పసిదనంతో ప్రయాణం (కాలమ్)

కరిష్మా – చరిష్మా

“సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి” ఈ సామెత ఎందుకు ఎలా పుట్టిందో తెలియదు కానీ పసితనం కష్టాలు పసితనానివే… ఆఁ వాళ్ళకేం కష్టాలు ఉంటాయి. ఆశ్చర్యం అసహనం కొందరి మోములపై కదలాడుతుండొచ్చు కానీ ఇది నిజం.
వారినీ అవమానాలు వెంటాడి ఆత్మన్యూనతకు లోనయ్యేలా చేస్తుంటాయి. అంతకంటే పెద్ద కష్టం ఇంకేముంటుంది?
అదిగో అలాంటి కష్టమే ఈ బుజ్జి కన్నమ్మకు వచ్చింది.

బెదురు బెదురు చూపులతో భీత హరిణంలా చుట్టూ చూస్తూ ఓ మూలన కూర్చుంది ఓ బుజ్జి కన్నమ్మ.
అక్కడ కూడా తనను కూర్చోనిస్తారో లేదో అనే బెరుకుతో తలుపు చాటుకు నక్కుతూ కూర్చున్న ఆ కొత్త బుజ్జి కన్నమ్మను చూడగానే ఏమిటి? ఈ కన్నమ్మకు సిగ్గా?బిడియమా? భయమా? మరీ ఇంత తనను తాను కనబడకుండా దాక్కునే అంతనా? ఆలోచిస్తూ కళ్ళతో సైగ చేస్తూ చేతులు చాపి రమ్మని పిలిచాను.
అంతే ఓ అల్లరి పిడుగు లేచి ఆ కర్రెపిల్లకు ఏం రాదు టీచర్! అందుకే ఎవరి దగ్గరకు రాదు టీచర్ ఆ కర్రెపిల్ల అంతే టీచర్!
గడగడా పాఠం చెప్పినట్లు ఆ బుజ్జి కన్నమ్మ గురించి చెబుతుంటే కొంచెం కోపం వచ్చింది కానీ చెప్పిన వాడూ ఓ బుజ్జి కన్నయ్య.
అందుకే వాడి మాటలకు అడ్డుపడుతూ ఇంతకూ అదేం పేరు? అన్నాను.

నల్లగుంటది కద టీచర్ అందుకే అట్లంటరు. వాళ్ళింట్లోళ్ళు, కూడా అట్లనే అంటరు టీచర్! అందుకే మేం కూడా అట్లనే అంటున్నం. నా మాట లోని ప్రశ్నార్థకాన్ని,మొహంలోని ఆశ్చర్యార్థకాన్ని చూస్తూ వివరణ ఇచ్చింది ఓ చిట్టి తల్లి.
ఇవన్నీ వింటూ కర్రె పిల్ల కాదు కాదు కరిష్మా వైపు చూశాను. కళ్ళనిండా నీళ్ళతో బిక్కు బిక్కు మంటూ ఈ మాటలకు గాయపడిన పసితనం ఆ మోములో చూశాను.
“ఇటురా కరిష్మా! దగ్గరకు రా!” అనగానే ఆ తడి కళ్ళలో ఓ మెరుపు.తననేనా పిలిచింది అన్న ఆశ్చర్యం ఆ చూపులో కనబడింది.
“నిన్నే రా బంగారూ! రా కరిష్మా బంగారూ!” అనగానే పిల్లలంతా ఒక్కసారిగా ఘొల్లున నవ్వారు.
“తప్పు.అలా నవ్వొద్దు! కొంచెం గట్టిగా పిల్లల్ని అనడంతో అడుగులో అడుగు వేస్తూ నాదగ్గరకు వచ్చిందల్లా చటుక్కున వెనక్కి మర్లింది.

