అమృతలత అపురూప అవార్డు గ్రహీత – అల్లూరి గౌరీలక్ష్మి

కాలానికనుగుణంగా జీవితం పరుగులు తీస్తూనే ఉంటుంది. అది అనుభవాల సమ్మిళితమై, అనుభూతుల ఆలంబనగా, సుఖదుఃఖాల సమాహారంగా ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటుంది. చుట్టూ వున్న పరిసరాలను, పరిస్థితులను గమనిస్తూ వాటి నుండి పొందిన ప్రేరణ కొంతమందిలో రచనాసృష్టి చేయిస్తుంది. అది సాహితీరంగంలో ప్రత్యేక స్థానమై నిలుస్తుంది. అటువంటి వారిలో విభిన్న ప్రక్రియల్లో రచనల ద్వారా తనను తాను నిరూపించుకున్న మరో సాహితీతార శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారు. కథకురాలిగా, నవలాకారిణిగా, కాలమిస్ట్ గా, రాజకీయ వ్యంగ్య వ్యాస రచయిత్రిగా మంచి పేరు సంపాదించుకున్నారు.

అల్లూరి గౌరీలక్ష్మి గారు అంతర్వేదిపాలెంలో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు అల్లూరి నరసమ్మ, లక్ష్మీపతిరాజు గారలు. కేవలం తొమ్మిదేళ్ల వయసు నుండే ఆమెకు పత్రికలు, నవలలు చదవడం అలవాటుగా మారి లైబ్రరీలో ఉన్న పుస్తకాలు మొత్తం చదివేంత ఆసక్తికరంగా పరిణమించింది. పదవతరగతిలో స్కూల్ ఫస్ట్ రావడంతో వాళ్ళ నాన్నగారు మలికిపురం డిగ్రీకళాశాలలో బిఎస్ సి. చదివించారు.

సెక్రటేరియట్ లో ఉద్యోగం చేస్తున్న పెన్మెత్స సుబ్రమణ్య గోపాలరాజు గారితో వివాహానంతరం ఆమె హైదరాబాద్ కు రావడం జరిగింది. ఆ తరువాత అంబేద్కర్ యూనివర్సిటీ నుండి పొలిటికల్ సైన్స్ లో ఎం.ఎ డిగ్రీని, బ్యాచిలర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ లో మరో డిగ్రీ పూర్తిచేశారు. 1984 లో ఆంధ్రప్రదేశ్ హస్తకళల సంస్థ (APHDC)లో ఉద్యోగంలో చేరిన ఆమె మూడు సంవత్సరాలు పనిచేసి, ఆ తరువాత పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (APIIC) లో 33 సంవత్సరాలు పనిచేసి పబ్లిక్ రిలేషన్స్ జనరల్ మేనేజర్
గా పదవీవిరమణ చేశారు.

డిగ్రీ పాసైన తరువాత ‘ఆడది’ అనే కథను చదవడం గౌరీలక్ష్మి గారిలో ఆవేశాన్ని కలిగించింది. ఆ కథలో స్త్రీ నిస్సహాయతను పరిహసిస్తూ “పాపం ఎంతైనా ఆడది!” అనే ముగింపు వాక్యాలు ఆమెను చదివి ఊరుకోనివ్వలేదు. ఆ కథకి ప్రతిగా “పాపం ఎంతైనా మగాడు!” అని ముగిసేలా ‘మగాడు’ అనే కథ రాశారు. ఇది ఆమెలోని స్త్రీవాద తత్త్వానికి, స్త్రీల అభ్యుదయకాంక్షను తెలియజేస్తుంది. ఆ కథ ‘విజయ’ మాసపత్రికలో వెంటనే ప్రచురితమై పలువురి ప్రశంసలు అందుకున్నది. అక్కడి నుండి మొదలైన ఆమె సాహితీరచన ఎక్కడా ఆగకుండా ఈనాటి వరకు సాగుతూనే ఉంది.

