ప్రముఖ రచయిత్రి డి. కామేశ్వరిగారి ఇంటర్వ్యూ
తెల్లని దుస్తుల్లో, మేలిమి బంగారు ఛాయలో, ముఖ వర్ఛస్సుతో, నిండైన దేహ సౌష్ఠవంతో, ఆత్మవిశ్వాసంతో వున్న ఆమెను చూడగానే నిండుపున్నమి జాబిలిని చూసిన ఆనందం కలుగుతుంది. 90 యేళ్ళ వయసులో కూడా ఆమె మాటలోని గాంభీర్యం ఏ మాత్రం తగ్గలేదు. ఆమె తెలుగు సీనియర్ రచయిత్రి డి. కామేశ్వరి గారు. 1962 నుంచి గతయేడాది వరకూ రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. ఐదు తరాలను చూసిన ఆమె అప్పటినుంచి ఇప్పటి వరకూ సమాజంలో వస్తున్న మార్పు లను సునిశితంగా పరిశీలిస్తూ సమాజానికి వుపయోగపడే రచనలు చేశారు. గాలి, నిప్పు, నీరు ఈ మూడు అణిగి వున్నంత వరకు ఏమీ కాదు. కానీ చెలరేగితేనే పెనుప్రమాదం. ఈ ప్రమాదాన్ని ముందే గుర్తించి తన రచనల ద్వారా సమాజాన్ని హెచ్చరించిన ద్రష్ట ఆమె. తల్లిపాల నిలువ (mother milk banks), స్వచ్ఛభారత్ లాంటివి దానికి ఉదాహరణలు. ఆమె రచనలు చదవటమంటే ఐదు తరాలుగా వస్తున్న సామాజిక మార్పులను తెలుసుకోవడం. సాహిత్య రంగంలో దాదాపు 63 యేళ్లుగా ఆమె చేసిన ప్రయాణం, మారుతున్న సామాజిక పరిస్థితులు ఆమె తాత్విక దృక్పథాన్ని భావితరాలకు పరిచయం చేయడమే ఈ ముఖాముఖి వుద్దేశం.
ప్ర. నమస్తే! మేడం.
జ. నమస్తే అమ్మా! రండి. కూర్చోండి.
ప్ర. మేడం, మీ తల్లిదండ్రుల, తోబుట్టువుల గురించి చెప్పండి.
జ. మా అమ్మ ప్రభల మాణిక్యాంబ. అప్పట్లోనే ఎనిమిదో తరగతి చదువుకుంది. తండ్రి పేరు ప్రభల రఘురామయ్య. 1920-25 నాటికే ఉన్నత విద్యనభ్యసించి ఇంజినీరుగా పనిచేశారు. నాకు ఒక అక్క, ఒక అన్న,ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. ఇలా మేం ఆరుగురు తోబుట్టువులం. మాది ఉన్నత మధ్యతరగతికి చెందిన కుటుంబం.

ప్ర. మీ పుట్టుక విద్యాభ్యాసం గురించి చెప్పండి.
జ. నేను 22/ 8/ 1935 న తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో మూడో సంతానంగా జన్మించాను. అదే జిల్లా లోని రామచంద్రాపురంలో నా బాల్యం విద్యాభ్యాసం గడిచింది. ఎస్. ఎస్. ఎల్. సి దాకా చదువుకున్నాను. ఆ తరువాత మా తల్లిదండ్రులు నాకు వివాహం చేశారు. చదువుకంటే పుస్తకాలు చదవడం వల్ల ఎక్కువ జ్ఞానం అబ్బింది.
ప్ర. మీ వివాహం ఎప్పుడు జరిగింది? మీ అత్తగారింటి వివరాలు చెప్పండి.
