ధనుర్మాసం ప్రారంభం అయింది. ఆ విశేషాలు మరిన్ని తెలుసుకుందాం.
డిసెంబర్ 16 వ తేదీన బ్రహ్మ ముహూర్తం తో ప్రారంభం అయిన ధనుర్మాస పూజా విధానం అందరూ ఆచరించవచ్చు. గోదాదేవి జన్మించిన విషయం ఆసక్తికరమైన విషయం. ఆమె పెరిగి , శ్రీ విష్ణు మూర్తి ని చేరుకోవడం అనే ప్రయాణం లో సంగీత సాహిత్య కళాత్మకమైన జీవితం ఉన్నది. గోదమ్మ భగవంతుడినే భర్తగా భావించి, అతనిలో లీనమై పోయేందుకు సంకల్పించిన వ్రతం పేరే తిరుప్పావై. దీని వ్యుత్పత్తి ని తెలుసుకుందాం. “తిరు” అంటే “శ్రీ ” అని అర్థం. అలాగే ” పావై” అంటే “పాటలు “అనీ “వ్రతం ” అనీ అర్ధాలున్నాయి. గాన రూపం లో దేవుడి ని కొలవడం.
తిరుప్పావై విశేషాలు తెలుసుకుంటే,తిరుప్పావైలో 30 పాశురాలు ఉన్నాయి. పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాట. ఆండాళ్ , గోదాదేవి అపురూప భక్తి పారవశ్యాన్ని కావ్యం గా రచించాడు శ్రీకృష్ణ దేవరాయలు . ఈ కావ్యం పేరు “ఆముక్తమాల్యద ” అంటే వేసుకుని విడువబడినది అనే అర్థం. అన్ని వ్రతఆలకఉన్నట్టఏ తిరుప్పావై వ్రతానికి కూడా కొన్ని విధివిధానాలు , నియమాలు ఉన్నాయి. తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే స్నానమాచాలి. ప్రారంభ శ్లోకాలు చదువుకున్న తర్వాత క్రమం తప్పకుండా రోజొక్క పాశురం ప్రతి రోజూ స్వామి కీర్తనలగా పాడాలి. సృష్టిలో భగవంతుడు ఒక్కడే పురుషుడు అనీ మనుషులంతా స్త్రీలు అనే ఉద్దేశంతో విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు మన పెద్దలు. స్త్రీ పురుష సంబంధాల విశిష్టత అందరికీ తెలిసిందే. కొన్ని బంధాలతో భావిస్తాం. అలాంటి శ్రీ మహావిష్ణువును భర్తగా పొందాలనే తలపుతో గోదాదేవి సంకల్పం పెట్టుకుని ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతం ఇప్పటికీ మహిళలు ఆచరిస్తుంటారు. అయితే పెళ్లి అయినవాళ్ళు కాని వాళ్ళు , స్త్రీ పురుషులు ఇద్దరూ చేయవచ్చు. ధనుర్మాసం మొదటిరోజున ఈ పూజ ను ఈ వ్రతాన్ని ఆరంభించి, సంక్రాంతి పండుగ లలో భోగిరోజున ఆండాళ్- శ్రీరంగనాథుల కల్యాణాన్ని జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది.
భూదేవే ఆండాళ్ అని అంటారు. ఆకాశం స్వామి వారు అనుకున్నప్పుడు భూమి మీదే బ్రతికే మనుషులంతా ఆ దైవ శక్తి అనుగ్రహం కోసం పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు .
శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం భక్తిలో మునిగితేలే వాళ్ళ ను , భగవంతుని వర్ణిస్తూ ప్రజలకు చెప్పేవాళ్ళను ”ఆళ్వారులు” అంటాం. మన భారత దేశం సంప్రదాయం లో పన్నెండుమంది ఆళ్వారుల్లో ఉన్నారు. వాళ్ళ లో విష్ణుచిత్తుడు మొట్ట మొదటివాడు. తన కూతురు గోదాదేవికి విష్ణు మూర్తి పైనుండాల్సిన భక్తిసంపదలను వారసత్వంగా ధారాదత్తం చేశాడు. భూదేవే ఆండాళ్ అంటారు. శ్రీరంగనాథుని పూజ కోసం విష్ణుచిత్తుడు తులసితోట పనులు చేస్తుంటే గోదా దేవి దొరికింది. సాధారణంగా తులసి ఆకులు భగవంతుని పూజ కోసం వినియోగం కాని మరే ఇతరాలకూ వాడరు. అటువంటి తులసివనంలో దొరికింది . ఆండాళ్ అసలు పేరు కోదై. ”కోదై” అంటే మాలిక అని అర్థం. కోదై గోదాగా మారింది. భక్తి ముక్తి కి సంబంధించిన వ్రతం ధనుర్మాస పూజ.
అలవాట్లు మనుషుల తత్వాన్ని చెప్పేవి. సమాజానికి సాయపడేలా జీవించాలని, తోటివారికి మనుషులు గా గుర్తించాలని చెప్పే విధానం ఉంటుంది ఇందులో. భగవంతుని ఆరాధించాలనీ, భక్తి శ్రద్ధలతో పూజించడం శక్తి సంపన్నతలను ఇస్తుంది. సాత్విక జీవనం అలవడుతుంది. ఇంతకన్నా ఏం కావాలి? ఒక్కొక్క పాశురం 30 రోజులు చదవాలి.
అయితే ఈ పాశురాలలో
మొదటి 5 పాశురాల భావాలలో ఉపోద్ఘాతం , ఉద్దేశ్యం ఉంటుంది.
పాశురాలు- భావాలు – విశ్లేషణ:-
మొదటి పాశురము: గోదాదేవి ను ఆండాళ్ అంటాం. గోదమ్మ తాను చేయబోయే ధనుర్మాస వ్రతం లోని పారాయణ మైన తిరుప్పావై పాశురాల అర్థాలు తెలుసుకుందాం.
ఆండాళ్ గొల్ల భామలను, కాలాన్ని ప్రశంసిస్తూ, భగవంతుని లో ఐక్యం కావాలని కోరుకోవడం మాత్రమే మన అంతిమ లక్ష్యమని చెబుతుంది. ఈ లక్ష్యసాధనమనే విషయాన్ని ప్రశంసిస్తూ, కృష్ణానుభవం పొందాలనే సంకల్పం తో మార్గళి నోముని పాటించాలని బలం గా నిశ్చయించుకుంది.
పాశురం -1
మార్గళి త్తింగల్ మది నిఱైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుమ్ ఆయ్ ప్పాడి శెల్వచ్చిఱు మీర్గాళ్
కూర్వేల్ కొడుం తొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏర్ ఆర్ న్ద కణ్ణి యశోదై యిళంశింగమ్
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్!”
భావం:-
భగవంతుని కీర్తించడానికి భక్తి తో పూజించి సకల ఐశ్వర్యాలు పొందడానికి గోదాదేవి ఇలా అంటుంది-
” ఓహో ! ఇది మార్గశీర్ష మాసం. వెన్నెలలు నిండి ఉండే మంచిరోజులు . అందమైన ఆభరణాలు ధరించిన ఓ పడుచులారా! సకల ఐశ్వర్యాలతో తులతూగుతున్న వ్రేపల్లెలో ఆరోగ్యానందాల సంపదలతో తులతూగుతున్న ఓ బాలికలారా! ఈ మార్గశీర్ష స్నానం చేయాలనే సంకల్పమున్నట్టైతే ఇక్కడికి రండి… ముందు కు నడవండి. వాడిదైన గొప్ప వేలాయుధాన్ని ధరించి మనందరికీ ఏ విధమైన ఆపద లు రాకుండా కాపాడుతున్న నందగోపుల కుమారుడు, అందమైన కన్నులతో అలరుచున్న యశోద యొక్క బాల సింహం, నీలమేఘశ్యాముడు, ఎఱ్ఱ తామరలపోలిన కన్నులు కలవాడునూ, సూర్యుని లా ప్రకాశాన్ని, చంద్రునిలా ఆహ్లాదాన్ని ఇవ్వగల వాడూ, దివ్యమైన ముఖమండలమున్నవాడూ అయిన నారాయణుడే అతడు! ఈ నారాయణుని తప్ప వేరొకరిని అర్ధంచననీ, మనకే … మనం ఆపేక్ష పడే వ్రత సాధనమైన పర’ అను వాద్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఈ వ్రతాన్ని చేస్తుంటే చూస్తున్న లోకులందరూ సంతోషించే లా మీరు అందరు వచ్చి ఈ వ్రతం లో చేరండి! రండి! ” అంటూ గోదమ్మ అందరినీ ఆహ్వానిస్తున్నది. ..
_*__
2 వ పాశురం : –
ఈ వ్రత విశేషమేమిటంటే అందరి మంచిని కోరడం. సకల శాంతి సందేశం ఇవ్వడం.. గోదాదేవి ఏం చేయాలో ఎలా చేయాలో ఇలా చెబుతుంది….
” వైయత్తువాళ్వీర్గాళ్ నాముమ్ నమ్ పావైక్కు
చ్చెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్,
పైయత్తు యిన్ణ పరమన్ అడిపాడి,
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి
మై యిట్టు ఎళుదోమ్ మలరిట్టు నామ్ ముడియోమ్,
శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్ఱోదోమ్,
ఐయ్యముమ్ పిచ్చైయుమ్ ఆన్దనైయుమ్ కాకట్టి ఉయ్యు మాఱైణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్.”
పాశురం అర్థం :
కృష్ణానుభవంలో పాల్గొనేటప్పుడు చేయవలసిన పనులూ చేయకూడిని పనుల జాబితాను గోదమ్మ వివరిస్తుంది.భగవంతునికి శరణాగతి చేసిన మనకు పూర్వాచార్యులే మార్గదర్శకులు అని వివరించింది.
కృష్ణుడవతరించిన కాలంలో పుట్టి దుఃఖమయమగు ఈ ప్రపంచం లో కూడా ఆనందం అనుభవిస్తున్న జనులారా! మేము ఈ వ్రతాన్ని చేయబోతున్న క్రియాకలాపం వినండి-
పాలసముద్రంలో ధ్వని కాకుండా మెల్లగా పండుకొని ఉన్న ఈ పరమపురుషుని పాద యుగళాలకు మంగళమని పాడుకుందాం!
ఈ వ్రత సమయంలో నేతిని గాని,పాలను గాని మేమారగింపము. తెల్లవారుజాముననే లేచి స్నానం చేస్తాం. కంటికి కాటుక పెట్టుకోము, కొప్పులో పువ్వులు ముడువము, మా పెద్దలు ఆచరించనివి ఏవీ మేము ఆచరించము. వేరే వాళ్ళ కు బాధ కలిగించే మాటలను, అసత్య వాక్యాల ను పలుకము. జ్ఞానాధికులను అధిక ధనధాన్యాదులతో సత్కరిస్తాం.,బ్రహ్మచారులకు, సన్యాసులకు బిక్షను ఇస్తాం. మేమంతా ఉజ్జీవించు విధముగానే పర్యాలోచన చేసుకొంటాం .
_*_
మూడవ పాశురం : –
కృష్ణానుభవమును ఆస్వాదించడానికి అంటే శ్రీ కృష్ణ తత్వం తెలియడానికి ఓ అవకాశం కలుగుతుంది. ఆమెకు అనుమతి ఇచ్చిన బృందావనం లోని వాళ్ళందరికీ ఈ మంచి ప్రయోజనాలు కలగాలని ఆండాళ్ ప్రార్థిస్తుంది. ప్రతి ఒక్కరూ కృష్ణానుభవం పొందాలి అని అర్ధం .
3 వ పాశురం-
“ఓంగి యులగళన్ద ఉత్తమన్ పేర్ పాడి
నాంగళ్ నమ్ పావైక్కు చ్చాఱ్ఱి నీరాడినాల్
తీంగిన్ఱి నాడెల్లామ్ తింగళ్ ముమ్మారి పెయ్ దు
ఓంగు పెరుం శెన్నెల్ ఊడు కయలుగళ
పూంగువళై పోదిల్ పొరివణ్డు కణ్పడుప్ప
తేంగాదే పుక్కిరున్దు శీర్తములై పఱ్ఱి
వాంగ, క్కుడమ్ నిఱైక్కుమ్ వళ్ళల్ పెరుం పశుక్కళ్
నీంగాద శెల్వమ్ నిరైన్దేలో రెమ్బావాయ్.”