నిన్నే బంగారూ!కరిష్మా ఇటురా తల్లీ మరోసారి బతిమాలుతూ పిలవడంతో కొంచెం ధైర్యం తెచ్చుకుని మెల్ల మెల్లగా నాదగ్గరకు అడుగంలు వేసింది.
చటుక్కున దగ్గరకు తీసుకొని తల నిమిరాను.ఆ స్పర్శ నచ్చినట్లుంది.అవకాశం ఎక్కడ జారిపోతుందో ఏమోనని ఒళ్ళో గువ్వ పిట్ఠలా ఒడిలో ఒదిగి పోయింది.
అది మొదలు తనలో బెరుకుతనం పోయింది. నా పక్కనే కూర్చోపెట్టుకుని అక్షరాలు, గేయాలు నేర్పడం మొదలు పెట్టాను. నోరు విప్పేందుకే భయపడ్డ ఆ బుజ్జి కన్నమ్మ గేయాలు, అక్షరాలు బుద్ధిగా నేర్చుకుంటోంది.
ఆనాటి నుండి బుజ్జి కన్నమ్మలో అంతులేని ఆత్మవిశ్వాసం. ఎవరైతే చదువు రాని పిల్ల అన్నారో వాళ్ళకు ధైర్యంగా సమాధానం చెప్పడం చూసి మనసుకెంతో తృప్తిగా అనిపించింది.
ఓ రోజు వాళ్ళ అమ్మని పిలిపించాను.
వస్తూ వస్తూనే “మా కర్రెపిల్ల ఎలా చదువుతోంది మేడం ? ఊఁ అంటే నెత్తిన నీళ్ళ కుండ.కొట్టకముందే ఏడుస్తుంది.ఏం పిల్లో! ఏమో? అంది.
ఆ బుజ్జి కన్నమ్మకు అంత చక్కటి పేరు పెట్టిన మీరే కర్రెపిల్ల అనడమేంది? ఇంట్లో కూడా అందరూ అలాగే అంటారట కదా! పిల్లలకూ మనసుంటుంది అలా పిలిస్తే ఎం బాధ పడిందో ఆ పసిమనసు. ఇక నుంచి అలా పిలవకండి. అని.. విడమర్చి చెప్పాను.
“అవునా మేడం! మా చిన్ని మనసును అంతగా గాయ వరిచానా? ఆశ్చర్యంగా నా వంక చూస్తూ.. దీని గురించే నా బాధ.ఎలా బతుకుతుందో ఏమో? అని .ఈ మధ్య ఇంట్లో కూడా ధైర్యంగా ఉంటోంది. అనగానే నా ప్రయత్నం ఫలించినందుకు బోలెడు సంతోషం వేసింది.
వాళ్ళమ్మ కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయింది. వాళ్ళమ్మను చూసి కూడా చూడనట్లు మిగతా పిల్లలతో ఆటల్లో మునిగి పోయిన కరిష్మాను చూస్తుంటే నాలో ఓ తృప్తి.
కరిష్మా చరిష్మా అయి చదువుతో ఆత్మ విశ్వాసంతో ఆకట్టుకున్న ఆ రోజులు తలుచుకుంటుంటే ఇప్పుడు ఏం చేస్తుందో ఆ బంగారు తల్లి ఉన్నఫలంగా తనని చూడాలని మనసు తహతహలాడుతోంది.
ఈ సునందమ్మ.

ఈ సంఘటనతో పాటు వెంటనే మరో బుజ్జి కన్నయ్య వెంటనే గుర్తుకు వచ్చాడు. వాడే “అమెరికోడు”. ఆ కన్నయ్య గురించి కూడా చెప్పుకోవాలి.

అమెరికోడు
****
ఆరోజు మా ఒకటో తరగతి పిల్లలంతా కట్టగట్టి నా దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.అంతలోనే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ చెప్పాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు.
ఏమైందబ్బా వీళ్ళకు.ఏమిటో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు?
ఇంటర్ వెల్ లో పిల్లల అటెండెన్స్ రిజిష్టర్లో పేర్లు రాసుకుంటున్న నాకు ఏమి అర్ధం కాలేదు.
రిజిస్టర్ పూర్తి చేసి పక్కకు పెట్టగానే టీచర్! టీచర్! అంటూ గుండ్రంగా కళ్ళు తిప్పుతూ బోలెడంత ఆశ్చర్యాన్ని ఒలకబోస్తూ ఇగ్గో! ఇగ్గో నీకు తెలుసా! అంది ఓ చిట్టి బంగారు.
చెప్పకుండానే నాకేం తెలుస్తుంది? అదేమిటో చెప్పు? అనగానే ఇంతలో ఓ బుజ్జి కన్నయ్య ఏదో పరిశోధన చేసి కనిపెట్టిన వాడిలా నా దగ్గరకు వచ్చి టీచర్! టీచర్! మన బడికి అమెరికోడు వచ్చిండు టీచర్! అన్నాడు.
ఆఁ ! అమెరికోడా? ఎవరబ్బా అతడు? నాకు కూడా చాలా చాలా ఆశ్చర్యం వేసింది.
ఇగ్గో టీచర్! వాడు.. వాడు మన దగ్గరికే వస్తడు టీచర్. ఒకటో తరగతే. మా అత్త చెప్పింది. మరో బుజ్జి కన్నమ్మ వివరణ.

ఇలా మా మాటలు సాగుతుండగానే ఆ అమెరికోడిని తీసుకుని నా దగ్గరకు రానే వచ్చింది వాళ్ళమ్మ.

