నిషిద్ధాలు !!

2025 అక్టోబర్ తరుణి పత్రిక సంపాదకీయం

ఈ మానవీయ, అమానవీయ సమాజం లో ఎప్పటికప్పుడు కొత్త సంగతులు నేర్చుకోవాలి. మేము మంచి వాళ్ళము మాతో ఎవరికీ ఏ నష్టము కష్టం జరగదు అనుకునే వాళ్ళు, నేనింతే నేను ఇలాగే ఉంటాను అనుకొని వాళ్లూ, తెలియకుండానే సమాజానికి నష్టం చేసే వాళ్ళే కాదు చాలామంది చాలా కొత్తగా చేయకూడనివి ఏమిటో నేర్చుకోవాలి.  సరే దొరలవాట్లతో బాధ్యత మరిచి ఉండేవాళ్లు అందరూ ఎప్పటికప్పుడు మారిన పరిస్థితుల నుండి జాగ్రత్తలు నేర్చుకోవాలి. ఎందుకంటే ….ఎప్పటికప్పుడు కూడదు, వద్దు, కాదు అనే పదాలు, భావాలు వెంట ఉండే పరిస్థితులు ఉంటాయి.  ఇది ఓ పెద్ద జీవ సంకటం. 60లో పడ్డాం 70లో పడ్డాం ఇంకా నేర్చుకునేది ఏమిటి? సగం ఆయుష్షు లోకి వచ్చాం ఇప్పుడెవరి మాట వినేది ఏంటి? అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే కొన్ని ‘నిషిద్ధాలు’ ఉంటాయి అవి ఏంటో పరిశీలిద్దాం….

  నిషిద్ధాలా!! ఎవరు ఏర్పరిచారు? ఎందుకు ఏర్పరిచారు? ఏర్పరిస్తే మాకేంటట?  మేమెందుకు వినాలి?  మేమెందుకు ఆచరించాలి? మా ఇష్టం ఉన్నట్టు మేము ఉంటాం అంటే ఇక్కడ కుదరదండి… ఎందుకంటే మనం ఒక్కళ్ళమే ఉండం. మనం నలుగురితో బ్రతుకుతాం. నలుగురి వెంటే పోతాం… నలుగురు ఉంటేనే పోతాం …అందుకే! ఎక్కడెక్కడి పూర్వభావాలను తెచ్చి గుట్టలుగా పోసి ఇల్లు పీకి పందిరేసినంత పని చేసి ఆచరణ సాధ్యం కానివన్నీ అలవర్చారు కదా అవి మార్చుకోవాలి ఇప్పుడు.

“ఒరులేయవి యొనరించిన
నరవర! యప్రియము తన మనం బునకగు దా
నొరులకు నవిసేయకునికి
బరాయణము ప్రేమ ధర్మ పథములకెల్లన్!!”

          నరవర అంటే రాజు.  ఓ రాజా, ఇతరులు నీకు ఏ పనులు చేస్తే నీ మనసుకి ఆ ప్రియంగా అంటే నచ్చనివిగా అనిపిస్తాయో వాటిని నువ్వు ఇతరులకు చేయకుండా ఉండడమే అన్ని ధర్మాల్లోకెల్లా గొప్ప ధర్మం అని మహాభారతంలో తిక్కన గారు విదురుని తో ధృతరాష్ట్రునికి చెప్పించిన పద్యం. ఇది అందరికీ వర్తిస్తుంది.

నిషిద్ధము అంటే prohibitor , forbidden అంటారు ఇంగ్లీష్ లో!! ప్రామాణికంగా చెప్పాలనుకున్నప్పుడు వాడే పదాలు సాధారణంగా ఈ పదాలు. ఏదైనా అభ్యంతరకరమైన విషయం ఉంటే, అనుమతించలేనిది ఉంటే ఈ నివారించే విధంగా చూసేవాటిని నిషిద్ధాలంటాం. ఏవైనా సంస్థల ఉద్యోగాలలో    వివాదాస్పదంగా అవుతుందనుకునే వాటిని ఇది నిషిద్ధం అది నిషిద్ధం అని అంటుంటారు. ఏవైతే సామాజికంగా ఆమోదయోగ్యంగా ఉండవో అవి అన్నమాట.

