తులసితీర్ధం

కథ

అర్ధరాత్రి మెలకువ వచ్చిన లతకు వెనకింట్లో, అమ్మ, గదిలో లైటు వెలుగుతున్నట్లనిపించి “ఇదేమిటి! అమ్మ ఇంకా పడుకోలేదా!” అనుకుంటూ వచ్చి చూసింది. అమ్మ కనిపించలేదు. పెరటి తలుపు గడియ వేసిలేదు. అమ్మకేమైందోనని భయపడుతూ పెరట్లోకి వచ్చి చూసింది లత. తల్లి, కమల పక్కింటిలో ఉండడం చూసి, ఆశ్చర్యపడుతూ అక్కడకు వెళ్ళింది లత, అమ్మకక్కడ పని యేమిటనుకుంటూ. అక్కడ మంచం మీద కనకమ్మ ఎగూపిరితో ఉంది. కనకమ్మ చేతులు పట్టుకొని, పక్కనే కూర్చుని ఉంది కమల. ఆమె కళ్ళ నిండా నీళ్ళు. చూస్తున్న లతకే అర్థమయిపోయింది. ఏ నిమిషంలోనైనా కనకమ్మ ప్రాణాలు పోవచ్చని. అలికిడి విని వెనక్కి చూసిన కమల, లతను చూసి ఆశ్చర్యపోయింది.

“భగవధేచ్ఛ అంటే ఇదేనేమో! రా! ఇలా వచ్చి అమ్మమ్మ పక్కన కూర్చో!” అని లత చేయి పట్టుకొని కనకమ్మ పక్కన లతను కూర్చోబెట్టి, “పెద్దమ్మా! నీ మనవరాలు వచ్చింది చూడు” అని కనకమ్మ చెవిలో చెప్పింది. అమ్మ… అర్ధరాత్రి… ఇక్కడ… ఇలా…కనకమ్మ పక్కన…ఇదంతా చూస్తున్న లతకు ఆశ్చర్యంగానూ, అయోమయంగా అనిపించి…
చిన్నప్పటి విషయం….తన ఏడేళ్ళ వయసులో జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది లతకు. పక్కింటి తాతగారు తనను పిలిస్తే వాళ్ళింటికి వెళ్ళేది. ఒకసారి…. ఆ తాతగారు తనను ఒడిలో కూర్చోబెట్టుకొని అన్నీ అడుగుతున్నారు. ఇంతలో కనకమ్మ వచ్చి “చాల్లెండి! ప్రేమ కారిపోతోంది. ఇంట్లో ఉన్న మనవలను ముద్దు చెయ్యడం తెలియదు గాని, ఊర్లోవాళ్లను ముద్దు చెయ్యడం తెలుసు” అని తాతగారి ఒడిలో కూర్చున్న తనను క్రిందకు లాగింది. అప్పటి నుండి ఆ ఇంటివేపు గూడా తను చూసేది కాదు. పెద్దవుతున్నకొద్దీ అందరూ అంటున్న మాటలను బట్టి ఆ ఇంటికి, తమకి ఉన్న సంబంధబాంధవ్యాలు తెలిసాయి తనకు.
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆ ఇంట్లో మేము ఉండవలసింది. దర్జాగా బ్రతకవలసిన తాము, మిగిలిన చుట్టాలతో పోల్చుకుంటే, లేమిలో ఉండటానికి కారణం కనకమ్మేనని, లతకు కనకమ్మ అంటే కోపం కూడా వచ్చేది. ఎప్పుడైనా పెరట్లో తిరుగుతున్నప్పుడు, మంచంమీద వున్న కనకమ్మ కనిపిస్తే, జాలి కన్నా కోపమే ఎక్కువగా వచ్చేది లతకు. బాగా అయింది! అని మనసులోనే అనుకునేది. బయటకు అంటే అమ్మ ఊరుకోదని తెలుసు. లతకు, అమ్మను చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉండేది. అమ్మకసలు కోపం రాదా! అని.
