మే నెల తరుణీ సాహిత్య సమాలోచన…

తరుణీ అంతర్జాల దిన పత్రికగా మొదలై ఎంతో మంది కవులు, కళాకారులైన మహిళామాణుల్ని వెలికి తీసింది.
తరగని గనులకే కాదు….. తరగని సాహిత్య సంపదకు మన తెలుగు నేల ప్రతీక!
” శ్రీ శ్రీ గారంటారు… కవుల్ని కనడంలో తెలుగు తల్లిదే ప్రపంచం రికార్డు ” అని, అలా అనడంలో అతిశయోక్తి లేనేలేదు…
నవ్య స్రవంతిలా పారే సాహిత్య గంగను దర్శించి తరిద్దాం….
మరింకెందుకు ఆలస్యం… మే నెలలో వెలువడిన వివిధ సాహిత్య ప్రక్రియల విషయ విశేషాలను మనమిపుడు పరిశీలిద్దాం…

1. చేను మేసిన కంచె

శీర్షిక లోనే పూర్తి అర్ధాన్ని ప్రతిబింబిస్తూ రాశారు పద్మ శ్రీ చెన్నోజ్వల గారు…
సాధారణంగా కంచెను చేను కు ఎలాంటి హాని కలగకుండా వేస్తారు… కానీ.., ఆ కంచె చేనును మేస్తే? హాని తలపెడితే?
కంటేనే అమ్మ అని అంటే ఎలా..? అనే మంచి అమ్మ పాటతో మొదలు పెట్టి, నేడు జరుగుతున్న పాపాలను గూర్చి వివరిస్తూ… నిజంగా కన్నతల్లే కాటికి పంపడానికి కారణమైతే..? ఇంకెక్కడి భద్రతా ఇంకెక్కడి బ్రతుకు?
నవ మాసాలు మోసి పెంచిన మమతానుబంధాలే పిల్లల పాలిట యామపాషాలుతున్నాయానే విషయాన్ని చాలా చక్కగా కారణాలతో సహా తెలియజేశారు. మాతృ స్వభావానికి పశు పక్ష్యాదులు సైతం అతీతం కావు అనే విషయాన్ని చక్కగా తెలియజేశారు.

2. మన మహిళామాణులు వసంత శోభ
“పూవు పుట్టగానే పరిమళిస్తుంది ” అనే దానికి నిదర్శనం తరగా సిస్టర్స్ అని, వారు శ్రీమతి తరగా జానకి రాణి క్రిష్ణమోహన్ రావు గార్ల నేత్రాలు…
నారీ చైతన్యం గురించి విపులంగా వివరించారు అచ్యుతుని రాజ్యశ్రీ గారు.

3. ముఖాముఖి
సాహిత్య ప్రపంచానికి పరిచయస్తులైన ” ముక్తేవి భారతి ” గారి ముఖాముఖి…

4. రమక్క ముచ్చట్లు
మన రమక్క మాల్లొక కొత్త ముచ్చట పట్కచ్చింది. ఏముంది ఎండాకాలం సెలవులల్ల పిల్లల్ని ప్రశాంతంగ ఉందనీయకుట ఎట్ల పరేషాన్ జెస్తుండ్రో జెప్పింది. నిజమే గదా… సమస్రం పొడవూ సదువుడే నాయే మరి ఆళ్ళకు ఇంత రెస్ట్ కావాలె గదా… గట్ల మంచిగా సెలవులు ఇంటి కాడ ఉండేటానికి ఇస్తే మల్ల అవ్విట్నీ గూడా అకాడమిక్ క్యాలెండరు లాగా ఇంకోటి ఎదో నేరుస్కోనికి వెట్టిండ్రు… గిట్ల జిందగీ మొత్తం నేరుస్కునుడు ఉర్కుడు.. పరీక్షలే ఉంటె మరి బతికేదెప్పుడు…??
ఇగ మల్ల కొత్త ముచ్చట AI ట్రెండ్ అట… అనుకుంటా మంచి సామెతల తోటి ఒక మంచి ముచ్చట ఎర్కజెశింది మన రమక్క.

5. మా పల్లె
అందరికి ఇష్టమైంది పల్లె. పల్లె ప్రకృతిని ఆస్వాదించని వారేవారు ఉండరు. పల్లె గురించి తనదైన శైలిలో చక్కగా కవిత్వీకరించింది కృప.
ఈ సృష్టి దేవుడిచ్చినదే, ప్రతి అణువు నుండి… అందులో మొదటగా జీవనం మొదలయింది పల్లెలోనే.. పల్లె దేవుడిచ్చిన వరం అని, చెబుతుందీ చిన్నారి. సూర్యుడు మన సుప్రభాతా నికి మేల్కొంటాడట, సాయంకాలం పిల్లల దాగుడు మూతలకి వెన్నెల చాలా దానాన్ని పంచుతూందట… అంటూ కళ్ళకు కట్టినట్లు వర్ణించింది యువ కవయత్రి.

