మన మహిళామణులు-శ్రీలత రమేష్ గోస్కుల

నా సాహిత్య ప్రయాణం..

శ్రీలత రమేష్ గోస్కుల రచయిత్రి కవయిత్రి.తరుణితో తన జీవనయానంని పంచుకుంటున్నారు

నేను శ్రీలతరమేశ్ గోస్కుల.మాది కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్.మావారు గోస్కుల రమేశ్(కైతికాలు రూపకర్త).మాకు ఇద్దరు అబ్బాయిలు విజ్ఞాన్,భువన్ తేజ్.నా తల్లిదండ్రులు గట్టు.కొమరయ్య,సుశీల. ప్రస్తుతం వారు ఇద్దరు కూడా స్వర్గస్తులయ్యారు.నాన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసేవారు.అందువల్లనే నా బాల్యంలో ప్రాథమిక విద్యాభ్యాసమంతా ఊరికో తరగతిగా హుజురాబాద్,కడెం,నిర్మల్, చెన్నూరులలో కొనసాగింది.ఆ తరువాత హైస్కూల్,ఇంటర్ హుజురాబాద్ లో, డిగ్రీ హుజురాబాద్ కు దగ్గరగా ఉన్న జమ్మికుంట లో,పీజీ,బిఎడ్ హన్మకొండలో కొనసాగాయి.ఇక సాహిత్య ప్రవేశం విషయానికి వస్తే…ఏ మాత్రం సాహిత్య పరిచయం లేని కుటుంబంలో నుండి వచ్చిన నాకు మావారితోనే ఆ పరిచయం కలిగింది. క్లాస్మెట్ మరియు స్నేహితుడు కావడం వల్ల తన అభిరుచులు కూడా నా అభిరుచులు గానే మారిపోయాయి.ఇంట్లో కవితలను వినడం వరకే పరిమితమైన నేను కూడా తొలిసారిగా2018 నుండి కవితలు రాయడం మొదలు పెట్టాను..మొదటి సారిగా కాళోజీ గారి యాది సంకలనానికి పంపడం జరిగింది.ఆ తర్వాత నుండి ఇంట్లో వారి మరియు వాట్సాప్ మిత్రుల ప్రోత్సాహంతో సాహితీ రంగంలో కొనసాగుతున్నాను.అయితే మావారు కైతికాలు అనే ప్రక్రియను రూపకల్పన చేసిన తర్వాత తన ఆధ్వర్యంలో కైతికాల సమూహంను వాట్సాప్ ద్వారా నడిపించేవారు.మొదట్లో వచన కవిత్వం వ్రాసే అలవాటు మాత్రమే ఉన్న నేను కైతికాల సమూహంలో సహ కవులు కొత్తగా రాసే కైతికాలలోని మాత్రలను,ప్రాస మరియు కవితాత్మను పరిశీలించి సరి చేయడం జరిగేది.ఇలా కొన్ని వేల కైతికాలను నియమాలకు అనుగుణంగా సరి చేయడంతో పాటుగా వారికి ఉత్సాహంతో మరిన్ని కైతికాలు రాయడానికి వారికి ప్రోత్సాహాన్ని కూడా అందివ్వడం జరిగేది.ఇక నేను ఇతర సాహిత్య సమూహాలల్లో మరియు సందర్భానుగుణంగా లెక్కమించినవే కవితలు వ్రాయడం జరిగింది.వచన కవితలతో పాటు కైతికాలు,ఆట వెలది పద్యాలు,కొన్ని రూబాయిలు,యువర్ కోట్ యాప్ లో తెలుగు సాహిత్యానికి సంబంధించి కొన్ని వందల కోట్స్ రాశాను. చాలా సంకలనాలలో నా కవితలు ఉన్నాయి.