“అమ్మకు, కనకమ్మ అంటే ఇంత అభిమానముందా!” నమ్మశక్యం కావడం లేదు లతకు. ఆమె చనిపోబోతుందని అమ్మకెలా తెలుసు? లేకపోతే, అమ్మ ప్రతీరోజూ వచ్చి కనకమ్మను కనిపెట్టుకొని వెళుతుందా? ఇవన్నీ సమాధానం తెలియని ప్రశ్నలు లతకు.
కమల పాత విషయాలు ఏవో మాట్లాడుతూనే ఉంది కనకమ్మతో. ఆ మాటలేవి వినిపించడం లేదు లతకు. ఆశ్చర్యంగా అమ్మను, కనకమ్మను మార్చి మార్చి చూస్తుంది. ఇంతలో.. ఉండుండి కనకమ్మ ఛాతీ, ఎగిరెగిరి పడుతోంది ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు.
“లతా! కొంచెం తులసినీళ్లు తీసుకురావే. అమ్మమ్మ నోట్లో వేద్దాం” దుఃఖాన్ని దిగమింగుకుంటూ లతకు చెప్పింది కమల. లత తెచ్చిన తులసి నీళ్లు కనకమ్మ నోట్లో వేసి, లతతో కూడా వేయించింది కమల. గొంతు దిగనట్లు ఆ నీళ్లు పక్కకు జారిపోయాయి. అది చూసి తట్టుకోలేక “నా చేతి తులసి నీళ్లు కూడా తాగవా పెద్దమ్మా! అంత కానిదానను అయిపోయానా నీకు?” అని బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టింది కమల.
“ఇంకా ఎవరున్నారు నాకు? పెద్ద వాళ్ళందరూ ఎప్పుడో వెళ్లిపోయారు. ఇంకా మిగిలున్నదానవు నువ్వొక్కదానివే. పక్కింట్లోనైనా ఉన్నావనుకుంటూ బతుకుతున్నాను. నువ్వెళ్ళిపోతే ఒక్కదాన్నే అయిపోతాను పెద్దమ్మా!” ఏడుస్తూ అంది కమల.
కమల కన్నీళ్లు కనకమ్మ ముఖాన్ని తడుపుతున్నాయి. పెదాలను తడుపు కుంటున్నట్లు నాలుక ఆడిస్తుంది కనకమ్మ. దుఃఖంతో ఉన్న కమలకు ఇవేవీ తెలియడం లేదు. ఆమె ఏడుస్తూనే ఉంది. ఏడుస్తున్న కమల కన్నీళ్లు కనకమ్మ నోటిలో పడ్డాయి. అమృతం తాగుతున్నంత గొప్పగా ఆ నీటిని గుటక వేసింది కనకమ్మ. ఆమెకంట ఒక కన్నీటిచుక్క జారింది. అంతే తల వాల్చేసింది. ఆ నిమిషమే బొందిలోని ప్రాణం ఎగిరిపోయింది. ఇదంతా ప్రత్యక్షంగా చూస్తున్న లతకు కలో నిజమో అర్థం కాలేదు. ఒళ్ళంతా గగుర్పాటు చెందింది. అమ్మ కన్నీటికోసం కనకమ్మ కాచుకుని ఉందా! ఇటువంటివి సినిమాల్లో చూస్తుంటాం గాని, నిజజీవితంలో ఇలా జరుగుతాయని కూడా ఊహించలేదెప్పుడూ!
ప్రాణం పోగానే, కమల చేతిలో వాలిపోయింది కనకమ్మ తల. ప్రాణం పోయిందని గ్రహించుకున్న కమల, నెమ్మదిగా కనకమ్మ తలను దిండుమీదకు చేర్చింది. దుఃఖాన్ని అణుచుకుంటూ, “ఋణం తీరిపోయింది” అని గొణుక్కుంటూ మంచంమీద నుండి లేచి, అన్నీ జాగ్రత్తగా సర్ది, చివరిసారిగా కనకమ్మ ముఖాన్ని దీర్ఘంగా చూసి, లత చేతిని పట్టుకుని పెరట్లోకి తీసుకు వచ్చి, అక్కడ నూతి దగ్గర ఉన్న బక్కెట్టు లోని నీటిని తల మీదుగా పోసుకుని, లత మీద కూడా పోసి, ఏమీ జరగనట్లు లోపలికి వెళ్ళిపోయింది.
