(ఇంతవరకు జరిగిన కథ.. ఆమని వాళ్ళ మనవడి పుట్టినరోజు వేడుకకు హాజరైన మైథిలి ,మాలినిలు అది పూర్తికాగానే వారి వద్ద సెలవు తీసుకుని ఆ ఊళ్లోనే ఉంటున్న తమ స్నేహిత పద్మిని ఇంటికి వెళతారు. ఈ సమాచారం ఫోన్ ద్వారా తెలుసుకున్న హాసిని దంపతులు కూడా అక్కడకువస్తారు. తాము విజయవాడలో ప్రైవేట్ కళాశాలలో పనిచేసినప్పటి సంగతులను గుర్తు చేసుకుంటూ ,ప్రస్తుతం తమ వంశాంకురాలను గురించిన ముచ్చట్లతో సరదాగా గడుపుతారుపద్మిని, మైథిలి,మాలినిలు.తర్వాత వీరంతా కలిసి అక్కడే ఉంటున్న ఇంకో స్నేహిత చంద్రికను చూడటానికి వెళతారు .వీరి రాకతో ఎంతో సంతోష పడుతూ చక్కని అతిధి మర్యాదలు చేస్తుంది చంద్రిక. మాటల్లో మాటగా హాసిని పట్ల ఆమె భర్త జనార్థన్ ప్రవర్తించే తీరు తెలుసుకున్న మైథిలి ఆమెకు ధైర్యం చెబుతంది. చంద్రిక దగ్గర నుండి తిరిగి వెళ్లే సమయంలో పద్మిని దంపతులు మాలిని, మైథిలీ లను తమ కారులో మాలిని వాళ్ళ ఇంటి వద్ద డ్రాప్ చేస్తారు .హాసిని జంట తమ బండిమీద వెళ్లిపోతారు. మైథిలి రాకపట్ల చాలా సంతోషాన్ని వ్యక్త పరుస్తారు మాలిని కొడుకు ,కోడలు. తరానికి తరానికి మధ్య తలెత్తే విభేదాలను గుర్తించిన మైథిలి ఒకప్పుడు పూర్తి ఆర్థిక స్వాతంత్రంతో వ్యవహరించిన మాలిని క్రమక్రమంగా పరాధీనగా మారిపోతున్న పరిస్థితిని తలుచుకుని బాధపడుతుంది.)
మా ఫ్రెండ్స్‌లో మేమిద్దరమే ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించు కోలేకపోయాము. ముఖ్యంగా మరీ నేను అన్ని యోగ్యతలు ఉండి కూడా చిరుద్యోగిగా మిగిలిపోయా. ఎదుగు బొదుగూలేని జీతం తెచ్చుకుంటూ సమాజం చూపించే నికృష్టమైన చూపుల తాకిడికి చాలా మానసికమైన క్రుంగుబాటుకు లోనైన రోజులెన్నో. అవన్నీ గుర్తుకొచ్చి మనసంతా చేదుగా మారిపోయింది. మాలినివైపు చూశాను. ఒక మాత్ర, నిద్రకోసంగా వేసుకుంటానని చెప్పింది. బహుశా అందుకేనేమో నిద్రలోకి జారిపోయింది. నేనేమో గత జ్ఞాపకాల పుట్టకు చుట్టుకుపోయాను నా ప్రయత్నం లేకుండానే.
ప్రైవేట్ కళాశాలలంటే తెలవనిది ఏముంది? చాకిరీ ఎక్కువ, జీతాలు తక్కువ జీవితాంతం చేసినా. తరగతిలో విద్యార్థులు ఎక్కువ. వారం వారం పరీక్షలు. వాటిని మూల్యాంకనం చేయడం. అదనపు తరగతులు ఎక్కువ. సెలవులు తక్కువ. వెట్టిచాకిరీ లాగానే అన్పించేది ఒక్కోసారి. పుట్టింటి వేడుకలు, పెండ్లిండ్లకు కూడా ఓ అతిథిగా వెళ్ళినట్లుండేది. వేడుకకు ముందురోజు వెళ్లటం, వేడుక చూసుకోవటం, మళ్ళీ తెల్లారే వచ్చేయటం. ఇక ఇరుగు పొరుగు అమ్మలక్కల వింత మాటలు ‘ఆమెకేం హాయిగా పొద్దున్నే వెళ్లిపోతుంది. ఎప్పుడో పొద్దుగూకే సమయానికి వస్తుంది’ అన్నట్టుగా చాటుమాటు మాటలు ఒక్కోసారి చెవినపడి చాలా బాధ అన్పించేది. మావారు (కూడా) ఉద్యోగే ఆఫీసర్ స్థాయి. రోజూ వెళ్ళివస్తూండేవారు. ఇంటికి, మా కాలేజీకి మధ్య చాలా దూరం. పిల్లలిద్దరికీ, మా వారికి, నాకు క్యారేజీలు సర్దుకోవాలి. ఇంటిపనులు పూర్తి చేసుకుని ఇల్లు సర్దుకోవాలి. ఎంత సర్దుకుంటే మహిళలు ఎనిమిది గంటలకల్లా బైటపడగలరు. ఎంతటి మానసికమైన వత్తిడిని ఎదుర్కోవాలి ప్రతిరోజూ. ఇవ్వేమీ తెలవవు ఆ వాగుడ్లు వాగేవారికి. నేనేదో దర్జాగానే వెళ్తున్నట్లుంది చూసేవారికి. తలొంచుకుని నా దారిన పోతుంటే. ఎంత పొగరోననే చూపులు గుచ్చుకునేవి. పోనీ ఒకే వీధిలో ఉంటున్నాం గదాని పలకరిస్తే, ఏం మీకు ఈ రోజు సెలవు కాదా? అనే వెటకారపు మాటలు. ఎప్పుడైనా దొరకక దొరకక ఒక సెలవు రోజు దొరికి, ఏ షాపింగ్‌కో వెళ్తుంటే ‘మీరివాళ కాలేజీకి పోలేదా?’ అనే మాటలు ఇవే ఉంటాయి వెక్కిరింపుల మాటలు దొర్లుతాయి. ఇలాంటి మాటలు వింటుంటే చాలా ఎంబ్రాసింగ్‌గా, ఇరిటేటింగ్‌గా ఉండేవి.
