రిమోట్ కంట్రోల్ లు ….

8-7-2023 తరుణి పత్రిక సంపాదకీయం

డాక్టర్ కొండపల్లి నీహారిణి సంపాదకురాలు

ఎంత ఆధునికత మన చుట్టూ అల్లుకుని,మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా ఏం లాభం ?వెండితెర వైభవాన్ని మరిపించే బుల్లితెరలు వచ్చిన తర్వాత, రిమోట్ కంట్రోల్ చేతి ఆయుధాలు అయ్యాక బ్రతుకు పోరాటపు విలువలను గురించిన పోలికలు కూడా దీంతోనే చెప్పాల్సి వస్తోంది. అవును రిమోట్ కంట్రోల్ సంసారంలో చాలా గొప్ప …. గో…ప్ప…పనులు చేస్తున్నాయి. రూపం ఏమనుకున్నారు? అత్తగారు మామగారు భర్త గారు భార్య గారు ల మాటలు ఈ రూపాలన్నమాట!
సరే ఇప్పుడు ప్రస్తుతం అత్తగారు ( ఇద్దరి తల్లుల రూపం వాళ్ళ మాటల రూపం), భార్యగారు ( కోడలు, కూతురు రూపం, వాళ్ళ మాటల రూపం)అనే రిమోట్ ల గురించి మాట్లాడుకుందాం.
ఇలా అవసరమా ఆడవాళ్ళమైన మనమే ఆడవాళ్ళను గురించి ఇలా చెప్పుకుంటే ఎలా అనిపిస్తుంది? ఇవి చదువుతున్న వాళ్ళకి !కానీ తప్పదు మంచి మార్పు కోరుకునే మనలాంటి వాళ్ళకి తప్పదు .తప్పు అవతలి వాళ్ళదా? ఇవతలి వాళ్ళదా ? అని ప్రశ్నలు వేసుకున్నప్పుడు అసలు తప్పులు ఎలా జరుగుతున్నాయి ?ఎందుకు జరుగుతున్నాయి? అనేది కూడా ఒకసారి పునరాలోచన చేసుకోవాలి . పొరపాటు వేరు ,తప్పు వేరు. అనుకోకుండా జరిగేది , తెలియకుండా చేసేదాన్ని పొరపాటుఅనంటాం. తెలిసీ ,కావాలని చేస్తే తప్పు అని అర్థం. అంటే వ్యంగ్యం, కోపము అన్నీ వీళ్ళ వెటకారాలు అన్నీ హృదయాల ముందు వచ్చి కూర్చుంటాయి తప్పదు. ఇందులో భాగంగానే ఈరోజు’ రిమోట్ ‘ అని పిల్చుకుంటూ ముచ్చటించుకుందాం.
మనం కని పెంచిన పిల్లలు పెరగాలి ఎదగాలి ఉన్నత స్థానం అధిరోహించాలి అని కోరుకుంటాం ఇందులో భాగంగానే వయసు రాగానే పెళ్లి కూడా చేయాలనుకుంటాం. కూతురు కైనా కొడుకుకైనా పెళ్లి చేసి వాళ్ళ సంసారం నిలబడాలని ఆశపడతాం.ఇది మాతృ , పితృ హృదయాలకు ఉదాహరణ. పెళ్లి చేయాలంటే ఏంత ఆరాట పడతారు? ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తారు?
1. ప్రేమ పెళ్లి 2.పెద్దలు కుదిరిచిన పెళ్లి.ఇలా పెళ్లిళ్లు రెండు రకాలు. ఎలా జరిగిన పెళ్లి అయినా వారి కుటుంబాన్ని ఏర్పరచుకొని సుఖ సంతోషాలతో బ్రతకాలని కోరుకోవడంలోనే నిజమైన తృప్తి ఉంది కదా! ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఉక్రోషం మమ్మల్ని కాదని ఇష్టమైన తీర్లో వెళ్ళిపోయారు అని. ఇక ప్రతి మాటకు ప్రతి చేతకు జల్లెడ పట్టడమే వీళ్ళ పని అటు తల్లిదండ్రులు , ఇటు అత్తమామలు. తామే కుదిరించిన పెళ్లిళ్లు అయినా అత్త పెత్తనం,మామ పెత్తనం చేయడానికని కోడి గుడ్డుకు వెంట్రుకలాగడం చేస్తుంటారు. ఇది ఒక మానసిక పైశాచిక ఆనందం ఇలా అనిపిస్తుంది కావచ్చు ఎదుటివాడు తప్పు చేస్తున్నారే అనుకోండి తప్పు చేసిన మనం తప్పు చేస్తున్నావు అంటే ఎవరికి నచ్చుతుంది ? ఇవి ఏమన్నా దేశం నష్టపోయే తప్పుల కాదు కదా ! చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసి గొడవలకు దారి అయ్యేలా మాట్లాడితే ఏం వస్తుంది ?సంసారాలు కూలిపోతున్నాయి దీన్నే రిమోట్ కంట్రోల్ అని అనాల్సిన మాటకు జోడించుకుంటే,