ఇంట్లోకి వెళ్ళిందే గాని కమలకు గతమంతా కళ్ళముందు కదలసాగింది.
తన తండ్రికి పెదనాన్న కొడుకు, పక్కింట్లో ఉన్న రామయ్య పెదనాన్న. పెదనాన్నకు పిల్లలు లేరు. ఆయనకున్న ఒకే ఒక్కచెల్లెలు, రాజమ్మ, భర్త వ్యసనపరుడైనందున అత్తింటిని వదిలి పుట్టింటికి వచ్చేసింది. ఆ చెల్లికి ఒకే ఒక్కకొడుకు చంద్రం. రామయ్యకు, తన చెల్లెలి కొడుకుకి, వరుసకు కూతురైన కమలని ఇచ్చి పెళ్లిచేసి ఇద్దరినీ ఇంట్లో ఉంచుకుందాం అన్న ఆలోచన ఉండేది. అందుకని చిన్నప్పటినుండి కమలను సొంతకూతురు లాగానే చూసుకునేవాడు. రామయ్య భార్య కనకమ్మ కూడా కమలను సొంతకూతురు లాగానే చూసుకునేది. కానీ కనకమ్మ ఆలోచనలు వేరేగా ఉండేవి. తన తమ్ముడి కొడుకుని తెచ్చుకొని కమలనిచ్చి పెళ్లి చేసి ఇంట్లో ఉంచుకుందామని ఆవిడ కోరిక.
కనకమ్మ ఆలోచనలు ఎలాఉన్నా, తనమాటే చెల్లుతుందన్న ధీమాతో ఉండేవాడు రామయ్య. కమల వ్యక్తురాలయ్యాక ఒక మంచి ముహూర్తం చూసి కమలకు, చెల్లెలి కొడుకు చంద్రంకు నిశ్చితార్థం చేద్దామనుకుంటే, కనకమ్మ పెద్ద గొడవ పెట్టేసింది.
అందుకని కనకమ్మ ఊర్లో లేనిరోజు చూసుకొని, చిన్నాన్న కొడుకైన కమల తండ్రి సోమయ్యను ఒప్పించి చంద్రంకు, కమలకు నిశ్చితార్థం చేసేశాడు రామయ్య. ఆయన ఆలోచనేమిటంటే నిశ్చితార్థం జరిగిపోతే ఇంక కనకమ్మ ఏమీ చెయ్యలేదు కదా! అని అనుకున్నాడు. కానీ కనకమ్మ మొండి పట్టుదలతో నా తమ్ముడి కొడుకుని తెచ్చుకొని పెంచుకోకపోతే నేను ఇంట్లో ఉండను అని పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్నాళ్ళు ఆగి చూసిన రామయ్యకు, కనకమ్మ ముందు తలవంచక తప్పలేదు. అలా రామయ్య ఇంటికి, కనకమ్మ తమ్ముడి కొడుకు జగన్నాథం వచ్చాడు. వాళ్ల ఆస్తికి ఉత్తరాధికారి అయ్యాడు.
