అమ్మకు ప్రేమతో

కథ

హైద్రాబాద్

11-12-2024

 

ప్రియాతి ప్రియమైన అమ్మకు ప్రేమతో,

అమ్మా నా మనసులో ఎగసిపడుతున్న ఆనంద తరంగాలను, చెలరేగుతున్న  భావోద్వేగాలను మాటలతో చెప్పలేక నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. ఏమిటిది అని ఆశ్చర్య పోతున్నావా? అవునమ్మా… నాలో నలిబిలిగా చెలరేగుతున్న భావాలను ఎలా చెప్పాలో నా ఆనందాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియనంత ఆనందంగా ఉన్నాను.

ఉహూ… ఇలా కాదు. ఆ రోజు నుంచి మొదలు పెడతాను.

నా స్నేహితురాలు కళ్యాణికి, నాకూ కాంపస్ సెలక్షన్స్ లో ఒకే ఆఫీస్‌లో ఉద్యోగాలు వచ్చాయని నీకు తెలుసు కదా! ఇద్దరమూ ఆ జాబ్‌లో చేరాము. కాలేజ్ నుంచి వచ్చిన కొత్త, కొత్త జాబ్! ఆడుతూ, పాడుతూ నెల గడిపేసాము. ఆ రోజు మా సాలరీ వస్తుందని తెలిసింది. మొదటి సాలరీ వస్తోందంటే చెప్పలేని ఉత్సాహం! ఆతృత! దానికోసం బోలెడు ప్లాన్స్! ఇంక చెప్పేదేముంది? పొద్దున్నే లేచి, తలస్నానం చేసాక, జుట్టు తడి ఆరకపోతే జబ్బు చేస్తుంది అని  జుట్టుకు సాంబ్రాణి వేసి, చిక్కులు తీసి చక్కగా జడ వేసావు. వద్దమ్మా అంటే వినవు.  చీర కట్టుకోవాలనిపించి గులాబీ రంగు షిఫాన్ చీర కట్టుకున్నాను.నన్ను చూసి, మా రాణీయమ్మ మెరిసిపోతోంది అని నువ్వు, డాడీ మురిసిపోయారు. బామ్మ దిష్టి తీసింది. ఉషారుగా ఆఫీస్‌కు వెళ్ళాను. మధ్యాహ్నానికి నా అకౌంట్‌లో సాలరీ జమ అయ్యింది.ఇక నా సంతోషానికి అవధులు లేవు. అయిదుగంటలకే ఆఫీస్ పని ముగించుకొని, నేనూ, కళ్యాణీ ఐస్ క్రీం పార్లర్ కు వెళ్ళాము. మాకు ఇష్టం అయిన కసాటా తిని, వీకెండ్‌లో సినిమాకు వెళుదామని ప్లాన్ వేసుకొని, ఇంటికి రావటానికి కాబ్స్ బుక్ చేసుకున్నాము. ఇద్దరి కాబ్స్ ఒకేసారి వచ్చాయి. బై చెప్పుకొని, మరో సారి ఒకరికొకరం కంగ్రాట్స్ చెప్పుకొని, ఎప్పుడెప్పుడు ఇంట్లో మా సాలరీ సంగతి మీకు చెప్పాలా అని ఉత్సాహంగా ఎవరి కాబ్ వాళ్ళము  ఎక్కాము.

నేను రిలాక్సెడ్ గా కూర్చొని, నా సెల్‌లో మెసేజెస్ చూసుకుంటున్నాను. కొంచం దూరం వచ్చాక, “మేడం” పిలిచాడు డ్రైవర్. ఏమిటీ అని తలెత్తుతూ టైం చూసుకున్నాను. ఆరున్నర అయ్యింది. మబ్బులు కమ్ముకొని, చిరు చీకటిగా ఉంది. అబ్బ ఈమధ్య ఈ వానలు తెగ ఏడిపిస్తున్నాయి అని విసుగ్గా అనుకున్నాను.కొద్ది దూరంలో సిగ్నల్ కనిపించింది. అక్కడ వెహికిల్స్ ఆగి ఉన్నాయి కానీ వాటికి దూరంగా ఉన్నాము. అది చూస్తూ “ఏమిటీ, స్లో చేస్తున్నావు ఎందుకు? సిగ్నల్‌కు దూరంగానే ఉన్నాము కదా” అని అంటున్నాను, రెప్పపాటులో నా మొహం మీద ఏదో స్ప్రే చేసాడు. ఏమిటీ? ఆపు… ఆపు… అంటున్నాను అంతే…