ఓ పంతులమ్మా! మా తెల్లోడికి కాసింత గట్టిగ చెప్పండి.వీడుట్టి బెదురుగొడ్డు” అని నా దగ్గర కూచోబెట్టి వెళుతుంటే బేర్ మని ఏడవడం మొదలు పెట్టాడు. తెల్లగా వున్న వాడు కాస్త ఏడుస్తుంటే ఎర్రగా కందిపోయాడు. వాడి ఏడుపును ఆపేసరికి తాతలు దిగొచ్చారు. మిగతా పిల్లలకైతే ఓ వినోదంలా ఉంది. వాడినే వింతగా చూస్తూ ఉన్నారు.
మొత్తానికి వాడిని దగ్గరకు పిలిచి ఓ చాక్లెట్ చేతిలో పెట్టి ఏడుపు మాన్పించాను.

ఏం పేరు నాన్నా? అడగ్గానే వెక్కుతూ అమెరికోడు అన్నాడు. నాకైతే నవ్వాగలేదు.కానీ నవ్వితే మళ్ళీ ఏడుపందుకుంటాడేమోనని “మరి మీ అమ్మ అలా చెప్పిందే? అనగానే “మా అమ్మొక్కతే నన్ను తెల్లోడు అంటుంది టీచర్! ముక్కు ఎగబీలుస్తూ అన్నాడు. వాడు అనే తీరుకు నవ్వాపుకోలేక కర్చీఫ్ అడ్డం పెట్టుకున్నా.
వాడు చెప్పేది ఆసక్తిగా వింటున్న పిల్లల్లో ఓ సందేహం ” ఇంతకీ వీడు తెల్లోడా? అమెరికోడా? గుసగుసలు.
ఇంతలో హెచ్చెం గారు అడ్మిషన్ ఫాం పంపించారు.అందులో వాడి పేరు అరవింద్ అని వుంది.
ఒరేయ్! నాన్నా! నీ పేరు అరవింద్. రా! అన్నాను. కాదు టీచర్ నాపేరు అమెరికోడు.

ఇంతకాలం వాడి పేరేమిటో వాడికి తెలియదని తెలిసింది.
రోజూ అటెండెన్స్ పిలవడం వాడేమో ఉలుకు పలుకు లేకుండా కూర్చోవడం. ఎన్నిసార్లు చెప్పినా వాడి పేరును వాడు అస్సలు ఒప్పుకోలేదు.

ఇక వాడు తెల్లని పాలిపోయిన రంగులో,రాగి రంగు జుత్తుతో, చిన్న కళ్ళు తెల తెల్లని కనుబొమ్మలతో వింతగా కనిపించాడు.
నేనలా చూస్తుంటే ఏమనిపించిందో వాడికి మొగ్గలా ముడుచుకు పోయాడు.
ఇక పిల్లల సంగతి సరే సరి. ఆ బుజ్జి కన్నయ్యను ఓ వింత మనిషిలా చూడసాగారు.

నేను వెంటనే తేరుకుని ఇటురా కన్నయ్యా! అని ఎంత పిలిచినా కుందేలు పిల్లలా ముడుచుకుని అంత దూరంలోళఅలాగే కూర్చున్నాడు.
ఎంతో అనునయంగా, ప్రేమగా పిలిస్తే కానీ వాడికి నా మీద నమ్మకం కుదరలేదు.
దగ్గరకు రాగానే వాడి భుజం మీద చెయ్యి వేయబోయాను.అంతే ఉలిక్కిపడి భయపడుతూ గదిలో ఓ మూలకు పరిగెత్తాడు. ఆ కన్నయ్యకు నా చేతి స్పర్శ నచ్చలేదా?అర్థం కాలేదు.

అలా వారం రోజులు దగ్గరకు పిలవగానే దూరంగా పారిపోవడం,పిల్లలతో కలవకుండా ఎవరొచ్చి దాడి చేస్తారోనని భయపడటం గమనించాను. ఈ కన్నయ్య మనసుకేదో బలమైన గాయమే అయ్యింది అనుకున్నా.
నా చాక్లెట్లు,పాపిన్స్ అస్త్రాలు ప్రయోగిస్తూ నెమ్మదిగా దగ్గరకు రప్పించుకుని మాట్లాడించడం, పిల్లల జట్టు ఆటల్లో పాల్గొనేలా చేయడంతో కొంచెం కొంచెం మార్పు వచ్చింది.
ఇంతకూ ఆ బుజ్జి కన్నయ్య అంతగా బెదిరిపోయి దూరంగా ఉండటానికి కారణం తెలిసి నివ్వెర పోయాను. తెల్లని వాడి శరీరాన్ని తాకి గిల్లడం.ఎర్రగా కందిపోతే అమెరికోడు ఎర్రటోడు అయ్యిండురోయ్ అని తెలిసిన వాళ్ళు, బంధువుల్లో కొందరు అలా చేసారట.వాళ్ళ అమ్మకి చెబితే “నువ్వు తెల్లోడివిగా ప్రేమతో అలా చేస్తున్నారని అన్నదట .ఇక వాడి బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. అందుకే అందరికీ దూరంగా ఉంటుండని వాడి మాటలు,ప్రవర్తన ద్వారా అర్థమై కళ్ళలో నీళ్ళు తిరిగాయి..వాడి వంటి మీద అక్కడక్కడా కమిలిన మచ్చలు కనిపించాయి.