జ. నా వివాహం 1952 ఫిబ్రవరిలో జరిగింది. నా భర్త దుర్వాసుల వెంకటనరసింహం. ఎలక్ట్రికల్ ఛీఫ్ ఇంజినీరుగా ఒరిస్సాలో పని చేసారు. మా వారి తాతగారు దుర్వాసుల నరసింహంగారి హయాం లోనే వాళ్ళ కుటుంబం ఆంధ్రాప్రాంతం నుంచి వెళ్ళి ఒరిస్సాలో స్థిరపడ్డారు. దానికి కారణం అప్పటి జమీందారు రాజావిక్రమదేవ వర్మ అక్కడ స్థిరపడిన తెలుగువారి పిల్లలకు తెలుగు నేర్పించడానికి ఆయనను పిలిపించారట. ఇలా మా పుట్టింటి వారు, అత్తింటి వారు ఉన్నత విద్యావంతులు కావడం చేత ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. మా పెళ్ళి తరువాత నేను కూడా ఒరిస్సాకే వెళ్లిపోయాను. 1984 వరకు అక్కడే వుండి మా ఆయన పదవీ విరమణ తరువాత ఇక్కడ ( హైదరాబాదులో స్థిర పడ్డాము ).
ప్ర. మీ పిల్లల గురించి చెప్పండి.
జ. నాకు ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్దమ్మాయి బి ఎస్సీ ఆనర్స్ చదివింది. అల్లుడు షిప్‌యార్డులో ఇంజనీరు. వాళ్ళు విశాఖపట్నంలో వుంటారు. రెండో అమ్మాయి ఎం.ఏ చదివింది. మా చిన్నల్లుడు ఆర్థోపెడిక్ డాక్టరు. వాళ్ళు హైదరాబాదులో వుంటారు. మా అబ్బాయి ఎం. టెక్ చదివి ఎయిర్ ఫోర్సులో పని చేస్తున్నాడు. ఇదే అపార్ట్ మెంట్స్ లో వుంటాడు.
ప్ర. మీ రచనా వ్యాసంగం ఎప్పుడు? ఎలా మొదలైంది?
జ. నేను ఎప్పుడూ రచయిత్రిని అవుతానని అనుకోలేదు 1962 లో ఒకరోజు అనుకోకుండా ‘ వనితలు- వస్త్రాలు ‘ అన్న చిన్న వ్యాసం రాసి పత్రికకు పంపించాను. అది వాళ్ళు పబ్లిష్ చేసారు. ఆ రోజుల్లో ఎనిమిది రూపాయలు పారితోషికం కూడా పంపించారు. ఆ ఉత్సాహంతో కథ రాయాలనిపంచింది. ఒకరోజు కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు (ఆ కాకర కాయలు ) ‘ ఆనందరావు – ఆకాకర కాయలు ‘ అనే హాస్య కథ మనసులో రూపుదిద్దు కుంది. అది రాసి ఆంధ్రపత్రికకు పంపించాను.వాళ్లు కూడా వెంటనే పబ్లిష్ చేసారు. సామాజిక సమస్యల నేపథ్యంతో కథలు రాయాలని అప్పుడు సీరియస్ గా అనుకున్నాను. అలా 300 దాకా కథలు రాసాను. ఏ పత్రికకు పంపినా వెనక్కి తిరిగి వచ్చేవికాదు.
ప్ర. మీ నవలా రచన నేపథ్యం చెప్పండి.
జ. 1968 అనుకుంటాను. హైదరాబాదులో రచయితల సమావేశానికి నాకు ఆహ్వానం వచ్చింది. నేనే ఆశ్చర్యపోయాను. అక్కడ రామలక్ష్మి నాకు ఎమెస్కో పబ్లిషర్ ను ( M. S. Rao ) పరిచయం చేసింది.ఆయన నన్ను నవల రాయమని అడిగారు. కానీ “నాకు నవల రాయడం రాదండీ ఇప్పటివరకూ కథలే రాసాన “ని చెప్పాను. ( అప్పట్లో ఎమెస్కో వారు ఇంటింటా గ్రంథాలయం పేరిట చిన్న చిన్న పుస్తకాలు ప్రచురించేవారు. వాటి ధర రెండు రూపాయలుండేది. ) అప్పుడు రామలక్ష్మి కథను పొడిగిస్తే నవల అవుతుంది. 120 పేజీలే కదా.. నువ్వు రాయగలవని చెప్పింది. అలా నేను నా మొదటి నవల ‘ కొత్తనీరు ‘ రాసాను తరువాత నేను రాయాలనుకున్న వస్తువు కథలో ఇమడదనుకున్నప్పుడు నవల రాశాను. ఆనాడు ఈనాడు నాకు కథలంటేనే యిష్టం.
