ఒడిపిళ్ళు -30వ భాగం

గిరిజన పూజారి పెళ్ళి ముహూర్తాన్ని నిర్ణయించాడు. నాలుగు పెద్ద బూరుగు చెట్లను నరికి, వాటి మొద్దులను బెరడు తీసి,అవి జిగురు బారే వరకు నీళ్ళల్లో నాన పెట్టారు. తర్వాత వాటిని కొత్త గృహం ప్రవేశద్వారం వద్ద నిలువుగా నేలలో పాతారు. చిన్న కొమ్మలతో పరంజాను తయారుచేసి భూమిలో నాటిన నాలుగు కర్రల మీద పరిచారు. దానికి ఒక గుమ్మడి కాయను వేలాడ తీసారు. వృత్తిపరంగా డప్పు వాయించేవారు ఎడతెగకుండా వాయిద్య ఘోషణ వినిపిస్తున్నారు.

తాడి చెట్ల నీడలు పొట్టిగా అవుతున్నాయి. అవి దాదాపు చెట్టు మొదట్లోకి పాకాయి. ఖచ్చితంగా మనిషి ఒకటిన్నర అరచేతి దూరం అంటే జానెడున్నర దూరం నీడల ప్రయాణ సమయంలో శుభముహూర్తం సమీపిస్తూంది. రెంగుపరజ వంకర తిరిగిన ఒక కత్తిని నడుముకు కట్టుకున్న గుడ్డలో దోపుకొని, భూమిలోకి పాతిన బూరుగు స్తంభాలపై పైకి ఎక్కడ ప్రారంభించాడు. అతని దగ్గరలో పూజారి నిలబడి మంత్రాలతో దేవుడిని స్మరిస్తూ ఉన్నాడు. రెంగుపరజ జిగురుగా ఉన్న బూరుగు కర్రలపై కొద్దిదూరం పాకి జారి కింద పడుతున్నాడు. తిరిగి మళ్ళీ పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. మళ్లీ మళ్లీ ప్రయత్నించగా చివరికి అలిసిపోయి, చెమట పట్టిన తర్వాత పైకి చేరుకోగలిగాడు. తన కత్తిని లాగి గుమ్మడి కాయను నాలుగు ముక్కలుగా కోశాడు. చుట్టూ చూస్తున్న బృందం ఒక్కసారిగా కేకలు పెట్టారు. పెళ్లి ప్రారంభోత్సవానికి జరిగే తంతు ఇదంతా.

పెళ్ళి ఊరేగింపు ఇంటి దగ్గర నుండి బయలుదేరింది. పెద్దవారు ముందు నడుస్తుండగా వధూవరులున్న సెల ఏటి తీరానికి చేరారు. అక్కడ తర్వాత వేడుక జరుగబోతోంది. పసుపు ముద్దను వధూవరుల శరీరాలకు పూశారు. వారి తలలకు చిక్కటి ఆముదాన్ని బాగా పట్టించారు. వారిని అక్కడి నుండి మరొక ఒక ముఖ్యమైన నదీప్రవాహం వద్దకు నడిపించారు. అక్కడ ఆ రెండు నదులు కలిసే చోట కమ్లీ, హేమ్లా పెద్దలు వచ్చేవరకు వేచి ఉన్నారు. పెళ్లి పెద్దలు వచ్చి హేమ్లా శరీరము పై నుండి పసుపును తీసి క జోడీకి రాశారు. బాగ్లా తలపైనున్న తీసి కమ్లీ తలకు రాశారు. ఆ తర్వాత కమ్లీ శరీరం నుండి పసుపు, తల నుండి నూనెను తీసి హేమ్లాకు రాశారు. ఆ విధంగా ప్రతీకాత్మకంగా వధూవరులిద్దరూ ఒకటైనట్టు గుర్తు. తరువాత హేమ్లా తన ఎడమకాలితో కమ్లీ కుడికాలిని తొక్కాడు. ఆపై ఆమె ముఖంపై మూడు సార్లు ఉమ్మి వేశాడు. ఆ తరువాత వధువు కూడా అదేవిధంగా వరుడి కాలిని తొక్కి ముఖంపై ఊసింది. వారి మెడలోని హారాలు, చేతి ఉంగరాలు ఒకరికొకరు మార్చుకున్నారు. కమ్లీ చీర కొంగును హేమ్లా వస్త్రపు కొంగుతో కలిపి ముడి వేశారు. ఇద్దరూ కలసి సరస్సులో పవిత్రమైన మునక వేశారు. పూజారి కొన్ని గుడ్లను ఇచ్చి రాహు గ్రహానికి బలి ఇమ్మన్నాడు.

సెలయేటి దగ్గర నుండి వారు పూర్వీకుల సమాధులు ఉన్న మైదానం వద్దకు వచ్చారు. అక్కడ పెద్ద వారితో కలిసి, మరణించిన వారికి, దేవుళ్ళకు బలులు సమర్పించారు. ఆ విధంగా ఆత్మలన్నీ శాంతింపజేశారు. సమాధుల వద్ద కోడిగుడ్లను అన్నాన్ని వినయంగా సమర్పించి. మా హువా మద్యాన్ని నేలపై శాఖగా ఆరపోశారు. వధూవరులిద్దరూ నేలపైకి వంగి చనిపోయిన వారికి నమస్కరించారు.

చివరికి అందరూ కలిసి కొత్త ఇంటికి చేరారు. పూజారి ఎవరికీ అర్థంకాని మంత్రాలను చదువుతూ, వారి తలపై పసుపును బియ్యాన్ని కలిపి చల్లాడు. ఒక పెద్ద నల్ల కోడిపుంజును తెచ్చి దాన్ని బలి ఇచ్చే ముందు వారి తలపై ఉన్న బియ్యపు గింజలను, అది ఏరుకొని తినేలా చేశారు. తర్వాత పూజారి వారిద్దరి చేతులను కలిపాడు, అందరి సమక్షంలో రెంగుపరజ వధువైన కమ్లీ చెవులకు ఒక జత బంగారు రింగులను వేలాడ తీశాడు. బంగారు ముక్కు పోగును ముక్కుకు పెట్టాడు , మెడలో మూడు వెండి హారాలు వేసాడు. అంతటితో పెళ్లి తంతు ముగిసింది. రెంగుపరజ పెళ్లి విందుకు తన బంధువులందరినీ ఆహ్వానించాడు. మద్యం విచ్చలవిడిగా పొంగి పొర్లుతూన్నది. పాటలు నాట్యాలు సాగుతూ ఉండగా వధూవరులు గృహ ప్రవేశం చేశారు.

జోడియపరజ జాతివారు వధూవరులకు సంబంధించిన బంధువులంతా సమీప గ్రామాల నుండి విందుకు వచ్చారు. పెళ్లి వాయిద్యాల శబ్దం పది వసంతోత్సవాలను మించి పోయింది. రెండు మద్యం దుకాణాలు ఊరిలో వెలిశాయి. అందరి మనసులు ఆనందంగా తృప్తిగా ఉన్నాయి. నాట్యాలు పాటలు రాత్రంతా కొనసాగుతూనే ఉన్నాయి. సాలీ తన ఇంటి నుండి బయటకు కదలనే లేదు. కానీ ఆమె చెల్లి మాలీ మాత్రం ఇంటినుండి బయటికి చాలా సార్లు వచ్చి పెళ్లి విందులో ఏమి జరుగుతోందో అన్ని విషయాలు అక్కకు చెబుతోంది.