భావం:- భగవంతుని వర్ణిస్తూ ఈ వ్రత ప్రాముఖ్యత ను చెప్తున్న గోదా దేవి…
బలి చక్రవర్తి ఇచ్చిన దానాన్ని అందుకొని , ఆకాశం వరకు పెరిగి , మూడు లోకాలనూ తనపాదాలతో కొలిచిన పురుషోత్తముడగు త్రివిక్రముని దివ్య నామాలను గానం చేయడం . మేము మా వ్రతమనే మిషతో స్నానం చేయగానే దేశమంతటా నెలకు మూడు వానలు పడి ఈతిబాధలు పోయి, సుఖం గా ఉండాలి. ఆకాశం వరకు పెరిగిన వరిచేలలో చేపలు త్రుళ్ళి పడుతుంటే, కలువ పూవు ల మీద మనోహరమైన తుమ్మెదలు నిద్రిస్తుండగా, సస్యములు సమృద్ధిగా ఉండాలి. పాలు పంచుకుతుంటే కొట్టములో దూరి స్థింగా కూర్చుండి , పొదుగునంటగనే పాలు కుండలు నిండునట్టే చేపు లు వచ్చే గోవులు సమృద్ధిగా ఉండాలి. నశ్వరము కాని సంపద దేశమంతా నిండాలి.అంటే దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాను- అని అంతర్భావం.
__*__
నాల్గవ పాశురము: ఆండాళ్ ఒక నెలలో మూడు సార్లు (బ్రహ్మణుల కొరకు, రాజు మరియు పవిత్రమైన స్త్రీల కొరకు) వర్షించాలని పర్జన్య దేవుడిని ఆదేశిస్తుంది, తద్వారా బృందావనములో ప్రజలు సంపన్నముగా జీవిస్తూ, కృష్ణానుభవమును పొందవచ్చు.
ఆళి మళైక్కణ్ణా ఒన్ఱు నీకై కరవేల్
ఆళియుళ్ పుక్కు ముగున్దు కొడార్తేఱి
ఊళి ముదల్వన్ ఉరువమ్ పోల్ మెయి కఱుత్తు
పాళియం తోళుడై పఱ్పనాబన్ కైయిల్
ఆళి పోళ్ మిన్ని, వలమ్బురి పోల్ నిన్ఱు అదిర్ న్దు
తాళాదే శార్ ఙ్గ ముదైత్త శరమళైపోల్
వాళవులగినిల్ పెయ్ దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళిన్దేలో రెమ్బావాయ్
గంభీర స్వభావుడా ! వర్ష నిర్వాహకుడా ! ఓ పర్జన్య దేవా ! నీవు దాత్రుత్వములో చూపు ఔదార్యమును ఏ మాత్రమును సంకోచింపచేయకుము. గంభీరమగు సముద్రములో మధ్యకు పోయి , ఆ సముద్ర జలమునంతను నీవు పూర్తిగా త్రాగి గర్జించి ఆకాశమున వ్యాపించి సర్వజగత్కారణ భూతుడగు శ్రీమన్నారాయణుని దివ్య విగ్రహము వలె శ్యామల మూర్తివై ఆ పద్మ నాభుని విశాల సుందరబాహు యుగళిలో దక్షిణ బాహువు నందలి చక్రమువలె మెరసి ఎడమ చేతిలోని శంఖమువలె ఉరిమి శార్ఙమను ధనస్సు నుండి విడిచిన బాణముల వర్షమా అనునట్లు లోకమంతయు సుఖించునట్లు మేము సంతోషముతో మార్గశీర్ష స్నానము చేయునట్లు వర్షింపుము.
ఐదవ పాశురము: ఎంబెరుమాన్ యొక్క దివ్య నామాలను నిరంతరం పఠించడంతో మన అన్ని కర్మలు (పాప పుణ్యాలు రెండూ) మటుమాయమవుతాయని ఆండాళ్ చూపిస్తుంది. మన పూర్వ కర్మలు నిప్పులో వేసిన దూది వలె కాలిపోతాయి, భవిష్యత్తులో చేసే కర్మలు తామరాకుపై నీరువలె అంటకుండా పోతాయి. ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన అంశము ఏమిటంటే, మనము గతంలో చేసిన పాప కర్మలన్నీ ఎంబెరుమాన్ తొలగిస్తాడు. మనము భవిష్యత్తులో తెలియక చేయబోయే పాపములు కూడా తొలగిస్తాడు. కానీ, భవిష్యత్తులో తెలిసి చేసే పాప కర్మల ఫలితమును మాత్రము అనుభవించేలా చేస్తాడు.
మాయనై మన్ను, వడమదురై మైన్దనై
త్తూయ పెరునీర్ యమునై త్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోన్ఱుమ్ మణివిళక్కై
త్తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వన్దునామ్ తూమలర్ తూవిత్తొళుదు
వాయినాల్ పాడి, మనత్తినల్ శిన్దిక్క
పోయ పిళ్ళైయుమ్ ప్పుగు దరువా నిన్ఱనవుమ్
తీయినిల్ తూశాగుం శెప్పేలో రెమ్బావాయ్
ఆశ్చర్యకరములగు చేష్టలు కలవాడును, నిత్యము భగవత్సంబంధముగల ఉత్తరదేశమునందలి మధురానగరికి నిర్వాహకుడును , పవిత్రము అగాధమునగు జలముగల యమునానది రేవే తనకు గురుతుగా కలవాడును , గోపవంశమున ప్రకాశించిన మంగళ దీపము అయినవాడును,తల్లి యశోద గర్భమును ప్రకాశింపచేయునటులు త్రాడుచే కట్టబడి దామోదరుడైన వాడునునగు కృష్ణ భగవానుని వద్దకు పవిత్రులమై వచ్చి మనము పరిశుద్దములగు పుష్పములతో నర్చించి అంజలి ఘటించి వాక్కుతో కీర్తించి మనసారా ధ్యానించినచో మన పూర్వసంచిత పాపరాశియు , ఆగామి పాపరాశియు అగ్నిలో పడిన దూదివలే భస్మమైపోవును.కావున భగవానుని నామములను పాడుడు.
ఈ విధంగా, మొదటి ఐదు పాశురముల ద్వారా, ఎంబెరుమాన్ యొక్క పర (శ్రీవైకుంఠంలో శ్రీమన్నారాయణ), వ్యూహ (క్షీర సముద్రములోని శ్రీ మహావిష్ణువు), విభవ (త్రివిక్రముడు), అంతర్యామి (వరుణుని అంతర్యామియైన), అర్చ (వడమధుర యొక్క భగవాన్) స్వరూపాల గురించి వివరింబడింది.
మంచి మనసుతో , చిత్తశుద్ధితో , భక్తి శ్రద్ధలతో భగవంతుని ప్రార్థిస్తే సకాలంలో సరిగ్గా వానలు పడకుంటే పంటలు పండుతాయి? పంటలు బాగా పండాలంటే దేశం సుభిక్షంగా ఉండాలంటే భగవంతుని పూలతో పూజించాలి అని గోదాదేవి పాశురాల ద్వారా చెప్పింది .
6.పాశురం :
ఈ పూజ చేయడం లో ఉన్న ఆంతర్యం ఏమిటో బోధపడాలి. ప్రకృతిలో జీవులూ కలిసిమెలిసి ఉంటాయి. మనుషుల జీవితాలు ఇలా ఉండాలనే ఉద్దేశం కనిపిస్తుంది.
6 వ పాశురం:-
పుళ్లుమ్ శిలుంబినకాణ్ పుళ్ళరయ్యన్ కోయిలిల్ వెళ్ళై విళిశంగిన్ పేరరవమ్ కేట్టిలైయో పిళ్ళా యెళుంది రాయ్ పేయ్ ములై నంజుఱ్ఱు
కళ్ళచ్చగడం కలక్కయ క్కాలోచ్చి వెళ్ళత్తరవిల్ తుయిలమర్ న విత్తిన్నై ఉళ్ళత్తుక్కొండు
మునివర్గళుమ్ యోగిగళుమ్ మెట్ట వెళున్దు ఆయన పేరరవమ్ ఉళ్ళమ్ పుగున్దు కుళిర్ న్దేలో రెమ్బావాయ్.
భావం : ఈ ధనుర్మాస వ్రతం కోసం అందరికంటె ముందుగానే కొందరు మేల్కొన్నారు . కానీ, ఒక గోపిక ఇంకా నిద్రిస్తున్నది . ఆమె అలా లేవకపోవడాన్ని గమనించి ‘తెల్లవారిందమ్మా!ఇక లేచిరావే!’ అని లేపుతున్నారు . పక్షులు వేకువనే లేస్తాయి. అవి ఒకరినొకరు ” రండి రండి మేతకు పోదాం !” అంటూ కూస్తూ… పిలుస్తూ ….పోతున్నాయి. అరె! తొందరగా రండి , మన పక్షిరాజైన గరుత్మంతుని కే రాజైన ఆ శ్రీమన్నారాయణుని కోవెలలో గంట మ్రోగింది! వినలేదా!
ఓ అమ్మాయీ ! భగవద్విషయం నీకు తెలియనట్టు న్నావే ! అదిగో శంఖధ్వనిని ! వింటూన్నావా లేదా? తొందరగా లేచి రావమ్మ ! పూతన స్తనాలలోని విషాన్ని ఆరగించినవాడూ, తనను చంపటానికి వచ్చిన శకటాసురుని కీళ్ళూడిపోయేలా తనకాళ్ళతో తన్నినవాడైన ఆ శ్రీకృష్ణుడే ఈవపాల సముద్రంలో ఆదిశేషునిపై యోగనిద్రలో హాయిగా శయనించి ఉన్నాడు . అతడే మన శ్రీమన్నారాయణుడు.
ఆ శ్రీమన్నారాయణుడినే కదా ఋషులూ, యోగి పుంగవులు వాళ్ళ హృదయాల్లో నిల్పుకొన్నది! ఆ భగవంతుడైన శ్రీమన్నారాయణునికి ఏ విధమైన శ్రమ కలుగ వద్దని మెల్లిగా “హరీ!హరీ!” అని అతణ్ణే స్మరిస్తున్న ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలను చేరికుని చల్లబరుస్తుంది. వణికిస్తున్నది. మేమంతా మేల్కొన్నాం . కాని నువ్వు ఏ మాత్రము కదలక అలాగే పడుకున్నావేంటమ్మా? ! ఆ ధ్వని నీకు వినబడలేదా!రామ్మా .. రా ! మాతో కలిసి వ్రతాన్ని చేయమ్మా”!
అని పిలుస్తారు.
సాధారణంగా పూజలు వ్రతాలు తెల్లవారుజామున చేయడమే మంచిది. అదే మన ఆచారం. ఆ భగవంతుని లీలలు గుర్తు చేసుకున్నారు, తోటి గోపికను కోవెలకు వెళ్దాం రమ్మని తొందరపడుతున్నారు . ఇది సమూహం గా వెళ్లాలనే ఆత్రానికి నిదర్శనం.
_*__
7.పాశురం :
భగవంతుని తత్వాన్ని తెలుసుకోవడానికి మనమంతా ఆరాధన చేస్తుంటాం. శ్రీమన్నారాయణను కీర్తస్తుంటాం .
ఇది కూడా పూజలో ఓ భాగమే !
7 వ పాశురం:-
కీశు కీశెవైజ్ఞుమానై చాత్తకలను! పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయో! పేయ్ పెణ్ణి! కాశుమ్ పిరప్పుమ్
కలగలప్పక్కైపేరు: వాశ నరుజ్జుళ లాయిచ్చియర్ మత్తినాల్ ఓపడు రవమ్ కేట్టిలయో
నాయకప్పెణ్ణిళ్ళాయ్! నారాయణన్ మూర్తి కేశావనై ప్పాడవుమ్ నీకేట్టి కిడత్తియో తేశముడైయాయ్! తిరు వేలో రెమ్బావాయ్.
భావం :
ఓ పిచ్చిపిల్లా! భరద్వాజ పక్షుల కిలకిలారావాలూ, చేస్తున్న కలకలమూ వినపడలేదా? అదిగో! చూడు, సువాసనలు వెదజల్లుతున్న కురులతో ఉన్న ఆ గోపికలంతా తాము ధరించిన ఆభరణాలన్నీ ధ్వనించేటట్టుగా చేతులు కవ్వాలను త్రిప్పుతూ పెరుగు చిలుకుతున్నారు కదా! ఆ ధ్వనులేవీ నీకు వినబడలేదా? నువ్వు మాకు నాయకురాలివి కద! భాగవద్విషయాల అనుభవం తెలిసినదానివి . మనదెంత భాగ్యం!! సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఇప్పుడు శ్రీకృష్ణుడిగా మనకోసం అవతరించాడు. మనకొరకే ‘కేశి’ వంటి రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు. మనమంతా ఆ దేవదేవుని కి కృతజ్ఞులమై అతని గుణాలను గానం చేస్తున్నాము. ఐనా… అవన్నీ వింటూనే ఇంకా పడుకొనే ఉన్నావేంటి? లే!! మేము పాడే యీ పాటలను ఆనందముతో వింటూ మురిసిపోతున్నావులే నువ్వు? ఇక లేచి రావమ్మా! ఓ తల్లీ! అని ‘ఒక గోపకన్యను లేపుతుంది ఆండాళ్ తల్లి.
