ఇంతవరకు జరిగిన కథ ఆమని మనవడి పుట్టినరోజు వేడుకను పూర్తి చేసుకున్న మైథిలి, మాలిని అదే ఊళ్లో ఉంటున్న పద్మిని, చంద్రిక ,హాసినిలను కూడా కలుస్తారు .గతంలో తామంతా ప్రైవేటు జూనియర్ కళాశాలలో కలిసి పని చేసిన కాలపు ముచ్చట్లతో పాటుగా ఇప్పటివరకు తమ పిల్లలపెండ్లిండ్లు మనవళ్ళు, మనవరాండ్ర ముద్దు మురి పాలను కూడా ఒకరితోమరొకరు పంచుకుంటూ తమ సమయాన్ని ఆనందమయం చేసుకొని తృప్తిగా ఎవరిళ్లకు వాళ్లు తిరిగి వెళ్లిపోతారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించలేని మైధిలి, మాలినితమ పాత ఉద్యోగంతోనే కుస్తీలు పడతారు.ఇటు ఇంట్లోనూ అటు బయట సమాజంలోనూ కూడా ప్రభుత్వోద్యోగి కాలేనందున మైధిలి ఎంతో వివక్షకు గురవుతుంది. భర్త అకాల మరణంతో వారసత్వపు క్షేత్రంలో అస్వతంత్రతకు బందీ అవుతుంది.అనుభవసారం ఒంటబట్టించుకున్న రామారావు దంపతుల జీవితం నిత్యవసంత మవుతుంది. హాసిని, చంద్రిక ,శాలిని మేడం గార్లు తమ జీవితాలను ఆక్రమించుకో జూస్తున్న ఆత్మ న్యూ నతా భావాలను సానుకూల దృక్పథంతో తట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు .భర్త యొక్క అనుమానపు జబ్బుకు విసిగి వేసారిన సువర్ణ బొటీక్ పెట్టుకుని స్వావలంబనతో జీవించాలనే స్థిర నిశ్చయంతో బెంగళూరులో ఉంటున్న తన కొడుకులు దగ్గరకు వెళ్ళిపోతుంది.
నానా తిప్పలు పడుతూ చంద్రిక ఎట్లాగైతేనేం ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం సంపాదించుకుని కుటుంబ భారాన్ని మోస్తూ పిల్లల్ని చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దుతుంది.భర్త శుక్లపక్షపు చంద్రుడే ఎప్పుడూ.పరాధీనగా ఇబ్బందులు పడుతున్న మాలిని తన స్వంత ఇంటికి వచ్చేస్తుంది)
ఇక చదవండి..
‘‘అదేగదా అడుగుతుంటా’’ అన్నా నవ్వుకుంటూ.
‘‘వాళ్లు తీసుకున్న అపార్ట్మెంట్లల్లో కప్‌బోర్డ్స్, టాయిలెట్స్‌లో కమ్మోడ్సు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాలిగదా. వీటన్నిటికీ వాళ్లు అపార్ట్‌మెంట్‌కు పెట్టిన మొత్తాన్ని పైన ఇలాంటి సౌకర్యాలన్నీ సమకూర్చుకోవటానికి ఇద్దరికీ చెరికొక నాలుగు, నాలుగు లక్షలైనా పడతాయని తెలిసింది. అదీగాక రేపో మాపో పెండ్లిండ్లు చేసుకుని స్థిరపడతారు. వాళ్ల మధ్య నేనెందుకు? కొడుకులు మనవాళ్లు గానీ, వచ్చే కోడళ్లు మనం అనుకున్నంత మాత్రాన మనవాళ్లు అవ్వరుగదా. ఇక నేను ఏమాత్రం చికాకులను పడలేను మైథిలీ. అందుకే నేను స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నా’’ అంది చివరిగా.
ఇది అసలు సంగతని నాకు తెలుసు. తనేం చెబుతుందోననే చిన్న సందేహం అంతే నాది.
‘‘వచ్చేవారమే ప్రారంభోత్సవం. నువ్వు రా మైథిలీ’’ అంది
‘‘సరే’’ అన్నా సంతోషం నిండిన గొంతుకతో.
‘‘తేదీ అదీ చెబితే టికెట్ బుక్ చేయించుకుంటాను’’ అన్నా సువర్ణతో.