“అదొక విందేనా ! సగం మంది అతిధులు ఆకలితో తిరిగి వెళ్లారు. వారిని ఎవరు పట్టించుకోలేదూ, భోజనం పెట్టలేదు. రెండు ముసలి మేకలను కోసి కూర వండారు. ఊర్లో వాళ్లంతా ఆ కూర తినలేక నమిలి నమిలి అలసిపోయారు. రామి నాతో చెప్పింది అతిథులకు పోసిన మద్యంలో సెలయేటి నుండి తెచ్చిన నీళ్లు కలిపేరట” అంటూ మాలీ వాళ్ల అక్కకు చెప్పింది.

సాలీ అన్నీ వింటూ బలహీనంగా నవ్వింది. మాలీ తన వ్యాఖ్యానాన్ని కొనసాగించింది.

“పూజారి గొంతు కర్కశంగా ఉండి, ఆ చలిలో ఏమి చెబుతున్నాడో ఎవరికీ వినపడలేదు, ఎంత ఘోరమైన సంగీతం అది, ఆ డప్పులు పగిలిపోయి ఉంటాయి. ఎంత చక్కదనాల దంపతులు కమ్లీ, హేమ్లాలు. ఆమె కనీసం 80 ఏళ్ల దానిలా ఉంది, అతని ముఖం గుర్రం ముఖంలా ఉన్నది” అంటూ చెప్తూన్నది.

వారు తమ బాధనుండి బయటపడి సౌకర్యంగా ఉండేందుకు ఆ మాటలతో ప్రయత్నించారు. విందు జరుగుతూనే ఉంది. మాలీసాలీలు చీకటిలో తడుముకుంటూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని వెక్కివెక్కి ఏడ్చారు. వారి కీచురు ఏడుపులు పెళ్లి భాకాల శబ్దంలో కలిసిపోయాయి.

**** *** *** *** ***

షావుకారు దగ్గరుండే గోటీలు పడుకునే పాకలో నేల మీద సోమ్లా పడుకుని, తనలో తాను గొణుక్కున్నట్టు నెమ్మదిగా “నేను ఏ మాత్రం ఇక నిలబడలేను భూక్యా. మనం ఏదో ఒకటి చేయాలి” అన్నాడు.

“అవును కానీ, ఏమి చేయగలం” ఆన్నాడు భూక్యా.

“అది తెలియదు నాకు. కానీ ఆలోచిస్తాను, ఏదో ఒకటి చెయ్యాలి” అన్నాడు తండ్రి.

“ఏమీ చేయడానికి లేదు నాన్నా. ఆలోచించేది కూడా ఏమీ లేదు. మన దగ్గర డబ్బు లేదు షావుకారుకు చెల్లించడానికి. అంతా అయిపోయింది. మన దగ్గర కేవలం రెండు పంట పొలాలు మాత్రం మిగిలాయి” అన్నాడు.

ఆ పంటపొలాలు రెండు సోమ్లాకి రెండు పక్కటెముకల వంటివి. ఆ నాలుగు ముక్కల బంజరు నేల తండ్రి తన కోసం వదిలి వెళ్ళినది ఉండేది ఒకప్పుడు. కానీ

“గాడబాజాహొల్ల” నది పక్కన కొంత నేలను కఠోర శ్రమతో చెక్కి తనంతట తాను పంట భూమిగా మార్చుకున్నాడు. అక్కడ ఒక చిన్న వంతెన కొన్ని సంవత్సరాలుగా ఉన్నది. నదీ ప్రవాహం యొక్క బురద ఆ నేలలో వ్యాపించి నిలిచి పోయింది. అందుకే అది చాలా లోతైన సారవంతమైన భూమిగా మారింది. అందుకే ఆ రెండు ముక్కల తడి నేల ఆ కుటుంబానికి అంతటికీ గర్వకారణం. అందులో మంచి నాణ్యమైన సన్నని బియ్యం పండుతాయి. వాటిని “ఆహార దేవత” గా పిలుస్తారు వాళ్లు. ఒకవేళ వర్షాలు పడక పోయినా, ఆ నేలలో మాత్రం స్థిరంగా పంట పండుతుంది. వరితో పాటు అవిసెలు, ఆముదాలు కూడా పండుతాయి. సాధారణంగా రైతుల నుండి ఈ తడి నేలపై ఎటువంటి పన్ను వసూలు చేయరు. ఎందుకంటే ఏ సమయంలోనైనా నదీ ప్రవాహంలో ఆ పంటలు కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. కానీ పన్ను వసూలు చేసే అధికారి ఆ నేలకు కూడా పన్ను నిర్ణయించాడు. సోమ్లా ఆ పన్ను చెల్లించాల్సిందే అందువల్లనే ఆ నేల తనకు ఎంతో విలువైనది. అతను ఆకలిని ఎదుర్కొంటున్నా సరే ఉపవాసాలు ఉన్నా సరే వడ్డీ వ్యాపారికి ఆ పొలాన్ని తనఖా పెట్టాలి అనుకోలేదు. కానీ ఇప్పుడు తప్పేటట్టు లేదు.

కొడుకు మాటలకు సమాధానంగా సోమ్లా ఇలా అన్నాడు “భూక్యా నేను ఆ భూమిపై కొంత డబ్బు అప్పుగా తీసుకోవాలి అనుకుంటున్నాను. నేను చాలా అలసిపోయాను ఇంకా గోటీగా ఏమాత్రమూ పని చేయలేను”.

“అవును కానీ నాన్నా! నీకు గుర్తుందా.. ఈ పని ముందే చేయవలసింది. అట్లా భూమి తనఖా పెట్టి ఉంటే, మనం గోటీలుగా మారే అవసరమే ఉండేది కాదు. అప్పుడు ఎంతో కోపంలో ఉన్నావు. ఎవరైనా చెప్పారా ఇలా చెయ్యమని” అన్నాడు భూక్యా.

“నిజమే కానీ నాకు తెలుసు కదా భూక్యా! నువ్వు అన్నీ అర్థం చేసుకోగలగాలి. ఆ పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. సాలీ, మాలీలు ఒంటరిగా ఇంట్లో ఉన్నారు. వారి కోసం మనం తినడానికి ఏమి పెట్టి రాలేదు. వారెంత కష్టపడుతున్నారో, ఒక్కసారి ఆలోచించు” అన్నాడు తండ్రి.

కొడుకు నిశ్శబ్దమై పోయాడు. టిక్యా నిద్రలో గురక పెట్టడం మొదలుపెట్టాడు. కానీ అప్రయత్నంగానే అతని చేయి అచ్ఛాదన లేని తన శరీరం మీద వాలుతున్న దోమల గుంపును తోలుతోంది.

సోమ్లా మళ్లీ ఇలా అన్నాడు “రాత్రి అయిపోతోంది సాలీ, మాలీ పడుకొని నిద్రపోయి ఉంటారు. బయట తలుపు గొళ్ళెం కూడా పెట్టి ఉంటారు. పాపం బిడ్డలు సరైన భోజనాన్ని తిన్నారో లేదో. ఖాళీ కడుపులతో ఉండటం ఎట్లా సాధ్యం” అని ఆలోచిస్తూ భూక్యా గురక పెట్టేది గమనించలేదు.

“నిద్రపోయావా భూక్యా! మన భూమిని తనఖా పెట్టాలనీ, ఆ డబ్బుతో మనం విముక్తులము కావాలనీ , నువ్వు అనుకోవడం లేదా !” అని అడిగాడు.

కొడుకు నుండి సమాధానం రాలేదు.

