సింహావలోకనం

తరుణి సంపాదకీయం -జూన్

బళ్ళు తెరుస్తున్నారు. చదువులు మొదలవుతాయి. కొత్తగా పాఠశాలలో అడుగుపెట్టబోయే చిన్నారులు తమదైన అమ్మనాన్నల ప్రపంచం నుండి మరెక్కడికో తీసుకు వెళుతున్నారు అని ఏడుస్తుంటారు. దాదాపు నెల పైగా ఇంట్లోనే ఉండి విసుగు అనుభవించిన పదవ తరగతి లోపు విద్యార్థులు కొత్త ఉత్సాహంతో అడుగు లేస్తారు. ఇది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్వహించే పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు పాఠశాలలే లేని కాలం నుండి, వీధి బళ్ళ కాలం నుండి చెట్టుకో పాఠశాల పుట్టకో పాఠశాల అన్నట్టుగా పుట్టగొడుగుల్లా వచ్చిన పాఠశాలలను చూస్తూ చూస్తూ వస్తున్నాం. మనమేంటి ?ఎక్కడున్నాం? ఎటువైపు వెళ్ళబోతున్నాం? అని ఒక సింహావలోకనం చేసుకోవాలి. సింహావలోకనమంటే గతంలో జరిగిపోయిన విషయాలను ఒకసారి గుర్తు చేసుకోవడం ,వాటి నుంచి ఏం నేర్చుకున్నాము? నేర్చుకున్న విషయాల నుండి ఇంకా మంచిగా భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? అని ఒక మదింపు లాంటిది ఒక చర్చ,ఒక ఆత్మ చర్చ,ఒక ఆత్మ పరిశీలన చేసుకోవడాన్ని సింహవలోకనం అంటారు. ఎందుకు ఈ జంతువు స్వభావమైన పోలికను పెట్టారు మన పెద్దలు అంటే సాధారణంగా అడవిలో సింహం తన ముందు వెనక ఉన్న పరిస్థితులను తను ఉన్న ఆ భూభాగాన్ని ఒకసారి చుట్టూ పరిశీలన చేసుకుంటుంది. దీన్ని ఇంగ్లీషులో retrospection అంటారు. సింహానికి ఎంత జాగ్రత్త? Before you are action, you should revise the situations, the events… where you are అనేది!

ఆశ్చర్యం ఏంటంటే మనుషుల తత్వాలకు జంతుతత్వాలతో ముడివేసి ఆ పదాలని మనకు అలవాటు చేశారు మన పెద్దలు. అంటే ,ఉదాహరణకు నక్కజిత్తులు, పాము పగ, తేలు కుట్టినట్టు, నల్లి కుట్ల వాళ్లు, లేడికి లేచిందే పరుగు వంటివి. సింహవలోకనం కూడా అదే. తన ఆహారాన్ని చేజిక్కించుకోవడానికి చేయబోయే దాడి ముందు సింహం ఎలా ఆలోచిస్తుందో అలా…. బడి చదువులకోసం తల్లిదండ్రులకు

ఉపాధ్యాయులకు కొత్తగా వచ్చే పెను సవాళ్లను ఎదుర్కోవడానికి గతాన్ని చర్చించుకోవడం జరిగిన నష్టాలను ఎదుర్కొన్న కష్టాలను అధిగమించిన ఇబ్బందులను పునఃశ్చరణ చేసుకోవడం అవసరం. సింహం తనకు ఆకలి వేసినప్పుడు మాత్రమే ఇతర జంతువుల పై దాడి చేస్తుంది అది బతకాలంటే దానికి అది తప్పనిసరి. ఆహారం సంపాదించుకునే మార్గం. అంతే!ఇది ఇప్పటి చదువులకు వర్తిస్తుంది. ఎలా? ఓ అవలోకనం చేసుకుందాం.

ర్యాంక్ ల కోసం తపన పడుతున్నారు గానీ పిల్లలు ఏం విలువలు నేర్చుకున్నారు? ఏం నేర్పాలి ? అనే దిశలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆలోచించాలి.

