ఏనాటి మధురస్మృతులో
ఈనాడు రంగుల సీతాకోకచిలుకలై
నన్ను చుట్టుకుంటున్నవి
పట్టలేని ఆనందంతో
మనసు పరిమళాలు వీస్తున్నా
ఎప్పుడో తడారిన గొంతు నుండి
మాటలు రాకున్నవి
ఓనమాల దగ్గరే ఆగిన నేను
పండుగ సందడిలా కదలాడే భావాలను
ఏ పదాల పొదిగించి తెలపాలో…
కొత్త కాంతి ఏదో పరుచుకుంటుంటే
ఊహల విహాయసంలో
ఆశలు విహరిస్తున్నా
పక్షిలాఎగిరి వచ్చి
నీ భుజంపై తలవాల్చ లేకున్నానే!
గాయాలు చేసిన మనసు శూన్యంలో
కొత్తగా స్వరాలు పల్లవిస్తుంటే
వసంత కోయిలనై
నీ ఇంటి చెట్టుపై వాలి
రాగలు పాడలేకున్నానే!
జ్ఞాపకాలన్నీ ముసురుకొనిరాగ
అజ్ఞాతపు ఆవిరంతా
ద్రవించి రాలుతుంటే
ప్రేమగా ఓ చినుకునై
నీ హృదయాన్ని తడుప
మేఘమైన కాలేకున్నానే!
ఎప్పటి నెమలీకలో
ఇప్పుడు పిలకలై పిల్లలై
పకపకా నవ్వుతూ, పరుగులిడుతున్నవి
ఇదంతా నీకు చెప్పాలన్న ఉత్సాహంలో
మరిచేపోయా
ఉన్నచోటనే చెట్టులా పాతుకుపోయానని
నేనుగా రాగలనా? నిన్ను చూడగలనా?
ఈ అనుభూతులన్నీ
మనసున మూటకట్టి
ఇక మనసునే పయనమైపొమ్మననా
మనసుచేతులతో
ఎదురొచ్చి హత్తుకుంటావుగా
నీవైపే దౌడు తీసే లేగ దూడ
పలుపు తెంపుకొని రాలేదు
అటుకులు మూటగట్టుకుని నేనూ రాలేను
నీవే రావాలి నా కోసం
చిన్ననాటి కబుర్లన్నీ చెప్పుకోవాలి
మరవకు మిత్రమా!
నీచెంతనే నాచింతకు ఓదార్పు సుమా!!