భారత కోకిల – సరోజినీనాయుడు

3

పసుపు – నారింజఎరుపు మిశ్రమంలోని ఆమని అందాలకు తన గానమాధుర్యాన్ని అలది వసంత రుతువుని రాగరంజితం చేసే వలసపక్షి కోయిల. కళల కాణాచి అయిన భారతావనిలో కలుపు మొక్కై మొలిచి , ఊడలమర్రిగా విస్తరించిన వలస వాదంపై తన కలాన్ని ఖడ్గంగా, గళాన్ని గొడ్డలిగా మార్చి కూకటి వేళ్లతో పెళ్లగించిన భారత కోకిల సరోజినీ నాయుడు.

1879 సంవత్సరం, ఫిబ్రవరి 13వ తేదీన బెంగాలీ కుటుంబీకులైన అఘోరనాథ్ చటోపాధ్యాయ- వరదసుందరీదేవి దంపతుల 8 మంది సంతానంలో ఒకరిగా హైదరాబాదు నగరంలో జన్మించారు సరోజినీ నాయుడు.

తండ్రి బహుభాషా కోవిదుడు, నిజాం కాలేజ్ మొట్టమొదటి ప్రధానోపాధ్యాయుడు, ఎడిన్బరో విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టాను పొందిన మొట్టమొదటి భారతీయుడు, శాస్త్రవేత్త , తత్వవేత్త కాగా తల్లి బాల్యం నుంచే బెంగాలీ భాషలో కావ్యాలు, కథలు రచించిన చక్కని రచయిత్రి. వీరి తోబుట్టువుల్లో ఒకరైన వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ విప్లవకారుడు కాగా, మరో సోదరుడు కవి, నటుడు, నాటక రచయిత కావడం గమనార్హం.

తల్లిదండ్రులు విద్యాధికులు కావడం, హైదరాబాదు నగరంలోని నాంపల్లి రైల్వే స్టేషన్ కు అతి సమీపంలోని వీరి నివాస గృహమైన చారిత్రాత్మక భవనం గోల్డెన్ త్రెషోల్డ్ కు విద్య, వివాహం, స్త్రీ శక్తి , మహిళా సాధికారత, జాతీయవాదం వంటి సమస్యలపై పోరాడే పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు తరచుగా రావడం, వారి సంభాషణలు, చర్చల నడుమ గడిచిన బాల్యం జ్ఞానసాగర మథ నానికి కారణమైంది. ఆంగ్లభాషపై ఏర్పడిన మక్కువ పట్టుదలగా మారి, 11వ ఏట అనర్గళంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాకుండా, 12వ ఏట మద్రాసు విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్ పరీక్ష ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలు కావడం , 13 వ. ఏట ‘సరోవర రాణి(The lady of the lake)’ అనే 1300 పంక్తుల కవితా రచనను ఆరు రోజుల్లో పూర్తి చేశారు. పర్షియన్ భాషలో వ్రాసిన ‘ మహర్ మునీర్ ‘నాటకానికి ముచ్చట పడిన నైజాం రాజు 4200 విద్యార్థి వేతనంతో అందించిన ప్రోత్సాహంతో (అనారోగ్య సమస్యల కారణంగా మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత సాధించిన నాలుగు సంవత్సరముల విరామానంతరం) విదేశీవిద్య నభ్యసించడానికిగాను 1895 లో లండన్ కు పయనమ య్యారు. నాలుగు సంవత్సరాల ఈ విరామ కాలాన్ని పుస్తకపఠనం ద్వారా సమర్థవంతంగా వినియోగించుకొని తనను తాను చక్కని కవయిత్రిగా మలుచుకోగలిగారు.