ఇక బంధువర్గం నుంచి మాటలు మరోరకంగా బాణాలై చురుక్కుమని గుచ్చుకుంటాయి. ‘ఓ ఇంకా ప్రభుత్వ ఉద్యోగం రాలేదా నీకు? అయినా గవర్నమెంటు ఉప్పుతినే అదృష్టం ఉండాలి ఎవరికైనా?’ అంటూ మొహం మీదే సామెత చెప్పినట్లుగా చెపుతూ, వేళాకోళపు చూపులు, ఇంట్లోనేమో ఇంకా ప్రత్యేకంగా… ‘బోల్డంత మందికి ఉద్యోగాలొస్తున్నాయి. టిక్కుటిక్కుమంటూ నువ్వింకా అదే చేస్తున్నావు. సంవత్సరానికి బోడి రెండొందలు పెరుగుతుంది. మీరేమో గట్టిగా అడగరు మేనేజ్మెంట్ని, ఆ ఇచ్చేది కూడా పదో తారీఖు దాటిన తర్వాతనే అనే సణుగుళ్లు. ఇలాంటి మాటలు విని వినీ రాయిలాగా అయిపోయిన మనసు మౌనంగా కన్నీళ్లు కార్చేది.
అత్తగారు లేనేలేరు. ఆమె వంతుగా వినొచ్చే మాటల్ని కూడా మా ఆడబడుచులే మూటకట్టుకుని నానెత్తిమీద గ్రుమ్మరిస్తూ ఈసడిరపుగా పలికే మాటల్ని అటుంచితే భర్తనుంచే వినాల్సిరావటం ఆడవారికెవరికైనా బాధగానే ఉంటూ గుర్తొచ్చినప్పుడల్లా ములుకుల్లాగా గుచ్చుకుంటూ ఉంటాయి.
పట్టుదలగా నా మెతుకు నేనే సంపాదించుకోవాలనే ఆకాంక్షతో చిన్న
ఉద్యోగమైనా విడువకుండా సుమారుగా 35 ఏండ్ల పాటు వెట్టిచాకిరీనే చేశా. ఇన్నేళ్లు ఎట్లా చేశారాంటీ? అని తెలిసినవాళ్లు ఎవరైనా అడిగితే ఇంట్లో కూర్చుని ఏం చేస్తామమ్మా మనం నేర్చుకున్న చదువు వృధా పోకుండా నల్గురికీ పంచటమే నాకిష్టమని చెప్పేదాన్ని. దీనికి వెనుకవున్న అసలు ఉద్దేశ్యం మీకు తెలవటమే నాకు కావలసినది.