6. యూరోప్ ట్రిప్
బ్రస్సెల్ ( బెల్జియం ) అ టోమియుమ్ & మినీ యూరోప్
విజయ రంగనాధన్ గారు తన యూరోప్ ట్రిప్ అనుభవాలను విశేషాలను గూర్చి సంక్షిప్తంగా వివరించారు.

7. వృద్ధాశ్రమాలు – శాపాలా వరాలా?
ఒకప్పుడు చాలా పెద్ద కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు అసలు కుటుంబమే వద్దు అని అనుకుంటున్నారు, కలికాలం మరీ ఇంతకు దారి తీస్తుందా అనిపించేట్లు.
అలా వృద్దాశ్రమాలు నెలకొనడానికి కారణాలను ప్రస్తావిస్తూ, నేటి జీవన పరిస్థితి గూర్చి క్షుణ్ణంగా పరిశీలించి మనకు తెలియజేశారు లక్ష్మి మదన్ గారు.
నిజంగా నారీ చైతన్యం అంటూ… ఎన్ని సాధిస్తున్నామో.. ఎం కోల్పోతున్నామో బాగా గుర్తుచేశారు.
ప్రత్యక్ష దైవలుగా భావించే వారిని నడిరోడ్డు మీద వదిలేసే దుస్థితి..
కానీ… ఎప్పటికైనా ఒకటి గుర్తు పెట్టుకోవాలి, జీవితం లో ఇది శాశ్వతం కాదు… మన జీవనమూ దశల వారీగా ఉంటుంది. రేపటి రోజున మనము వృద్ధాప్యాన్ని అనుభవించాల్సిందే… అందుకే మనం ఈరోజు నాటిన మొక్కే మహా వృక్షమై రేపటికి మనకు నీడనిస్తుంది. అలాగే చిన్ననాటి నుండి బంధాల్ని బంధుత్వాల్ని సరిగ్గా చూస్కుంటే అవే రేపటి రోజున మన బాలాలవుతాయి, భరోసానందిస్తాయి.

8. విధివంచిత
ఒక మధ్య తరగతి కుటుంబంలో ఒక ఆడపిల్ల జీవితం లో ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో ఒక చిన్న కథ ద్వారా తెలియజేశారు.
” అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందట” అనే సామెత లాగే ఆ అమ్మాయి జీవితానికి, ఆ కుటుంబానికి, ఆ అల్లుడే శని గా మారితే?
ఇలాంటి ఓ విభిన్న కథని మనకి పరిచయం చేశారు.
‘విధి’ ఏ విధాలైన వింత పరిణామలను తలపోస్తుందో ఈ చిన్ని కథలో తెలియజేశారు దేవులపల్లి విజయలక్ష్మి గారు.

9. పుస్తక దినోత్సవ సందర్భంగా…
“పుస్తకాల పురుగు”అని ఊరికే అనరు.., ఒకవేళ ఆలా అనాల్సిన వస్తే దానికి నిదర్శనం “దయ’ గారు అని చెప్పొచ్చు.
దయ గారు చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయారు అప్పట్నుంచి ఆవిడకి వాళ్ళ నానమ్మే సర్వస్వం!
ఎదిగే వయసులో బొమ్మలతో ఆడుకునే బదులు పుస్తకాలతో సహచర్యం చేసిందట! అలా బాలల బొమ్మల రామాయణ మహాభారతాది పుస్తకాల స్పర్శతో మొదలైన ఆమె పఠన ప్రయాణం తన కంటిచూపు సహకరించినంత వరకూ సాగింది! నిజంగా నేటి తరానికి దయ గారు ఆదర్శం! అలాంటి ఒక గొప్ప పుస్తక ప్రేమికురాలి గురించి మనకు పరిచయం చేశారు రంగరాజు పద్మజ గారు.

10. అలసిపోతున్న ఆనందం
నేటి ఈ కృత్రిమ జీవితానికి అలవాటు పడిన ఈ తరం సహజమైన ఆనందాన్ని మర్చిపోయిందని… ఆనందం అలసిపోయిందని… ఈ కాలం పోకడలను గూర్చి తెలియజేశారు పొలంరెడ్డి విజయలక్ష్మి గారు.

