“లోకాభిరామాయణం”( కాలమ్) చదవండి … మీరూ ఇష్టపడుతారు. P.V.S కృష్ణ కుమారి గారు ఈ నెల అంటే, 2025 సెప్టెంబర్ నుంచి మనకోసం మన తరుణి పత్రిక లో కాలమ్ రాయడం ప్రారంభించారు. గతంలో ” తరుణీయం”‘ అనే పేరుతో వేముగంటి శుక్తిమతి గారు, “ఉషోదయం ” అనే పేరు తో మాధవపెద్ది ఉష గారు, ” నేటి భారతీయం” పేరుతో డాక్టర్ మజ్జి భారతి గారు కంటెంట్ రైటప్ లను రాసారు. ఇప్పుడు కృష్ణ కుమారి గారు రాస్తారు చదవండి. ఆలోచనత్మకమైన ఈ రచనను చదివి ఆనందించండి.
– డాక్టర్ కొండపల్లి నీహారిణి, తరుణి పత్రిక సంపాదకులు.
మాట తీరు
” నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ ” అని సుమతీ శతక కర్త నుడివిన దానిలో తప్పించుకు తిరుగువాడు ధన్యుడు మాట సంగతి ఏమో కానీ, నొప్పింపక తానొవ్వక మాట్లాడటమనేది ఒక గొప్ప కళ, సంస్కారం.
“క్షీయంతే ఖలు భూషణాని సతతం వాక్ భూషణం భూషణం ” అని భర్తృహరి సుభాషితం. ఏంత విలువైన వస్తువులు అయినా కూడా ఏదో ఒకరోజు క్షీణించేవే. అలా క్షీణించనిది కేవలం వాక్కు మాత్రమే. వాక్కు అత్యంత ఖరీదైన ఆభరణం లాంటిది.
ఈ వాక్కు అనేది విలువైనదే కాదు, ధైర్యాన్ని ఇచ్చే ఔషధం కూడా. నిరాశ, నిస్పృహలతో కుంగిపోతున్న వాడికి ఆశాజనకమైన మాటలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నవాళ్ళకి దివ్యౌషధంగా పనిచేస్తాయి.
ఓటిమిలో ఉన్నవాడిని విజయం వైపు పయనింపచేస్తాయి. శత్రువులని మిత్రులుగా మారుస్తుంది.
కొందరు నిర్మొహమాటంగా,ముక్కు సూటిగా మాట్లాడేవారు ఉంటారు. చిక్కంతా వారితోనే వస్తుంది.
ఆమధ్య మా బంధువు ఒకాయనకి చిన్న ఏక్సిడెంట్ అయింది. కాలికి దెబ్బతగిలింది. ఇక బంధువులు, స్నేహితుల పలకరింపులు మొదలయ్యాయి.
” లేచిన వేళ మంచిది అయింది. చిన్న గాయంతో సరిపోయింది” అంటూ సాంత్వన వచనాలు పలికారు.
వాళ్ళలో ఒకాయన చాలా నిక్కచ్చిగా, ఉన్నదున్నట్లు మాట్లాడే స్వభావం కలవాడు.
” నీకు తగిలింది చిన్న దెబ్బే కానీ నీకు షుగర్ ఉంది. అది కోతి పుండుని బ్రహ్మరాక్షసిని చేస్తుంది. సాధారణంగా అందరికీ వారం రోజుల్లో తగ్గేది మనలాగా షుగర్ ఉన్నవాళ్ళకి ఆరు నెలలు పడుతుంది. కొన్ని సందర్భాల్లో సంవత్సరం కూడా సమయం తీసుకుంటుంది తగ్గటానికి. అందునా నీకు తగిలిన గాయం కాలికి. నీకు తెలుసుగా మా నాన్న కాలిగోరు మరో కాలికి తగిలి అదే పెద్దదయి సెప్టిక్ అయి చివరికి ఆంపుటేషన్ దాకా వెళ్ళాల్సి వచ్చింది. అయినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత నెల రోజులకే అంతా అయిపోయింది. కాబట్టి నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి” ఇలా సాగిపోయిందిట ఆయన ధోరణి. భార్య ఎంత కంట్రోల్ చేయాలని చూసినా ఆగలేదట.