గోదాదేవి తన స్నేహితులతో కలిసి వెళ్లి స్వామిని పూజించండమే తన కర్తవ్యం గా భావిస్తున్నదని ఈ పాశురం చదివితే తెలుస్తున్నది!
_*__
8.పాశురం :
ఈ పాశురం అర్థం చేసుకోగానే ఈ రోజు లలో ఉద్యోగాలు చేసేవాళ్ళు , వ్యాపార సంస్థలు వంటి వాళ్ళు వెంటనే గుర్తుకు వస్తారు!
8 వ పాశురం, భావ వివరణ:-
కీళ్ వానమ్ వెళ్ళెన్రు ఎరుమై శిరువీడు మేయ్ వాన్
పరరన్దనకాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్ పోవాన్ పోగినా పోగామల్ కాత్తున్నై కూవువాన్
వన్దు నిన్రోమ్ కోదుకలముడై పావాయ్!
ఎళున్దిరాయ్ పాడిప్పరైకొణ్డు మావాయ్! పిళన్దనై మల్లరై మాట్టియ దేవాదిదేవనై చ్చెన్రునామ్ శేవిత్తాల్ ఆవావెన్రా రాయ్ న్దరుళేలో రెమ్బావాయ్.
భావం:
తూర్పు దిక్కంతా ఆకాశము వెలుగు పరుచుకుంటూ తెల్లారింది. గేదె లు మంచుమేత మేయాలని విడిచారు . అవి మేత కోసం స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరక ముందుగానే అతని దగ్గర కు వెళ్ళాలని అతని చెంతకు చేరాలని ప్రయత్నిస్తున్నారు. అట్లా చేస్తే ఆయన చాలా సంతోషిస్తాడని అనుకుంటున్నారు. అందరూ కలసి గోష్ఠీగ పోవడమే మంచిదని , వాళ్ళందరినీ అక్కడనే నిలిపేసి, నీ కోసం వచ్చాం. నీకు కూడా కృష్ణ పరమాత్మ ను చేరాలన్న కుతూహలం వున్నదికదా! మరింకెందకు ఆలస్యం? లే! అశ్వాసురరూపుడైన కేశిని, చాణూరుణ్నీ, ముష్ఠికుణ్ణీ చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోదాం. వెళ్లి, మన నోముకు కావలసిన ‘ప’ అనే సాధనాన్ని పొందుదాం. ఆయన రాకకు ముందే మనమక్కడికి వెళ్ళామా అతడేమనకుంటాడో తెలుసా? అయ్యో! మీరు మా కంటే ముందుగానే వచ్చారే! అని నొచ్చుకొని మన అభీష్టాలను వెంటనే నెరవేరుస్తాడు!! నిజం!! పదా ..
అని ఇలా గోపిక లు అనుకోవడం ఎంత సహజం గా ఉంది కదా! సమయం కన్నా ముందే ఉంటే అధికారులు పెద్ద లూ సంతోషిస్తారు! కదా! ఆలస్యం గా వెళ్లకూడదు అని ఈ పాశురం చదివితే తెలుస్తున్నది.
_**_
9.పాశురం , భావ విశ్లేషణ:- ఈ పాశురాలలో ఉన్నదంతా మనవంటి వాళ్ళ గుణాలను మనస్తత్వాలనూ చెబుతూ ఆ భగవంతుని దగ్గరకు ఎందుకు తొందరగా వెళ్లి పూజించాలో చెబుతున్నాయి. అదేంటో చూద్దాం-
9 వ పాశురం:-
తూమణి మాడత్తుచ్చుట్రుమ్ విళక్కెరియ ధూపమ్
కమళత్తుయిలణై మేల్ కణ్ వళరుమ్ మామాన్ మగళే!
మణిక్కదవమ్ తాళ్ తిరువాయ్ మామీర్!
అవళై యెళుప్పీరో ఉన్ మగళ్ దాన్ ఉమైయో?
అన్రిచ్చెవిడో అనన్దలో ఏ మప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో? మామాయన్ మాధవన్ వైకున్టన్ ఎన్రన్రు.
నామమ్ పలవుమ్ నవిన్దేలో రెమ్బావాయ్
భావం :
నిర్దోష మాణిక్యాలతో నిర్మించిన భవనంలో చుట్టూనూ దీపాలు వెలుగుతున్నప్పుడు , అగరు ధూపాలను, పరిమళాలను వెదజల్లుతుంటే అతిమెత్తనైన హంసతూలికా తల్పంపై పడుకుని నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా! మణిమయ ప్రభలతో ప్రకాశిస్తున్న నీ భవన గడియను తీయవమ్మా! ఏమమ్మా! మేనత్తా! నీవైనా ఆమెను లేపుమమ్మా! ఏమి? నీ లేవకుండగ నీ పుత్రిక మూగదా? చెవిటిదా? లేకుంటే బద్దకస్తురాలా? ఆమెకు ఎవరినైనా కావలి వుంచినారా? లేకుంటే యింత మైమరచి నిద్రించాలని మంత్రించారా? ఆమెకేమైంది? నిద్ర లేవడమే లేదంటే
‘ఓ ఆశ్చర్య గుణచేష్ఠితుడా! ఓ శ్రియపతి! ఓ పరమపదవాసీ!’ అని ఇన్నేసి తిరునామాలను అనుసంధిస్తున్నా కూడా ఆమెకు వినబడుటం లేదేంటి? ఇంకా లేవదేమి? అని సకల సంపదలతో తులతూగుతున్న ఒక కన్యను లేపుతున్నారు . !!
మన విషయాబాబూ నిద్రలేరా.. పాపా లేమ్మా అని మనం బడికెళ్ళాలని నిద్రలేపుతున్నట్టే అని అనిపిస్తుంది కదూ! జ్ఞాన తృష్ణ !
_**_
10 వ పాశురం :
ఈ పాశురాలు ఏం చెబుతున్నాయి? మనదైన కుటుంబానికి ఉన్న మంచి పేరును మరవొద్దనీ , భగవంతుని గొప్పతనాన్ని మరవొద్దనీ.. అంతే! మరి అదెలాగో చూద్దాం..
పాశురం, భావ విశ్లేషణ :-
10 వ పాశురం:-
వర్కమ్ పుహిగినవమ్మనాయ్ నోట్రుచ్చు మాట్రముమ్ తారారో వాశల్ తిరవాదార్ నాట్రత్తుళాయ్
ముడి నారయణన్ నమ్మాల్ పోటప్పరైత్తరుమ్ పుణ్ణియనాల్
పజ్జూరునాళ్ కూట్రత్తిన్ వాయ్ విళన్ద కుమ్బకరుణనుమ్
తోటు మునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో?
ఆటవనన్దుడై యా యరుంగలమే తేట్రమాయ్ వన్దు తిరువేలో రెమ్బావాయ్.
భావం :
నోము నోచి శ్రీకృష్ణ సంశ్లేష సుఖానుభవాన్ని పొందుతున్న ఓయమ్మా.. ! తలుపును తెరువకపోయినమానెగాని, నోటినైనా తెఱచి పలుకవచ్చును కదా తల్లీ! అంటే, జ్ఞానుల దర్శనం కంటే వాళ్ళ శ్రీ సూక్తులను వినటమే చాలా ముఖ్యమని చెప్తున్నది ఆండాళ్ అమ్మవారు . పరిమళాలను వెదజల్లే తులసి మాలలను కిరీటం గా ధరించిన శ్రీమన్నారాయణడు మనచేత స్తోత్రం చేస్తున్నందుకు సంతసించి మనకు వ్రతోపకరణాలను (పలై) ఇస్తాడు కద!
పూర్వమొకప్పుడు ధర్మస్వరూడైన పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుణ్ణి సంహరించాడు. ఆ కుంభకర్ణుడు తన పెనునిద్ర నీకేమైనా కానుకగా యిచ్చాడా ఏంటి? ఓ పెద్ద నిద్ర కలదానా! లేచిరమ్ము. నీవు మాకు శిరోభూషణమైనదానివి కద! తొట్రుపడక లేచివచ్చి మా గోష్ఠిలో చేరి మా వ్రతాన్ని పూర్తి చేయాలి.
కాబట్టి నీ యోగ నిద్రను వీడి లేచి రావమ్మ! అని ఐదవ గోపికను మేల్కొలుపుచున్నారు.
ఈ పాశురం లోని సారాంశం ఏమిటంటే, ఆ అవతార పురుషుడు సంహరించినవాని మొద్దు నిద్ర వంటి నిద్ర కూడదు, ఎప్పుడూ చురుకుగా ఉండాలి అని! అందుకే ఆ పోలికను తీసుకున్నది గోదామాత! ఇవన్నీ నిత్య జీవితంలో మనకు అవసరమైన విషయాలే కదా!
_*_
11.పాశురం
చాలా వరకు స్తోత్రాలలో వర్ణనలు, కథలూ, భగవంతుని వివిధ అవతారాల విశేషాలు, ఆ స్వామి లీలలు వంటివి ఉంటాయి. ఈ పాశురం లో ఒక గోపిక వంశవిశేషాలతో కలిపి ఉన్నది. ఇవన్నీ పూర్వ వైభవం తెలిసేలా చెప్పడమే అనిపిస్తుంది.
11 వ పాశురం, భావార్థాలు:-
కట్రుక్కఱవై క్కణంగళ్ పలకఱందు,
శెట్రార్ తిఱలళియ చ్చెనృ శెరుచ్చెయ్యుం,
కుట్రమొన్ఱిల్లాద కోవలర్ తం పొఱ్కొడియే,
పుట్రరవల్‍గుల్ పునమయిలే పోదరాయ్,
శుట్రత్తు తోళిమారెల్లారుం వందు, నిన్
ముట్రం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్ పాడ,
శిట్రాదే పేశాదే శెల్వ ప్పెండాట్టి,
నీ ఎట్రుక్కుఱంగుం పొరుళేలోరెంబావాయ్.
భావం :
“ఓ గోపాలకుల తిలకమా! ఓ చిన్నదానా! లేత వయస్సు కలిగిన ఎన్నో పశువుల సమూహ సంపద కలిగిన మీ వంశం చాలా గొప్పది. ఆ సమూహాల పాలు పిదుకతగిన వాళ్ళూ, శత్రువులు నశించేలా యుద్ధం చేయగలవాళ్లూ , ఒక్క దోషమైనను లేనట్టి గొల్లకులమున పుట్టిన బంగారు తీగవంటి అందమైనదానా! పుట్టలోని పాము పడగతో సమానమైన నితంబము (నడుము) కలదానా! ఓ వనమయూరమా! ( అడవి నెమలి) రమ్ము నీ సఖులు, బంధువులూ అందరూ వచ్చి నీ వాకిట నిలబడ్డారు. వీళ్లంతా నీలిమేఘాలను పోలిన శరీరకాంతిగల శ్రీకృష్ణుని తిరునామాలు ( స్థిరమైన పేర్లు) పాడుతున్నారు. ఐనాగాని నువ్వు మాత్రము చలించక, మాట్లాడక, ఎలా నిద్రిస్తున్నావు అని అనుకుంటున్నారు.
అంటే యింత ధ్వని ఇన్ని చప్పుళ్ళు అవుతున్నా ఉలకక, పలకక(ధ్యానములో) ఎందుకున్నావు? ఇది శ్రీకృష్ణ సంశ్లేష ( కృష్ణ పరమాత్మ ను ఆలింగనం చేసుకున్నట్టుండే) అనుభవానందమే కదా! మరి యీ సంశ్లేషానుభవానందాన్ని నీ వొకదానివేగాక మా గోష్ఠిలో కలిసి ఈ వ్రతాన్ని పూర్తిచేసుకోవచ్చని అంటున్నారు.”
ఈ పాశురం లోని సారాంశం ఏమిటంటే…ఎవరు ఏ పూజ చేసినా ఆ పరమాత్మ కు దగ్గరగా ఉండాలన్న ఉద్దేశ్యమే! అటువంటి పూజను సామూహికంగా చేద్దాం రమ్మని పిలవడమన్నమాట!