ఆ కన్నయ్యకు శరీరం అలాంటి రంగులో ఉండటానికి కారణం ఏమై ఉంటుదబ్బా? ఈవిషయాన్ని నా డాక్టర్ దోస్త్ ను అడిగాను .అల్బినిజం ( Albinisim) వల్ల అని చెప్పింది.అల్బిజం అనేది శరీరం ఉత్పత్తి చేసే మెలనిన్ ( Melanin) మొత్తాన్ని ప్రభావితం చేసే అరుదైన జన్యు(genes) పరిస్థితి అని తెలిసింది.ఈ అల్బినిజం అనేది జన్యుపరమైన రుగ్మత.ఇది ఉన్న వారి చర్మం, కళ్ళు, జుట్టు చాలా తెల్లగా పాలిపోయినట్లు కనిపిస్తుంది అని చెప్పడమే కాకుండా ఇలాంటి వారు మామూలు వారికంటే చాలా సున్నితంగా ఉంటారని, ఇలాంటి పిల్లలు ఇలా బెదిరింపు లేదా వివక్షతను ఎదుర్కొంటూ ఉంటారని చెప్పినప్పుడు నాకు ఆ చిట్టి కన్నయ్య అరవింద్ అమాయక రూపం కళ్ళలో మెదిలింది. వాడు అవి రెండూ అనుభవిస్తున్నాడు. అంతేకాదు అతి గా సూర్య రశ్మి ( Sun Rays) ఎక్కువ తగలకుండా ఇటువంటి వాళ్ళ కు sunsreen లు పెడితే రక్షణ ఉంటుంది అనీ తెలిసింది.

ఆ రోజు నుండి ఆ కన్నయ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మొదలు పెట్టాను. చిన్ని చిన్ని కన్నయ్యలకు కన్నమ్మల చిట్టి బుర్రలకు అర్థమయ్యేలా అతడితో కలిసి మెలిసి ఉండాలని, వేరుగా చూడొద్దని చెప్పాను. పసివాళ్ళు కదా త్వరగానే అరవిందుకు దగ్గరయ్యారు.

ఆ కన్నయ్యను కూడా అమెరికోడు అని ఎవరు పిలిచినా పలకొద్దనీ అరవింద్ అంటేనే పలకాలని చిన్న చిన్నగా మార్పు వచ్చేలా చేశాను.
వాళ్ళ అమ్మను పిలిపించి ఆ పసివాడి మనసును అర్థం చేసుకొమ్మని,వాడిని ఎవరూ తాకకుండా, బెదిరంచకుండా జాగ్రత్తగా చూసుకొమ్మని చెప్పాను.

ఇంతకూ వాళ్ళు ఆ ఊరికి బతకడానికి వచ్చిన వాళ్ళు. ఆ సంవత్సరంలో కన్నయ్యలో చాలా మార్పు వచ్చింది .మామూలు పిల్లల్లా స్వేచ్ఛగా తిరిగే సమయంలో వాళ్ళు వేరే చోటికి వెళ్తున్నారని తెలిసింది.

తన కొడుకును అందరిలో కలిసేలా మార్చినందుకు కృతజ్ఞత చెప్పడానికి, తాము ఊరు నుండి వెళ్ళిపోతున్న విషయం చెప్పడానికి వచ్చిందా తల్లి.
అది విన్న అరవింద్ కన్నయ్య నన్ను చుట్టేసుకుని “నేను నీతోనే ఉంటా టీచర్! నేను వెళ్ళనని ఏడుస్తుంటే పిల్లలంతా వాడిని చూస్తూ ఏడవడం మొదలు పెట్టారు. నేను కూడా తట్టుకోలేక పోయాను.నాకు తెలియ కుండానే కళ్ళ నుంచి జారిన కన్నీళ్ళు వాడి తలమీద. తలెత్తి చిట్టి చేతులతో నా కళ్ళు తుడుస్తూ ” ఏడవకు టీచర్ మళ్ళీ వత్తా ! పిల్లల కళ్ళు కూడా తుడిచి వెక్కుతూ వెళ్ళిపోయాడు.
అలాంటి పిల్లలు కనబడినప్పుడల్లా అమెరికోడు కాదు కాదు అరవింద్ గుర్తొచ్చి గుండె బరువెక్కుతుంది.
వాడు ఎక్కడున్నా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉంటుంటాను.
—*__

Written by Urimalla Sunanda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆపద్బాంధవులు

శ్వేత ప్రపంచం