కనుపర్తి వరలక్ష్మమ్మ

ప్రముఖ తెలుగు రచయిత్రి. మహిళాభ్యుదయాన్ని కాంక్షించి సమాజాభివృద్ధికి తోడ్పడ్డ మహిళామణి .తెలుగులో లేఖా సాహిత్యం అంటే ముందుగా గుర్తుకొచ్చేది కనపర్తి వరలక్ష్మమ్మ గారే. వీరు అక్టోబర్ 6 న, 1896 గుంటూరు జిల్లాలోని బాపట్లలో జన్మించారు. పాలపర్తి శేషయ్య, హనుమాయమ్మ దంపతుల కుమార్తె. తమ పన్నెండవ ఏట కనుపర్తి హనుమంతరావు గారితో వివాహం జరిగింది.

పాఠశాలలకు వెళ్లి చదువు కొనసాగించలేకపోయినా చిన్నతనంలో’ కొటికలపూడి సీతమ్మ’ గారి ప్రసంగ ప్రభావంతో చదువుపై ఇష్టాన్ని పెంచుకుని ఎన్నో గ్రంథాలు చదివి ఆంగ్లం ,సంస్కృత భాషలపై పట్టు సాధించారు. తమ పరిసరాల్లోని నిరక్షరాస్యులైన మహిళలకు ఉత్తరాల రాసి పెట్టడం, చదివి వినిపించడం అలవాటైన తర్వాత కథ రాయాలని ఆసక్తి కలిగిందని ఆంగ్ల కథానువాదం చేసి ‘సౌదామిని’ పేరుతో ‘అనసూయ’ మాస పత్రికలో తొలి కథను అచ్చు రూపంలో చూసుకున్నాక ఇక వెనుదిరిగి చూడకుండా నిరాఘాటంగా సాహితీక్రతువులో పాల్గొన్నారు.

స్త్రీవాద రచయిత్రియైన వీరికి భర్త సంపూర్ణ సహకారమందించారు.దాదాపు 60 కథలు ‘భారతి’ , ‘వినోదిని’ లాంటి పత్రికలలో ప్రచురితమయ్యాయి. స్త్రీ సాధికారతకు చదువే పదునైన ఆయుధమని భావించి, వారిని ఉత్తేజితం చేయడానికి తమ రచనలతో ఎంతో స్ఫూరినందించిన మహిళామణి.
వీరు కవిత్వం, కథలు,నవలలు, నాటకాలు ఇలా ఎన్నో ప్రక్రియలను సృజించారు .ఈమెపై మహాత్మా గాంధీ ప్రభావం అధికం .స్వాతంత్ర ఉద్యమంలో స్వయంగా పాల్గొంటూ ఎందరో మహిళామణులు పాల్గొనేలా చేశారు . గాంధీజీ ప్రభావంతో తుది శ్వాస విడిచే వరకు ఖద్దరువస్త్రాలు కట్టుకోవడమే కాకుండా స్నేహితులతోకలిసి ‘స్వరాజ్యలక్ష్మి వ్రతం’, ‘రాట్నపూజ’ చేసిన పోరాటయోధురాలు.
” నా జీవము ధర్మము”
” నా మతము నీతి ”
“నా లక్ష్యము సతీ శ్రేయము”
ఈ మూడింటిని సమర్థించుటకే నేను కలము పట్టితిని అని చెప్పుకున్నారట. స్త్రీలు విద్య,వృత్తి నైపుణ్యాలు నేర్చుకొని సామాజిక స్థితిగతులు మెరుగుపరుచుకునేందుకు బాపట్లలో బాలికల కోసం ‘స్త్రీహితైషిణి మండలి ‘ని స్థాపించి మహిళల్ని ప్రోత్సహించారు. వీరు తమ రెండు శీర్షికలు’ గృహలక్ష్మి’ మాసపత్రికలో 1929 – 34 వరకు ‘శారదలేఖలు’ శీర్షిక పేరిట కల్పలత అనే ఊహల నెచ్చెలిని సృష్టించి ఎన్నో సమస్యలపై శారద పేరుతో వివరణాత్మక రచనలు చేశారు. ఆధునిక భావజాలం గల శారద పాత్ర ద్వారా స్త్రీల సమస్యలపై స్ఫూర్తివంతంగా ఎన్నో రచనలు చేశారు. తర్వాత 1920లో ‘ఆంధ్ర వారపత్రిక’లో’ మా చెట్టు నీడ ముచ్చట్లు'( మా చెట్టు నీడలో కబుర్లు) శీర్షికతో వ్యాసాలు రాయడం మొదలుపెట్టారు . స్త్రీల చైతన్యం, సంప్రదాయాలు, రాజకీయ, చట్ట ,సాంకేతిక, వర్ణ వివక్ష మొదలైన అంశాలను ప్రస్తావిస్తూ ఆరు సంవత్సరాలు ఈ కాలమ్ ను నిరాఘాటంగా కొనసాగించారు. వీరికి ఈ రెండు శీర్షికలతో మహిళాపాఠకుల ఆదరణ లభించింది. ‘ఆల్ ఇండియా రేడియో’ మరియు ‘దూరదర్శన్’ (ఇండియా టీవీ)లో వీరి నాటకాలు ప్రసారం చేయబడ్డాయి. మొదటి నవల1925లో రాసిన’ వసుమతి’ కాగా 1933లో’ విశ్వామిత్ర’ రెండవ రచన. మద్రాసు, విజయవాడ, ఆకాశవాణి కార్యక్రమాలలో పాల్గొన్న తొలి మహిళగానే కాకుండా ప్రపంచ తెలుగు మహాసభల్లో సన్మానించబడ్డ రచయిత్రిగా వినుతికెక్కారు. వీరి మొదటి కథ ‘సౌదామిని ‘1919లో ఆంగ్లంలోకి అనువదించబడింది. ‘ద్రౌపది వస్త్ర సంరక్షణం’ అనేది ద్విపద కావ్యం .ఇలా ఎన్నో ప్రక్రియలు సృజించారు.

వీరి శారద లేఖల్ని పోటీ పరీక్షల్లో పాఠ్యాంశంగా చేర్చారు . (80 లేఖల్ని 40 సంవత్సరాల వ్యవధిలో లేఖల రూపంలో సృజించిన ప్రక్రియ) .చదువే పదునైన ఆయుధమని భావించి , స్త్రీ సాధికారత, చైతన్యాలే ధ్యేయంగా జీవనం కొనసాగించిన స్త్రీ మూర్తిగా, తన రచనలతో ఎంతోమంది మహిళలను ఉత్తేజపరుస్తూ, దేశభక్తిని పెంపొందిస్తూ ఆత్మగౌరవం కలిగిన స్పూర్తి ప్రదాత. ‘గృహలక్ష్మి స్వర్ణ కంకణం’, ‘ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత్రి’, ‘కవితా ప్రవీణ’గా గుడివాడ పౌర సన్మానం ఇలా ఎన్నో సన్మానాలు పొందారు. అవిరామ సేవలందించి ఆగస్టు13, 1978 న తనువు చాలించిన ఈ కార్యశీలికి అక్షర నీరాజనాలర్పిస్తూ

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రమక్క తో ముచ్చట్లు -16

ఇంతి చేవ్రాలు