కానీ అతడు తన ఆలోచనల్లో తన ఊరిని తన ఇంటిని తన పొలాన్ని ఇంటి వద్ద ఉన్న తన బిడ్డలు సాలీ, మాలీలను, చనిపోయిన తన భార్యను కూడా చూసాడు. అతని మనసు షావుకారు ఇంటి నుండి ఎటువంటి బంధనాలు లేకుండా చాలా దూరం ప్రయాణం చేస్తూ పోయింది.

*** *** *** *** ***

మరుసటి దినం ఒక కొత్త రోజు మొదలైంది. కానీ ఆ ముసలి సోమ్లాకు మాత్రం కాదు. అతని పొలాలు తనఖా పెట్టలేకపోయాడు. అతడు విషయమంతా షావుకారుకు చెప్పాలనుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆ విషయంలో ప్రత్యేకమైన ఆసక్తి చూపలేదు. తర్వాత చూద్దాంలే అనుకున్నాడు. మధ్యాహ్నం భూక్యా కలిసినప్పుడు సోమ్లా మనసు మారిపోయినట్టు కనిపించాడు..

“భూక్యా! నేను బాగా ఆలోచించాను. మనం డబ్బును మరొకచోట వెతుక్కోవచ్చు. కానీ మన పొలం లాంటి భూమిని మళ్లీ సంపాదించ లేము. షావుకారుకి భూమిని తనఖా పెట్టడం అంటే దాన్ని పూర్తిగా కోల్పోవడమనే అర్థం. మనకు ఉన్నదంతా నష్టపోతాము ” అన్నాడు తండ్రి.

భూక్యా అసంతృప్తితో “సరే మంచిది, నీకు ఏది మంచిది అనిపిస్తే అదే చెయ్యి. మన దురదృష్టం మనని జీవితకాలం గోటీలుగా ఉంచుతుందేమో” అంటూ తిరిగి పనిలోకి వెళ్ళిపోయాడు.

సోమ్లా ఒంటరిగా కూర్చొని దూరంగా శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నాడు.

భూక్యా చిన్నవాడు అతనికి విషయాలు అర్థం కావు. అతడు తన సౌకర్యాన్ని మాత్రమే ఆలోచించగలడు సోమ్లా పరిస్థితి వేరు. తనకు భూమి అంటే ఒక నేలచెక్క మాత్రమే కాదు, అది అతని శరీరం లోని భాగం. తన పొలంలో ఉన్న ప్రతి గట్టు, ప్రతి గుంట తనకు తెలుసు. పొలంలో ఉన్న ప్రతి ముళ్ళ కంచెకు, ప్రతి చీమల పుట్టకు ఒక చరిత్ర ఉంది. అతడు తన చెమటతో తన పొలానికి నీరు పెట్టాడు. పదును చేశాడు. తన సొంత శరీరం వేడితో దానిని పెంచాడు. అతని నలుగురు పిల్లలు ఆనేల మీదనే పెరిగారు. అతని భార్య సాంబారీ అతనితో సమానంగా పొలంలో పని చేసింది. పొలంలో నాటు పెట్టేటప్పుడు, కలుపు తీసే సమయంలో, అతడు ఇంటికి వెళ్లలేని స్థితిలో, ఆమె అతనికి మధ్యాహ్నం భోజనం తెచ్చేది. అతని పిల్లలు పొలంలో రాళ్లు ఏరడానికి సాయం చేసేవారు. అతడు వారికి కొన్ని విషయాలు చెప్పేవాడు.

“చూడండి పిల్లలూ గుర్తుంచుకోండి ఈ భూమి మనకు తల్లి వంటిది. నేను మీ అమ్మ సాంబారీ ఈ భూమితల్లి ముందు ఏ లెక్కకాదు. ఈరోజు మేమిద్దరం ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కానీ ఈ పంట పొలం మాత్రం మీతో ఉండాలి” అని చెప్పి పంటవేసే ముందు పావురాన్ని , కోడిని భూమి దేవతకు బలి ఇచ్చే వాడు. భూమి దేవత కూడా ఆ బలిని స్వీకరించి, అతనిని హర్షించేది. కావలసినంత పంటను సంపూర్ణంగా అతని పొలాల్లో పండేది.

అటువంటి పొలానికి సంబంధించిన జ్ఞాపకాలను మరిచిపోవడం సాధ్యమా? అతడు వ్యాపార దృష్టితో పొలాన్ని తనకా పెట్టలేకపోయాడు..

*** *** *** *** ***

మార్చి, ఏప్రిల్ నెలలు గడిచి మే నెల కూడా సగం గడిచి పోయింది. ఆకాశంలో పెద్ద పెద్ద భారీ మేఘాలు బూడిద రంగులో ఉన్నాయి. తెలుపు రంగు కలిసిన నల్లటి మేఘాలు చీముపట్టిన గడ్డల్లా పేలిపోతున్నాయి. వర్షం రాకుండా మేఘాలు తేలి పోవడం రైతులకు నిరాశనుకలిగించే జ్ఞాపకాలు మనసుకు బాధను కలిగిస్తాయి. కానీ సంవత్సరం మొత్తంలో ఇది చాలా విశ్రాంతి లేనంతగా పని ఉండే సమయం. పిట్టలు తమ గూళ్లను నిర్మించుకుంటూ ఉంటాయి. గూళ్లలో ఉన్న గుడ్లలో ఉండే చిన్నచిన్న పిల్లలు తమ ముక్కులతో గుడ్డు పెంకులను అసహనంగా కొడుతూ ఉంటాయి. బయటకు వచ్చి మొట్టమొదటిసారి ఈ ప్రపంచాన్ని చూడాలని కోరికతో. బయటకు వచ్చిన పిట్టలు మనుషులంతా విశ్రాంతి లేకుండా చెమటోడ్చి నాగళ్ళతో, గునపాలతో పొలాలను పదును పెట్టి విత్తనాలు వేయడానికి సిద్ధం చేస్తూ ఉండడం చూస్తాయి. అంతేకాదు ఈ సమయంలో స్వార్థపరులైన మనుషులు కొత్తకొత్త ప్రణాళికలతో ఇరుగుపొరుగు వారి భూములను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఆ విధంగా అనేక రకాల వివాదాలు తలెత్తే సమయమది.

షావుకారు తన గోటీలతో తన పొలాల పక్కన ఉన్న కొండ జాతి వారి పొలాలలో కూడా వరి నాటమన ఆజ్ఞ జారీ చేశాడు. చాలా సంవత్సరాల ముందు షావుకారు ఒక మద్యం దుకాణం నడిపే వాడు. కొండ జాతి వారంతా మద్యం కొరకు తమ భూములను షావుకారుకు అమ్మివేశారు. కానీ ఆ పొలాలన్నీ తిరిగి కొండ జాతి వారికి అప్పగించ బడ్డాయి. ప్రభుత్వం జోక్యంతో అధికారులు కొందరు గ్రామాన్ని సందర్శించి భూములకు సంబంధించిన దస్తావేజులు అన్నింటిని పరిశీలించి ఆ గిరిజనుల పొలాల అమ్మకము చెల్లదని, చట్ట ప్రకారము గిరిజనుల భూములను గిరిజనేతరులు ఎవరూ కొనడానికి హక్కు లేదని తీర్పునిచ్చింది. షావుకారు తీవ్రమైన కోపంతో రగిలిపోయాడు. అధికారులంతా బుద్ది లేని వారని ప్రకటించాడు. కానీ న్యాయం అతనికి వ్యతిరేకంగా ఉన్నది. కొండ జాతి వారంతా తమ భూములు తమకు వచ్చినందుకు, ఆనందంతో ఒక ఎద్దును వధించారు. మద్యం సేవించి, డప్పులు మోగిస్తూ, వేడుక చేసుకున్నారు. వారంతా కలిసి అంతకుముందు మోసకారి అమ్మకాలతో షావుకారు అధీనంలో ఉన్న తమ పొలాలలో ఊరేగింపుగా తిరిగారు. దాదాపుగా అటువంటి తంతు మిగిలిన గ్రామాలలో కూడా పునరావృతమైంది. వడ్డీ వ్యాపారి రామచంద్ర పటేల్ తన సమయం కోసం వేచి చూస్తూ ఉన్నాడు. విశేషంగా ప్రతీకార వాంఛతో రగిలి పోతున్నాడు.

