లోకాభిరామాయణం -7

యుద్ధం

” హలో అక్కయ్యా, ఎలా ఉన్నావు?” అడిగింది రజనీ.
” నేను బాగానే ఉన్నాను. నీవు ఎలా ఉన్నావు? ఫోన్ చేసి చాలా రోజులైందని చేసాను. ఏమిటీ కబుర్లు?” అడిగింది వసంత.
” ఆ, నాకేముంటాయి. నీవే చెప్పాలి” అంది రజనీ.
‌. “ఏమిటే, అంతా నీరసంగా మాట్లాడుతున్నావు? ఏమైందీ?” కంగారుగా అడిగింది వసంత.
“ఏముంటుందీ, నాకు, మీ మరిదికి ప్రతిరోజూ ప్రతిదానికీ యుద్ధమే” అంది రజనీ.
“అంత యుధ్ధాలు ఏం జరుగుతున్నాయే?” నవ్వుతూ అడిగింది వసంత.
“యుధ్ధమా? మళ్లీనా?ఎక్కడా?” పరిగెత్తుకుంటూ వచ్చాడు వసంత భర్త ఆదినారాయణ.
“యుధ్ధం లేదు, పాడూ లేదు. ఏదో మా చెల్లిలితో మాట్లాడుతున్నా అంతే” అంది వసంత విసుగ్గా.
“మీ చెల్లితో మాట్లాడుతూ యుధ్ధాలు అన్నావు కదా!”
అన్నాడు ఆదినారాయణ కంగారుగా.
“ఏదో మాట వరుసకి ఇంట్లో యుధ్ధాలు జరుగుతున్నాయి అంది అంతే. ఇవి మీరు అనుకునే విధ్వంసకర యుధ్ధాలు కాదు” అంది వసంత.
ఫోన్లో అర్ధం అయీ,కానట్లు ఉన్న వీరిద్దరి సంభాషణ విన్న రజనీ,
“ఏంటక్కా, బావగారు ఏదో కంగారు పడుతున్నారు?” అడిగింది తాను కంగారు పడుతూ.
“ఏం చెప్పనే. ఈయన చరిత్ర పరిజ్ఞానం వల్ల యుధ్ధాలు, వాటి వల్ల జరిగే అనర్ధాలు తెలుసు కదా! ఇప్పుడు మళ్లీ ప్రపంచంలో జరుగుతున్న యుధ్ధాలు గురించి తెగ బాధ పడిపోతున్నారు ఈ మధ్య. యుధ్ధం అంటే ఉలిక్కిపడి పోతున్నారు” అంది వసంత.
“బావగారు భయం నిజమే అక్కా. ఈ యుధ్ధం వల్ల విదేశాల్లో ఉన్న మనవాళ్ళు ఎలా ఉంటున్నారోఅనే భయం మనకీ కలుగుతున్నది‌ ఉద్యోగాలు ఉంటాయో,పోతాయో తెలియదు‌. అన్నిటి ధరలూ పెరిగిపోతున్నాయి” అంది రజనీ.
ఫోన్ పెట్టేసిన తర్వాత కూడా వసంత ఆలోచనలు యుధ్ధం చుట్టూనే తిరుగుతున్నాయి.
ఈ యుధ్ధాలు ,వాటి పరిణామాలు మానవాళికి కొత్త కాదు .మానవ జాతి మొదలైనప్పటి నుంచీ కూడా యుద్ధం అనే పదం వినపడుతూనే ఉంది. ఆహారం కోసం, ఆవాసం కోసం ఆది మానవుడు యుద్ధం చేసేవాడు.
ఆ రెండిటి సమస్య తీరిపోయిన తర్వాత ఆధిపత్యపు పోరులు మొదలైనాయి. రాజ్యాలు స్థాపించారు. రాజ్యకాంక్ష ఎక్కువై , అది యుద్ధానికి దారి తీసింది. క్రమంగా వనరుల కోసం,జలాల కోసం, మతవ్యాప్తికి ఇలా చెప్పుకుంటూ పోతే యుద్ధాలకి ఎన్నో కారణాలు ఉన్నాయి.
ఆది మానవుడి నుంచి మనిషి నాగరికుడుగా మారినా , అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించినా విధ్వంసాలని సృష్టించే యుధ్ధాలు మాత్రం ఆగటం లేదు. పైగా సామ్రాజ్య వాద ధోరణి పెరిగిందేమో అనిపిస్తున్నది.
వేల సంవత్సరాల క్రితం నుంచి చాలా యుధ్ధాలు జరిగాయి. ప్రతి యుద్ధం ఒక విధ్వంసం సృష్టించింది. కురుక్షేత్ర యుద్ధం లో ఎంతమంది చనిపోయారు మనకి తెలియనిది కాదు. అలాగే అశోకుడు రాజ్యకాంక్ష చే కళింగ యుద్ధం చేసి బౌద్ధమతం స్వీకరించాడు అని చరిత్రలో చదువుకున్నాము. కానీ ఆ చరిత్ర నుంచి మనం ఏం నేర్చుకున్నాము?
యుధ్ధాలు ఆగలేదు. రెండు ప్రపంచ యుధ్ధాలు యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. యుధ్ధాలు రాకుండా యూఎన్ఓ స్థాపించారు.
రోజురోజుకూ మానవాళి అభివృద్ధి పథంలో దూసుకెళెతూఉన్నప్పటికీ యుధ్ధోన్మాదం ఆగటం లేదు. అగ్ర రాజ్యాలుగా చెలామణి అవుతున్న దేశాలే,శాంతి స్థాపనకు కృషి చేయాల్సింది పోయి, కయ్యానికి కాలు దువ్వుతున్నాయి.
ఒకప్పటి సంగతి వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. నేడు గ్లోబలైజేషన్ పేరుతో ప్రపంచం అంతా ఒక సర్కిల్ లోకి వచ్చింది. కాబట్టి ఎక్కడ ఏ చిన్న డిస్ట్రబెన్స్ వచ్చినా మొత్తం అతలాకుతలం అవుతుంది.
రెండు దేశాల మధ్య అవగాహనా లోపం, ఆధిపత్యపు పోరు, ఇగో మొదలైన అంశాలన్నీ మిగిలిన దేశాల మీద చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. దీనిని అవకాశంగా తీసుకుని దోపిడీ వ్యవస్థ విజృంబిస్తుంది.
యుధ్ధ ప్రభావం వల్ల వాతావరణంలో కూడా గణనీయమైన మార్పులు కలుగుతున్నాయి అని విశ్లేషకులు అంటున్నారు. ఉదాహరణకు ఈ సంవత్సరం భారతదేశంలో అధిక ఉష్ణోగ్రతలు,ఎల్ నినో లకి కారణం ప్రస్తుత యుధ్ధం వాతావరణమే అంటున్నారు.
ఏదిఏమైనా మానవాళి తెలుసుకోవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి. యుధ్ధం ఒక వర్గానికి విజయాన్ని ఇస్తుందేమో కానీ, మొత్తం మీద విధ్వంసమే జరుగుతుంది.
కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకుని, ప్రపంచ శాంతికి అన్ని దేశాలు కృషి చేయాలి.
“ఏమిటీ, ఇంకా మీ అక్కా చెల్లెళ్ళ కబుర్లు కాలేదా? ఈ రోజు కాఫీ ఇచ్చేది ఏమైనా ఉందా లేదా?” భర్త ఆదినారాయణ మాటలతో ఈలోకం లోకి వచ్చింది వసంత.
“ఇకనుంచి యుధ్ధం అయిపోయేదాకా కాఫీ కూడా ఒకసారే ఇస్తా, గ్యాస్ సిలిండర్ల కొరత ఉంది. కాదూ కూడదంటే మన మధ్య కూడా యుధ్ధం తప్పదు” అంది వసంత.
” హతోస్మీ” అనుకుంటూ నీరసంగా కుర్చీలో కూలబడ్డాడు ఆదినారాయణ.
* * *