11. సాంప్రదాయ జిమ్
ఇప్పుడంటే కాలం మారింది పద్ధతులు మారాయి గాని…. అప్పట్లో ఇలా ప్రత్యేకంగా శారీరక బరువు తగ్గడానికి జిమ్ లకు వెళ్ళాల్సిన పని ఉండకపోయేది.. ప్రతి ఇంట్లో రోలు ఉండేది ఎం నూరుకున్నా అందులోనే… బట్టలు కుడా చేతులతోనే ఉతుక్కునే వాళ్ళు… అలా ఆరోగ్యమూ రుచి శుచి ఉండేవి..బాగుండేది అంటూ సాంప్రదాయిక ఆరోగ్య చిట్కాలను పరిచయం చేశారు లక్ష్మి మదన్ గారు.

12. పశువుల్లో ఆత్మీయతానుబంధాలు
మానవుల్లోనే కాదు… ఆత్మీయత అనుబంధాలు మూగ జీవాలైన పశువుల్లోనూ ఉంటాయన్న సంగతి తెలిపేది ఎంకన్న

సీతక్కల కథ!
సంసారిక జీవితం లో మనుషులు ఎలా అయితే వారి జీవిత భాగస్వామిని ఎన్నుకుంటారో, వారి వియోగాన్ని తట్టుకోలేక ఎలా వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారో అలాంటి మమతానుబంధాలు పశువుల్లోనూ ఉంటాయన్న చక్కని కథని మనందరికీ తెలియజేశారు దేవకీదేవి గారు.

13. నదీమ తల్లీ
ఒక మంచి కుటుంబ కథను నదీమ తల్లి అనే పేరుతో మన ముందుకు తీసుకువచ్చారు దేవులపల్లి విజయలక్ష్మి గారు.. అవిడిచ్చే సందేశం తెల్సుకోవాలి అంటే కథ మొత్తం చదవాల్సిందే…

 14. అమ్మ కల
మొదటగా మనం నేర్చిన పదం, పిలిచిన పిలుపు అమ్మ!
అన్నీ ప్రేమల్లో కెల్లా గొప్పది అమ్మ ప్రేమ… అమ్మ గొప్పతనం గూర్చి తాను చేసే త్యాగాలను గూర్చి తన కవిత ద్వారా చక్కగా వ్యక్తం చేసింది భవ్య.

15. అమ్మ బాగున్న ఇల్లు
అమ్మ బాగుంటేనే ఇల్లు బాగుంటుంది లేదంటే ముఖం మాడ్చుకుంటుంది. అమ్మ బాగాలేకపోతె ఇల్లు ఎలా కళా విహీనంగా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు కవిత్వీకరించింది సాహితి.

16. ఇంకెప్పుడూ
సహనానికి నిదర్శనం! నిరంతర శ్రమకు ప్రతీక అమ్మ! వేతనం లేని కొలువు, గుర్తింపు లేని నౌకరీ… తన పిల్లలు, కుటుంబం కోసం తన ఆశయాలను సైతం పక్కన పెట్టిన త్యాగమూర్తిని ఇంకెప్పుడు గుర్తిద్ధాం..??
ఇంకెప్పుడు గౌరవిద్దాం..??
అంటూ అమ్మ చేసే త్యాగాలను తన మాటల్లో చాలా స్పష్టంగా చెప్పింది అక్షయ.

శుభ ముహూర్తం -1

తరుణీ పాఠకులకు సూపరిచితురాలు ప్రొ||. మజ్జి భారతి గారు.
నేడు మృగమవుతున్న కాల్పనిక చరిత్రను మనముందుకు తీసుకువచ్చారు. “శుభ ముహూర్తం ” పేరిట అపురూపమైన ప్రేమ కథను దారావాహిక నవలగా పరిచయం చేయబోతున్నారు భారతి గారు.

హరి చందన
హరిచందన అనే ఒక సాంఘీక నవలతో శైలజా, చందన, కౌసల్య, రేవతి పాత్రలను పరిచయం చేస్తూ… ఒక మంచి కథాంశాన్ని తరుణీ పాఠకులకోసం తీసుకువచ్చారు డా||. భవాని కృష్ణమూర్తి గారు.

