నేపాల్ లోని బోటు షికారుకు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగా…వారాహీ అమ్మవారు వెలసిన స్థలం.
“ఫేవా” అనే పదం సాధారణంగా నేపాల్లోని ప్రసిద్ధ సరస్సు అయిన *”ఫేవా సరస్సు” (Phewa Lake)*ను తెలుపుతుంది.ఇది పోఖరా నగరంలో ఉంది మరియు పర్యాటకులకు అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశం.
నేపాల్లోని ఫేవా సరస్సు (Phewa Lake) మధ్యలో ఒక చిన్న ద్వీపంలో వెలిసిన *”తాల్ బారాహి” (Tal Barahi Temple)*ఆలయానికి చాలా విశిష్టమైన స్థల పురాణం ఉంది. స్థానిక భాషలో ‘తాల్’ అంటే సరస్సు అని అర్థం. సరస్సు మధ్యలో ఉండటం వల్ల దీనికి ఈ పేరు వచ్చిందని స్థానికులు చెప్పారు. ఇక్కడ అమ్మవారు వారాహి దేవి (దుర్గా దేవి అవతారం) రూపంలో పూజలందుకుంటున్నారు.
భిక్షుకి రూపంలో వచ్చిన అమ్మవారి గాథ! సరస్సు ఆవిర్భావం ఎలా జరిగిందంటే? పూర్వం ఇప్పుడు సరస్సు ఉన్న ప్రాంతంలో ఒక అందమైన, సంపన్నమైన గ్రామం (కొన్ని కథనాల ప్రకారం ఫేవా నగరం) ఉండేదట. ఒకరోజు అమ్మవారు ఒక ముసలి భిక్షుకి (యాచకురాలి) రూపంలో ఆ ఊరిలోకి వచ్చి, ఆకలితో అలమటిస్తూ ప్రతి ఇంటి తలుపూ తట్టి అన్నం అడిగింది. కానీ, భోగభాగ్యాలతో అహంకారంతో ఉన్న ఆ ఊరి జనం ఆమెను ఈసడించుకుని, తలుపులు మూసేశారు. చివరకు ఆ ఊరి చివర ఉన్న ఒక పేద వృద్ధ దంపతుల ఇంటికి ఆమె వెళ్ళింది. వారు అత్యంత ఆదరంతో ఆ వృద్ధురాలిని ఆహ్వానించి, తమ వద్ద ఉన్న కొద్దిపాటి అన్నాన్ని, కూరలను పెట్టారు. వారి ఆతిథ్యానికి, నిష్కల్మషమైన భక్తికి అమ్మవారు ప్రసన్నురాలైంది. ఆ మరుసటి రోజు ఉదయం, ఆ వృద్ధ దంపతులతో అమ్మవారు ఇలా చెప్పింది: “ఈ ఊరి జనం స్వార్థంతో, అహంకారంతో నిండిపోయారు. త్వరలోనే ఈ గ్రామం మొత్తం జలమయం కాబోతోంది. మీరు వెంటనే మీ సామాగ్రిని తీసుకుని పక్కనే ఉన్న ఎత్తైన కొండపైకి వెళ్ళిపోండి” అని హెచ్చరించింది. ఆ దంపతులు అమ్మవారి మాట విని కొండపైకి చేరుకోగానే, ఆకాశానికి చిల్లులు పడినట్లుగా పెను తుఫాను వచ్చి, కొండల నుండి నీరు ఉరకలెత్తి ఆ గ్రామాన్ని ముంచెత్తింది. ఊరంతా నీట మునిగి ఒక పెద్ద సరస్సులా (ఫేవా సరస్సు) మారిపోయింది. కేవలం ఆ వృద్ధ దంపతుల ఇల్లు ఉన్న ఎత్తైన భాగం మాత్రం నీటిపై ఒక చిన్న ద్వీపంలా మిగిలిపోయింది. అక్కడ అమ్మవారు భగవతి (వారాహి) రూపంలో వారికి సాక్షాత్కరించింది. ఆ కృతజ్ఞతతో ఆ ద్వీపంలో అమ్మవారికి ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. మరో స్థల పురాణం ఇలా తెలిసింది… కాస్కీ రాజు కల – విగ్రహ ప్రతిష్ఠ చేయించారని…. మరొక ప్రసిద్ధమైన చారిత్రక గాథ ప్రకారం… పూర్వం ఆ ప్రాంతాన్ని పాలించిన కాస్కీ రాజ్యానికి చెందిన రాజ కులమండన్ షా (Kulmandan Shah) పరమ దుర్గా భక్తుడు. అమ్మవారి అసలు విగ్రహం మొదట సరస్సు పైభాగంలో (మాఘ్తుమ్ అనే చోట) ఉండేదని, ఒకసారి వచ్చిన భారీ వరదలకు ఆ విగ్రహం కొట్టుకువచ్చి ఫేవా సరస్సు మధ్యలో ఉన్న ఈ చిన్న ద్వీపం వద్ద నిలిచిందని చెబుతారు. అదే సమయంలో రాజు కలలోకి వచ్చిన అమ్మవారు… తాను ఈ నిర్మలమైన సరస్సు మధ్యలో, జలాల నడుమ కొలువై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపి, అక్కడ తనకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. అమ్మవారి ఆజ్ఞ ప్రకారం రాజు ఆ ద్వీపంలో పగోడ (Pagoda) శైలిలో రెండంతస్తుల అందమైన ఆలయాన్ని నిర్మించాడు.
స్వరూపం ఇక్కడి వారాహి అమ్మవారు వరాహ ముఖంతో, మానవ శరీరంతో, చేతుల్లో శక్తి ఆయుధాలను ధరించి ఉగ్రమూర్తిగా శత్రు సంహారకురాలిగా, అలాగే భక్తులను కాపాడే ప్రశాంత మాతగా దర్శనమిస్తుంది. హిందువులతో పాటు బౌద్ధులు కూడా ఈమెను ‘వజ్రవారాహి’గా ఎంతో భక్తితో కొలుస్తారట. ఈ ఆలయానికి చేరుకోవడానికి కేవలం బోట్లు (పడవలు) మాత్రమే ఏకైక మార్గం. చుట్టూ హిమాలయాల (అన్నపూర్ణ పర్వత శ్రేణుల) ప్రతిబింబాలు ఫేవా సరస్సు నీటిలో కనిపిస్తూ ఉంటే, దాని మధ్యలో ఉన్న ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంది. ప్రకృతి అందాల నడుమ, దైవిక శక్తితో విరాజిల్లే ఈ “తాల్ బారాహి” క్షేత్రం నేపాల్లోని అత్యంత పవిత్రమైన శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.