ప్ర. మీ రచనలు ఏయే పత్రికలలో అచ్చయ్యాయి?
జ. మహిళా రచయితలే పత్రికలను నడిపించిన కాలమది. అంటే మహిళల రచనలు లేకుండా పత్రికలు వచ్చేవి కాదు. ఎంతలా? అంటే పురుషులు కూడా స్త్రీల పేర్లతో రాయాలనుకునేటంత .. నా రచనలు కూడా భారతి, ఆంధ్రప్రభ, ఆంధ్ర పత్రిక, ఆంధ్రభూమి ఇలా వివిధ పత్రికలలో వచ్చాయి. చాలా నవలలు సీరియల్స్ గా కూడా వచ్చేవి. TV. Smart Phone లు లేని కాలం. ప్రజలకు వినోదాన్ని అందించేవి రేడియో, పత్రికలే కదా..
ప్ర. మీరు రాసిన పుస్తకాలు మొత్తం ఎన్ని? వాటి గురించి చెప్పండి.
జ. కథా సంపుటాలు 13 వచ్చాయి. గతేడాది ‘ భవబంధాలు ‘ వచ్చింది. అదే చివరిదని కూడా అనుకుంటున్నాను. 21 నవలలు వచ్చాయి. ” నావిదేశీ ప్రయాణాలు ‘ పేరిట ఒక ట్రావెలాగ్ పుస్తకం వచ్చింది.’ ప్రేమపక్షి ‘ పేరుతో ఒక కవితా సంపుటి వచ్చింది. మొత్తం 40 పైగా పుస్తకాలు వచ్చాయి.
ప్ర. మీ రచనలు ఇతర భాషల్లోకి అనువాదం అయ్యాయా?
జ. హిందీ, ఇంగ్లీషు, తమిళ, కన్నడ భాషలలోకి నా రచనలు కొన్నిఅనువాదం అయ్యాయి. ‘ జీవితం చేజారనీయకు ‘, ‘ మనసున మనసై ‘ అనే నవలలు, కొన్నికథలు తమిళం లో వచ్చాయి. కన్నడంలో కనీసం పది పుస్తకాలు వచ్చాయి. ‘ ఆజ్ కీ నారీ, ‘ పేరుతో హిందీలో, ‘ లివింగ్ టుగెదర్ ‘ పేరుతో ఇంగ్లీషులో ఒక్కొక్క కథల పుస్తకం వచ్చింది.

ప్ర. సినిమా, టీవీ సీరియల్స్ గా కూడా వచ్చాయి కదా? వాటి గురించి చెప్పండి.
జ. అవునండీ! ‘ కొత్త మలుపు ‘ అనే నవల ‘ న్యాయం కావాలి ‘ అనే సినిమాగా తీశారు. అది అప్పట్లో వంద రోజులు ఆడింది. అదే ఏడాది ఉత్తమ సినీ కథగా అవార్డు గెలుచుకుంది. సితార, వంశీ బర్కిలీ, సినీ హెరాల్డ్, కళాసాగర్,చిత్ర భూమి ( ఆంధ్రభూమిలో ఈ పేరులో సినిమా ప్రత్యేక పేజీ వచ్చేది ) అవార్డులు అందుకున్నాను. ‘కోరికలే గుర్రాలైతే ‘ సినిమా ప్రధాన కథ నాదే.. అయితే ఆ సినిమా దర్శకుడు ఆ థీమ్ మాత్రమే తీసుకొని కథ మొత్తం తానే పెంచి రాశానని చెప్పాడు. ‘ జీవితం చేజారినీయకు ‘ టీవీ సీరియల్ గా వచ్చింది. దానికి నంది అవార్డు, అవార్డుల వచ్చింది . కొన్ని కథలు షార్ట్ ఫిలిమ్స్ గా వచ్చాయి. కొన్ని నవలలు రేడియో నాటికలుగా గంట ప్రసారాలుగా వచ్చాయి.