ఇంటి పని – The Home Work
ప్రస్తుతం సమాజం లో నెలకొంటున్న అంశాలు.. స్త్రీల పాత్ర, వారి గౌరవాభిమనాలు…, మథర్స్ డే స్పెషాలిటీ.. అంటూ ఆడవాళ్ళని గౌరవించాలని, అది ప్రారంభదశ నుండే ఒక సంస్కారంగా నేర్పించే బాధ్యతాయుతమైన ఒక పెద్ద ఇంటి పని అని క్లుప్తంగా విశ్లేషించారు తరుణీ సంపాదకులు డా|| నిహారిణి గారు.

వానకోయిల
చిరు జల్లులు కురిసే వాన కాలంలోని వాన కోయిల రాగాలను తన గళంతో పలికించారు రాధిక సూరి గారు.
ఆ కోయిల తన తీయని స్వరంతో కూయడమే కాదు… రైతుని నిద్ర లేపే నేస్తం కూడా…
వర్ష ప్రియ, చిట్టీ కోయిల, చాట పక్షి అంటూ సందర్భానుగుణంగా సంభోదిస్తూ…, విభిన్న వర్ణనలతో, కొత్త వసంత శోభ కోసం ఎదురు చూసే గుంపు కోయిల గూర్చి చాలా చాతుర్యంగా వర్ణించారు.

బొమ్మ – బొరుసు
భార్య భర్త ల అన్యోన్యతను, ప్రేమను తెలిపే గొప్ప కథ. విధి ప్రేరణచే వారిరువురి మధ్యాహ్నం వియోగం కలిగినా ఎలా నిలబడాలో,ఒకరు లేని లోటు ఎలా లేకుండా చూసుకోవాలో, ఒకరి పనులు ఇంకొకరు ఎలా చేసుకోవాలో తెలుపుతూ చక్కని సందేశాన్ని అందించారు నమని సుజనాదేవి గారు.
బతకాలికదరా
భారతీయ తత్త్వం అగ్రహోదగ్రమహోదగ్రమై ఉప్పెనై ఎగసి పడుతుందణి, ప్రమథగణమై విరుచుకు పడుతుందని, మన దేశంలో జరిగిన సంఘటనలను గూర్చి గుర్తు చేస్తూ… మన దేశ గొప్పతనం గూర్చి తన కవితా పంక్తులతో తెలియజేశారు జి. సులోచన గారు.

కదం తొక్కుతూ కథలి రావే చెల్లెలా!
అనాదరణకు గురైన సమాజం నుండి… నేడు అన్నింట్లో తానే నిలిచే సమసమాజం లోకి అడుగుపెట్టాం…!
సువిశాల ధరలో నీకూ నీవే సాటి, అంటూ చైతన్య స్ఫూర్తిని రగిలించారు డా||.మరంరాజు వెంకట మానస గారు.

శాంతి చేకూర్చండి
శాంతికి నెలవైన మన భారత ఖండంలో ఆశాంతి నెలకొంది అనే విషయాన్ని తెలుపుతూ… మన దేశంలో ఇటీవల స్త్రీలపైన జరిగిన అఘాయిత్యాలకు తను కదిలి, తన కలాన్ని కదిలించి… ఓ నల్లకోటు మూర్తులారా నడుం కట్టండి …. అని శాంతి చేకూర్చండి అంటుంది చిన్నారి అక్షయ.
భువిలో స్వర్గం
భువిలో స్వర్గం అని వెతుక్కుంటూ వెళ్లి ప్రాణాలు వీడే కన్నా… మనం ఉన్నచోటే స్వర్గం గా భావించి మరిన్ని కాలాల పాటు ప్రాణాన్ని నిలుపుకోవటం మిన్న… అని
నేటి ఈ సమాజం మతం అనే మత్తులో బతుకుతోందని, ఇటీవల జరిగిన పహల్గాం సంఘటనను గూర్చి తన అభిప్రాయాన్ని కవితాస్ఫోరకంగా వ్యక్తీకరించారు లత మూర్తి గారు.
అయితే మీరే ( భుజాలు తడుముకుంటున్నారుగా )
సోంపాక సీత గారు… చక్కటి చిక్కనైన దారావాహిక తో వచ్చారు. ఎలాంటి సందేశాలని… వినోదన్ని అందించారో తెలుసుకోవాలంటే… తప్పకుండ చదవాల్సిందే..

అరవీర భయంకరం
“నా దేశ పౌరుషం అజరామరం… అరవీర భయంకరం” అంటూ.. తన దేశ భక్తిని చాటుకున్నారు అరుణ ధూళిపాళ గారు.

Written by Sushma Srinivas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సింహావలోకనం

మన మహిళామణులు-శ్రీలత రమేష్ గోస్కుల