ఇంకా వాట్సాప్ ద్వారా వివిధ సాహిత్య గ్రూపులలో రాసిన ఇతర కవుల కవితలపై సమీక్షలను కూడా వీలును బట్టి అందిస్తున్నాను.వీటితో పాటుగా కొన్ని వ్యాసాలు కూడా వ్రాశాను.ఇవి నమస్తే,నవ తెలంగాణలో,మన తెలంగాణ, ప్రజాతంత్ర,ప్రజా పక్షం,నేటి నిజం వంటి పలు జాతీయ దిపత్రికలల్లో ప్రచురితం అయినాయి.ఇంకా నేను రాసిన కవితలు,కైతికాలు నమస్తే పత్రికలో చాలా సార్లు ప్రచురితమైనాయి.సాహిత్యం పరిచయం అయ్యాకే నమస్తే పత్రికలో రిపోర్టర్ గా కూడా చేరాను. ఇంకా సామాజిక కవితలతో పాటు బతుకమ్మ పాటలు,బతుకమ్మ కవితలు లాంటి సంస్కృతి సాంప్రదాయాల రచనలు కూడా వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. వందకు పైగా కవితలు ఉదయం పేపర్ లో కూడా ప్రచురణయ్యాయి. ఇంకా గత రెండు, మూడు సంవత్సరాల నుండి’ప్రజా మణిపూస’ సకల జనుల మాసపత్రికలో ప్రతి నెల రెగ్యులర్ గా నేను రాసినటువంటి జనరల్ వ్యాసాలు గాని,ప్రముఖుల గ్రంథ సమీక్షలు గాని ఒక వ్యాసంగా నా రచనలు ప్రచురణ అవుతున్నాయి. ఇందులో భాగంగా కత్తి పద్మారావు గారి స్వీయ జీవిత చరిత్ర అయినటువంటి ఒక అస్పృశ్యుని యుద్ధ గాథ మొదటి మరియు రెండు భాగాల గ్రంథాలపై సమీక్ష వ్యాసాన్ని,దాస్యం సేనాధిపతి గారి దిక్సూచి గ్రంథం పై,గోస్కుల రమేష్ గారి వెలుగు బాట శతకం మరియు కైతిక ప్రక్రియలో రాసినటువంటి చీకట్లో చిరుదివ్యలు పై,డాక్టర్ ఈటెల సమ్మన్న గారి జీవితమంటే గ్రంథంపై,అల్లాడి శ్రీనివాస్ గారు కైతికాల ప్రక్రియలో రాసిన గున్కపూలుపై,డాక్టర్ పాండాల మహేశ్వర్ గారి ఊరేగింతపై, దర్పణం సాహిత్య వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ రాయారావు సంపాదకత్వంలో వెలువడిన భావదర్పణం సంకలనంపై, బండి శ్రీనివాస్ గారి మోచనిక నవలపై సమీక్షా వ్యాసాలు ఇలా ఇప్పటి వరకు వందకు పైగా వ్యాసాలను వ్రాశాను.ఇంకా ‘శతక సాహిత్య వైశిష్టం- ఆధునిక శతకాలు’ అనే కార్యక్రమంలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి సబ్బని లక్ష్మీనారాయణ గారి సబ్బని కవి పలుకు సత్యమెపుడు అనే ఆటవెలదుల గ్రంథంపై పత్ర సమర్పణ కూడా చేశాను.
అయితే ఇది ఇలా ఉంటే నా చిన్నప్పుడు మాత్రం నన్ను ఒక ఆశ్చర్యం వెంటాడేది. ప్రతిరోజు ఇంటికి ఈనాడు న్యూస్ పేపర్ వచ్చేది.అయితే ఆ పేపరును చూస్తూ చూస్తూ ఒకరోజు ఇన్ని అక్షరాలను ఎలా రాస్తారు పేపర్లో.. ఇలా రాయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని ఆశ్చర్యంగా మా నాన్నని అడిగాను. అతను ఇది ఒక్కరే చేసే పని కాదు చాలామంది చాలా విషయాలను వార్తలుగా సేకరించి ప్రింటుకు పంపిస్తారు.ఈ న్యూస్ పేపరు ఏ రోజుకు ఆ రోజు వస్తుందని చెప్పాడు.అదంతా అప్పుడు నా చిట్టి బుర్రకు అర్థమయ్యేది కాదు. రోజు న్యూస్ పేపర్ ను ముందు వేసుకోవడం ఇన్ని విషయాలు ప్రతి రోజు ఎలా సాధ్యమంటూ నా ఆశ్చర్యం అలాగే కొనసాగేది.ఇక నేను డిగ్రీ లో ఉండగా ఎడిటోరియల్ వ్యాసాలను చూస్తూ నేను ఒక రోజైనా ఇలా వ్యాసం వ్రాయాలని నన్ను నేను పేపర్ లో చూసుకోవాలని అనుకునేది కానీ అది ఎలా అనేది మాత్రం తెలియలేదు. అందులో భాగంగానే అప్పట్లో టైపింగ్ కూడా కొద్ది రోజులు నేర్చుకోవడానికి వెళ్ళాను కానీ అది మధ్యలోనే ఆగిపోయింది.ఇక కాలం కరిగిపోతూనే ఉంది.ఈ మధ్య స్మార్ట్ ఫోన్స్ వచ్చాక మా పిల్లల సహాయంతో తెలుగులో టైప్ చేయడం నేర్చుకున్నాను. ఒక వార్త పత్రికలో రిపోర్టర్ గా జాయిన్ అయ్యాను.ఇక కవితలను రాయడం, కవితలకు సమీక్షలు రాయడం, వ్యాసాలను పేపర్ కు పంపడం అన్నీ చకచగా సాగిపోయాయి.నన్ను నేను నా అక్షరాలను పేపర్లో చూసుకుంటూ చాలా మురిసిపోయిన క్షణాలు ఇప్పటికీ నా మనసులో పదిలమే..