అయితే సహజంగా ధైర్యవంతుడు కాబట్టి ఆయన భయపడలేదు కానీ, ఆ మాటల్లోని వాస్తవం మాత్రమే గ్రహించాడు. ఆ తర్వాత దేవుని దయవల్ల త్వరలో కోలుకున్నాడు.
ఈ విషయం వాళ్ళ పిల్లలు నాతో చెప్పి, ఎప్పుడు ,ఎలా ,ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళు మనలోనే ఉన్నారు అని చెప్పి వాపోయారు.
ఇలాంటి వారు తాము నిర్మొహమాటంగా ఉన్నమాట చెప్పాము అనుకుంటారు కానీ,అవతలి వారి మానసిక స్థితి ఎలా ఉంటుందో గమనించరు.
కొంతమంది తీరు మరోలా ఉంటుంది. ఒకాయన బంధువుల ఇంటికి వెళ్ళాడు. రాకరాక చాలా సంవత్సరాల తర్వాత వచ్చాడు కదా అని వాళ్ళు సకల మర్యాదలు చేయసాగారు. భోజనానికీ కూర్చోగానే,
” ఇన్ని రకాల చేసారు, నేను ఒకటి, రెండు ఐటెమ్స్ కంటే తినలేను. నేను మితాహారం తీసుకుంటాను. అయినా ఇంత అతి మర్యాదలు అవసరమా?”
” కూర చాలా కారంగా ఉంది. ఇంతింత కారాలు ఆరోగ్యానికి మంచివి కాదు”
” పెరుగు కంటే మజ్జిగ చాలా మంచిది” ఇలా నసుగుతూనే ఉన్నాడు.
పైగా “నేను చాలా నిర్మొహమాటంగా మాట్లాడతానమ్మా ఏమనకోకు” అన్నాడు.
అక్కడికీ అతని భార్య , ‘వాళ్ళు ప్రేమతో చేసారు ఈ రోజుకి తినండీ ‘అంటూనే ఉంది. అబ్బే, వినేదే లేదు.
వినీ వినీ ఆ ఇంటి ఇల్లాలికి ఒళ్ళు మండింది.
” మీ కోసం ప్రత్యేకంగా ఏమీ చేయలేదండీ. మా ఇంట్లో రోజు నాలుగు ఐటెమ్స్ ఉండాలి. ఎవరికి ఏది ఇష్టమైతే అది తింటారని చేస్తాను. ఇక మాకు చప్పిడి కూరలు తినటం అలవాటు లేదండీ. శరీరానికి అన్నీ సమపాళ్లలో ఉండాలి కదా!” అంది.
కొంతమంది మేము ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతాం అంటారు. ఉదాహరణకు
“నా డ్రెస్ ఎలా ఉంది” అంటే,
” డ్రెస్ బాగుంది కానీ, నీకు అంత నప్పలేదు”
” చాలా ఖర్చు పెట్టి ఫంక్షన్ చేసావు కానీ , సరిగా ఆర్గనైజ్ చేయలేకపోయావోయ్”
” నాకు ఇలాంటి ఫంక్షన్స్ ఇష్టం ఉండవు, కానీ నీవు బాధపడతావని వచ్చాను” ఇలా సాగిపోతూ ఉంటాయి వారి మాటలు.
అయితే నిజాయితీతో కూడిన ముక్కుసూటి తనం ఒకొక్కసారి మంచి ఫలితాల్ని ఇస్తుంది. నేను స్కూల్ పెట్టాలి అనుకున్నప్పుడు అంతకుముందు నేను పనిచేసిన స్కూల్ ప్రిన్సిపల్స్ ని, కొంతమంది శ్రేయోభిలాషులు అనుకున్న వాళ్ళని కలిసి చెప్పాను.
