॥॥ ఇంతేకదా॥॥

“ లక్ష్మీ నాకు టయం అవుతుంది  ఇంకా ఎంతసేపు, నీ వల్ల

రోజు  ఆఫీసులో  మా బాసుతో  మాటలు పడవలసి వస్తుంది,  కాస్త  ముందుగా  లేచి చేస్తే సరిపోతుంది కదా! అయినా   మీ అమ్మ వాళ్ళింట్లో   బాగా అలవాటు  పొద్దెక్కినా కూడా లేవకపోవడం  అది ఇంకా పోవట్లేదు,” అన్నాడురఘు  రుసరుసలాడుతూ.

 

“ అవును అనండి మీరు మా అమ్మ వాళ్ళ అనకపోతే  లేకపోతే ఇంకా ఎవరినంటారు, రోజుకు ఒకసారైనా మా పుట్టింటి వాళ్ళను అనందే  మీకు పొద్దుగడవదు  కదా, అలా అటు ఇటు కాలుగాలినా పిల్లిలా తిరగే బదులు టిఫిన్ బాక్సు మీ బ్యాగులో  పెట్టుకోవచ్చు, వాటర్ బాటిల్‌లో   నీళ్లు నింపుకోవచ్చు అన్ని ఒక్కదాన్నే చేయ్యాలనే  రూల్ ఏమి లేదు   రండి టిఫిన్ చెయ్యండి ,” విసురుగా టేబుల్ మీద పెట్టింది.

“ అవునవును  నాకింకేం  పనుంది  మీ వాళ్ళను  అనడం తప్పా ! అన్ని పనులు నేను చేసుకున్నాక నువ్వేం  వెలగబెడతావు,” టిఫిన్  తింటూ వ్యంగ్యంగా అన్నాడు.

“ అబ్బే  నాకేం పనుంటుంది  మీరందరూ వెళ్లిపోయాక హాయిగా పడుకుంటాను మీరు వచ్చేవరకు, మీరందరు వచ్చాక  నాకు చాలా సహాయం చేస్తారు కదా,”మూతి విరుస్తూ అంది .

“ అబ్బా అమ్మా  మాకు స్కూల్ కి టైం అవుతుంది నాకు జడ వెయ్యి,” పిలిచింది ఏనిమిది సంవత్సరాల చిన్మయి.

“  మీ అమ్మకు నాతో గొడవ పెట్టుకోవడమే సరిపోతుంది ఇంకేం పని,”  అంటూ తన బ్యాగు తీసుకొని వెళ్ళిపోయాడు ఆఫీసుకు చరణ్. భర్త పిల్లలు  వెళ్ళిపోయాక భర్త అన్న మాటలు తలుచుకుని  బాధపడింది.  ఛీ ఛీ ఏం బతుకులో ఏమో ఆడవాళ్ళవి. చచ్చేంత చాకిరి చేసినా

రవ్వంత  కూడా కనికరం చూపెట్టరు.  ఇంకా నయం ఉద్యోగం చెయ్యమనడంలేదు  అప్పుడు రెండు విధాల  నరకం కనిపించేదేమో. పెళ్ళైన  మొదట్లో అనుకున్నాను నేను కూడా ఉద్యోగం చేస్తే   బాగుండేదని  కానీ  ఆయనే ఒప్పుకోలేదు   ఇది నా మంచికే జరిగింది లేకపోతే గోడదెబ్బ చెంపదెబ్బ లాగా  ఉండేదేమో నా పరిస్థితి.

“ లక్ష్మీ… కాఫీ పెట్టు  త్వరగా  మార్కెటుకు వెళ్ళి కూరగాయలు  తెస్తాను , అలాగే ఏమేమి  తీసుకరావాలో   లిస్టు రాసిపెట్టు,  మళ్ళి ఇది  తేలేదు  అది తేలేదంటూ  నస మొదలుపెడతావు,” ఆఫీసునుండి  వస్తూనే చెప్పాడు.ముందు వెనక ఆలోచించకుండానే అనేస్తూనే  ఉంటాడు ఎదుటి మనిషి బాధపడతారేమో  అన్న ఆలోచన  కూడా ఉండదు.

“ ఇదిగో  ముందు మీరు కాఫీ తాగండి   ఈ లోపల లిస్టు  రాస్తాను,  అలాగే వచ్చేటప్పుడు పిల్లలను ట్యూషన్నుండి తీసుకురండి,” కాఫీ అందిస్తూ అంది.

