రాజగురువులు వచ్చారన్నమాట వినగానే, శిక్షణా తరగతుల మధ్యలో వున్న వినయవర్మ హుటాహుటిన వెనుకకు కూడా చూడకుండా వెళ్లి పోవడానికి, రాకుమారి అస్వస్థతకు ఏదైనా సంబంధముందా? అంతకుముందు సర్వసేనాధిపతులు, అనంతుల వారు శిక్షణనిచ్చేవారు. ఆ తర్వాత, వారి గురువులైన వినయవర్మ గారు వస్తున్నారు. అనంతులవారు, వారికిస్తున్న మర్యాదను బట్టి, వారు మహారాజుకు అత్యంత ప్రీతిపాత్రులనే విషయం అర్థమవుతుంది. రాకుమారి అస్వస్థతకు, వినయవర్మకు, ఏదో సంబంధం ఉంది. అదేమిటి? ఎంత ఆలోచించినా, చిక్కుముడి విప్పలేక పోతుంది ప్రియంవద.

చిన్నప్పటినుండి రాకుమారినే సేవిస్తున్న ప్రియంవదకు, రాకుమారి గురించి తెలియని రహస్యాలు లేవు. ఒకవేళ… ఆ ఆలోచన మనసులో పొడచూపగానే, ప్రియంవద ముఖంలో కూడా భయం, ఆందోళన చోటు చేసుకున్నాయి. రాకుమారి ఎందుకంత భయపడుతుందో అర్థమైందిప్పుడు. మహారాజు కోపాగ్నికి, రాకుమారి బలి కాక తప్పదా? ఇన్ని ఆలోచనలు మనసులో సుడులు తిరుగుతుంటే, తన హావభావాలను దాచుకుని, ఏమీ తెలియనట్లు “ఏమైంది రాకుమారి?” అని అనునయంగా అడిగింది.

అంతవరకూ, మనసును ఉగ్గబట్టుకొని వున్న రాకుమారి కన్నీళ్ళ పర్యంతమైంది. అది చూసి బెంబేలెత్తిపోయిన ప్రియంవద, “రాకుమారీ! నా ప్రాణాలు ధారపోసైనా మిమ్మల్ని కాపాడుకుంటాను. దయచేసి జరిగింది చెప్పండన్న” ప్రియంవద మాటలకు, ఏడాది క్రితం జరిగిన విషయం గుర్తుకు వచ్చింది ప్రమీలాదేవికి.

రాజధాని నానుకున్న అటవీ ప్రాంతంలో ఎలుగుల బెడద ఉందని తెలిసి, తండ్రిగారికి తెలియకుండా చెలికత్తెలతో కలిసి పురుష వేషంలో వేటకి వెళ్ళడం… ఆ మహాభాగుల వారు వేసిన బాణం తగిలి, అక్కడ నుండి పారిపోతున్న ఎలుగు తన వైపుకు దూసుకు రాగా, తప్పించుకునే యత్నంలో తాను వారి చేతుల్లో ఒరిగిపోవడం, వారెవరో తెలియకపోయినా… వారి చూపులతో తన చూపులు కలవగానే, ఏనాడూ ఎవరిని చూసినా కలగని అలౌకికానందంమేదో కలిగి, అదే శుభముహూర్తంలా తోచటం, ఆ మూర్తిని మనసులో ప్రతిష్టించుకోవడం జరిగిపోయాయి.

ఇన్నాళ్లూ ఎవరో, ఎక్కడుంటాడో తెలియని, ఆ మహాభాగుడు ఈ రోజు తన కళ్ళెదురుగా… శిరస్త్రాణం తీసి వడివడిగా నడిచి వెళుతుంటే… ఇన్నాళ్లూ తన కళ్ళెదురుగా, తనకే సకల విద్యలనూ నేర్పిస్తుంటే, ఆయనను గుర్తించకపోవడం తన అజ్ఞానానికి ప్రతీక. తాను గాఢంగా ప్రేమించాననుకున్న వ్యక్తి, ఎదురుగా వున్నా గుర్తించలేక పోయిందా? ఇదేనా తన ప్రేమకు పరమార్థం? ఇప్పుడేమని ఆయనకు తన ముఖం చూపించగలదు? ఆయన తనను క్షమిస్తారా?” ఆ ఆలోచనతో మరింత దుఃఖం ముంచుకొచ్చింది.

ఏమైందో చెప్పమని బ్రతిమలాడుతున్న ప్రియంవదతో, “ఏమైందా? నేను చేయరాని నేరం చేశాను. ఘోరమైన పొరపాటు చేశాను. వారి మనసు కష్టపెట్టాను. ఎదురుగా ఉన్నా గుర్తించలేని, అంధురాలినై పోయాను. నా పాపానికి నిష్కృతి లేదు” అని భోరున విలపించ సాగింది ప్రమీలాదేవి. తాననుకున్నది నిజమే. రాకుమారి మనసు దోచుకున్నది వినయవర్మ గురువుగారే. మరిప్పుడు సమస్య ఏ రకంగా పరిష్కారమవుతుంది. ఏమైనా కాని, ముందు రాకుమారిని స్వాంతన పరచాలని,

“ఇలా బెంబేలెత్తిపోతున్నారేమిటి రాకుమారి? ఏమి జరిగిందో చెప్పండి” అనునయంగా అడిగింది ప్రియంవద.

“వారే నా మనసు చూరగొన్న మహాభాగులు. వారిని నేను గుర్తించలేక పోయాను. ఎదురుగా పెట్టుకొని కూడా వారిని తిరస్కరించాను. వారు ఎంత బాధపడి ఉంటారో? ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వారిని నేను మన్నించమని అడగగలను?” రెండు చేతుల్లో ముఖం పెట్టుకొని కన్నీరు కార్చింది ప్రమీలాదేవి.

“ఈ విషయం మహారాజుల వారికి తెలిస్తే, వినయవర్మగారి పరిస్థితేమిటి?” మనసులో అనుకోబోయిన మాట బయటకే అనేసింది ప్రియంవద.

“ఇప్పుడు వారి మాటెందుకొచ్చింది” అయోమయంగా అడిగింది రాకుమారి.

ఈసారి ఆశ్చర్య పోవడం ప్రియంవద వంతయింది. “అదేమిటమ్మా అలా అంటారు? మీరు ప్రేమించినది వినయవర్మ గారినని తెలిస్తే మహారాజుల వారు దానినే రకంగా తీసుకుంటారు? వినయవర్మ గారిని ఏమి చేస్తారోనని భయమేస్తుందమ్మా” ఏమైతే అది అయిందని తన మనసులో నలుగుతున్న ఆలోచనను చెప్పేసింది ప్రియంవద.

ఆ మాటలు విన్న రాకుమారి ఫక్కున నవ్వింది. ఈ పరిస్థితుల్లో నవ్వుతున్న రాకుమారిని చూసి తెల్లబోయింది ప్రియంవద.
తర్వాత భాగం వచ్చే సంచికలో…
*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కోడలమ్మ కథలు (కాలమ్)

“అమరనాథ్ యాత్ర”