__*__
ఎట్రుక్కుఱంగుం పొరుళేలోరెంబావాయ్ ॥ 11 ॥
12. పాశురం :-
తల్లి పిల్లల ప్రేమానురాగాల విశేషాలు భగవంతుని గాఢానురక్తితో కలిపి కీర్తించడం ఈ పాశురం లో ఉండడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
12 వ పాశురం భావార్థాలు:-
కనైత్తిళం కట్రెరుమై కనృక్కిఱంగి,
నినైత్తు ములై వళియే నినృ పాల్ శోర,
ననైత్తిల్లం శేఱాక్కుం నఱ్చెల్వన్ తంగాయ్,
పనిత్తలై వీళ నిన్ వాశఱ్ కడై పట్రి,
శినత్తినాల్ తెన్నిలంగై క్కోమానై చ్చెట్ర,
మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్,
ఇనిత్తానెళుందిరాయ్ ఈదెన్న పేరుఱక్కం,
అనైత్తిల్లత్తారు మఱిందేలోరెంబావాయ్ ॥
భావం :
లేగ దూడలను తలచుకొని గేదలు పాలను నిరాటంకంగా స్రవిస్తూ ఉన్నాయి. ఆ పాల ధారలతో ఇంటి ప్రాంగణమంతా తడిసి బురదమయమయ్యింది. ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లెలివైతివి. ఓయమ్మా! మేమందరమూ నీ వాకిట కు వచ్చి పైన మంచు కురుస్తున్నా సహించి , నీ గడపనానుకొని నిలుచున్నాము. పైన మంచు కురుస్తున్నది , క్రింద పాలధారలు బురద చేస్తున్నవి . మేమంతా మనస్సులో మాధవునే నింపుకొని ఉన్నాము. పైన మంచు కురవడమనే శ్రీసూక్తి ధారల ( ఒక రాగం విశేష ధార) ప్రవాహం సాగిపోతుంది. కాళ్ల క్రింద పాల ధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతుంది. మనస్సులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తి ( పరమాత్మ లో లీనమవ్వాలనే ఆలింగనాత్మక భగవద్భక్తి ) ధారలు విచ్చిన్నంగా పొంగిపొరులుతున్న ఈ ముప్పేట ధారలతో తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకకోవాలని నీ వాకిట్లో గుమ్మాన్ని పట్టుకొని ఉన్నామమ్మా! ఆనాడు సీతమ్మను అపహరించాడన్న కోపం తో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ స్వర్ణలంకాధిపతి పది తలల రావణున్ని మట్టుబెట్టినటుంటి వాని గుణగణాలను స్తుతిస్తున్నాము, కీర్తిస్తున్నాము, పాడుతున్నాము. మేమింత చేస్తుంటే నువ్వు నోరైన మెదపటం లేదేమి తల్లీ! ఇది ఏమి మొద్దునిద్రమ్మా! నీ గొప్పతనాన్ని మేమెరిగితిమిలేవమ్మా. నీ మొద్దు నిద్ర విషయమంతా ఊరు వాడ తెలసిపోయిందిలే! ఇక నీ మొద్దు నిద్ర చాలించి మేలుకో! ( నీ ద్యానస్థితి నుంచి మేలుకో) మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాంగోపాంగంగా ( సమస్త అవయవాలతో, సమస్త వేదాంగ పూరితంగా అంటే వేదాలకు సంబంధించిన అనుబంధ శాస్త్రాలు (ఉదా: శిక్ష, కల్ప, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిష్యం) పూర్తి చేయటానికి సహాయపడు అని ఏడవ గోపికను లేపుతున్నారు.. ”
అంటే … ఈ పాశురం లో రామావతార విశేషం చెబుతూనే భారతీయ పూర్వచార సదాచార సంపన్నతలనూ తెలుసుకుంటూ స్తోత్రం చేద్దాం రమ్మని పిలవడమన్నమాట!
_*__
13 వ పాశురం:-
పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా వరక్కనై
క్కిళ్ళి క్కళైందానై క్కీర్తిమై పాడిప్పోయ్,
పిళ్ళైగళెల్లారుం పావైక్కళంబుక్కార్,
వెళ్ళి యెళుందు వియాళముఱంగిట్రు,
పుళ్ళుం శిలంబిన కాణ్! పోదరిక్కణ్ణినాయ్,
కుళ్ళక్కుళిర క్కుడైందు నీరాడాదే,
పళ్ళిక్కిడత్తియో పావాయ్! నీ నన్నాళాల్,
కళ్ళం తవిరందు కలందేలోరెంబావాయ్ ॥
13వ పాశురం భావం :
కంసునిచే పంపబడిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణునీ, దుష్టుడైన రావణుని పది తలలను గిల్లి పారవేసిన శ్రీరామునివీ కళ్యాణ గుణ సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషాన్ని అనుభవించాలని కోరుకునే గోపికలందరూ సంకేతస్థలానికి ఎప్పూడో చేరిపోయారు. నువ్వు ఇంకా లేవడం లేదు! తెల్లవారినదని సూచిస్తూ శుక్రుడు ( అంటే, భార్గవుడు, అగ్ని అంటే సూర్యుడు) ఉదయించాడు. బృహస్పతి ( దేవతల గురువు) అస్తమించెను. ఇదిగో పక్షులన్నీ తమ ఆహార అన్వేషణ నిమిత్తం అరచుకొంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి’ అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరచి చూసింది. ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై , “వికసించిన తామరపూవులపైన వ్రాలిన తుమ్మెద వంటి కన్నులు కలదాన! ఇకనైన లేచి రావమ్మ!
నీ నేత్ర సౌందర్యానికి ముగ్దుడై శ్రీకృష్ణస్వామి తానే నీ దగ్గరకు వచ్చునని భ్రమించకు. శ్రీకృష్ణ విరహతాపాన్ని తీర్చుకోవడానికి ఈ చల్లని నీళ్లల్లో అందరితో కలసి స్నానమాడగా రావమ్మ! ఇంకను పరుండరాదు. మనము నోచే ఈ వ్రతమునానికి ఇది శుభసమయము, మంచి కాలము. ఓ సుందరీ! నీ కపటమును వీడి మా గోష్ఠిలో కలిసి మహిమాన్వతమైన ఈ వ్రతాన్ని సాంగోపాంగముగా పూర్తి చేయడానికి సహకరిచు. అన్నింట్లో శుభాలే కలుగుతాయి” అని గోదాదేవి ఎనిమిదవ గోపికను మేల్కొలుపుతున్నారు.”
ఈ పదమూడవ పాశురం లో ఆ భగవంతుని శక్తి ను వివిధ రకాలుగా పోలుస్తూ వివిధ రకాలుగా కీర్తిస్తూ గోపికలను నిద్ర లేపుతున్నది గోదమ్మ. అంటే వీటిల్లో శుభ లక్షణాలు, శుభ సంకేతాలు ఉన్నాయి.
_**_
14.పాశురం
ఒక్కో పాశురం ఒక్కో విషయాన్ని వివరించడం చూస్తాం. వర్ణనలు కథలూ కబుర్లు బాగా ఉన్నాయి. ప్రకృతిలో జీవులూ నేలమ్మా పచ్చని తీరు చూస్తే మనసు పలికే మౌనరాగాలు అన్నీ ఈ స్తోత్రాలలో ఉన్నాయి .
14 వ పాశురం భావార్థాలు:-
ఉంగళ్ పుళైక్కడై త్తోట్టత్తు వావియుళ్,
శెంగళు నీర్ వాయ్ నెగిళందు అంబల్ వాయ్ కూంబిన కాణ్,
శెంగల్ పొడి క్కూఱై వెణ్బల్ తవత్తవర్,
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్,
ఎంగళై మున్నం ఎళుప్పువాన్ వాయ్ పేశుం,
నంగాయ్ ఎళుందిరాయ్ నాణాదాయ్ నావుడైయాయ్,
శంగొడు శక్కరమేందుం తడక్కైయన్,
పంగయక్కణ్ణానై ప్పాడేలోరెంబావాయ్
భావం :
ఏమె సఖీ ! ఇదేమి? ముందుగా మమ్ములను లేపుతానంటివి కదా! ఇంత వరకు పండుకొనే ఉన్నావేమి ? లే లెమ్ము! తెల్లవారిపోయింది, చూడు. మీ పెరటిలోని ఎర్రకలువలు విచ్చుకున్నవి. నీలోత్పలాలు ( నీలి కలువలు) ముకుళించాయి, కాషాంబరులైన మునులు, యోగులు తెల్లని పలువరుసలు కలిగిన వారందరూ దేవాలయాలలో భగవరాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయటానికి ‘కుంచెకోలను’ ( కుంచిక – తాళం తీసే వంకర ఇనుపకమ్మి) తాళపు చెవులను తీసుకొని వెళుతున్నారు. ఇవన్నీ ప్రాతఃకాలమగు సూచనలే కదా! నీవు చేసిన వాగ్దానమును మరిచితివా? నీకేమి? పూర్ణురాలవు కదా! ( నిండైన దానిని) సరే! ఇకనైనా లేచిరమ్ము. వాగ్దానమును మరచిన సిగ్గులేని దానా! లేవమ్మ అనగానే, “నన్నేల నిందింతురు? నేనేమి చేయవలే? ” అన్నదామె . అనగానే, ” శ్రీ శంఖచక్రములచే విరాజిల్లుచున్న విశాల సుందర భుజాలు కలవాణ్ణీ, పంకజాక్షుని , ఆ శ్రీకృష్ణుని గుణగణాలను మధురమైన స్వరం తో కీర్తించాలి. మేము కూడా నీతో కలిసి పాడుతాము. ఇట్లా గోష్ఠీగా ( సల్లాపంగా) సంకీర్తనం చేస్తే వ్రతము ఫలించగలదు. కాబట్టి వెంటనే మేలుకొనుమమ్మా’ అని గోదాదేవి ఈ పాశురంలో తొమ్మిదవ గోపికను లేపుతున్నది.”
అంటే గోదా అమ్మవారి పూజలు వ్రతాలు తెల్లవారుజామున లేచి నదీస్నానం చేసి శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం తో ఉన్నట్టు అనిపిస్తుంది. దేవాలయ సందర్శన చేసి, ద్వారం తలుపులు తెరిచి దేవదేవుని సన్నిధిలో స్తోత్రం చేద్దాం రమ్మని పిలవడమన్నమాట.
_*__
15. పాశురం
ఎల్లే! ఇళంకిళియే ఇన్నముఱంగుదియో,
శిల్లెన్ఱళైయేన్మిన్ నంగైమీర్ పోదరుగిన్ఱేన్,
వల్లై ఉన్ కట్టురైగళ్ పండే యున్ వాయఱిదుం,
వల్లీర్గళ్ నీంగళే నానేదానాయిడుగ,
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఋడైయై,
ఎల్లారుం పోందారో? పోందార్
పోందెణ్ణిక్కొళ్,
వల్లానై కొన్ఱానై మాట్రారై మాట్రళిక్క
వల్లానై, మాయానై పాడేలోరెంబావాయ్
భావం :
ఈ మాలిక సంభాషణ రూపంలో ఉన్నది.
బయటి వారు – ఓ లేత చిలుక! ఇంకను నిద్రిస్తున్నావా? ఇదేమి ఆశ్చర్యమే! లోపలి గోపంగన పూర్ణులైన పూబోడులారా! ఇదిగో వస్తున్నాను.
బయటి వారు – శ్రీఘ్రముగా రావమ్మా!
లోపలి గోపాంగన – అబ్బా! గొల్లుమని ఉలికి పడినట్లు గొంతెత్తి చెవులు గడియలు పడునట్లు పిలవకండి. వస్తాలే!
బయటి వారు – ఓ చిన్ని చిలుకా! నీవు చాలా చమత్కారముగా మాట్లాడుతావు. నీ నేర్పరితనము, నీ పుల్లవిరుపు మాటలు మేము ఇదివరకే యెరుగుదములేమ్మా!
లోపలి గోపాంగన – మీరే అట్టి సమర్థులమ్మా! నేనేమీ కాదులే! అయినా మీరన్నట్లు నేనట్టిదానినేమో! రావలసిన వారు అందరూ వచ్చినారా?
బయటి వారు- కువలయాపీడనమనే కంసుని గజమును, కంసాది శత్రువులను సంహరించిన సర్వేశ్వరుడైన శ్రీకృష్ణని కళ్యాణ గుణములను కీర్తింపగా రమ్ము. ఇట్లు చేసినగాని మనము చేయు వ్రతము శుభప్రదముగ పూర్తికాదు అని బయటి నుండి సమాధానము చెప్పి ఆమెను కూడ తమ గోష్ఠీలోనికి చేర్చుకున్నారు గోపికలు.”
ఈ పాశురం లో ఏం చెప్పారంటే లోకకళ్యాణం చేసిన కృష్ణ పరమాత్మ ను మేల్కొలుపడానికి తొందరగా వెళ్ళాలని గోపికలనందరినీ సమాయత్తం చేస్తున్నది గోదా దేవి.
ఇక
5 నుంచి 15 పాశురాల్లో
పూలు సేకరిస్తూ గోప బాలిక లతో పల్లె వాతావరణాన్ని వర్ణిస్తూ చెబుతుంది. పక్షుల కిలకిలారావాలు, ఉషోదయం, వెలుగు చైతన్యం , రంగురంగుల పువ్వులు , గొల్లలు వెన్న చిలకుతుంటే వినిపించే సంగీత ధ్వనులు, ఆలమందల ధూళి, గోపబాలురుల పనితనం వర్ణిస్తూ ఉంటాయి పాశురాలు. చిరుగంటల సవ్వడితో గోవులు , గుండె గుంట లు మ్రోగునట్లు గుడి గంటలు మ్రోగడం, శంఖారావం వినిపించడం వంటి వర్ణనలు పాటలయ్యాయి , కీర్తనలయ్యాయి గోదాదేవి పాశురాల లో! అందరి ఇళ్ళకు వెళ్ళి, తన చెలులను తట్టి లేపుతుంది. నదీ స్నానానికి తీసుకుని వెళ్ళి అక్కడ భగవంతుని అవతారాలను కీర్తిస్తూ వాళ్ళ తోనూ పాడిస్తూ ఆనందించండం!!