వ్యాసాలు
***
       గౌరీలక్ష్మి గారిది విశాలదృక్పథం. ఆమె రచనలన్నీ ప్రత్యేకంగా ఏ ఒక్కదానికో పరిమితం కాకుండా మానవతావాదంతో, సానుకూల పరిణామ దిశగా ఉండడం విశేషం. రాష్ట్రవిభజన సందర్భంగా ప్రజల సామరస్యతను ఆశిస్తూ సత్యం, పరిష్కారం, దృశ్యం, కొత్తమట్టి అని ఆమె రాసిన నాలుగు కథలకు చాలా గుర్తింపు వచ్చింది. ఇదే సందర్భంలో నాలుగు కవితలను, కొన్ని వ్యాసాలను రాసి పేరు తెచ్చుకున్నారు. ఈనాడు, జ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి వంటి ప్రముఖ పత్రికల్లో కె.ఎన్. వై. పతంజలి, శ్రీ రమణ గార్ల స్ఫూర్తితో ఆమె రాసిన రాజకీయ వ్యంగ్య వ్యాసాలు ప్రచురించబడ్డాయి. ‘అడుగెయ్ నిబ్బరంగా’ అనే ఆమె సుదీర్ఘవ్యాసం ‘నెచ్చెలి’ పత్రికలో వచ్చింది.
కథలు
**
       నూటా ఇరవై అయిదుకు పైగా ఈమె రాసిన అనేక కథలు వివిధ దిన, వార, మాస, పత్రికల్లోనూ, అంతర్జాల పత్రికల్లోనూ ప్రచురితమైనాయి. కొంతమంది గళాల ద్వారా యూట్యూబ్ ఛానల్ లోనూ కొన్ని కథలు, నవలలు అందుబాటులో ఉన్నాయి. ‘మెమరీ కార్డ్’ అనే కథను ఎల్. బి. శ్రీరామ్ గారు టెలీఫిల్మ్ గా తీశారు. మరికొన్ని టెలీఫిల్మ్స్ లకు ఆమె మాటలు రాశారు. అంతర్లీనమైన సందేశం ఈమె రచనల్లో ప్రత్యేక తరహాలో నిలుస్తుంది. ఈమె రాసిన అనేక కథలు, నాటికలు, ప్రసంగవ్యాసాలు ఆకాశవాణిలో ప్రసారం అయ్యాయి. కొన్ని కథలు తమిళంలోకి, మరికొన్ని కథలు కన్నడంలోకి అనువదించబడ్డాయి.
అపురూప అవార్డు వచ్చిన సందర్భంగా
        ఆమె రాసిన ‘అమ్మకో అబద్ధం’ కథకు జాగృతి వారపత్రిక దీపావళి కథల పోటీలో ప్రథమ బహుమతి,
‘స్నేహ సౌరభం’ కథకు ఆంధ్రప్రభ కథల పోటీలో, ‘గమ్యం దిశగా’ కథకు ఆంధ్రభూమి పత్రికలో, ‘లోపలస్వరం’ కథకు జాగృతిలో, ‘ఆంధ్రజ్యోతి’కి మల్లెతీగ మాసపత్రికలో  బహుమతులు లభించాయి. ఆంధ్రప్రభ పత్రికలో వచ్చిన ‘స్టేటస్ సింబల్’ కథను శ్రీ రమణ గారు ఎంతో మెచ్చుకున్నారు.
 కవితలు
***
       సాహిత్య అకాడెమీ వారి ఆహ్వానంపై హైదరాబాద్ లో జరిగిన కవితా పఠనం కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్పొరేట్ ఆసుపత్రుల వైనం, సమాజంలో స్త్రీ, పురుష వివక్ష, స్వతంత్రతను కోల్పోయిన వర్తమాన మీడియా దుస్థితికి దర్పణంగా నిలిచే వైవిధ్యభరితమైన కవితలు ఆమె సామాజిక దృక్పథాన్ని తెలుపుతాయి. అనేక కవితలకు బహుమతులు పొందారు.
కాలమ్స్
***
       అంతేకాకుండా ఆమె రాసిన కాలమ్స్ వేటికవే ప్రత్యేకం. సామాజిక పరిణామాలకు స్పందిస్తూ ఎప్పటికప్పుడు ఆమె రాసే కాలమ్స్ ‘సంచిక’ డాట్ కామ్ లో ‘రంగులహేల’ పేరుతో 55 నెలలు వెలువడి ఇప్పటికీ కొనసాగుతుండడం విశేషం. ‘విజేత’ దినపత్రికలో కూడా ‘ఊహలపల్లకీ’ పేరుతో వారం వారం ఆరు నెలల పాటు ఆమె కాలమ్స్ ప్రచురితమైనాయి. ఆమె రాసిన రాజకీయ, వ్యంగ్య వ్యాసాలు పలువురి దృష్టిని ఆకర్షించాయి.