ప్ర. మీ ఇతర అవార్డుల గురించి చెప్పండి.
జ. 1970 ‘ గృహలక్ష్మి స్వర్ణకంకణం ‘ అవార్డు మొదలుకొని 2025 ‘అభినందన భవాని ‘ అవార్డు వరకు చాలా అవార్డులు వచ్చాయి. అందులో ‘ ఎండమావులు ‘ తెలుగు యూనివర్శిటీ ఉత్తమ రచయిత్రి అవార్డు, వంగూరి ఫౌండేషన్ అవార్డు,అమృతలత ‘ జీవనసాఫల్య అవార్డు ‘ ఉన్నాయి.
ప్ర. మీ రచనల పరిశోధన జరిగిందా?
జ. నా రచనల మీద ఐదుగురు అమ్మాయిలు పరిశోధన చేసి పి.హెచ్ డీ డాక్టరేటు పొందారు.
ప్ర. మీ దృష్టిలో ఉత్తమ సాహిత్యం అంటే ఎలా వుండాలి?
జ. ఖచ్చితంగా సాహిత్యానికి సామాజిక ప్రయోజనం వుండాలి. నేను అదే ధ్యేయంతో రచనలు చేశాను.అపుడే ప్రజలు దానిని ఆదరిస్తారు. ఒక పుస్తకం చదివినప్పుడు పాఠకునికి ఆ రచనలో ఆనాటి సమాజం ఆవిష్కృతం కావాలి. అది పాఠకుణ్ణి ఆలోచింప చేయాలి. సమాజంలోని లోపాలను సరిదిద్దగలిగే శక్తి సాహిత్యానికి వుంటుంది. ఆ దిశగానే రచయితలందరూ రచనలు చేయాలి.
ప్ర. ఐదు తరాలను చూసిన మహిళగా స్త్రీలపట్ల సమాజంలో వచ్చిన మార్పులు చెప్పండి.
జ. మా అమ్మమ్మల, అమ్మల తరంలో స్త్రీలు వంటింటికే పరిమితమయ్యారు. మా తరంలో కొద్దిగా చదువుకొని, సమాజాన్ని పరిశీలిస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేసారు. మా అమ్మాయి తరం వచ్చేసరికి స్త్రీలు కూడా ఉద్యోగాలు చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. దానివల్ల ఇంటా బయటా రెండు రకాలుగా కష్టపడవలసి వచ్చింది. మా మనమరాలి తరంలో అంటే ప్రస్తుతం అమ్మాయిలు కూడా ఉన్నత దువులు చదువుకొని పురుషులతో సమానంగా కష్టపడుతున్నారు. అందుకని యింటిపని కూడా సమానంగా భాగం పంచుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కెరియర్ కే ప్రాధాన్యత యిస్తున్నారు. ఈ రోజుల్లో ఒక ఫోన్ కాల్ తో ఏది కావాలన్నా ముంగిట్లో వచ్చి వాలుతున్నాయి కదా.. అవసరాలు అలా తీరిపోతున్నాయి.
ప్ర. అయితే మరి ఈ కాలంలో ఆడపిల్లలకు కష్టాలే లేవంటారా?