15 నుంచి 20 పాశురాల్లో
గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను 15 నుంచి 20 పాశురాలలో వర్ణిస్తుంది . భగవంతుడిని నిద్ర మేల్కొలపడానికి గోదావసుప్రభాతాన్ని ఆలపిస్తుంది. శ్రీకృష్ణు కృష్ణుడి భార్య లలో ఒకరైన నీలాదేవి తానే భూదేవి తానే!
20 నుంచి 30 పాశురాల్లో
చివరి తొమ్మిది పాశురాలు భగవంతుడి గొప్పతనాన్ని వివరిస్తాయి. ఆఖరి పాశురంలో గోదాదేవి, తను విష్ణుచిత్తుని కుమార్తెనని, ఈ 30 పాశురాలు తాను రచించి పాడాననీ, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృపను పొందుతారు అని పెద్దల విశ్వాసం. మంచి ఆరోగ్యం కోసం మంచి ఫలితం కోసం ఈ తిరుప్పావై చదువుకొని పూజలు చేస్తే అందరికీ మంచిదే!గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే మనం చేసే ఇటువంటి క్రతువులు ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే పెట్టకుండా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ” సర్వేజనా సుఖినోభవంతు” అనే మాట సార్థకం అవుతుంది.
16. పాశురం
ఈ పాశురం లో భగవంతుని మీద ఉన్న ప్రేమానురాగాలను వ్యక్తం చేయాలని కృష్ణ స్వామి తరుమాళిగి లోపలికి వెళదామనుకుంటున్న గోపికలను అడ్డుకున్న ద్వార పాలకునితో వాదన చేస్తూ ఏం చెబుతున్నారంటే…
16 వ పాశురం భావార్థాలు:-
నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ
కోయిల్ కాప్పానే, కొడిత్తోనృం తోరణ
వాయిల్ కాప్పానే, మణిక్కదవం తాళ్ తిఱవాయ్,
ఆయర్ శిఋమియరోముక్కు, అఱైపఱై
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్ నేరందాన్,
తూయోమాయ్ వందోం తుయిలెళప్పాడువాన్,
వాయాల్ మున్నమున్నం మాట్రాదే అమ్మా, నీ
నేయ నిలైక్కదవం నీక్కేలోరెంబావాయ్
భావం :
మాకందిరికీ ప్రభువైన నందగోపుడు ఉన్న తిరుమాళిగను (నివాసాన్ని )రక్షించువాడా! మమ్మల్ని లోపలికి పోనివ్వు. వ్రేపల్లెలో నుండే గొల్లపిల్లలము. స్వామిని దర్శించాలని వచ్చాము. పరిశుద్ధంగా వచ్చాము.మణులతో ఉన్న గడియను తెరువు. మేము స్వామికి శరణాగతి చేసిన వాళ్ళం. గొల్లకులం లో పుట్టినా , అజ్ఞానులమే అయినా కూడా స్వామి ముందు అత్యంత అధిక ప్రేమానురాగములు కలవాళ్ళం. స్వామికి సుప్రభాతము పాడి మేలుకొలుపడానికి వచ్చాం. గొల్లవంశంలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణ చేపితు, ఇంద్రనీల మణివర్ణం గల శరీరం కలవాడూ అయిన శ్రీకృష్ణుడు మాకు ‘ప’ అని ధ్వనించే వాద్యాన్ని ఇస్తానని నిన్ననే వాగ్దానం చేసాడు.
ఇప్పుడు అనన్య ప్రయోజకులమై స్వామి ని నిద్ర లేచేలా సుప్రభాతాన్ని పాడాలని వచ్చాము. నీ నోటితో వద్దని చెప్పకు. మమ్మల్ని అడ్డుకోక ధృడంగా బంధించిన తలుపు గడియను వెంటనే తెరచి లోపలికి పోనివ్వు‘ అని కావలి వాడిని వేడుకొంటున్నారు.
ఈ పాశురం ఎంతటివారైనా సరే అనుమతి ఇచ్చేవాళ్ళు ఇవ్వకపోతే ప్రవేశం ఉండదు. ద్వారపాలకునికి ఈ గోపికల భక్తి గురించి తెలియదు కాబట్టి చెప్పుకోవాల్సి వచ్చింది. అవసరానికి తగినట్లుగా కాస్త తగ్గి ఉన్నంత మాత్రాన నష్టం లేదు. ఆ భగవంతుని దర్శనం ముఖ్యం కదా! ఇది ఈ పాశురం చదివితే బాగా తెలుస్తుంది.
_*__
17. పాశురం :
ఈ పాశురం శ్రీ కృష్ణ ని తల్లిదండ్రులైన యశోదా నందరాజు ప్రస్థావన తో సాగుతుంది. చక్కని ఉపమాలంకారాన్ని చూస్తాం. ఓ తీగ తో ఆడవాళ్ళ ను పోల్చడం , రాజు ధర్మాన్ని చెప్పడం చూస్తాం. ఇలా పొగుడుతూ వీళ్ళ కుమారుడైన శ్రీ కృష్ణ పరమాత్మ ను మేల్కొల్పడానికి గోదమ్మ ఎలా కీర్తిస్తుందో చూద్దాం-
17. వ పాశురం భావార్థాలు:-
పాశురం:-
అంబరమే తణ్ణీరే శోఱే అఱం శెయ్యుం,
ఎంబెరుమాన్ నందగోపాలా ఎళుందిరాయ్,
కొంబనార్క్కెల్లాం కొళుందే కుల విళక్కే,
ఎంబెరుమాట్టి యశోదాయ్ అఱివుఱాయ్,
అంబరమూడఋత్తు ఓంగి ఉలగళంద,
ఉంబర్ కోమానే! ఉఱంగాదెళుందిరాయ్,
శెం పొఱ్కళలడి చ్చెల్వా బలదేవా,
ఉంబియుం నీయుముఱంగేలోరెంబావాయ్
భావం :
ద్వారపాలకులు గోపాంగనలను లోనికి అనుమతించగా వారు మొదట అన్న,వస్త్ర, తీర్థాదులను ధర్మబుద్ధి తో దానాలు చేసే నందగోపులను ‘స్వామి! మేలుకొనుము’ అని ప్రార్థించారు.
తరువాత ‘ప్రబ్బలి తీగవంటి స్త్రీలకు అందరికీ తీగ లా ముఖ్యమైనదానా! గొల్లకులానికి మంగళదీపం వంటిదానా! మాకు కూడా స్వామినివైన ఓ యశోదమ్మా ! లేమ్మా! అని వేడుకొన్నారు . ఆకశామంత ఎత్తుకెదిగి సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజైన ఓ కృష్ణా నిద్ర చాలునయ్యా! మేలుకో అని ప్రార్థించారు.
ఆయన లేకపోవడాన్ని చూసి, బలరాముణ్ణి నిద్ర లేపక తప్పు చేసామే అని అర్థం చేసుకుని ‘ మేలిమి బంగారు కడియాలతో శోభిస్తున్న పాదయుగళాలున్న ఓ బలరామా! నీ తమ్ముడు శ్రీకృష్ణుడూ ,నీవూ ఇంకా నిద్రించడం తగదు. కాబట్టి శీఘ్రమే లేచి రండి! ” అని , అందరిని క్రమం తప్పకుండా మేల్కొలుపుతున్నారు వాళ్ళు. “కృపతో మేలుకొనవా కృష్ణా!” ఇది వాళ్ళ కోరిక.
ఈ పాశురం లో రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి భగవంతునికి తల్లిదండ్రులు, అన్నా వంటి ప్రముఖులు ఉన్న మంచి కుటుంబం ఉన్నది అనేది. రెండో విషయం స్త్రీ ను ” పెబ్బలి తీగ” తో పోల్చడం. ఎందుకు ఇలా పోల్చారంటే… పెబ్బలి తీగ సముద్రం ఒడ్డున పెరుగుతుంది. సంసారం అనేది సాగరం అంటాం. కుటుంబం తో అల్లుకుని ఉంటుంది ఆడవాళ్ళ జీవితం. అలలను, ఆటుపోట్లనూ తట్టుకుంటుంది. ఎన్ని వరదలొచ్చినా ఏటికి ఎదురునిలిచి బ్రతుకుతుంది , పచ్చపచ్చని ఆకులతో నవ్వుతుంది. నీటి లభ్యత నూ సూచిస్తుంది కాబట్టి , వినమ్రతా భావం తోనూ ఉండే స్త్రీల వర్ణనలో పోల్చాలనుకున్నప్పుడు సాహిత్యం లో ప్రాముఖ్యం ఉన్న ఈ తీగలను సంస్కృత భాష లో
“వేతసం” అంటారు. చెట్టు రూపంలో కొన్ని సార్లు, తీగ రూపం లో కొన్నిసార్లు ఉపమా రూపకాలంకారాల వర్ణనలలో ఉపయోగిస్తారు కవులు. ఇంటిపని, బయట చేసే ఉద్యోగాల పని ఇప్పుడు ఆధునిక మహిళలు కూడా ఎంతో సమర్థవంతంగా చేస్తున్నారు. ఈ పోలిక సరిపోతుంది. ఇలా ప్రాచీన కావ్యాలలో ని విషయాలు అన్వయం చేసుకోవాలి.
18 వ పాశురం:- ఈ పాశురం లో ప్రకృతి వర్ణన తోపాటు స్త్రీ సహజత్వాన్ని వర్ణించడం చూస్తాం. ఇంకా, నప్పిన్న పిరాట్టి గురించి ఉంటుంది. అంటే లక్ష్మీ దేవి అంశం శ్రీ కృష్ణ పరమాత్మ భార్య గా అంటారు కాబట్టి గోదా దేవి ఆమెకూ మేల్కొల్పుల గీతాలు పాడుతుంది . అవేంటో చూద్దాం..
18. పాశురం
ఉందు మద గళిట్రనోడాద తోళ్వలియన్,
నందగోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!,
గందం కమళుం కుళలీ కడైతిఱవాయ్,
వందు ఎంగుం కోళి యళైత్తన కాణ్, మాదవి
పందల్ మేల్ పల్‍కాల్ కుయిలినంగళ్ కూవిన కాణ్,
పందార్ విరలి ఉన్ మైత్తునన్ పేర్ పాడ,
శెందామరై క్కైయాల్ శీరార్ వళైయొళిప్ప,
వందు తిఱవాయ్ మగిళందేలోరెంబావాయ్
భావం :
నందగోపులు మొదలుగా బలరాముని వరకు మేల్కొలిపి తలుపులు తీయమని ప్రార్థించినా వాళ్ళు తెరువకపోవుటం వల్ల , ఇలా పిలుస్తుంది “మదజలం స్రవిస్తున్న ఏనుగు లా శత్రువులకు భయపడని భుజాలున్న నందగోపుని కోడలా! ఓ నప్పిన్న పిరాట్టీ! పరిమళిస్తున్న కేశ సంపద కలదానా! తలుపు తెరువుమమ్మా! కోళ్లు వచ్చి కూస్తున్నట్టే జాజి పందిళ్ల మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటిమాటికి కూయుచున్నవి. సుమా! నీవు, నీ భర్తయును సరససల్లాపాలాడే సందర్భాలలో నీకు ఓటమి కలిగినప్పుడు మేము నీ పక్షాన్నే ఉంటాం. దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడుతాములే! ! కాబట్టి అందమైన నీ చేతులకున్న భూషణాలన్నీ ధ్వనించేటట్టు నువ్వు నడచి వచ్చి ఎర్ర తామరలవంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తెరువుమమ్మా!’ అని గోపాంగనలు నీళాదేవిని ఈ పాశురంలో మేల్కొల్పుల పాటలు పాడుతున్నారు. ”
ఈ పాశురం స్త్రీ ల సౌకుమార్యం వర్ణిస్తూ నే పురుశోత్తముని విశేషాలు చెప్తారు . నీళా దేవి , పిరాట్టి లక్ష్మీ అలా ఉన్న పేర్లు చెబుతారు . దీని వల్ల తెలియనివెన్నో కొత్త విషయాలు తెలుస్తాయి.
