ధనుర్మాసం అంటే ధనస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించడం వల్ల ఈ మాసానికి ఆ పేరు వచ్చింది . సూర్యుడు నెల రోజులు ఒక మాసంలో ఒకే రాశిలో ఉంటాడు. కాబట్టి ఆ నెలకు ఏ రాశిలో సూర్యుడు ఉంటాడో ఆ రాశి పేరుతో ఆ మాసం , ఆ నెల పేరు ఉంటుంది. ధనుర్మాసం భగవంతుడైన విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం. ఈ నెలలోనే గోదాదేవి విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నది. గోదా అమ్మవారు తిరుప్పావై పాటలను పారవశ్యంతో పాడి , శ్రీ రంగనాయక స్వామిని మేల్కొల్పి ప్రసన్నం చేసుకుని ఆయనను పెళ్లి చేసుకున్నది. ఆ తరువాత శ్రీరంగ నాయకునిలోనే ఐక్యమయింది గోదాదేవి.
తిరుప్పావై అంటే 30 స్తొత్రాలు, పాటలు . విష్ణుమూర్తిని కీర్తిస్తూ పాడిన ఈ పాటలను తిరుప్పావై అంటారు. ఈ మాసం లో ఉండే ఈ 30 రోజులు 30 పాటలను పాడుతూ చేసే పూజా విధానాన్ని మార్గళి అంటారు.

ధనుర్మాసం వచ్చిందంటే ప్రతి వైష్ణవ దేవాలయాల్లో విశేషంగా తెల్లవారుజాముననే స్వామివారిని మేల్కొలిపి భక్తులందరితో కూడి తిరుప్పావై పారాయణం చేస్తారు. పెరుమాళ్ళు అంటే దేవుడు. పెరుమాళ్ళకు ఇచ్చే ప్రసాదాల్లో “కట్టె పొంగళి”ని అంటే బియ్యం,పెసరపప్పు, మిరియాలు, నెయ్యి కలిపి వండే కట్టె పొంగళి పదార్థాన్ని భగవంతుడికి ఆరగింపు చేస్తారు. ఆరిగింపు అంటే నైవేద్యం పెట్టడం. ఈ కట్టె పొంగళితో పాటు పుళిహోర, దధ్యోజనం ( దధి + ఓదనం = దధ్యోదనం. దధి అంటె పెరుగు , ఓదనం అంటే అన్నం, వాడుక భాషలో దధ్యోజనం అంటారు) చక్కెర పొంగళి మొదలైన పదార్థాలను కూడా దేవుని కి ఆరగింపు చేసి, వచ్చిన భక్తులందరికీ పంచుతారు.
ఈ ధనుర్మాస వేళల్లో పెళ్లి కావలసిన అమ్మాయిలు, అబ్బాయిలు ప్రత్యేకంగా జరుపవలసిన పూజ మార్గళి పూజ. ఎందుకంటే గోదా అమ్మవారు చాలా చిన్న వయసులోనే భక్తి పారవశ్యంతో తిరుప్పావై 30 రోజులు 30 పాటలు పాడింది , ఆ పెరుమాళ్ళ అనుగ్రహం వల్ల వారిని భర్తగా పొందగలిగింది . అలాంటి సుగుణాలు ఉన్న భర్త దొరకాలని అమ్మాయిలు, అలాంటి సుగుణవంతులైన భార్య దొరకాలని అబ్బాయిలు
ఈ పూజ చేస్తే ఫలితం ఉంటుంది. ఇదొక్కటే కాకుండా భక్తితో సేవించి భగవంతుణ్ణి అంతా మంచి జరగాలని కోరుకుంటే ఏదైనా తీర్చగలడు అనే నమ్మకం గోదాదేవి నిరూపించింది కాబట్టి అందరూ తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఈ పూజ చేయాలి. చక్కగా ఇంటి ముందు ముగ్గులు పెట్టి అలంకరించాలి తాము అలంకరించుకోవాలి. అలంకరణ మనకే కాదు భగవంతుడికి చేయాలి. ఇంట్లో ఉన్న దేవుడి విగ్రహాలకు కూడా రంగురంగుల పట్టు వస్త్రాలను ధరింపజేసి, మంచి సువాసన గల అందమైన పూలతో అలంకరించి, భక్తితో ఈ 30 పాశురాలు పాడి, పొంగళిని ఆరగింపు చేసి, దేవాలయాలకు వెళ్లి భక్త బృందమంతా కలిసి పెరమాళ్ళను భక్తితో ఈ తిరుప్పావై పారాయణం చేసి ప్రసాదాలను స్వీకరించాలి.
