
దమయంతి
మన పురాణాలలో గొప్ప ప్రేమ కథ నలదమయంతుల ప్రణయం. దమయంతి ప్రేమకు మాత్రమే కాదు, వివాహానంతరం సహ ధర్మచారినిగా కూడా ఎంతో ఆదర్శనీయురాలు.
విదర్భ దేశపు రాజు ” భీముని ” కూతురు దమయంతి. పిల్లలు లేని ఆ రాజుకు ‘ దమనుడు’ అనే ముని ఇచ్చిన వరం కారణంగా దమయంతి కలిగింది. దమయంతి సౌందర్య రాసే కాదు గుణవంతురాలు కూడా . దమయంతి అనగా తన అందము చే ఇతరులను దమించునది.
షట్ చక్రవర్తులలో ఒకరైన నలుడు నిషిధ దేశాధిపతి. ఒకనాడు వన విహారం చేస్తూ ఒక హంసను చేజిక్కించుకున్నాడు. ఆహంస విదర్భ దేశపు రాజు కుమార్తె అయిన దమయంతి గుణ గుణాలను, అందచందాలను నలునికి వివరించి, నలుని ధమయంతిని మోహించేటట్లు చేసింది. ఆ హంస విదర్భకు కూడా వెళ్లి దమయంతికి నలుని అందచందాలు, వీర పరాక్రమముల గురించి పూసగుచ్చినట్టు చెప్పింది. దమయంతి కూడా నలుని మీద మొహం కలిగింది. ఇరువురు వివాహం చేసుకోవాలని మనసులో నిశ్చయించుకున్నారు.
ఇంతలో విదర్భరాజు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. ఈ స్వయంవరానికి దమయంతి అందచందాలు విన్న, దిక్పాలకులు కూడా వచ్చారు. నలమహారాజు కూడా వచ్చారు. దమయంతి నలుల ప్రేమ కథ తెలియని దిక్పాలకులు, నలుని రాయబారిగా “తమలో ఎవరినైనా వివాహం చేసుకోవాలని'” పంపారు. కానీ దమయంతి ససే మీరా ఒప్పుకోనంది. చేసేదిలేక దిక్పాలకులు నలుని వేషం ధరించి హాజరయ్యారు. దమయంతి ఇది గమనించి,వారిని ప్రార్థించగా, తమ యదార్ధ రూపాలు ధరించి, నలదమయంతుల వివాహానికి కారకులయ్యరు.
కొంతకాలం నలుని తో సుఖ భోగాలు అనుభవించింది దమయంతి. కలిపురుషుని ప్రభావం వలన తన దాయాదులతో జూదం ఆడి సర్వం కోల్పోయి, కట్టుబట్టలతో అడవుల పాలయ్యారు. నలుడు దమయంతిని తన తండ్రి దగ్గరకు వెళ్లి పొమ్మన్నాడు. కానీ దమయంతి దానికి ఒప్పుకోలేదు. మీరున్నచోటే నాకు స్వర్గం అన్నదా సహనశీలి, సాధ్వి. తాను లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోతుందని గ్రహించి నలుడు ఒక రాత్రి దమయంతిని ఒంటరిగా వదిలి వెళ్లిపోయాడు. ఆమె చాలా దుఃఖించి, విదర్భ చేరి, నలుని వెతకడానికి చారులను పంపింది. అడవిలో నలుని పాము కరచి నల్లగా రూపహీనుడైనాడు
దమయంతి పంపిన ఒక చారుడు రుతుపర్ణ దేశానికి వచ్చి భాహుకుడి రూపంలో నున్న వంట వాడిని చూసి ఇతడే నలుడు అని గుర్తించి దమయంతికి వార్త చేరవేశాడు. తెలివైన దమయంతి ఆ బహుకు డు నలుడో కాదో అని తెలుసుకోవడం కోసం,ఋతుపర్ణుడికి” తాను తిరిగి వివాహం చేసుకోబోతున్నానని, మరునాడు స్వయంవరం అని ఆహ్వానం పంపింది. ఎందుకంటే నలునికి ” అశ్వ హృదయం ” అని విద్య తెలుసు. ఎంతో వేగంగా రధాని నడపగలడు. ఇది తెలిసే దమయంతి ముందు చూపుతో నలుని రప్పించడానికి పన్నాగం పన్నింది. ఎంతటి రాజకీయ చతుర్రాలో కదా!
ఆమె భావించినట్లుగానే, నలుని సారధ్యం వలన ఋతుపర్ణుడు విదర్భ చేరుకున్నాడు. ఇది అబద్ధపు స్వయం వరమని, బహుకుడు నలుడు అని రుజువు చేసుకోవడానికి తాను వేసిన ఎత్తని దమయంతి నివేదించింది. ఆమె పాతివ్రత్య మహిమ వలన
భర్తకు నిజరూపం కూడా తెప్పించుకున్న మహా పతివ్రత దమయంతి. ప్రజల కోరిక మీద పోయిన రాజ్యాన్ని తిరిగి దక్కించుకుని, చిరకాలం సుఖంగా జీవించాడు. ఇందులో మనకి దమయంతి సహనము, ముందు చూపు, రాజకీయ చతురత కూడా కాన వస్తున్నాయి.
నలదమయంతులు తమఅమర ప్రేమ వలన చరిత్రలో చిరస్మరణీయులయ్యారు. వీరిని తలుచుకోవడం వలన కలి దోషం కూడా ఉండదని నానుడి.