పంచభూతాలమయమైనప్రకృతిని పూజించటం,ఆరాధించటం,కాపాడుకోవటం మానవధర్మమనే సందేశాన్నందించే కథనే పిప్పలాదునిచరిత్ర.మహాభాగవతంలో సూత్రప్రాయంగా ఉన్నప్పటికీ శివపురాణం, బ్రహ్మపురాణాలలో పిప్పలవృక్షమైన రావిచెట్టు గొప్పదనం విస్తృత పరుస్తూ పిప్పలాదమహర్షి జన్మ,మహిమలు,రచనలు, సామాజిక ఉపయోగం గురించి అనేక కథనాలు కనిపిస్తాయి.వేలసంవత్సరాలుజీవనం సాగించే పంచపల్లవాలుగా ప్రాధాన్యత సంతరించుకుని పూజనీయ బహువార్షిక వృక్షాలు మామిడి,మర్రి,మేడి,రావి,జువ్వి .క్షణం తీరిక లేకుండా ఆకులనునాట్యంచేయిస్తూ ఇరవైనాలుగు గంటలు ప్రాణవాయువును అందించే రావిచెట్టుకు చలపత్రవృక్షం అనే పేరుకూడా ఉంది.దానిలో నిత్యనివాసముండే విష్ణుమూర్తి ని అశ్వత్థనారాయణునిగా పూజించటం భారతీయ సంస్కృతి లో భాగం.దానిగురించి వేదాల్లో మంత్రాలు,పురాణాలలో స్తోత్రాలు ఉన్నాయి.రావిచెట్టును భక్తిగా కొలిచిన సామాన్య మానవులు పొందే ప్రయోజనాలనుసర్వవ్యాప్తం చేసినగొప్పమహర్షిగా పిప్పలాదుడు కీర్తిమంతుడయ్యాడు.ఆ చరిత్ర అందరూ తెలుసుకోవలసినదే.
“శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం” అన్న ఆర్యోక్తి అందరికీ తెలిసిందే.ఇతరుల మంచి కొరకు ఉపయోగపడినపుడే మానవ జన్మకు అర్థం పరమార్థం.దధీచి మహర్షి ఈ కోవలోకి చెందిన వాడు.
దధీచి ఇథః దధీచి అంటే మనసును ఆత్మయందు సుస్థిరం చేసేవాడని చ్యవన మహర్షి తన కుమారునికి దధీచి అని పేరు పెట్టాడు. దధీచి ఇచ్ఛా మృత్యు వరాన్ని పొందినవాడు.అందుకే దేవతలకోసం తన శరీరాన్ని త్యాగం చేశాడు.అతని ఎముకలను నుండి వజ్రాయుధాన్ని తయారు చేసి రాక్షససంహారంచేశారు.
***
దధీచి సువర్చలా కుమారుడే పిప్పలాదుడు.ఇతడు ప్రశ్న ఉపనిషత్తులను రచించిన మహాజ్ఞాని.జన్మించిన ఐదేండ్లవరకూ
ఎవ్వరికైనా శని ప్రభావముండకుండా చేసినట్టి మహానుభావుడు.
అంతేకాకుండా ఎవరైతే ఉదయమే రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి నీరుపోసి నమస్కరిస్తారోవారికి శనిప్రభావం ఉండకుండా చేసిన గొప్పవాడు పిప్పలాదుడు.దధీచి అస్థికలదానంచేసి శరీరాన్ని విడిచి నప్పుడు అతనిభార్య సువర్చలా కూడా సహగమనం చేయడానికి సిద్ధపడగా దేవతలువారిస్తారు.ఆమె ఆ వేళ గర్భవతిగా ఉంటుంది.పుట్టబోయే పిల్లవాడికోసమైనా జీవించాలని దేవతలు కోరుతారు.ఆ పుట్టబోయే శిశువు గొప్ప జ్ఞాని కాగలడని పలుకుతారు.
సువర్చలా దేవతలతో తనకు బిడ్డను వెంటనే ప్రసాదించమని,గర్భంలో ఉన్న బిడ్డ బయటకు వచ్చేవరాన్నికోరుతుంది.సువర్చల పిప్పలవృక్షంక్రింద ప్రసవించి పండంటి బిడ్డ కు జన్మనిస్తుంది.మహావృక్షంక్రిందపుట్టినమ పిల్లవాడిని ఆ వృక్షమే తల్లి వలె పెంచవలసినదిగా కోరింది.కాన పిప్పలాదుడు అనే పేరు సార్థకమయ్యింది.
సువర్చల బిడ్డకు తండ్రి లేకుండా చేసిన దేవతలకు శాపమిస్తుంది.తనకుమారుడైన పిప్పలాదునికి ఆకలిదప్పులు లేకుండా అమృతం ఇవ్వమని చంద్రుడిని వేడుకుంది.దేవతలు సరే అని అమృతము ఇప్పిస్తారు.పిప్పలాదుడిని కనులారా చూసుకుని ఎంతో మురిసిపోతుంది.ఆ రావిచెట్టునీడలో పిల్లవాడు హాయిగా పెరుగగలడనే విశ్వాసాన్ని ఏర్పరుచుకుంది.
*
సువర్చల దేవతలకు శాపమివ్వడానికి కారణం ఒక్కరుకూడా తన కొడు ఆలనాపాలనా చూసుకోవటానికి ముందుకు రాలేదని ఆవేదన చెంది శాపమిస్తుంది.
“మీరు ఇంతకాలం సంపాదించిపుణ్యం అనుభవించినా నేటి నుండి ఇంకో పుణ్యంసంపాదించలేరు.ఆతర్వాత ప్రాణాలు కోల్పోతారు” అంటుంది.భర్తనువీడి ఉండలేక అతని చితి మీద కూర్చుని సహగమనం చేస్తుంది.