నాకు తెలివి వచ్చి, అతి కష్టం మీద కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. నా పక్కన నువ్వు కూర్చొని ఉన్నావు. అసలేమయ్యింది నాకు? నేనెక్కడ ఉన్నాను? ఏమీ తెలియటంలేదు…

శరీరమంతా విపరీతమైన బాధ…

ఏదో మత్తుగా ఉంది…

ఉలిక్కిపడి లేచాను…

అమ్మా… అమ్మా…

“బంగారూ…” అంటూ నన్ను నీ దగ్గరగా పొదుపుకున్నావు. నా తల మృదువుగా నిమిరావు. అలా నీ దగ్గరనే, నీ వడిలోనే ఎన్ని రోజులు…

కాదు… కాదు… నెలలు… ఉమ్హూ కాదు సంవత్సరాలు ఉంచుకున్నావు. సేద తీర్చావు. శరీరానికి తగిలిన గాయాలకు మందు పూసావు. మానసిక గాయాలకు ఓదార్పును ఇచ్చావు. నీ కంటి నీరు నా కంట పడకుండా దాచావు.

ఆ రోజులు మర్చిపోగలనా అమ్మా?

ఆ రాత్రి…

రాత్రీ, పగలూ, నన్ను చూసుకుంటున్న నువ్వు అలిసిపోయినట్లున్నావు. నామీద వేసిన నీ చేయి పక్కకు జరిగింది. నువ్వు ఆదమరిచి నిద్ర పోతున్నావు. చిన్నగా లేచి కూర్చున్నాను. పీడకల అనుకో అంటావు కానీ ఎట్లా అనుకుంటాను? ఎట్లా మర్చిపోగలను? నా వైపు నేను చూసుకున్నాను. నా ఈ శరీరం చూసుకుంటుంటే చాలా చీదరగా ఉంది.  ఇక భరించటం నా వల్ల కాదు. లేచి సైడ్ డ్రా లో ఉన్న స్లీపింగ్ టాబ్లెట్ స్ట్రిప్తీసి, చింపి అన్నీ నా చేతిలో పోసుకున్నాను. పక్కన ఉన్న మంచి నీళ్ళసీసాలో నుంచి మంచి నీళ్ళు గ్లాస్‌లోకి వంపుకుంటుంటే, నా అదృష్ఠమో, దురదృష్ఠమో సీసా కింద పడి భళ్ళుమని శబ్ధం చేస్తూ పగిలింది. ఆ శబ్ధానికి నువ్వు లేచావు. డాడీ హాల్‌లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, లైట్ చేసారు.నన్ను చూసి ఒక్క కష్ణం నిర్ఘాంతపోయి, నా చేతిలో నుంచి టాబ్లెట్స్ తీసుకొని,

“రాణియమ్మా… నువ్వు ఒక్క దానివే కాదు, నేనూ అమ్మా కూడా వేసుకుంటాము. ఇవి సరిపోవు. తాతయ్య గదిలో ఉన్నవి తెస్తాను. ముగ్గురం ఒకేసారి వేసుకుందాము ఉండు” అని వెళ్ళబోయారు.

“డాడీ…” భోర్ మంటూ మంచం మీద కూలబడ్డాను. డాడీతో ఎంత చనువుగా ఉండేదానిని! అట్లాంటిది డాడీ దగ్గరకు వెళ్ళాలన్నా భయం తో వణికిపోతున్నాను.

“ఏమిటండీ? మీరు కూడా ఈ పిచ్చి పని?” డాడీ చేతిలోని టాబ్లెట్స్ తీసి, బుట్టలో వేసావు. డాడీ చిన్నగా బయటకు వెళ్ళిపోయారు.

“అమ్ములూ” అంటూ ఏడుస్తున్న నన్ను నీ దగ్గరకు తీసుకున్నావు.

“అమ్మా నాకు బతకాలని లేదు. నా శరీరం చూసుకుంటుంటే అసహ్యం వేస్తోంది.  ఎవరెవరు ఏమేమి…” నా నోటి మీద సున్నితంగా చేయి వేసి, నన్ను మాట్లడనీయకుండా ఆపావు.

“చూడు తల్లీ… మీ స్కూల్‌లో త్రో బాల్ ఆడేటప్పుడు, పక్క అమ్మాయి తోస్తే కింద పడ్డావు. మోచేతికీ, మోకాలికీ ఎంత పెద్ద దెబ్బలు తగిలాయో, నొప్పితో ఎంత విలవిల్లాడిపోయావోగుర్తుందా? మరి ఆ దెబ్బలకు ఆయింట్మెంట్ రాసి, టాబ్లెట్స్ వేసుకొని తగ్గించుకొని మళ్ళీ త్రోబాల్ ఆడి,స్కూల్ చాంపియన్‌గా బహుమతి అందుకున్నావు. మర్చిపోయావా?”