నాలాగే అచ్చులో తమ అక్షరాలను చూసుకుంటూ మురిసే అవకాశం కూడా చాలా మంది కవులకు కలిగించాను.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో కృషి చేస్తున్న మహిళామణులను ప్రోత్సహించేందుకు ఆన్లైన్ వేదికగా వాట్సాప్ ద్వారా కవి సమ్మేళనం నిర్వహించి ఆన్లైన్ ప్రశంసా పత్రాలను కూడా కవయిత్రులకు పలుసార్లు అందించాను.అంతేకాదు వివిధ సందర్భాలలో కూడా కవితలు వ్రాసినవారికి ప్రశంసా పత్రాలు అందించాను.నేను చేస్తున్న ఈ సాహిత్య కృషికి మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ సన్మానాలతో పాటుగా భద్రాచలంలో బెక్కంటి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మరియు ఇతర ప్రముఖుల చేతుల మీదుగా లేడీ లెజెండ్ 2020 అంతర్జాతీయ అవార్డును కూడా అందుకోవడం జరిగింది.ఈ సాహితీ ప్రయాణంలో పూర్వపు ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు గారు, పూర్వపు కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ గారు మరియు ఏనుగు నరసింహారెడ్డి గారు వంటి మొదలైన ప్రముఖులతో సన్మానాలు మరిచిపోలేని వి.ఇక కవితలకు అందుకున్న బహుమతులు నూతనోత్సాహం అందించాయి. స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినీ విద్యార్థులకు కైతికాల కవిత్వంపై మెలకువలు కూడా అందించడం జరిగింది.కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో సాహిత్యంతో కొనసాగుతూ ఈ మధ్యనే శ్రీ-రుచులు అభిరుచులు అనే యూట్యూబ్ ఛానల్ ను కూడా ప్రారంభించి అందులో వంటలు, కవితలతో పాటు రామాయణం మహాభారతంను సులభ శైలిలో చదువుతూ ఇంకా ఎన్నో విషయాలతో సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నాను.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నా గురించి నేను పరిచయం చేసుకునే అవకాశాన్ని అందించిన మహిళామణి కవయిత్రి ఫ్రిలాన్సర్ అచ్యుతుని రాజ్యశ్రీ గారికి ధన్యవాదాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మే నెల తరుణీ సాహిత్య సమాలోచన…

ఎక్స్పైరీ డేట్