**
పిప్పలాదమహర్షి బాలుడిగా ఉన్నప్పుడు ఓరోజు చంద్రుడిని తన పుట్టుక గురించి అడిగితెలుసుకుంటాడు.తల్లిదండ్రుల మరణానికి దేవతలే కారణమని భావించి వారిని చంపాలనుకుని చంద్రుడి సలహా అడుగుతాడు.చంద్రుడు పరమశివునికోసం తపస్సుచేయమనిసూచిస్తాడు.బాలుడు గోదావరి నదీ తీరమున కూర్చొని గొప్ప తపస్సు చేసి పరమేశుని దర్శనం పొందుతాడు.శివుడు వరము కోరుకోమనగా తనకు దేవతలనుచంపేశక్తిని ప్రసాదించమని కోరుతాడు.భవుడు. కృత్య అనే శక్తిని అనుగ్రహిస్తాడు.ఆశక్తిని దేవతలందరినీ చంపమని మహేశుడాజ్ఞాపిస్తాడు.ఆన మేరకు దేవతలందరినీ చంపడం మొదలు పెడుతుంది.దేవతలందరూ బ్రహ్మ దేవుని దగ్గర మొరపెట్టుకున్నారు.విధాత మీరందరూ మహాదేవుని ప్రార్థించమని సూచిస్తాడు.దేవతలంతా ముక్తీశ్వరునివేడగా మీరు పిప్పలాదుడినే శరణుకోరమని సలహానిస్తాడు.వారట్లే పిప్పలాదుని పదసన్నిధి శరణు వేడగా శాంతి చెందుతాడు.శంకరుడు పిప్పలాదునికి తల్లిదండ్రుల దర్శనం చేసుకునే వరమందిస్తాడు.ఆ శూరుడు తల్లిదండ్రుల చూసి ప్రణమిల్లి ఆనందిస్తాడు.దధీచి పిప్పలాదుడి ని తపస్సునకు వెళ్ళమని చెబుతాడు.అట్లే అతడు తపోవనంలో జీవితంగడుపుతాడు.గొప్ప గురువుగా పరిణతి చెంది శిష్యకోటికి మేధాసంపత్తిపంచుతాడు.ప్రశ్నోపనిషత్తు రచించి ఆరుగురు ఋషులకు బోధించాడు.దశోపనిషత్తులలో ప్రామాణికత గల్గింది ప్రశ్నోపనిషత్తు.
“ఓంకారమంటే ఏమిటి.ప్రాణమంటేఏమిటి,ప్రాణం జీవులలో కి ఏవిధంగా ప్రవేశిస్తుంది,ఆత్మ అంటే ఏమిటి,దేవుడంటే ఎవరు, ఆత్మానందాన్ని ఏవిధంగా అనుభవించాలి”,అని అనేక విషయాల గురించి ప్రశ్నోపనిషత్తు లో విశ్లేషిస్తారు.
**
మరోకథనంలో
పిప్పలాదుడు కౌశికుని కొడుకు.తానుపోషించలేక బాలుడిని రావిచెట్టు క్రింద వదులుతాడు.అక్కడదొరికినపండ్లుతిని,దగ్గర చెరువులో నీరు తాగి బతగటంతో ఆయనకు పిప్పలాడు పేరువచ్చింది.
పిల్లవాని దీనస్థితి గమనించి నారదుడు ఓం నమోభగవతే వాసుదేవాయ మంత్రోపదేశం చేయటంతో జపం చేసి పిప్పలాదుడు జ్ఞానవంతుడై మహర్షిగా పరిణతి పొందుతాడు.
చిన్నతనంలో తనకష్టానికి శని కారణమని తెలుసుకుని ఆయనపై ఆగ్రహంచెందుతాడు.
దేవతలు ప్రదేశమైన పిప్పలాదుని సముదాయించి ప్పిపలాదుని స్మరించిన వారికి శనిదోషాలుండబోవని దానివల్లత అతని హృదయవేదనతీరుతుందని వరమిస్తారు.అందుకే పిప్పల వృక్షాన్ని
మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రత శ్శివ రూపాయ వృక్షరాజాయ తే నమః కోణస్థఃపింగళోబభ్రుః కృష్ణో రౌద్రోంతకో యమః శౌరిశ్శైనశ్చరో మందః పిప్పిలాదేవ సంస్తుతః అంటు ప్రదక్షిణ చేసే సంప్రదాయం నడుస్తుంది.
పిప్పలాదుడురచించిన ప్రశ్నోపనిషత్తు కు ఆదిశంకరులు భాష్యం వ్రాసారు.దీనిలో ఎన్నో విషయాలు ఆరు ప్రశ్నలతో వివరించారు
పరబ్రహ్మోపనిషత్తు లోకూడా పిప్పలాదుడు జ్ఞానాన్ని ప్రసాదించినట్లు ఆధారాలున్నాయి..
ఋషులు,జ్ఞాన సంపన్నులు వారు బోధించినమార్గంలో నడిస్తే మానవ జీవితం చరితార్థమవడమే కాకుండా ఒక పరిపూర్ణత చేకూరుతుంది.
**
ఉపయుక్తవనరులు/గ్రంథసూచి
1.బ్రహ్మపురాణం, 2.శివపురాణంలో శతరుద్రసంహితపిప్పలావతారవర్ణనము24వ అధ్యాయము.
3.డాక్టర్ అంబడిపూడి శ్యాంసుందర్ రావు,
4.డాక్టర్ ఎం.ఎస్.ఆచార్య,
5.చాగంటి కోటేశ్వరరావు గారి వంటి ప్రముఖుల ప్రవచనాలు,వ్రాతలు…