మూడు గిన్నెలతో ముచ్చటైన కాపురం

కథ

మా ఆయన ఉద్యోగం పుణ్యమా అని నానా దేశాలూ తిరిగాము, తిరుగుతున్నాము. మనం జాగ్రఫీలో పూర్ కాబట్టి కొన్ని దేశాలు ఉన్నాయని కూడా తెలియలేదు, అక్కడికి వెళ్ళేదాకా. అమెరికా నుంచి లగోస్, నైజీరియా వెళ్తున్నాము అంటే, మన చిట్టెన్ రాజు గారి లాంటి పెద్దమనుషులు, ఎవరైనా అక్కడినుంచి ఇక్కడికొస్తారు, నీకేం మాయరోగం అన్నారు! ఐనా పట్టించుకోకుండా పతి పద సేవయె భాగ్యముగా అనే పాటను లూప్ లో పాడుకుంటూ అన్ని చోట్లకీ తిరుగుతున్నాను. తిరిగి తిరిగి ప్రస్తుతం దక్షిణ అమెరికా లోని గయానా అనే దేశంలో వచ్చి పడ్డాం. ఎక్కడికెళ్ళినా మేము కట్టుగుడ్డలతో వెళితే, కంపెనీ వాడు పాపం మన విరిగిపోయిన చెంచాలు, పగిలిపోయిన కంచాలతో సహా ఏ సామానునీ వదలకుండా సముద్రంలో పారేస్తాడు, అంటే సీ షిప్మెంట్లో పంపుతాడన్నమాట. సముద్రుడి దయ, మన ప్రాప్తం ఆధారంగా అది మనకు చేరడానికి మూడు నుంచి ఆరు నెలల సమయం పట్టచ్చు.
ఈలోగా ఓ సాఫ్ట్ పేక్ ఇస్తారు, అంటే మూడు బొచ్చెలు, నాలుగు ప్లేట్లు, రెండు చెంచాలు, ఓ బ్లెండరు, ఇలా మనం ఏం వండుకోవచ్చో నిర్ణయించి ఇస్తారు. పాపం వాళ్ళది సదుద్దేశ్యమే అయినా ఇందులో ఏవీ భారతీయ భోజనం అందులో మరీ ముఖ్యంగా తెలుగు వంటలకి పనికిరావు. బంగాళదుంప కూరకే అరకొరగా పనిచేసే గిన్నెతో నేను బచ్చలి ఆవపులుసెట్టి, ప్యూరే అనే పదార్ధానికి మాత్రమే పరిమితమయ్యే బ్లెండర్ తో దోశపిండి, వేరుశనగపచ్చడి చేసి, దాని దుంప తెంపుతున్నాను.  ఇవేం సరిపోతాయి అంటే పతిదేవుడు, ‘అదే! నిన్ను సంతోషపెట్టడం నాకే కాదు, మల్టీ బిలియన్ డాలర్ కంపెనీ తరం, ఆ బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. ఇన్ ఫ్లేషన్ పెరిగి, ఫ్రీగా ఇస్తే ఫినాయిల్ తాగే జనాలున్న రోజుల్లో, ఉచితంగా ఇచ్చినవి చూసి సంతోషించకుండా, వెట్ గ్రైండర్ లేదు, ఇన్ స్టెంట్ పాట్ లేదు, రుంబా లేదు, రంభా లేదు అంటూ నన్ను తినకు! ఆఫీసులో చాలా పని ఉంది, ఫోన్ చెయ్యకు, చేసినా ఎత్తను ‘ అని తప్పించుకు తిరుగుతున్నారు.