సెలవులు ఎక్కువగా లభించవుగదా ప్రైవేటు సంస్థల్లో పనిచేసేవారికి. మన దగ్గిర ముస్లిం పిల్లలు ఎక్కువ లేరని వారి పండుగలకు సెలవు లేకుండా చేయటం. పరీక్షా ఫలితాలు బాగా రావాలని ప్రైవేటు తరగతులతో రుద్దటం, కఠినంగా ఉన్న సబ్జెక్టుకు ఎక్స్ట్రా క్లాసులంటూ సమ్మర్లో కూడా మాకివ్వాల్సిన సెలవులను కుదిస్తూ మొత్తంమీద ఓ పదిరోజులివ్వటం గగనమైపోయేది. ఇక ఇలాంటి సందర్భంలో తీవ్రమైన వాగ్భాణాలు సంధింపబడేవి ఇంట్లో. ‘వాళ్ళిచ్చే ఇంతోటి జీతానికి సెలవురోజు కూడా కాలేజీకి పోవాలా? నువ్వే పోతున్నావా? ఇంకెవరైనా వస్తున్నారా లేదా? ఒకచో అనుమానపు చూపులు…
‘అదేంటండీ… అందరికీ సెలవులిచ్చారు గదా! ఐనా మీరు
వెళ్తున్నారెందుకంటూ…’ ఏదో నామీద లేనిపోని సానుభూతి ఒలకపోస్తూ చేసే కొందరి ఇచ్చకాల మాటలు… ఇంట్లో గొడ్డు చాకిరీ చేస్తున్నా… అందరి చేతా మాటలు శూలాలై గ్రుచ్చుకుంటున్నా, క్లాసుకు వెళ్లగానే, బోధనలో పడగానే మనసు దూదిపింజలా తేలిపోయేది. అసలు పనిచేస్తున్న కాలేజీలోకి అడుగు పెట్టగానే ఓ ఓ పవిత్రభావన నన్ను అలుముకునేది. ఇదంతా ఆ సరస్వతీ మాత అందించిన దీవెనలా భావిస్తుంటాను ఇప్పటికీ. కానీ ఒక్కోసారి మనసు మరీ బాధపడేదెందుకంటే పదో తారీఖు వచ్చేసింది. ఇంకా జీతమడిగి తీసుకోరా, అడగటం కూడా చేతకాదా? అనే పదునైన ప్రశ్నలు ప్రతినెలా వినాల్సి రావటం. అసలు చదువుకోకుండా ఉంటే ఎంత బాగుండేది? ఒకవేళ చదువుకున్నా ఏ పదో తరగతి తోటో ఆపేస్తే ఎంత బాగుండేది! నేను కళాశాల నుండి స్టడీ అవర్ గానీ లేదా అదనపు క్లాసుగానీ ముగించుకుని వచ్చే సమయానికి సూర్యాస్తమయం దాటిపోయేది. సూర్యోదయానికి ముందే అంట్ల గిన్నెలతో కుస్తీలు, వంటింట్లో తలమునకలయ్యే పనులు… నాలుగున్నర ఐదింటికి ఠంచనుగా లేస్తేనే అట్లాట్లా టైము సరిపోయేది. ఒంట్లో నలతగా ఉండి ఏరోజైనా లేవటం ఆలస్యమైపోతే ఇక ఆరోజు చెప్పనే అక్కర్లేదు. ఈ ఇబ్బందులతోటి పోల్చుకుంటే ఇంట్లో హౌజ్ వైఫ్స్‌గా ఉంటారే వాళ్లపని చాలా బెస్ట్ అన్పిస్తుంది. పైగా భర్త జీతాన్ని తాము అందుకుంటూ ఇంట్లో వాళ్లందరి మీదా పెత్తనం చెలాయించటం, ఇంట్లో అన్నింటికి వాళ్ళ మాటే చెల్లుబాటులోకి తెచ్చుకోవటం ఇవన్నీ గమనిస్తుంటే… నాలాంటి చిరు ఉద్యోగినులందరికీ మిగిలేది ఏంటయ్యా అంటే ఏతావాతా చీవాట్లు, ఈసడిరపులు, పని ఒత్తిడిలో నలిగిపోవటం మినహా ఏం మిగిలిందనీ అనిపిస్తుంది నాకు. కానీ ఓపిక ఉన్నంతవరకు చిన్నదైనా సరే జాబ్ చేస్తూ స్వాభిమానంతో బ్రతకటమే ఎంతో మేలుగదా! ఆలోచిస్తూ… ఆలోచిస్తూ… గతాన్ని నెమరు వేసుకుంటూ నేను కూడా ఎప్పుడు నిద్రలోకి జారిపోయానో తెలవదు.
మెలకువ వచ్చి చూస్తే తెల్లారి ఏడన్నరయింది గోడమీద ఉన్న గడియాం చూసేసరికి. నా చెయ్యి మాలినిని చుట్టుకుని ఉంది. పంక్షన్లో అలసిపోవటం మూలానో, ఆలోచనలకు నిద్రకు బ్రేకు వేయటమో… మొత్తానికి ఏమైందో తెలియదు గాని, తర్వాత గాఢ నిద్రే నన్ను వరించినట్లుగా అర్థమైంది. మనసు చాలా తేలికయినట్లన్పించింది.
***
ఆలోచనలను, బాధలను దులుపుకున్న మనసులు రాత్రిని కూడా దులుపుకున్నాయి. కప్పుకున్న దుప్పట్లను మడత పెట్టి, వాటి స్థానాల్లో సర్దేసి, బ్రెష్, స్నానం పూర్తిచేసుకుని, దేవుని దగ్గర దీపం పెట్టుకుని, టిఫిన్లు పని పూర్తిచేసుకుని ఇద్దరూ తయారవటం మొదలుపెట్టాము. ఎందుకంటే ఈరోజు ఆమని వాళ్ళింటికి వస్తామని తనకు మాటిచ్చాం. నిన్నంతా ఫంక్షన్‌కి వచ్చిన గెస్టులను రిసీవ్ చేసుకోవటం, భోజనాలకు తీసుకువెళ్ళటం, మళ్ళీ వాళ్లని సాగనపంటం. మధ్యమధ్యలో ‘మీరు కూడా రావాలి ఫోటోకి’ అని కోరే బంధువులతో, వచ్చిన ఫ్రెండ్స్‌తో స్టేజీ మీదకి ఫోటో దిగటానికి వెళ్ళాల్సి రావటం… ఇన్ని పనుల మధ్య సతమతమవుతూ కూడా కుదిరినప్పుడల్లా మా దగ్గరకు వచ్చి బాగా అయినవారిని మాకు పరిచయం చేయటం లాంటి పనులతో ఆమని హడావుడి పడుతోంది. మా పిల్లల చిన్నప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు మేమంతా కలిసి ప్రైవేట్ కాలేజీలో పని చేశామని వారికి చెప్పటంతో ‘ఆ… ముప్ఫై, ముప్ఫై ఐదేండ్ల స్నేహమా మీది?’ అని వాళ్ళు ఆశ్చర్యపోవటం చూస్తుంటే చెప్పద్దూ… మాకు ఒకింత గర్వంగా
ఉండేది. అది ఆమని వాళ్ళ మనవడి బర్త్‌డే ఫంక్షను, పెండ్లిండ్లు, ఎంగేజ్మెంట్లు వాటితో పోల్చి చూస్తే ఇది చిన్నదే గదా!