“  నాకు కుదరదు లేటవుతుందినువ్వేం చేస్తావు  వెళ్లి పిల్లలును తెచ్చుకో,  పొద్దస్తమానం ఊరికే ఉంటావు  ఇంత వంటచేసి పెట్టి కూర్చుంటావు, కాస్త  అలా  వెళ్తే వాకింగ్ కూడా అవుతుందిఈ మాత్రం దానికేతెగ కష్టపడి పోతున్నాను  అనుకుంటావు,”  కాఫీ తాగి లిస్టు తీసుకొని వెళ్ళిపోయాడు లక్ష్మి వెళ్లి పిల్లలను తీసుకొని వచ్చి  భర్త  తెచ్చిన కూరగాయలు సర్దడం మొదలుపెట్టింది.

“ ఏమండీ ఇలా రండి  … మీకు ఆడవాళ్లు అంటే చిన్నచూపు ఉద్యోగం లేని వాళ్ళు అంటే మరీను,  ఏమన్నారు నేను ఇంట్లో ఏం చేస్తానని కదా వంటవండి పడేస్తే పనే  లేదన్నారు కదా! ఇప్పుడు చూడండి మీరు కూరగాయలు తెచ్చి పడేశారు మీపని అయిపోయింది, దొండకాయలు బీరకాయలు  చూడండి నాఅంత  ఉన్నాయి, కాకరకాయలు పండు పండుఅలానే తెచ్చారు  వంకాయలు తెచ్చేటప్పుడు చిన్నవి లేతని చూసి తీసుకోవాలి, ఇప్పుడు ఇవన్నీ మంచివి తీసి పెట్టి పాడైపోయేటివి ముందుగా వండాలి  అవునా,  మళ్లీ ఇందులో పిల్లలకు నచ్చినవి మీకు  నచ్చినవి వేరేవి, ఈ కూరగాయలన్ని  నేను వారం రోజులు కాపాడాలి పాడవకుండా చూసుకోవాలి ఇది పని లాగా మీకు కనిపించదు,”

“ ఎందుకు  రెండు రెండు చేయడం వాళ్లకి అన్ని అలవాటు చేయాలి, తినకపోతే రెండంటిస్తే సరి,” తనను తప్పు పెట్టేసరికి ఉక్రోషం ముంచుకోచ్చింది రఘుకు.