ఇదిలా ఉండగా, పోన్లే ఒకటి రెండు రెస్టారెంట్లు ఉన్నాయి, బయట తిందాము అనుకుని, వచ్చిన రోజే వెళితే, బిల్లు ఇరవై ఒక్క వేల డాలర్లు అయ్యింది. మా ఆయన ఏమాత్రం సంకోచించకుండా బిల్లు కాష్ తో కట్టి ఓ పదిహేనొందలు టిప్ కూడా ఇచ్చారు. కలయో వైష్ణవమాయయో..మా ఆయన ఇలాంటి మూడ్లో ఉండగానే ఓ అరకేజీ బంగారం కొనిపించేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాను, అనుకోలేదు, బయటికే అన్నట్లున్నాను వెర్రి మొహాన్ని! ‘నీ తలకాయ! నీకు అర్థమయ్యే భాషలో మన నలుగురి తిండి ఖరీదు వంద అమెరికన్ డాలర్లు, ఇచ్చిన టిప్పు ఇంచుమించు 8 డాలర్లు. అయినా నీకు చాలా ఎక్కువ అనిపించింది కదా, ఏం ఫర్లేదు, ఎంచగ్గా ఇంట్లో వండేసుకుందాం. నువ్వు ముద్ద పప్పు ఎంత బాగా వండుతావో, పాలు ఎంత బాగా తోడెడతావో’ అని మా ఆయన కాంప్లిమెంట్ తో నా జీవితం కాంప్లికేట్ చేసేసారు.  ‘పైగా పిల్లలు కూడా కాలేజీలకు వెళ్ళిపోయారు, నీకు తోచదు. నీకు మొక్కల్ని పాతెయ్యడం, గడ్డి పీకెయ్యడం సరదా కదా! పైగా మనం ఉన్నది రెయిన్ ఫారెస్ట్లు ఉన్నటువంటి సుజల, సుఫల, సస్య శ్యామలమైన భూమి..ఆ కూరలన్నీ కూడా మనమే (అంటే నేను మాత్రమే) పెంచేసుకుంటే ఆర్గానిక్ వ్యవసాయం చేసినట్లూ ఉంటుంది, ఆరోగ్యం కూడా భేషుగ్గా ఉంటుంది’ అని ఇంకో మెలిక పెట్టారు. వండిన గిన్నెని తోమి, తోమిన గిన్నెలో వండి, తోచినంత మెక్కి, మిగిలితే ఫ్రిజ్జిలో కుక్కి, ఇలా మూడు గిన్నెలతో ముచ్చటైన కాపురాన్ని గత మూడు నెలలుగా లాక్కొస్తున్నాను.
దీని మాట ఎలా ఉన్నా విశాఖపట్టణం బీచ్ అందాలూ, కోనసీమ కొబ్బరితోటలు కలగలిపిన ఆహ్లాదకరమైన వాతావరణం, దాదాపు 150 సంవత్సరాల క్రితమే ఇక్కడకి వచ్చి సెటిల్ అయిన ప్రవాస భారతీయుల సంతతీ, ప్రతీ మూడు నాలుగు వీధులకి కలిపి ఓ గుడీ, పనస చెక్క దగ్గర్నించి, అరటి దవ్వ వరకూ అన్ని రకాల కూరలు, జామకాయనుంచి మామిడి పండు వరకూ అన్ని పండ్లూ, ఒరిజినల్ సైజుల్లో అంటే మా టెక్సాస్ భారీ కాయాలు కాకుండా మహా రుచిగా ఉన్నాయి.
ఏ మాటకామాట చెప్పుకోవాలి –  పెళ్ళైన కొత్తల్లో మా ఆయనకి ఓ మాట చెప్పా! నీ సంపాదనకి తగినట్లు నా ఖర్చు ఉండదు, నా ఖర్చుకి తగినట్లు నువ్వు సంపాదించాలి అని. పెళ్ళైన కొత్త కదా, కొత్త మోజుతో ఏ కళనున్నారో అలాగే అని బుర్రూపి, శంకరగిరి మాన్యాలలా ఐదు ఖండాలు, ఆరు దేశాలు అంటూ తిరుగుతున్నారు, ఆయన చిటికెన వ్రేలు పట్టుకుని నిను వీడని నీడను నేనే అని కూడా వెళ్తున్నాను. ఇంకా ఈ జన్మలో ఎన్ని దేశాలు చూస్తామో, ఎక్కడ తిండి నీళ్ళు ప్రాప్తమో ఆ భగవంతుడికెరుక !

Written by UMA DESHBHOTLA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

‘నదీమతల్లి’ -4

శిక్షణ – క్రమశిక్షణ