_**__
19. పాశురం
ఈ పాశురం లో నీళా కృష్ణ ల ప్రణయాన్ని చెబుతూ, భగవంతుని సేవకు పరితపించే స్థితి ని వర్ణిస్తుంది గోదమ్మ
19 వ పాశురం భావార్థాలు–
పాశురం:-
కుత్తు విళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్ మేల్,
మెత్తెన్ఱ పంచశయనత్తిన్ మేలేఱి,
కొత్తలర్ పూంగుళల్ నప్పిన్నై కొంగైమేల్,
వైత్తు క్కిడంద మలర్ మార్ పా వాయ్ తిఱవాయ్,
మైత్తడం కణ్ణినాయ్ నీయున్ మణాళనై,
ఎత్తనై పోదుం తుయిలెళవొట్టాయ్ కాణ్,
ఎత్తనైయేలుం పిరివాట్ర గిల్లైయాల్,
తత్తువమనృ తగవేలోరెంబావాయ్
19 వ పాశురం భావం :
గుత్తి దీపపు కాంతులు నాల్గు దిశల వెలుగులు ప్రసరిస్తుంటే ఏనుగు దంతాలతో చేసిన కోళ్లు గల మంచం మీద అందము,చలువ,మార్దవము, పరిమళము, తెలుపులనే- ఐదు గుణా లను కలిగిన హంసతూలికా తల్పముపై పవళించి ఉన్న సమయంలో , గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులతో అలంకరించబడిన శిరోజాలు కలిగిన నీళాదేవిని తన విశాల వక్షస్థలం పై వేసుకొని పవళించి ఉన్న ఓ స్వామి! నోరు తెరచి ఒక్క మాటైననూ మాట్లాడకూడదా? కాటుక తో అలంకరించుకున్న విశాలమైన నేత్రాలున్న ఓ నీళాదేవి ! జగత్స్వామియైన శ్రీకృష్ణణుని స్వల్ప కాలం కూడా విడిచి బయటకు వచ్చుటకు అనుమంతింపకున్నావు! క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే? ఇది నీ స్వరూపమునకు, నీ స్వభావమునకును తగదు. నీవలే మేము కూడా అతనికి అనన్యార్హశేషభూతలమే కదా! కానీ కరుణించి కొంచెమవకాశమీయుము తల్లీ! అట్టి అవకాశము నీవు ఇచ్చితివేని మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్కైంకర్యరూప మంగళ వ్రతముగా సాంగోపసాంగంగా సమాప్తి చెందును. ఇందు ఏ మాత్రమూ సంశయము లేదు అని ఆండాళమ్మవారు నీళాకృష్ణులను వేడుకుంటున్నారు” .
ఈ పాశురం లో నీళా కృష్ణుల జీవన విధానాన్ని చెబుతూనే , వాళ్ళు ఉపయోగించే వస్తువులను వర్ణిస్తూనే గోదా దేవి తనకూ గోపికలకూ కృష్ణ భక్తి ని సమర్పించుకునే అవకాశాన్ని ఇమ్మని వేడుకుంటుంది. అనన్యార్హభూతులను చేయమని అంటే , భగవంతుని కి సమర్పించని జీవితం వృధా కదా అనీ అట్లా దేవుని అనుగ్రహ పాత్రులైన ఉన్నత భావాలలో మేముండాలి అని గోపికలు కోరుకున్నట్టు చెప్పడం చూస్తాం.
20. పాశురం :
గోదా దేవి చేసే ఈ మేల్కొలుపులలో భగవంతుని కైంకర్యం కోసం ఏమేమి చేయాలో చెబుతున్న సందర్భం లో దేవతలనే రక్షించే వాడిగా చెప్పడం చూస్తాం..
20 వ పాశురం భావార్థాలు:-
ముప్పత్తు మూవరమరర్కు మున్ శెనృ,
కప్పం తవిర్కుం కలియే తుయిలెళాయ్,
శెప్పముడైయాయ్ తిఱలుడైయాయ్, శెట్రార్కు
వెప్పం కొడుక్కుం విమలా తుయిలెళాయ్,
శెప్పన్న మెన్ములై శెవ్వాయి శిఋమరుంగుల్,
నప్పిన్నై నంగాయ్ తిరువే
తుయిలెళాయ్,
ఉక్కముం తట్టొళియుం తందున్ మణాళనై,
ఇప్పోదే యెమ్మై నీరాట్టేలోరెంబావాయ్
20 వ పాశురం భావము :
ముప్పది మూడు కోట్ల దేవతలకు ఏ విధమైన సంకటాలు వచ్చినా ముందుగానే అక్కడికి పోయి, వాళ్ళ ను రక్షించే సమర్థతగల ఓ స్వామి! నిద్ర లేచిరమ్ము. ఆశ్రితులను రక్షించడం కోసం వాళ్ళ విరోధులను దునుమాడు బలాఢ్యుడా! ఆశ్రిత రక్షకా! ఓ బలశాలీ! శత్రువులకు మాత్రమే అతి దుఃఖాన్నిచ్చే నిర్మలుడా! నిద్ర నుండి మేల్కొను స్వామి! అని స్తుతిస్తూ మేల్కొలుపినా కానీ …. స్వామి లేవకపోవడాన్ని చూచి , జగన్నాటక సూత్రధారియైన ఆ జగన్నాధుని మేల్కొలపుమని నీళాదేవిని ప్రార్థిస్తున్నారు గోపికలు. బంగారు కలశాల వంటి పాద ద్వయం, దొండపండు వంటి అధరాలు , సన్నని నడుమూ తో అతిలోక సుందరంగా విరాజిల్లుచున్న నీళాదేవి! నువ్వు మహాలక్ష్మీ సమానురాలవు! కరుణించి నీవైనా మేల్కొనవమ్మా! ‘నేను లేచి చేయవలెనందువేమో!’ విను- మన స్వామి శ్రీకృష్ణునికి శరీరం పైన చిరుచెమట పట్టినప్పుడు దాన్ని ఉపశమింపచేయడానికి వీవన(విసనకర్ర ) కైంకర్యం చేయడానికి ఒక దివ్యమైన విసనకర్రను ఇవ్వమ్మా! ప్రబోధ సమయం లో స్వామి తిరుముఖ మండలాన్ని చూడటానికి ఒక దివ్య మణిదర్పణాన్ని (అద్దము) ఇవ్వవా ! వీటన్నింటిని మాకు అనుగ్రహించి, స్వామిని మేల్కొలిపి, మమ్ము అతనితో కూర్చి మంగళ స్నానాన్ని చేయింపవా తల్లీ! నీ అనుగ్రహముంటేనే కద మా యీ వ్రతం మంగళకరంగా పూర్తి కాగలదు?’ అని ఆండాళ్ తల్లి నీళాదేవిని వేడుకొంటున్నారు.
21. పాశురం
ఏట్ర కలంగళ్ ఎదిర్పొంగి మీదళిప్ప,
మాట్రాదే పాల్ శొరియుం వళ్ళల్ పెరుం పశుక్కళ్,
ఆట్రప్పడైత్తాన్ మగనే అఱివుఱాయ్,
ఊట్రముడైయాయ్ పెరియాయ్, ఉలగినిల్
తోట్రమాయ్ నిన్ఱ శుడరే తుయిలెళాయ్,
మాట్రారునక్కు వలితొలైందు ఉన్ వాశఱ్కణ్,
ఆట్రాదు వందు ఉన్నడి పణియుమాపోలే,
పోట్రియాం వందోం పుగళందేలోరెంబావాయ్
భావము :
పాలను పిదుకుటకై పొదుగుల క్రింద ఎన్ని భాండములనుంచినను అవన్నియు పొంగిపొరలి పోవునట్లు క్షీరధారలను వర్షించే గోసంపద కలిగి ఉన్న శ్రీ నందగోపుని కుమారుడవైన శ్రీకృష్ణా! మేల్కొని మమ్ము కనరావయ్య! అప్రతిహత ధైర్య సాహసములను కల్గియును ఆశ్రిత పక్షపాతివై సర్వులకు ఆత్మ స్వరూపుడవైన నీవు ఈ భూలోకమునందు అవతరించిన ఉజ్వల రత్నదీపమా! వేద ప్రమాణ ప్రసిద్ధుడా! ఆ వేదము చేతనైనను ఎరుక పడనంతటి మహా మహిమాన్వితుడా! ఈ దీనులను కటాక్షించి మేలుకొనుము. శత్రువులెవ్వరూ నీ పరాక్రమమునకు తాళజాలక భయపడి నీకు ఓడిపోయి, నీ వాకిట నిల్చి, నిన్ను శరణుజొచ్చిన రీతిని మేమందరమూ అనన్య ప్రయోజనులమై ‘నీవే తప్ప ఇఃతపరంబెరుగ’మని నీ పాదదాసులమై వచ్చితిమి. మీ దాసులమైన మేమందరమును నీ దివ్య కళ్యాణ గుణ సంకీర్తనము చేయగా వచ్చినాము. నీ దివ్య మంగళ విగ్రహమునకు దివ్య మంగళాశాసనము చేయాలని స్వామి! నిన్నాశ్రయించి వచ్చిన మమ్ము కరుణించడానికి మేలుకో స్వామీ! లేచి రావయ్యా! ! అని వేడుకొంటున్నారు.
అర్థ వివరణ:- ఈ గోపాలురు సమస్త మానవ సంఘానికి ప్రతినిధులు. భగవంతుని ప్రేమ పాలభాండాలు పొంగిపొర్లుతున్నాయి అని చెప్పడం చూస్తాం. అదెలాగో చూసాం. ఎన్ని ఉన్నా చివరికి చేరుకోవాల్సిన గమ్యం అదే అయినప్పుడు తనదైన ధర్మాన్ని ఆచరిస్తూనే నీవు తప్ప .. అని వేడుకున్న తర్వాత జరిగిన గజేంద్ర మోక్షం కనులముందాడుతుంది!
_*_
22. పాశురం :
జీవిత చరమాంకానికీ యవ్వనం వికారానికీ మధ్య ఊగిసలేంటో ఈ పాశురం ఎటువంటి పోలికలు చెబుతున్నదో చూద్దాం..
పాశురం:-
అంగణ్ మా ఞాలత్తరశర్,
అభిమాన బంగమాయ్ వందు నిన్ పళ్ళిక్కట్టిఱ్కీళే,
శంగమిరుప్పార్ పోల్ వందు తలైప్పెయ్‍దోం,
కింకిణి వాయ్‍చ్చెయ్‍ద తామరై ప్పూప్పోలే,
శెంగణ్ శిఋచ్చిఱిదే యెమ్మేల్ విళియావో,
తింగళుమాదిత్తియను మెళుందాఱ్పోల్,
అంగణిరండుంకొండు ఎంగళ్ మేల్ నోక్కుదియేల్,
ఎంగళ్ మేల్ శాపమిళిందేలోరెంబావాయ్
22. పాశురం భావము , అర్థ వివరణ:-
ఈ సుందర సువిశాలమైన భూమిని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన రాజులందరూ తమకు ఎవ్వరు ఎదురు లేరనే అహంకారాన్ని వీడి, అభిమానులై నీ శరణు జొచ్చారు. అనన్య శరణాగతిని చేస్తూ నీ సింహాసనం దగ్గర గుంపులు గుంపులుగా చేరినట్టు మేము అనన్య ప్రయోజునులమై నీ శరణుజొచ్చాము. మాకు నీవు తప్ప వేరే దిక్కే లేదు స్వామి!
చిరుమువ్వలు నోళ్ళు తెరచినట్లు, సగము విరిసిన తామరపువ్వు మురిసినట్టు మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాలనుంచి జాలువారే వాత్సల్య కరుణారస దృక్కులను మాపై ప్రసరింపనిమ్ము. సూర్యచంద్రులు
ఉదయించెనా అన్నట్టు కనిపించే నీ కన్నుదోయి నుంచి జాలువారే కరుణ వాత్సల్యరసదృక్కులు మాపై ప్రసరిస్తే మా కర్మ బంధాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మా కర్మబంధాలు తొలగగానే మేము నిన్ను చేరుకొంటాం కద! మా వ్రతానికి పొందవలసిన ఫలము కూడ ఇదే కదా! అని, కర్మ బంధం తొలిగితే ముక్తి లభిస్తుందని ఆండాళ్ తల్లి తెలియజేస్తుంది.
వివరణ:-
భగవంతుడు ఆశ్రిత రక్షకుడు. అద్భుతమైన సాహిత్య విలువలతో కూడిన అలంకార యుక్తమైన వాక్య నిర్మాణ శైలి తో పాటు భక్తి ముక్తి మధ్య ఉన్న అనుసంధానం వివరించారు.
_*_
23 వ పాశురం భావార్థాలు:-
ప్రకృతి మనిషికి ఆదర్శం. కాలం తనపని తాను చేస్తూ ముందుకెట్లా సాగుతోందో అలా అనుకున్నప్పుడు ఈ ప్రకృతే భగవంతుడు అని భక్తుల నమ్మకం ఎలా అవుతుందో ఈ పాశురం లో చూడగలం.