1895 – 1898 వరకు లండన్ లోని మహబూబ్ అలీఖాన్ స్థాపించిన ‘నిక్సం ‘ కళాశాలలోనూ, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలైన ‘ గిర్టన్ ‘ కళాశాలలోనూ విద్యనభ్యసిస్తూ, ఆర్థర్ సైమన్స్, ఎడ్వర్ గూస్ వంటి పలువురు పాశ్చాత్య విద్వాంసులతో చక్కని స్నేహ సంబంధాలు ఏర్పరచుకొని, వారి పాండిత్యాన్ని ఆకళింపు చేసుకోవడమే కాకుండా, వారి ఆదరణ, మార్గదర్శకత్వంలో కాలవిహంగం ( Bird of time), స్వర్గ ద్వారం ( The golden threshold), విరిగిన రెక్కలు( The broken wings) వంటి చక్కని కవితా సంకలనాలను ప్రచురించారు. గేయం, గీతం, పద్యం వంటి మూడు ప్రక్రియల్లో రూపొందిన ఈ సంకలనానికి , వీరి కవితా శైలికి ముచ్చటపడిన ఆర్థర్ సైమన్ ప్రోత్సాహాన్ని అందించడమే కాకుండా, పరిచయ వాక్యాలు కూడా వ్రాశారు. వెన్నుతట్టి ప్రోత్సహించిన మరో విద్యావేత్త అయిన ఎడ్వర్ గూస్ గారికి ఈ సంకలనాన్ని అంకితమిచ్చారు. 1889లో భారతదేశానికి తిరిగి వచ్చి, దేశాభివృద్ధికి గొడ్డలిపెట్టుగా పరిణమించిన కులమత భేదాలు, వేర్పాటువాదంపై పోరులో భాగంగా, పలు విమర్శలు, వ్యతిరేకతల నడుమ 19 సంవత్సరాల వయసులో, 1889 డిసెంబర్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నానికి చెంది, హైదరాబాదు నగరంలో ఓషధారోగ్యాధికారిగా విధులు నిర్వహించే పైడిపాటి గోవిందరాజులు నాయుడు గారిని ప్రముఖ సంఘ సంస్కర్త అయిన శ్రీ కందుకూరి వీరేశలింగం గారి ఆశీర్వచనాల నడుమ వివాహమాడి, ఐదుగురు పిల్లలకు (పద్మజా నాయుడు, లీలామణి నాయుడు, రణధీర్ నాయుడు, జయసూర్య నాయుడు, నీలావర్ నాయుడు) జన్మనిచ్చారు.

విద్యాధికురాలిగా, కవయిత్రిగా, కూతురిగా, అర్ధాంగిగా, మాతృమూర్తిగా అన్ని పాత్రలను సమర్థవంతంగా నిర్వర్తించి, న్యాయం చేసినప్పటికీ కూడా మనసులో ఇంకా ఏదో వెలితి, జీవితం అనే నాటక రంగంలో తన పాత్ర కుటుంబానికి మాత్రమే పరిమితం కాదనీ, ఈ పరిధికి ఆవల తాను నిర్వర్తించాల్సిందేదో మిగిలి ఉందని మనసు హెచ్చరిస్తూ ఉంటే , 1905లో బెంగాల్ విభజ నానంతరం జాతీయోద్యమంలో చేరి, గాంధీజీ స్ఫూర్తితో1915, 1916లో బొంబాయి, లక్నో సభలో పాల్గొని ,స్వాతంత్ర సంగ్రామంలో చురుకైన పాత్రను పోషించారు. 1915 – 1918 మధ్యకాలంలో సామాజిక సంక్షేమం, మహిళా విముక్తి వంటి అంశాలపై ప్రసంగాలి వ్వడానికి గాను దేశం నలుమూలలా తిరిగారు.1908 మూసి వరదల సమయంలో అందించిన సేవలకుగాను 1911లో బ్రిటీష్ ప్రభుత్వం ‘కైజర్- ఏ – హింద్ ‘ అవార్డును అందించగా 1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ ఉదంతానికి కలత చెంది అవార్డును తిరస్కరించారు.

అప్పటి పురుషాధిక్య సమాజంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలకు స్పందించి 1917లో ‘ఉమెన్ ఇండియన్ అసోసియేషన్ ‘ ఏర్పాటుకు తోడ్పడి,తన సహోద్యోగి, హోమ్ రూల్ లీగ్ అధ్యక్షురాలైన అనీబీసెంట్ గారితో కలిసి లండన్ లోని జాయింట్ సెలెక్ట్ కమిటీ ముందు భారతదేశానికి సార్వత్రిక ఓటు హక్కును ప్రదర్శించారు. 1917లో భారత మహిళాసంఘ స్థాపనకు తన మద్దతును ప్రకటించగా అది క్రమేణ మహిళా ఫిర్యాదులు, హక్కుల సాధనకు వేదికగా మారడమే కాకుండా, అదే సంవత్సరం భారత విదేశాంగ కార్యదర్శి అయిన ఎడ్విన్ మోంటాగు మరియు భారత వైస్రాయ్ లార్డ చెల్మస్ ఫోర్డ్ తో సమావేశమైన మహిళా బృందానికి ప్రతినిధిగా వ్యవహరించారు. 1925లో భారత జాతీయ కాంగ్రెస్ కు రెండవ అధ్యక్షురాలిగా, మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు.