“అదీ ఇదీ ఒకటేనా?” వెక్కుతూ అన్నాను.

“ఏం ఎందుకు కాదు? నాలుగేళ్ళ క్రితం నాకు బ్రెస్ట్ కాన్సర్ వచ్చి, బ్రెస్ట్ తీసేసారు. మరి కీమో థెరఫీలు ఎన్ని తీసుకున్నాను? ఎంత ఇబ్బంది పడ్డాను. తగ్గిపోయింది మళ్ళీ రాకుండా, ఇప్పటికీ మెడిసెన్స్ వేసుకుంటున్నానా లేదా? రెగ్యులర్ చెకప్స్‌కు వెళుతున్నాను. మరి నేను ఆత్మహత్య చేసుకున్నానా? ఇదీ అలాగే అనుకో! జరిగింది మర్చిపో, పీడకల అనుకో అని చెప్పినంత సులభం కాదు కానీ ప్రయత్నం చేయి. మళ్ళీ ఆఫీస్‌కు వెళ్ళు. పనిలో పడు. అన్నీ సద్దుకుంటాయి” అని మృదువుగా చెప్పావు.

“అమ్మో నేను వెళ్ళను. వెళితే ఇంకేమైనా ఉందా? ఒక స్పెసిమన్‌ను చూసినట్లు చూస్తారు. నవ్వుకుంటారు. ఇప్పటికే పరామర్శ కంటూ వచ్చి ఎంత కుళ్ళబొడుస్తున్నారు. వాళ్ళను నువ్వూ, డాడీ నా దాకా రాకుండా పంపేస్తున్నారు. అమ్మో నేను బయటకు వెళ్ళను” తలుచుకుంటూనే వణికిపోయాను.

ఆ పరిసరాల నుంచి దూరంగా తీసుకెళితేనన్నా కోలుకుంటానేమోనని ఢిల్లీ తీసుకొచ్చావు. ఎవరూ తెలియని కాలనీ లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉన్నాము. డాడీ అప్పుడప్పుడు వచ్చి వెళుతుండేవారు. ప్రదేశం మార్పు కావాలనిసిమ్‌లా, డెహ్రాడూన్ అంటూ హిల్ స్టేషన్స్ కు తీసుకెళ్ళి తిప్పావు. నా మనసు సాంత్వన పరిచేందుకు చాలా చాలా ప్రయత్నాలు చేసావు.

ఒకసారి డాడీ వచ్చినప్పుడు, నేను పడుకున్నాననుకొని, నువ్వు డాడీ వడిలో తల పెట్టుకొని ఏడుస్తుండటము చూసాను. ఇక ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. నా మూలంగా మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో అని చాలా బాధ కలిగింది. అప్పుడే పేపర్‌లో “మీ టూ” ఉధ్యమం గురించి చూసాను. పెద్దపెద్ద పొజిషన్ లో ఉన్నవాళ్ళు, సెలెబ్రీటీలూ అందులో పాల్గొన్నారు. ఒకొక్కరూ బయటకు వచ్చి వారి మీద జరిగిన అత్యాచారాల గురించి చెపుతున్నారు. ఆ వార్తలన్నీ చూస్తుంటే, వీళ్ళకంటే అన్ని హంగులు ఉన్నాయి, అండదండ ఉంది. కాబట్టి వారికి జరిగిన అన్యాయాన్ని ఇప్పుడయినా ఎదిరించగలిగిన ధైర్యం వచ్చింది. అదే శ్రామిక వర్గంలో అమ్మాయికి ఇలా జరుగుతే, బస్తీ అంతా ఏకమయ్యి నిందితుని తాట వలుస్తారు. ఎటూ కానీ మనలాంటి మధ్యతరగతి అమ్మాయిలకే అన్ని కష్టాలు. వదిలించుకోలేరు! భరించలేరు! వీళ్ళకు సహాయం చాలా అవసరం. వీరిలాంటి వారికి నేనేమైనా చేయగలనా? అని చాలా ఆలోచించాను. నీతో సంప్రదించాను. నువ్వు నా నిర్ణయం విని చాలా సంతోషించావు.

