ప్రోత్సాహం

కథ

ప్రేక్షకుల కరతాళధ్వనులతో ఆడిటోరియం మారుమోగిపోయింది. ముందు వరుసలో కూర్చున్న శశికళకి సంతోషంతో కళ్లల్లో ఆనందభాష్పాలు నిలిచాయి. ఆ రోజు తన కూతురు మౌక్తిక మొదటి పాట కచేరీ. ‘ తన కూతురేనా ఈ విధంగా ఇంతమంది మన్ననలు అందుకుంటోంది! ఇది నిజంగా నిజమేనా లేక తాను కల కంటోందా? అవును ఆ రోజు తాను మౌక్తిక సంగీతం టీచర్ హితోక్తులను లెక్కచేయకుండా ఉండి ఉంటే నిజంగానే ఇది కలే అయి ఉండేది. కానీ ఆవిడ ఆ రోజు జోక్యం చేసుకోబట్టే తన కూతురు ఈరోజు ఇట్లా కర్నాటక సంగీతంలో నిష్ణాతురాలై పాట కచేరి ఇచ్చే స్థాయికి ఎదిగింది. నిజంగా మా కుటుంబం యావత్తూ ఆవిడకి జన్మ జన్మలకీ రుణపడి పోయాం‘ అని మనసులో అనుకున్న శశికళ, తనకి తెలీకుండానే గతంలోకి జారుకుంది.
అప్పుడు మౌక్తిక వయసు ఏడేళ్లు. తనకు సంగీతం అంటే ప్రాణం అన్న విషయం శశికళ గుర్తించలేదు. ఎంతసేపూ కూతురు చదువుల్లో రాణించాలని, ఏ డాక్టరో లేక ఏ ఇంజనీరో అవ్వాలని, క్లాస్లో తనకే ఫస్టు ర్యాంకు రావాలన్న పట్టుదలతో ఎప్పుడూ చదువు చదువు అని వెంటపడి వేధించేది. భర్త శ్రీధర్ కూడా ఓ ఉన్నత పదవిలో ఉండటం మూలాన పిల్ల చదువు బాధ్యత అంతా భార్య మీదే ఉంచడం మూలాన ఇక ఆమె మాటే సాగేది. కానీ మౌక్తిక మాత్రం ఏ మాత్రం ఛాన్సు దొరికినా పాటలు వినడమే కాదు వాటిని ఏకాంతంలో కూనిరాగం తీస్తూ ఉండేది. తన గొంతు కూడా బావుంటుంది. స్కూల్లో మౌక్తిక క్లాస్ మేట్స్ కూడా ఫ్రీ టైం లో తన చేత సినిమా పాటలు పాడించి ఆనందించేవాళ్ళు.
మౌక్తిక సరిత స్నేహితులు. సరిత స్కూల్ నుంచి రాగానే టిఫిన్ చేసి పాలు తాగి వాళ్ళ అమ్మ నాన్న కుదిర్చిన సంగీతం టీచర్ దగ్గర ఇంట్లోనే ఓ గంట సేపు సంగీతం నేర్చుకునేది.
సరితని చూసి మౌక్తికకి కూడా సంగీతం నేర్చుకోవాలన్న కోరిక ఇంతింతై వటుడింతై లాగా దినదిన ప్రవర్థమానమవసాగింది. కానీ మౌక్తిక అమ్మానాన్నలు అందుకు ససేమిరా అన్నారు. సంగీతంలో పడితే ఇక చదువు వచ్చినట్టే అని తేలికగా కొట్టిపారేసారు. అందులో పడితే చదువు దెబ్బతింటుంది వద్దని ఖచ్చితంగా చెప్పేసారు.