‘‘రెండు ముహూర్తాలు చూడమన్నాం పంతులుగారితో. మళ్లీ ఈరోజు నవీన్ మాట్లాడతానన్నాడు ఆయనతో. ఒక వారం రోజులు లేదా రెండో మూడు రోజుల్లో అంతే. ఎక్కువ తేడా ఉండదు. తేదీ ఖరారుకాగానే ఫోన్ చేసి చెబుతా. తప్పకుండా రావాలి’’ అంటూ ఫోన్ పెట్టేసింది.
పురుషాధిక్య సమాజంలో పడి శలభాల్లా మాడిపోతున్న అబలలు ఎంతోమంది. ఆ చట్రం నుండి బైటపడి స్వావలంబన దిశగా గట్టి అడుగులు వేస్తూ భావి జీవితాన్ని స్వశక్తితో నిండిన వెలుగులతో మలుచుకుంటూ పదుగురికీ ప్రేరణదాయకంగా నిలుస్తున్న మహిళా లోకంలో స్వీయ కాంతి పుంజాలై వెలుగుతున్నారనటానికి శాలినిగారు, చంద్రిక, మాలిని, సువర్ణలాంటివారు మేలిమి ముత్యాలు.
వ్యసనాల బారిన పడి తమను తాము కోల్పోతూ, తమ కుటుంబాలను కూడా నష్టపరచుకుని చరిత్ర హీనులుగా కొంతమంది మిగిలిపోతుంటే రామారావుగారు లాంటి వాళ్లు మేల్కొని తమ కుటుంబాలను, తననే నమ్ముకున్న భార్యా బిడ్డలకు నీడనిచ్చి, ఆహ్లాదాన్ని పంచే తరువులుగా మారుతూ నేటి సంఘంలో చక్కని పేరు, ప్రఖ్యాతులను తిరగ రాసుకుంటూ స్ఫూర్తిదాయకంగా వెలుగులీనుతున్న మర్యాదా పురుషోత్తములై కొందరు.
పరిస్థితులు గుణపాఠాన్ని నేర్పిస్తున్నా, అహం విషవృక్షాలై అనుమానపు వట వృక్షాలై సమాజంలో చీడపురుగులుగా ఛీత్కారాలకు గురవుతున్న వారిలో సువర్ణ లాంటి, హాసిని లాంటి వాళ్ల ఆయనలు, శాలిని మేడమ్ గారి భర్తలాంటి వాళ్ళు ఎందరో.
***
మైథిలిది ఒక బంధు ద్వీపం. బంధువులు చుట్టూరా ఉంటారు. కానీ ఈ ద్వీపంలో ఉప్పు సముద్రాలు ఎక్కువ. ఈ నీళ్లు తాగటానికి పనికిరావు. స్నేహ సేద్యానికి అసలే పనికిరావు. ఎంత అనురాగ వాత్సల్యాలు క్రుమ్మరించినా దక్కేది హుళక్కే. మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందంటారు చాలామంది. కానీ ఇలాంటి సూత్రాలేవీ వంటబట్టించుకోని మాయాద్వీపమిది. లేనివి ఉన్నట్లుగా, ఉండాల్సినవి మచ్చుకైనా కానరానీయని మాయల మరాఠీలతో రాటు దేలిన ద్వీపం.
తీసుకోవటమేగాని, ఇవ్వటం తెలవని రాతి విగ్రహాలుంటాయి ఇక్కడ. వీటిపై ఎంత ఆప్యాయత కురిపించినా కరగవు సరికదా! ఆప్యాయతా వృష్టిని కూడా తెగతాగి, కలుపు మొక్కలుగా బలిసి, కుటుంబ పూలవనాన్ని శాసిస్తాయి. ఈ కలుపు మొక్కల నీడలో ఏ మొక్కలూ వెన్ను నిలిపి ఎదగలేవు.
సముద్రంలాంటి జీవితంలో ఎన్ని సంవత్సరాలు శోధించినా నత్తగుల్లలూ, రాళ్లూ రప్పలే దర్శనమిస్తాయి. ఉప్పునీరు గదా! ప్రేమగా, అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల మధ్య సైతం ప్రేమను విరగ్గొడతాయి. కలుపు మొక్కలేమో వేటినీ స్వతంత్రంగా ఎదగనీయకుండా తమ కబంధ హస్తాలతో నుగ్గు నుగ్గు చేస్తుంటాయి జీవితాలను. ఇక మైథిలి లాంటి తులసి మొక్కలేం ఎదుగుతాయి ఇట్లాంటి చోట.
