బుజ్జి కన్నమ్మలే కాదు బుజ్జి కన్నయ్యలు కూడా మనం కొంచెం చనువుగా వుంటే ఎంత ప్రేమాభిమానాలతో ఉంటారో… వాళ్ళ మనసుల్ని కదిపితే ఆనందాల సరాగాలే కాదు విషాద రాగాలు కూడా వినిపిస్తాయి.
నేను ఆరోజు నాకు అత్యంత ఇష్టమైన ఏడవ తరగతి తెలుగు టి.కృష్ణమూర్తి యాదవ్ గారి కవిత”అమ్మ జ్ఞాపకాలు” పాఠం చెబుతున్నా.అమ్మకు బిడ్డల మీద ఎంత ప్రేమ ఉంటుందో, అమ్మ తన బిడ్డల కోసం వాళ్ళకు ఇష్టమైనవి తాను తినకుండా ఎలా దాచి పెడుతుందో, బతిమిలాడి గోరుముద్దలు తినిపిస్తుందో…అందులో నేను బాల్యాన్ని తడుముకుంటూ,పిల్లలకి చెబుతుంటే ‘అవును మేడం’, ‘అవును మేడం’ అంటూ కేరింతలు కొడుతూ పాఠంలో లీనమయ్యారు.ఒక్కొక్కరు వాళ్ళ అమ్మ గురించి చెబుతూ ఉన్నారు.
ఇంతలో సన్నగా ఎక్కిళ్లు వినిపించాయి.ఎవరబ్బా ఏడ్చేది? అని చూస్తే ఓ బుజ్జి కన్నయ్య.
“ఎందుకురా నాన్నా ఏడ్చేది? ఎవరైనా ఏమైనా అన్నారా? అనునయంగా అడిగాను.
అలా అడిగేసరికి ఆ కన్నయ్య మరింత ఎక్కువగా ఎక్కిళ్లు పెట్టి ఏడవసాగాడు. నేను చాలా కంగారు పడి పోయాను. “ఎందుకు నాన్నా? అంటూ వాడిని ఓ వైపు ఊరడిస్తూనే మరో వైపు “ఒరేయ్ పిల్లలూ! వాడికేమైంది? ఎందుకలా ఏడుస్తున్నాడు? చెప్పండిరా. నాకేం చెయ్యాలో తోచడం లేదు అన్నాను.
ఇంతలో పిల్లలంతా” మేడం! వాడికి అమ్మ లేదు.మీరు అమ్మ గురించి చెబుతుంటే వాడికి బాధై ఏడుస్తున్నాడు ” అన్నారు. ఆ క్షణం మనసు వికలమై పోయింది. “అయ్యో! అవునా! కన్నా!” అంటూ ఉద్వేగంతో వాడిని దగ్గరకు తీసుకున్నాను.నా కుచ్చిళ్ళలో ముఖం దాచుకుని భోరుమని ఏడవసాగాడు.” వద్దు నాన్నా! ఏడవొద్దు “తల నిమురుతూ ఓదార్చాను కానీ వాని చిన్ని గుండెలో బాధ తీరనిది. తీర్చగలనా? అనిపించింది.
అప్పటి నుంచి వాడిని ప్రత్యేకంగా చూస్తూ మరింత ప్రేమగా మాట్లాడసాగాను. వాడికి నా మీద నమ్మకం కుదిరింది.నన్నో అమ్మలా చూడసాగాడు. “మీతో ఏదైనా చెప్పుకోవచ్చా మేడం?” అన్నాడో సారి. “తప్పకుండా నాన్నా” అనగానే వాడి కన్నుల్లో వెలుగు.
అలా రోజూ నా దగ్గరకు వచ్చి వాళ్ళ ఇంటి విషయాలు చెప్పేవాడు.వాళ్ళ నాన్న బాగా తాగుతాడనీ, వాళ్ళ నాయనమ్మ దగ్గర ఉంటున్నానని చెప్పాడు. “నువ్వు బాగా చదువుకోవాలి కన్నా!” అన్నాను. బుద్ధిగా తల ఊపాడు.
ఆ తర్వాత సంవత్సరం అనుకోకుండా అక్కడి నుండి బదిలీ మీద వేరే వూరికి వచ్చాను.వాడు మొదట్లో పదే పదే గుర్తకు వచ్చే వాడు.
ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో ఆ బుజ్జి కన్నయ్య.
నాకంటే మీకే బాగుంటుంది
****
కొంత మంది పిల్లలు పెద్ద మనసుతో ప్రేమ పంచిన విషయాలు మనసు మీద శాశ్వత ముద్ర వేస్తాయి. అందులో ఇదిగో ఈ బుజ్జి కన్నయ్య ముచ్చట.
నేను పని చేస్తున్న ఊరిలో ఓ సారి ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
పిల్లల ద్వారా విషయం తెలిసి నాకూ వెళ్ళి చూపించుకోవాలని అనిపించింది కానీ పాఠశాల నడుస్తున్న సమయంలో వెళ్ళడం కుదరదు కదా! అందుకే స్కూల్లోనే ఉండి పోయాను.