ఈ పూజ ఇప్పుడెందుకు చేయాలంటే ? : –
ఈ కాలం పిల్లలకు చాలా అవసరం. ఛందోబద్ధంగా ఉండే ఈ శ్లోకాల , ఈ కీర్తనల పారాయణం వలన వాక్కు స్పష్టత పెరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది కాబట్టి ఉపయుక్తమైన పూజ ఇది. శీతాకాలం మజ్జుతనం ఉంటుంది . అంటే సోమరితనం తో ఉంటారు. గోదాదేవి భగవంతునిలో లీనం కావడానికి కారణం ఆమె ఏకాగ్రత వల్లనే. అంటే మనం చేసే పని పట్ల శ్రద్ధ కలుగుతుంది, విజయాన్ని సాధిస్తాము అని చెప్పడానికి ఈ పూజను నిర్వహించుకుంటాం. ఇది కేవలం మహిళలు మాత్రమే చేసే పూజ కాదు. పిల్లలు పెద్దలు అందరూ చేయవలసిన పూజ.
ఇలా ఈ స్తోత్రాలను చిత్తశుద్ధితో చదవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. బుద్ధి చాంచల్యం తొలగిపోతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి , బద్ధకం పోతుంది. ఒక మంచి సంకల్పంతో స్పష్టంగా స్వచ్ఛమైన మనసుతో భగవంతుడి ముందు కూర్చుని గానం చేయడం వలన మెదడు చురుకుగా ఆలోచిస్తుంది . ఈ పూజ తరువాత శాస్త్ర సాంకేతిక విద్యలలో కానీ, వాళ్ళు చదవాలి అనుకునే ఏ విషయం పైననైనా, ఏ ఉద్యోగం లోనైనా చేయాల్సిన పనుపై ఏకాగ్రత పెరిగి, తాము సాధించాలనుకునే ఫలితాలలో సఫలీకృతులు అవుతారు.
ఈ పూజ ఒక్కరు మన ఇంట్లో కూర్చొని చేసేది కాదు. ఎందుకంటే గోదమ్మ ప్రతి పాశురంలో ఆ రంగనాయకులను మేల్కొల్పటానికి గోపికలందరితో కలిసి వెళ్లినట్లు ఉంటుంది కాబట్టి, భక్త బృందంతో కలిసి ఈ పూజ చేస్తే విశేష ఫలితం ఉంటుందని గోదమ్మ తను ఆచరించి మనకు నేర్పించింది. అంటే ఇందులో కూడా ఒక సామాజిక ప్రయోజనం కూడా ఉన్నది. నలుగురితో కలిసి మంచిగా మాట్లాడడం కలిసి ఉండడం అనే సంఘటిత శక్తికి ఉదాహరణ గా ఈ ధనుర్మాస క్రతువును చెప్పవచ్చు.
ఈ కథ వివరణ :-
ఈ గోదమ్మ ఎవరు? ఈ కథ ఎలా వచ్చింది? అని మీకు సందేహం రావడం సహజం! తమిళనాడులోని విల్లిపుత్తూర్ అనే ఊరిలో విష్ణుచిత్తులు అనే పరమ భక్తుడు ఉండేవాడు. అతను ఒక తులసి వనాన్ని పెంచుతూ అందులోని తులసి దళాలతో మాలలు కట్టి పెరుమాళ్ళకు అలంకరించేవాడు. ఇట్లా రోజూ చేస్తూ ఉండగా ఒక రోజు ఒక పాప ఆ తులసి వనంలో దొరికింది విష్ణు చిత్తుల వారికి సంతానం లేకపోవడం వల్ల భగవంతుడే నాకు ఈ పాపను అనుగ్రహించాడని అనుకొని ఆ పాపకు కోదై (గోదా) అని నామకరణం చేసి అల్లారం ముద్దుగా పెంచుకున్నారు.