వంటలో ఉప్పు ఎలా తగు పాళ్లలో ఉండాలో అలాగే మైథిలి ఈ మాయా జాలాలను మరీ రాసుకోవటం, పూసుకోవటాలు చేయకుండా బాధ్యతలను నిర్వర్తించాల్సిన చోట బాధ్యతలను స్వీకరిస్తూ నడుస్తుంటుంది.

ఐనాగానీ మైథిలి కుటుంబంలో జరిగే వేడుక సమయాలను,
శుభసందర్భాలను ఓర్వలేని అనుబంధాలు తుఫాన్, సునామీల మాదిరిగా ద్వేషాల అనకొండలవుతూ విజృంభిస్తాయి. ఇలాంటి విపత్కర సందర్భాలను దాటి, తన కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో అనుభవ పాఠాల ద్వారా ఎన్నో నేర్చుకుంది జీవితంలో.
మెట్టినింటి బంధాల ద్వారా ఎదురవుతున్న బాధలను ఇన్నేళ్లూ తనలో తానే దాచుకొని కుళ్ళిపోయేది. ఇక లాభం లేదు. తన భర్తకు తెలిసేట్లు చేయాలనే దృఢమైన నిర్ణయానికి వచ్చింది పిల్లల సలహాతో మైథిలి.
ఒకరోజు ఉదయంపూట పూరీలు చేస్తోంది టిఫిన్‌కు. ఇంటిపక్కనే ఉన్న ఆడబిడ్డ పిల్లలిద్దరు మైథిలి వాళ్లింట్లోనే ఎక్కువగా ఆడుకోవటం, టి.వి. చూడటం చేస్తుంటారు. ఆరోజు ఉదయం కూడా రోజూలాగానే వచ్చి, అడుకుంటున్నారు. మైథిలిది కల్మషం లేని మనస్తత్వం. తన పిల్లలతోపాటే వాళ్లిద్దర్నీ కూడా పిలిచింది ‘పూరీలు పెడుతున్నా తినటానికి రమ్మంటూ’.
ఆ పిల్లలిద్దరూ ఆడేఆటలు వదిలేసి గభాలున పరుగెత్తుకుంటూ వాళ్లింటికెళ్లి పోవటం చూసి, మైథిలి భర్త కోపంగా…
ఏం మా అక్క పిల్లలకు పెట్టేవే నీకు ఎక్కువైపోయాయా? అంటూ థుమథుమ లాడిపోయాడు మైథిలిమీద.
మైథిలి మొహం చిన్నబోయింది. విషయం ఇదీ… అని చెప్పినా నమ్మడు భర్త. వాళ్ళ వాళ్ళ మాటంటే అంత తీపి. కనీసం నేనేం చెబుతున్నానో వినిపించుకోవాలనే ఆలోచనే ఉండదు. ఇదీ అని గట్టిగా చెప్పే అవకాశమే ఇవ్వడు. తమ్ముడు మా మాటే వింటాడు. మేం ఏం చెబితే అదే. భార్య మాటకు విలువివ్వడు అనే ఉద్దేశ్యం అర్థమైపోయి వాళ్లంతా నా భర్తముందు ఒకలాగా, ఆయన ఇంట్లో లేనపుడు నాతో ఒకలాగా ప్రవర్తిస్తారు. అది అర్థం కాదు ఈయనకి. నాకు పెట్టుపోతలేవీ తెలియని దానిలాగా, బంధువులను, వారి పిల్లలను ఆదరించని దానిలాగా చిత్రీకరించి తమ్ముడి మనసులో గిట్టనిదానిలాగా గట్టిగా ముద్రించారు. దీన్ని ఎలాగైనా బద్దలు కొట్టాలనే నిశ్చయించుకున్నాను ఈరోజు. ఎన్నాళ్లు ఓపిక పట్టాలి. నాలో ఉన్న ఓపిక నశించిపోతోంది. ఒకరోజు ఒక సంఘటన అయితే సర్దుకుపోవచ్చు. కానీ పదే పదే రిపీటవుతుండటంతో మా ఆడబిడ్డల ఓర్వలేని తనాన్ని మావారి కండ్లకు చూపించాలనుకున్నాను. దీనికి తీవ్రమైన అవరోధం ఎదురై తీరుతుంది అన్ని వైపుల నుండి. అయినా సరే ఇన్నాళ్లూ తట్టుకున్న వాటిముందు ఇది పెద్ద సమస్యగా అనిపించలేదు నాకు.
