జ్యోతి ప్రకాశం

“పెద నాన్నా! మా అమ్మాయి పెళ్లి ఖాయమైంది. మన ఇంటిలో మీరు పెద్ద వారు. పెద్దమ్మను తీసుకుని మీరు పెళ్ళికి నాలుగు రోజులు ముందే తప్పకుండా రండి. నాన్న మిమ్మల్ని చూసి చాలా రోజులయ్యింది. తప్పకుండా రమ్మని చెప్పమన్నాడు” అంది నా పెద్ద తమ్ముడు మోహన్ కూతురు సుమ.
అలాగే ! సుమా! అన్నాను.

ఎవరు ఫోను చేశారు? అంటూ వంట గది నుండి వచ్చింది నా శ్రీమతి సుజన.
సుమ కూతురి పెళ్లట. మన ఇద్దరినీ తప్పకుండా రమ్మని ఫోను చేసింది అన్నాను.

పెళ్ళికి వెళితే బంధువులందరినీ చూసి రావచ్చును అనుకుంటూ నేను సుజన, పెళ్ళికి బయల్దేరి వెళ్ళాము.
పెళ్ళికి రెండురోజుల ముందే ముఖ్యమైన బంధు మిత్రులు వచ్చారు.

రంగ రంగ వైభవంగా వివాహం జరిగింది. భోజనం చేసివచ్చి విశ్రాంతిగా కూర్చున్నాం.
” మీరు మా సుమకు పెద్ద నాన్న కదా!అంటూ ఒకామె వచ్చి, మా పక్కన కూర్చుంది. ఆమె వంక చూస్తూ…
నీవు సుమ ఆడబిడ్డ జ్యోతివి కదూ! అంది నా శ్రీమతి.
అవును. మీరు నన్ను గుర్తు పట్టినందుకు చాలా సంతోషం అంది జ్యోతి.

“మా ఈశ్వర్ పెద నాన్నకు పిల్లలుంటే కూడా…
తన తోబుట్టువుల పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు ఆర్థిక సాయం చేస్తాడని, మా సుమ ఎప్పుడూ చెపుతుంటుంది. అందువల్ల నాకు, మీ దంపతులంటే ఎనలేని గౌరవం అని జ్యోతి చెప్పింది.

మీ వారు బాగున్నారా? అన్నాను.
మావారు హార్ట్ ఎటాక్ తో చనిపోయారు అంది జ్యోతి.
అయ్యో! ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నారా? మీ జీవితం ప్రశాంతంగా గడుస్తోందా? అన్నాను.
మీ లాంటి పెద్ద వారు అడుగుతుంటే
నా జీవితంలోని కష్ట సుఖాలు పంచుకోవాలి అనిపిస్తోంది అంటూ జ్యోతి చెప్పడం మొదలు పెట్టింది.

మా నాన్న సుందరయ్య గారు మా ఊరిలో ధనవంతులు. నాకు ఇద్దరు అక్కలు,ఇద్దరు తమ్ముళ్ళు,ఒక చెల్లి ఉన్నారు.
నేను మా పక్క ఊరి గవర్నమెంట్ కాలేజీలో ఇంటరు పరీక్షలు వ్రాసి ముగించాను.

ఒక రోజు నాన్నగారు నాతో … “జ్యోతీ ! నీకు ఒక మంచి పెళ్ళి సంబంధం వచ్చిందమ్మా! అతను నీవు చదివే కాలేజీలో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్నాడట. అతని పేరు ప్రకాశం. నీవు అతనికి నచ్చావట. కట్నం అక్కరలేదు అన్నాడట.
నీకు ఇష్టమైతే పెళ్ళిచూపులు ఏర్పాటు చేస్తాను అన్నారు.”
మీ ఇష్టం నాన్నగారూ! అన్నాను. మా ఇద్దరికీ పెళ్ళి జరిగింది.

నేను అత్తగారింటికి వెళ్ళాను. వాళ్ళది మా పక్క ఊరే.
మా మామగారు ఆ ఊరిలో పెద్ద రైతు. కష్టపడి వ్యవసాయం చేసి పంటలు బాగా పండించేవారు.
ఆయనకు ఇద్దరూ కొడుకులే. పెద్ద కొడుకు జయేష్ బి.ఏ. చదివి, పక్క పట్టణంలో వ్యాపారం చేస్తున్నాడు.
జయేషుకు వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, ఒక కూతురు.
పెళ్లయి నేను అత్త గారింటికి వెళ్లిన తర్వాత, నాలుగు రోజులు ఉండి మా బావ గారు, తన భార్యా పిల్లలతో తాను వ్యాపారం చేసే ఊరుకు వెళ్ళిపోయారు.

