ప్రకృతిలో ఎన్ని ఘోరాలు జరిగినా.. కాలం అన్నిటినీ సర్దుబాటు చేయగలదు. సమయం వచ్చినప్పుడు ప్రతి పిచ్చుక తన గూటిని నిర్మించుకోవడం మొదలుపెడుతుంది. సీతాకోకచిలుక ఎగురుతూ అలసిపోయినప్పుడు ఆధారం కోసం వెతుకుతుంది. మనిషి తన భుజాలు నొప్పి పుట్టినప్పుడు రక్షణకవచం కోసం చూస్తాడు.
కమిలీ కూడా ఇప్పుడు తాను మరిచిపోయిన తన జీవితాన్ని గురించి గుర్తు చేసుకుంటుంది. ఎవరైనా వివాహమైన స్త్రీలు గర్వంగా తల ఎత్తుకొని నుదుటిపై కుంకుమను ధరించి వెళ్తున్నప్పుడు, వారి ముక్కులు చెవులు ఆభరణాలతో ముందుకు పొడుచుకు వచ్చి, ఇంటి తాళపు చేతుల గుత్తి చీర కొంగు చివరన వేళ్ళాడుతున్నప్పుడు చూసి తాను తన గురించి దిగులు పడేది. అమ్మలందరూ ఎంత విజయోత్సాహంతో వారి మురికి పిల్లల కోసం ఆరాటపడటం గమనించేది. రోజంతా పనిచేసి చెమటతో తడిసిన భర్త కోసం తపిస్తున్న వారిని గమనించేది. మురికి బట్టలతో కారుతున్న ముక్కులతో ఉన్నప్పటికీ ఆ పిల్లలను ఆనందంగా చేతులతో హత్తుకుంటారు అమ్మలు.
ఆ అమ్మలకు మాత్రం అంత పెద్ద ఇంటిలో, సమాజంలో ఒక చిరు స్థానం మాత్రమే, ఏదో ఒక మూల నేలపై అస్పష్టంగా చతికిలబడి పోతారు.
కమిలీ వేగంగా నడుస్తూ పోతూ ఉండగా సోమ్లా ఇంటి ముందు వరండాలో సాలీ నిలబడి ఉన్నది. ఇంకా వంట చేసినట్టు లేదు. కమిలీకి ఆ ఇంటి వైపు చూసినప్పుడల్లా చాలా అసౌకర్యంగా అనిపిస్తోంది. చివరకు వారి ఇంటి ముందు నుండి గాక పొలాల్లో నుండి వేరే దారిని వెతుక్కుంది.
పొడుస్తున్నట్టు బాధ కలిగించే జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు వచ్చాయి. ఆ ఇల్లు చాలా రోజులుగా పాడుపడింది దాని యజమాని లేక. ఆమె నడుస్తున్నప్పుడు ఎవరూ పలకరించడం లేదు. అక్కడ భూక్యా లేడు తనవైపు పెద్ద కళ్ళతో చూడడానికి, ఆ చూపులలో భాషను చదవడానికి. అక్కడ టిక్యా లేడు సరదాగా హాస్య మాడడానికి. సోమ్లా లేడు చేతిలో పార పట్టుకుని తన పొలాల్లో నడుస్తూ పెద్దదిక్కుగా తండ్రిలా దీవించేందుకు.
అప్పుడప్పుడు సోమ్లా అతని కొడుకులు ఇంటికి వచ్చి వెళ్తున్నారని విన్నది కమిలీ. కానీ ఒక రుణగ్రస్త కార్మికునికి స్నేహితులతో గడిపేందుకు తగిన సమయం ఉండదు. అంతేకాదు వారు ఎప్పుడు వస్తారో గ్రామస్తులకు ఎవ్వరికీ
కూడా తెలియదు. ఎవ్వరూ గ్రామసభ గురించి చర్చించడం లేదు. ఒక్కరు కూడా ఈ పని సోమ్లా వచ్చేవరకు ఆగాలని చెప్పడం లేదు. మనిషి జ్ఞాపక శక్తిని కోల్పోయిన తర్వాత నీటి మీద గీతల వలె వారి స్మృతులు మిగులుతాయి. ప్రపంచం తన ఆటను ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆటగాళ్ళతో ఆడిస్తోంది. ఆటకు రాని, రాలేని క్రీడాకారులను మర్చిపోతుంది. వారికి ఉనికి ఉండదు.