నిశ్చితార్థం జరిగిపోయింది కాబట్టి, పెద్దగా ఆస్తి పాస్తులు లేకపోయినా చంద్రంతో కమల పెళ్లి జరిగిపోయింది. ఆ పెళ్లిరోజు పక్క ఇంటిని, అదే, ఇప్పుడు కమలా వాళ్ళు ఉంటున్న ఇంటిని, చంద్రం పేర రాసేశాడు రామయ్య. అప్పటినుండి ఆ ఇంటికి, ఈ ఇంటికి మాటల్లేవు. ఆ ఇంటిమీద కాకి, తన ఇంటిమీద వాలితే కనకమ్మ ఊరుకోదు. కమలకు పెదనాన్న అంటే ఒక పక్క కోపం…. ఆయన నుండే తనకు ఈ పెళ్లి జరిగి, పెద్దగా ఆస్తిపాస్తులు లేకుండా ఉండవలసి వచ్చిందని…. ఇంకొక పక్క జాలి… సింహంలాంటి ఆయన అనుకున్నది చెయ్యలేక ఎంత క్షోభ అనుభవిస్తున్నాడోనని.
కనకమ్మ, తమ్ముడి కొడుకు జగన్నాథంకు చెల్లెలు కూతురు రాణినిచ్చి, పెళ్లి చేసింది. కమల పెళ్లి అయిపోయాక రామయ్య ఇంట్లో ఏ విషయం కూడా కల్పించుకోవడం లేదు. ఆఖరికి ఈ పెళ్ళి విషయంలో కూడా రామయ్య కల్పించుకోలేదు.
“అమ్మా! అమ్మా!” అంటూ రాణి, కనకమ్మ వెనకే తిరిగేది. తమ్ముడి కొడుకు, చెల్లెలి కూతురు ఇంట్లో కళకళలాడుతూ తిరుగుతుంటే కనకమ్మ ఆనందం పట్టనలవి కాదు. రామయ్య యేమనుకునేవాడో, మనసులో ఏముందో ఎవరికీ తెలిసేది కాదు. మౌనంగా ఉండేవాడు. ఇంటి వ్యవహారం, ఆస్తి వ్యవహారం కూడా పట్టించుకునేవాడు కాదు. ఇంట్లో పెత్తనం కనకమ్మది, బయట పెత్తనం జగన్నాథంది.
లతకు పదేళ్లు వచ్చేసరికి, చంద్రం యాక్సిడెంటులో చనిపోయాడు. యాక్సిడెంట్లో చెల్లెలు కొడుకు చంద్రం, చనిపోవడంతో రామయ్య మరింత మానసిక క్షోభకు గురయ్యాడు. కమల జీవితం అలా కావడానికి కారణం తనేనేమోనన్న భావనతో కుమిలిపోసాగాడు. ఆ మనస్థాపంతోనే చంద్రం చనిపోయి, ఆరు నెలలు తిరగకుండానే రామయ్య కూడా తనువు చాలించాడు.
అప్పటివరకు ఒంటినిండా నగలతో లక్ష్మీదేవిలా కళకళలాడిన కనకమ్మ పరిస్థితి, ఆ తర్వాత రోజు రోజుకి దిగజారడం మొదలు పెట్టింది. రామయ్య ఉన్నంతవరకు, కనకమ్మను కన్నతల్లిలా చూసుకున్న రాణి అసలు స్వరూపం, ఆయన లేకపోయేసరికి బయట పడడం మొదలైంది. అసలే కాస్త లేమి కుటుంబం నుండి వచ్చిన రాణికి, పెత్తనం చేతికి వచ్చేసరికి పూర్తిగా మారిపోయింది. పెద్దమ్మే అయినా, కనకమ్మను కోడలిలా సాధించడం మొదలుపెట్టింది.
కొడుకు చంద్రం చిన్న వయసులోనే చనిపోవడం, ఆరు నెలలు తిరగకుండానే అన్న రామయ్య కూడా చనిపోవడం, రాజమ్మకు ఆశనిపాతమే అయింది. కానీ తను కూడా లేకపోతే కోడలు కమల ఏమైపోతుందోనని ఆ బాధనంతా మనసు లోపలే దాచుకునేది రాజమ్మ.