తండ్రి భగవంతునికి చేసే నిత్య సేవను శ్రద్ధగా గమనిస్తూ గోదాదేవికి కూడా ఆ పెరుమాళ్ళ మీద అనంతమైన, అచంచలమైన భక్తి ఏర్పడింది. ఆ పాప కొద్దిగా పెరిగాక తను తండ్రితో తులసి వనానికి వెళ్ళేది. అక్కడ తండ్రి అల్లిన మాలను తను మొదలు ధరించి అవి ఎలా ఉన్నాయో బావిలోని నీళ్లలో చూసుకొని అదే మాలని పెరుమాళ్లకు సమర్పించేందుకు ఇచ్చేది. ప్రతిరోజు అలా చేస్తుండగా ఆమె తండ్రి విష్ణుచిత్తులవారికి ఒకరోజు ఆ మాలలో వెంట్రుకలు కనిపించాయి. వెంటనే చాలా పెద్ద అపచారం జరిగిందని మాలలను తీసివేయబోతే పెరుమాళ్లు, నాకు ఇలాగే ఇష్టం. నాకు ఇవే వేయాలి అని చెప్పాడట! దీంతో భగవంతుని కీ భక్తులకూ ఉండే అవినాభావ సంబంధం తెలుస్తుంది. ఏవిధమైన క్రోధ,మోహ,లోభాలు లేని ఓ సమర్పణ భావం చేసే పూజ దీన్ని గ్రహించాలి. గోదాదేవిలోని అమాయకమైన ప్రేమతో కూడిన భక్తిని గమనించాడా భగవంతుడు.
అలా దినదినాభివృద్ధిగా గోదాదేవి ఆ పెరుమాళ్ళ పట్ల విడదీయలేని ప్రేమను పెంచుకొని తన తండ్రితో ఆ పెరుమాళ్లే నాకు భర్తగా కావాలని కోరిందట. అప్పుడు తండ్రి ఆమెకు ఎంతో నచ్చ చెప్పటానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయిందంట. గోదమ్మ కచ్చితంగా నిర్ధారించుకొని ఆ రంగనాయకులనే భర్తగా పొందాలన్న ఆశయంతో, భక్తితో ధనుర్మాసంలో ఈ 30 పాశురాలు అంటే ఈ 30 పాటలను రోజుకొకటి చొప్పున పాడి చివరికి పెరుమాళ్ల అనుగ్రహం పొందింది. విగ్రహ రూపంలో ఉన్న రంగనాయకులు బయటికి కదలి వచ్చి గోదాదేవిని వివాహమాడి తనతో ఆలయంలోకి తీసుకువెళ్లాడట. గోదమ్మ తో సహా అక్కడ అంతర్ధానమయ్యారట . అప్పుడు ఆ విష్ణుచిత్తుడు, నా బిడ్డ ఏది? అని రోధించగా పెరుమాండ్లు పలుకుతూ నాతో కళ్యాణ జరిపించావు కదా? అందుకే నాతో తీసుకువెళ్లానని చెప్పారట. అయితే విష్ణుచిత్తుడు తన కూతురు కోసం ప్రార్థించగా నువ్వు ముందు నీ ఊరు వెళ్లి మాకు ఉండడానికి ఏర్పాటు చెయ్యి మేము వస్తామని చెప్పి పంపినందుకు ఇచ్చిన మాట ప్రకారం రంగనాయకులు గోదా సమేతంగా శ్రీరంగనాథుని గా విల్లపుత్తూరుకు ఇల్లరికం అల్లుడుగా వచ్చారు, ఇప్పటికీ ఉన్నారు. విల్లిపుత్తూరులో ఆండాళు కోయల్ గా విరాజిల్లుతున్నది మనం ప్రత్యక్షంగా వెళ్లి చూడవచ్చు సర్వం కృష్ణార్పణమస్తు!!