మా ఊరి పిల్లలు,పెద్దలూ అందరూ వెళ్లి పరీక్ష చేయించుకుంటున్నారు.పర్మిషన్ అడిగి పోవాలంటే మనసొప్పలేదు.” ఎంత పీనాసి మనిషి.ఉచితంగా చేయించుకుంటుంది చూడు!” అంటారని భయం.పెద్దగా కంటి సమస్య లేదు కానీ రీడింగ్ గ్లాసెస్ తీసుకుంటే బాగుండని ఓ పక్క మనసు లాగుతోంది.
మా బడి పిల్లలు కూడా చాలా మంది వెళ్ళి చూపెట్టుకున్నారు.కొందరు రీడింగ్ గ్లాసెస్ తెచ్చుకున్నారు. మరికొందరు కంటి పరీక్షలు చేయించుకొని దానికి అవసరమైన కళ్ళద్దాలు ఇస్తే తెచ్చుకున్నారు.
మా తరగతి కన్నయ్య ఫరీద్ కూడా రీడింగ్ గ్లాసెస్ తెచ్చుకున్నాడు. అది పెన్ టైప్ బాక్స్ లో దూరేది.చూడ్డానికి చాలా బావుంది.జెంట్స్ అయితే ఓ లావుపాటి పెన్నులా జేబులో పెట్టుకోవచ్చు కూడా. అది నాకు చాలా చాలా నచ్చింది.
కంటి పరీక్ష శిబిరం ఓ ఫారెన్ సంస్థ సారథ్యంలో జరిగింది కాబట్టి.వాళ్ళు ఉచితంగా ఇచ్చిన కళ్ళజోళ్ళలో చాలా నాణ్యత ఉంది.
కన్నయ్య ఫరీద్ బడికి తెచ్చుకుని నేను వెళ్ళిన పీరియడ్ లో సంబురంగా తీసి చూపించాడు. “చాలా బాగుంది” అనగానే మీరు కూడా తప్పకుండా వెళ్ళండి మేడం అన్నాడు కానీ నా పరిధులు దాటి వెళ్ళలేకపోయాను.
నా మనసు ఆ కళ్ళజోడు మీద ఉందని గ్రహించాడో ఏమో “మేడం! ఇది పెట్టుకుని చూడండి. ఎలా వుంటుందో! అనగానే ‘సరే ‘ అని పెట్టుకున్నా.
వెంటనే నా కళ్ళ వైపు చూసి”చాలా చాలా బాగుంది మేడం మీకు” అన్నాడు.
తరగతి గదిలో పిల్లలందరూ నా వైపు చూసి”అవును మేడం మీకు చాలా బాగుంది” అన్నారు. “సరేలేరా” అని తనకి ఇచ్చేశాను.
కానీ ఆ కన్నయ్య మాత్రం రోజూ తీసుకొని రావడం. నేను తరగతిలోకి వెళ్ళగానే నాకు ఇచ్చి పెట్టుకొమ్మని చెప్పడం. వద్దన్నా వినకుండా పాఠం చెప్పేంత వరకు అలాగే ఉండనీయమనడం. నేను వేరే తరగతిలోకి వెళ్ళేముందు తనకు తీసి ఇవ్వడం… ఇలా పాఠశాల దినచర్యలో భాగం అయ్యింది.
నా కోసం ఆ బుజ్జి కన్నయ్య రోజూ జాగ్రత్తగా తీసుకుని రావడం.తానిక పెట్టుకునే ప్రయత్నం చేయకుండా బ్యాగ్ లో దాచిపెట్టి తీసుకుని పోవడం.” చూస్తూ తలచుకుంటూ ఉంటే పిల్లల్లో ఇంత పెద్ద మనసు ఉంటుందని ఎవరం ఊహించం కానీ మా ఫరీద్ నే ప్రత్యక్ష సాక్షం.
ఇలా రోజులు గడుస్తున్నాయి. ఓ రోజు బడయ్యాక ఇంటికి వెళ్తూ నా దగ్గరకు వచ్చాడు.
“మేడం! ప్లీజ్ మేడం! ఇది మీ దగ్గరే ఉండనీయండి మేడం! నాకంటే మీకే బాగుంటుంది” అంటూ ఎంత వద్దన్నా వినకుండా ఆ కళ్ళజోడు బాక్స్ తో సహా ఇచ్చాడు.
ఆ కన్నయ్య ప్రేమాభిమానాలకు కళ్ళు చెమ్మగిల్లాయి. గుర్తుకు వచ్చినప్పుడల్లా వాడి గొప్ప మనసు నా హృదయాన్ని కదిలిస్తుంది.ఆ కన్నయ్య ఫరీద్ లాంటి ప్రేమ దొరకడం నిజంగా నా అదృష్టం కదా!