షావుకారుకు గురువు వంటివాడు “గరజా సుందరం” అనే పేరుగల ‘రిబినీ’ అంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్ అని అర్థం. శక్తివంతమైన అధికారం గలవాడు. అతను షావుకారుకు ఆదర్శంగా ఉండేవాడు. భయంతోనో అతనికున్న కీర్తి వల్లనో కానీ రామచంద్రబి పటేల్ అతనిని తనకు మార్గదర్శకునిగా భావించాడు. అందుకే అతనిని అనుసరిస్తున్నాడు. గరజ సుందర భారీ బంగారు పోగులను చెవులకు అలంకరించుకునేవాడు. రామచంద్ర పటేల్ కూడా అదేవిధంగా తన చెవులకు బంగారు రింగులను పెట్టుకున్నాడు. ఇద్దరూ ఒకే రకంగా వారి నుదుటిపై పొడవుగా కుంకుమ బొట్లను నామాలుగా ధరించేవారు. పవిత్రమైన పరిమళాలను వెదజల్లేందుకే తాము ఉన్నామని ప్రకటించు కునేందుకు. ప్రతిరోజు స్నానం చేసిన తరువాత ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ పులి చర్మం పై పద్మాసనం వేసుకుని మంత్రాలను చదువుతూ విచిత్రమైన హావభావాలను ప్రదర్శించేవాడు. షావుకారు కూడా అతనిని అనుసరిస్తూ ఉండేవాడు. ఇద్దరూ కలిసి గంజాయి తాగే వారు, ఇంట్లో కాచిన మద్యాన్ని సేవించేవారు. ఇద్దరికీ స్త్రీల పట్ల వ్యామోహం అనే బలహీనత ఉన్నది. ఇద్దరూ యాబై సంవత్సరాల వయసు వారే. ఇద్దరికీ ఒకే రకమైన గుబురు మీసాలు ఉండేవి. అవి నిక్కబొడుచుకొని అడవి పంది శరీరంపై వెంట్రుకలు వలె ఉండేవి. పైన చెప్పినట్టుగా రామచంద్ర పటేల్ అన్నిరకాల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ని అనుకరిస్తూ ఉండేవాడు. కొండ జాతి, పరజ జాతి గిరిజనులను భయపెట్టేందుకు, దూషించేందుకు, వారిని దండించేందుకు అవకాశాల కోసం వారిని స్వల్పంగా రెచ్చగొట్టేందుకు చేసేవి ఈచర్యలన్నీ. వారిద్దరూ కొండ జాతి ప్రజలకు భయాన్ని కలిగించే వాళ్ళే అప్పుడప్పుడు వారిద్దరూ కలిసి గుర్రాలపై స్వారీ చేస్తూ కొరడాతో పదేపదే వాటిని కొడుతూ వింతగా వ్యవహరిస్తూ ఉండేవారు. మెడలో ఎర్రమందారం దండలను ధరించిన కొండ జాతి ప్రజలందరూ పెద్ద పెద్ద కళ్ళతో వింతగా వారిని చూసేలా చిల్లర పనులన్నీ చేసేవారు. గిరిజనులంతా గరజ సుందర అనబడే రెవెన్యూ ఇన్స్పెక్టర్ కి మానవాతీత మంత్ర శక్తులు ఉన్నాయని నమ్మేవారు. రామచంద్ర పటేల్ ప్రోత్సాహంతో వాటిని తమపై ఉపయోగిస్తాడని నమ్మేవారు. ‘గరజ సుందర’ అంటే అతని గర్జన వినసొంపుగా ఉంటుందని అర్థం. ఒక్కొక్కసారి అడవి కాలుతున్న సమయంలో గిరిజనులంతా కొండ వైపు చూస్తూ అదంతా గరజసుందర మంత్రశక్తి వల్లనే అడవి కాలి పోతుందని గుసగుసగా ఆనుకునేవారు. ఏ ఒక్కరు కూడా ఆ ఇరువురి చర్యలను, చేతలను ప్రశ్నించే సాహసం చేసేవారు కారు. ఆ విధంగా వారిని షావుకారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇద్దరూ కలిసి భయపెట్టే వారు.

షావుకారు లేచింది మొదలు పులిని అనుసరిస్తున్న నక్కలాగా రెవిన్యూ ఇన్సిపెక్టర్ ను అనుసరించేవాడు. ఆశ్చర్యం కలిగించే విధంగా కొంతమంది రిబినీలు కొండ జాతి వారిలో మంచి పేరు కలిగి ఉండేవారు. షావుకారు గిరిజనులను మోసం చేసేందుకు సాయం చేసేవారు. చాలా వరకు అధికారులతో షావుకారు మంచి సంబంధాలు పెట్టుకొని అతనికి వచ్చే లాభంలోవాటాను వారికి చెల్లించేవాడు. వారిని అతిథులుగా పోషించేవాడు. ప్రతి అధికారి పర్యటనను ముందుగానే తెలుసుకుని, వారికి కావలసిన వన్నీ సమకూర్చే వాడు. చాలామందికి వేట పట్ల ఆసక్తి ఉండేది. వారి పర్యటనల గురించి వారి ఆసక్తుల గురించి ముందుగానే తెలుసుకున్న షావుకారు, తన పని వాళ్ళను పంపించి అరటి పళ్ళు, సంత్రాలు, సిగరెట్లు , విదేశీ మద్యం వారి కోసం తెప్పించే వాడు. విదేశీ మద్యాన్ని గిరిజనులంతా ‘ఎర్ర నీరు’ అని పిలిచేవారు. పర్యాటకులుగా వచ్చే అధికారులందరికు షావుకారు తన తోటలో నుంచి పెద్ద మొత్తంలో క్యాబేజీలను, సంచుల కొద్ది సన్నటి బియ్యాన్ని, పెద్ద పెద్ద డబ్బాల నిండా నెయ్యిని బహూకరించే వాడు. ఎవరైనా ఒంటరితనంతో బాధపడే వారు ఉంటే షావుకారు వారికి సహచరులను రాత్రిపూట ఏర్పాటు చేసేవాడు.

