తెలంగాణ బంగారునిధి

పుస్తక సమీక్ష

ఎంతో కాలం నుండి నాకు పరిచయమున్న విజయశ్రీ గారు మృదు స్వభావి,నెమ్మదస్తురాలు,హంగు ఆర్భాటాలు లేని సౌమ్యవశీలి కనిపించని జ్ఞాని అయిన నన్నపరాజు విజయశ్రీ గారందించిన గొప్ప గ్రంథం.తెలంగాణ చరిత్ర తెలుసుకోవడానికి బంగారు నిధి.కె.సి.ఆర్.వేసిన దారులు అనే బృహత్ గ్రంథం. ఏ విషయాన్నైనా అవగాహన చేసుకుని,నిశితంగా పరిశీలింయూచి తనదైన శైలిలో రాసి అందించడం అలవాటైన నన్నపరాజు విజయశ్రీ గారు తెలంగాణ చరిత్రను విశదంగా ఒక ఉద్గ్రంథాన్ని రచించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కె.సి.ఆర్.వేసిన దారులు అనే పేరు పెట్టారు. చాలా సంవత్సరాలనుండి పరిచయమున్న విజయశ్రీ ఉపాధ్యాయ వృత్తిలో నైపుణ్యాన్ని చూపించి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా రాష్ట్రపతి పురస్కారం పొందిన ఘనురాలు. పదునాలుగు సంవత్సరాల శ్రమకు నిదర్శనంగా వెలువడిన ఉత్తమ గ్రంథం.పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు తయారయ్యే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా వుండే బంగారు నిధి ఈ గ్రంథం .

సమీక్షకులు డా. చీదేళ్ళ సీతాలక్ష్మీ

నన్నపరాజు విజయశ్రీ గారికి తెలంగాణ అన్న, కె.సి ఆర్ గారన్న విపరీత అభిమానం.తెలంగాణ అంటే ప్రేమ ఎక్కువ.
విజయశ్రీ గారు పుస్తకంలో తన అభిప్రాయాన్ని ఇలా చెప్పారు.*”కె.సి.ఆర్.ఒక గాంధీ,ఒక సెహ్రూ, ఒక ఇందిరాగాంధీ,ఒక పటేల్,ఒక వాజపేయి,ఒక రచయిత,ఒక ఆధ్యాత్మిక చింతనాపరుడు,ఒక సాహిత్య కారుడు,ఒక కళాకారుడు,ఒక శాస్త్రవేత్త,ఒక తత్వవేత్త,ఒక ఇంజనీర్,ఒక వైద్యుడు,ఒక శిల్పి,ఒక విశ్లేషకుడు, ఒక ప్రజ్ఞావంతుడు,ఒక వక్త,ఒక శక్తి యుక్తి నాయకుడు,ఒక సంక్షేమ ప్రదాత,ఒక అభివృద్ధి పథకాల విధాత,ఒక సంస్కృతీ సంప్రదాయాల రక్షకుడు అందరూ కలిస్తే ఒక కల్వకుంట్ల చంద్రశేఖర రావు.” అంటూ కె సి.ఆర్ లో కలగలిసిన సకల గుణగణాలను,లక్ష్యాలను,సిద్ధాంతాలను ఎంతో ఉన్నతంగా కొనియాడింది.
అందుకే తెలంగాణ రాష్ట్ర సాధనకు దారి చూపిన దారి దీపంగా పేర్కొనడం గమనించవచ్చు
ఉపాధ్యాయినిగా విధి నిర్వహణలో ఉన్నప్పటికీ సాహితీ, సామాజిక కార్యక్రమాలు చేపట్టిన విజయశ్రీ గారు ఈ గ్రంథంలో తన అనుభవాన్ని రంగరించి తెలంగాణ ముందు పరిస్థితులను,తెలంగాణ వచ్చాక సంక్షేమ పథకాలతో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాబ గురించి ఏ విషయం వదలి పెట్టకుండా ప్రతి అంశాన్ని పేర్కొనడం ఆమె నిశిత పరిశీలనా దృష్టికి తార్కారణం.

   

ఈ బృహత్ గ్రంథానికి కె.వి రమణాచార్యులు,బి.ఎస్.రాములు,గోరటి వెంకన్న,కల్వకుంట్ల కవిత,డా నందిని సిధారెడ్డి గార్లు,మంత్రులు నిరంజన్ రెడ్డి,సబితా ఇంద్రారెడ్డి గార్లు మొదలైన ప్రముఖులు ఎందరో శుభాభినందనలు తెలియచేస్తూ విజయశ్రీ గారు చేసిన కృషిని వారి ముందుమాటలో మెచ్చుకోవడం జరిగింది.