అందుకే వాళ్ళు ‘ఈ ఫంక్షన్‌కి అంత దూరం నుండి వచ్చారా’ అని ఆశ్చర్యంగా అడుగుతుంటే మా మధ్య పాదుకొని ఉన్న స్నేహ మాధుర్యం నా మనసునిండా సుధలు చిమ్మించేది. ఇదీ అని చెప్పలేని, ఎంత చెప్పినా తనివితీరని, ఎప్పటికీ మాసిపోని మా స్నేహబంధమిది అని వాళ్ళకు ఏం తెలుస్తుంది? అనుకున్నా నా మనసులో.
మొహమాటాన్కి వచ్చేవాళ్లు కొందరు, పరిచయాన్ని పురస్కరించుకుని రాకపోతే ఫీలవుతారని వచ్చేవాళ్లు కొంతమంది, మనింటికి వచ్చారుగదా, మనం కూడా వెళ్ళాలి, బాగోదని కొందరు, దాన్ని బాధ్యతగా భావించి కొందరు, పనిచేసివున్న ఆఫీసు కాబట్టి మొక్కుబడి కోసం వచ్చేవారు ఇంకొందరు, ఒకే అపార్టుమెంటులో ఉండేవాళ్ళము తెల్లారి లేస్తే ఒకరి మొఖాలొకరు చూసుకోవాలి… ఇది తప్పనిసరి అని భావించి అటెండయ్యేవారు కొంతమంది… వాళ్లకూ, మనకూ అంతగా మాటల్లేక పోయినా పిలిచారు కాబట్టి వెళ్ళొద్దాం. వెళ్ళకపోతే మనింటికి మళ్ళీ పిల్చినా వాళ్లు రారు అని మొక్కుబడిగా వచ్చేవాళ్ళు… ఇలా హాలంతా నిండిపోయి మొత్తానికి సందడి సందడిగా, కోలాహలంగా ఉంటే, తిండి కోసమే వచ్చామన్నట్టుగా ఆబగా ప్లేటునిండా వడ్డించుకుని, ఆపై తినలేక వృధాగా పారేసే వేస్టురాయుళ్లు.. ఇందరి మధ్యన వెలుగుతున్న స్నేహ బంధం గొప్పదనం వాళ్ళకి ఎలా చెబితే అర్థమవుతుంది చెప్పండి.
అందర్నీ గమనిస్తూ భోజనం చేస్తున్న మమ్మల్ని ‘‘ఆ కర్రీ వేయించుకోండి చాలా బాగుంది. ఇదిగో ఈ కర్రీ రోటీలోకి బావుంటుదని మా పిల్లలు స్పెషల్‌గా చేయించారని, తానే స్వయంగా తెచ్చి వడ్డించటంతో నేనే వారించా ఆమనిని.
‘‘మేమేమన్నా కొత్త చుట్టాలమా? ఏంటి చెప్పు. మాకు కావాల్సింది మేము పెట్టించుకుంటాంలే! అని చెప్తూ అతిథులను చూసుకో ఆమనీ’’ అని ఒకింత గట్టిగా చెప్పటంతో అయిష్టంగానే కదలటం తప్పింది కాదు తనకు. ఆ కబుర్లూ, ఈ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించి, తలా ఓ కప్పు ఐస్క్రీము తినే పనిలో పడ్డాం. మాకు తెలిసిన వారిని పలకరిస్తూ, వారి యోగక్షేమాలు కనుక్కంటూ మధ్యమధ్యలో మా మా హ్యాండ్ బ్యాగ్‌ల మీద ఓ కన్నేసి ఉంచుతున్నాం. తప్పదుగదామరి! జనం తొక్కిడిలో వున్నప్పుడు మన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేగదా!
అతిథుల తాకిడి క్రమక్రమంగా తగ్గుతోంది. నిండుగా ఉన్న ఆ హాలు పలచబడుతూ, పొందికగా వేయబడ్డ కుర్చీలు అయిష్టంగా ఉన్న వ్యక్తులు ప్రక్క ప్రక్కనే ఉన్నా ఎలా పెడమొఖంగా ఉంటారో అట్లా ఉన్నాయి. బఫే మూలంగా అక్కడక్కడా వాటర్ తాగిన గ్లాసులు, ఫంక్షన్ మధ్యలో సర్వ్‌చేసిన కూలింగ్ డ్రిరక్ బాటిల్సు అక్కడక్కడా చెల్లాచెదురుగా పడివున్నాయి. ఇంట్లో ఏదన్నా అభిప్రాయ బేధాలు లేదా గొడవలు జరిగినపుడు కుటుంబంలో ఏదో కష్టపడిపోయినట్లు. ‘ఇక మేం వెళ్లొస్తామండీ!’ అంటూ ఆమని దంపతులకు చెప్పి వెళ్తున్నారు వచ్చిన అతిథులు.