గరజసుందర అనే రెవన్యూఅధికారి, షావుకారు సమస్యను పరిష్కరించే మార్గాన్ని సుగమం చేసే పద్ధతి చెప్పాడు. ఏ పొలాల నైతే కొండ జాతి వారికి తిరిగి ఇవ్వవలసి వచ్చిందో వాటిని తిరిగి పొందేందుకు ప్రణాళిక వేశాడు. మొదట ‘అమీను’ అంటే పన్ను వసూలు చేసే అధికారిని ప్రసన్నం చేసుకోవాలని అనుకున్నాడు. అతడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ కంటే పెద్ద అధికారి. షావుకారు తన ప్రణాళికను చాలా తెలివిగా ప్రదర్శించి అమీన్ వద్దకు పెద్ద అధికారుల వద్దకు జిల్లాలో ఉన్న అనేక రకాల ఆరోపణలను, కొండ జాతి గ్రామపెద్ద పై ఆరోపణలు చేస్తూ సమాచార నివేదిక పంపాడు. ఆ తర్వాత గ్రామ పెద్దను మార్చి, తమ మాట వినేరకం కొండజాతి వ్యక్తిని గ్రామపెద్దగా ఉంచాడు. మామూలు గిరిజనులు భూములన్నీ గ్రామపెద్దవనీ, అతడు అందరికీ బహుమానంగా భూములను పంపించాడనీ, ఆ భూములకు అసలు యజమాని గ్రామపెద్ద అని నమ్ముతారు. భూములకు సంబంధించిన యజమాన్య హక్కుదారు ఎవరనే దస్తావేజులు ఏవీ ఉండేవి కావు. గ్రామపెద్ద భూములను కౌలుకు ఒకరి నుండి మరొకరికి బదిలీ చేస్తూ ఉండేవాడు. ఎటువంటి ప్రశ్నలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు పాతని గ్రామపెద్ద తొలగించారు. పాపం కొండజాతి గిరిజనులంతా అయోమయంలో పడ్డారు. భూములన్నీ ఇప్పుడు ఎవరికి చెందినవో అర్థం కావడం లేదు.

మూడు సంవత్సరాల ముందు చివరి దశ ప్రణాళిక ప్రారంభమైంది. షావుకారు రెవెన్యూ అధికారులకు భూములపై వచ్చే ఆదాయాన్ని గురించి పునః నిర్ధారణ కోసం అర్జీ పెట్టాడు. అతనికి భూములపై వచ్చే కౌలును పెంచాలనే ఆలోచన ఉంది. షావుకారు రికార్డులలో చూపించిన దానికంటే ఎక్కువ భూములు కలిగి ఉన్నప్పటికీ, అదే సమయంలో భూములపై అద్దెను కొండ జాతి ప్రజలు చెల్లిస్తున్న దానికంటే తక్కువగా చూపించాడు. ఆదాయపు రికార్డులన్నీ హక్కుదారు షావుకారుగా దస్తావేజులు తయారు చేయించాడు. భూములపై అద్దెను కొండ జాతి వారు చెల్లించి నప్పటికీ, షావుకారు చెల్లించినట్లు రికార్డులు తయారు చేశారు.

ఎప్పుడైతే కొత్త గ్రామపెద్దను ఏర్పాటు చేశారో అప్పుడే అతనితో వేలిముద్రలను న్యాయపరమైన దస్తావేజులపై వేయించాడు రెవిన్యూ ఇన్స్పెక్టర్. వాటి ఆధారంగా కొండ జాతి వారు నిబంధనలకు అనుగుణంగా భూములు తమ భూములపై రామచంద్ర పటేల్ కు అద్దె చెల్లించవలసి ఉంటుంది. ప్రభుత్వ అధికారులు చూసినా ఆ విషయాన్ని మినహాయించి మిగిలినది చెల్లించమని ఆదేశిస్తుంది.

అప్పుడు రెవన్యూ ఇన్స్పెక్టర్ ప్రవేశించి, రామచంద్ర పటేల్ పేరు మీద యాజమాన్యపు హక్కుల దస్తావేజులు ఉన్నాయి కాబట్టి, ఆ భూములపై అద్దెను క్రమంగా అతనే చెల్లిస్తున్నాడు అనిచెపుతాడు. ఎటువంటి న్యాయస్థానం కూడా యాజమాన్యం హక్కు కోసం ప్రశ్నించే అవకాశం ఉండదు.

ఆ విధంగా షావుకారు తమ గోటీలను వివాదాస్పదమైన కొండ జాతి వారి భూములలో నాగళ్ళను ఎద్దులను తీసుకొని ఊరేగింపు చేయమన్నాడు. కొన్ని భూముల్లో కొండజాతి వారు ముందే వరి నాటారు. అయినా కానీ వాటిని షావుకారు మళ్లీ దున్నించాడు. కొండ జాతి వారు శాపనార్థాలు పెడుతూ చూస్తూనే నిలబడ్డారు. షావుకారు అతని గోటీలు వారిని కర్రలతో గొడ్డళ్లతో కొట్టడానికి ప్రయత్నించారు. కొండ జాతి వారు ఏమీ చేయలేక పోయారు. గోటీలు తాము గర్వించే, తమ ధైర్యం తమకు ఏ విధంగా ఉపయోగపడకపోగా, షావుకారుకు న్యాయం చేకూర్చింది. ఆ విధంగా వారి అధోగతి పూర్తయింది.

పంచాయితీ కోసం కొండజాతివారు పెద్దలను తీర్పు చెప్పవలసినదిగా అడిగారు. వారంతా షావుకారు తమ భూములను బలవంతంగా ఆక్రమించాడని ఆరోపించారు. షావుకారు భూములన్నీ తమ కుటుంబానికి చెందినవనీ, తన వద్ద రసీదులు ఉన్నాయనీ, తన భూములను వారు పండించుకుంటూ ఉంటే తిరిగి స్వాధీనం చేసుకున్నానని రికార్డులను చూపించాడు. రెండు వైపులా వాదనల తర్వాత గుంపులు గుంపులుగా జనాలు పెరిగారు. ఎవరు ఏమి మాట్లాడుతున్నారో వినపడకుండా గట్టిగా అరుచుకున్నారు.

కొండ జాతి వారి సంప్రదాయం ప్రకారం వారు ప్రమాణం చేశారు. ‘భూమి దేవత’ సాక్షిగా ‘కోడింగమలి’ పర్వతం సాక్షిగా మేము చెప్పినది అబద్ధమైతే, మా చేతులు పడిపోతాయని, మా పిల్లలు పశువులుతో సహా చనిపోతాయనీ, ఆ భూమి అంతా తమదేనని ఏడ్చారు.

అదంతా వింటూ ఉంటే ఆ ప్రమాణం ఎంతో నమ్మదగినదిగా అనిపించినా కానీ, తర్కానికి న్యాయానికి విరుద్ధంగా ఉపయోగం లేనిది. న్యాయపరమైన దస్తావేజులన్నీ షావుకారుకు మద్దతు ఇస్తున్నాయి. అందుకే గెలుపు అతనిది అయింది.

కొండ జాతి గిరిజనులు అలసిపోయే వరకూ అరిచారు ఏడ్చారు ఆ తర్వాత ఇంటికి పోయారు.

అంతటితో పంచాయతీ ముగిసింది.

షావుకారు తన జెండాను భూముల్లో నాటాడు. అన్ని న్యాయస్థానాల అధికారాలు అతని వైపు నిలబడ్డారు. షావుకారు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. “కొంచెమన్నా భూమి మీద న్యాయం నిలిచి ఉన్నదని అన్నాడు. లేకపోతే ఈ కొండజాతి దుర్మార్గులు తన భూములను వదిలి వెళ్లేవారా” అన్నాడు.

ఆ తర్వాత ఒక రూపాయి తన గోటీల వైపు విసిరి, తన గెలుపును వేడుకగా చేసుకోమని చెప్పాడు షావుకారు.