చిర్రు బుర్రు లాడుకుంటూ మైథిలిని చురచురా చూసి ఆఫీసుకెళ్ళిపోయాడు భర్త.
చేయని తప్పుకు మాటలు, నిందలు పడాల్సొస్తోందనే బాధ నిలువెల్లా దహిస్తోంది మైథిలిని.
మళ్లీ అదేరోజు సాయంత్రం ఆ పిల్లలు శ్రీనూ, వెంకూ ఇద్దరూ వచ్చి, హాల్లో ఆడుకుంటున్నారు మా ఇంట్లో.
హాల్లో కుర్చీలో కూర్చుని టి.విలో వార్తలు చూస్తున్న వాళ్లాయనకు టీ తెచ్చిచ్చి, తానూ కుర్చీ లాక్కుని దగ్గరగా జరుపుకుని కూర్చుంది మైథిలి.
ఆ పిల్లలిద్దర్నీ దగ్గరకు పిలిచింది మైథిలి. వాళ్లొచ్చారు.
‘‘అవును శ్రీనూ, వెంకూ పొద్దున్న పూరీలు తిందురుగానీ ఉండండంటే ఎందుచేత గభాల్న పరుగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారెందుకు?’’ అని అడిగింది మైథిలి.
‘‘అత్తయ్య తినమని పిలిచినప్పుడు ఎందుకు వెళ్లిపోయార్రా?’’ అని అడిగాడు మైథిలీ వాళ్లాయన ఆ పిల్లల్ని.
‘‘మరేమో… మరేమో…’’ అంటూ బిక్కమొగమేశారు పిల్లలు, మావయ్యను చూస్తూ.
‘‘ఏం కాదు! నేనేమీ కోప్పడనులే! చెప్పండి’’ అన్నాడు వాళ్లను అనునయంగా దగ్గరకు తీసుకుంటూ.
‘‘మా అమ్మ… మా అమ్మ… మామయ్య ఇంట్లో ఉన్నప్పుడు మీ అత్తయ్య ఏం పెట్టినా తినద్దు. తింటే కొడ్తానంది’’ అన్నాడు పెద్దాడు భయంగా.
‘‘ఎందుకురా వెంకూ?’’ అని చిన్నాడివైపు చూస్తూ అడిగినదానికి బదులుగా

‘‘ఏమో మామయ్యా! నువ్వు లేనప్పుడైతే మేము ఏమైనా ఇక్కడ తినచ్చట. ఉంటే మాత్రం తినవద్దట!’’ అన్నాడు వెంకూ అయోమయంగా.
‘‘అత్తయ్య మాకు చాక్లెట్లిస్తుంది. బనానాస్ ఇస్తుంది. పీచుమిఠాయి కొనిపెడుతుంది. కానీ నువ్వు ఇంట్లో ఉన్నప్పుడిస్తే మాత్రం వద్దు తినద్దు, ఇంటికొచ్చేయమని తిడుతుంది మా అమ్మ’’ అన్నాడు.
ఇదంతా వింటున్న శ్రీను భయం భయంగా చూస్తున్నాడు. ఇదంతా తెలుసుకుని వాళ్లమ్మ ఎక్కడ దెబ్బలు కొడుతుందోననే భయం ఆ పిల్లాడి మొహంలో స్పష్టంగా కనపడుతోంది.
దీంట్లో మర్మమేంటో ఇప్పటికైనా అర్థమైందా? అన్నట్లు భర్తవైపు చురుగ్గా చూసి వంటగదిలోకి వెళ్లిపోయింది మైథిలి.
తన అక్క చెల్లెళ్లది ఎలాంటి నైజమో తెలుసు మైథిలి భర్త అయిన ప్రకాష్‌కి. అవసరాలకు మనుషుల్ని వాడుకుని అవసరం తీరిపోయాక పూడ్చిపెట్టేరకం.