ఏమాటకామాటే చెప్పుకోవాలి. రాజమ్మ కోడలు కమలను ఎప్పుడూ కూతురులాగే చూసుకునేది. తన అన్న కారణముగా, ఆస్తిపాస్తులు లేని తన కొడుకుని కమల పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని, కమల మీద జాలిగూడా ఉండేది రాజమ్మకు. అందుకని ఇంకా బాగా చూసుకునేది. కమల కూడా రాజమ్మను తల్లికన్నా ఎక్కువ గౌరవించేది. ఆస్తిపాస్తులు లేని ఇంటికి కోడలినయ్యానని, ఏ రోజూ అనుకునేది కాదు. తనకు ఇంతే రాసిపెట్టి ఉందని అనుకునేది కమల. అలాంటి కమల, రాజమ్మల ఆశలన్నీ లత మీదే ఉండేవి. కాలక్రమేణ రాజమ్మ కూడా చనిపోయింది.
కమల, రాజమ్మల ఇంట్లో ఇలాఉంటే పక్కింట్లో పరిస్థితి ఇంకోలా ఉండేది. అంత ఇష్టపడి తెచ్చుకున్న రాణి, పెద్దమ్మ అయిన కనకమ్మను, సరిగ్గా చూసుకునేది కాదు. ఆస్తి మొత్తం కనకమ్మదే అయినా, పెత్తనమంతా జగన్నాథంది, రాణిదే. రామయ్య ఉన్నన్నాళ్లు రామయ్య, కనకమ్మలు ముందుంటిలో ఉండేవారు. పల్లెటూళ్ళల్లో పూర్వకాలపు ఇళ్లల్లో ముందు మూడు గదులు, వెనక మూడు గదులు ఉండి, మధ్యలో నడవా ఉంటే, ముందిల్లు, వెనకిల్లు అనేవారు. సాధారణంగా ఆ నడవాలోనే వంట, అదీ చేస్తూ ఉంటారు. ఇంటి యజమాని ముందు గదిలో, పిల్లలు, కొత్తగా పెళ్లైన వాళ్లు వెనక గదులలో ఉంటారు.
ఇప్పుడు రామయ్య లేడు కాబట్టి, జగన్నాథం, రాణి ముందింటిలోకి మారిపోయి, కనకమ్మను వెనకింటిలోకి మార్చారు. వెనకింటిలో దొంగల భయమని, నెమ్మది నెమ్మదిగా కనకమ్మ నగలు కూడా, జాగ్రత్త చేసే నెపముతో, రాణి ఆమెను ఏ నగలూ వేసుకోనిచ్చేది కాదు. అలా నెమ్మది నెమ్మదిగా, కనకమ్మ పరిస్థితి యజమానురాలు స్థాయి నుండి, పనిమనిషి స్థాయికి పడిపోయింది.
ఊర్లో వాళ్లు కూడా “కమలకు చేసిన అన్యాయం ఊరికే పోతుందా! కట్టి కుడపదా!” అనుకునేవారు. ఆమె పరిస్థితికి, అయ్యో! పాపం, అనేవాళ్ళు కూడా కరువయ్యారు. అలా తన బాధని ఎవరితోనూ పంచుకునే మార్గం కూడా లేక కనకమ్మ మనసులోనే కుమిలిపోయేది. ఆడపడుచు రాజమ్మకు చేసిన అన్యాయం, కమలకు చేసిన అన్యాయం గుర్తుకు తెచ్చుకొని మరీ బాధపడేది. కమల రాజమ్మని ఎంతబాగా చూసుకుంటుందో తెలిసిన కనకమ్మ, ఇప్పటి తన పరిస్థితికి, తనని తానే నిందించుకునేది. కానీ ఇవన్నీ మనసులోనే. బయటకు అనుకునే ధైర్యం కూడా కనకమ్మకు ఇప్పుడు లేదు. కానీ ఏ రోజు గూడా కమల, కనకమ్మను నిందించిన దాఖలాలు లేవు. పైగా, అప్పుడు పెద్దమ్మ వొంటినిండా నగలతో ఎంత దర్జాగా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో తలచుకొని మరీ బాధపడేది.