** ** *** ** **

అసహజమైన గాలి గుండ్రంగా తిరుగుతూ రింగులు రింగులుగా హరికేన్ తుఫానుకు సూక్ష్మరూపంగా పొలాలలో దుమ్ము రేపుతూ ఒక దుమ్ము స్తంభం లాగా పైకి లేస్తూ ముందుకు పోయింది. పొలాలో పురుషులు విశ్రాంతి తీసుకుంటున్నారు. అది మధ్యాహ్న భోజనం చేసే సమయం, వారు సొరకాయ బుర్ర నుండి ఆకులతో చేసిన చిన్న చిన్న కప్పులలోకి రాగి అంబలి వంపుకుని తాగుతున్నారు. చిన్న పిల్లలు వారి చుట్టూ మూగారు. గాలి సుడిగాలిలా వారి చేతిలో ఉన్న కప్పులలోకి దుమ్మును విసిరి కొట్టింది. అయినా వారు నవ్వుతూ పెనుగాలి తగ్గిపోయే వరకు ఆగి, తరువాత తమ భోజనాలను కొనసాగించారు. అదొక అద్భుతమైన అనుభవము, తమ సొంత పొలాలలో పని చేయడం. తళతళ మెరిసే ఎండ ఏపుగా పెరిగిన పంట పొలాలలో తరంగాలుగా నృత్యం చేస్తోంది. ఆ తర్వాత పండిన ధాన్యంతో బంగారు పండుగ వలె మారుతుంది. అంతం లేని వారి ఆనందం పంట కోతకు వచ్చి ఇల్లు చేరే వరకు కొనసాగుతూ గతంలోని చేదు అనుభవాలు మసకబారిపోతాయి. పంట పండని పొలాలు కూడా చనిపోయిన వారి పూర్వీకుల ప్రోత్సాహంతో పంటల నిస్తాయి అంతం లేని ఆ కాలా చక్రానికి ప్రతిసారి పంట కోతకు రావడం అనేది ముగింపు. ఆ తరువాత వారు శాంతియుతంగా పంట పొలాలకు లొంగి పోతారు. నేలలో ఉన్న జీవం నిద్రావస్థలో ఉంటుంది. రైతుల చెమటతో దానిని తడిపి, వెచ్చటి శ్వాస అందించడంతో జాగృతమై, విస్తృతంగా మృదువైన పంటలను అందిస్తాయి. పంటకోతల సమయంలో అద్భుతాలు జరుగుతాయి. సామాన్యుని శ్రమకు పులకించిన నేల పంట నివ్వకుండా ఎప్పుడూ విఫలం కాదు. ఆ తర్వాత ఆ పంటపొలాల్లో లెక్కలేనన్ని కాకులు, పావురాలు, చీమలు, మిడతలు ధాన్యాన్ని భుజిస్తాయి. అయినప్పటికీ రైతుకు మిగిలిన పంట తిరిగి మళ్ళీ పంట కోతకు వచ్చే వరకు ఆనందాన్ని అందిస్తుంది. విచారాన్ని అధిగమిస్తుంది.

సేద్యగాడు తన నేలలో పంటల ఆధారంగా సంవత్సరాలను లెక్కిస్తాడు. పంట పండే దాకా వేచి ఉండి ధాన్యం ఇంటికి చేరిన తరువాత మరొకరికి ఆ నేల సాగుచేసే అవకాశం వస్తుంది. ఆ పొలాల్లో ఏం జరుగుతుందో రైతుకు తెలుసు. వాటిపట్ల అనాసక్తంగా ఉంటూ, పడడం లేవడం అనే విషయాలకు అలవాటుపడిన రాజు వంటి వాడు. కానీ అతనికి తెలుసు మరొకరి పంటల కోసం వేచి ఉంటారు కొందరు. పొలాల చుట్టు వేసిన కంచెలు పొదలుగా పెరిగి ఉన్నప్పటికీ, ఎవరో ఒకరు రైతుకు తెలియకుండా అందిన వరకు తెంపుకు పోతారు అది మాత్రం నిజం.

*** *** *** ***

సోమ్లా పొలాలు సేద్యం లేకుండా పడి ఉన్నాయి. తోటి రైతులు ఎవరు కూడా వారి పొలాలను కౌలుకు తీసుకోవడానికి ముందుకు రాలేదు. గ్రామ పెద్ద “అనవసరంగా ఆ నేలల్లో మన శ్రమను ఎందుకు వృధా చేసుకోవడం, అతి త్వరలో లేదా ఆ తరువాత సోమ్లా పొలాలను అన్నింటిని మనలో ఒక్కరికి అప్పగించ వలసిందే” అని అన్నాడు. సాలీ తన ఇంట్లో నుండి పొరుగువారి పొలాలను చూస్తూనే ఉంది. విత్తనాలు మొలకెత్తి వరి, రాగుల పంట పచ్చగా ఎదిగింది. తమ భూములు బంజరు భూములుగా నిలిచిపోయాయి. వారికి సరైన ఆహారం దొరకక కొన్ని నెలలు అయింది. అక్క చెల్లెల్లు ఇద్దరు మామిడి పొడి, చింతగింజల పొడి, ఆకులు వండుకు తింటూ జీవిస్తున్నారు. కొన్నిసార్లు కొంత తేడా కోసం, అడవి కందిరీగల గుడ్లను వాటి గూళ్ళ నుండి తెచ్చి పులుసు పెట్టుకొని తింటున్నారు. వారిద్దరూ ఆకలిని భరించడానికి అలవాటు పడ్డారు.

కానీ సంత రోజున ఇప్పటికీ కూడా మెరుగైన బట్టలు వేసుకొని, ఇత్తడి రాగి నగలు ధరించి. వారి ముఖాలను శుభ్రంగా కడుక్కొని పసుపు రాసుకుని, తలకు నూనె రాసి జడలు వేసుకుని, ఎరుపు రంగు పూల గుత్తులను జడలో పెట్టుకుని ఆనందంగా సంతకు బయలుదేరుతారు. వారిద్దరూ గతంలో వలెనే అన్ని దుకాణాల ముందు తిరుగుతారు. మట్టి గాజుల దుకాణాలు, మిఠాయి దుకాణాలు, బిర్యాని, మౌలాసాలు అమ్మే దుకాణాలు చూస్తూ తిరుగుతారు. కానీ ఏ వస్తువును కొనలేరు. వారి ఇంటి నుండి సంత ఎనిమిది మైళ్ళ దూరంలో ఉంది. కానీ అది వారికి చాలా దగ్గరలో ఉన్నట్టనిపిస్తుంది. సంతరోజు మాత్రమే వారు నవ్వగలరు. మిగిలిన వారితో కలిసి మాట్లాడడం, పాటలు పాడడం వంటివి జరుగుతాయి. వారు జీవించి ఉన్నట్టు అనిపించేందుకు అదొక మంచి అనుభవం.

ఒకసారి పంటపొలాలలో గింజ‌లు మొలకెత్తిన తర్వాత, పొలాలలో వీరి సేవలు అవసరమవుతాయి. కలుపు తీయడానికి, నాటు వేయడానికి వ్యవసాయ కూలీలు అవసరం. అప్పుడు కావలసినంత కూలిడబ్బు సంపాదించగలరు. ఆకలిని తరిమేయవచ్చు .

కానీ సాలీ మనసులోని గాయం ఇంకా పచ్చిగానే మిగిలి ఉంది.

ఒకరోజు మధ్యాహ్నం హేమ్లా తన కొత్త ఇంటి ముందు, వాకిట్లో కూర్చుని ఉన్నాడు. కమ్లీ అతడికి వేడినీటితో స్నానం చేయిస్తుంది. మట్టి కుండ నుండి నీటిని, సొరకాయ బుర్రతో అతని మీద గుమ్మరిస్తున్నది. పరజజాతి మహిళలందరూ వారి భర్తలకు ఈ విధంగా స్నానానికి సాయం చేస్తూ ఉంటారు. ఒక చిన్న కట్టె ఎత్తు పీటమీద కాళ్లు చాచుకుని కూర్చున్నాడు హేమ్లా. అతని నడుముకు చిన్న తుండుగుడ్డ కట్టుకుని ఉన్నాడు. కమ్లీ సొంత స్పృహ లేకుండా అతని వీపును బలంగా రుద్దుతోంది.