మైథిలి మీద నాలో అపోహలను పెంచి చెడ్డదానిగా చూపిస్తూ పబ్బాలు గడుపుకునే బుద్ధి ఇంకా మారనందుకు చింతిస్తున్నాడు లోలోన.
తన అక్క చెల్లెళ్లది ఎలాంటి తక్కువ స్థాయి మనస్తత్వమో తెలుసుకానీ మైథిలి ముందు బయటపడి చులకన కావటం ఇష్టముండదు.
ఎప్పుడూ మీవాళ్లిట్లా! అని భర్త ప్రకాష్‌తో పల్లెత్తు మాట కూడా అని ఎరుగదు. మైథిలి మంచి మనస్తత్వం ఇప్పుడిప్పుడే అర్థం చేసుకోగలుగుతున్నాడు. జరిగిన విషయాలు చెప్పి, తన అప్పచెల్లెళ్లతో జగడాలు పెట్టించదు. కానీ లోలోపల తాను ఏం బాధపడుతుందోగాని, నా దగ్గర ఏమాత్రం బయట పడదు. పశ్చాత్తాపం లాంటిది కలగసాగింది ప్రకాష్‌లో.
ఇంతలో ఓ డబ్బాలోంచి కచ్చామ్యాంగో చాక్లెట్లు తీసి శ్రీనూ, వెంకూలకు చెరో రెండు చేతిలో పెట్టింది.
‘‘తినండి. మీరేం భయపడకండి. మీ అమ్మ ఏమీ అనదులే. నేను మాట్లాడుతా మీ అమ్మతో. నేనిచ్చినా, అత్తయ్య ఇచ్చినా ఎవరిచ్చినా ఒకటే. తీసుకుని తినాలి తెలిసిందా?’’ అన్నాడు పిల్లలిద్దన్నీ దగ్గరకు తీసుకుంటూ ప్రకాష్.
పిల్లల మొహాల్లో భయంపోయి సంతోష ఛాయలు అలుముకున్నాయి. చాక్లెట్లు తింటూ టి.వి చూడసాగారు. ఇంతలో హోమ్ వర్క్ పూర్తి చేసుకుని మైథిలీ వాళ్ల పిల్లలు కూడా లోపలికి వచ్చి కూర్చుని చాక్లెట్లు తింటూ టి.వి. చూడసాగారు.
బెడ్రూంలో బట్టలు మడతపెడుతుండగా ప్రకాష్ లోపలికి వచ్చి, తులపులు వారగా వేసి ‘‘సారీ మైథిలీ… ఇన్ని రోజులూ తప్పులు మాలో ఉంచుకుని, నిన్ను నిందించా!’’ గతంలో కూడా అనేక సందర్భాల్లో వాళ్ల వాళ్ల మాటలు విని మైథిలిని చిన్నచూపు చూస్తూ ఏవగించుకున్న సందర్భాల్ని గర్తు చేస్తున్న భర్త నోటిని తన చేత్తో మూసేస్తూ…
‘‘గతం గతః మీరు నిజాలు గ్రహించారు. అది చాలు నాకు’’ అంటూ తిరిగి ఆ చేదును గుర్తు చేసుకోవటాన్కి ఇష్టపడటం లేదన్నట్లుగా చూసింది భర్త కండ్లలోకి. ఆ కండ్లలోని అపరాధ భావం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.
‘‘నన్ను క్షమించు మనః స్ఫూర్తిగా’’ అంటూ మైథిలి నుదురును చుంబించాడు ప్రేమగా ప్రకాష్.
***
మైథిలి వంటింట్లో పనిలో ఉండగా ఫోన్ మోగిందో ఏమో వినపడలేదు బహుశా అది వాట్సాప్ కాల్ కావచ్చు. పనంతా పూర్తి అయి హాల్లోకి వెళ్లింది మైథిలి. పొద్దున్నే ఫోన్ పట్టుకునే అలవాటు లేదు. ఏవైనా ముఖ్యమైన కాల్స్ వచ్చాయేమోనని చూసుకుంటే, కమల నుండి రెండుసార్లు ఫోన్ కాల్ వచ్చినట్లుగా ఉంది. సమయం ఉదయం పదిగంటలుగా సూచిస్తోంది. ఈరోజు సెలవు రోజు కాదు. కమల తరచుగా ఫోన్ చేసి మాట్లాడే సాయం సమయాలు కాదు. ఏదో అత్యవసరమైన విషయం చెప్పటానికే ఫోన్ చేసివుండవచ్చు. ఎందుకైనా మంచిదని కమలకి లైన్ కలిపింది. దీనికోసమే ఎంతో సేపటి నుంచి ఎదురు చూస్తున్నదనటానికి గుర్తుగా వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది కమల.