రాణి, కనకమ్మకు భోజనం కూడా సరిగ్గా పెట్టదని కొందరు చెవులు కొరుక్కునేవారు. గాని రాణి దగ్గర ఆ మాట అనే ధైర్యం ఎవరికీ లేదు. అలా సరైన ఆహారం లేక, మానసిక కుంగుదలతో కనకమ్మ ఆరోగ్యం రోజురోజుకీ క్షీణించసాగింది. ఆఖరికి అన్నీ మంచం మీదే….లేచే ఓపిక కూడా లేదు కనకమ్మకు. హాస్పిటలుకు తీసుకు వెళితే డబ్బు దండగని, ఊరిలో సంచి డాక్టరుని తీసుకువచ్చి చూపించేది రాణి.
అన్నీ మంచం మీదే అయిపోతున్నాయని వెనకింటినుండి వసారాలోకి మారింది కనకమ్మ పడక. కనకమ్మ కింద చేయటానికి ఒక మనిషిని బెత్తాయించాడు జగన్నాథం. అతని మనసులో ఏమూలో కనకమ్మ అంటే కొద్దిగా కృతజ్ఞతాభావం ఇంకా ఉంది. అందుకని రాణిలా పూర్తిగా వదిలివేయకుండా కనకమ్మ పనులు చేయటానికి ఒక ఆడమనిషిని కుదిర్చాడు. ఆవిడ మూడు పూటలూ వచ్చి కనకమ్మకు తినిపించి, అక్కడంతా శుభ్రం చేసి వెళ్ళిపోతూ ఉండేది. రాణి తలుపు తీయాల్సిన అవసరం కూడా లేకుండా, ఆ ఆడమనిషి పెరటి గుమ్మం నుండే వెనకింట్లోకి వచ్చి, వెళ్ళిపోతూ ఉండేది. ఇవన్నీ గుర్తు తెచ్చుకొని నిట్టూరుస్తున్న కమల దగ్గరకు వచ్చి, “అమ్మా! ఒక మాటడుగుతాను. నీకు కనకమ్మ అంటే… అదే… పక్కింటి అమ్మమ్మ అంటే కోపం లేదా?” అడిగింది లత.
“ఇప్పటికే తను చేసిన దానికి ఎంతో కుంగిపోయింది మా పెద్దమ్మ. ఇంకా నేనుకూడా….” మాటలాడలేనట్లుగా ఆగిపోయింది కమల.
“మీ నాన్న చనిపోయారన్న దుఃఖంతోనే మా పెదనాన్న, అదే మీ పక్కింటి తాతగారు, చనిపోయారని అందరికీ తెలుసు. మరి మా పెద్దమ్మకు తెలియదా! అప్పుడే సగం చచ్చిపోయుంటుంది. ఆ తర్వాత ఆమె పరిస్థితేమిటో, నువ్వూ చూస్తునే వున్నావు. మానసికంగా ఎప్పుడో చచ్చిపోయింది. ఇంకా నేనూ మాటలని, ఆమెను బాధ పెట్టనా? నేనుకూడా ఆమెమీద కక్ష సాధించి పాపం మూట కట్టుకోనా? పెద్దమ్మ, చేసిన తప్పుకి క్షోభననుభవిస్తూ చనిపోవలసిందేనా? అమ్మమ్మ చనిపోతుందని తెలిసినా, ఎవరూ పక్కన లేకుండా, అనాధలా అమ్మమ్మను పైలోకానికి పంపించాలా! చెప్పు. గొడవలు ఉంటాయి. కానీ మనసులో పెట్టుకోకూడదు. మనసులో పెట్టుకుని మనకు మనమే శిక్ష వేసుకోకూడదు. ఆ విషయం తెలియక చాలామంది ఎదుటివాళ్ళని అంటున్నామనుకుంటూ, తమకి తామే శిక్ష వేసుకుంటారు. తెలిసీ ఆ పని నేను చేయలేను” చెప్పింది కమల.