మొదట ఒక రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ ని కలిసాను. ఆయన అభినందనలు తెలపటమే కాక, భార్య చేత పసుపు, కుంకుమ , చీరె పెట్టించి, 2000 ఎమౌంట్ స్కూల్ ఫండ్ కింద ఇచ్చారు. మీరు తప్పక సక్సెస్ అవుతారు అంటూ బ్లెస్ చేసారు.
మరి కొందరు కూడా అలాగే చెప్పారు. చాలా ప్రోత్సహించారు. చాలా ఆనందం , ఉత్సాహం కలిగింది.
చివరిగా మొట్టమొదట నేను పనిచేసిన స్కూల్ ప్రిన్సిపాల్ ని కలిసాను. అతనికి ట్విన్ సిటీస్ లోనే కాక, ఇతర జిల్లాల్లో దాదాపు పది కూడా బ్రాంచెస్ ఉన్నాయి.
” అభినందనలు కృష్ణ కుమారి గారు. అయితే మీరు అనుకున్నంత తేలిక కాదు ఇనిస్టిట్యూట్ రన్ చేయటం. మీకు ఎవరూ సహాయం రారు. మీ వాళ్ళే మీకు శత్రువులు అవుతారు. మీ సమర్ధత ఎందుకూ పనికిరాదు. డిప్రెషన్ లోకి వెళ్ళే పరిస్థితి కూడా వస్తుంది. ఆలోచించుకుని అడుగు వేయండి. నేను మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తున్నాను అనుకోవద్దు. వాస్తవాలను నిర్మొహమాటంగా చెపుతున్నాను” చాలా నెమ్మదిగా,ఓర్పుగా కష్టసుఖాలు చెప్పుకొచ్చాడు.
అతను ముక్కుసూటిగా చెప్పినా, చెప్పిన విధానం చాలా పొలైట్ గా, సలహాలాగా చెప్పుకొచ్చారు.
అయితే ఆ మాటలు వినగానే మనసంతా చేదుగా అయిపోయింది. అప్పటికి అన్నీ అరేంజ్మెంట్స్ చేసుకున్నాను. వెనక్కి వెళ్ళలేను. ఏం చేయాలో అర్ధం కాలేదు. ఎప్పుడో వస్తుంది అని అతను చెప్పిన డిప్రెషన్ ముందే వచ్చేసింది. మావారు నా పరిస్థితి చూసి,
” ఏం ఆలోచన లేకుండా ముందుకు వెళ్ళు. సక్సెస్ అయితే అవుతావు. లేదంటే ఏదో ఒక ట్రయల్ వేసాను అనుకో” అంటూ ధైర్యం చెప్పారు.
అన్నట్లు గానే ముందుకు వెళ్ళాను. అయితే ఆ రోజు అతను చెప్పిన మాటలు నాకు ప్రతి క్షణం గుర్తు కొచ్చేవి. నిజంగానే అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఒకటి రెండు సంఘటనలు అతను చెప్పినట్లు జరగటంతో , అతని మాటల్లోని వాస్తవం గ్రహించి, మిగిలిన వాటి పరిష్కారానికి ఆలోచనలు చేసేదాన్ని.
దీనిని బట్టి ఏమి అర్ధం అవుతుంది అంటే నిజాయితీతో, మన శ్రేయోభిలాషులు,ఏ విషయమైనా చెప్పే విధంగా చెపితే మన పనిలో మనం విజయం వైపు పయనించగలుగుతాము.
అలా కాకుండా, అర్ధం పర్ధం లేకుండా, సమయం సందర్భం లేకుండా నేను ముక్కుసూటిగా, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతా అంటే ముక్కు పగులుతుంది. కుండలోని ప్రేమ జలం ఒలికి పోయి బంధుత్వాలు , స్నేహాలు మరుగున పడతాయి.
అందరికీ తెలిసిన విషయాలే అయినా ఏదో లోకాభిరామాయణం అంతే.
మరో ముచ్చటతో మళ్ళీ వస్తాను