‘‘హలో… మైథిలీ… బాగున్నావా?’’ అని పలకరించింది.
‘‘ఆ… బాగానే ఉన్నా కమలా. ఈరోజు వంటగదిలో కొంచెం పని ఎక్కువగా ఉండి, వాటిని తెముల్చుకుని హాల్లోకి వచ్చేసరికి ఇదిగో ఈ టైమయింది’’ అంటూ గోడకున్న గడియారం చూసింది, పదకొండు దాటింది.
‘‘సారీ కమలా… వెంటనే ఫోన్ చూసుకోలేకపోయానని’’ చెప్పింది మైథిలి బాధతో.
‘‘ఫరవాలేదు… ఏమైందిలేగానీ… పనిలో ఉంటే ఎవరమైనా అంతేగదా’’ అని నవ్వింది కమల.
‘‘అసలు విషయమేంటి? ఎంతో అత్యవసరమైన సమాచారం చెప్పటానికి తప్ప ఉదయంపూట… అందునా ఆఫీస్ టైంలో చేయ్యవుగదా! రెండుసార్లు కాల్స్ వచ్చినట్లు కనబడేసరికి నాకు కొంచెం భయమేసి వెంటనే చేశా’’ అంది మైథిలి.
‘‘అబ్బే… అదేం లేదులేగానీ… నా మనసుకు తెరుపునిచ్చిన విషయాన్ని నీతో పంచుకోవాలనిపించి చేశాను. ఈరోజు ఆఫీస్‌కి సెలవు పెట్టా’’ అన్నది కమల.
మళ్ళీ తనే ‘‘నేను ఎదురు చూస్తున్న విడాకుల కాగితాలు నిన్నే నాకు అందాయి, మా లాయర్ గారి ద్వారా’’ అంది.
కమల గొంతులో ఎంతో రిలాక్సేషన్ వినపడిరది మైథిలికి. తను ఎంతగానో ఎన్నాళ్లనుండో ఈ రిలీఫ్ కోసమే ఎదురు చూస్తోంది.
‘‘గుడ్ కంగ్రాచ్చులేషన్’’ అన్నా.
‘‘ఇంకో గుడ్ న్యూస్ మైథిలీ’’ అంది మళ్లీ కమల.
‘‘ఏంటి కమలా? శుభవార్తలమీద శుభవార్తలు చెబుతున్నావ్! మీ చరణ్‌కు ఉద్యోగమేదైనా వచ్చిందా? పార్టీ ఇవ్వాల్సిందే! తప్పదు…’’ అన్నా కమలతో.
‘‘అదికాదు మైథిలీ! నాకు సీనియర్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ వచ్చింది. మా బాస్ నిన్న తన క్యాబిన్‌కు పిలిచి ప్రమోషన్ ఆర్డర్స్ చేతికిచ్చారు’’ అంటూ చెప్పింది సంతోషంగా.
ఇక అన్నీ మంచిరోజులే. కమల జీవితానికి పట్టిన శని వదిలిపోయింది అనుకున్నా మనసులో.
‘‘ఇంకో సర్ప్రైజ్’’ అంది అట్నుంచి ఫోన్లో.
‘‘ఓయ్… తప్పదు గ్రాండ్ పార్టీ ఇవ్వాలి, మన ఫ్రెండ్సందరికీ…’’ అన్నా.
‘‘అయితే ఓకే’’ అంది మరింత సంతోషంగా కమల.
‘‘పార్టీ అని అడిగావుగానీ, సర్ప్రైజ్ ఏంటో అడగవా?’’ అంది కొంచెం దబాయిస్తున్న స్వరంతో కమల.
‘‘ఓ… మర్చేపోయాను సుమా! చెప్పు తల్లీ త్వరగా’’ అంది మైథిలి.
‘‘నేను మీ ఊరి దగ్గరకే వచ్చేస్తున్నా… నాకు ప్రమోషన్ ఎక్కడికిచ్చారో తెలుసా? గుంటూరుకే’’ అంది సంతోషం నిండిన స్వరంతో.