ఈ గ్రంథంలో మొత్తం 175 విభాగాలున్నాయి. ముందుగా ‘”తెలంగాణ చారిత్రక పరిణామ క్రమాన్ని చెపుతూ క్రీ.పూ. 3 లక్షల సంవత్సరాల నుండి దిగువ పాతరాతియుగం నుండి మొదలుకొని 26 జనవరి 1952 వరకు అంటే నైజాం పరిపాలన పోయి భారతదేశంలో విలీనమైన తెలంగాణను ఏలినట్టి రాజ్యవంశాల గురించి ఎన్నెన్ని సంవత్సరాలు ఎవరెవరు పరిపాలించినారో ” వివరాలుతెలియచేసింది.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు పూర్వ యుగం నుండి ఇప్పటి వరకు ఎలా ఉండేదో వివరించింది గ్రంథంలో.
తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం ఎందుకు కొనసాగిందో,సీమాంద్రపరిపాలనలో మనమేమి కోల్పోయామో వివరించింది రచయిత్రి.
తెలంగాణను పాలించిన రాజవంశాలగురించి,గతపాలకుల పాలనలో తెలంగాణ వికాసదశలను కూలంకషంగా వివరించింది.
నిజాంరాజ్యంలో తెలంగాణ ఉనికి ఆర్థికవ్యవస్థ ఎలా వుందో,సాయుధ పోరాటం గురించి,రైతాంగ పోరాటం గురించి,విశాలాంధ్ర ఏర్పాటు,ఆంధ్ర పాలనలో తెలంగాణ దోపిడీకి గురైనదంటూ ఆవేదన చెందుతూ నాటి పరిస్థితిలను వివరించింది విజయశ్రీ.
ప్రత్యేక తెలంగాణ కోరుకోవడానికి కారణాలను వివరిస్తూ 1969 నాటి తెలంగాణ ఉద్యమాన్ని గ్రంథంలో పేర్కొంటూ ఆనాడు తొలి దశ ఉద్యమాన్ని అణిచివేసిన అనుభవంతో ప్రొఫెసర్ జయశంకర్ పిలుపుతో కె.సి.ఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన,ఉద్యమ విధానాలు ఉద్యమ రూపాలు,సకల జనుల సమ్మె,వంట వార్పు,ధర్నాలు,రైలు రోకో మొదలైన కొత్తపద్ధతులతో ఉద్యమానికి ఊపిరిపోసి కష్టపడి తెలంగాణ సాధించిన రీతులను ఒక్కటి కూడా వదిలిపెట్టక తన గ్రంథంలో రికార్డు చేసింది విజయశ్రీ.

గ్రంథ రచయిత డా. సన్నపురాజు విజయశ్రీ జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలు, రంగారెడ్డి జిల్లా విశ్రాంత ఉపాధ్యాయురాలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నాదరగుల్, ముద్రితాలు -6, అముద్రితాలు -8, సంకలనాలు – 300 పైన వ్యాసాలు, కథలు, కవితలు, గేయాలు, లేఖలు, సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు

తెలంగాణ సాధించుకున్నాక తొలిముఖ్యమంత్రిగా కె.సి.ఆర్ నేతృత్వంలో నీరు,నిధులు,నియామకాల పునాదిగా ఏర్పడ్డ తెలంగాణ అనేక సంక్షేమ పథకాలతో అభివృద్ధి పథంలో పయనిస్తూ ,కాళేశ్వరం ప్రాజెక్టుతో తీరిన నీటి సమస్య,భగీరథ,మిషన్ కాకతీయ మొదలైన ప్రణాళికతో తగ్గిన నీటి ఎద్దడి,ఆగని కరెంటు,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆసరా పథకాలు,వృద్ధాప్య ,వికలాంగ పింఛన్లు,ఆడపిల్లల పెళ్లికోసం కళ్యాణాలక్ష్మి,షాదీ ముబారక్ పథకాలు, రైతు బంధు ఇంకాఎన్నో పథకాలతో అభివృద్ధి పథంలో పయనిస్తున్న తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి, విధి విధానాలను తన గ్రంథంలో పొందు పరచింది రచయిత్రి.
ఈ బృహత్ గ్రంథంలో నాడు నేడు తెలంగాణ గురించి ఎంతో చక్కగా,క్షుణ్ణంగా వివరించింది రచయిత్రి విజయశ్రీ.

ఈ గ్రంథంలో చారిత్రక యుగం నుండి ఇప్పటివరకు ఉన్న తెలంగాణ చరిత్రను సంస్కృతి,రాజకీయ,ఆర్థిక ,సాంఘిక పరిస్థితులను పరిణామ క్రమంలో వివరించిన తీరు చాలా బాగుంది.తెలంగాణ సమగ్ర చరిత్రను చక్కగా ఆవిష్కరించింది.చేసిన కృషి ప్రశంసనీయం. తలకెత్తుకుని దాదాపు మూడు లక్షల ఖర్చుతో స్వయంగా గ్రంథాన్ని అచ్చువేసిన వదాన్యురాలు,తెలంగాణ వీరాభిమాని విజయశ్రీ.

తెలంగాణ ఉద్యమంనాటి పరిస్థితులను,చేసిన ఉద్యమాల తీరును ,తెలంగాణ సాధించినాక వివిధ పథకాలతో అభివృద్ధిపథంలో పయనిస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని,ప్రతి రంగంలో సాధిస్తున్న తీరును వివిధ కోణాలను దాదాపు 750 పేజీలున్న తన గ్రంథంలో విపులంగా కళ్ళకు కట్టినట్లు పేర్కొన్నారు.
విజయశ్రీ గారి కృషి అడుగడుగునా ఈ గ్రంథంలో కనిపిస్తుంది.
జలసిరి తెలంగాణను ఉన్నంతంగా నిలిపిన ఈ గ్రంథం తప్పక అందరూ చదవాల్సిన ఉత్తమ గ్రంథం అని చెప్పక తప్పదు.విజయశ్రీ చేసిన పరిశోధన, పరిశీలనా దృక్పథంతో రచించిన పెద్ద గ్రంథానికి డాక్టరేట్ ఇవ్వొచ్చు అనిపించింది.ఈ గ్రంథం పరిశోధన చేయడానికి కూడా తోడ్పడే గొప్ప గ్రంథాన్ని అందించిన విజయశ్రీ గారికి అభినందనలు తెలియచేస్తున్నాను.

2 Comments

Leave a Reply
  1. చాలా బాగుబడి.అభినందనలు.

  2. చాలా బాగుబది.అభినందనలు.నీహారిణికి ధన్యవాదాలు

Leave a Reply to డా చీదెళ్ళ సీతాలక్ష్మి Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఎర్రరంగు బురద

అయినదిపో… మేమేలా పోవలె… పోతిమిపో….