“  చాలా బాగా చెప్పారు చిన్న పిల్లలు కదా కొడితే సరిపోతుంది అనుకుంటున్నారు, మరి మీరు  మీకు  నచ్చినవి  మాత్రమే తింటారు ఒక పూట పప్పు చెయ్యకపోతే గొడవ, ఇడ్లీకి సాంబారు మీకు కావాలి పిల్లలకు పచ్చడి లేనిదే తినమంటారు,  పెసరట్టు  ఉప్మా మీకుకావాలిపిల్లలకు అదంటేనే ఇష్టం ఉండదు,  వాళ్లకు వేరే టిఫిన్ చేయాలి ప్రతిదీ మీకు నచ్చినట్టు చేయాలి, పిల్లలు తినరు కాబట్టి   వాళ్ళకి నచ్చినవి వాళ్ళకు  చేయాలి , వంటలతో కుస్తి పడటంతోనే నేను అలిసిపోతాను, ఇంత కష్టపడుతున్నాను పనిమనిషి పెట్టమంటే మేము వెళ్ళిపోయాక నువ్వు ఖాళీగానే ఉంటావు అంటారు,  కనీసం ఒక్కరు కూడా మీ బ్యాగుల నుండి టిఫిన్ బాక్సులు తీసి కూడా సింక్ లో వేయరు చేతకాదు,  ఎందుకంటే  మీరు అలసిపోయి వస్తారు, నేను మాత్రం  పని పాటలేకుండా ఉండేదాన్ని మీ దృష్టిలో,  మీ బట్టలు మల్లెపూల లాగా తెల్లగా తళతళలాడాలంటారు మీరు వేసుకునేవన్నీ తెల్ల బట్టలు ,అవి ఉతికి ఉతికి  నా ఎముకలన్ని తెల్లబడి ఉంటాయి పోనీ కష్టపడి ఉతికింది కదా ఇస్త్రీ చేసుకుందామని ఆలోచన కూడా ఉండదు పైగా  నామీద హుంకరింపు, భార్య అంటే బానిసనుకుంటారు మీరు ఆడమన్నట్టల్లా ఆడే  ఆటబోమ్మతో  పోల్చుకుంటారు,  ఆఫీస్ నుండి వస్తూనే ఎవరినో వెంటబెట్టుకొని వస్తూనే  మాకు వేడి వేడి బజ్జీలు వేయమని ఆర్డర్,  ఇంట్లో వస్తువులు ఉన్నాయో లేదో భార్యకు ఓపిక  ఉందో లేదో అని ఆలోచన కూడా మీకు రాదు కదా!  లంచాలు  ఇచ్చి పనులు చేయించుకుంటారు కానీ ఆడవాళ్లు కట్నం అనే లంచం ఇచ్చి కట్టుకున్న భర్తకు అత్తింటివారికి  పిల్లలకు బానిసల బతకాలి, పెళ్ళిలో  చెప్పిన మంత్రాలు  కేవలం  ఆడవాళ్ళకేపరిమితం మరి  మగవాళ్ళకు అలాంటి మంత్రాలు లేవా? “కార్యేషు దాసి” దాసి లాగా పనులన్నీ చేయాలి,“కర్ణేషు  మంత్రి” మీమగవాళ్లకు అన్ని సలహాలు ఆడవాళ్ళే ఇవ్వాలి అప్పుడు మంత్రి లాగా ఉండాలి మళ్ళీ ఆడవాళ్లే తెలివి తక్కువ అనే ఓ  చిన్న చూపు, “ భోజ్యేషుమాత” అంటే  మీకు  ఏది కావాలంటే అది చేసి మీరు తృప్తిగా తినేలా చూడాలన్నమాట అంతేకానీ కట్టుకున్న భార్య తిన్నదో లేదో అనే  ఆలోచన  మీ దరిదాపులకుకూడా రాదు,   భార్యకు ఓపిక ఉందా లేదా తనకు ఏదైనా సహాయం చేయాలా అనే ఊహ మీకు రాదు, “ శయనేషు  రంభ”  ఉదయం లేచిన దగ్గరనుండి మీ అందరికి అన్నీ సమకూరుస్తూ  ఇంటెడు చాకిరి  చేసి అలసిపోయిన  భార్యతో ప్రేమగా  రెండుమాటలు మాట్లాడాలన్నమనసే మీకు రాదు, కానీ మిమ్మల్ని మాత్రం రంభలాగా  సంతోషపెట్టాలి,ఇదెక్కడి  న్యాయమండి  మనుషులన్నప్పుడు  అందరికీ ఒకే రూల్  ఉండాలి కదా!  ఆడవాళ్ళను చులకన చేయడం ఏం బాగాలేదు ఇప్పుడు చెప్పండి నేను పని పాట లేకుండా ఇంట్లో పడి ఉంటున్నానా?  ఆడవాళ్ళు లేచినప్పటి నుండి పడుకునేవరకు ఎన్ని అవతారాలు ఎత్తుతుందో  ఇప్పుడన్నా అర్ధం చేసుకోండి, మేము  మనుసున్న మనుషులమే మాకు  ఒక మనసుంటందని  ఎప్పటికి  తెలుస్తుందో మీకు,”  ఎన్నో రోజులుగా భర్తకు చెప్పాలని  ఎదిరి చూసి చూసి  తన మనసులో  ఉన్న ఆవేదనంతా  ఒక్కసారిగా గుమ్మరించేసింది  లక్ష్మీ.

“ సరే సరే  ఇది ఎప్పుడు ఉండేదే కదా  నీ నస,” అనుకుంటూ లుంగీ కట్టుకుని బాత్రూంలోకి వెళ్ళాడు. బాత్రూంలో  కూర్చొన్న  రఘుకు  మార్కెట్ లో కలిసిన వేణు గుర్తుకు వచ్చాడు.

“ ఏరా  రఘు బాగున్నావా? చాలా రోజులైంది  నిన్ను కలిసి,” రఘును చూసి అడిగాడు వేణు.

“ ఏయ్ వేణు  ఏంట్రా మరీ కనిపించకుండా పోయావు  అంతగా పనిలో  మునిగిపోయావా,

స్నేహితులను కూడా కలుసుకునే తీరిక లేదా  ఏంటి విషయాలు,”నవ్వుతూ అన్నాడు రఘు.

“ పదా అలా  కూరగాయలు తీసుకుంటూ  మాట్లాడుకుందాము,  ఇప్పుడు మీ వాళ్ళందరూ బాగున్నారా,” బెండకాయలు  లేతవి తీస్తూ అడిగాడు.