‘‘వావ్! ఇది నిజంగానే గొప్ప శుభవార్త కమలా. ఎప్పుడు జాయినింగ్?’’ అంది మైథిలి
‘‘వారం రోజులు గడువిచ్చారు, విధుల్లో చేరటానికి’’ అంటూ ‘‘నేను ఎల్లుండే వస్తున్నా’’ అంది కమల.
‘ఇటు విజయవాడ డైరక్టుగా వచ్చి, ఒక పూట ఉండి, గుంటూరు వెళ్ళు’’ అంది మైథిలి కమలతో.
‘‘అదికాదుగానీ, డైరెక్టుగా గుంటూరు ఆఫీసుకే వెళ్ళి జాయినయి, ఓ వారం రోజులు సెలవు పెట్టుకుంటా’’ అంది కమల.
‘‘ఐతే నా దగ్గరకు రావా?’’ అంది మైథిలి చిరు అలక నిండిన గొంతుకతో.
‘‘ఓ… అప్పుడే కోపమొచ్చేసిందన్నమాట మైడియర్ మేడమ్‌గారూ’’ అంటూ అలకేల ఓ భామినీ అనే చరణం అందుకుంది కమల తన తీయని గొంతుకతో.
అటు నుంచి పాట వినపడగానే మైథిలి నుండి చిరునవ్వుల జల్లులు కురిసి మురిపించాయి కమలని.
‘నిన్నెలా నా రూట్లోకి రప్పించుకోవాలో తెలుసులే నాకు’ అని మనసులో అనుకుంటూ `
‘‘ఎల్లుండి గురువారం రాత్రికల్లా నీ దగ్గరకు చేరుకుంటాను. శుక్రవారం జాయినవుతా. ఆ తర్వాతెలాగూ శని, ఆదివారాలే కాబట్టి పిల్లలిద్దరూ శనివారం
ఉదయానికల్లా వస్తారు విజయవాడకు’’ అని కమల చెప్పటంతో…
నిజంగానే ఎంతగానో సంతోషించింది మైథిలి.
‘‘సరే నువ్వు విజయవాడ వచ్చేముందు ఫోన్ చెయ్యి. అయ్యో మర్చిపోయా మాటల సందట్లోపడి, నువ్వు చెప్పిన శుభవార్తలకు ఫోన్లో అభినందనలు చెప్పి, విష్ చేయటం సరిపోదులేగానీ… నీకు రవ్వ పూర్ణాలంటే ఇష్టం గదా! రుచిగా తయారుచేసి నీ రాకకోసం ఎదురుచూస్తుంటా… ఫోన్ పెట్టేస్తున్నా’’ అని చెప్పింది మైథిలి.
ప్రతిగా ‘‘బై… బై… సీ… యూ’’ అంటూ కమల కూడా ఫోన్ పెట్టేసింది.
***
సువర్ణ టైలరింగ్ దుకాణం మూడు పువ్వులు తొమ్మిది కాయలుగా వర్ధిల్లుతోంది. ఇటు భార్గవ్, అంటే సువర్ణ పెద్ద కొడుకు పనిచేసే సాఫ్ట్వేర్ కంపెనీలోని లేడీస్ నుండి, చిన్న కొడుకు నవీన్ పనిచేసే సాఫ్ట్వేర్ కంపెనీలోని లేడీస్‌లో చాలామంది సువర్ణ దగ్గరకే వచ్చేవారు. ‘‘బాగా కుడుతున్నారు ఆంటీ’’ అంటూ వాళ్లకి నచ్చిన డిజైన్లు సెలక్టు చేసుకుని కుట్టించుకునేవారు. కొంచెం తక్కువ రేటుకే కుట్టటంతో బేరాలు బాగా పెరిగాయి. దాంతో ఆదివారాలు, సెలవు రోఉలు, పండుగ రోజులంటూ లేకుండా శ్రమపడుతోంది సువర్ణ.
‘‘అమ్మా ఇలాగైతే ఎట్లా? నీ ఆరోగ్యం పాడవదా?’’ అని భార్గవ్ అన్నాడు.
‘‘నాన్నా భార్గవ్! ఇప్పుడిప్పుడే కదా పుంజుకుంటున్నాం…’’ అంది సువర్ణ కొడుకుతో.