నేను ఇంటర్ పరీక్షలు రాసిన వెంటనే, నాకు పెళ్ళి జరగడంతో నాకు వంట చేయడం రాలేదు. అందువల్ల మా అత్తగారితో పాటు వంట గదిలోకి వెళ్ళి అత్త గారి దగ్గర రక రకాల వంటలు చేయడం నేర్చుకున్నాను.
“మా అత్తగారు, మామగారు చాలా మంచి వారు. వారు నన్ను తమ కూతురిలా చూసుకునేవారు. మా వారు నన్ను ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు కాబట్టి నాపట్ల ఎంతో ప్రేమగా ఉండేవారు.”

వేసవి సెలవులు ముగిసి, కాలేజీ తెరిచిన తర్వాత మా వారు ఉద్యోగం చేసే కాలేజీలో నన్ను బి.ఏ. లో చేర్పించారు. నేను శ్రద్ధగా చదువుకునేదానిని. నా పరీక్షల సమయంలో మా అత్త గారు వచ్చి, వంట పని తాను చేస్తూ, నన్ను చదువుకోమనేవారు. నేను బి.ఏ. పాస య్యాను.
****
ఒక రోజున మా అత్తగారు నాతో,
జ్యోతీ మీకు ఒకరో, ఇద్దరో పిల్లలు ఉంటే బాగుంటుంది అన్నారు.
అత్తగారి సలహాతో నేను లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. ఆమె పరీక్షలు చేసి మందులు వాడమంది.
” పిల్లల కోసం మేము చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నేను బాగా దిగులు చెందాను.”

మా వారు నాతో, జ్యోతీ! మనకు పిల్లలు లేరని దిగులు పడి ఏం చేస్తాం?మనం, బంధువుల పిల్లల్ని పెంచుకోవచ్చు. ఈ దేశంలో ఎందరో అనాధ పిల్లలు ఉన్నారు. వారికి మన చేతనైన సహాయం చేయ వచ్చు.
నీవు దిగులు మాని పట్టుదలతో చదువుకుని, నీకంటూ ఒక జీవితం ఏర్పరుచుకో! అన్నారు.

మా వారికి ప్రమోషన్ మీద హైదరాబాదుకు బదిలీ అయింది.
నేనూ అక్కడ ఉద్యోగంలో చేరాను. మేమిద్దరం ఉద్యోగం చేసి మిగిల్చిన డబ్బుతో, ఆఫీసులో లోను తీసుకుని చిన్న ఇల్లు కట్టుకున్నాం. నేను ప్రైవేటుగా ఎం.ఏ. చదివి పాసయ్యాను.

మా ఇద్దరిదీ ఒకే మాట. ఒకే బాట. మా శరీరాలు వేరైనా ఆత్మ ఒకటే ఆన్నట్లుగా, ఒకరికి ఒకరు తోడు నీడగా సంతోషంగా ఉండేవారం.
మా వారికి చెడు అలవాట్లు ఏవీ లేవు. అందువల్ల మేము సంపాదించిన ధనాన్ని, పొదుపు పథకాలలో భద్రపరిచి, మా ఊరిలో స్థలాలు కొన్నాం.

నా దురదృష్టవశాత్తూ మా వారూ హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. ప్రాణ ప్రదంగా ప్రేమించిన భర్త ఇక లేరు అనే బాధను నేను భరించలేక పోయాను. నేను బ్రతకడం వృధా అనిపించింది. ఆ మాటే మా అమ్మా నాన్నలతో చెప్పాను.

మా నాన్న …
జ్యోతీ! దేవుడు మనకు ఇచ్చిన ఈ జీవితాన్ని, కష్టం వచ్చిందని, బలవంతాన మధ్యలో ముగించ కూడదు. కష్టాల్ని సహిస్తూ, మనం బ్రతికి, మనచుట్టూ ఆపదలో ఉన్న నలుగురికీ సాయపడాలి అంటూ ధైర్యం చెప్పారు.
అమ్మ కూడా నాకు రక రకాలుగా ఓదార్పు మాటలు చెప్పింది.
వారిద్దరూ నన్ను మామూలు మనిషిని చేశారు.

నేను ఉద్యోగం చేస్తూ, తోబుట్టువుల పిల్లలను చదివిస్తూ గడిపాను.
మా వారికి తండ్రి తరపున వచ్చిన ఆస్తిని, మా బావ గారికే ఇచ్చాను.
మా వారికి ఉద్యోగం వల్ల వచ్చిన డబ్బును పొదుపు పథకాలలో భద్రపరిచాను.
నేను ఉద్యోగంలో ప్రమోషన్లను పొందుతూ, గవర్నమెంటు సంస్థలో సూపరిండెంటుగా రిటైరయ్యాను.

“నా తోబుట్టువులు అందరూ ఆర్థికంగా చాలా బాగున్నారు. నా తమ్ముళ్ళ కూతుళ్ళకు, వారి పెళ్ళి సమయంలో నాకు మా ఊరిలో ఉన్న స్థలాలను ఇచ్చాను.”
నేను రిటైరైనప్పుడు వచ్చిన డబ్బులో, నా తోబుట్టువులకు ఒక్కొక్కరికీ యాభై వేల రూపాయలు ఇచ్చాను.