కమిలీ గతాన్ని గుర్తుచేసుకుంది. భూక్యా పేరును తన పేరుతో కలిపి ప్రతి ఒక్కరి నాలుకలపై నానిన సంగతి, చైత్రమాసంలో వారి పెళ్లి జరగాల్సి ఉంది. స్నేహితులంతా ఆ ఉత్సవం కోసం రోజులు లెక్క పెట్టుకుంటూ, ఆ ఆనందం కోసం ఎదురు చూసేవారు. అటువంటి ఎదురుచూపులు చాలా అందంగా ఉండేవి. ఆ రోజుల్లో ఆమె ఆనందం ఆమె కళ్ళల్లో ఆమె నడకలో ఆమె మాటల్లో ప్రతిబింబించేది.
కానీ ఇప్పుడు ఆ జలపాతం ఎండిపోయింది. కేవలం బురదగుంట మాత్రమే మిగిలింది.
*** *** *** *** *** *** ***
ఫిబ్రవరి రాత్రుల్లో మంచు భారీగా కురిసి, ఎముకలు కొరికే చలి ఉంది. కానీ చంద్రుడు మాత్రం భోగి మంటలు వేసి ఉత్సాహపరుస్తూ కొండల వెనక వెలుగుతూ పైపైకి వస్తూన్నాడు. అడవి చిరునవ్వుతో వెలుగుతుంటే, పర్వతాలు, లోయలు కలలు కంటూ నీడలతో తేలియాడుతున్నవి. ఆ వెన్నెల రాత్రి, జీవితంలో ఉన్న విషాధాలను మరిచిపొమ్మంటున్నది. జీవితంలో ఏ సమస్యా లేనట్టు భ్రమింప చేస్తూన్నది.
సాలీ తన గుడిసె ముందు ఓ మట్టిదిబ్బ పైన కూర్చొని, ఆ రాత్రి ఆకాశంలోకి చూస్తూ, తనను తాను మరిచి పోయింది. మాలీ ఆమె వెనుకగా వచ్చి ఆమె భుజం మీద చెయ్యి వేసింది.
“పడుకుందాం రా అక్కా”, అంటూ మృదువుగా పిలిచింది. సాలీ లేచి ఆమె వెంట గుడిసెలోకి నడిచింది. తనను ఆహ్వానించే రాత్రి సమయపు సంగీత శబ్దాలు, గుడిసెలోకి ఆమెతో అనుసరించాయి.
తమ తండ్రి, సోదరులు ఇల్లు వదిలి వెళ్ళి చాలా నెలలు గడిచాయి. మొదట్లో, జీవితం గడపడం సులభంఅనిపించింది; అప్పటికే రాగుల పంటంతా ఇల్లుచేరింది, సరిపడా ఆహారం ఉంది. భోజనం వండగానే, అడవిలో తిరుగుతూ సాయంత్రం నృత్యంలో చేరడానికి తగిన సమయం వుండేది. ఎటువంటి ఆందోళన ఉండేది కాదు.
అప్పుడు రాగులు, జొన్నలు, వరి ధాన్యం ఇంట్లో పైకప్పును తాకుతూ ఉండేవి. అవి కొద్ది కొద్దిగా తరిగిపోయాయి. ఇది ఎవరూ ముందుగా ఊహించని పరిణామం. గిరిజన జాతి ప్రస్తుతంలో మాత్రమే జీవిస్తారు. సోమ్లా ఇంటిని వదలి వెళ్ళేప్పుడు “అటకపై వంటకోసం ధాన్యం ఉంది” అని చెప్పాడు. ఆహారం ఎంత కాలంలో ముగుస్తుందో లెక్కలేయడం ఎన్నడూ ఆగిపోలేదు; భూక్యా ఇంట్లో సోమరిగా కూర్చుని పంటను ఆస్వాదించాలనుకోలేదు. ఇతర యువకులు నృత్యం చేసి పాడుతూ ఉండే సమయంలో, అతడు శ్రమిస్తూ చెమటోడ్చేవాడు.
భూక్యా, సోమ్లాలకు ఆహారధాన్యం ఎంతోకాలం సరిపోదని తెలిసి కూడా, దాని గురించి వారు చేయగలిగిందేమీ లేదు. ఇది వారి వంటి చాలా మంది సాధారణ ప్రజలకు మామూలే. పేద కార్మికులు ఒక ఉనికి కోసం వారి గుడిసెలను వదిలేవారు. అకస్మాత్తుగా వారి సేవలకు పిలుపు వచ్చేది దానికి విధేయులై వెళ్ళాలిసిందే, మరి అన్నింటికీ ఎదురుచూస్తూ ఉండాలి; వారు దూరంగా ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో ఆలోచించరు. ఇంట్లో ఆకలితో ఎవరూ చనిపోరు అని ఒక సాధారణ విశ్వాసం వారిది.