“భగవంతుని నిర్ణయం కాకపోతే! ఈ అర్ధరాత్రి నాకు మా పెద్దమ్మ పిలుస్తున్నట్లు కల రావడమేమిటి! నేను వెళ్లి చూసేటప్పటికి ఆమె అంత్య స్థితిలో ఉండడమేమిటి? నన్ను వెతుక్కుంటూ నువ్వు రావడమేమిటి? ఇదంతా భగవన్నిర్ణయం కాకుండా మరేమిటి? కాకపోతే నాకు ఒక్కటే బాధ. పెద్దమ్మకి తులసి నీళ్లుకూడా గుటక పడలేదు. పెద్దమ్మ, మనం వేసిన తులసి నీళ్లు కూడా తాగలేదు. నేను ఎంత పాపం చేసుకున్నానో!” ఇలా అంటూ కుమిలి పోసాగింది కమల.
అమ్మ మనసు అర్థం అయిన లత అమ్మను ఒడిలోకి తీసుకుని మృదువుగా “అమ్మా! నీ కన్నీరే అమ్మమ్మకి తులసి తీర్థం అయింది. నీ కన్నీళ్ళు నోటిలో పడగానే, గుటక వేసింది. ఆ తర్వాతే అమ్మమ్మ ప్రాణం పోయిందమ్మా!” తను చూసిన విషయాన్ని అమ్మతో పంచుకుంది లత.
“నిజంగానా!” నమ్మలేనట్టు రెట్టించి మరీ అడిగింది కమల.
“నిజమేనమ్మా! నేను కళ్ళారా చూసాను. అది చూసి నాకు ఒళ్ళంతా గగుర్పొడిచిందన్న లత మాటలు విన్న కమల “పెద్దమ్మా! నామీద నీకు కోపం లేదు కదా! ఎప్పుడైనా, నిన్ను బాధపెట్టి ఉంటే నన్ను క్షమించు” మీదకు చూస్తూ అంది.
“అమ్మా! నిన్నన్యాయం చేసిన వాళ్లను కూడా నువ్వు క్షమాపణ అడుగుతున్నావంటే నీ మనసెంత గొప్పది?” అమ్మను కౌగిలించుకుంటూ అంది లత.
“ఇందులో నా గొప్పతనం ఏమీలేదు. నాదీ స్వార్ధమే. తప్పుచేసి, ఆ బాధతో నేను చనిపోకూడదన్న భావమేమో! ఇదంతా పెద్దమ్మ మీద ప్రేమ కాదేమో! ఇందులో నా స్వార్ధమే ఎక్కువేమో” అంటూ కన్నీళ్లు కార్చింది కమల.
“లేదమ్మా! నేను చిన్నప్పటినుండి నిన్ను చూస్తూనే ఉన్నాను కదా! ఒక్కరోజు కూడా నువ్వు అమ్మమ్మ మీద కోపంతో మాట్లాడలేదు. ఆమె గురించి చెడుగా చెప్పలేదు ఈ రోజు నుండి నేనుకూడా నీలాగే బ్రతుకుతానమ్మా. క్షమాపణకు ఇంత విలువ ఉందని నాకు ఇంతవరకు తెలియలేదమ్మా! నన్ను క్షమించు. అందరిలాగే నేను కూడా కనకమ్మ అమ్మమ్మని మనసులోనైనా ఆమెకు బాధ కలిగించే మాటలే అనుకునేదాన్ని. నన్ను క్షమించు అమ్మమ్మా!” మనస్పూర్తిగా అనుకుంటూ ఆకాశంలోకి చూస్తూ చేతులు జోడించింది లత.
అమ్మ చదువుకోలేదని తెలుసు. కానీ జీవితాన్ని ఇంత బాగా చదువుకుందని ఇప్పుడే తెలిసింది లతకు. అమ్మ మాట్లాడుతుంటే ఆమె మాట్లాడినట్టు లేదు. పై నుండి ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. మొదటిసారి వాళ్ళమ్మను చూసి చాలా గర్వంగా ఫీలయింది లత.
*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వర్ణ క్రాంతి

లోకాభిరామాయణం. 5