జ. ఎందుకు లేవు? పురుషాధిక్య సమాజంలో స్త్రీకి ఈనాటికీ చెప్పుకోలేని అనేక కష్టాలున్నాయి. అలాగని ఇంకా ఎక్కువ కష్టాకుంటాయి. మనది పితృస్వామ్య సమాజం స్త్రీలకు కష్టాలు ఎప్పుడూ వుంటాయి. నిజం చెప్పాలంటే నేటి ఆధునిక మహిళకు ప్రమాదం మరింత పొంచి వుంది. సోషల్ మీడియా వల్ల స్త్రీలు మరింత జాగ్రత్తగా వుండాలి.
ప్ర. నేటి యువతకు మీరిచ్చే సలహా ఏమిటి?
జ. ఈనాటి యువతకు నేనిచ్చే సలహా ఒక్కటే.. ఇల్లు, సంసారం అన్నాక ఇద్దరు మనుషుల మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి. పంతాలకు, ఇగోలకు పోయి సంసారాలు పాడుచేసుకోకండి. సర్దుబాటు, అడ్జస్ట్మెంట్ తప్పదు. సంసార జీవితం పాడుచేసుకుంటే నష్టం, కష్టం ఆడదానిదే..ఎంత చదివినా సింగిల్ మదర్ ఒంటరి జీవితంలో ప్రతి మగాడు అలుసు తీసుకుంటాడు. కుటుంబ జీవతం పాడైతే పిల్లలు నలిగి పోతారు. కలసి ఉంటే కలదు సుఖం అని నమ్మించికుంటూ సర్దుబాటు తనం అలవరచుకోవాలి. పురుషాధిక్య సమాజంలో స్త్రీకి చెప్పుకోలేని అనేక కష్టాలున్నాయి. అలాగని ఒంటరి జీవితంలో ఇంకా ఎక్కువ కష్టాలుంటాయి. కుటుంబ జీవితం లేకపోతే సమాజంలో విశృంఖలత ఎక్కువవుతుంది. అంచేత యువత జాగ్రత్తపడి కుటుంబం జీవితాన్ని కాపాడుకోవాలి. నేను నా రచనల్లో చెప్పేది అదే.. స్వేచ్ఛ పేరుతో జీవితాలను ఫణంగా పెట్టకూడదు. మనది పురుష సమాజం అరిటాకు ముల్లు సామెత లాగా ఎటు తిరిగీ ఆడపిల్లకే కష్టం. అందుకని ఆడ పిల్లలు అతి జాగరూకతతో వుండాలి. ఎవరో లక్ష్మణ రేఖలు గీయడం కాకుండా తమకు తామే హద్దులు విధించుకోవాలి. అపుడే ఆనందంగా వుండగలుగుతారు.
ప్ర. చివరగా, గతయేడాది వచ్చిన ‘ భవబంధాలు ‘ కథా సంకలనం తర్వాత మీరేమీ రాసినట్టు లేదు. ఎందుకు?
జ. సాహిత్యం రోజు రోజుకూ కనుమరుగువుతుంది. సాహిత్యo, పుస్తకం చదివేవారు కనుమరుగయ్యారు. చదివి గ్రహించాల్సిన యువత అసలు చదవడం లేదు. దాదాపు పదికోట్ల తెలుగు జనాభాలో 500 కాపీలు కూడా అమ్ముడు పోవడం లేదు. అంటే తెలుగుకి పట్టిన, పట్టబోతున్న గతిని ప్రభుత్వాలు గుర్తించడం లేదు. సాహిత్యం పోతే భాష పోతుంది. భాష పోతే జాతి పోతుంది. లిపి పోయి తెలుగు కేవలం మాట్లాడే భాషగా మిగిలి పోయే ప్రమాదం వుందని ప్రభుత్వాలు గ్రహించి మేలుకోవాలి. లిపి లేనిభాషగా తెలుగును మిగలనీయకండి. ఇది నా విన్నపం. అందుకే రాయాలంటే ఆసక్తి పోయింది. ఎవరికోసం రాయాలి? అనిపిస్తుంది. అందుకే రాయడం ఆపేసాను. రాసింది చాలు అనిపించింది. భావి తరాలకు సాహిత్యాన్ని భద్రపరిచి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే..