మాండలికానికి మహోన్నత స్థానం కల్పించిన భాషాప్రేమికురాలు . డోగ్రి భాషలో రచనలు చేసిన తొలి ఆధునిక భారతీయ మహిళ .జమ్ము కాశ్మీర్ రాష్ట్ర అధికార భాషలో రచనలు చేసిన వీరు ఏప్రిల్ 17న, 1940లో జమ్మూలోని కుర్మాంపూర్ మండలంలో బారీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వీరి తండ్రి శ్రీ జైదేవ్ బాబు సంస్కృత భాషలో ప్రొఫెసర్.
పద్మాసచ్ దేవ్ తన16 యేట తొలి కవిత రాయగా, స్థానిక పత్రికా సంపాదకుడు వేద్ పాల్ దీప్ తన పత్రికలో అచ్చు వేసినప్పుడు ఆ రాష్ట్ర సీఎంతో సహా ఎందరివో ప్రశంసలందుకున్నారు. వీరు ఆకాశవాణిలో అనౌన్సర్ గా మొదట జమ్మూకాశ్మీర్లో పనిచేసి తరువాత ముంబై కేంద్రంలో కూడా కొంతకాలం సేవలు అందించారు.

హిందుస్తానీ గాయకులు శ్రీ సురీందర్ సింగ్ ను 1966 లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె మీతా సచ్ దేవ్. వీరి శాశ్వత నివాసం ముంబై.
శ్రీమతి సచ్ దేవ్ డోగ్రి భాషలోనే కాకుండా హిందీలో కూడా పలు రచనలు చేసి కవితా సంకనాలెన్నో ప్రచురించారు. ‘తావితే, చంహాన్, నెరియా గలియా, పోతా పోతా నింబల్, ఉత్తర వాహిని, తైంతియన్’ ముఖ్యమైనవి.
1971లో సాహిత్య అకాడమీ అవార్డును కైవసం చేసుకున్నారు.
2001లో పద్మశ్రీ పురస్కారాన్ని, మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2007 లో కవిత్వానికి గాను కబీర్ సమ్మాన్ తో గౌరవించింది .
డోగ్రి భాషలో ఆమె ఆత్మ కథ ‘చిత్ చితే’ కు గాను 2015లో సరస్వతి పురస్కారం లభించింది.
2019లో సాహిత్య అకాడమీ ఫెలోషిప్ కూడా అందుకున్నారు. ‘మేరీ కవిత – మేరే గీత్’ సంకలనానికి సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన రాంధారీ సింగ్ దినకర్ “ఈమె కవితలు చదివిన తర్వాత నా కలం పడేయాలి అనిపించింది. ఈమె రాసేదే నిజమైన కవిత్వం” అని చెప్పారు.
భారతీయ కుటుంబ వ్యవస్థలో గృహిణుల జీవితాలలోని సాధకబాదకాలు,
వ్యక్తిగత సమస్యలు, సామాజికాంశాలు,మహిళా
సమస్యలే ప్రధాన కథా వస్తువుగా రచనలు చేసారు.
కొన్ని చలనచిత్రాలకు కూడా వీరు గీతాలను అందించారు .ప్రముఖ గాయని లతా మంగేష్కర్, డోగ్రి గీతాలను ఆలపించడంలో ప్రభావితం చేసిన రచయిత్రిగా ఘనత సాధించారు.
జమ్మూ కాశ్మీర్ డి.బి .పంత్ మెమోరియల్ ట్రస్ట్ వారిచే 2017లో దినుభాయ్ పంత్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు.
2015లో భారతీయ భాషా పరిషత్ పశ్చిమబెంగాల్
వారిచే కృతితవ స్మగ్రా సన్మానం అందుకున్నారు.
మాతృభాష డోగ్రి కోసం అవిశ్రాంతంగా పోరాడిన ఈ స్త్రీ మూర్తి రాజ్యాంగంలోని షెడ్యూల్ 8 లో డోగ్రి భాషను చేర్చిన రోజు తనకు అత్యంత ప్రీతికరమైన రోజని ఆమె ఒకానొక సందర్భంలో తెలిపారు.
డోగ్రి భాషలోని గొప్ప సాహిత్యాన్ని పరిచయం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు.హింది, డోగ్రి భాషలలో దాదాపు 60 పుస్తకాలు రాశారు.
2017లో ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్ అవార్డు స్థాపించిన కె.కె.బిర్లాఫౌండేషన్ వారు ప్రశంసలు కురిపిస్తూ – 600 పేజీల పైగా ఉన్న పుస్తకం లో పదబందాలు, జాతీయాలతో జమ్ము చరిత్ర ,సాంస్కృతి – సంప్రదాయాలు కళ్ళకు కట్టినట్టు చూపడమే కాకుండా,, డోగ్రీ భాషకు సజీవ సాక్ష్యంలా నిలిచిందీరచన అంటూ అధికారిక ప్రకటనలో తెలిపింది .
డోగ్రీ చివరి పాలకుడైన మహారాజా హరి సింగ్ కుమారుడు కరణ్ సింగ్ ఆమె రచన ఒకదాన్ని తీసుకుని ఆంగ్లంలోకి అనువదించారు. అచ్చమైన జమ్ము మాండలికంలో రచనలు చేసిన పద్మా సచ్ దేవ్ పై పలువురి అభిప్రాయాలు, వివిధ సందర్భాలలో :
హిందీ భాషలో మహాదేవి వర్మ ఎలాగో , పంజాబీకి అమృతప్రీతం ఎలాగో, డోగ్రి భాషకు పద్మ సచ్ దేవ్ కూడా అలాంటివారేనని కవయిత్రి నిరుపమ దత్ పేర్కొన్నారు.
‘ద నైటింగేల్ అఫ్ డోగ్రి’లో రచయిత్రి అనిత కన్వాల్ స్లాథియా ఇలా పేర్కొన్నారు : డోగ్రి సంస్కృతిని పరిరక్షించడం శ్రీమతి సచ్ దేవ్ చాలా బాగా తెలుసని, దాన్ని కాపాడాల్సిన బాధ్యత భావితరాలదే.
‘డోగ్రి కి బార్డ్ ‘డోగ్రిలోని మౌఖిక సాహిత్యాన్ని వ్యయప్రయాసల కోర్చి అందంగా సశాస్త్రీయంగా అక్షరబద్ధగా తీర్చిదిద్దారని కవయిత్రి అనామిక టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
సచ్ దేవ్ ఆత్మ కథను
ఉమా వాసుదేవ్, ‘ఎ డ్రాప్ ఇన్ ద ఓషన్ ‘ పేరిట ఆంగ్లంలోకి అనువదించారు.
ఆమె అందమైన నవ్వు మాటున దాగిన మౌనఘోషలెన్నో! అనారోగ్యంతో తల్లడిల్లుతూ మనసుపడ్డ వేదనలింకెన్నో! గడ్డుకాలంలో జీవితం ఆమెకు నేర్పిన పాఠాలు, గుణపాఠాలతో పాటు ఉద్దండులతో కలిగిన పరిచయాలతో సమాజాన్ని దగ్గరగా చూసిన ఈమె ,తన అనుభవాలకు సహజ శైలిని జోడించి, సమాజాన్ని తట్టి లేపి, మాండలికానికి పట్టంకట్టి చేసిన అక్షర క్రతువుతో అలసిపోయి, ఆత్మానందంతో మురిసిపోయి ,ఆగస్టు 4 ,2021 న ముంబైలో కన్నుమూసిన మాండలిక భాషా ప్రేమికురాలిని మనసారా స్మరిస్తూ , అక్షరాంజలిఘటిస్తూ …