కానీ సంగీతమంటే ఉన్న ఆసక్తి మూలంగా మౌక్తిక రోజూ సాయంత్రం సరితావాళ్ళ సంగీతం టీచర్ వచ్చే టైం కి వాళ్ళింటికి వెళ్ళి కూర్చుని వినడం మొదలు పెట్టింది. ఓ రోజు సరిత సంగీతం టీచర్ శారద మౌక్తికని అడిగింది, “ అమ్మా నువ్వు రోజూ సరిగ్గా నేను వచ్చే టైం కల్లా వచ్చి కూర్చుని నేను సరితకు చెప్పే పాఠం శ్రద్ధగా వింటున్నావు . నాకు నిజంగా నిన్ను చూస్తుంటే ఎంతో ముచ్చట వేస్తోందమ్మా…నీకు నిజంగా సంగీతం అంటే అంత ఇష్టమా?”
ఆ మాటలకు మౌక్తిక కొద్దిగా సిగ్గు పడుతూ చెప్పింది,” అవును టీచర్ నాకు సంగీతం అంటే ప్రాణం. నాకు కూడా సరితలా సంగీతం నేర్చుకోవాలని ఉంది మేడమ్. కానీ మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు. దీంట్లో పడితే చదువు దెబ్బతింటుంది అంటున్నారు మా మమ్మీ. అందుకే ఇలా వచ్చి రోజూ వింటున్నాను “ అంది.
“ అయితే ఏదీ నీ గొంతు టెస్టు చేస్తాను ఏదైనా నీకు నచ్చిన, వచ్చిన పాట పాడు” అన్నది శారద.
మౌక్తిక ఏ విధమైన బిడియం లేకుండా తనకు బాగా వచ్చిన ఓ సినిమా పాట పాడి వినిపించింది. విన్న శారద మౌక్తికని ఎంతో మెచ్చుకుంది.
“ నీ గొంతు చాలా బాగుందమ్మా! సంగీతం పట్ల నీ ఆసక్తిని చూస్తుంటే నాకు నీకు కూడా సంగీతం నేర్పించాలని ఉందమ్మా…అందుకని నువ్వు ఓ పని చేయి. రోజూ నువ్వెలాగూ వస్తున్నావు కాబట్టి నేను సరితతోపాటు నీకు కూడా సంగీతం నేర్పిస్తాను. నువ్వు మీ ఇంట్లో వాళ్లకు చెప్పనవసరం లేదు. నువ్వు ఓ స్థాయికి వచ్చాక నేనే వెళ్లి మీ మమ్మీ తో మాట్లాడతాను ఏం!” అంది శారద.
ఆ మాటలకి మౌక్తిక ముఖం కోటి దీపాల కాంతితో వెలిగి పోయింది.
“ సరే టీచర్ అలాగే నేర్చుకుంటాను “ అంది ఎంతో సంబరంగా.
ఆ మరునాటి నుంచే శారద సరితకూ, మౌక్తికకూ కలిపి సంగీతం నేర్పించడం మొదలుపెట్టింది. కొద్ది రోజులు అలా గడిచిపోయాయి.
కొన్నాళ్లవరకూ ఈ విషయం మౌక్తిక తల్లి శశికళకు తెలీదు.సరితతో ఆడుకోవడానికి వెళ్తున్నానని అబద్ధం చెప్పేది. కానీ కొద్ది రోజుల్లోనే శశికళ మౌక్తిక రోజూ సరితా వాళ్ళ ఇంటినుంచి వచ్చి హడావిడిగా హోమ్ వర్క్ చేయడం, ఒక్కొక్క సారి హోమ్ వర్క్ చేయకుండా, ఆరోజు పాఠాలు చదవకుండా నిద్ర పోవడం మొత్తానికి చదువు అంటే అశ్రద్ధ చేయడం గమనించింది.అప్పుడే ఆమెకు మౌక్తిక ఇలా రోజూ సరితావాళ్ళింటికి వెళ్ళి ఏం చేస్తోందన్న అనుమానం తలెత్తింది. అందుకే ఆ రోజు మౌక్తిక సరితావాళ్ళింటికి వెళ్ళాక కొంచెం సేపు ఆగి తాను కూడా వాళ్ళింటికి వెళ్ళింది.అక్కడ సరితతోపాటు మౌక్తిక కూడా సంగీతం నేర్చుకోవడం చూసి అవాక్కయింది. ఆమె మనసు కోపంతో రగిలిపోయింది.కానీ తనలోని భావాలను కప్పి పుచ్చుకుని కాసేపు సరితావాళ్ళ అమ్మతో పిచ్చాపాటి మాట్లాడి మౌక్తికతోపాటు ఇంటికి వచ్చేసింది.