నేను రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బును, మా వారు చనిపోయినప్పుడు వచ్చిన డబ్బును కలిపి, మా వారూ, నేనూ చదువుకున్న కాలేజీలో ఆడిటోరియం కట్టించాను. ఆ భవనం మీద నాపేరు జ్యోతి, మా వారి పేరు ప్రకాశం, కలిపి “జ్యోతి ప్రకాశం” అని పెట్టారు.
ఆవిధంగా నేనూ, మావారు కష్టపడి సంపాదించిన ధనం సద్వినియోగం అయిందని సంతోషించాను.
పై లోకంలో ఉన్న మావారి ఆత్మ కూడా అందుకు సంతోషిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం.
ఇవి చూడండి అంటూ, తన ఆల్బంలో ఉన్న ఫోటోలను జ్యోతి మాకు చూపించింది.

కరోనా వచ్చి, ప్రపంచం అంతా అతలాకుతలమైంది. “నాకూ కరోనా వచ్చింది. ఆ సమయంలో మా పనిమనిషి భయపడకుండా, నాకు ఎంతో సాయం చేసింది. మనకు ఎంత మంది బంధువులు ఉన్నా, ఆపదలో ఆదుకున్న వారే మనకు దేవుడితో సమానం.”
మా ఇంటి ముందు ఉన్న స్థలంలో, ఒక చిన్న గది కట్టించి పనిమనిషి ఉండడానికి ఇచ్చాను అంది జ్యోతి.

నాకు ఉండడానికి ఇల్లు ఉంది. ప్రతి నెల మా వారిది, నాదీ పెన్షన్ వస్తుంది. నా ఖర్చులకు పోగా, మిగిలిన డబ్బును అనాధ శరణాలయాలకు, పేద విద్యార్థులకు ఫీజులు కట్టడానికి వాడుతున్నాను.
మా మేనత్త ఒకామె భర్త పోయి నిరాధారంగా ఉంది. ఆమెకు వృద్ధాప్యపు పెన్షన్ వస్తుంది. నేను ప్రతి నెల అయిదు వేల రూపాయలు ఆమెకు ఇస్తున్నాను. ఆమెకు ఏ చిన్న అనారోగ్యం చేసినా, నేనే చూసుకుంటున్నాను అని జ్యోతి చెప్పింది.

అమ్మా జ్యోతీ! జీవితంలో నీకు వచ్చిన కష్టాలను ధైర్యంతో ఎదుర్కొన్నావు. నీ జీవితాన్ని, ఎంతో ఆదర్శవంతంగా తీర్చి దిద్దుకన్నావు. నీ చుట్టూ ఉన్న పేదవారికి సాయం చేస్తున్నావు. ఒక ఆదర్శ మహిళగా ఉన్నతమైన స్థానంలో నిలిచావు. నీకు హృదయపూర్వక అభినందనలు అన్నాను.
నా శ్రీమతి సుజన కూడా నీ లాంటి స్త్రీ మూర్తిని చూడడం నాకు పరమానందంగా ఉంది అని చెప్పింది. మా మాటలకు జ్యోతి మనసారా నవ్వింది.
నవ్వుతూ ఉన్న జ్యోతిని చూస్తూ ఉంటే…
అందరినీ చల్లగా కాపాడే ఆ జగన్మాతే నాకు దర్శనమిచ్చినట్లయింది.

Written by Lingamneni Sujatha

పేరు: లింగంనేని సుజాత
భర్త పేరు: డా: లింగంనేని బసవ శంకర రావు ఎం.ఏ. పిహెచ్.డి
ఊరు:చెన్నై
వృత్తి: గృహిణి
ప్రవృత్తి: కథలు, కవితలు, వ్యాసాలు,వంటలు వ్రాయడం, పజిల్స్ పూర్తి చేయడం. పజిల్స్ పూర్తి చేసి మూడు సార్లు నగదు బహుమతి అందుకున్నాను.
ఇప్పటివరకు 100 కథలు వ్రాశాను.
40 కథలతో "సుజాత కథలు" అనే పుస్తకము 2020వ సంవత్సరంలో ప్రచురించాను.
మరొక 40 కథలతో "మనిషి కథలు" అనే పుస్తకము 2024వ సంవత్సరంలో ప్రచురించాను.
25-5-2025 న అక్షరయాన్ వారిచే మాతృవందనం పురస్కారాన్ని అందుకున్నాను.
3-8-2025 న అశోక్ నగర్ ప్రోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్ వారు నిర్వహించిన డిజిటల్ యోగా కంటెస్ట్ లో ఫస్ట్ ప్రైజ్ అందుకున్నాను.
13-8-2025 న నవ తెలంగాణా మానవి లో నన్ను గురించిన వ్యాసం ప్రచురించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

జ్వలిత చేతనం : బాలలత మల్లవరపు

తేట తెనుగు