         ముప్పది మూడు సంవత్సరాలుగా సాహిత్యరంగంలో తమ ముద్ర వేసుకున్న గౌరీలక్ష్మి గారు
మనోచిత్రం, వసంత కోకిల, కొత్తచూపు, అమ్మకో అబద్ధం అనే నాలుగు కథా సంపుటాలను వెలువరించారు. అనుకోని అతిథి, అంతర్గానం, ఎదలోపలి ఎద, మలిసంజ కెంజాయ అనే నాలుగు నవలలు, నిలువుటద్దం, నీరెండ దీపాలు, ప్రవాహోత్సవం అనే మూడు కవితా సంపుటాలు, భావవల్లరి, కలర్ఫుల్ కదంబం అనే రెండు కాలమ్స్ సంపుటాలుగా మొత్తం పదమూడు పుస్తకాలు ఇప్పటివరకు ప్రచురించబడ్డాయి.
పురస్కారాలు
*****
        ఇంతటి సాహితీ సేద్యం చేస్తున్న ఆమెను అనేక పురస్కారాలు వరించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ‘శ్రీ విళంబి’ ఉగాది పురస్కారాన్ని, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ‘కీర్తి’ పురస్కారాన్ని ఆమె కైవసం చేసుకున్నారు. అదేవిధంగా లేఖిని సంస్థ నుండి ‘లేఖిని’ పురస్కారం, విశాలాక్షి మాసపత్రిక వారి ‘ప్రతిభా’ పురస్కారం, మల్లెతీగ మాసపత్రిక వారి ‘సాహితీ సేవా పురస్కారం’, వంశీ ఇంటర్నేషనల్ మరియు లేఖిని సంయుక్త ఆధ్వర్యంలో అందుకున్న ‘మాదిరెడ్డి సులోచన’ పురస్కారం, ‘మలిసంజ కెంజాయ’  నవలకు గిడుగు రామమూర్తి ఫౌండేషన్ వారి జాతీయపురస్కారం, ‘ప్రవాహోత్సవం’ కవితాసంపుటికి “ఆరిగపూడి పూర్ణచంద్రరావు ఫౌండేషన్” హైదరాబాద్ వారి జాతీయ పురస్కారం, “కొనిరెడ్డి ఫౌండేషన్ చదువుల సాహిత్య కళావేదిక” ప్రొద్దుటూరి వారి జాతీయ పురస్కారం, రచన పత్రిక నుండి ‘సభాపర్వం’ కథకు కథాపీఠం పురస్కారం ఆమెను అలంకరించాయి.
        “ప్రకృతి ఆరాధన, సంగీత రసాస్వాదనా వ్యసనాలుగా జీవించాలని కోరిక ఉన్నప్పటికీ, సమాజ ఘర్షణలను ప్రత్యక్షంగా చూస్తూ, ఇంతకంటే మనం ఇంకా ప్రశాంతంగా జీవించలేమా? అందుకొరకు ఆలోచించలేమా? అని అనుకున్నప్పుడు తోటివారికి ఏదో చెప్పాలన్న తపన, ఉద్వేగం నన్ను రాయిస్తాయి”. అని చెప్పుకున్న ఆమె సమాజ హితకాంక్ష  అనుసరణీయం. నిరాడంబరత, సహృదయ వ్యక్తిత్వం కలిగిన గౌరీలక్ష్మి గారు మరెన్నో సమాజోపయోగకరమైన రచనలు చేసి విశేషమైన ఖ్యాతిని ఆర్జించాలని కోరుకుంటున్నాను. ఈ నెలలోనే ఈ సంవత్సరానికి గాను (2025) కథా విభాగంలో గౌరీలక్ష్మి గారు అమృతలత అపురూప అవార్డు అందుకున్న సందర్భంగా ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నాను.

Written by Aruna Dhulipala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

విషయసూచిక

అయితే మీరే… (భుజాలు తడుముకుంటున్నారుగా!)