ఇంటికి వచ్చాక మౌక్తికకి క్లాస్ తీసుకుంది.ఇలా సంగీతంలో పడి చదువుని అశ్రద్ధ చేస్తే ఫస్ట్ ర్యాంక్ కాదనీ అప్పుడు తన ఫ్రెండ్స్ సర్కిల్ లో తనకు అవమానమే కాకుండా ఏ డాక్టరో ఇంజనీరో కాలేవనీ, అందుకే ఇకనుంచి వాళ్ళింటికి వెళ్లవద్దనీ ఆర్డర్ జారీ చేసింది.

కొన్ని రోజులు మౌక్తిక సంగీతం నేర్చుకోవడానికి రాకపోయేటప్పటికీ శారద సరితని అడిగింది కారణం ఏంటని. సరిత చెప్పిన కారణం విన్న టీచర్ కి ఎంతో బాధ కలిగింది. ఆ రోజు పాఠం అయ్యాక ప్రక్కనే ఉన్న మౌక్తికా వాళ్ళ ఇంటికి వెళ్ళి శశికళని కలిసింది శారద.
“ శశికళ గారూ మీరేమీ అనుకోనంటే ఒక్క మాట.గత కొన్ని రోజులు మీ అమ్మాయికి సంగీతం నేర్పాను నేను. మీ మౌక్తిక గొంతు చాలా బాగుంటుంది. ఇలాంటి ప్రతిభ ఉన్న శిష్యులు దొరకడం కూడా మా లాంటి టీచర్ల అదృష్టమేనని చెప్పాలి. నా విద్య ఈ విధంగా ఇంత ప్రతిభ ఉన్న ఎవరికోసం అయినా సద్వినియోగం అయితే అంతే చాలనుకుని, మీ అమ్మాయికి ఉచితంగా సంగీతం నేర్పదలిచాను ఇన్నాళ్ళూ..! ఈ మధ్యనే సరిత ద్వారా మీరు మీ అమ్మాయిని ఎందుకు పంపడం లేదో తెలుసుకున్నాను. కానీ నాది కూడా ఒక్క మాట…మనిషికి చదువు ముఖ్యమే కాదనను. కానీ పిల్లల అభిరుచి ఏంటో చిన్నప్పుడే తెలుసుకుని ఆ రంగంలో వారిని ప్రోత్సహిస్తే ఎంతో పైకి వస్తారు. నలుగురిలో మీ ప్రిస్టేజీ కోసం మీ అమ్మాయి మీద ఒత్తిడి తీసుకురావడం న్యాయమేనా…? ఆలోచించండి!
* * *

సంగీతం అరవై నాలుగు కళల్లో ఒకటి. మీ అమ్మాయి కూడా లతా మంగేష్కర్ (ఇండియన్ నైటింగేల్), గానకోకిల సుశీల గారు, ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి గారు, బాలమురళీ కృష్ణ గార్లలా సంగీతం లో నిష్ణాతురాలై పేరు ప్రఖ్యాతులు గడిస్తుందేమో ఎవరు చెప్పగలరు? మీ లాగానే వారి తల్లిదండ్రులు కూడా అభ్యంతరం తెలిపి ఉంటే వారంతా ఈ నాడు అంత పెద్ద గాయకులైవారేనా మీరే చెప్పండి….?”