23. పాశురం :
మారిమలై ముళైంజిల్ మన్ని క్కిడందుఱంగుం,
శీరియ శింగమఱివుట్రు త్తీవిళిత్తు,
వేరి మయిర్ప్పొంగ వెప్పాడుం పేరందూదఱి,
మూరి నిమిరందు ముళంగి ప్పుఱప్పట్టు,
పోదరుమా పోలే నీ పూవైప్పూవణ్ణా,
ఉన్కోయిల్ నినృ ఇంగనే పోందరుళి,
కోప్పుడైయ శీరియ శింగాశనత్తిరుందు,
యాం వంద కారియమారాయ్‍ందరుళేలోరెంబావాయ్
భావము :
“వర్షాకాలం లో చలనం లేకుండా పర్వత గుహలో ముడుచుకొని పడుకుని నిద్రిస్తున్న సింహం మేల్కొని, తీక్షణమైన తన చూపులతో నలుదిశలా పరికించినట్టు , పరిమళాలతో ఉన్న తన జూలు నిక్కబొడుచునట్లు అటుయిటు దొర్లి, లేచి తన శరీరాన్ని బాగా సాగదీసి, ఒళ్లు విరుచుకొని ఒక్క పెట్టున గర్జించి, గుహనుంచి రాజఠీవితో బయటకు వచ్చిన విధంగా అతసీ పుష్పపు రంగు కలిగిన ఓ స్వామి! నువ్వు నీ భవనం నుండి ఆ సింహరాజము రీతిలో వచ్చి, మనోహరంగా అలంకరించబడిన ఈ దివ్య సింహాసనాన్ని అలంకరించాలి. ఆ తర్వాత మేము వచ్చిన కార్యం విషయమై తెలుసుకోవాలి. తెలుసుకుని , మీ అభీష్టాన్ని అనుగ్రహించాలి”! అని స్వామిని గోపికలతో కూడిన ఆండాళ్ తల్లి తన మనోభీష్టాన్ని తెలియజేసింది.
అర్థ వివరణ:- వనరాజు సింహం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ పాశురం లో సింహం ప్రస్థానం గొప్ప పోలిక . అలాగే, ” కృష్ణాష్టకం” లో ” అతసీ పుష్ప సంకాశం హార నూపురం శోభితమ్ ।
రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం।।” అని చెప్పినట్టు కృష్ణ ఛాయలో .. అంటే నీలం వర్ణంతో మెరిసే లా ఉన్న పూల హారంతో వెలుగుతున్న భగవంతుడు అని అర్థం.
శ్రీ కృష్ణ పరమాత్మ ను మేల్కొల్పడానికి గోదమ్మ పోలికగా తీసుకున్నారు.
_**_
24 పాశురం భావార్థాలు:-
ఈ పాశురం అర్థం తెలుసుకోబోయే ముందు దశావతారాల ప్రాశస్త్యం తెలియాలి. ముఖ్యంగా శ్రీ కృష్ణావతారం లోని విశేషాలు కీర్తిస్తూ భగవంతుని తో గోదాదేవి ఎలా అంటూందో ఈ పాశురం చెబుతుంది!
24. పాశురం :
అనృ ఇవ్వులగమళందాయ్ అడిపోట్రి,
శెన్ఱంగుత్ తెన్నిలంగై శెట్రాయ్ తిఱల్ పోట్రి,
పొన్ఱ చ్చగడముదైత్తాయ్ పుగళ్ పోట్రి,
కనృ కుణిలా వెఱిందాయ్ కళల్ పోట్రి,
కునృ కుడైయాయ్ ఎడుత్తాయ్ గుణం పోట్రి,
వెనృ పగై కెడుక్కుం నిన్‍కైయిల్ వేల్ పోట్రి,
ఎన్ఱెనృన్ శేవగమే యేత్తి ప్పఱై కొళ్వాన్,
ఇనృ యాం వందోం ఇరందేలోరెంబావాయ్.
భావము :
” అలనాడు బలివలన దుఃఖితులైన దేవతలను రక్షించడానికి త్రివిక్రముడవై మూడు లోకాలను కొలిచిన వామనుడా! నీ రెండు పాదాలకు మంగళము! సీతమ్మను అపహరించిన దుష్టుడగు రావణుని లంకను గెలిచిన ఓ శ్రీరామా! నీ ధీరతకు మంగళం! బండి రూపములో శకటాసురుడనే రాక్షసుడు నిన్ను చంప ప్రయత్నించగా వాని కీళ్ళూడునట్లు తన్నిన నీ కీర్తి ప్రభలకు మంగళము! దూడ రూపమున నిన్ను చంపవచ్చిన వత్సాసురుడనే రాక్షసుని, వెలగ చెట్టుగా దారికి ప్రక్కన నిల్చిన కపితాసురుడనే రాక్షసుని ఒక్కసారిగా వంచి సంహరించిన నీ పాదాలకు మంగళము. దేవేంద్రుడు రాళ్ల వర్షాన్ని కురిపించిగా గోవర్ధనగిరిని గొడుగుగా ఎత్తి గోకులాన్ని రక్షించిన నీ ఆశ్రిత రక్షణ గుణానికి మంగళమగుగాక! శత్రువుల్ని చీల్చి చెండాడేటువంటి నీ చేతి చక్రానికి మంగళము! ఇట్లా నీ వీర గాథలనెన్నింటినో నోరార స్తుతిస్తాము. నీ నుండి మా నోముకు కావలసిన పరికరాలను పొందడానికి మేము ఈ రోజు ఇక్కడికి వచ్చి ఉన్నాము. కాబట్టి మా యందు దయచేసి అన్నింటినీ కృపతో ప్రసాదించవా!” అని గోపికలందరు స్వామిని వేడుకొన్నారు.
పాశురం అర్థ వివరణ:-
ఈ పాశురం కృష్ణ స్వామి ను ఎందుకు కీర్తించాలో అక్షరాక్షరం చెబుతున్నవి. పరమాత్మ లీలలను చూపించి అవన్నీ తెలుసుకోవాలన్న ఆసక్తి ను ప్రేరేపిస్తుంది. అన్యాయాన్ని ఎదిరించేవాడిగా, దుర్మార్గులను శిక్షించేవాడిగా ప్రతి అవతారం లో దేవుడు కనిపిస్తాడు. అహంభావం ఉండరాదని చెప్పిన గోవర్ధన గిరి ని ఎత్తడం అనే కథ చెబుతుంది. ఇలా ప్రతి పాశురం ఓ కొత్త విషయం చెబుతుంది. మనసు పెట్టి చదివితే!!
25 వ పాశురం భావార్థాలు:-
ఇహ పర స్పృహ కు సంబంధించిన వివరాలు ఉన్న పాశురం.
25. పాశురం :
ఒరుత్తి మగనాయ్ ప్పిఱందు, ఓరిరవిల్
ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర,
తరిక్కిలానాగిత్తాన్ తీంగు నినైంద,
కరుత్తై ప్పిళైప్పిత్తు క్కంజన్ వయిట్రిల్,
నెరుప్పెన్న నిన్ఱ నెడుమాలే, ఉన్నై
అరుత్తిత్తు వందోం పఱై తరుదియాగిల్,
తిరుత్తక్క శెల్వముం శేవగముం యాంపాడి,
వరుత్తముం తీరందు మగిళందేలోరెంబావాయ్
భావము :
ఓ కృష్ణా! పరమ భాగ్యవతైన శ్రీ దేవకీదేవి ముద్దుల పట్టిగ అవతరించి, అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్దుబిడ్డవై రహస్యం గా శుక్లపక్ష చంద్రుని లా పెరుగుతుండటంతో గూఢాచారులవలతో ఈ విషయాన్ని తెలుసుకున్న కంసుడు నిన్ను మట్టుబెట్టేందుకు ఆలోచిస్తుంటే అతడి ప్రయత్నములన్నీ వ్యర్థం చేసి అతని గర్భములో చిచ్చుపెట్టినట్టు నిల్చిన భక్త వత్సలుడవు! అటువంటి నిన్ను భక్తి పూర్వకంగా ప్రార్థించి నీ సన్నిధికి చేరినాము. మాకు ఇష్టార్దమైన ‘పఱ’ అను వాద్యాన్ని అనుగ్రహింపు.
ఇట్లా మమ్మనుగ్రహించిన శ్రీ లక్ష్మీదేవి ఆశపడదగిన సంపదను, దానిని సార్థక పరచు నీ శౌర్యాన్ని పొగిడి , మాకు కలిగిన సంకటాలను నీ విశేషాలతో నివారణ చేసికొని మేము సుఖిస్తాం. నీవిట్లా కృపచేయడం వల్ల మా ఈ అద్వితీయమైన వ్రతము శుభముగ సంపూర్ణమగును.
అర్థ వివరణ:-
” పర వాద్యం” అంటే పవిత్రమైన వాద్యమనీ, గొప్ప ఆనందాన్ని ఇచ్చే దనీ అంటారు. వేరొక వాద్యం. పవిత్రమైన వాద్యం. ఇది భౌతిక వాద్యం కాదు, భక్తి వాయిద్యం. అంటే మోక్ష జ్ఞానం ఇచ్చే జ్ఞానం అనీ జనన మరణ చక్రాలను ఛేదించి పరమాత్మను చేరే సాధనం గా ఉండే జ్ఞానం ప్రదాత గా ఉండే విద్య గా అంటారు. ఈ “వేరే ప్రత్యేక జ్ఞానాన్ని” ప్రసాదించమని గోదా దేవి భగవంతుని కోరుతున్నారు. ఇటువంటి గొప్ప విషయాలు పాశురాలు చెబుతున్నాయి.
26. పాశురం :
వటపత్రశాయి యైన ఆ కృష్ణ పరమాత్మ వేడుకునే రీతులు ఎన్నెన్నో విధాలు! భక్తి శ్రద్ధలతో పూజించి ఆ స్వామి ను ఎలా ప్రసన్నం చేసుకున్నదో గోదామాత! ఈ పాశురం లో చూద్దాం..
పాశురం:-
మాలే ! మణివణ్ణా ! మార్గళి నీరాడువాన్,
మేలైయార్ శెయ్‍వనగళ్ వేండువన కేట్టియేల్,
ఞాలత్తైయెల్లాం నడుంగ మురల్వన,
పాలన్న వణ్ణత్తు ఉన్ పాంచజన్నియమే,
పోల్వన శంగంగళ్ పోయ్‍ప్పాడుడైయనవే,
శాలప్పెరుం పఱైయే పల్లాండిశైప్పారే,
కోల విళక్కే కొడియే వితానమే,
ఆలినిలైయాయ్ అరుళేలోరెంబావాయ్
భావము :
“ఆశ్రిత వ్యామోహమే స్వరూపం గా కలిగిన ఇంద్రనీలమణి వంటి శరీరం కలవాడా! ఓ వటపత్రశాయి! మార్గశీర్ష మాస స్నానం చేయగా వచ్చాము. మా పూర్వులునూ ఈ స్నాన వ్రతాన్ని ఆచరించారు. ఈ వ్రతానికవసరమైన పరికరాలను తీసుకోవాలని నిన్నర్థించడానికి వచ్చాము. దయచేసి ఆలకించు దేవా.. భూమండలమంతా వణుకు కల్గించేలా ధ్వనించే పాలవంటి తెల్లనైన శంఖములు సరిగా నీ పాంచజన్యము వంటివి కావాలి, అతి పెద్దవైన ‘పఱ’ వంటి వాద్యములు కావాలి. మృదుమధురమైన కంఠాలతో మంగళ గానాలను పాడి నిను ప్రసన్నులను చేసే భాగవతులు కూడా కావాలి. వ్రతంలో ముందుకు సాగే నిమిత్తం మంగళదీపమూ కావాలి. వ్రాత సంకేతాలు గా చాలా చాందినీలూ కావాలి. లోకాలన్నింటినీ నీ చిరుబొజ్జలో దాచుకొని, ఒక లేత మఱ్ఱి ఆకు మీద పడుకున్న నీకు చేతకానిదేమున్నది స్వామి! కరుణించి మా వ్రతం మొత్తం సంపూర్ణంగా పూర్తి అయ్యేలా మంగళా శాసనం చేసి మాకు అన్నింటినీ ప్రసాదించు తండ్రీ!!”
వివరణ:- మర్రి ఆకు మీద శయనించిన విష్ణుమూర్తి చిన్నారి బాలుని రూపంలో ఈ సమస్త సృష్టికి మూలమైన జీవన స్థితిగతులు చెప్తుంది. వట వృక్షం అంటే మర్రి చెట్టు. వట పత్రం అంటే మర్రి ఆకు. ఆనాటి మహాప్రళయ సందర్భంగా మొత్తం విశ్వమంతా మునిగిపోయినప్పుడు చిన్న మర్రి ఆకు పై పడుకుని చిద్విలాస రూపంలో జీవరాసినీ కాపీ ఉన్న శ్రీ కృష్ణ పరమాత్మ ను వేడుకున్నారని అర్థం.