ఇప్పటికే నా మూలంగా మీకు ఆర్ధికంగా, మానసికంగా చాలా బాధ కలిగింది. ఇక ఇక్కడ వద్దు, హైద్రాబాద్ వెళుదాము అని నేను మిమ్మలిని ఒప్పిస్తే హైద్రాబాద్ వచ్చేసాము. ఇక్కడ అప్పటికల్లా నాకు జరిగిన అత్యాచారం గురించి దాదాపు అందరూ మర్చిపోయారు. హాల్‌లో తాతయ్య లాయర్ కోట్‌తో ఉన్న ఫొటో చూడగానే, నేను లా చదివి లాయర్‌ను అవుతే అత్యాచార బాధితులకు అండగా ఉండి, వారి తరుఫున వాదించి నేరస్తులకు శిక్ష తొందరగా పడేట్లుగా చేయవచ్చు. భాదితుల కొరకు ఒక సెంటర్ ఏర్పరిచి, ఒక డాక్టర్, కౌన్సలర్‌ను ఏర్పాటు చేసి వారిలోని నూన్యతాభావనను పోగొట్టి జనబాహుళ్యంలోకి తీసుకు రావచ్చు. వారికి ఒక దారి చూపవచ్చు. అని పరిపరివిధాల ఆలోచించి నీకు చెప్పాను. నువ్వు ఆలశ్యం చేయకుండా నన్ను లా కాలేజ్ కు తీసుకెళ్ళావు. మామూలుగా అయితే లా అయిదు సంవత్సరాలు చదవాలి. ఏదైనా గ్రాడ్యుయేషన్ కోర్స్ చేస్తే, మూడు సంవత్సరాలు చదువుతే చాలు అన్నారు. ఫారం పూర్తి చేసి, ఎంట్రెన్స్ ఎగ్జాం కోసం ఫీజ్ కట్టావు. అహోరాత్రులు నాతో పాటు కూర్చొని, నాకు జ్యూస్‌లు ఇస్తూ, బలమైన ఆహారం ఇస్తూ కంటికి రెప్పలా చూసుకున్నావు. ఎంట్రెన్స్ మంచి మార్క్‌లతో పాస్ అవుతే నాకన్నా ఎక్కువగా ఆనందించావు.  నా చదువును ఒక తపస్సులా చదివాను. దానికి నీ సహకారం నేను మర్చిపోలేనిది.

అమ్మా ఈరోజు మా కాన్వొకేషన్. స్టేజ్ మీద నాకు గోల్డ్ మెడల్ ఇస్తుంటే “నాకు కాదు మా అమ్మకు ఇవ్వండి” అని అభ్యర్దించి, నిన్ను పిలుస్తే నీ కంటిలో నిలిచిన ఆనందబాష్పాలు నాకు కరదీపికలుగా కనిపించాయి. ఆ స్పూర్తి తో నేను ధైర్యంగా స్టేజ్ మీద నాకు జరిగిన అత్యాచారం గురించి, నీ గురించి చెప్పగలిగాను. నా లాయర్ వృత్తితో నాలాంటి నిర్భయలకు అండగా నిలుస్తాను అని ప్రతిజ్ఞ చేసాను. నీకు తెలుసా అమ్మా, ఇప్పుడుఅత్యాచార నిందితునికి తొందరగా నేర నిరూపణ చేసి, ఉరి శిక్ష విధించాలని ప్రభుత్వము ప్రయత్నం చేస్తోంది. నిర్భయ కేస్‌లో ఒక నిందితుడు పద్దెనిమిది సంవత్సరాలు నిండని మైనర్ అని, అతనిని శిక్షించకుండా బాల నేరస్థుల కేంద్రానికి పంపారు కానీ ఇక నుంచి వారిని కూడా పెద్దవారిగానే పరిగణించి శిక్షించాలని కూడా చట్టం తెస్తున్నారు.“చట్టాల వల్ల బాగయ్యే రోగం కాదు ఇది. మనసమాజం కూడా మారాలి. స్త్రీలకు పురుష బానిసత్వం నుంచి విముక్తి కావాలి. ఆమెను ఒక భోగ వస్తువుగా కాదు మనిషిలా చూడాలి. వంటరిగా ప్రయాణించకూడదు. ఇలా ప్రవర్తించు, అలా మాట్లాడు అంటూ పెట్టే ఆంక్షలను తొలిగించాలి. పురుషుడి దయాదాక్షిణ్యాల మీద బతికే దుస్థితి తొలగాలి. శ్రమ శక్తిలో మహిళ వాటా పెరగాలి. స్త్రీని ద్వితీయశ్రేణిగా చూడకూడదు. ఇలా  ఇప్పుడు చికిత్స జరగాల్సింది సంఘానికి. ఇది అనుకుంతనంత సులభం కాదు. మొత్తం సమాజం గట్టి సంకల్పం వహించాలి. దీనికి మీ న్యాయవాదులు మీ వంతుగా కృషిచేయాలి” అని ఈ మధ్య మన రాష్ట్రపతిద్రౌపతి ముర్ముగారు నల్సార్ కాలేజ్ స్నాతకోత్సవం సంధర్భంగా సందేశం ఇచ్చారు గుర్తుంది కదూ!