Written by PVS Krishnakumari

పేరు. : పీ. ( వల్లూరు) వి. యస్. కృష్ణ కుమారి
భర్త : పోతరాజు వేణుగోపాల కృష్ణ మూర్తి ( రిటైర్డ్ ఫైనాన్స్ ఆఫీసర్ హై కోర్టు)
పుట్టిన తేది. ఆగష్టు, 14
తండ్రి. : వల్లూరు కోటేశ్వరరావు
తల్లి : వల్లూరు రాజ్యలక్ష్మి
పిల్లలు : నీలా సుందరి ( కూతురు )
రవిశంకర్ ( అల్లుడు)
శ్రీవాత్సవ ( కుమారుడు)
‌. మృణాళిని ( కోడలు)

జన్మస్థలం : వల్లూరు , గుంటూరు జిల్లా
విద్యాభ్యాసం. : పొన్నూరు, విజయవాడ ,
క్వాలిఫికేషన్ : బి.ఏ. బీఈడీ
వృత్తి. : ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ శ్రీవాణి మోడల్ స్కూల్ ( సొంత స్కూల్)
ప్రవృత్తులు. : సంగీతం, సాహిత్యం
సాహితీ ప్రయాణం. : 2010 లో మొదటిసారిగా కవితలతో మొదలైంది. వార్త, మన తెలంగాణా, సత్యం ఆన్లైన్ మ్యాగజైన్ లలో వందకి పైగా కవితలు
2015 లో మొదటి కథ ' ఓ సీత కథ' నవ్య వారపత్రికలో ప్రచురితమైంది. ఆ తర్వాత నవ్య, పాలపిట్ట, నమస్తే తెలంగాణా, జాగృతి, ఉషోదయ వెలుగు, వార్త ఆదివారం అనుబంధం, ఉషా మ్యాగజైన్ లలొ దాదాపు ఇరవై ఐదు కథలు, బహుమతులు , సాధారణ ప్రచురణకు ప్రచురితమైనాయి.
కథా మంజరి, కథా వేదిక, తరుణి ఇంకా అనేక ఫేస్ బుక్ గ్రూప్ లలో యాభైకి పైగా కథలు రాగా, ఇరవై కథలకి బహుమతులు వచ్చాయి.
నవలలు : జీవన విపంచి
వేద సుధామయం.
నేల నుండి నింగికి ( అముద్రితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

బోనెపెట్టె

అమ్మ గుర్తొచ్చి…