     సంప్రదాయాల్లో సంస్కృతులలో ఆచారాలలో పాతుకుపోయిన అతి ఏదైనా ఉంటే , మూఢనమ్మకాలు ఉంటే వాటిని నిషేధించడం అవసరం. ఉదాహరణకు బాల్య వివాహాలు చేయొద్దన్నారు. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపాలన్నారు. బలులు చేయవద్దని, పెద్ద పెద్ద ఎలక్ట్రిక్ ట్రాన్స్మిటర్ ల దగ్గరికి వెళ్లడం నిషిద్ధం అనీ అంటారు .  ఇటువంటివి. తరచుగా rules, laws, social norms వంటివి forbidden గా ఉంటాయి. Prohibited areas అనేవి ఉంటాయి. ఉదాహరణకు “Smoking is forbidden in this area” , ” ఇక్కడ చెత్త వేయకూడదు” వంటివి చూస్తూ ఉంటాం. అట్లాగే చెత్త పనులు కూడా చేయకూడదు.

       ఇక, చాలావరకు రోజువారి భాషలో అనైతికమైనటువంటివి అనుచితమైనటువంటివి మాట్లాడకూడదు, కాలదోషం పట్టిన పదాలను ఉచ్చరించకూడదు అంటుంటాం. అసభ్యకరమైనటువంటివో, అభ్యంతరకరమైనటువంటివో కొన్ని పదాలను నిషేధిస్తాం. ఎందుకు? అంటే వాటి వలన ఇతరులకు బాధ కలుగుతుంది కాబట్టి. ప్రాంతీయ మండలికాల విషయంలోనూ సామాజిక మండలికాల విషయంలోనూ ఎత్నిక్ వాల్యూస్ పడిపోకుండా ఉండాలని కూడా కొన్ని మాటలను  నిషేధిస్తారు. ‘ఊత పదాలు’ అంటారే…. వాటిని. అయితే ఇప్పుడు సాధారణంగా ఇళ్లల్లో మాట్లాడే మాటలలో ఏవేవి నిషిద్ధాలుగా మనం   చూడాలో ఇండ్లలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చూద్దాం…

“నా బొంద” “దరిద్రుడా”వంటివి ఉన్నాయనుకోండి…ఈ  పదాలు అశుభ సూచకం కాబట్టి ఈ ఊతపదాలను కష్టపడైనా మానుకోవాలి. Positive thinking ను దూరం చేస్తుందిది.అలాగే, వ్యక్తిని తిడుతున్నామనుకుంటారు.కానీ ,తల్లిని తండ్రిని ఆయా పేర్లతో తిట్టినట్టే కదా!  తిట్టుపదాలు మానుకోవడం అందరికీ మంచిది. ఇటువంటి వెన్నో గుర్తొస్తున్నాయా?  వస్తాయి..వస్తాయి!! మరి మానుకోవాలి. మానుకుంటే, ఖండిస్తేనే మర్యాద!

     ప్రతి పదానికి అర్థం ఉంటుంది దాన్ని బట్టి ఉపయోగించాలి . ” అత్త పెత్తనం చెయ్యకు” అని ఓ కామన్ డైలాగ్ అంటుంటారు. ఇది కాల దోషం పట్టింది. అత్తగార్లు ఎవ్వరూ పెత్తనాలు చేయాలని చూసే రోజులు పోయాయి. పోవాలి కూడా. తన కూతురూను ఎలా చూస్తుందో కోడల్ని అలాగే చూడాలి.   అలాగే,”కోడలుగిరీ చేయకు” అని అంటుంటారు.    అత్తను అమాయకురాన్ని చేసి పెత్తనం చేసే కోడలు ఉంటే ఇలా అంటారు. ఇది తప్పే ! అత్తగారికి కష్టం కలిగించని కోడళ్ళు ఎందరో ఉంటారు. కోడలును ప్రేమగా చూసుకునే అత్తలూ ఉంటారు. ఏదో చిన్న పొరపాటు జరిగితే ఇంత లేసి మాటలను అనవలసిన అవసరం లేదు. సంయమనం అవసరం. క్షమాగుణం ఉండాలి.

