ఋతువులు నైసర్గిక పరిస్థితిని తెలిపే కాలాలు. ప్రకృతిలో వచ్చే మార్పులనే మన ఋషులు ఖగోళ శాస్త్ర ప్రకారము లెక్కించి వాటికి తగిన పేర్లు ఏర్పాటు చేశారు. వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత్, శిశిరము లని పేరు పెట్టారు. ఈ రుతువుల మార్పును మనం ప్రకృతిలో గమనిస్తూనే ఉంటాం. ఆయా కాలాలలో ఆయా పంటలను కూడా మనం గమనిస్తూనే ఉంటాం. కానీ సైన్స్ ప్రకారము భూమి అక్ష సంబంధ వంపు ఉండటం వలన, భూమి సూర్యుని చుట్టూ తిరిగినప్పుడు భూమి కక్ష ( అక్షాంశాలు, రేఖాంశములు ) యానానికి సంబంధించి రుతువులు ఏర్పడ్డాయి అంటారు. భూమి ఉపరితలానికి చేరుకొనే సూర్యకాంతి తీవ్రతలో ఋతువులు గుర్తింపబడతాయి అని గుర్తించాలి. ప్రాంతీయ వైవిధ్యాల ఆధారంగా వివిధ సంస్కృతులు ఋతువుల సంఖ్య స్వభావాన్ని స్పష్టపరుస్తాయి. వ్యవసాయ సమాజాలకు ఋతువులు తచ్చుగా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి.శీతల దేశాలలో చెట్లు తమ ఆకుల రంగులను మార్చుకుంటాయి ఈ హేమంతంలో.
ఇప్పుడు జరుగుతున్న హేమంత ఋతువు మన తెలుగు నెలల ప్రకారం మార్గశిర పుష్య మాసములు. నాలుగు కాలాలలో ఇది శీతాకాలం. ఇది శరదృతువు తరువాత వసంత కాలానికి ముందు వస్తుంది. మంచు కురిసి చల్లగా ఉండే కాలం. ఈ కాలంలో భూమి అక్షం వల్ల ఉత్తర అర్ధగోళంలో సూర్యుడి నుండి దూరంగా ఉంటుంది. అందువలన పగళ్ళు తక్కువ రాత్రి కాలం ఎక్కువగా ఉన్నట్టుగా ఉంటుంది. దక్షిణార్థ గోళంలో దీని విరుద్ధంగా వేసవి వస్తుంది భూమి సూర్య గమనాలని బట్టి.
భారతీయ ఆధ్యాత్మిక వ్యవస్థ అపరిమితం. ప్రకృతిలో జరిగే మార్పులను వడిసిపట్టుకుని అందులోని రహస్యాలను అంతరార్థాలను మానవులకు తెలియజేస్తుంది. లౌకిక జీవనం పునాదిగా అలౌకిక జీవనానికి మార్గదర్శనం చేయటం మన ఆధ్యాత్మికత గొప్పతనం. వాన జాడలు పూర్తిగా మరుగై అప్పుడే ప్రవేశించిన చలిని రెట్టింపు చేస్తూ ప్రకృతి మాతకు చేమంతుల హారం వేస్తుంది హేమంతం. ఇతరులకు భిన్నంగా హేమంతం మనుషులను దగ్గరికి చేరుస్తుంది. చలి మంటలు దగ్గర అందరూ గుమిగూడి కూర్చుంటారు.ఈ హేమంత ఋతువు అంతా పండుగుల మయం.. పుష్య మాసంలో పెద్ద పండుగ సంక్రాంతి వస్తుంది. మార్గశిరంలో మొదలైన ధనుర్మాసం భోగి పండుగ తో ముగుస్తుంది. సంక్రాంతి సంబరమంతా పల్లెలోనే చూడాలి. వాడ వాడల హరిదాసులు, గంగిరెడ్లు, బుడబుక్కలాళ్లు,, జంగం దేవరలు ప్రత్యక్షమవుతారు. వారికి ఉన్నంతలో అందరూ తిండి బట్ట ఇస్తారు. రైతులకు పంటల రూపంలో ఆదాయం చేతికందే కాలం. ప్రతి ఇల్లు బంధుమిత్రులతో కలకలాడుతూ ఉంటుంది.
ప్రాంతీయ ఆచారాలను బట్టి భారతదేశమంతా పండుగలు జరుపుకుంటారు . అలాగే వంటలు పిండి వంటలు కూడా .యజమానికి రాబడి తో పాటు ఖర్చు కూడా చూపించే మాసం .ఇళ్లన్నీ తోరణాలతో రంగవల్లులతో తీర్చిదిద్దుతారు .కానీ నేటి న్యూక్లియర్ ఫ్యామిలీస్ ,గ్లోబల్ వార్మింగ్ మన పాలిట శాపాలై రుతువులు తమ గతిని తప్పుతున్నాయి .ఇవి జీవవైవిద్యానికి గొడ్డలి పెట్టు .ఇది కాక మనిషి జీవనం యాంత్రికమైపోయింది .విజ్ఞాన పరంగా ఎదగడమే కానీ మానసిక ఒత్తిడిని తెలుసుకోవడం లేదు .. ఇది నేడు అనేక రోగాలకు కారణభూతమవుతోంది .నిన్న మొన్న మనం అనుభవించిన కరోనా భయము వలన స్వేచ్ఛగా కలవడానికి కూడా భయపడే రోజులు వచ్చాయి .మన పెద్దలు శీతాకాలం కోసం చెప్పిన పద్ధతులను ఆశ్రయించి, వంటిల్లు నే ఒక చిన్న సైజు వైద్యశాలగా మార్చుకోవాలి .. పిల్లలు వృద్దులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన కాలం .రోగ నిరోధక శక్తిని పెంచే పుల్లని పళ్ళు ( ఉసిరి, నిమ్మ ,దానిమ్మ,, ద్రాక్ష ) లాంటి పళ్ళు ఈ సీజన్లో ఎక్కువగా వస్తాయి. ధనుర్మాసం నెల్లాళ్లు వైష్ణవ దేవాలయంలో ఉదయం “భోగం “అని బలవర్ధకమైన ప్రసాదాలను పంచుతారు. ఏది ఏమైనా కాలానుగుణంగా నడుచుకోవడం ఆరోగ్యానికి,కుటుంబానికి చాలా మేలు కలగజేస్తుంది. ఋతువులు మన బతుకులను సరి చేయడానికి ప్రకృతి ఏర్పరిచిన వీలునామా.