అందుకే నా మాట విని మీరు మీ అమ్మాయికి తప్పక సంగీతం నేర్పించండి.అది చెబుదాం అనే ఈ రోజు నేను మీ ఇంటికి వచ్చాను అన్నది శారద, శశికళ ముఖంలో త్వర త్వరగా మారుతున్న రంగులను గమనిస్తూ ఫోన్ మ్రోగింది. అలా ముభావంగా ఉన్న శశికళ ను చూసి తన అభిప్రాయాన్నైతే చెప్పింది. ఇక వాళ్ళ ఇష్టం అనుకొని టీచర్ వెళ్లిపోయింది.
ఏంటి అక్క ఏంటీ అలా ఉన్నావు? ఏం మాట్లావూ? అంటుంటేఫోన్ లో నుండి మాటలు విని ఉలిక్కిపడి , టీచర్ వచ్చి చెప్పిన విషయమంతా క్లుప్తంగా చెప్పింది.
మనం మన కళలను కాపాడుకోలేకపోయామప్పుడు . లేకుంటే నేనో సంగీత కళాకారిణి, నువ్వో వీణా విద్వాంసురాలివీ అయ్యే వాళ్ళం. నీకు ఎంత కోరిక గా ఉండేది ఏంటి? ఆ రోజు లు వేరు..
మరి ఇప్పుడు మన పిల్లకూ ఈ అన్యాయమే జరగాలా? అని చెల్లెలు చెవిలోని సీసాన్ని తీసేసింది.
ఆమె మాటలతో శశికళ కళ్ళకు కప్పిన పొరలు విడిపోయాయి.తన తప్పు తనకు తెలిసి వచ్చింది. వెంటనే శారద ను కలవడానికి పరుగెత్తింది. ఆవిడ వెళ్లి పోయేదే ఆటో ఎక్కి. తొందరగా ఆమె దగ్గర కు వెళ్ళి, చేతులు పట్టుకుని,” సారీ శారద గారూ మీరు చెప్పేవరకు నేను ఎంత పెద్ద తప్పు చేస్తున్నానో గ్రహించలేకపోయాను. మా చెల్లి ఫోన్ వచ్చింది అప్పుడే, తనుకూడా అలానే అన్నది. నా కళ్లు తెరచుకున్నాయి. అలాగే కానివ్వండి.రేపట్నుంచి మా మౌక్తికకి కూడా సంగీతం నేర్పండి. ఇకనుంచి నేను ఎటువంటి అభ్యంతరం చెప్పను.” అన్నది శశికళ.
‘ ఇప్పుడు కుమారి మౌక్తిక తల్లి గారైన శశికళ గారినీ, తండ్రి గారైన చంద్ర శేఖర్గారినీ వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం అన్న ఎనౌన్స్మెంట్ వినపడడంతో గతంలోంచి వర్తమానంలోకి వచ్చింది శశికళ. ఆలోచనల్లో పడి తెర తీసిన సంగతే గమనించలేదు. వేదిక మీద ఆ నాటి ముఖ్య అతిథి, పాటకచ్చేరి నిర్వాహకులు తదితరులు వేదికనలంకరించి కనిపించారు. శశికళ, చంద్ర శేఖర్ దంపతులు కూడా వేదికపై తమ కోసం కేటాయించబడిన కుర్చీల్లో ఆసీనులైనారు.
అప్పుడు కార్యకర్తలు కుమారి మౌక్తికకు ముఖ్య అతిథిద్వారా మొమెంటోని బహూకరించారు. ముఖ్యఅతిథి ఓ ఐదు నిమిషాలపాటు, “ నేడు చదువుల కారణంగా అంతరించిపోతున్న అనేక కళల్లో ఈ సంగీతకళ కూడా ఒకటి. అది అంతరించి పోకుండా ఉండాలంటే తల్లిదండ్రులు వాటిని తమ బిడ్డలకు నేర్పించాడంద్వారా, మరుగున పడకుండా కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందనీ, అందుకు నేను, నేడు మౌక్తిక తల్లిదండ్రులను అభినందించకుండా ఉండలేకపోతున్నాను “ అని అంటుండగా, వెంటనే శశికళ లేచి, “ సభ అనుమతిస్తే నేను రెండు మాటలు ప్రేక్షకులకు చెప్పదలుచుకున్నాను.” అన్నది.