ఈరోజు మేము నలుగురం స్నేహితులము కలిసి ఒక సంస్థ ఏర్పరుచుకున్నాము. దానికి “కరదీపిక” అని పేరు పెట్టుకున్నాము.అత్యాచారబాధితుల తరఫున కేస్ తీసుకొని వాదిస్తాము. నిందితులకు ఉరిశిక్ష పడేలా చేస్తాము.నీకు నేను ముందు చెప్పినట్లుగా మేము బాధితులను కృంగిపోకుండా కౌన్సిలింగ్ ఇప్పించటము, వారికి చేయూతనివ్వటమూ చేస్తాము. కాలేజ్ లకు, స్కూల్స్ కు వెళ్ళి అమ్మాయిలు తీసుకోవలసిన జాగ్రత్తలు, గుడ్ టచ్, బాడ్ టచ్ మొదలయిన వాటి గురించి చెపుతాము. అబ్బాయిలకు కూడా తమతోటి అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో చెపుతాము. చిన్నచిన్న స్కిట్స్ చేసి, ప్రెజెంట్ చేస్తాము. ఇది ఒక ఉధ్యమంలాగా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాము. దానికి సరి అయిన ప్లాన్స్ వేసుకుంటాము. ఇలా చాలా ఆశయాలు ఉన్నాయి. మా ఆశయాల సిద్దికై పోరాడుతాము.అంతే కాదున్యాయ వ్యవస్థలో సాంకేతికతను ఉపయోగించుకొని, బాధితులకు సత్వర న్యాయం జరగేలా చూడాలని, దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టటంతో పాటు కేసుల సత్వర పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో నెట్ వర్క్ ఉండాలని, పూర్వ విద్యార్ధులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మహిళా న్యాయవాదులు, న్యాయ విద్యార్థులతో పాటు నెట్ వర్క్ ఏర్పాటు చేయాలని కూడా ఆ సభలో సందేశం ఇచ్చారు మన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముగారు. మేము ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నాము.

మొన్న బామ్మ, తాతయ్య నా పెళ్ళి గురించి నీతో, డాడీ తో మాట్లాడటము విన్నాను. అమ్మా, జీవితంలో పెళ్ళే పరమావధి కాదు. అట్లా అని నేను పెళ్ళికి విముఖురాలిని కాను. నా మీద జరిగిన అత్యాచారం తెలిసి, నన్నూ, నా ఆశయాలను గౌరవించి ప్రేమించేవాడు కలిసినప్పుడు తప్పక చేసుకుంటాను.అంత వరకూ నన్ను పెళ్ళి కోసం ఇబ్బంది పెట్టవద్దని పెద్దవాళ్ళకు చెప్పమ్మా ప్లీజ్!

అమ్మా ఆనాడు తొమ్మిది నెలలు నన్ను నీ కడుపున మోసి, పురిటి నొప్పులు అనుభవించి నాకు జన్మను ఇచ్చావు. ఈనాడు అయిదు సంవత్సరాలుగా నా వెంట ఉండి, నా ట్రామా నుంచి బయట పడవేసి, ఒక న్యాయవాదిగా, సమాజానికి ఉపయోగపడేలా, సాటి స్త్రీలకు కరదీపికలా పునర్జన్మను ఇచ్చావు. నీ ఋణమును నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. మీరు ప్రేమగా రాణియమ్మ అని పిలుచుకునందుకు ఎప్పటికీ మీ రాణియమ్మగానే దేనికీ భయపడక, ఎవరికీ తలవంచక, ధీమాగా ఉంటానని మాట ఇస్తున్నాను.  నీలాంటి అమృతమూర్తి అమ్మను నాకు ప్రసాదించిన ఆ దేవదేవునికి శతకోటి నమస్కారాలు అర్పిస్తున్నాను.

ప్రేమతో,

మీ రాణియమ్మ.

Written by Kamala Kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రశ్న?

వని ‘తలకు’ జోహార్…జోహార్..