ఎక్కడి వాళ్లక్కడ స్తబ్దుగా ఉన్నట్లుగా తోచసాగాయి వాటిని చూస్తుంటే. సందడి సద్దుమణిగింది. మేం కూడా ఆమని దంపతులకు వెళ్లొస్తామని చెప్పి బైల్దేరాం అక్కడి నుండి.
మాలిని, నేనూ ఆటోలో వెళ్తున్నామన్న మాటేగానీ కందిరీగల్లా ఆలోచనలు ముసురుకోసాగాయి నా మనసులో.
‘‘ఆమని ప్రొద్దున్న కాల్ చేసింది నాకు. చూసుకోలేదు. ఇటురావటానికి తయారయ్యే ధ్యాసలోపడి’’ అంది నవ్వుతూ మాలిని నాతో.
వింటున్నట్లుగా తనని చూసి తలపంకించాను నేను.
‘‘ఈ పూట భోజనానికి రావాలి తప్పకుండా’’ అని మెజేస్ పెట్టింది. నేను ఫోన్ చూసుకోలేదని’’ అంది మాలిని మళ్ళీ.
మళ్ళీ ‘ఊ’ అన్నాను తల ఊపుతూ.
ఫంక్షన్ కొచ్చిన కొంతమంది అట్నుంచి అటే వెళ్లినా దగ్గిర బంధువులు కొందరైనా ఇంటికొచ్చి బస చేస్తారుగదా! వద్దంటే వినదు.
అసలు తననోసారి కలిసి కాసేపుండి ఆ బర్త్‌డే బుడ్డోడ్ని మరోసారి ఎత్తుకొని మురవాలని నా ఆశ. మాలినిది కూడా అదే ఆశ. ఆ ఆలోచనతోటే ఉన్న మాకు భోజనానికి ఇక్కడికే రావాలన్న ప్రేమ పూర్వక ఆదేశంలాంటిది అందటంతో తప్పించుకోలేకపోయాము మేమిద్దరం. మాలిని మనసులోని భావాలు కూడా ఇవే సాగుతున్నట్లుగా అర్థమవుతున్నాయి తన ముఖ కవళికలను చూస్తుంటే.
‘‘అవునబ్బా మైథిలి… రామారావు అన్నయ్యగారు చాలా మారిపోయారు. మునుపటిలాగా కాదు. నిప్పులోంచి పుటం పెట్టి బైటికి తీసిన వ్యక్తిలాగా స్వచ్ఛమైన వ్యక్తిత్వంతో మెరిసిపోతుంటారు’’ నిండైన మనసుతో తొణికిసలాడుతుంటారు’’ అంది నాతో.
‘‘అవును భార్యభర్తలిద్దరూ చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న సహృదయాలు అంటూ గతంలోని ఒక సంఘటనను ఇలా పంచుకుంది మైథిలి మాలినితో.
మా పెద్ద మనవరాలు పుట్టినపుడు హాస్పిటల్లో…
మా పెద్దమ్మాయి కిరణ్మయిని కాన్పు కోసం హాస్పిటల్‌కి వెళ్ళేటప్పుడు మా ఇంటి చుట్టూతా ఉన్న ఆడపడుచులూ, మా తోటికోడలు అందరూ వచ్చారు రావటానికైతే. దానికి తొలిచూలు. నాకూ క్రొత్త. ఏదో భయంతో కూడిన హడావుడి. కాలూ చెయ్యి ఆడట్లేదు నాకు కంగారులో. ఉమ్మనీరు పడిపోవటంతో కాన్పు కష్టమయ్యేట్లుందని డాక్టరమ్మ సిజేరియన్ చెయ్యాలని చెప్పి మావారితో సంతకం తీసుకున్నారు. సర్జరీకి కావలసిన ఫార్మలిటీస్ ఏవో ఉంటాయి గదా! చకచకా ఆ పనులు పూర్తవుతున్నాయి ఒక ప్రక్కనుంచి. రెండోవైపు పిల్లని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు నర్సులు. నాకేమో ఇంకా భయం పెరిగిపోతోంది మనసులో. ఎట్లా బైట పడుతుందో ఏమోనని ఆదుర్దా మావారి మొహంలో స్పష్టంగా కన్పడుతోంది. ఎప్పుడూ ధైర్యం చెదరని వ్యక్తి ఆయన గంభీర వదనంలో కూడా కంగారు స్పష్టంగా కనబడుతోంది. ఏమి చెయ్యడము. ఏం చెయ్యాలో తోచని పరిస్థితి. అప్పుడు మా చిన్నపాప హరిణి అక్కడే ఉంది. ముందుగా ఈ విషయం వెంటనే ఆమనికి ఫోన్ చేసిందట తను. కబురందిన వెంటనే ఆఘమేఘాలమీద వచ్చి వాలారు ఆమని దంపతులు. ఇక్కడొక విషయం చెప్పాలి. తను ఒక్కతే వస్తే చాలు నాకు సాయం చేయటాన్కి. కానీ తనతోపాటుగా వాళ్ళ వారు రామారావు అన్నయ్యగారు కూడా వచ్చి చాలా సేపటి వరకూ అక్కడే ఉండిపోయారు మాతోపాటుగా. మా బంధుగణం వాళ్ళల్లోవాళ్ళు ఛలోక్తులు వేసుకుంటూ టైంపాస్ చేస్తున్నారుగానీ, ఒకళ్లైనా