          మానవ సంబంధాలను పరస్పరంగా సామాజికంగా నిర్వహించే చర్యలను శశాస్త్రీయంగా అధ్యయనం చేసే ఒక రంగాన్ని సామాజిక శాస్త్రం అంటాం. అంటే వ్యక్తుల మధ్య ఉండే పరిచయాలు, బంధాలు వీటి క్రిందికి వస్తాయి. ఇవే సమాజం పైన కూడా ప్రభావం చూపిస్తాయి. Sociological  association లో ముఖ్య విషయం.  Society కి సంబంధించిందిది. మనిషి సంఘ జీవి. కొన్ని సైద్ధాంతిక విధానాలు ఉంటాయి. ఒక తండ్రి కూతురితో ఎలా ప్రవర్తిస్తున్నాడు తల్లి కూతురుతో ఎలా ప్రవర్తిస్తుంది అనేవి ఉంటాయి. ఎవరి పరిమితులు వాళ్లకు ఉండాలి. దైనందిన జీవితంలో కుటుంబ సంబంధాల సరళి ఒకటి ఉంటుంది. అది తప్పకుండా అందరూ పాటించాలి. ఆధునిక కాలంలో  చలన శీలత  పెరుగుతున్నది. ఈ రోజుల్లో సాంస్కృతిక జీవన విధానానికి సరిపడే క్రమశిక్షణ అవసరం. అదే ఉత్తమమైన పద్ధతి. మనిషిని మనిషి గౌరవించుకోవడం  మానవీయ శాస్త్రం. శాస్త్రీయ విధానాలు అవసరంలేని సంబంధ బాంధవ్యాలు. ప్రేమ, గౌరవం, స్నేహం,మంచితనం వంటివీ, లింగ, జాతి, కులాల విషయాలలోనూ  హార్దిక అసమానతలు లేకుండా చూడాలి. మాట బాగుండాలి. ఇవే సమసమాజ నిర్మాణ నైతిక సూత్రాలకు మూలమైనవి. 

కులాల పేర్లను ఎత్తి దుర్భాషలాడే అలవాటు కొందరిలో ఉంటుంది. ఇది చాలా తప్పు. వృత్తి రీత్యా ఏర్పడినవే కులాలు.  కులాలను ఆచరిస్తే .. ఎవరి కులం వాళ్ళ కు గొప్ప. ప్రతి ఒక్కరూ తమ తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి. ఈ అభ్యుదయ కాలంలో నోరు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం అందరికీ ఉన్నది.

      సరే మరి … నూరేళ్ల జీవిత పయనానికి మూలమైన జంట విషయాన్ని ఎలా చూడాలి అనే ప్రశ్న వేసుకుంటే పెళ్లిళ్లలో అవసరమైన,అనవసరమైన కార్యక్రమాలు చాలా ఉంటాయి.  అవసరమైనవి సరే,  కొన్ని కార్యక్రమాలు ఆడంబరాలు ప్రదర్శించడానికనో ఆనందంగా ఉంటుందనో చేస్తూ ఉంటారు. చేస్తే చేసుకున్నాకానీ అక్కడ కూడా నోరును అదుపులో పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల పెళ్లొక్కటేకాదది , రెండు కుటుంబాల కలయిక.   ఏవో చిన్న చిన్న విషయాలకు మాటలు అని మాటలు పడి మనసుల్లో గాయాలకుండలను తయారు చేస్తారు. ఈ కుండలలో భావాలు మసిలిపోతాయి, పొగలు కక్కుతాయి.ఇవన్నీ మోసుకొని అత్తగారింట్లో కాలు పెట్టే కోడలుకు, అత్తగారింట్లో కాలు పెట్టే అల్లుడికీ మానసికంగా ఎంత వేదన ఉంటుందో ఈ పెద్దలనే వాళ్ళెవ్వరూ  ఆలోచించరు. ఇవ్వి పెను ప్రమాదాలు తేకుండా చూడాలి.

 వరనిశ్చయాలు, నిశ్చితార్థ  వేడుకలు, ఎదురుకోళ్ళ సందళ్ళు, పెళ్లి తంతూ ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకత కలిగినవి. ఈ వేడుకలన్నీ వియ్యంకుల మధ్య వధూవరుల మధ్య, కుటుంబాల మధ్య సాన్నిహిత్యం పెరిగాలన్నదే ప్రధమ ఉద్దేశ్యం. ఈ కార్యక్రమాల్లో మా ఆచారాలు గొప్పవి అనీ, మీ ఆచారాలు ఇలానా , మేమైతే ఇట్లా చేస్తాం మీరు అయితే అట్లా చేస్తారు అంటూ అక్కరలేని పట్టింపులకు వెళ్లి అడ్డ గీతలు వేస్తూ దూరాలను పెంచుతుంటారు.”అతి సర్వత్ర వర్జయేత్” ఈ అతిని నిషేధించాలి. ఇలాంటి  ఎన్నో రకాలుగా నిషేధాలు అవసరం.