మొత్తం సమాజాన్ని అల్లకల్లోలం చేసిన కోవిడ్ కాలం నుంచి పిల్లల పైన చాలా చెడు ప్రభావం చూపింది. అప్పటివరకు ఫోన్ కూడా చూడని పిల్లలకు కూడా ఫోన్ లూ, లాప్టాప్ లూ ఇవ్వాల్సి వచ్చింది. పిల్లల లో అత్యుత్సాహం వేరే ఆంశాలపైన కలిగిందే కాని, చదువుకు సంబంధించిన విషయాలపై దృష్టి పోలేదు. ఈ అంశాన్ని పసిగట్టే సమయమూ, తీరిక, ఆసక్తి లేని తల్లిదండ్రులు ఎక్కువ శాతం.ఇది చేసిన విధ్వంసం ఇంత అంతా కాదు. పిల్లల్లో అసహనం ఎక్కువైపోయి తల్లిదండ్రులని ఎదిరించడం, వాళ్లకు తెలియకుండా ఆన్లైన్లో ఇతరత్రాలు చూడడం, టీచ ర్ల మాట వినకపోవడం వంటి మొండి అలవాట్లయ్యాయి. అంతా టార్గెట్ బేస్డ్ ఎడ్యుకేషన్ అయిపోయింది. ఇది పిల్లల్లోని సృజనాత్మకతను దెబ్బతీసి మానసికంగా బలహీనపడేలా చేసింది. క్రమంగా అరికట్టగలిగితే బాగుండేది కానీ తల్లిదండ్రులకి కూడా ఉద్యోగాలలో టార్గెట్స్ ఉండడము వాళ్ళ ఉద్యోగ భద్రత కోసం వాళ్ళ సమయాన్ని అంతా వెచ్చించడంతో పిల్లల్ని సరిగా చూసుకోలేకపోయారు.

ఇక తక్కువ  చదువుకొన్నవాళ్లు, తక్కువ జీవనోపాధి ఉన్న వాళ్ళ పిల్లల పరిస్థితి అదొక రకం. ఈ సగటు జీవుల ఆర్థిక సామాజిక పరిస్థితులు మరీ హృదయ విదారకం.  పిల్లలు ఏం చదువుతున్నారు? ఏం చూస్తున్నారు? అని గ్రహించే తెలివి ఈ సగటు తల్లిదండ్రులకు లేకపోవడం వల్ల ఈ పిల్లలూ నష్టపోయారు.

టీచర్ల పరిస్థితి ఈ విషయంలో మరీ దారుణమైపోయింది. క్లాస్ కంట్రోల్

చేయడం ఎంతో కష్టం. ఎదురుగా కూర్చుంటే చెప్పడం ఒక పద్ధతి.కాస్తనైనా భయమో భక్తో ఉంటుంది. ఇది సంవత్సరం కాలం మాత్రమే జరిగి ఉంటుంది కానీ తర్వాత దీని ప్రభావం లోంచి బయటపడలేకపోయారు పిల్లలు, పెద్దలు,టీచర్లు. దీనివల్ల మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి. అరాచకత్వ ఆలోచనలు చెలరేగాయి. నిర్లక్ష్యం …నిర్లక్ష్యం… ఎక్కడ చూడు నిర్లక్ష్యం. ఇదే , దీనివల్లే జాతి సమైక్యతకూ, నైతిక విలువలకు, కుటుంబ బాంధవ్యాలకు దూరమయ్యారు.

మరి ఇప్పుడు ఏం చేద్దాం? నాలుగేళ్లయిన మార్పు రాకుంటే ఎలా? “చదువదియెంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నాచదువు నిరర్థకంబు” అన్నాడు కవి. ఎప్పుడో వందల ఏళ్ల క్రితం రాసిన ఈ పద్యం నిన్న మొన్న పరిస్థితులను చూసి రాసినట్టుగానే ఉంది. ఉప్పులేని కూర చప్పన అంటాం కదా! అలా అయిపోయాయి బ్రతుకులు. ఓ 60 వసంతాలు అనుభవించిన, ఓ 70 వసంతాల జీవితాలు ఉన్న వాళ్లకు పెద్ద తేడా కనిపించదేమో కానీ… రేపటి దేశ భవిష్యత్తుకు పునాదుల వంటి విద్యార్థుల జీవితాలు సక్రమమైన మార్గంలో నడవకుంటే జాతికి విపత్తు కలుగుతుంది. నీతి పద్యాలు వల్లె వేయించడం, సూక్తులను రాసి పాఠశాలలో గోడలకి, కారిడార్లలో  అతికించడం, పాఠశాల ఆవరణలో ఉదయపు సమావేశంలో చిన్న చిన్న మాటలు పిల్లలతో చెప్పించడం, వాళ్లకు ప్రేరణ కలిగించే లాగా ఒక గొప్ప వ్యక్తిని తీసుకువచ్చి ఉపన్యాసం ఇప్పించడం వంటివి చేస్తే కొంత నైనా మారుతారు. ఇలా జరగాలంటే ముందు టీచర్లలో నిబద్ధత ఉండాలి. సంపాదిస్తున్న డబ్బులకు న్యాయం చేయాలి. ముఖ్యంగా వృత్తికి న్యాయం చేయాలి అనే సోయి ఉండాలి.