కొడుకు కోడలు విదేశాల్లో ఉన్నారనుకోండి విదేశాల్లో ఉంటే మగవాళ్ళు పనులు చేస్తారు చేయాల్సి వస్తుంది అక్కడి మగవాళ్ల లాగా అనే భయం ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకు పట్టుకుంది ఈ మధ్యన !!దాంతో ఏం చేస్తున్నారు ?కోడలికి ఫోన్ చేసినప్పుడు ఒక రకంగా , కొడుకుకు ఫోన్ చేసినప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నారు . కోడలు అయితే ఇన్ డైరెక్ట్ గా పనులు ఎవరు చేశారో తెలుసుకోవాలి ఇది మా చాతుర్యం అని అనుకుంటున్నారు .అనుకొని వంట అయిపోయిందా? ఏం చేస్తున్నారు ఈరోజు కూరగాయలు ఎవరు కట్ చేసారు ?గిన్నెలు తోమింది ఎవరు ?ఇటువంటి ప్రశ్నలు అడగడం ! ఇది అవసరమా ? ఏం ? కొడుకు చేయకూడదా ? కోడలే చేయాలా కూతురు విషయంలోనేమో అల్లుడు చేస్తే బాగుండని కోరుకుంటారు .
ఈ ఫోన్లు ఏం ఉపయోగం చేస్తున్నాయి?ఆ అమ్మాయికి కోపం తెప్పిస్తున్నాయి ,కోపం రాగానే ఎవరిమీద ప్రదర్శిస్తుంది ? తన భర్త పైన ప్రదర్శిస్తుంది !! అనే ఒక ఇంగిత జ్ఞానం లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు . ఇక కొడుకుకు ఫోన్ చేస్తూ పనులను ఎలా ఎగ్గొడితే బావుంటుందో ఉపాయాలను సూచిస్తున్నారు . పనులు కాదు, The Kitchen is the Heart of the Home అని కదా అంటాం.హోమ్ అనేది గోడలతో నిర్మించబడింది కాదు! హోమ్ అంటే మనసులతో నిర్మించబడింది !!అందుకోసం అలా మనసులు బాధపడేలా మాట్లాడకుండా ‘వంట ఇల్లు ‘ఇద్దరికీ సంబంధించింది కాబట్టి ఇద్దరూ కలిసి మెలిసి చేసుకోవాలి అనే మంచి మాటలు చెప్పాలి. ఇలా చెప్పడం చేత కాకుంటే, చెప్పడం ఇష్టం లేకుంటే నోరు మూసుకొని ఊరుకోవాలి.అంతే కానీ ఇండియా నుండి ఫోన్లు చేసి ఛానెల్స్ తిప్పినంత ఈజీ గా కొందరు మాటలను మారుస్తున్నారు.ఒకవేళ అమెరికాలో ఉంటే ఇండియా వాళ్లకి ఫోన్ చేసి రిమోట్స్ లాగా నొక్కుతూ, నొక్కి నొక్కి వక్కాణించి చెప్తూ కుటుంబాలలో మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు.
ఒకరిని మించి మరొకరు చూపుతున్న ఈ సమరోత్సాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు. “అదేంటీ ముఖాన బొట్టు లేకుండా ఉన్నావేంటీ? అక్కడి వాళ్ళు పెట్టుకోకుంటే నీకేంటి? మనమూ మన సాంప్రదాయమూ … ” అని దీర్ఘాలుతీస్తారు ఇవన్నీ మానుకున్ననాడే పిల్లల మధ్య మనస్పర్ధలు రాకుండా ఉంటాయి. సంసారాలు వర్థిల్లుతాయి. మీరేమంటారు?
—-***____

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

One Comment

Leave a Reply

Leave a Reply to Rama S. Gurijala Cancel reply

Your email address will not be published. Required fields are marked *

గాడి తప్పిన …..

యముండా!