తరచూ ఈ సంసారిక దృశ్యాలను చూస్తూ సాలీ వేగంగా ఆ ఇంటి ముందు నుండి సెలయేరు వైపు నడిచేది. కమ్లీ ఆమెతో పాత సంబంధాలను గుర్తుపెట్టుకుని సరసంగా ‘ఫైన్ ప్యాడీ’ అంటే ‘మంచి వరి’ అనే ముద్దుపేరుతో పిలిచేది. కానీ సాలీ వేగంగా అడుగులు వేస్తూ ముందుకు సాగేది. హేమ్లా కమ్లీల నవ్వులు తన చెవిలో మోగుతూ ఉండేవి. ఎప్పుడూ శూన్యంలో ఉంటూ దేనికీ స్పందించడం లేదు ఆమె.

**** **** **** *****

ఒక సాయంత్రం సాలీ పొరుగింట్లో ఉండే ‘దీప్తిమోని’ వారి ఇంటికి వచ్చింది. ఆమెకు కట్టె నిప్పులు కొన్ని అవసరమయ్యాయి. తన ఇంట్లో సొంతగా పొయ్యి అంటించడానికి. ఆమె ‘డోంబ్ బారిక్’అనే గ్రామ సమాచారకర్త (విలేజ్ మెసెంజర్) కూతురు. దీప్తిమోని తరచూ అందరి ఇళ్లకు వెళుతూ వార్తలు సేకరించి ముచ్చట్లు చెప్తూ ఉంటుంది.

“మాథియా అనబడే క్రిస్టియన్ మత ప్రచారకుడు ఈరోజు మన ఊరికి వస్తాడట” అని ఆమె మొదలు పెట్టింది.

‘ఔనా’ చాలా సామాన్యంగా అన్నది సాలీ.

“అతడు కోరాపుట్ , లచ్చింపూర్ నుండి తిరిగి వస్తున్నాడు” అంటూ దీప్తి మోని కొనసాగించింది.

“అయితే”అన్నది సాలీ.

“చాలామంది మన జిల్లా నుండి అస్సాంకు వెళ్తున్నారని, అక్కడ కొత్త రోడ్డు ఒకటి నిర్మించ పోతున్నారనీ, అతడు చెప్పాడు” అన్నదామె.

సాలీ వింటూ ఊం కొడుతోంది.

“మనుషులను తినే పులి, లచ్చింపురం దగ్గర మరొకరిని చంపిందట. పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ విచారణ కోసం వెళ్ళాడట” అన్నది దీప్తి.

“ఏమి విచారణ” సాలీ ప్రశ్నించింది.

“ఒక ఎడ్ల బండి నిండా దాన్యం దోచుకున్నారట, ‘పోడగాడ్’ సంతలో ” దీప్తి సమాచారం.

“ఎవరి దట బండి ధాన్యం” అని సాలీ అడిగింది.

“నాకు తెలవదు. కానీ ప్రభుత్వంవారు నారింజ నారును, ముల్లంగి విత్తనాలను రైతులకు పంచుతున్నారట” అన్నది దీప్తి.

“నిజంగానా అన్నది” సాలీ.

“పన్ను వసూలు చేసే అధికారి, ‘డుంబగూడా’ గ్రామంలో వసూళ్లు మొదలు పెట్టాడట” అన్నదామె మళ్ళీ. “ఎప్పుడు” సాలీ ప్రశ్న.

“అతి త్వరలో ధరండోర్ దగ్గర జాతీయ రహదారిని మరమ్మత్తు చేస్తారట. గుత్తేదారు గుమస్తా- కూలీల కోసం అన్ని ఊర్లు తిరుగుతున్నాడట. మరమ్మత్తు పనికి వస్తానన్న వారికి ముందస్తుగా కొంత డబ్బును ఇస్తున్నాడట. వేలకొద్దీ రూపాయలను ఒక సంచిలో వేసుకుని, మోసుకుంటూ తిరుగుతున్నాడట” అన్నది దీప్తి.

“అతడు మన ఊరికి వస్తాడని, నువ్వు అనుకుంటున్నావా” అని సాలీ ప్రశ్నించింది.

“నువ్వు అనుకున్న దానికంటే చాలా తొందరగా వస్తాడు” దీప్తి సమాధానమిచ్చింది.

“స్త్రీలకు రెండు అణాలు, పురుషులకు మూడు అణాల కూలీని చెల్లి ఇస్తారట” అన్నది మళ్ళీ.

“కానీ ధరండోర్ చాలా దూరం కదా ! ప్రతిరోజు పని తర్వాత రాత్రికి ఇంటికి రాగలరా” అని అడిగింది సాలీ.

“ఎందుకు రావాలి ? ప్రతి ఒక్కరికి అక్కడ క్యాంపులో వసతి ఉంటుంది” అని చెప్పిందామె.

“ఎటువంటి పని చేయవలసి ఉంటుంది ” అని అడిగింది సాలీ.

“చాలా సాధారణమైన పనులు. గంపలతో కొందరు మట్టిని, కొందరు ఇసుకను మోయాలి, కొందరు నీటిని చల్లాలి. ఇటువంటివే ఇంకా కొన్ని పనులు” దీప్తి సమాధానం.

“మన ఊరి నుండి ఎవరైనా వెళ్తున్నారా?” సాలీ ప్రశ్న.

“తప్పకుండా పోవచ్చు. చాలామంది మన వీధి నుండి కూడా వెళుతున్నారు”

అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ చాలా ప్రశ్నలు వేశారు.

దీప్తిమోని గంట కంటే ఎక్కువ సేపు కూర్చొని వారితో మాట్లాడింది. అప్పటికే మండుతున్న భస్మం చల్లటి బూడిదగా మారింది.

ఈ వార్త చాలా వేగంగా గ్రామాల్లోవ్యాపించింది. గుత్తేదారు కార్మికులను నియమిస్తూ ఉన్నాడని, వేతనాలు చాలా బాగున్నాయని, రెండు అణాలు అంటే ఒకరు తినడానికి మాండియా కొనుక్కోవచ్చు తలకు రాసుకుని ఆముదాన్ని, ఇంకా సబ్బులను కూడా కూడా కొనవచ్చు. పంట కోతకు రాకముందు పనులు లేని నెలల్లో వేరేపనుల మీద ఆధారపడవలసిందే. చాలామంది అడవిలో కంద మూలాలను తవ్వుతారు. ఇది చాలా మంచి ఆహారం కూడా.

క్యాంపులో జీవితం ఒక దీర్ఘ కాలిక సెలవుదినం వంటిది. అక్కడ సంగీతం, డాన్సులు, కావలసినంత మద్యం లభిస్తుంది. అమ్మాయిల పట్ల విస్తారంగా శ్రద్ధ కనబరిచే పురుషులు కూడా ఉంటారు. అక్కడ డబ్బు అనేది అన్నింటికీ మారకద్రవ్యంగా మారుతుంది.

ఒక మండే మధ్యాహ్నం సాలీ, మాలీ అడవి గడ్డల కోసం తవ్వుతున్నారు. ఎర్రటి గులకరాళ్ళతో కూడిన కఠినమైన నేల. వారి సున్నితమైన రక్షణ లేని పాదాలకు గుచ్చుకుంటున్నాయి. ఒంటరితనం, ఆయాసం కలిగిస్తోంది. నదీతీరం ఎండిపోయి కొండచరియల పక్కన అంతా ఖాళీగా కనిపిస్తూన్నది. కానీ కొన్ని వాడిపోయిన ఆకులు ఆఖరి గ్రేయింగ్ అనే చేపల వలె కనిపిస్తున్నాయి. నేలంతా ఇతరులు తవ్వడం వల్ల గుంటలు గుంటలుగా కనిపిస్తున్నది. అక్కడ ఇక్కడ ఏమీ దొరికే సూచనలు కనిపించడం లేదు.