“ ఆహా  నాతో సహా అందరం బాగున్నాము,  అవును మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు,”

“ ఇంకెక్కడుంటారు  నేనొక్కడినే కొడుకును కదా  వాళ్ళకు  నాతోనే  ఉంటారు,  ఈమధ్యన మా అమ్మకు పక్షవాతం వచ్చి  మంచం మీదనుండి కదలలేకపోతుంది,”

“ అలాగా ! మరి  ఏదైనా మంచి  హాస్పిటల్‌లో  చూపిస్తున్నావా?   నువ్విలా  ఒక్కొక్క  బెండకాయ  దొండకాయలు ఏరుతుంటే   ఇవాళ  మనం కూరగాయలు కొన్నట్టే, ఏవో  చేతికి

నచ్చినవి  కవర్‌లో  వేసుకుంటే  సరిపోతుంది, ఇంటికి వెళ్ళాక  వాళ్ళే  చూసి పెట్టుకుంటారు

వాళ్ళకేం పనుంటుంది,” నవ్వుతూ అన్నాడు  రఘు.

“ రఘు … నువ్వింకా  ఆడవాళ్ళను చిన్న చూపు  చూడడం  మానలేదా?   రఘు  మనం

ఆఫీసుకు వెళ్ళి  కష్టపడి సంపాదిస్తున్నాము  కాదనను కానీ,  ఇంట్లో ఆడవాళ్ళు  ఉదయం లేచినప్పటినుండి   రాత్రి పడుకునేవరకు  సమస్తం పనులతో  సతమతమయిపోతారు,  మనందరి  అవసరాలు  తనొక్కతే చెయ్యగలదు  పైగా మనం  వాళ్ళు  చేసే  వంటలకు వంకలు  పెడుతుంటాము అవునా,  ఉద్యోగం చేసే  మీ ఆవిడలాంటి  వాళ్ళకు  ఇంకా కష్టం

ఇంట్లో   బయట పని  చేసి  అలసిపోతుంటారు, మా ఆవిడ  చూడు  పాపం మా అమ్మకు సమస్తం  చేస్తూ  చంటిపాపలా  చూసుకుంటుంది, మా నాన్నకు  సరిగా కళ్ళు కనపడవు ఆయనను  చూసుకుంటూ  మా అందరికి  అన్ని విధాల చేసిపెడుతుంది,    ఇంట్లో

ఉండి  అలాంటి  పనులు  మనం  చెయ్యకపోయినా,  కనీసం  కూరగాయలు మంచివి చూసి తెచ్చిపెట్టామంటే  వెళ్ళగానే  సర్ధుకోవలసిన అవసరం లేకుండా  ఫ్రీడ్జ్ లో పెట్టుకుంటుంది, సమయం దొరికినప్పుడు  పిల్లలను స్కూల్  ట్యూషన్ నుండి  తీసుకరావడం చెయ్యాలి, ఇంట్లో తనకు సహాయం చెయ్యకపోయినా  చేసినదానికి వంకపెట్టకుండా  ఉంటే చాలు,

ఎలాగు  చేస్తుంది  కదాని  మరి  చులకనగా చూడకూడదు రఘు,  పుట్టినింటి వాళ్ళందరిని

వదులుకుని  ముక్కు ముఖం తెలియని  మనల్ని పెళ్ళి చేసుకుని  మనమే తన జీవితమనుకునే  ఆడవాళ్ళను  గౌరవించడం నేర్చుకోవాలి , అంతే కానీ  హేళన చెయ్యడం దెప్పిపొడవడం  మంచిది  కాదు  రఘు,” చెప్పడం  ఆపాడు  కూరగాయలు తీసుకోవడం అయిపోవడంతో.

“ సరేలే  నీవన్నీ  పాతకాలం  ఆలోచనలు  నువ్వలాగే  ఉండు, నీలాగా అందరు ఉండాలంటే

మగజాతికే చులకన,  నీ గురించి తెలిసి  నిన్ను కదిలించాను చూడు  అది నేను చేసిన పొరబాటు,  నీలాగా  ఆడవాళ్ళను  వెనకేసుకొస్తే   కీలుబొమ్మను చేసి  ఆడిస్తారు   నాకది అర్థం కావడం లేదు  సరే నేను వెళతాను,” పొగరుగా సమాధానం చెబుతూ  గబగబ అక్కడనుండి  వెళ్ళిపోయాడు రఘు.

రఘు … నీ భార్య మంచిది గనుక  నిన్ను భరిస్తుంది  ఇంకొకరైతే  ఈపాటికి  నీ అహంకారానికి  ఎప్పుడో విడాకులిచ్చేది,  నువ్వెప్పటికి తెలుసుకుంటావో  ఆడవాళ్ళకు గురించి  మనసులోనే బాధపడుతూ ఇల్లు చేరుకున్నాడు వేణు.