కానీ సాలీ ఈ మూఢనమ్మకాన్ని అంగీకరించ లేదు, పురుషులకున్న ధైర్యం ఆమెకు లేదు. ఆమెది చింతలేని జీవితమే అయినా అందరు గిరిజన ఆడవాళ్లలానే అడవికి వెళ్ళాలి , కష్టపడాలి, పొలాల్లో తవ్వాలి ఇంటి పని చేయాలి వంట పని చేయాలి వారాంతపు సంత కోసం దూర ప్రాంతం వరకు నడవాలి, ఇంటి పంటలైన కూరగాయల బుట్ట తలపై పెట్టుకొని మార్కెట్ కు వెళ్ళి అవి అమ్మి , ఇంట్లోకి ఉప్పు, సిగరెట్లు కొనుగోలు చేయవచ్చు. కానీ ఇప్పటి వరకు అదంతా ఆమె తండ్రి సలహాలతో మాత్రమే పని జరిగింది: ఆమె తన తలపై బుట్టను మాత్రమే మోసింది, కానీ భుజాలపై ఎటువంటి బాధ్యత వహించలేదు. అందువల్ల ఆమెకు తన జుట్టును పూలతో సింగారించడానికి , దుస్తులు ప్రత్యేక శ్రద్ధతో ధరించడానికి సమయం చాలా ఉండేది. ఆమె చీరకట్టును ఓరచూపులతో యువకులు గమనించి నవ్వుతూండేవారు.
ఆమెకు వారాంతపు సంతకు పోవడం ఒక పండుగ అనిపించేది. అట్లా వెళ్ళడం అదనపు చాకిరీ అనిపించేది కాదు. దారెంట చెరుకుగడ నములుతూ , పూలను తెంపి కొప్పులో పెట్టుకుంటూ పెద్దగా పాటలు పాడుతూ ప్రయాణం సాగేది.
ఇప్పుడు ఆ ఆనందం అంతమయింది. పూలలో తేనెలు నిండుగానే ఉన్నాయి , కానీ ఆశలన్నీ నేలపాలయ్యాయి. వాస్తవాన్ని సాలీ గుర్తించింది.
ఆమె పరవశం కలిగించే వేకువనే నిద్ర లేచింది తన ఊహల్లో అడవిలోకి పరిగెత్తింది పొలాల మీదుగా ఒలిసీ పంటలు దాటుతూ మెరిసే కొండ కింది భూముల గుండా నడిచింది. దట్టమైన పొదల నడుమ నెమళ్ళ బృందం నాట్యమాడే చోటికి, పొడవైన కొమ్ములున్న మగదుప్పి తల పైకెత్తి వాసన ఎగబీల్చడం చూసింది. హేమ్లా పనికి పోతూ తన వైపు చూసి నవ్వడం చూసింది. అంతే తన రోజు మారిపోయింది. అంతకు ముందు కొట్టుకు పోతున్న ఆమె ఒక్కసారిగా నేలను తాకింది.
ఆమె తన రోజు వారి పనంతా తొందరగా పూర్తి చేసి, ఇంటి గోడలను నేలను రంగులతో అలంకరించేందుకు మాలీనీ రంగుల కుండలు తెమ్మని గెదిమింది. హేమ్లా తన పని ముగించుకొని చెమటతో తడిసి తిరిగి వచ్చేప్పుడు అతనిని తమ ఇంటిలోకి పిలవాలని , తాము కలిసి కూచ్చొని అతను చెప్పే అర్థం లేని కథలు వినాలనుకున్నది. ఆ తరువాత మాలీని తనను వెన్నెలలో కొండ అవతలి వైపుకు తీసుకుపొమ్మని అడగాలని అనుకుంది.
మాలీ ముగ్గుల కోసం బయటకు పోగానే సాలీ పొయ్యి వెలిగించి నీరు నింపిన కుండను పెట్టింది వంట కోసం. నిటారుగా వేయబడిన పాతనిచ్చెనను ఎక్కి ఇంటి కప్పు కింద ఉన్న అటక మీదకు తలను చాచి చీకట్లోకి చూసింది. అక్కడ రెండు ఎదురు గంపల్లో ఏదో ఒక ధాన్యం ఉండేది. సాలీకి అవసరమైనప్పుడల్లా చెయ్యిపెట్టి తీసుకొని మళ్ళీ మూతపెట్టడమే కానీ ఎప్పుడూ అందులోకి తొంగి చూడలేదు.
కానీ ఆరోజు సాలీ ధాన్యం అయిపోవచ్చిందనీ , అడుగున కొద్దిగా మిగిలిందనే విషయం గమనించింది. అతిత్వరలో అది కూడా ఐపోతుంది. అప్పుడేమి చేయగలదు ఆమె.