జాతి నిర్మాణానికి స్త్రీ శక్తి అత్యంత బలమైన కారకమనీ, స్త్రీల భాగస్వామ్యంలేని జాతీయ వాద ఉద్యమం వ్యర్థమనీ, మహిళా హక్కుల పునాదులపైనే జాతీయవాద సౌధం నిర్మించబడుతుందనీ, పరాయి పాలనలోని కబంధ హస్తాల నుండి భారతదేశం విముక్తి పొందాలంటే స్త్రీ శక్తి చాలా అవసరమనీ గ్రహించి, వారిలో స్వాతంత్ర్య కాంక్షను రగుల్కొల్పడానికి తన స్ఫూర్తిమంతమైన ప్రసంగాలతో ఉత్తేజపరిచారు. ఈ కారణాల వల్లనే స్వాతంత్రోద్యమానికి సమాంతరంగా మహిళా ఉద్యమం అభివృద్ధి చెందింది.

1930లో గాంధీజీ ఆధ్వర్యంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలోనూ, 1931లో బాపూజీ, చాచాజీ, గోపాలకృష్ణ గోఖలే వంటి రాజకీయ దిగ్గజాలతో కలిసి రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. 1930లో కాంగ్రెస్ నాయకులను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేయగా లండన్ లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ దూరంగా ఉన్నప్పటికీ, 1931లో గాంధీ – ఇర్విన్ ఓడంబడిక అనంతరం సరోజినీ నాయుడు, మరికొంతమంది నాయకులు రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. బాపూజీ నాయకత్వంలో జరిగిన శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన నాయకుల్లో ఒకరై పలుమార్లు అరెస్టై , 21 నెలల కారాగార వాసాన్ని గడిపారు.

1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన అనంతరం అప్పటి అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా ఎన్నికయ్యారు.

19వ శతాబ్దపు చివర సంధ్యా సమయంలోని భాగ్యనగరం అందాలను ‘ The night fall in the city of Hyderabad ‘ అనే కవితలోనూ, హైదరాబాదు నగర వీధుల్లోని సందడిని ‘ In the bazaar of Hyderabad ‘ అనే మరో కవితలోనూ తమ అందమైన అక్షరాల అల్లికలో చిత్రించారు. 1918 లో ‘The speeches and writings of sarojini ‘అనే సంకలనాన్ని ప్రచురించారు.వీరి కవితాశైలికి ముచ్చటపడిన బాపూజీ వీరికి ‘భారత కోకిల’అనే బిరుదునిచ్చారు.

1949, మార్చి 2న ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలోనే వీరు తుది శ్వాస విడిచారు. 1927లో ‘ The feather of dawn ‘ అనే సంకలనాన్ని వీరి మరణానంతరం వీరి కుమార్తె అయిన పద్మజా నాయుడు 1961లో ప్రచురించారు. 1964, ఫిబ్రవరి 13న వీరి చిత్రంతో కూడిన తపాలాబిళ్ళను భారత ప్రభుత్వం విడుదల చేసింది. వీరిపై ఉన్న అభిమానానికిగాను సికింద్రాబాద్ సమీపంలోని ఒక వీధికి ‘ సరోజినీ దేవి రోడ్డు’ అని నామకరణం చేశారు. వీరు పుట్టి పెరిగిన హైదరాబాదులో ‘సరోజినీ కంటి ఆసుపత్రి ‘ ని స్థాపించారు. వీరు ఉపయోగించిన వస్తువులు సాలార్జంగ్ మ్యూజియంలోనూ, జాతీయ పురావస్తు ప్రదర్శనశాలలోనూ ప్రజల సందర్శనార్థం ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి.

పద్మశ్రీ చెన్నోజ్వల

పిల్లలు , దేశభక్తి, విషాదం వంటి ఇతివృత్తాలతో కవితా సౌరభాల్ని పంచి, హిందూ ముస్లిం భాయీ భాయీ అని నినదించి, తను నమ్మిన సిద్ధాంతానికిగాను ఎన్ని ఆటంకాలెదురైనా సడలిపోని సాహసమై, వెన్నుచూపని శౌర్యమైన బెంగాలీ ఆడపడుచు, తెలుగింటి కోడలు అయిన ఆ ధీరవనితకు ప్రణతులర్పిస్తూ……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మురారి కథలో ప్రేమ పాశం

ఏడంతస్తుల మేడ ఇది – ఎన్నో గుండెల వ్యధ ఇది