సాలీ, మాలీలు ఒక చెట్టు నుండి మరొక చెట్టు పైకి దాహంతో ఎగురుతున్న రెండు కొంగల వలె తిరుగుతున్నారు. మండుతున్న ఎండలో లెక్కలేనంత అలుపుతో, బలహీనమైన కాళ్ళతో, వెక్కిరించినట్టుగా, నిస్సత్తువుగా జారుతున్న భుజాలతో, నోటిని తెరుస్తూ మూస్తూ తిరుగుతున్నట్టు ఉన్నారు. వారు కొద్దిసేపు ఆకులు లేని ఒక చెట్టు నీడన కూర్చున్నారు. తరువాత మళ్లీ వెతకడం మొదలుపెట్టారు.

కానీ వారికి ఎక్కడ ఏ దుంపలు దొరకలేదు.

“మనం చాలా దూరం వచ్చాము, వెనుకకు తిరిగి ఇంటికి వెళ్ళిపోదామా అక్కా!” అన్నది మాలీ.

“వెనక్కి పోయి ఏమి తింటాము” అని అడిగింది సాలీ.

కొద్దిసేపు మౌనం తరువాత “నిజంగానే గుత్తేదారు గుమస్తా వస్తాడు అంటావా” మాలీ మళ్ళీ అడిగింది.

“నాకెలా తెలుస్తుంది” అన్నది సాలీ.

“భారిక్ చెప్పాడు కదా అతడు మన ఊరు వస్తున్నట్టు, మనం కూడా వెళ్ళొచ్చు కదా” అని మాలీ అన్నది.

“అందరూ వెళుతున్నట్టున్నారు. మనం ఎందుకు వెళ్ళకూడదు ” సాలీ అన్నది.

” మరి ఇంటి సంగతి ఏమిటి?” చెల్లెలు సందేహం.

“తాళం వేస్తాము” అక్క సమాధానం.

” సరే కానీ, నాన్నకి ఎవరు చెప్తారు” మళ్లీ ప్రశ్నించింది చెల్లెలు.

సరిగ్గా అప్పుడే పదునైన రాయి ఒకటి ఎండలో భరించలేనంత వేడెక్కి సాలీ పాదానికి గుచ్చుకున్నది. బాధ తట్టుకోలేక ఆమె మోస్తున్న గడ్డపార కిందపడేసి. గట్టిగా అరిచింది సాలీ.

“నాన్న ఏమంటాడో నేను లెక్క చేయను. ఆయన మన కోసం ఏమి జాగ్రత్త తీసుకున్నాడు” అన్నది.

వారిప్పుడు ‘ఎలుగొడ్ల కొండ’ దగ్గర ఉన్నారు. మనుషులను తినే పులి వాళ్ళమ్మను చంపిన ప్రదేశం అది. అడివంతా ఎండిపోయి ఉన్నది. వారు కొంత భయపడ్డారు కూడా. పులి చంపిన వారి ఆత్మలు, మధ్యాహ్న సమయంలో అడవిలో తిరుగుతూ ఉంటాయనీ, అవి రకరకాల ఆకృతులలో అంటే చిన్న పిల్లల్లాగా, అమ్మాయిలుగా, అబ్బాయిలుగా ఆత్మలు కనిపిస్తాయని. వారి తలలూ కళ్ళూ పెదవులు అన్నీ ఎర్రగా ఉండి, శరీరమంతా వెంట్రుకలు పొడవుగా పెరిగే ఉంటాయని అనుకోగా విన్నారు. ఇంకా ఆ ఆత్మలు చాలా వింత శబ్దాలతో, మూలిగినట్టు, గుసగుసలాడినట్టు‌, గర్జనలతో తిరుగుతుంటాయని, ఎండిన కొమ్మలను విరుస్తూ, ఎవరైనా కనబడితే వెంటపడి భయపెడతూ తరుముతాయని అందరూ అనుకుంటూ ఉంటారు.

సొలీ గట్టిగా మాట్లాడినప్పుడు అడవిలో ఎవరిదో బొంగురు గొంతు శబ్దం ప్రతిధ్వనించి. వేరెవరో మాట్లాడినట్టు వినిపించింది. ఆ కొండల్లో వారు చాలా దూరం వచ్చేశారు. అక్కడ ఎవరూ కనిపించడం లేదు. కొండల నుండి ప్రవహించే నీరు వేడెక్కి మరుగుతున్నట్టు కనబడుతున్నాయి. ఆ నీటి తరంగాల వేడి చుట్టూ ఉన్న ఖాళీ పొలాల్లోకి వ్యాపిస్తూ ఉన్నది. కొండలన్నీ మత్తుగా నిద్రలో ఉన్నాయి.

సాలీ తన ముఖానికి పట్టిన చెమట తుడుచు కొని, వెనుకకు తిరిగి

“ఇంటికి పోదాం పద” అన్నది.

….. … ……

Written by Jwalitha

కవి, రచయిత, అనువాదకురాలు, ఫ్యామిలీ కౌన్సిలర్, సామాజిక కార్యకర్త, ప్రచురణకర్త, ప్రకృతి ప్రేమికురాలు, తెలంగాణ ఉద్యమ కారిణి అయిన జ్వలిత అసలు పేరు విజయకుమారి దెంచనాల.
‘బహళ’ అంతర్జాతీయ అంతర్జాల త్రైమాసిక మహిళా పత్రికను 2021నుండి నడుపుతున్నారు.
వీరి రచనలు-
కాలాన్ని జయిస్తూ నేను, సుదీర్ఘ హత్య, అగ్ని లిపి, సంగడి ముంత అనే నాలుగు కవితా సంపుటులు; ఆత్మాన్వేషణ, రూపాంతరం అనే రెండు కథల సంపుటులు; జ్వలితార్ణవాలు అనే సాహిత్య సామాజిక వ్యాసాల పుస్తకం; ఎర్రరంగు బురద, ఆత్మార్ణవం, జగన్నాటకం, ఒడిపిళ్ళు అనే నాలుగు నవలలు మొత్తం 11 పుస్తకాలు రచించారు. ముజహర్ నగర్ లో దీపావళి, ‘పరజ’ వంటి అనువాదాలతోపాటు, బహుజన కథయిత్రుల పరిచయం, మెరిసే అనువాదాలు, అనువాద నవలలు పేరుతో శీర్షికలను నిర్వహించారు.
స్వీయ సంపాదకత్వంలో ఖమ్మం కథలు, మల్లెసాల చేతివృత్తికథలు, కొత్తచూపు స్త్రీల కథలు, పరివ్యాప్త, సంఘటిత, రుంజ, కరోనా డైరీ, లేఖావలోకనం, గల్పికా తరువు, ఓరు వంటి పదో సంకలనాలను ప్రచురించారు. గాయాలే గేయాలై, పూలసింగిడి వంటి అనేక పుస్తకాలకు సహసంపాదకత్వం వహించారు.
మర్డర్ ప్రొలాంగేర్, వుండెడ్ లైవ్స్ పేరుతో వీరి కవిత్వం ఆంగ్లానువాద పుస్తకాలు వెలువడ్డాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

స్నేహం

లలితాంజలి