వచ్చి ‘భయపడకు మైథిలీ, ఏం కాదు కిరణ్మయికి. తేలికగానే బయటపడుతుంది అని ఒక్కరు కూడా నాకు ధైర్యం చెప్పటం కాదుగదా, కట్టకట్టుకున్నట్టుగా అందరూ ఓ ఫ్యాన్ కింది చేరిపోయారు. నేను, మావారు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాము, థియేటర్ బయట తలుపులకు దగ్గరగా నిలబడి. నర్సులు బైటకి వచ్చి కొబ్బరినూనె, ఇంకా పాత క్లాతులు ఇట్లా ఏవేవో అడుగుతుంటే మా చిన్నపాపే అందిస్తోంది వాళ్లకు. నా ప్రక్కనే నిలబడి ఆమని నా చెయ్యి పట్టుకుని ‘ఏంకాదండీ… కంగారు పడకండి’ అంటూ ఉపశమనపు మాటలు చెబుతోంది. తన మాటలకు కాస్త ఊరట లభించింది నాకు. కొంచెం తెప్పరిల్లాను. ఈలోపులో థియేటర్లో నుండి అప్పుడే పుట్టిన చంటిపాప ఏడుపు కేర్‌కేర్ మని (పెద్దగా) వినపడటంతో అందరి మొహాల్లో నవ్వులు విరబూశాయి. ఈలోగా ఒక నర్సు తలుపు కొద్దిగా తెరిచి, ‘మీకు మనవరాలు పుట్టింది. తల్లీ, బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నార’ని చెప్పటంతో, ఇంతవరకూ పడ్డ ఆ కంగారూ, ఆదుర్దా ఎటు ఎగిరిపోయాయో తెలియదు. నా మనసు ఆనంద తరంగమైంది. మావారి మొహంలో సంతోషం ఎగిసిపడుతోంది.
ఇంతలో పాపను హాస్పిటల్ డ్రస్సప్‌తో చలిగాలి తగలకుండా భద్రంగా చుట్టి నాకు తెచ్చివ్వబోతుంటే, చటుక్కుమని ఆమని తన రెండు చేతులను చాచి పదిలంగా అందుకుంది. నాకేమీ అర్థం కాలేదు.
‘‘రండి మైథిలీ… మనమిప్పుడు పీడియాట్రిషన్ దగ్గరకు వెళ్ళి వ్యాక్సిన్ వేయించాలి బేబీకి’’ అంటూ అన్నయ్యగార్ని ఆటో తెమ్మని పురమాయించింది.
మావారు, మా చిన్నపాప కిరణ్మయిని చూసుకుంటానికి అక్కడే ఉన్నారు. బంధువుల కబుర్లు కొనసాగుతూనే ఉన్నాయి. హరిణీ అక్కను జాగ్రత్తగా చూసుకోమని చెబుతూ, మావారి నుండి నేను కొంత డబ్బు అడిగి తీసుకుని, ‘జాగ్రత్తగా చూసుకోండి కిరణ్మయిని’ అని చెబుతూ, ఆమనితోబాటుగా నేనూ నెమ్మదిగా మెట్లుదిగి, అన్నయ్యగారు రెడీగా తెప్పించి ఉంచిన ఆటోలో జాగ్రత్తగా ఎక్కి, పిల్లల హాస్పిటల్‌కు చేరుకుని, పాపాయికి వ్యాక్సిన్ వేయించుకుని తిరిగి హాస్పిటల్‌కు నేను, ఆమని చేరుకున్నాము. రిసెప్షన్లో రూం నెంబరు కనుక్కుని రూమ్‌లోకొచ్చాము. మత్తు
ఉంటుందిగా కొద్దిపాటి మూలుగుతో మంచం మీద పడుకో పెట్టబడి ఉంది కిరణ్మయి. మావారు మెడిసిన్స్ తీసుకోవటాన్కి క్రింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మెడికల్ షాపుకు వెళ్ళినట్లుగా చెప్పింది హరిణి. ఎంతో పదిలంగా ప్రేమతో పాపాయిని కిరణ్మయి ప్రక్కన జాగ్రత్తగా పడుకోబెట్టి, అంతే జాగ్రత్తగా బెడ్‌షీట్‌ను కప్పింది ఆమని, చలిగాలి తగలకుండా. మనసులో ఏ మారుమూలో దాగివున్న కంగారు, భయం క్రమేపీ తగ్గసాగాయి నాలో. ఆమని లేకపోతే నేను పాపాయిని వ్యాక్సిన్‌కి తీసుకెళ్లటం, తీసుకురావటం ఖచ్చితంగా చేయలేననిపించింది. తను ఉండబట్టి సరిపోయింది. అప్పుడే పుట్టిన బేబీస్‌ను ఎలా ఎత్తుకోవాలో తెలవదు నాకు. ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా ఆమని రెండు చేతులూ పట్టుకుని `
‘‘థ్యాంక్స్ ఆమనీ’’ అన్నా నిండైన మనసుతో, ఆనంద భాష్పాలు నిండిన కండ్లతో. గద్గదమైన కంఠం నుండి ఎక్కువ మాటలు వెలువడలేదు నాకు.