అటక మీద ఒక కాలు, నిచ్చెన పైమెట్టు పై ఒక కాలు పెట్టి నిశ్చేష్టయై శిలావిగ్రహంలా నిలబడింది.
ఆమె తల తిరుగుతోంది. ఆమె ఏమి చేయగలదు , తండ్రి అన్న ఇంట్లో లేరు. పొలల్లో పంట దిగుబడి తగ్గింది.
ఎక్కడి నుండి ఆహారాన్ని సంపాదించగలదు. రేపు ఉన్న కొద్ది దాన్యం అయిపోతుంది. ఏమి తింటాము. తన చెల్లెలు ఎవరిని అన్నం కావాలని అడగ గలదు.
గతంలో వలె తమను చూడటానికి ఎవరూ రావటంలేదు. కనీసం పిల్లిపిల్ల కూడా తొంగి చూడట్లేదు. తన తండ్రి స్నేహితులు ఏది అవసరమైనా అడుక్కొని తీసుకొని పోయేవారు గతంలో. కానీ ఇప్పుడెవ్వరూ వీరికేమి కావలో అడగటం లేదు. గతంలో గ్రామ పెద్ద స్వయంగా వచ్చి తన తండ్రికి తియ్యని మాటలు చెప్పి డబ్బు అడిగి తీసుకునే వాడు. ఇప్పుడు పండుగ చందాలు కూడా అడగడం లేదు. ఎప్పుడైతే తండ్రీ, అన్న ఊరు వదిలి వెళ్లారో ఊరంతా ఈ అక్క చెల్లెళ్ళనిద్దర్ని హీనంగా చూస్తున్నారు. ఒక దిక్కు లేని హీనమైన విధవల జీవితం అయింది. ఇంటి ముందు యువకులు ఎవరు కనిపించడం లేదు, ఎవరూ వారిని పాట పాడమని ఆహ్వానించడం లేదు.
గ్రామస్థుల తీరు వ్యక్తుల ఆస్తులు ననుసరించి కనబడుతున్నది. ఆ ఆదిమ సమాజంలో కూడా ప్రతి ఒక్కరి అటకపై ఉన్న ధాన్యాన్ని బట్టి వారి ఆస్తిని అంచనా వేస్తారు. ఇది గ్రామస్తులు చూపిస్తున్న విరోధం, వివక్ష భావం, అహంకారం. తరువాత అతి త్వరలోనే వారు ఇంకా ఎక్కువ అవమానాలను ఎదుర్కోవలసి రావచ్చు. తమ ధాన్యం అయిపోయిందని గుర్తించిన సాలీ భయపడింది. ఆ భయంతో మర్చిపోయిన ఎన్నో సంఘటనలు ఆమెకు గుర్తుకు వచ్చాయి. అందులో ఎన్నో అవమానాలు అవహేళనలు స్నేహితులు చూపించిన నిర్లక్ష్యం అసమానతలు గుర్తుకొచ్చాయి. ఆమె మనసంతా సిగ్గుతో నిండిపోయింది. మొదటిసారి ఆమె జీవితంలో పేదరికాన్ని అర్థం చేసుకుంది. ఆమె తన దీనావస్థను దాచుకోవాలని అనుకుంది. ఆ చీకటిలో కలిసిపోవాలి అనుకుంది. తమను బాధించే వందల చూపులను, తమకు ఎదురైన అవమానాలను మరచి పోయేందుకు ప్రయత్నిస్తూ అటకపై ఉన్న సంచులను, కుండలను, గంపలన్నింటిని వెతికి చూసింది సాలీ. ఎక్కడా కొంచెం కూడా ధాన్యం కనిపించలేదు. కేవలం మట్టి గోడలు, గుడిసె పై కప్పిన గడ్డి కనపడింది. అదంతా కొండ ప్రాంతంలో వేసవికాలంలో రాలిపోయిన చెట్టు లాగా బోడిగా ఖాళీగా కనబడింది.
సాలీ నెమ్మదిగా అటక నుండి నిచ్చెన మెట్ల మీద నుండి కిందికి దిగి నేలపై కూలబడింది.
ఇంతలోనే రంగుల ముగ్గులతో మాలీ ఇంటికి వచ్చింది. కానీ బిలీ కదల లేదు, మెదల లేదు.
” ముగ్గులు వేద్దాం రా అక్కా” అంటూ ఆమెను కుదిపింది మాలీ.
” కాదు , ఈరోజు కాదు” అని ఒక్క మాట మాత్రమే అనగలిగింది మాలీ.
****. ****. ****