తలవంచాల్సిందే…

ఎన్ని కలలు కన్నది… ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయాలనే తన కోరిక ఆలస్యమైనా ఇలా తీరటం ఎంత బాగుంది… రాధిక గర్వంగా ఫీల్ అవుతోంది… తన ఫ్రెండ్స్ అందరికీ క్యాంపస్ లో వచ్చింది… తనకు ఆలస్యం అయినా ఎమ్ ఎన్ సి లో వచ్చిందని అమ్మా నాన్నా ఎంతో సంతోషించారు…

ఉద్యోగంలో చేరటం వెంటనే పెళ్ళి కుదిరింది… ఉద్యోగం లేదని ఏ సంబంధం కుదరలేదు… ఇటు ఉద్యోగం రాగానే పెళ్ళి కూడా కుదిరింది…ఆడవాళ్ళు కట్నాలు మాత్రమే ఇవ్వటం లేదు… ఒక ప్రక్కన లాంఛనాలు, పెళ్ళి ఘనంగా చెయ్యమని కోరటం మరో ప్రక్కన ఉద్యోగం… ఆడవాళ్ళకు ఎక్కడ ఉంది స్వేచ్ఛ… అన్ని రకాలుగా బందీ అవుతోంది…

పెళ్ళి తరువాత అత్తగారింటికి వెళ్ళటం కొత్త జీవితం… శ్రీరామ్ బాగా సహకరించే వాడు… అత్తమామలు చాలా మంచివారు… అత్తగారు వంట చేసి బాక్స్ లో పెట్టి ఇచ్చేది… తనకు వంట ఇంటి బాధ లేదు…

ఒక సంవత్సరం వరకు బాగానే జరిగింది… ఇంతలో కన్సీవ్ అయింది… అప్పుడు మొదలైనాయి కష్టాలు… విపరీతమైన వాంతులు… ఏమీ తినాలనిపించేది కాదు… అలాగే ఉద్యోగం… మానెయ్యమని శ్రీరామ్ చెప్పినా వినకుండా అలాగే వెళ్ళేది… తన బాధ చూడలేక బాస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాడు…

ఆడది ఉద్యోగంలో రాణించాలంటే ఎంతోమంది సహకరించాలి…

“అత్తయ్యా! అమ్మలా మీరు చూసుకుంటున్నారు… మామయ్య గారు శ్రీరామ్ ఎంతో సహకరిస్తున్నారు…” అంటూ అత్తగారి చేతులు పట్టుకుంది…

“అయ్యో పిచ్చి పిల్లా…. నేను చేసింది ఏమీ లేదు… బాధ నీదే కదా…” అంటూ త్రోసి పుచ్చేది…

మూడో నెలలో అమ్మ వాళ్ళు వచ్చి దొంగ చలిమిడి పెట్టి రాధికను నిద్ర చేయటానికి తీసుకెళ్ళారు…

అక్కడకు వెళ్ళిన తరువాత ఎంతో ఉపశమనం కలిగింది… “శ్రీరామ్ నేను ఇక్కడి నుంచి పని చేస్తాను…”అని అడిగింది…

“బంగారం… ఇప్పటి నుండే నా? అయినా నీ కంప్యూటర్ సెటప్ ఇక్కడే చేసుకున్నావు… వచ్చెయ్ ప్లీజ్…” అంటూ బ్రతిమిలాడాడు…

ఇలాంటి ప్రేమే కదా ఎవరైనా కోరుకునేది… అనుకుంటూ వెళ్ళింది…

తోమ్మిదో నెలవరకు అత్తగారింటి నుంచే పనిచేసింది… తరువాత శ్రీమంతం చేసి అమ్మా వాళ్ళు తీసుకెళ్ళారు… అప్పుడే మెటర్నిటీ లీవ్ పెట్టింది…

తల్లిగారింటికి వచ్చిన నెలరోజులకు పండంటి బాబు పుట్టాడు… ఎంతో ఆనందం శ్రీరామ్ తో పంచుకుంది… ఆరునెలలు గడిచి పోయాయి… ఇంకా తల్లి దగ్గర ఉంటే బాగుండదని అత్త వారింటికి వచ్చింది…. మళ్ళీ ఉద్యోగం, తల్లిగా మరో బాధ్యత ఒక వారం రోజులు గడిచాయి…

ఒకరోజు పని చేస్తుంటే బాబు బాగా ఏడ్చాడు… వాడికి డబ్బా పాలు అలవాటు చెయ్యలేదు… తల్లి పాలే ఇస్తోంది…ఫీడింగ్ కోసం బాస్ ని పర్మిషన్ అడిగింది… కుదరదు అన్నాడు… అమ్మకూడా ఉద్యోగం చేసింది… ఇలాంటి సమస్య రాలేదా ?మరి తానెందుకు ఇంత సెన్సిటివ్ గా ఆలోచిస్తోంది… ఒక రోజంతా ఆలోచించింది…

ఒక నిర్ణయం తీసుకున్న తనకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది… బాబుకు అన్యాయం చేయలేదు… ఒక తల్లిగా తను ఎన్నో త్యాగాలు చేయాలి… ఉద్యోగానికి రిజైన్ చెయ్యాలని నిర్ణయించుకుంది… బాబు కొంచెం పెద్దయిన తరువాత ఇంకో జాబ్ వెతుక్కోవచ్చు… తన చిట్టిచేతులను గట్టిగా పట్టుకుని ఆకళ్ళలో చూస్తుంటే ‘నన్ను ఎప్పుడూ  విడిచి వెళ్ళవద్దు… నువ్వు నాతోనే ఉండాలి…’ అని అడుగుతున్నట్లుగా ఉంది… చెయ్యి వదలకుండా తన చిన్న వ్రేళ్ళతో బంధించాడు…

యుగాలు మారినా తరాలు మారినా స్త్రీ మాతృత్వానికి వెలకట్టలేము… అది భగవంతుడు ఆమెకు ఇచ్చిన వరం…  దానిముందు అన్నీ తలవంచాల్సిందే

Written by Shamir Janakidevi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వీరుడా వందనం

వికసించిన పద్మం :పద్మా సచ్ దేవ్