‘‘ఇవేం మాటలు. ఇలాంటి మాటలుండకూడదు ఫ్రెండ్స్ మధ్యలో’’ అంటూ నా వీపు నిమిరి, ఎనలేని ధైర్యాన్నిచ్చిన ఆపన్న ధైర్య హస్తం ఆమనిది.
బంధుగణం అనబడే మావాళ్లు నెమ్మది, నెమ్మదిగా ఒక్కొక్కరు మెచ్చుకోళ్ళుగా అభినందనలు చెబుతూ వాళ్ళ ఇండ్లకు వెళ్ళిపోవటానికి తిరుగు ముఖం పడుతున్న సమయంలో, మావారు పెద్ద మందుల పెట్టెతో వచ్చారు రూంలోకి. ఆ వెనుకే వచ్చిన నర్సు ఇంజక్షన్‌ని లోడ్ చేసుకుంటూ, ‘పాపాయికి మధ్య మధ్యలో దూదితో డిస్ట్రిల్ వాటర్‌ని చప్పరించేటట్లు చేయండి’ అంటూ కొంచెం దూదిని, డిస్ట్రిల్ వాటర్ బాటిల్‌ను నాకు ఇవ్వబోతే, ‘మీరాగండి’ అంటూ తనే అందుకుంది ఆమని.
ఆ వెళ్తున్న వాళ్లను చూస్తూ ఎవరన్నా ఇక్కడుండండి మైథిలికి తోడుగా అని మావారు అనబోతండగా, అది వినిపించుకునే స్థితిలో లేని వాళ్ళ కదలికలు ‘వెళ్ళొస్తాం మైథిలీ’ అని తిరుగుటపా కట్టారు. చేసేదిలేక వాళ్ళ వాళ్ళు కదా! పైగా మాతోపాటు వచ్చారాయె! బాగోదని క్రిందిదాకా వెళ్ళి వాళ్లు వెళ్ళిన తర్వాత పైకి రూంకి వచ్చారు మళ్ళీ మావారు.
‘‘మీకు తోడుగా నేనుంటాను ఈ నైట్‌కి ఇక్కడ. ఇద్దరం కల్సి తల్లి పిల్లల్ని చూసుకుందాం’’ అంది ఆమని నాతో.
ఎంతో భరోసానిచ్చిన తన మాటలను, తోడుండి తెల్లవార్లూ కిరణ్మయినీ, పాపాయినీ చూసుకున్న తీరుని నేను ఈ జన్మలో మర్చిపోలేను.
‘‘ఓయ్, మైథిలీ!’’ అని గట్టిగా మాలిని నా భుజాన్ని కుదపటంతో నేను గతంలోంచి వాస్తవంలోకి వచ్చిపడ్డాను. ఆటోనేమో ఆమని వాళ్ళ అపార్ట్మెంటు ముందుకొచ్చి ఆగింది.
డబ్బులిచ్చి ఆటోవాణ్ణి పంపేసి, ఇద్దరమూ లోపలికెళ్ళి లిఫ్ట్ సాయంతో పైకి చేరుకుని సరాసరి ఆమని వాళ్ళ పోర్షన్ ముందు ఆగాము.
ఇంకా కొంతమంది బంధువులున్నారు. చిన్నపిల్లలు బొమ్మలతో ఒకరిద్దరు పిల్లలు కార్టూన్ నెట్వర్క్ చూస్తూ ఒకింత హడావుడిగా ఉంది, మెస్ డోర్ లోంచి చూస్తుంటే. కాలింగ్ బెల్ నొక్కింది మాలిని. వెంటనే మా కోసమే ఎదురు చూస్తోందేమో… బెల్ మ్రోగిన వెంటనే సంతోషంగా వచ్చి మెస్ డోర్ తీసింది ఆమని నవ్వుతూ. తన వెనకే అన్నయ్యగారు కనపడ్డారు. ఇద్దర్నీ విష్ చేసి అక్కడున్న సోఫాలో కూర్చున్నాము. వాటర్ కావాలా? కాఫీగానీ, టీ గానీ తాగుతారా అని అడిగింది మమ్మల్ని.