◦ వెంటనే ముఖ్య అతిథిగారు మైక్ ఆమె చేతికిచ్చారు. అప్పుడు శశికళ మైక్ తీసుకుని ఇలా అంది, “ఈ రోజు మా అమ్మాయి మౌక్తిక కర్నాటక సంగీతంలో ఇంతటి ప్రావీణ్యత సాధించడానికి దోహదపడిన వ్యక్తి మరొకరు ఉన్నారు. ఆవిడ ఎవరో కాదు మౌక్తిక గురువుగారు శ్రీమతి శారదగారు. ఆవిడే పట్టుపట్టి సమయానికి మా కళ్ళు తెరిపించి ఉండి ఉండకపోతే ఇలా మా అమ్మాయి మౌక్తిక గానకచేరి మనమెవ్వరమూ చూడగలిగి ఉండేవాళ్ళం కాదు.మా మౌక్తికను ఇంతదాన్ని చేసినందుకు మేమిరువురం శారదగారికి సదా కృతజ్ఞులం. దయచేసి శ్రీమతి శారద గారిని వేదిక మీదకు రావలసిందిగా కోరుతున్నాను.!”
◦ వెంటనే ముందు వరుసలో కూర్చున్న శారద లేచి వేదిక మీదకు నడిచింది.ఆవిడ పైకి రాగానే కుమారి మౌక్తిక ఓ పూలహారం తెచ్చి ఆమె మెడలో వేసింది. ఆ తర్వాత ఓ పళ్ళెంలో కంచిపట్టు చీర, పూలు పళ్ళూ, ఓ గిఫ్ట్ చెక్ ఉన్న కవరూ తీసుకొచ్చి తన గురువుగారికి సమర్పించి ఆవిడకి పాదాభివందనం చేసింది మౌక్తిక. శారద మౌక్తికను మనసారా ఆశీర్వదించి తన అక్కున చేర్చుకుంది. గురు శిష్యుల ఆ అపురూప దృశ్యం కెమేరాలలో బంధింపబడింది.
◦ శారద మెడలోని పూల హారం తీసి పక్కన పెట్టి మైక్ అందుకుంది.
“ సభకు నమస్కారం! ఈరోజు మౌక్తిక సాధించిన విజయానికి ఆమె గురువుగా నేనెంతో గర్విస్తున్నాను. ఇందులో నేను చేసిందేమీ లేదు. నా చేతికి వచ్చిన రత్నాన్ని నేను సాన పెట్టానంతే! ఇందుకు ఆమె తల్లి తండ్రుల ప్రోత్సాహం ఉండబట్టే ఆమెకీ విజయం సులభసాధ్యం అయ్యింది. అందుకే నేను ఇక్కడికి విచ్చేసిన ప్రతి తల్లీతండ్రికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీ పిల్లల అభిరుచిని చిన్నప్పుడే కనిపెట్టి వారిని ఆ ఆ రంగాలలో ప్రోత్సహించండి. అంతేకానీ వారి అభిరుచికి విరుద్ధంగా వారికిష్ఠం లేని చదువులను కానీ లేక రంగాన్ని కానీ వారి మీద బలవంతంగా రుద్దకండన్నదే నా వినతి. ధన్యవాదాలు.” మరొక్కసారి ఆడిటోరియం చప్పట్లతో ప్రతిధ్వనించింది.
***

మాధవపెద్ది ఉష
హైదరాబాద్

Written by Madhavapeddi Usha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆపాత మధురాలు:-

ఆట  – ఆడు