మరో వింత! పాఠశాల కు పిల్లలను పంపించేది ఎందుకు? చదువు కోసం. తద్వారా తమ పిల్లలు జ్ఞానవంతులు కావాలనే కదా! చదువు చెప్పేది ఎవరు? ఉపాధ్యాయులు. ఇంట్లో ఒక్కరో ఇద్దరో పిల్లలని మెయింటైన్ చేయలేని తల్లిదండ్రులు బడిలో 30, 40 పిల్లలను టీచర్ ఒక్క తాటిపైకి తీసుకువచ్చి పాఠాలను బోధిస్తారు.  అటువంటి టీచర్ ను గురించి పిల్లల

ముందే తప్పుడు మాటలు మాట్లాడడం సబబా? ఇక పిల్లలేం విలువ ఇస్తారు? భయభక్తులు అనేవి మచ్చుకైనా కానరాకుండా ఉన్న ఈ రోజుల్లో,  వివిధ ఆకర్షణల మధ్య శలభాలైపోతున్న పిల్లలను మంచి మార్గంలో పెట్టాలి కానీ…ఇలా తమ పిల్లలు చదువుతున్న బడిని గురించి తక్కువ చేసి మాట్లాడడం…” ఏ.. ఈ స్కూల్ వేస్ట్ అని”, ” ఏ… ఈ  టీచర్ వేస్ట్” అని కామెంట్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇవన్నీ నిషిద్ధాలు!!
నిషిద్ధాలు!! నిషిద్ధాలు!!

           *2025 అక్టోబర్ తరుణిలో విషయం సూచిక
************
1. అమ్మగారింటికి దారేది ( కథ) – శ్రీభాష్యం అనురాధ
2. ప్రేమకులం ( కవిత) – అరుణా పరంధాములు
3. పుష్పక విమానం మా పట్నం ( కాలమ్ – రమాదేవి కులకర్ణి
4. హరిచందన ( ధారావాహిక నవల 6వ భాగం)-భవానీ కృష్ణమూర్తి
5. శుభముహూర్తం ( ధారావాహిక నవల 6 భాగం) – మజ్జిభారతి
6. నదీమతల్లి ( ధారావాహిక నవల 6 భాగం) – దేవులపల్లి విజయలక్ష్మి
7. ఒడిపిళ్ళు ( ధారావాహిక నవల 24 వ భాగం)- జ్వలిత
8. అయితే మీరే…( ధారావాహిక నవల 6 వ భాగం) – సోంపాక సీత
9. ఓ ప్రేమకథ ( ధారావాహిక నవల 3 భాగం)- లక్ష్మీ మదన్
10. కాగితం పడవ( నవల- కొత్త సీరియల్) – రేణుకా అయోలా
11. ఆచంట హైమవతి పాటలు ఆడియో
12. ధవళ కాంతులు(చివరి భాగం వ్యాసం) – విజయకందాళ
13. అమర్ నాథ్ యాత్ర- (ట్రావెలాగ్) – మజ్జి భారతి
14. కలలే కన్నీళ్ళుగా ( కవిత)- కాయిత అనూష
15. సమన్వయం – ( కథ) పోలం రెడ్డి విజయలక్ష్మి
16. నిష్క్రియా పర్వం (కవిత) – వై. సుజాత ప్రసాద్
17. తెలంగాణ వైభవం – మహిళాచైతన్యం –
(పుస్తక ఆవిష్కరణ కార్యక్రమ వార్తా విశేషాలు)
18. శతలేఖిని రామభద్రాంబ( ఆనాటి రచయిత్రులు ధారావాహిక వ్యాసాలు-1 ) –               విజయారంగనాథం
19. సంప్రదాయాల నెలవు – బొమ్మల కొలువు ( వ్యాసం) – జి. భవానీ కృష్ణమూర్తి
20. భవ్య శోభావళి- దివ్య దీపావళి ( వ్యాసం) – k. వీణా రెడ్డి
21. నిషిద్ధాలు (సంపాదకీయం ) – డాక్టర్ కొండపల్లి నీహారిణి
22. అద్భుత చిత్రకారిణి ఫ్రిద కల్హో (వ్యాసం)- ఇంద్రాణి నెల్లుట్ల
23. ఇది చాలు – (కవిత) ధూళిపాళ అరుణ
24. తల్లి మనసు (కథ) – అరుణ పరంధాములు
25. ⁠పసిదనంతో ప్రయాణం ( కాలమ్ 2) : అమెరికోడు – వురిమిళ్ళ సునంద

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

భజన పాటలు

అయితే మీరే.. (భుజాలు తడుముకుంటున్నారుగా!) -7వ భాగం