_*_
27 వ పాశురం భావార్థాలు:-
ఈ పాశురం లో నీళా దేవి గోపికల సమేతంగా కోరుతున్న కోరికలను చూస్తుంటే, త్రేతాయుగంలో
భగవంతునికి రేగిపళ్ళు తినిపించిన శబరి మాత గుర్తుకు వస్తుంది. ఈ వ్రత దీక్ష ఎప్పుడు ఫలించినట్టు? అల్పమైన జీవులు వీళ్ళు.. వాళ్ళ కోరికలేమై ఉంటాయి? ఈ పాశురం లో చూద్దాం..
27. పాశురం :
కూడారై వెల్లుం శీర్ గోవిందా,
ఉన్ తన్నై పాడి పఱై కొండు యాం పెఋ శమ్మానం,
నాడు పుగళుం పరిశినాల్ నన్ఱాగ,
శూడగమే తోళ్ వళైయే తోడే శెవిప్పూవే,
పాడగమే ఎన్ఱనైయ పల్‍గలనుం యామణివోం,
ఆడై యుడుప్పోం అదన్ పిన్నే పార్శోఋ,
మూడ నెయ్ పెయ్‍దు ముళంగై వళివార,
కూడియిరుందు కుళిరందేలోరెంబావాయ్
భావము :
నిన్ను ఆశ్రయించని వాళ్ళ ను కూడా వాళ్ళ మనస్సులను మార్చి నీకు దాసులైనట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడా ఓ గోవిందా! నిన్ను స్తుతించి నీనుండి ‘పఱ’ అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడాలని మా కోరిక ! నీ అనుగ్రహానికి పాత్రులమయ్యామని మిమ్మల్ని ఈ లోకమంతా పొగడాలి. మేము పొందే ఆ సన్మానమూ లోకులందరూ పొగుడేలా ఉండాలి. ఆనాటి మా రూపాలు ప్రకాశవంతంగా, తేజోమయంగా విరాజిల్లుతూ ఉండాలి. దానికోసం మాకు కొన్ని భూషణాలు కావాలి. ముంజేతికి కంకణాలు , భుజాలకు అలంకరించుకోవడానికీ భుజకీర్తులు కావాలి. దండలకు తోడవులూ, ఇంకా ఎన్నో ఆ భూషణాలను నువ్వు అనుగ్రహించాలి, మేము ధరించాలి.సన్మానాలు పొందాలి. వీటన్నిటిని ధరించి ఆపై మేలిమి దుస్తులను , మేలిమి చీరలనూ కట్టుకోవాలి. ఆ తర్వాత క్షీరాన్నం మునుగేటట్టు పోసిన నెయ్యి మోచేతిగుండా కారుతుంటే మేమంతా నీతో కలసి చక్కగా ఆరగించాలి. ఇదీ మా కోరిక. ఇట్లా అయితే మా వ్రతము మంగళప్రదమైనట్లే!”
వివరణ:- అల్పమైన వీళ్ళ కోరికల్లో అనల్పమైన భావం దాగి ఉంది. మానవావసరాలైన ప్రాథమిక జీవన స్థితిగతులలో కూడు గుడ్డ నీడ అనేవే కోరుతున్నారు గాని అష్టైశ్వర్యాలు అడగలేదు . వాళ్లేమీ దండకడియాలు కంకణాలూ రత్నఖచిత మణిమాణిక్యాల స్వర్ణ భూషణాలడుగలేదు. పాలూ పెరుగు నేయి ఇష్టపడుతున్నారంటే సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారనీ అవి కూడా కృష్ణయ్య తో కలిసి తినాలనీ కోరుతున్నారు. ఇంతటి విశేషార్థం దాగి ఉన్న దీ పాశురం లో!
_*__
28 వ పాశురం భావార్థాలు:-
” ఎలా పిలిచినా పలుకుతాను ” అంటాడు భగవంతుడు. అట్లా తమతో కలిసి భుజించడం ఎంత ఇష్టమో పై పాశురం లో చూసేస్తే, ఇందులో తొందరగా మా తప్పు లేమైనా ఉంటే క్షమించండి అని వేడుకున్నారు. అంతటి సమర్పణాభావం!!
28. పాశురం :
కఱవైగళ్ పిన్ శెనృ కానం శేరందుణ్బోం,
అఱివొనృ మిల్లాద వాయ్‍క్కులత్తు,
ఉంతన్నై పిఱవి పెరుందనై ప్పుణ్ణియుం యాముడైయోం,
కుఱై ఒనృమిల్లాద గోవిందా,
ఉన్ తన్నోడు ఉఱవేల్ నమక్కు ఇంగొళిక్క ఒళియాదు,
అఱియాద పిళ్ళైగళోం అన్బినాల్,
ఉన్ తన్నై శిఋపేరళైత్తనవుం శీఱి యరుళాదే,
ఇఱైవా! నీ తారాయ్ పఱై యేలోరెంబావాయ్
భావము :
ఓ కృష్ణా! మేము అవివేక శిఖామణులం . తెల్లవారగానే చద్దితాగి పశువులను మేపి , సాయంకాలం తిరిగి చేరేవాళ్ళం.
వివేకం ఏమాత్రం లేనివాళ్లం . అజ్ఞానులం. గొల్లపడుచులం , గొల్లవాళ్ళ. నీవు మా గొల్లకులములో జన్మించుడమే మాకుమహాభాగ్యము. మీ తోటి సహవాసమే మాకు అదృష్టము. ఈ బంధమెన్నటికినీ తెగనిది, తెంచలేనిది. మా గోపకులం ధన్యమైంది. పరిపూర్ణ కళ్యాణ గుణగణాలతో ప్రకాశించే నీవు గోవిందుడువు. మాకు లోక మర్యాద మాత్రము తెలియక చిన్నచిన్న పేర్లతో కృష్ణా!గోవిందా! అని పిలిచాము. స్వామీ! అందుకు కోపగించుకోకు! జ్ఞానులు పొందవలసిన ఆ ‘పఱ’ వాద్యమును ఈ కారణమున మాకు ఇవ్వననబోకుము. నీతో మెలిగిన సఖులమనే యెంచి మాపై కృప చేయుము అని గోపికలందరూ స్వామికి శరణాగతిని చేశారు. తమను అనుగ్రహించి వ్రతమును పూర్తిచేయగ ఆశీర్వదించమని, తమ తప్పులను సవరించు ” అని క్షమాయాచన చేశారు.
వివరణ:- తల్లిదండ్రులు పిల్లల తప్పు దిద్దనట్టు, ప్రేమ పంచినట్టూ పెంచినట్టు .. కాచుకొని
ఉంటాడు. అని అర్థం.
_*_
29.పాశురం :
శిట్రం శిఱుకాలే వందున్నై శేవిత్తు,
ఉన్ పోట్రామరై అడియే పోట్రుం పొరుళ్ కేళాయ్,
పెట్రం మేయ్‍త్తుణ్ణుం కులత్తిల్ పిఱందు,
నీ కుట్రేవల్ ఎంగళై కొళ్ళామల్ పోగాదు,
ఇట్రై పఱై కొళ్వాననృ కాణ్ గోవిందా,
ఎట్రైక్కుం ఏళ్ ఏళ్ పిఱవిక్కుం,
ఉన్ తన్నోడు ఉట్రోమే యావోం ఉనక్కే నాం ఆట్చెయ్‍వోం,
మట్రై నం కామంగళ్ మాట్రేలోరెంబావాయ్
భావము :
ఓ స్వామీ! శ్రీకృష్ణా! నీ పాదారవింద దాసులమగు మేము మిక్కిలి వేకువనే లేచి నీ సన్నిధికి వచ్చి నిన్ను దర్శించి నీ సుందర తిరువడులకు మంగళాశాసనము చేయుటే మాకు పరమావధి, ఎందుకనగా పశువులను మేపి మా జీవనం నడుపుకొనే అజ్ఞానులమైన మేము చేసే అంతరంగ సేవలను నీవు స్వీకరించకుండ ఉండరాదు. ఏలనగా నీవు మా గొల్లకులములో జన్మించి మా కులమును, మమ్ములను ధన్యులను చేసినవాడవు.
ఓ గోవిందా! పుండరీకాక్షా! మేము నీ వద్ద కు ‘పఱ’ అను వాద్యమును పొందుటకు రాలేదు. అది ఒక నిమిత్తమే! వ్రతము నిమిత్తమే! మేము ఏడేడు జన్మల వరకును మరియు ఈ కాలతత్వముండు వరకును నీకు అనివార్య శేషభూతులమై నీతోడ చేరి నీ దాస్యము చేయుచుండువారము కామా? మా యందు ఇతరములైన ఆపేక్షలేవైన ఉన్నచో వానిని తొలగించి మమ్ము కృపచూడుము స్వామి! సదా నీ సేవలను మాకొసగము. అని వ్రత ఫలమును ఆండాళ్ తల్లి వివరించింది.
వివరణ:- ఆండాళ్ తల్లి మనందరి పక్షాన ఈ పూజ చేయడం చూస్తాం.
_*_
30 పాశురం:
వంగక్కడల్ కడైంద మాదవనై కేశవనై,
తింగళ్ తిరుముగత్తు చ్చెయిళైయార్ శెన్ఱిఱైంజి,
అంగప్పఱై కొండవాట్రై,
అణిపుదువై పైంగమలత్ తణ్‍తెరియల్ పట్టర్ పిరాన్ కోదై శొన్న,
శంగ త్తమిళ్ మాలై ముప్పదుం తప్పామే,
ఇంగు ఇప్పరిశుఱైప్పార్ ఈరిరండు మాల్వరైత్తోళ్,
శెంగన్ తిరుముగత్తు చ్చెల్వ త్తిరుమాలాల్,
ఎంగుం తిరువరుళ్ పెట్రు ఇన్బుఋవరెంబావాయ్
భావము :
ఓడలుగల పాల సముద్రాన్ని దేవతలకోసం మధించి వారికి అమృతాన్ని ప్రసాదించినవాడూ , బ్రహ్మరుద్రాదులకు ప్రభువైనటువంటి నారాయణుని చంద్రముఖులైన గోపికలు అలంకృతులై చేరారు. మంగళాశాసనాన్ని చేసి గోకులం లో ‘పఱై’ అనే వంకతో స్వామీ వీళ్లు పొందారు. ఈ కైంకర్య విధమంతా కూడా అలంకారమైన శ్రీ విల్లిపుత్తూరులో అవతరించినట్టూ , తామర పూసల మాలలను ధరించిన పెరియాళ్వార్ల( విష్ణుచిత్తుల) పుత్రికైన గోదాదేవి సాయించింది. ఇది గోపికలు గుంపులు గుంపులుగా కూడి అనుభవించిన ప్రబంధమై, ద్రావిడ భాషలో పాశురరూపంగా ప్రవహించింది.
వివరణ:- విష్ణు మూర్తి ను చేరుకోలేని ఉద్దేశ్యంతో గోదా దేవి ఈ పాశురాలతో స్తుతించి ముక్తి నీ పొందింది.
_*_
పాశురాలు సమాప్తం!! కానీ బతుకు పాశం బతుకు పాయసం ఎప్పటికీ ఉండేవే! ఈ పాశురాలద్వారా ఏం అర్థం చేసుకోవచ్చు అనేది ముఖ్యం!!
గోదాదేవి రచించిన విష్ణు కీర్తనల ఈ తిరుప్పావై ముప్పై పాశురాలలో చివరలో వచ్చే పదమైన ” లోరున్బావాయ్” అనేది ” రెమ్బావాయ్ ” అనే మకుట పదం లోనిది. అంటే ఇదే దేవా మేం పాడే గేయం అనో మేం పాడే పద్యమనో అర్థం లో వస్తుంది. ఇంకా, ఇది మేం చేసే, మేం ఆచరించే ఉత్తమ మైన నోము దేవా , మేలైన నోము , మంచి వ్రతం అనే అర్థం లోనో ఉన్న పదం. గోదాదేవి మూలం లో రచించిన ఈ తిరుప్పావై తమిళ భాషలో ఉన్నది ఇది పన్నిద్దరాళ్వార్లు రచించిన నాలాయిర ప్రబంధాలలో ముఖ్య స్థానం లో ఉన్నది. ధనుర్మాసం లో ఈ వ్రతాన్ని చేయడం వల్ల విష్ణు మూర్తి ని చేరుకోవచ్చు అనే నమ్మకం ఉన్నది. శ్రీ కృష్ణ దేవరాయలు రచించిన ” ఆముక్తమాల్యద గ్రంథం ఈ కీర్తనల ఆధారంగా నే! ఆముక్త అంటే విడిచి వేసిన అనే అర్థంలో వాడుతున్నాం. గోదాదేవి తన మెడలో వేసుకుని తీసిన దండను భగవంతుడు స్వీకరించిన ఏకైక విషయం ఈ విష్ణుచిత్తీయం లో చూస్తాం. అందుకే ఆండాళ్ తల్లి , గోదా దేవి నోచిన ఈ నోము విశేషమైన నోము అని అందరి నమ్మకం!!
__**__

ధనుర్మాసం ప్రారంభం అయింది. ఆ విశేషాలు మరిన్ని తెలుసుకుందాం.