లోకాభిరామాయణం. 4

ప్రైవసీ, సీక్రసీ

ఈ రోజు లోకాభిరామాయణంలో అందరికీ తెలిసినదీ, కానీ తెలుసుకోవాల్సిన విషయం గురించి మాట్లాడుకుందాం.

జవహర్ లాల్ నెహ్రూ జైలులో ఉన్నప్పుడు ఇందిరాగాంధీకి ఉత్తరాలు రాస్తూ ఉండేవాళ్ళు. అవి మామూలు కుశల ప్రశ్నలతో కాదు. అవి జీవితంలో ఎలా ఉండాలి అని తెలియ జెప్పే గొప్ప పాఠాలు. అవి ‘లెటర్స్ టు హర్ డాటర్ ‘ అనే పేరుతో చాలా ప్రసిద్ధి చెందాయి అనేది మనందరికీ తెలుసు.
రాజకీయంగా నెహ్రు అంటే కొంతమందికి ఇష్టం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈ ఉత్తరాలు ప్రతి ఒక్కరూ చదవాల్సినవి.
అందులో నాకు ఒకటి ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాను. అతను ఒక ఉత్తరంలో ఒకటి చెపుతాడు.
” ప్రైవసీ , సీక్రసీ అనే రెండు పదాలు మనం తరచూ వాడుతూ ఉంటాం. ఎవరైనా సీక్రసీ మెయిన్ టైన్ చేస్తున్నారు అంటే వాళ్ళు చేయకూడని పని ఏదో చేస్తున్నారని అర్ధం. కాబట్టి నీవు ఏ పని చేసినా సీక్రెట్ గా చేయవద్దు‌. అయితే ప్రైవసీ అవసరం. అంటే చేసే పనికి కాస్త చాటు అవసరం” అని ఇంకా చాలా చెపుతాడు.

మనం ఈరోజు సీక్రసీ , ప్రైవసీ గురించి మాట్లాడుకుందాం.
ఆ మధ్య మా ఫ్రెండ్ మాట్లాడుతూ ఒక విషయం చెప్పింది. వాళ్ళ చెల్లెలి కొడుకుకి అమెరికా ఛాన్స్ వచ్చింది. నాలుగు రోజుల్లో ప్రయాణం అనగా వచ్చి చెప్పాడు. అంతటితో ఊరుకోకుండా
” ప్రాసెస్ కంప్లీట్ అయి, వీసా వచ్చేదాకా ఎవరికీ చెప్పవద్దు అనుకున్నా పెద్దమ్మా ” అన్నాడుట.
వాడంటే చిన్న పిల్లవాడు, కానీ మా చెల్లెలు కూడా మాటవరసకైనా అనలేదు అని బాధపడ్ఠది.