‘‘అయ్యబాబోయ్! కాఫీ, టీలు ఏమీ వద్దు. అన్నీ అయ్యాయి. ఇప్పుడేం వద్దు. కాసేపయ్యాక భోజనాలు చేసేద్దాం’’ అన్నా ఆమనితో. సరేనని తనుకూడా తలవూపుతూ మాతోపాటు కూర్చుంది కాసేపు. ఎంత కేటరింగ్ అయినా, ఫంక్షన్ జరిగిందంటే ఆ ఇంట్లో అదేనండీ ఫంక్షన్ హాలయినా చేసిన వారికి అలసట అన్ని వస్తువులు సర్దుకునేవరకు హడావుడి మామూలే. దీనికేమాత్రం విరుద్ధంగా లేదు ఆ ఇల్లు.
‘‘ఇప్పుడీ భోజనాలు, గీజనాలూ పెట్టుకోకపోతే ఏమైంది ఆమనీ’’ అన్నా.
‘‘ఆ… ఇక్కడున్న మేమంతా ఏదో ఒక సందర్భంలో కలుస్తూనే ఉంటాం. నువ్వు మాత్రం రాలేకపోతున్నావుగా. ఇప్పుడొచ్చావు ఎలాగో! మళ్ళీ ఎన్నాళ్లకో’’ అంది కొంచె నిష్ఠూరం నిండిన స్వరంతో.
‘‘ఆ… ఇక అలాంటిదేమీ లేదోయ్! కనీసం రెండు నెలలకొకసారయినా వస్తుంటాను’’ అన్నాను నమ్మకంగా. కొంచెం అనారోగ్యం బారినుండి కోలుకున్నాననే ధైర్యం వచ్చింది కాబట్టి.
‘‘అవును… ఇకనుండీ తప్పకుండా వస్తుంది మనల్ని కలవటాన్కి’’ అని నా అభిప్రాయాన్ని సమర్థించింది మాలిని.
నైటీ మీద ఉంది ఆమని. పాపం ఇంతసేపూ వంటపనిలో ఉందిగదా. ఇప్పుడే డ్రస్ ఛేంజ్ చేసుకుని వస్తా, మాట్లాడుతుండండి’’ అంటూ లోపలికి వెళ్ళింది.
మేమొచ్చిన అలికిడిని తెలుసుకున్నట్లుంది. నిన్నటి వేడుకకు కర్త, కర్మ, క్రియలుగా వెలిగిన జంట బర్తడే బాబుతో హాల్లోకి వచ్చారు. అసలు వాళ్లమ్మ చంకలో ఉండట్లేదు వాడు. కిందకి దిగి పరుగెత్తాలని వాడి ఆలోచన. ఇక లాభం లేదనుకుని తల్లి బాబుని కిందకి దింపింది. అసలు నిన్నే బాబు ఫంక్షన్ హాల్లో పరుగులు పెడుతుంటే ఎక్కడ పడిపోతాడో ఆ కార్పెట్లూ, కుర్చీలూ తగిలి, అనే భయంతో వెనుకెనుకే తిరిగారు బాబు తాతైన రామారావుగారు. ముందు వచ్చిన చెవులు కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అంటారు ఇదేగదూ అంటే చంద్రిక పగలబడి నవ్వింది. ఆ నవ్వుతో శృతి కలిపారు హాసిని, పద్మిని, మాలినులు. ‘అంతేగదా’ అంటూ.
అలా కిందికి దింపిందో లేదో తల్లి… బాబు హాలంతా తిరుగుతూ నన్నెవరూ చూడట్లేదులే అని గమనించినప్పుడల్లా పరుగులు తీస్తున్నాడు.
సంవత్సరమన్నా వెళ్లిందో లేదో ఆ బుడతడు అలా వేగంగా నడుస్తూ ఎవరికీ అందకుండా పరుగెత్తాలనే ఆ చిన్ని బుర్ర ఆలోచనకు నాకెంతో ముద్దొచ్చి, అమాంతం దగ్గిరగా వెళ్లి ఎత్తుకున్నాను. నవ్వు మొహం బాబుది. ఎవర్ని చూసినా కిలకిలా నవ్వుతాడు. బాబు మొహాన్ని మరింత అందంగా మారుస్తోంది వాడి చలాకీదనం.
అన్నయ్యగార్కి ఫోటోలు తియ్యమని సైగ చేశాం. వెంటనే దాదాపు ఓ ఐదారు ఫొటోలు ఫాస్ట్‌గా క్లిక్ చేశారు. బాబుని వాళ్లమ్మ కిచ్చాను. ఇంతలోకి లోపలనుంచి వచ్చిన ఆమని డైనింగ్ టేబుల్ మీద భోజనాలు సిద్ధం చేస్తూ, రమ్మని పిలవటంతో సింక్ దగ్గిరకు వెళ్లి చేతులు కడుక్కుని మాలిని, నేను డైనింగ్ డేబుల్ దగ్గరకు చేరుకున్నాము. ‘నువ్వు కూడా మాతోపాటు కూర్చో ఆమనీ’ అని పిలవటంతో తనూ మాతో చేరింది టేబుల్ దగ్గరకు. అన్నయ్యగారు కూడా వచ్చి కూర్చున్నారు భోజనానికి. పప్పు, చిక్కుడుకాయ కూర, పచ్చడి, సాంబారు, వడియాలు, ఒక ఆకుకూర… అన్నీ మా నల్గురికీ అందుబాటులో ఉండేవిధంగా అమర్చింది ఆమని.