టీచర్లు తిడితే కోప్పడితేనే సహించలేని తల్లిదండ్రులు ఉన్నంతవరకు కాస్త కఠినంగా ఉండడం సిన్సియర్ టీచర్లకూ కష్టమే. యాజమాన్యానికి తల్లిదండ్రులకు మధ్య నలిగిపోతున్న  టీచర్ల పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఇంట్లో తిండి తినకుంటే ఒక దెబ్బ వేస్తారు, చెప్పిన మాట వినకుంటే శిక్షలు వేస్తుంటారు. ‘టైం అవుట్’ ఇస్తారు. కానీ, జీవితానికి ‘తిండి’ అనే ‘చదువును’ అందిస్తున్న టీచర్లు తమ పిల్లలను ఒక్క మాటంటే సహించలేకపోతున్నారు తల్లిదండ్రులు! దీనికి కారణం ఏంటి? ఇగో .. ఈ ఈగోస్ వల్లనే ఇవన్నీ వస్తున్నాయి. పోయిందేమీ లేదు …ఉపాధ్యాయుల

కోప్పడితే నష్టమేమీ లేదు అనుకోవాలి.  కాకుంటే… మార్గాలు సక్రమంగా ఉంటే అదుపు చేయడంలో ఉపాధ్యాయులు కాస్త జాగ్రత్తగా ఉంటే ఇటువంటి ఇబ్బందులను అధిగమించగలరు . అవి ఏంటి? మాట! మాటకు చాలా విలువ ఉంటుంది.మనం మాట్లాడే మాట ధ్వని ఎలా ఉంది? విద్యార్థి హృదయాన్ని గాయపరుస్తుందా ఎటువంటి పదాల్ని ఉచ్చరిస్తున్నాము? అనే స్పృహ ఉపాధ్యాయులకు ఉండాలి. ఒక విద్యార్థి ఏదైనా తప్పు చేసినా చదవకున్నా ఎవరి ముందు మందలించాలి అనే ఆలోచన కూడా ఉండాలి. ఒంటరిగా ఉన్న సమయంలోనో సందర్భోచితంగా నో జాగ్రత్తగా విద్యార్థి మనసుకు అర్థమయ్యేలా చెప్పాలి ఈ విషయాన్ని తల్లిదండ్రులతో షేర్ చేసుకోవాలి.హెడ్మాస్టర్ కి హెడ్ మిస్సెస్ కి తెలియ జేయాలి. ఇవన్నీ కూడా అందరి ముందు కాకుండా గోప్యంగా, జాగ్రత్తగా చేస్తే విద్యార్థులు బాధపడరు, తల్లిదండ్రులకు కంప్లైంట్స్ ఇవ్వరు. బాగా చదివిన పిల్లల్ని ఎలా మెచ్చుకుంటారో ఎలా ప్రోత్సహిస్తారో బాగా చదవని పిల్లలకు కూడా అప్పుడప్పుడు వాళ్ళు చేసిన ఇతర మంచి పనులకు మెప్పులు, ప్రశంసలు అందించాలి. ఏ ఏ విద్యార్థులు ఎలాంటి ఇళ్ళ నుంచి, ఎలాంటి సామాజిక ఆర్థిక పరిస్థితుల నుంచి వస్తున్నారు వస్తున్నారు? అనేది కూడా ఆ విద్యార్థి ప్రవర్తన అలా ఉంటుంది. ఇవి మనసుపెట్టి గ్రహించాలి.వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి చేయూతనివ్వాలి. ఇటువంటి చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించి విద్యార్థులను తమ వైపు తిప్పుకోవాలంటే ముందు టీచర్లలో సిన్సియారిటి ఉండాలి. ఉపాధ్యాయులు తమ ఇండ్లల్లో ఉన్న ఎన్నో సమస్యలను బళ్ళోకి తీసుకు రాకూడదు. బడిని ఎందుకు ఆధునిక దేవాలయం అని అన్నారు ? స్వచ్ఛత స్పష్టత శుభ్రత అనేవి శరీరంలోనూ  మనసులోనూ ప్రవర్తనలోనూ ఉన్నప్పుడే అది సాధ్యం. దేవాలయంలో దేవుడు ఉంటాడు అనడం అంటే హృదయంలో దేవుడు ఉండడం అని అర్థం. దేవుడంటే మంచితనం. ఈ basic knowledge నూ, దేశం మూలాలను మరచిపోయి ప్రవర్తించడం వలన ఈ సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి.కాస్తంత సహనం కాస్తంత మంచితనం ఎంతో గొప్ప జీవితాన్ని అందిస్తుంది.తల్లిదండ్రులు  ఉపాధ్యాయులు మనస్ఫూర్తిగా సింహవలోకనం చేసుకుంటే భావి భారతం బాగుంటుంది.అమ్మలూ, నాన్నమ్మ లూ, అమ్మమ్మలంతా ఆలోచించాలి!!

_____****____

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రక్తదానం

మే నెల తరుణీ సాహిత్య సమాలోచన…