‘‘అదికాదమ్మా… నువ్వు కటింగ్ చేసి ఇస్తుండు. వాళ్లు కుడతారు. నువ్వు పై ఎత్తున సూపర్వైజ్ చేస్తూవుండు. క్యాష్ కౌంటర్లో ఉండు’’ అన్నాడు మళ్లీ భార్గవ్.
‘‘నిన్న ఒక కార్పొరేట్ పాఠశాల వాళ్ళ నుండి స్కూల్ యూనిఫారమ్స్ కుట్టటానికి ఆర్డర్ వచ్చినదని చెప్పావుగా అమ్మా… ఒకే చేశావా?’’ అనడిగాడు నవీన్.
‘‘ఆ… మొదటి విడత ఎంత పే చేయాలో, డ్రస్సులన్నీ వాళ్లకు అప్పచెప్పేటప్పుడు మొత్తం ఎంత పే చేయాలో… ఆ వివరాలన్నీ ఈరోజు ఉదయం మాట్లాడి నిర్ణయించేశా’’ అంది సువర్ణ నవీన్‌తో.
‘‘అమ్మా! నువ్వు ఇంకో ఇద్దర్నో, ముగ్గుర్నో పనిలోకి తీసుకోమ్మా… పనిభారం కూడా పెరుగుతోందిగా’’ అన్నాడు భార్గవ్.
‘‘అవును నేను కూడా అదే అనుకుంటున్నాను’’ అంటూ షాపు ప్రారంభం చేసిన తొలిరోజుల్లో కుట్టుపనికి వస్తామని కొందరొచ్చి అడిగితే, మేము పెట్టింది ఈ మధ్యనే, బేరాలు పెరిగాక తీసుకుంటానని చెప్తూ, వాళ్ల ఫోన్ నెంబర్లు, పేరు అది రాసుకున్నాను నోట్సులో’’ అంటూ టేబుల్ సొరుగు లోంచి నోట్స్ తీసి అందులోని నెంబర్లకు ఫోన్ చేసి ‘రేపు వచ్చి కలవండి షాపుకు’ అని చెప్తే వాళ్లు వస్తామన్నారు సువర్ణతో.
తమ మాటలు విని వదిలెయ్యకుండా వర్క్ర్స్ని పెంచుకుంటుంన్నందుకు సంతోషపడ్డారు కొడుకులిద్దరూ.
***
ఏదో బింకంగా కొద్దికాలం పట్టుదలగా వండుకు తిన్నాడు. సార్ ఒక్కరేగదా! ఏం పనుంటుందిలే అని పనమ్మాయి కూడా ఈ మధ్య బాగా ఎగ్గొడుతుందట. పనమ్మాయి ఉందిగాని, వాషింగ్ మిషన్ జోలికెళ్లకుండా, బట్టలు ఆమెకే వేస్తున్నాడట. అది సరిగా ఉతకట్లేదట. రెండు రోజులకొకసారి వచ్చి పైపైన డొల్లిచ్చి వెళ్ళిపోతుందిరా!’’ అని తన గోడు చెప్పుకున్నాడట పెద్ద కొడుకు భార్గవ్‌తో, తండ్రి నాగు ఫోన్లో.
‘‘వినీ విననట్లు ఊరుకున్నా నవీన్…’’ అని చెప్పాడు తమ్ముడితో.
‘‘అమ్మ ఉండి అన్ని సేవలూ చేస్తూ, వండి పెడుతుంటే తెలవలేదు నాన్నకి’’ అని మండిపడ్డాడు నవీన్.
‘‘ఇక్కడికి వస్తానంటే, నువ్వు మాత్రం నాన్నని రమ్మని చెప్పద్దన్నయ్యా’’ అన్నాడు కోపంగా.
‘‘ఇంకా కొద్దికాలం పోవాలి. అమ్మ విలువేంటో తెలవాలి నాన్నకు’’ అన్నాడు భార్గవ్, నవీన్‌తో.
‘‘ఇప్పుడే ఈ విషయాలేమీ అమ్మకు చెప్పద్దు మనం’’ అని అన్నదమ్ములిద్దరూ గట్టి నిర్ణయానికి వచ్చేశారు.
***
ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ చాలా రోజులైంది నాగూగాడిరటికి వెళ్ళక… అని అనుకుంటూ వెళ్ళారు.