అది విన్న నేను పెద్దగా ఆశ్చర్య పోలేదు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఇలా సీక్రెట్ మెయిన్ టైన్ చేయటం చూస్తూనే ఉన్నారు.
అదేమంటే, చెప్పిన దగ్గర్నించి ఈర్ష పడతారు, మన పనికాదు, సక్సెస్ రాదు అని వాళ్ళ స్థిరమైన అభిప్రాయం.
ఒకప్పుడు అన్నదమ్ములు, అన్నాచెల్లెళ్లు, మేనత్తలు,మేనమామలు ఎవరైనా సరే, ఒకరి ఇంట్లో ఒకరికి ఏదైనా కష్టం కానీ,సుఖం కానీ ,ఒక విజయం కానీ, ఓటమి కానీ అందరికీ చెప్పుకునేవారు.
కష్టంలో అందరూ ఓదార్పు ఇచ్చి, తగు సలహాలు ఇచ్చేవారు. అలాగే మంచి విషయం అయితే, చాలా ఆనందించేవారు.
కానీ నేడు ఆ పరిస్థితి లేదు. మంచి విషయాలు చెపితే ఈర్ష పడతారు, బాధలు,ఓటమి గురించి చెపితే నవ్వుకుంటారు అనే భావన సర్వసాధారణం అయిపోయింది.
అసలు అంత సీక్రెట్ అవసరమా? నెహ్రూ చెప్పిన సిధ్ధాంతం ఇక్కడ వర్క్ అవుట్ కావటం లేదు.
ఇక రెండవది ప్రైవసీ. సీక్రెట్ మెయిన్ టైన్ చేస్తున్నారు, కానీ ప్రైవసీ ఉండాల్సిన చోట అది ఉండటం లేదు. అక్కడ అంతా బహిర్గతం అవుతున్నది. ఎక్కడ?
నేడు ఫేస్ బుక్ ,యూ ట్యూబ్ ఛానెల్స్ పుణ్యమా అని ఒకరికొకరు ముఖ పరిచయం లేకపోయినా, ప్రైవసీ అనేది లేకుండా వ్యక్తిగత విషయాలను అందరితో షేర్ చేసుకుంటున్నారు.
ఒక అక్కయ్య ఇంట్లో ఏం జరుగుతుందో తమ్ముడికి తెలియదు. తమ్ముడి పరిస్థితి అక్కయ్యకి తెలియదు. అంతా సీక్రెట్ .
అందరితో సమానంగా ఏదో గ్రూప్ లో చూసి వీళ్ళు తెలుసుకుంటారు. ఆ సీక్రెట్ ఇక్కడ ఉండదు.
కుటుంబ విషయాలు రచ్చకెక్కుతున్నాయి అంటే కోపం రావచ్చు. ఇంట్లో కుటుంబ సభ్యులకి తెలియని విషయాలు కూడా ముఖ స్నేహితులకి ,బయట అందరికీ తెలుస్తున్నాయి. ఒక రకంగా కుటుంబ విషయాలు రచ్చకెక్కుతున్నాయి.
ఒక కష్టం కలిగితే, రక్త సంబంధీకులు, తోబుట్టువులకి చెపితే ఒకళ్ళు కాకపోతే ఒకరైనా సహాయపడతారు. ఒకవేళ ఎవరూ సాయం చేయకపోయినా, కుటుంబం వీధిన పడదు.
కానీ, అక్కడ అహం అడ్డు వస్తుంది. ముక్కు మోహం తెలియని ‘స్నేహితులతో’ చెప్పుకోవటానికి ఏ మాత్రం అహం ఉండదు.
ఫేస్ బుక్ స్నేహితుల్లో బాగా దగ్గరైన వారుంటే, వారితో వ్యక్తి గతంగా మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. అందులో తప్పులేదు.
అలా కాకుండా వాటిని వేదికగా తీసుకుని పర్సనల్ విషయాలు అన్నీ పబ్లిక్ చేయటం మంచిదా? ఇవి వారి తాలూకు బంధువులు, స్నేహితులు,ఇంట్లోవారు చూసినట్లయితే వాళ్ళు బాధపడే అవకాశం ఉంటుంది కదా!
అందరూ ఇలా ఉంటారు అని అనుకోలేం. అలా ఉన్నవారి గురించే మాట్లాడుకుంటాం.
సీక్రెట్ ఉండాల్సింది దేశ రక్షణ కోసం ప్రభుత్వం చేసే వ్యూహాలలో. సాధారణ కుటుంబ వ్యవస్థలో ప్రైవసీ ఉండాలి కానీ సీక్రసీ కాదు.
ఇప్పుడు అన్నీ న్యూక్లియర్ ఫామిలీస్. బంధాలు, బంధువుల విలువ పిల్లలకి తెలియాలి. వారి అండా దండా ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే మనసులు విప్పి అయిన వాళ్ళతో మాట్లాడుకోవాలి. అరమరికలు లేని మానవ బంధాల్ని ఏర్పరచుకోవాలి.

Written by PVS Krishnakumari

పేరు. : పీ. ( వల్లూరు) వి. యస్. కృష్ణ కుమారి
భర్త : పోతరాజు వేణుగోపాల కృష్ణ మూర్తి ( రిటైర్డ్ ఫైనాన్స్ ఆఫీసర్ హై కోర్టు)
పుట్టిన తేది. ఆగష్టు, 14
తండ్రి. : వల్లూరు కోటేశ్వరరావు
తల్లి : వల్లూరు రాజ్యలక్ష్మి
పిల్లలు : నీలా సుందరి ( కూతురు )
రవిశంకర్ ( అల్లుడు)
శ్రీవాత్సవ ( కుమారుడు)
‌. మృణాళిని ( కోడలు)

జన్మస్థలం : వల్లూరు , గుంటూరు జిల్లా
విద్యాభ్యాసం. : పొన్నూరు, విజయవాడ ,
క్వాలిఫికేషన్ : బి.ఏ. బీఈడీ
వృత్తి. : ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ శ్రీవాణి మోడల్ స్కూల్ ( సొంత స్కూల్)
ప్రవృత్తులు. : సంగీతం, సాహిత్యం
సాహితీ ప్రయాణం. : 2010 లో మొదటిసారిగా కవితలతో మొదలైంది. వార్త, మన తెలంగాణా, సత్యం ఆన్లైన్ మ్యాగజైన్ లలో వందకి పైగా కవితలు
2015 లో మొదటి కథ ' ఓ సీత కథ' నవ్య వారపత్రికలో ప్రచురితమైంది. ఆ తర్వాత నవ్య, పాలపిట్ట, నమస్తే తెలంగాణా, జాగృతి, ఉషోదయ వెలుగు, వార్త ఆదివారం అనుబంధం, ఉషా మ్యాగజైన్ లలొ దాదాపు ఇరవై ఐదు కథలు, బహుమతులు , సాధారణ ప్రచురణకు ప్రచురితమైనాయి.
కథా మంజరి, కథా వేదిక, తరుణి ఇంకా అనేక ఫేస్ బుక్ గ్రూప్ లలో యాభైకి పైగా కథలు రాగా, ఇరవై కథలకి బహుమతులు వచ్చాయి.
నవలలు : జీవన విపంచి
వేద సుధామయం.
నేల నుండి నింగికి ( అముద్రితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నా బాధ్యత

సంగీత సరోవరంలో విరిసిన పద్మం – ఎన్. రాజం