ఇంటికి వచ్చినప్పటినుండి  రఘుకు  ఎంత వద్దనుకున్నా  వేణు మాటలే పదేపదే గుర్తుకు వస్తున్నాయి.   నిజమే  నేనేనాడు   లక్ష్మిని  మెచ్చుకున్నదేలేదు  ఎప్పుడు దేనికో ఒకదానికి  ఈసడించుకోవడమే,  భార్యను  చెప్పుచేతుల్లో  ఉంచుకోకపోతే   ఏకుమేకైపోతారని  చిన్నప్పుడు  నానమ్మ  ఎప్పుడు  నాన్నతో  చెప్పేది. అదే  నిజమనుకుని  లక్ష్మిని  ప్రతిదానికి  అనడం  అలవాటయిపోయింది.  మగవాళ్ళు  సంపాదించుకరావాలని   ఇంట్లో పనులుచెయ్యకూడదని   కాలుమీద కాలు వేసుకుని  పెత్తనం చెలాయించాలని  నానమ్మ

మాటలు  నాలో  జీర్ణమైపోయాయి .  నిజానికి  లక్ష్మి  నాకంటే  ఎక్కువ కష్టపడుతుంది

ఇంట్లో  ఊపిరిసలపని  చేసుకుని   పరుగెత్తుకుంటూ  ఆఫీసుపని  పాపం చాలా అలసిపోతుంది.  వేణు  నువ్వు  చెప్పింది  నిజం  ఆడవాళ్ళ  కష్టం తెలుసుకుని  సహాయం చెయ్యడం  నేర్చుకోవాలి. అవును  ఇక నుండి  నేను  లక్ష్మి  ఇద్దరం  కలిసి  బరువు బాధ్యతలు  తీసుకుంటాము .  తనకు చేదోడు వాదోడుగా నేను మారతాను  నా మనసులో

మాట  లక్ష్మికి చెబితే  ఎంతో  సంతోషిస్తుంది. తేలికైన మనసుతో  బయటకు వచ్చి.

“ లక్ష్మీ … నువ్వు నిజంగా  నా కళ్ళు తెరిపించావు  అహంకారంతో నిన్ను రోజు మాటలతో బాధపెట్టాను,  మాకోసం మా సంతోషం కోసం నువ్వుఎంత  కష్టపడుతున్నావో తెలుసుకోలేకపోయాను,  ఆడవాళ్లకు ఇంట్లో ఏమంత పని ఉంటుంది  వంటచెయ్యడం  పిల్లలను చూసుకోవడం ఇంతేకదా  , ఆపీసుకు వెళ్ళినా మగవాళ్ళలా కష్టపడతారా అనుకున్నాను,అష్టావధానంలా  అందరిని మెప్పించి ఒప్పించిఅందరిని  తృప్తి పరిచి ఇల్లు చక్కదిద్దుకునే ఇల్లాలు   దేవతని  ఇప్పుడే తెలుసుకున్నాను,  లక్ష్మీ  ఇక నుండి నిన్ను  నేనొక్క మాట కూడా  అనను,  అంతే కాదు నీకు ఇబ్బందికలిగించే పనులు చెయ్యను  చేయించను,”అంటూ ఆర్తిగా  భార్యను  హృదయానికి హత్తుకున్నాడు. భర్తలో వచ్చిన  మార్పుకు ఆనందంతో  అతని కౌగిలిలో ఒదిగిపోయిందిలక్ష్మీ .

Written by Lakshmi Sharma Trigulla

॥॥ రచయిత్రి పరిచయం॥॥

పేరు- లక్ష్మీశర్మ త్రిగుళ్ళ
గృహిణి
భర్త పేరు- మెట్రామ్ శర్మ
(HMT రిటైర్మెంట్ )
ప్రవృత్తి –కథలు కవితలు రచనలు
4/10/2021కిన్నెర ఆర్ట్ ధియేటర్స్ ఆద్వర్యంలో
( మబ్బులు వీడిన ఆకాశం) కథల సంపుటి
మన తెలుగు కథలు డాట్ కామ్ వారి నుండి
(30/10/2022) ఉత్తమ రచయిత్రి బిరుదు
(సందెపొద్దు గూటిలోకి) కథకు (ప్రథమ బహుమతి)
( విశిష్ట బహుమతి) ఉత్తమ కథ బహుమతి ఓకే కథకు మూడు
రావడం
వివిధ పత్రికలలో మరిన్ని కథలు ప్రచురణ జరిగింది
మీ అందరి అభిమానంతో మరిన్ని మంచి కథలు రాయాలన్నదే
నా ధ్యేయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రమక్క తో ముచ్చట్లు-19

ఇదొక అపురూపమైన క్షణం